కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోషంగల దేవునితో ఆనందంగా ఉండండి

సంతోషంగల దేవునితో ఆనందంగా ఉండండి

సంతోషంగల దేవునితో ఆనందంగా ఉండండి

“తుదకు సహోదరులారా, సంతోషించుడి . . . ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.”​—⁠2 కొరింథీయులు 13:⁠11.

1, 2. (ఎ) చాలా మంది జీవితంలో ఆనందమెందుకు లేదు? (బి) ఆనందం అంటే ఏమిటి, మనం దాన్ని ఎలా పొందవచ్చు?

చుట్టూ గాఢాంధకారం అలుముకుని ఉన్న ఈ రోజుల్లో, చాలా మందికి ఆనందించడానికి కారణమేమీ కనిపించదు. వాళ్ళకు గానీ, వాళ్ళు ప్రేమించే ఎవరికైనా గానీ ఏదైన విపత్తు సంభవిస్తే, “స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును” అని ప్రాచీన యోబు భావించినట్లే వాళ్ళు భావించవచ్చు. (యోబు 14:⁠1) ఈ ‘అపాయకరమైన కాలాల్లో’ కలిగే ఒత్తిళ్ళకు శ్రమలకు క్రైస్తవులు అతీతులు కారు. కాబట్టి నమ్మకస్థులైన యెహోవా సేవకులు కొన్నిసార్లు నిరుత్సాహానికి గురికావడంలో ఆశ్చర్యమేమీ లేదు.​—⁠2 తిమోతి 3:⁠1.

2 అయినప్పటికీ, క్రైస్తవులు శ్రమల్లో ఉన్నప్పుడు కూడా ఆనందంగా ఉండగలరు. (అపొస్తలుల కార్యములు 5:​40, 41) అదెలా సాధ్యమో తెలుసుకోవడానికి, ఆనందమంటే ఏమిటన్నది మొదట పరిశీలించండి. “మంచి చేకూరినప్పుడు లేదా మంచి కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఉప్పొంగే భావోద్వేగమే” ఆనందమని నిర్వచించబడుతుంది. * దేవుని క్రొత్త లోకంలో మన కోసం దాచి ఉంచబడిన ఆనందాల గురించి ధ్యానిస్తూ, ప్రస్తుతం మనకున్న ఆశీర్వాదాలను గురించి ఆలోచించడానికి సమయాన్ని తీసుకుంటే మనం ఆనందంగా ఉండగలం.

3. ఆనందించేందుకు ప్రతి ఒక్కరికీ కనీసం కొన్ని కారణాలుంటాయని ఏ అర్థంలో చెప్పవచ్చు?

3 ప్రతి ఒక్కరూ కృతజ్ఞులై ఉండేలా ఏదో విధంగా ఆశీర్వదించబడినవారే. ఒక కుటుంబ శిరస్సు ఉద్యోగాన్ని కోల్పోయాడనుకోండి. అప్పుడు సహజంగానే ఆయనకు చింత ఉంటుంది. ఆయన తన కుటుంబాన్ని పోషించాలని కోరుకుంటాడు. ఆయన శారీరకంగా బలమైనవాడూ, మంచి ఆరోగ్యవంతుడూ అయితే, తనకు మళ్ళీ ఉద్యోగం దొరికిన తర్వాత, కష్టపడి పని చేయగల్గుతాడు. కాబట్టి ఆ విషయమై ఆయన కృతజ్ఞుడై ఉండవచ్చు. మరొక ఉదాహరణగా, ఒక క్రైస్తవ స్త్రీకి అకస్మాత్తుగా బలహీనపరచే ఒక జబ్బు వచ్చి ఉండవచ్చు. అయినా, ఆమె తన జబ్బును హుందాగా ధైర్యంగా ఎదుర్కొనేలా సహాయపడేందుకు ప్రేమగల స్నేహితులూ, కుటుంబ సభ్యులూ ఇస్తున్న మద్దతుకు ఆమె కృతజ్ఞతలు చెప్పవచ్చు. నిజ క్రైస్తవులందరూ, తమ పరిస్థితులెలా ఉన్నప్పటికీ, ‘సంతోషంగల దేవుడైన’ యెహోవానూ, ‘సంతోషభరితుడు ఏకైక అధిపతి’ అయిన యేసుక్రీస్తునూ ఎరిగివుండడమనే ఆధిక్యతను బట్టి ఆనందించగలరు. (1 తిమోతి 1:​11; 6:⁠15 NW) అవును, యెహోవా దేవుడూ, యేసుక్రీస్తూ అత్యంత సంతోషభరితులుగా ఉన్నవారే. భూమి మీది నేటి పరిస్థితులు యెహోవా ప్రారంభంలో ఉద్దేశించినదానికి పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ, వాళ్ళు తమ ఆనందాన్ని కాపాడుకున్నారు. వాళ్ళ మాదిరి, మనం మన ఆనందాన్ని ఎలా కాపాడుకోవచ్చన్నదాన్ని గురించి మనకు చాలా నేర్పించగలదు.

