కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘జ్ఞానమువలన మనకు దీర్ఘాయువు కలుగుతుంది’

‘జ్ఞానమువలన మనకు దీర్ఘాయువు కలుగుతుంది’

‘జ్ఞానమువలన మనకు దీర్ఘాయువు కలుగుతుంది’

మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి జ్ఞానము అత్యావశ్యకమైనది. కాదని ఎవరనగలరు? నిజమైన జ్ఞానమంటే, పరిజ్ఞానాన్నీ, బుద్ధినీ సరిగా ఉపయోగించే సామర్థ్యం. అది వెర్రితనానికీ, బుద్ధిహీనతకూ, పరమ మూర్ఖత్వానికీ పూర్తిగా భిన్నమైనది. అందుకే జ్ఞానమును సంపాదించుకొమ్మని లేఖనాలు మనలను ప్రేరేపిస్తున్నాయి. (సామెతలు 4:⁠7) వాస్తవానికి, బైబిలు పుస్తకమైన సామెతలు ప్రముఖంగా జ్ఞానమునూ, క్రమశిక్షణనూ అందించడానికే రాయబడింది. దాని ఆరంభపు మాటలు ఇలా ఉన్నాయి: “దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును [“క్రమశిక్షణను,” NW] అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును . . . తగిన సామెతలు.”​—⁠సామెతలు 1:⁠1-4.

ఉదాహరణకు, సామెతల్లోని తొలి అధ్యాయాల్లోని దిట్టమైనవీ నమ్మదగినవీ అయిన కొన్ని బోధలను పరిశీలిద్దాం. ఒక ప్రేమగల తండ్రి తన కుమారుని పురికొల్పే విధంగా, క్రమశిక్షణను అంగీకరించమనీ, జ్ఞానంపట్ల శ్రద్ధ వహించమనీ సొలొమోను ఆయన పాఠకులను బతిమాలుకొంటున్నాడు. (1, 2 అధ్యాయాలు) యెహోవాతో సాన్నిహిత్యాన్ని ఎలా పెంచుకోవాలో, మన హృదయాన్ని ఎలా కాపాడుకోవాలో ఆయన మనకు చూపించాడు. (3, 4 అధ్యాయాలు) నైతిక నడవడి విషయమై పవిత్రంగా ఉండమని మనల్ని హెచ్చరించాడు. (5, 6 అధ్యాయాలు) అవును, ఒక జార స్త్రీ కుయుక్తులను బట్టబయలు చేసిన అధ్యాయం మనకెంతో అమూల్యమైనది. (7వ అధ్యాయం) ఒక వ్యక్తిగా చిత్రీకరించబడిన జ్ఞానము చేసిన విన్నపం ప్రతి ఒక్కరికీ ఎంత ఆసక్తికరంగా ఉందో కదా! (8వ అధ్యాయం) మిగతా అధ్యాయాల్లోని సామెతలను సంక్షిప్తంగా చెప్పడానికి ఉపక్రమించే ముందు, రాజైన సొలొమోను ఇప్పటి వరకు తాను చర్చించిన వాటి గురించి ఒక ఉత్తేజకరమైన సారాంశాన్ని అందిస్తున్నాడు.​—⁠9వ అధ్యాయం.

‘రండి, నేను సిద్ధపరచిన ఆహారమును భుజించి, ద్రాక్షారసమును త్రాగండి’

సామెతల మొదటి భాగమైన తొమ్మిది అధ్యాయాల ఈ ముగింపు, ఇదివరకు పేర్కొన్న సలహాలను క్లుప్తంగా వివరించే అనాసక్తికరమైన సారాంశం మాత్రం కాదు. బదులుగా, ఇది ఉత్తేజపరిచే, చైతన్యం కలిగించే దృష్టాంత రూపంలో, జ్ఞానాన్ని వెతకడానికి పాఠకుడ్ని పురికొల్పే విధంగా అందించబడింది.

