‘చూడండి! గొప్పసమూహం!’
సంపూర్ణాత్మ నిశ్చయతగలవారై నిలకడగా ఉండండి
‘చూడండి! గొప్పసమూహం!’
దశాబ్దాలపాటు, యెహోవా సేవకులకు అదొక క్లిష్టమైన ప్రశ్నగా ఉండేది. లేఖనాధారంగా ఆ చిక్కుముడిని విప్పడానికి వాళ్లు చాలాకాలం ప్రయత్నాలు చేశారు. ఆ అంశం అనేక చర్చలకు దారితీసింది. కానీ చివరికి బైబిలు ఆధారిత సమాధానం దొరికింది, 1935వ సంవత్సరంలో వాషింగ్టన్ డి.సి.లో జరిగిన సమావేశంలో శ్రోతలనది ఉర్రూతలూగించింది.
ఈ చర్చకు ముఖ్య కారణం, ప్రకటన 7:9 లో ప్రస్తావించబడిన “గొప్ప జనసమూహం” (కింగ్ జేమ్స్ వర్షన్), లేదా “గొప్ప సమూహము” (పరిశుద్ధ గ్రంథము) ఎవరు? ఈ సమూహానికి చెందిన విశ్వాసులు పరలోకంలో నివసిస్తారా? అనే సర్వసాధారణమైన ప్రశ్న.
అతిపురాతనమైన ఒక ప్రశ్న
అపొస్తలుడైన యోహాను కాలంనుంచి మనకాలం వరకు, “గొప్ప సమూహము”ను గుర్తించే విషయంలో క్రైస్తవులు తికమకపడ్డారు. బైబిలు విద్యార్థులు ఈ గొప్ప సమూహాన్ని పరలోకానికి చెందిన రెండవ తరగతివారిగానూ, బైబిలు సత్యాన్ని గూర్చిన పరిజ్ఞానమున్నా దాన్ని వ్యాప్తి చేయడానికి ఎలాంటి చర్యా గైకొనని ఒక సమూహంగానూ పరిగణించారు.
అయినా, అభిషిక్త క్రైస్తవుల సహవాసులు కొందరు ప్రకటనా పనిలో చాలా ఆసక్తితో పాల్గొన్నారు. వారికి పరలోకానికి వెళ్ళాలన్న అభిలాషలేదు. నిజానికి వారి నిరీక్షణ, 1918 నుంచి 1922 వరకు యెహోవా ప్రజలు ఇచ్చిన “ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది మరెన్నడూ మరణించరు” అనే బహిరంగ ప్రసంగానికి అనుగుణంగా ఉంది. అలాంటి వ్యక్తులు భూమిపై నిరంతర జీవితంతో ఆశీర్వదించబడతారు.
కావలికోట అక్టోబరు 15, 1923 (ఆంగ్లం)లో యేసు చెప్పిన గొర్రెలు మేకల ఉపమానమిలా చర్చించబడింది: “గొర్రెలు అన్ని దేశాల ప్రజలను సూచిస్తున్నాయి, ఆత్మ జనితులను కాదుగానీ నీతివైపుకు మొగ్గుచూపేవారిని, యేసు క్రీస్తును ప్రభువుగా ఎవరైతే మానసికంగా అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన పరిపాలన ద్వారా మంచికాలం వస్తుందని నిరీక్షిస్తున్నారో ఆ వ్యక్తులను సూచిస్తుంది”.—మత్తయి 25:31-46.
మరిన్ని ప్రకాశవంతమైన కాంతికిరణాలు
1931వ సంవత్సరంలో విండికేషన్ మొదటి పుస్తకంలో యెహెజ్కేలు 9వ అధ్యాయం చర్చించబడింది, లోకాంతమందు రక్షించబడేందుకు నుదుటి మీద గుర్తున్నవారిని యేసు ఉపమానంలోని గొర్రెలుగా అది గుర్తించింది. విండికేషన్ మూడవ పుస్తకం (1932 లో ప్రచురితం), ఇశ్రాయేలు అభిషిక్త రాజైన యెహూ అబద్ధ ఆరాధకులను హతం చేస్తుండగా ఆయన ఆసక్తిని చూడడానికి యెహూతోపాటు ఆయన రథంమీద వెళ్ళిన ఇశ్రాయేలీయుడు కాని యెహోనాదాబు యొక్క నీతియుక్తమైన మనోవైఖరిని వర్ణించింది. (2 రాజులు 10:15-28) ఆ పుస్తకం ఇలా చెప్పింది: “ఇప్పుడు భూమిమీద ఉన్న ప్రజలకు, అంటే (ఎవరైతే) సాతాను సంస్థతో అనైక్యంగా ఉంటూ, ఎవరైతే నీతివైపు నిలబడతారో ఆ తరగతి వారికి సూచనగా లేదా ముంగుర్తుగా యెహోనాదాబు నిలిచాడు. వారినే అర్మగిద్దోను సమయమందు ప్రభువు రక్షిస్తాడు, ఆ శ్రమనుంచి బయటకు తెస్తాడు, వారికే భూమిపై నిరంతర జీవితాన్ని ఇస్తాడు. వీరే ‘గొర్రెల’ తరగతి.”