వాళ్ళు తమ ఆనందాన్నెన్నడూ కోల్పోలేదు

4, 5. (ఎ) మొదటి మానవులు తిరుగుబాటు చేసినప్పుడు యెహోవా ఎలా ప్రతిస్పందించాడు? (బి) మానవుల విషయంలో తనకున్న అనుకూలమైన దృక్పథాన్ని యెహోవా ఏ విధంగా కొనసాగించాడు?

4 ఏదెను తోటలో, ఆదాము హవ్వలు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుభవించారు, వాళ్ళ మనస్సులు కూడా పరిపూర్ణంగా ఉండేవి. వాళ్ళకు చేయడానికి ఫలవంతమైన పనీ, దానికి తగిన పరిసరాలూ ఉండేవి. అన్నింటి కన్నా ముఖ్యంగా, యెహోవాతో తరచుగా మాట్లాడే ఆధిక్యత ఉండేది. వాళ్ళ భవిష్యత్తు సంతోషకరంగా ఉండాలన్నదే దేవుని సంకల్పం. కాని మన మొదటి తల్లిదండ్రులు ఆ మంచి బహుమానాలతో తృప్తిచెందలేదు; నిషేధించబడిన “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష” ఫలాలను వాళ్ళు దొంగిలించారు. ఈ అవిధేయ చర్య, వారి సంతతివారమైన మనం నేడు అనుభవిస్తున్న అసంతోషకరమైన విషయాలన్నింటికీ కారణమైంది.​—⁠ఆదికాండము 2:15-17; 3:⁠6; రోమీయులు 5:⁠12.

5 అయితే, ఆదాము హవ్వలు చూపించిన కృతఘ్నతా వైఖరి తన ఆనందాన్ని దోచుకునేందుకు యెహోవా అనుమతించలేదు. వాళ్ళ సంతానంలో కనీసం కొందరి హృదయాలైనా తనను ఆరాధించేలా కదిలించబడతాయన్న నమ్మకం ఆయనకు ఉండింది. వాస్తవానికి, ఆయనకు ఎంత నమ్మకం ఉందంటే, ఆదాము హవ్వలకు మొట్టమొదటి బిడ్డ పుట్టడానికి ముందే, విధేయతగల వారి సంతతిని విమోచించాలన్న తన సంకల్పాన్ని ప్రకటించాడు! (ఆదికాండము 1:​31; 3:​15) ఆ తర్వాతి శతాబ్దాల్లో, మానవుల్లో అధికశాతం మంది ఆదాము హవ్వల అడుగుజాడల్లో నడిచారు, అవిధేయత అంత విస్తృతంగా వ్యాపించినప్పటికీ యెహోవా మానవ కుటుంబాన్ని తిరస్కరించలేదు. అలా తిరస్కరించే బదులు, ‘తన హృదయాన్ని సంతోషపరుస్తున్న’ స్త్రీపురుషులపైన, తనను ప్రేమిస్తున్నందువల్ల, తనను ప్రీతిపరచేందుకు నిజమైన కృషి చేస్తున్నవాళ్ళపైన తన అవధానాన్ని కేంద్రీకరించాడు.​—⁠సామెతలు 27:​11; హెబ్రీయులు 6:⁠10.

6, 7. తాను ఆనందంగా కొనసాగేందుకు యేసుకు ఏవి సహాయపడ్డాయి?