బైబిలు పుస్తకమైన సామెతలు 9వ అధ్యాయం ఈ మాటలతో మొదలవుతుంది: “జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది.” (సామెతలు 9:⁠1) “ఏడు స్తంభములు” అన్న పదం, “రెండుప్రక్కల మూడేసి స్తంభములు, మూడోవైపు ఒక స్తంభం, నాలుగోవైపు స్తంభాలేవీ లేకుండా ప్రవేశించడానికి వీలుగా ఏడు స్తంభాల ఆధారంగా కట్టిన, విశాలమైన ప్రాంగణమున్న ఒక పెద్ద ఇంటికి సంకేతంగా ఉంది” అని ఒక పండితుడు సూచించాడు. అది నిజమైనా కాకపోయినా, నిజమైన జ్ఞానము అనేకమంది అతిథులను ఆహ్వానించడానికి దృఢమైన ఒక ఇంటిని కట్టింది.

ఆ ఇంట్లో విందుకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మాంసమూ ఉంది, ద్రాక్షారసమూ ఉంది. భోజనం సిద్ధంచేయడానికీ, బల్లను అమర్చడానికీ జ్ఞానము వ్యక్తిగత శ్రద్ధను చూపించింది. “పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది భోజనపదార్థములను సిద్ధపరచియున్నది.” (సామెతలు 9:​2-3) ఆధ్యాత్మికంగా జ్ఞానోదయాన్ని కలిగించే పౌష్టికాహారం ఈ అలంకారిక బల్లపైన అందుబాటులో ఉందని స్పష్టమౌతోంది.​—⁠యెషయా 55:⁠1, 2.

నిజమైన జ్ఞానము సిద్ధపరచిన విందుకు ఎవరు ఆహ్వానించబడ్డారు? “తన పనికత్తెలచేత జనులను పిలువనంపినది, పట్టణమందలి మెట్టలమీద అది నిలిచి​—⁠జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివిలేనివారితో అది ఇట్లనుచున్నది​—⁠వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానముచేయుడి ఇక జ్ఞానము లేనివారై యుండక బ్రదుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి.”​—⁠సామెతలు 9:​3-6.

ప్రజలను ఆహ్వానించడానికి జ్ఞానము తన పనికత్తెలను పంపించింది. అత్యధిక సంఖ్యలో ప్రజలను పిలవడానికి వాళ్ళు ప్రజలు కూడుకునే స్థలాలకు వెళ్ళారు. “తెలివిలేనివా[రు]” లేదా బుద్ధిహీనులతోపాటు జ్ఞానములేనివారు​—⁠అందరూ ఆహ్వానించబడ్డారు. (సామెతలు 9:⁠4) వారికి జీవం వాగ్దానం చేయబడింది. దేవుని వాక్యంలో జ్ఞానముంది, అందులో భాగమైన సామెతల పుస్తకంలోనూ జ్ఞానముంది, అది నిస్సందేహంగా దాదాపు అందరికీ అందుబాటులో ఉంది. నేడు, నిజమైన జ్ఞానపు సందేశకులుగా యెహోవాసాక్షులు, ప్రజలను ఎక్కడ కనుగొన్నా వారితో బైబిలు అధ్యయనం చేయడానికి వారిని ఆహ్వానించడంలో చాలా బిజీగా ఉన్నారు. నిజంగానే, ఆ పరిజ్ఞానాన్ని పొందినప్పుడు అది మనల్ని నిత్యజీవానికి నడిపించగలదు.​—⁠యోహాను 17:⁠3.

జ్ఞానమిచ్చే క్రమశిక్షణను క్రైస్తవులు వినయంతో అంగీకరించాలి. ప్రత్యేకంగా యౌవనుల విషయంలోనూ కొత్తగా యెహోవాను తెలుసుకోవడం ప్రారంభించిన వారి విషయంలోనూ ఇది నిజం. ఎందుకంటే దేవుని మార్గాల గురించి పరిమితమైన అనుభవమున్నవారు కాబట్టి, వారు “తెలివిలేనివా[రు]” కావచ్చు. దీనర్థం వారి ఉద్దేశాలన్నీ చెడ్డవని కాదు, కానీ వారి హృదయాన్ని యెహోవా దేవుణ్ణి నిజంగా సంతోషపరిచే స్థితికి తేవడానికి సమయంతోపాటు ప్రయత్నాలూ అవసరమౌతాయి. అందుకు వారి ఆలోచనలూ, కోరికలూ, అనురాగాలూ, జీవిత లక్ష్యాలూ దేవుడు అంగీకరించేవాటికి అనుగుణంగా ఉండాల్సిన అవసరముంది. వారు “నిర్మలమైన వాక్యమను . . . పాలను అపేక్షించ[డము]” ఎంతో ప్రాముఖ్యం.​—⁠1 పేతురు 2:⁠2-3.