భూనిరీక్షణ గల క్రైస్తవులు యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం పొందాలని 1934 లోని కావలికోట స్పష్టం చేసింది. భూ తరగతిని గురించిన వెలుగు నిజంగానే ఇంతకుముందుకన్నా ప్రకాశవంతంగా తేజరిల్లుతోంది!—సామెతలు 4:18.
ప్రకాశవంతమైన ఒక అవగాహనా మెరుపు
ప్రకటన 7:9-17 వచనాల అవగాహన ధగధగమని కాంతులీనుతూ తళుక్కున మెరవడానికి సిద్ధంగా ఉంది. (కీర్తన 97:11) 1935 లో అమెరికాలోని, వాషింగ్టన్, డి.సి. నందు మే 30 నుంచి జూన్ 3 వరకు ప్రణాళిక వేయబడ్డ సమావేశం యెహోనాదాబుగా సూచించబడే వారికి ఒక “నిజమైన ఓదార్పుగా, ప్రయోజనంగా” ఉంటుందని కావలికోట ప్రకటించింది. అది నిజమని నిరూపించబడింది!
ప్రకటన 7:9 లోని “గొప్పసమూహము”తో సమానమని జె. ఎఫ్. రూథర్‌ఫోర్డ్ లేఖనాల రుజువులను అందించారు. (యోహాను 10:16) ఆ ప్రసంగం ముగింపులో ప్రసంగీకుడు ఇలా అడిగారు: “భూమిమీద నిరంతరం జీవించే నిరీక్షణగల వారందరూ దయచేసి నిలుచుంటారా?” సభికుల్లోని చాలామంది లేచి నిలబడగానే, రూథర్‌ఫోర్డ్ ఇలా ప్రకటించారు: “చూడండి! గొప్ప సమూహం!” క్షణంపాటు గొప్ప నిశ్శబ్దం, తర్వాత పెద్ద పెట్టున తమ ఆనందోత్సాహాలను తెలిపారు. దాని తర్వాతి రోజు, 840 మంది యెహోవా కొత్త సాక్షులు బాప్తిస్మం పొందారు, వారిలో చాలామంది తాము గొప్ప సమూహానికి చెందినవారమని చెప్పుకునేవారే.
సమావేశానికి హాజరైన 20,000 మందికి “గొప్ప సమూహము” మీద ఉర్రూతలూగించే ఒక ప్రసంగం యివ్వబడింది, ఆధునిక “వేరే గొఱ్ఱెలు”గమనార్హమైన హాజరు
1935కు ముందు, బైబిలు సందేశానికి ప్రతిస్పందించి, సువార్త ప్రకటనా పనిలో ఆసక్తి చూపించిన వారిలో అధికంగా పరదైసు భూమి మీద నిరంతరం జీవించాలనే కోరికనే కనబరిచారు. దేవుడు వారికి పరలోక జీవితపు నిరీక్షణను ఇవ్వలేదు కాబట్టి, వారికి పరలోకానికి వెళ్ళాలనే కోరిక కలగలేదు. వారు తమను తాము వేరే గొఱ్ఱెలలోని గొప్ప సమూహంగా పరిగణించుకోవడం, 1935నాటికి 1,44,000 మంది అభిషిక్త క్రైస్తవుల దేవుని ఎన్నిక దాదాపు పూర్తయ్యిందని సూచిస్తుంది.—ప్రకటన 7:4.
రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు గొప్ప సమూహానికి చెందిన వారిని సమకూర్చకుండా ఆపడానికి అపవాదియైన సాతాను తీవ్ర ప్రయత్నాలు చేశాడు. దేవుని రాజ్య ప్రకటనాపని అనేక దేశాల్లో నిషేధించబడింది. నిరాశాజనకమైన ఆ రోజుల్లో, జె. ఎఫ్. రూథర్‌ఫోర్డ్ 1942, జనవరిలో తన మరణానికి కాస్త ముందుగా, “ఎంతైనా ఈ ‘గొప్ప సమూహము’ అంత గొప్పగా అవదేమోనని అనిపిస్తోంది” అని పేర్కొన్నారు.
కానీ దేవుని ఆశీర్వాదాలవల్ల పరిస్థితులు మారాయి. అభిషిక్తులూ, వారి సహచరులైన వేరే గొఱ్ఱెలూ ‘సంపూర్ణాత్మ నిశ్చయతతో నిలకడగా ఉంటూ’ శిష్యులను చేయాలనే ఆదేశాన్ని నెరవేరుస్తున్నారు. (కొలొస్సయులు 4:12; మత్తయి 24:14; 28:19, 20) 1946 నాటికి 1,76,456 యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తుండేవారు, వారిలో అధిక సంఖ్యాకులు గొప్ప సమూహానికి చెందినవారే. 2000వ సంవత్సరం నాటికి, 60,00,000కు పైగా యెహోవాసాక్షులు, 235 దేశాల్లో యథార్థతతో యెహోవా సేవ చేస్తున్నారు—నిజంగానే అది ఒక గొప్ప సమూహము! ఆ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.