6 యేసు విషయమేమిటి, ఆయన తన ఆనందాన్ని ఎలా కాపాడుకున్నాడు? పరలోకంలో శక్తిమంతుడైన ఆత్మ ప్రాణిగా, ఆయనకు భూమి మీద ఉన్న స్త్రీపురుషుల కార్యకలాపాలను గమనించేందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయి. వాళ్ళ అపరిపూర్ణతలు ఆయనకు స్పష్టంగా కనిపించాయి, అయినప్పటికీ ఆయన వారిని ప్రేమించాడు. (సామెతలు 8:​31) అటు తర్వాత, ఆయన భూమి మీదికి వచ్చి, మానవుల ‘మధ్య నివసించినప్పుడు’ మానవాళిని గురించి ఆయనకున్న దృక్కోణం మారలేదు. (యోహాను 1:​14) పాపభరితమైన మానవ కుటుంబాన్ని గురించి తనకున్న అనుకూల దృక్పథాన్ని కాపాడుకునేలా దేవుని పరిపూర్ణ కుమారునికి సహాయపడిందేమిటి?

7 మొదటిగా, తన నుంచీ ఇతరుల నుంచీ ఆశించేదాని విషయంలో యేసు సహేతుకంగా ఉన్నాడు. లోకమంతటినీ మారుమనస్సు పొందేలా తాను చేయబోవడం లేదని ఆయనకు తెలుసు. (మత్తయి 10:​32-39) అందుకే, రాజ్య సందేశాన్ని ప్రకటించినప్పుడు యథార్థవంతుడైన ఒక్క వ్యక్తి అనుకూలంగా ప్రతిస్పందించినా ఆయన ఆనందించేవాడు. తన శిష్యుల ప్రవర్తనా, వైఖరీ కొన్నిసార్లు అంత సంతృప్తికరంగా లేకపోయినా, నిజానికి వాళ్ళు తమ హృదయాల్లో దేవుని చిత్తాన్ని చేయాలనే కోరుకుంటున్నారని యేసుకు తెలుసు గనుక, దాన్ని బట్టి ఆయన వాళ్ళను ప్రేమించాడు. (లూకా 9:​46; 22:​24, 28-32, 60-62) “వారు నీ వాక్యము గైకొని యున్నారు” అని తన శిష్యులు అప్పటి వరకు తీసుకున్న అనుకూల చర్యలను గురించి ఆయన తన పరలోక తండ్రికి చేసిన ప్రార్థనలో క్లుప్తంగా పేర్కొనడం గమనార్హం.​—⁠యోహాను 17:⁠6.

8. మన ఆనందాన్ని కాపాడుకునే విషయానికి వచ్చినప్పుడు యెహోవాను, యేసును అనుకరించగల కొన్ని విధాలను పేర్కొనండి.

8 యెహోవా, క్రీస్తు యేసు ఉంచిన మాదిరులను గురించి జాగ్రత్తగా ఆలోచించడం ద్వారా మనమందరమూ నిస్సందేహంగా ప్రయోజనాన్ని పొందుతాం. బహుశా, విషయాలు సరిగ్గా మనమాశించినట్లు జరగనప్పుడు అమితంగా చింతించకుండా ఉండడం ద్వారా మనం యెహోవాను మరింత సంపూర్ణంగా అనుకరించగలమా? మన ప్రస్తుత పరిస్థితుల విషయంలో అనుకూల దృక్పథాన్ని కాపాడుకోవడం ద్వారా, మన నుండీ ఇతరుల నుండీ ఆశించేవాటి విషయంలో సహేతుకంగా ఉండడం ద్వారా యేసు అడుగుజాడలను మరింత దగ్గరగా అనుసరించగలమా? ఈ సూత్రాల్లో కొన్నింటిని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంతాసక్తిగల క్రైస్తవుల హృదయాలకు ఎంతో ప్రియమైన ఒక రంగమైన క్షేత్ర పరిచర్యలో ఎలా ఆచరణయోగ్యంగా అన్వయించుకోవచ్చో చూద్దాం.

మన పరిచర్య విషయంలో అనుకూల దృక్పథాన్ని కాపాడుకోండి

9. యిర్మీయాకు మళ్ళీ ఆనందమెలా కలిగింది, ఆయన మాదిరి నేడు మనకెలా సహాయపడగలదు?