నిజానికి, మనమందరం “మూలోపదేశము”ల కంటే ముందుకు వెళ్ళవద్దా? నిశ్చయంగా మనం “దేవుని మర్మముల” పట్ల ఆసక్తిని పెంచుకోవాల్సిన అవసరముంది. ఎదిగిన వారికి చెందిన బలమైన ఆహారాన్నుండి పోషక పదార్థాలను పొందాల్సిన అవసరమూ ఉంది. (హెబ్రీయులు 5:⁠12–6:⁠1; 1 కొరింథీయులు 2:​10) యేసు క్రీస్తు స్వయంగా పర్యవేక్షిస్తున్న “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[డు]” ఆధ్యాత్మిక ఆహారాన్ని కష్టపడి సిద్ధంచేసి సమయోచితంగా అందరికీ అందజేస్తున్నాడు. (మత్తయి 24:​45-47) దేవుని వాక్యాన్నీ, దాసుని తరగతి ఏర్పాటు చేసిన బైబిలు ఆధారిత ప్రచురణలనూ శ్రద్ధతో అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానము యొక్క బల్ల దగ్గర మనమూ విందు ఆరగించుదము గాక!

“అపహాసకుని గద్దింపకుము”

జ్ఞానపు బోధల్లో బుద్ధిచెప్పడమూ, గద్దించడమూ ఉన్నాయి. జ్ఞానంలోని ఈ భాగాన్ని అందరూ ఆనందంతో స్వీకరించరు. ఆ కారణంగానే, సామెతల పుస్తకపు మొదటి భాగం ముగింపులో ఒక హెచ్చరిక ఉంది: “అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును.”​—⁠సామెతలు 9:⁠7, 8ఎ.

ఒక అపహాసకుడు, తన మార్గములను సరిదిద్దాలని ప్రయత్నించే వ్యక్తిపట్ల కోపద్వేషాలను పెంచుకుంటాడు. ఒక దుష్టుడు గద్దింపుకున్న విలువను సరిగా గ్రహించడు. సత్యాన్ని ద్వేషించే వ్యక్తికిగానీ లేక దాన్ని అపహాస్యం చేయాలని చూసే వ్యక్తికిగానీ, మనస్సును రంజింపజేసే దేవుని వాక్య సత్యాన్ని నేర్పించటానికి ప్రయత్నించడం ఎంతటి మూర్ఖత్వం! అపొస్తలుడైన పౌలు అంతియొకయలో ప్రకటిస్తున్నప్పుడు, సత్యంపట్ల ప్రేమలేని యూదుల గుంపొకటి ఆయనకు ఎదురైంది. వారు ఆయనను దూషిస్తూ అడ్డుపడి, ఆయన వాదంలో ఇరుక్కోవాలని ప్రయత్నించారు, కాని పౌలు స్పష్టంగా ఇలా పేర్కొన్నాడు: “మీరు [దేవుని వాక్యాన్ని] త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము.”​—⁠అపొస్తలుల కార్యములు 13:⁠45, 46.

దేవుని రాజ్య సువార్తతో యథార్థహృదయులను చేరుకోడానికి మనం చేసే ప్రయత్నంలో, అపహాసకులతో తార్కికవాదాల్లోగానీ, వాగ్వాదాల్లోగానీ ఇరుక్కోకుండా మనం జాగ్రత్తగా ఉందాం. యేసు క్రీస్తు తన శిష్యులను ఇలా ఆదేశించాడు: “[మీరు] యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి. ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి.”​—⁠మత్తయి 10:​12-14.

గద్దింపుపట్ల ఒక జ్ఞానవంతుని ప్రతిస్పందన అపహాసకుని ప్రతిస్పందనకు భిన్నంగా ఉంటుంది. సొలొమోను ఇలా పేర్కొన్నాడు: “జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును.” (సామెతలు 9:⁠8బి, 9ఎ) “ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును” అని జ్ఞానవంతునికి తెలుసు. (హెబ్రీయులు 12:​11) ఇవ్వబడిన సలహా బాధాకరంగా అనిపించినప్పటికీ, దాన్ని అంగీకరించడం వల్ల మనం జ్ఞానవంతులం అవుతామనుకుంటే, దాన్ని ప్రతిఘటించడం గానీ తిరస్కరించడంగానీ ఎందుకు చేయాలి?

“నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును” అంటూ జ్ఞానియైన రాజు ముందుకు సాగాడు. (సామెతలు 9:⁠9బి) ఏ ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేనంత అధిక జ్ఞానవంతులూ కాదు, వయసు మీరిపోయిన వారూ కాదు. జీవితపు మలిదశలో ఉన్న వృద్ధులు కూడా సత్యాన్ని స్వీకరించి యెహోవాకు సమర్పించుకోవడాన్ని చూడడం ఎంత ఆనందకరమో కదా! నేర్చుకోవాలనే కోరికనూ, మనసును చురుగ్గా ఉంచుకోవాలనే కోరికనూ నిలుపుకోవడానికి మనం కూడా కృషిచేద్దాం.

“నీవు జీవించు సంవత్సరములు అధికములగును”

ప్రస్తుతం చర్చించబడుతున్న విషయంలోని ప్రాముఖ్యమైన అంశాన్ని నొక్కిచెబుతూ, సొలొమోను జ్ఞానానికి అత్యంతావశ్యకమైన దాన్ని చేర్చుతున్నాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “యెహోవాయందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే [“పరిజ్ఞానమే” NW] వివేచనకు ఆధారము.” (సామెతలు 9:​10) సత్యదేవుని పట్ల భయభక్తులూ, ప్రగాఢ గౌరవమూ లేనట్లయితే దైవిక జ్ఞానము లేనట్లే. ఒక వ్యక్తి విషయ పరిజ్ఞానంలో ఆరితేరినవాడై ఉండవచ్చు, కానీ యెహోవాపట్ల భయభక్తులు కనుక లోపిస్తే, ఆ పరిజ్ఞానాన్ని సృష్టికర్తకు గౌరవాన్ని తెచ్చే విధంగా ఉపయోగించడంలో తప్పిపోతాడు. తాను వెర్రివాడిలా కనబడేవిధంగా, తనకు తెలిసిన వాస్తవాలనుంచే తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. అంతేకాదు, జ్ఞానపు విశిష్ట లక్షణమైన వివేచనను పొందడానికి అత్యంత పరిశుద్ధుడైన యెహోవాను గూర్చిన పరిజ్ఞానము అత్యావశ్యకము.

జ్ఞానము ఎటువంటి ఫలితాలనిస్తుంది? (సామెతలు 8:​12-21, 35) దాని గురించి ఇశ్రాయేలు రాజు ఇలా చెబుతున్నాడు: “నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును.” (సామెతలు 9:​11) జీవితపు రోజుల, సంవత్సరాల కాలావధి జ్ఞానముతో చేసే సహవాసం మీదే ఆధారపడివుంది. అవును, “జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును.”​—⁠ప్రసంగి 7:​12.

జ్ఞానమును పొందడానికి బాగా కృషి చేయాల్సిన బాధ్యత మనదే. ఈ నిజాన్ని నొక్కిచెబుతూ సొలొమోను ఇలా పేర్కొన్నాడు: “నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను.” (సామెతలు 9:​12) జ్ఞానవంతుని జ్ఞానం ఆయనకే ప్రయోజనకరం, అపహాసకుడు తాను ఎదుర్కొనే దుష్ఫలితాలకు తానే బాధ్యుడు. నిజంగానే, మనం విత్తిన దాన్నే కోస్తాము. కాబట్టి, మనం ‘జ్ఞానమునకు చెవియొగ్గుదము’ గాక.​—⁠సామెతలు 2:⁠2.

‘బుద్ధిహీనత అను స్త్రీ బొబ్బలు పెడుతోంది’

తర్వాత విభిన్నమైన రీతిలో, సొలొమోను ఇలా అంటున్నాడు: “బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది, అది కాముకురాలు దానికేమియు తెలివిలేదు. అది తన ఇంటివాకిట కూర్చుండును ఊరి, రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిని పోవువారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్లువారిని చూచి​—⁠జ్ఞానములేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలుచును.”​—⁠సామెతలు 9:​13-16.