9 మనం తన సేవలో ఆనందంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. మన ఆనందం మనం పొందే ఫలితాలపై ఆధారపడి ఉండకూడదు. (లూకా 10:​17, 20) ప్రవక్తయైన యిర్మీయా ఎటువంటి ఫలితాలూ కనబడని ప్రాంతంలో సంవత్సరాల తరబడి ప్రకటించాడు. ఆయన ప్రజల ప్రతికూల ప్రతిస్పందనపై మనస్సు పెట్టినప్పుడు, తన ఆనందాన్ని కోల్పోయాడు. (యిర్మీయా 20:⁠8) అయితే తాను అందించే సందేశం ఎంత అద్భుతమైనదన్న దాన్ని గురించి ధ్యానించినప్పుడు, ఆయనకు మళ్ళీ ఆనందం కలిగింది. “నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యముల కధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి” అని యిర్మీయా యెహోవాకు చెప్పాడు. (యిర్మీయా 15:​16) దేవుని వాక్యాన్ని ప్రకటించే తన ఆధిక్యత విషయమై యిర్మీయా ఆనందించాడు. మనం కూడా ఆనందించగలం.

10. మన ప్రాంతం ప్రస్తుతం అంత ఫలవంతమైనది కాకపోయినప్పటికీ, మన పరిచర్యలోని ఆనందాన్ని మనమెలా కాపాడుకోవచ్చు?

10 అధిక సంఖ్యాకులు సువార్తకు ప్రతిస్పందించకపోయినప్పటికీ, మనం క్షేత్రసేవలో పాల్గొంటున్నప్పుడు ఆనందంగా ఉండేందుకు గొప్ప కారణమే ఉంది. కొందరు మానవులు తనకు సేవచేసేందుకు కదిలించబడతారన్న నమ్మకం యెహోవాకు ఖచ్చితంగా ఉందని గుర్తుంచుకోండి. యెహోవాలాగే, మనం కూడా కనీసం కొందరైనా విశ్వ సర్వాధిపత్యం విషయంలోని వివాదాన్ని అర్థం చేసుకుని, రాజ్య సందేశాన్ని స్వీకరిస్తారన్న ఆశను వదలకూడదు. ప్రజల పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని మనం మర్చిపోకూడదు. అత్యంత సంతృప్తితో ఉన్న వ్యక్తులు సహితం, అనూహ్యమైన నష్టాలు సంక్షోభాలు ఎదురైనప్పుడు జీవితానికి గల అర్థాన్ని గురించి ఆలోచించనారంభించవచ్చు. అలాంటి వ్యక్తికి ‘తన ఆధ్యాత్మిక అవసరాల పట్ల శ్రద్ధ’ కలగనారంభించినప్పుడు అతనికి సహాయం చేయడానికి మీరు అందుబాటులో ఉంటారా? (మత్తయి 5:​3, NW) అంతెందుకు, మీ ప్రాంతంలోకి మీరీసారి ప్రకటించడానికి వెళ్ళినప్పుడు సువార్తను ఆలకించడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటుండవచ్చు!

11, 12. ఒక పట్టణంలో ఏమి జరిగింది, దాని నుండి మనమేమి నేర్చుకోగలం?

11 మన ప్రాంతపు స్వభావం కూడా మారిపోవచ్చు. ఒక ఉదాహరణను పరిశీలించండి. ఒక చిన్న పట్టణంలో, మంచి సాన్నిహిత్యంగల కొందరు యువజంటలు తమ పిల్లలతో పాటు నివసిస్తున్నారు. యెహోవాసాక్షులు వాళ్ళను సందర్శించినప్పుడు, “మాకు ఆసక్తి లేదు!” అన్న మాటే ప్రతి ఇంటా వినవలసివచ్చేది. రాజ్య సందేశంలో ఎవరైనా ఆసక్తి చూపిస్తే, సాక్షులు వాళ్ళను మళ్ళీ సంప్రదించకుండా పొరుగువాళ్ళు వాళ్ళను వెంటనే నిరుత్సాహపరచేవారు. అక్కడ ప్రకటించడం ఒక సవాలుగా ఉండేదన్నది వేరేగా చెప్పనక్కర్లేదు. అయినా, సాక్షులు మానలేదు; వాళ్ళు ప్రకటిస్తూనే వచ్చారు. దాని ఫలితమేమిటి?

12 కొంత కాలానికి, ఆ పట్టణంలోని అనేక మంది పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై, పెళ్ళిళ్ళు చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. ఆ యువతీ యువకుల్లో కొందరు తమ జీవిత విధానం నిజమైన సంతోషాన్ని తీసుకురాలేకపోయిందని గ్రహించి సత్యాన్వేషణ మొదలుపెట్టారు. సాక్షులు ప్రకటించిన సువార్తకు వాళ్ళు అనుకూలంగా ప్రతిస్పందించినప్పుడు వాళ్ళు దాన్ని కనుగొన్నారు. అలా, అనేక సంవత్సరాల తర్వాత, అక్కడి చిన్న సంఘం పెరగనారంభించింది. తమ ప్రయత్నాల్ని మానుకోని రాజ్య ప్రచారకులు ఎంత ఆనందించి ఉంటారో ఊహించుకోండి! మహిమాన్విత రాజ్య సందేశాన్ని పంచుకోవడంలో పట్టుదలను చూపించడం మనకు కూడా ఆనందాన్ని తీసుకువచ్చును గాక!

తోటి విశ్వాసులు మీకు మద్దతునిస్తారు

13. మనకు నిరుత్సాహం కలిగినప్పుడు మనమెవరి వైపుకు మళ్ళగలం?

13 మీకు ఒత్తిళ్ళు పెరిగినప్పుడు, విపత్తులు మిమ్మల్ని బాధించినప్పుడు మీరు ఓదార్పు కోసం ఎవరివైపు మళ్ళగలుగుతారు? యెహోవాకు సమర్పించుకున్న లక్షలాది మంది సేవకులు ప్రార్థన ద్వారా మొట్టమొదట యెహోవా వైపుకు మళ్ళుతారు, ఆ తర్వాత తమ క్రైస్తవ సహోదర సహోదరీలవైపుకు మళ్ళుతారు. భూమి మీద ఉన్నప్పుడు, యేసు సహితం, తన శిష్యుల మద్దతును ఎంతో విలువైనదిగా ఎంచాడు. తను చనిపోవడానికి ముందటి రాత్రి, ఆయన వారిని గురించి “నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు” అని అన్నాడు. (లూకా 22:​28) అవును, ఆ శిష్యులు అపరిపూర్ణులే. కానీ వాళ్ళు విశ్వాసంగా ఉండడం దేవుని కుమారుడ్ని బలపరచింది. మనం కూడా తోటి ఆరాధకుల నుండి బలాన్ని పొందవచ్చు.

14, 15. తమ కుమారుని మరణాన్ని తట్టుకునేందుకు ఈ దంపతులకు ఏమి సహాయపడింది, వాళ్ళ అనుభవం నుండి మీరేమి నేర్చుకుంటున్నారు?

14 సహోదర సహోదరీల మద్దతు ఎంత గొప్ప సహాయకంగా ఉండగలదన్నది మీషెల్‌, డ్యాన్‌ అనే క్రైస్తవ దంపతులు అనుభవపూర్వకంగా తెలుసుకోగల్గారు. 20 ఏండ్ల వాళ్ళ కుమారుడు జోనాతాన్‌ ఎంతో చురుగ్గా ఉండేవాడు, ఉజ్వలమైన భవిష్యత్‌ ఉన్నట్లు అనిపించేది. అలాంటిది ఆయనకు మెదడులో కంతి ఉందని వైద్య పరీక్షల్లో తెలిసింది. ఆయనను ఎలాగైనా బ్రతికించాలని వైద్యులు మనస్ఫూర్తిగా శ్రమించారు, కానీ ఒక రోజు మధ్యాహ్నం ఆయన శారీరక పరిస్థితి విషమించి, చివరికి మరణించాడు. మీషెల్‌, డ్యాన్‌లు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఆ సాయంకాలం జరగనున్న సేవా కూటం దాదాపుగా ముగిసి ఉంటుందని వాళ్ళకు తెలుసు. అయినప్పటికీ, తమకు ఓదార్పు ఎంతో అవసరం కనుక, తమను రాజ్యమందిరానికి తీసుకువెళ్ళమని తమతో పాటు ఉన్న పెద్దను వాళ్ళు కోరారు. జోనాతాన్‌ మరణాన్ని గురించి అప్పుడే సంఘంలో ప్రకటించారు, అంతలో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఆ కూటం తర్వాత, సహోదరసహోదరీలు గుడ్ల నీరు కక్కుకుంటున్న ఆ తల్లిదండ్రుల చుట్టూ చేరి, వాళ్ళను కౌగిలించుకుని, ఓదార్పు మాటలు పలికారు. “మేము రాజ్య మందిరానికి చేరుకున్నప్పుడు ఇక జీవితమంతా శూన్యమని మాకు అనిపించింది, కానీ సహోదరులు మాకెంత ఓదార్పునిచ్చారు​—⁠ఎంత ఊరట కలిగించారు! వాళ్ళు మా బాధను తీసివేయలేకపోయినప్పటికీ, మేము మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు సహాయం చేశారు!” అని డ్యాన్‌ గుర్తుచేసుకుంటుంది.​—⁠రోమీయులు 1:​11, 12; 1 కొరింథీయులు 12:​21-26.