బుద్ధిహీనత బిగ్గరగా అరిచే, క్రమశిక్షణలేని, బుద్ధిలేని ఒక స్త్రీగా వర్ణించబడింది. ఆమె కూడా ఒక ఇల్లు కట్టింది. జ్ఞానములేని వారెవరైతే ఉంటారో వారిని పిలిచే పనికి తనే నడుం బిగించింది. అలాగైతే, ఆ దారిన వెళ్ళేవారికి ఎంపిక చేసుకునే అవకాశముంది. వాళ్ళు జ్ఞానము యొక్క ఆహ్వానాన్ని అంగీకరిస్తారా లేక బుద్ధిహీనత ఆహ్వానాన్నా?

“దొంగిలించిన నీళ్లు తీపి”

జ్ఞానము, బుద్ధిహీనత రెండూ వినువారిని ‘ఇక్కడికి రండి’ అని ఆహ్వానిస్తాయి. కానీ, అభ్యర్థనలో మాత్రం వ్యత్యాసముంటుంది. జ్ఞానము ప్రజలను ద్రాక్షారసం, మాంసం, రొట్టెల విందుకు ఆహ్వానిస్తుంది. అయితే, బుద్ధిహీనత చూపించే ఆకర్షణ మనకు, నైతికతలేని స్త్రీ మార్గాలను గుర్తు చేస్తుంది. సొలొమోను ఇలా అంటున్నాడు: “అది తెలివిలేనివాడొకడు వచ్చుట చూచి​—⁠దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును.”​—⁠సామెతలు 9:17.

కలిపిన ద్రాక్షారసమునకు బదులుగా, ఆ “మందబుద్ధి అనే స్త్రీ” దొంగిలించిన నీళ్ళను అందిస్తోంది. (సామెతలు 9:13, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ప్రియమైన భార్యతో లైంగికానందాన్ని పొందడం, లేఖనాల్లో సేదతీర్చే నీళ్ళు త్రాగడంతో పోల్చబడింది. (సామెతలు 5:15-17) ఆ కారణంగా, దొంగిలించిన నీళ్ళు, రహస్యంగా కొనసాగే అక్రమ సంబంధాలను సూచిస్తున్నాయి. అలాంటి నీళ్ళు దొంగిలించినవే కాకుండా వాటిలో తప్పించుకునే వ్యూహం కూడా ఉంది కాబట్టి, అవి ద్రాక్షారసం కంటే రమణీయంగా కనిపిస్తాయి. రహస్యంగా తినే రొట్టె అవినీతి మార్గంలో పొందినది కాబట్టే, జ్ఞానము ఇచ్చే రొట్టె, మాంసంకన్నా అది ఎంతో కమ్మగా ఉన్నట్టు కనిపిస్తుంది. నిషేధించబడిన దానినీ, దాచిపెట్టబడిన దానినీ చూసి ఆకర్షణీయంగా ఉందనుకోవడం బుద్ధిహీనతకు సూచన.

జ్ఞానము యొక్క ఆహ్వానంలో జీవితపు వాగ్దానముండగా, బుద్ధిహీనతగల స్త్రీ తన మార్గాలను అనుసరించడంవల్ల వచ్చే పర్యవసానాలను గురించి ప్రస్తావించదు. కానీ సొలొమోను ఇలా హెచ్చరిస్తున్నాడు: “అయితే అచ్చట ప్రేతలున్నారనియు, దాని ఇంటికి వెళ్లువారు పాతాళకూపములో ఉన్నారనియు వానికి ఎంతమాత్రమును తెలియలేదు.” (సామెతలు 9:18) “మందబుద్ధి అనే స్త్రీ ఇల్లు నివాసగృహం కాదుగానీ అది ఒక సమాధిగృహం, దాంట్లో ప్రవేశిస్తే మీరు ప్రాణాలతో బయటపడరు” అని ఒక పండితుడు వ్రాశాడు. అనైతికమైన జీవనశైలిని అనుసరించడం జ్ఞానవంతమైనది కాదు; అది మరణకరమైనది.

యేసు క్రీస్తు ఇలా అన్నాడు: “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.” (మత్తయి 7:​13, 14) మనము ఎల్లప్పుడూ జ్ఞానము బల్ల దగ్గర భుజిస్తూ, జీవానికి నడిపించే ద్వారము గుండా వెళ్ళేవారితో ఉందుముగాక.

[31వ పేజీలోని చిత్రం]

జ్ఞానవంతుడు గద్దింపును స్వీకరిస్తాడు

[31వ పేజీలోని చిత్రం]

జ్ఞానమును సంపాదించుకోవడం వ్యక్తిగత బాధ్యత