15 మీషెల్‌ డ్యాన్‌లు తమ సహోదరులకు మరింత సన్నిహితులయ్యేందుకు విపత్తు కారణమయ్యింది. అది వాళ్ళు ఒకరికొకరు మరింత సన్నిహితులయ్యేందుకు కూడా కారణమయ్యింది. “నేను నా ప్రియమైన భార్యకు మరింత విలువివ్వడం నేర్చుకున్నాను. నిరుత్సాహం కలిగే క్షణాల్లో, బైబిలు సత్యాన్ని గురించీ, యెహోవా మమ్మల్నెలా కాపాడుతున్నాడన్నదాన్ని గురించీ మేమిద్దరం మాట్లాడుకుంటాం” అని మీషెల్‌ అంటున్నాడు. “రాజ్య నిరీక్షణ అనేది మాకిప్పుడు మరింత విలువైనదిగా ఉంది” అని డ్యాన్‌ చెబుతుంది.

16. మన అవసరాలను సహోదరులకు తెలపడంలో మనమే చొరవతీసుకోవడం ఎందుకంత ప్రాముఖ్యం?

16 అవును, కష్ట కాలాల్లో మన క్రైస్తవ సహోదర సహోదరీలు మనకు “ఆదరణ”నివ్వగలరు, ఆ విధంగా మనం ఆనందాన్ని కాపాడుకునేందుకు సహాయపడగలరు. (కొలొస్సయులు 4:​11) నిజమే, వాళ్ళు మన మనస్సులను చదవలేరు. అందుకే, మనకు మద్దతు అవసరమైనప్పుడు, వాళ్ళకు తెలపడం మంచిది. ఆ తరువాత, మన సహోదరులు మనకు ఇచ్చినది ఎలాంటి ఊరటైనా అది యెహోవా నుండి వస్తున్నట్లుగా దృష్టించి, దాని పట్ల మనం నిజమైన మెప్పుదలను వ్యక్తీకరించగలం.​—⁠సామెతలు 12:​25; 17:⁠17.

మీ సంఘాన్ని చూడండి

17. ఒక ఒంటరి తల్లి ఏ సవాళ్ళను ఎదుర్కొంటుంది, ఆమెలాంటి వారిని మనమెలా దృష్టిస్తాం?

17 మీరు తోటి విశ్వాసులను ఎంత దగ్గరగా పరిశీలించగల్గితే, మీరు వారి పట్ల మెప్పుదలను చూపడాన్నీ, వారి సహవాసంలో ఆనందాన్ని పొందడాన్నీ అంత ఎక్కువగా నేర్చుకోగలరు. మీ సంఘాన్నే చూడండి. మీకు ఏమి కనిపిస్తుంది? సత్యపు మార్గంలో పిల్లలను పెంచడానికి పాట్లు పడుతున్న ఒంటరి తల్లి ఎవరైనా ఉన్నారా? ఆమె ఉంచే చక్కని మాదిరిని గురించి మీరు ఎప్పుడైనా బాగా ఆలోచించారా? ఆమెకు ఎదురవుతున్న కొన్ని సమస్యలను ఊహించడానికి ప్రయత్నించండి. ఒంటరితనం, ఉద్యోగ స్థలంలో మగవాళ్ళు తన విషయంలో అవసరానికి మించి చొరవతీసుకోవడం, ఆర్థిక ఇబ్బందులు వంటి కొన్ని సమస్యల్ని జనీన్‌ అనే ఒక ఒంటరి తల్లి పేర్కొంటుంది. అయితే, అధిగమించాల్సిన వాటిలో అన్నింటికన్నా పెద్ద సమస్య తన పిల్లల భావోద్వేగ అవసరాలను తీర్చడమేనని, ఎందుకంటే ఒక్కో బిడ్డ అవసరాలు వేర్వేరుగా ఉంటాయని ఆమె చెబుతుంది. జనీన్‌ మరొక సమస్యను గురించి పేర్కొంటూ, “భర్త లేని కారణాన కొడుకుని కుటుంబ శిరస్సుగా చేయకుండా ఉండడమన్నది నిజంగా పెద్ద సవాలుగా ఉండగలదు. నాకు ఒక కూతురు ఉంది, నా ఆంతరంగిక సమస్యలన్నీ ఆమెతో పంచుకుని ఆమెపై అతిగా భారం మోపకూడదన్న విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం చాలా కష్టం” అని అంటోంది. దేవునికి భయపడే వేలాది మంది ఇతర ఒంటరి తల్లిదండ్రుల్లాగే, జనీన్‌ కూడా పూర్తికాల ఉద్యోగాన్ని చేస్తూ, తన కుటుంబంపట్ల శ్రద్ధ వహిస్తుంది. అలాగే ఆమె తన పిల్లలతో బైబిలు అధ్యయనం కూడా చేస్తుంది, పరిచర్యలో వాళ్ళకు తర్ఫీదునిస్తుంది, వాళ్ళను సంఘ కూటాలకు తీసుకువెళ్తుంది. (ఎఫెసీయులు 6:⁠4) ఈ కుటుంబం యథార్థతను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలను యెహోవా ప్రతిరోజూ చూస్తున్నప్పుడు ఎంత సంతోషిస్తుండవచ్చు! అలాంటి వాళ్ళు మన మధ్య ఉండడం మన హృదయాలకు ఆనందాన్ని కలిగించదా? అవును, తప్పకుండా కలిగిస్తుంది.

18, 19. సంఘ సభ్యుల మీద మనకున్న మెప్పుదలను మనమెలా మరింత ఎక్కువ చేసుకోవచ్చో సోదాహరణంగా చెప్పండి.

18 మరొకసారి మీ సంఘాన్ని చూడండి. భార్య చనిపోయిన లేక భర్త చనిపోయిన నమ్మకస్థులైన వారు కూటాలకు “విడువక” రావడం మీకు కనిపిస్తుండవచ్చు. (లూకా 2:​37) కొన్నిసార్లు వాళ్ళు మరీ ఒంటరితనంతో బాధపడుతుంటారా? అందులో సందేహం లేదు. వాళ్ళకు తమ వివాహజత అహర్నిశలూ గుర్తుకు వస్తూనే ఉంటారు! కానీ వాళ్ళు యెహోవా సేవలో బిజీగా ఉంటారు. ఇతరుల మీద వ్యక్తిగత ఆసక్తిని చూపిస్తుంటారు. వాళ్ళ స్థిరమైన అనుకూల దృక్పథం సంఘపు ఆనందాన్ని పెంచుతుంది! 30 సంవత్సరాలకుపైగా పూర్తికాల పరిచర్య చేస్తున్న ఒక క్రైస్తవురాలు, “నాకు గొప్ప ఆనందాన్ని కలిగించేవాటిలో ఒకటేంటంటే, అనేక శ్రమలను అనుభవించినా ఇప్పటికీ విశ్వాసంగా యెహోవా సేవచేస్తున్న పెద్ద వయస్కులైన సహోదర సహోదరీలను చూడడమే!” అని వ్యాఖ్యానిస్తోంది. అవును, మన మధ్య ఉన్న పెద్దవయస్కులైన క్రైస్తవులు చిన్నవాళ్ళకు గొప్ప ప్రోత్సాహకరంగా ఉన్నారు.

19 సంఘంతో సహవాసాన్ని ఈ మధ్యే ఆరంభించిన క్రొత్తవారి విషయమేమిటి? వాళ్ళు కూటాల్లో తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు మనం ప్రోత్సహించబడడం లేదా? వాళ్ళు బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టినప్పటి నుండి సాధించిన ప్రగతిని గురించి ఆలోచించండి. వాళ్ళను చూసి యెహోవా తప్పకుండా చాలా ఆనందిస్తుంటాడు. మనమూ ఆనందిస్తున్నామా? వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకు వాళ్ళను మెచ్చుకుంటూ మనం కూడా మన ఆమోదాన్ని తెలుపుతున్నామా?

20. సంఘంలోని ప్రతి సభ్యుడూ సంఘంలో ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తున్నారని ఎందుకు చెప్పగలం?

20 మీరు వివాహితులా, అవివాహితులా, ఒంటరి తల్లా/తండ్రా? మీరు తల్లి/తండ్రి లేని అమ్మాయా/అబ్బాయా, లేదా భార్య/భర్త చనిపోయినవారా? మీరు సంఘంతో అనేక సంవత్సరాలుగా సహవసిస్తున్నవారా, లేక సహవాసాన్ని ఇటీవలే ఆరంభించినవారా? మీరు ఎవరైనా సరే, నమ్మకమైన మీ మాదిరి మా అందరికీ ప్రోత్సాహాన్నిస్తుందన్న నిశ్చయతను మీరు కలిగివుండండి. మీరు రాజ్య గీతాన్ని ఇతరులతోపాటు పాడుతున్నప్పుడు, వ్యాఖ్యానిస్తున్నప్పుడు, లేదా దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో విద్యార్థిగా నియామకాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు, మీరు మా ఆనందాన్ని పెంచుతున్నారు. అంతకన్నా ప్రాముఖ్యంగా, అది యెహోవా హృదయాన్ని ఆనందింపజేస్తుంది.

21. మనం ఏమి చేయడానికి అనేక కారణాలున్నాయి, అయితే ఏ ప్రశ్నలు తలెత్తుతాయి?

21 అవును, సంక్షోభంతో నిండిన ఈ కాలాల్లో కూడా, సంతోషంగల మన దేవుణ్ణి ఆరాధించడంలో ఆనందంగా ఉండగలం. “సంతోషించుడి, . . . ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును” అని పౌలు ఇచ్చిన ప్రోత్సాహానికి ప్రతిస్పందించేందుకు మనకు అనేక కారణాలున్నాయి. (2 కొరింథీయులు 13:​11) అయితే, మనం ఏదైనా ప్రకృతి వైపరీత్యం బారిన పడితే, హింసించబడితే లేదా మనకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే, అప్పుడేమిటి? అలాంటి పరిస్థితుల్లో కూడా మనం మన ఆనందాన్ని కాపాడుకోవడం సాధ్యమేనా? తర్వాతి ఆర్టికల్‌ని పరిశీలించి, మీకై మీరే ఒక నిర్ధారణకు రండి.

[అధస్సూచి]

^ పేరా 2 యెహోవాసాక్షులు ప్రచురించిన అంతర్దృష్టి 2వ సంపుటి (ఆంగ్లం) 119వ పేజీ చూడండి.

మీరు జవాబివ్వగలరా?

• ఆనందమెలా నిర్వచించబడింది?

• అనుకూల దృక్పథాన్ని కాపాడుకోవడం, ఆనందంగా కొనసాగేందుకు ఎలా సహాయపడుతుంది?

• మన సంఘ సేవా ప్రాంతం గురించి అనుకూల దృక్పథాన్ని కలిగివుండేందుకు మనకు ఏది సహాయపడగలదు?

• మీరు ఏయే విధాల్లో మీ సంఘంలో ఉన్న సహోదర సహోదరీల ఎడల మెప్పుదలను చూపిస్తారు?

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని చిత్రాలు]

మన సేవాప్రాంతంలో ఉన్న ప్రజలు మారవచ్చు

[12వ పేజీలోని చిత్రం]

మీ సంఘంలో ఉన్నవారు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటారు?