దేవుడు అనుమతించిన బాధలకు అంతం సమీపించింది
దేవుడు అనుమతించిన బాధలకు అంతం సమీపించింది
ఎక్కడ చూస్తే అక్కడ బాధలే. కొందరు తమకు తామే బాధలను తెచ్చుకుంటారు. లైంగికంగా సంక్రమించే వ్యాధులను కొనితెచ్చుకుంటారు, లేదా మాదకద్రవ్యాలకుగానీ త్రాగుడుకుగానీ పొగత్రాగడానికిగానీ బానిసలై, దాని దుష్ఫలితాలను అనుభవిస్తారు. లేదా అనుచితమైన ఆహారపుటలవాట్ల మూలంగా వాళ్ళు ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవచ్చు. అయినప్పటికీ, బాధలు ఎక్కువగా ఉత్పన్నమవడానికి గల కారకాలు లేక సంఘటనలు సగటు వ్యక్తి అదుపులోలేవు, అవేమిటంటే యుద్ధం, జాత్యాంతర కలహం, పేదరికం, కరువు, అంటువ్యాధులు. అంతేగాక మానవులు ఏ మాత్రం అదుపు చేయలేనివి వృద్ధాప్యం, మరణం వల్లవచ్చే బాధలు.
“దేవుడు ప్రేమాస్వరూపి” అని బైబిలు మనకు నమ్మకంగా చెబుతోంది. (1 యోహాను 4:8) మరి, ప్రేమగల దేవుడు ఈ బాధల్ని అనేక శతాబ్దాలుగా ఎందుకు అనుమతించాడు? ఆయన ఈ విషమ పరిస్థితిని ఎప్పుడు బాగుచేస్తాడు? అనే ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే, మానవుల పట్ల దేవుని సంకల్పమేమిటో మనం పరిశీలించాల్సిన అవసరముంది. దేవుడు బాధలను ఎందుకు అనుమతించాడు, వాటి విషయమై ఆయనేమి చేస్తాడన్నది అర్థం చేసుకోవడానికి ఈ పరిశీలన మనకు సహాయపడుతుంది.
స్వేచ్ఛాచిత్తం అనే బహుమతి
దేవుడు మొదటి మానవుడ్ని సృష్టించినప్పుడు, కేవలం మెదడుతోవున్న ఒక శరీరాన్ని రూపొందించడం కంటే ఎక్కువే చేశాడు. అంతేకాదు, దేవుడు ఆదాము హవ్వలను మెదడులేని రోబోటుల్లా కూడా సృష్టించలేదు. వారికి స్వేచ్ఛాచిత్తాన్ని వినియోగించుకోగల శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. అదొక చక్కని బహుమతి, అందుకే “దేవుడు తాను చేసినది ఆదికాండము 1:31) అవును, “ఆయన కార్యము సంపూర్ణము.” (ద్వితీయోపదేశకాండము 32:4) మనకు దేనినీ ఎంచుకొనే అవకాశం లేకుండా మన ఆలోచనలన్నింటినీ, చర్యలన్నింటినీ ఎవరో వచ్చి మనకు ఆదేశించడాన్ని మనం ఇష్టపడం కాబట్టి, మనమందరం స్వేచ్ఛాచిత్తాన్ని విలువైన బహుమతిగా పరిగణిస్తాం.
యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను.” (అయినా, స్వేచ్ఛాచిత్తమనే ఈ చక్కని బహుమతి ఇవ్వబడింది హద్దుల్లేకుండా ఉపయోగించడానికా? తొలి క్రైస్తవులకు ఇచ్చిన నిర్దేశాల్లో దేవుని వాక్యం ఇలా జవాబిస్తోంది: “స్వతంత్రులైయుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడియుండుడి.” (1 పేతురు 2:16) బహుళజన ప్రయోజనార్థం హద్దులు తప్పకుండా ఉండాలి. కాబట్టి, స్వేచ్ఛాచిత్తం నియమానుసారంగా క్రమబద్ధం చేయబడాలి. లేకపోతే అది అరాచకత్వానికి దారితీయగలదు.
ఎవరి నియమం?
ఎవరి నియమం స్వాతంత్ర్యానికి సరైన హద్దులు ఏర్పరచాల్సి ఉంది? ఈ ప్రశ్నకు జవాబు, దేవుడు బాధల్ని అనుమతించడానికిగల ప్రధాన కారణంతో ముడిపడి ఉంది. మానవులను దేవుడే సృష్టించాడు కాబట్టి, వారి స్వంత ప్రయోజనం నిమిత్తం, ఇతరుల ప్రయోజనం నిమిత్తం వారు ఏ నియమాలకు విధేయత చూపాలో ఆయనకు బాగా తెలుసు. దాన్ని బైబిలు ఈ విధంగా తెలియజేస్తోంది: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.”—యెషయా 48:17.
మానవులు దేవుని నుంచి స్వతంత్రులై ఉండడానికి సృష్టించబడలేదన్నది స్పష్టం. తన నీతివంతమైన నియమాలకు వారు చూపించే విధేయతపైనే వారి సఫలతా, సంతోషమూ ఆధారపడి ఉండేలా ఆయన వారిని రూపొందించాడు. దేవుని ప్రవక్తయైన యిర్మీయా ఇలా అన్నాడు: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.”—యిర్మీయా 10:23.
దేవుడు, గురుత్వాకర్షణ శక్తిలాంటి తన భౌతిక నియమాల ఆధీనంలో ఉండేలా మానవజాతిని రూపొందించాడు. అదేవిధంగా, సామరస్యంతో కూడిన సమాజాన్ని రూపొందింపజేసే తన నైతిక నియమాల ఆధీనంలో కూడా ఉండేలా ఆయన వారిని సృష్టించాడు. కాబట్టి దేవుని వాక్యం ఈ విధంగా ప్రేరేపించడం సహేతుకమే: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.”—సామెతలు 3:5.
అందుకే, మానవ కుటుంబం దేవుని పరిపాలన ద్వారా కాకుండా తనకు తాను క్రమబద్ధం చేసుకోవడం ద్వారా ఎంతమాత్రం సఫలత పొందదు. దేవునినుంచి స్వతంత్రంగా ఉండాలనే ప్రయత్నంలో ప్రజలు ఒకదానితో మరొకటి విభేదించుకునే సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత వ్యవస్థలను రూపొందించుకుంటారు, చివరికి, “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొను[ను].”—ప్రసంగి 8:9.
అపశృతికి కారణమేమిటి?
మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వలకు దేవుడు పరిపూర్ణమైన ఆరంభాన్నిచ్చాడు. వారికి పరిపూర్ణమైన శరీరాలూ, మనసులూ, నివాస స్థలంగా పరదైసులాంటి తోటా ఉండేవి. వారు గనుక దేవుని పాలనకు లోబడి ఉండివుంటే వారు పరిపూర్ణులుగానూ సంతోషంగానూ ఉండేవారు. కాలక్రమేణా, పరదైసు భూమిపై ఆదికాండము 1:27-29; 2:15.
జీవించే పరిపూర్ణమైన, సంతోషభరితమైన మొత్తం మానవ కుటుంబానికి వారు తల్లిదండ్రులయ్యుండేవారు. అది మానవజాతిపట్ల దేవుని సంకల్పంగా ఉండేది.—అయితే, మన తొలి పూర్వికులు వారి స్వేచ్ఛాచిత్తాన్ని దుర్వినియోగపర్చుకున్నారు. దేవునినుంచి స్వతంత్రంగా ఉండడంవల్ల తాము సఫలత పొందగలమని వారు తప్పుగా ఆలోచించారు. తమ స్వంత స్వేచ్ఛాచిత్తం వల్లనే వారు దేవుని నియమాల హద్దులను దాటారు. (ఆదికాండము, 3వ అధ్యాయం) వారు ఆయన పరిపాలనను తిరస్కరించారు కాబట్టి, ఆ పైన వారిని పరిపూర్ణతలో కొనసాగింపజేయడానికి దేవుడు బద్ధుడు కాదు. ‘వారు తమను తాము చెరుపుకొన్నారు, ఆయన పుత్రులుగా వారు ఉండలేదు, వారు కళంకులు.’—ద్వితీయోపదేశకాండము 32:5.
ఆదాము హవ్వలు, దేవునికి అవిధేయులైనప్పటి నుంచి వారి శరీరమూ, మనసూ కృశించడం ఆరంభించాయి. జీవపు ఊట దేవుని దగ్గర ఉంది. (కీర్తన 36:9) అందుకే, యెహోవా నుంచి తెగతెంపులు చేసుకోవడం మూలంగా, మొదటి మానవ దంపతులు అపరిపూర్ణులుగా మారి చివరికి మరణించారు. (ఆదికాండము 3:19) వంశానుగత లక్షణాలను సంక్రమింపజేసే జన్యు నియమాల ప్రకారం, తమ తల్లిదండ్రుల వద్ద ఏమున్నాయో వాటినే వారి సంతానం పొందగల్గింది. అవేమిటి? అవే అపరిపూర్ణత, మరణము. అందుకే అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఒక మనుష్యునిద్వారా [ఆదాము] పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”—రోమీయులు 5:12.
ప్రధానమైన వివాదాంశం—సర్వోన్నతాధిపత్యం
ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవునిపై తిరుగుబాటు చేశారో, అప్పుడే ఆయనకున్న పరిపాలనా హక్కును అంటే ఆయన సర్వోన్నతాధిపత్యాన్ని వారు సవాలు చేశారు. యెహోవా వారిని నాశనంచేసి మరో జంటతో మానవజాతిని ప్రారంభించగలిగేవాడే, కానీ ప్రజలకు ఎవరి పరిపాలన సరైనదీ, శ్రేష్ఠమైనదీ అనే వివాదానికి అది పరిష్కారం అయ్యుండేది కాదు. తమ స్వంత ఆలోచనల ప్రకారం మానవ సమాజాలను అభివృద్ధి చేసుకోవడానికి సమయాన్ని అనుమతించడం, దేవుని నడిపింపు లేకుండా స్వతంత్రంగా చేసే పరిపాలన సఫలీకృతం అవుతుందా కాదా అన్న విషయాన్ని ఏ మాత్రం సందేహం లేకుండా తేల్చివేస్తుంది.
వేల సంవత్సరాల మానవ చరిత్ర మనకేం తెలియజేస్తోంది? ఈ శతాబ్దాలన్నింటిలో ప్రజలు అనేక విధాల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మత వ్యవస్థలను ప్రయత్నించారు. అయినప్పటికీ, దుష్టత్వమూ బాధలూ కొనసాగాయి. నిజం చెప్పాలంటే, ప్రత్యేకించి మన కాలంలో ‘దుర్జనులు అంతకంతకు చెడిపోయారు.’—2 తిమోతి 3:13.
20వ శతాబ్దం, విజ్ఞానపరంగా పారిశ్రామికపరంగా శిఖరాగ్ర స్థాయిలో ఘనకార్యాలను చూసింది. అయితే అది మానవజాతి చరిత్రంతటిలోను భయంకరమైన బాధలను కూడా చూసింది. వైద్యపరంగా ఎన్ని అభివృద్ధులు జరిగినప్పటికీ ఇప్పటికీ దేవుని నియమమే నిజమైనది: జీవపు ఊటయైన దేవునినుంచి దూరమైన మానవులు వ్యాధులకు గురౌతారు, వృద్ధులౌతారు, చివరికి మరణిస్తారు. మానవులు “తమ మార్గము నేర్పరచుకొనుట” వారి వశములో లేదని ఎంత స్పష్టంగా రుజువైంది!
దేవుని సర్వోన్నతాధిపత్యం నిరూపించబడింది
తిరుగులేని విధంగా చివరికి, దేవునినుంచి స్వాతంత్ర్యమనే విషాదకరమైన ఈ ప్రయోగం ఆయననుంచి స్వతంత్రంగా చేసే మానవ పరిపాలన ఎన్నడూ విజయవంతం కాలేదు అని రుజువు చేసింది. కేవలం దేవుని పరిపాలన మాత్రమే సంతోషాన్నీ, ఐక్యాన్నీ, ఆరోగ్యాన్నీ, జీవాన్నీ తీసుకురాగలదు. అంతేగాక, యెహోవా దేవుని పరిపూర్ణ వాక్యమైన పరిశుద్ధ బైబిలు, దేవుని నడిపింపు లేకుండా స్వతంత్రంగా చేస్తున్న మానవ పరిపాలనకు “అంత్యదినములలో” మనం జీవిస్తున్నామని తెలియజేస్తోంది. (2 తిమోతి 3:1-5) యెహోవా అనుమతించిన ఈ మానవ పరిపాలనకూ, దుష్టత్వానికీ, బాధలకూ అంతం సమీపించింది.
అతి త్వరలో దేవుడు మానవ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటాడు. దాని గురించి లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “ఆ రాజుల [ప్రస్తుతం ఉనికిలోవున్న మానవ పరిపాలనలు] కాలములలో పరలోకమందున్న దేవుడు [పరలోకములో] ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు [ఇకపై మరెన్నడూ కూడా ఈ భూమిని మానవులు పరిపాలించరు]; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని [ప్రస్తుత పరిపాలనలను] పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:44.
యెహోవా దేవుని సర్వోన్నతాధిపత్యంపై మోపబడిన నింద తప్పని పరలోక రాజ్యం ద్వారా నిరూపించడమే బైబిలులో ఉన్న ప్రధానాంశం. యేసు దీన్నే తన మత్తయి 24:14.
ప్రధాన బోధగా చేసుకున్నాడు. ఆయనిలా అన్నాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మానవ పరిపాలన స్థానంలోకి దేవుని పరిపాలన వచ్చినప్పుడు ఎవరు రక్షించబడతారు, ఎవరు రక్షించబడరు? సామెతలు 2:21, 22 మనకిలా అభయమిస్తోంది: “యథార్థవంతులు [దేవుని పరిపాలనను సమర్థించినవారు] దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు [దేవుని పరిపాలనను సమర్థించనివారు] దేశములో నుండకుండ నిర్మూలమగుదురు.” దైవిక ప్రేరేపణతో కీర్తనకర్త ఇలా పాడాడు: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:10, 11, 29.
అద్భుతమైన నూతన లోకము
దేవుని రాజ్య పరిపాలనలో, ప్రస్తుత విధానాంతంలో రక్షించబడినవారు దుష్టత్వమూ, బాధలూ లేకుండా తుడిచివేయబడిన భూమిపైకి నడిపించబడతారు. మానవజాతికి దేవుని నియమాలు అందజేయబడతాయి, కాలక్రమేణా “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.” (యెషయా 11:9) నైతికంగా బలాన్నిచ్చే ఈ నిర్మాణాత్మకమైన బోధలు నిజంగా శాంతియుతమైన, సామరస్యమైన మానవ సమాజం ఏర్పడటానికి తోడ్పడతాయి. తత్ఫలితంగా యుద్ధం, హత్య, దౌర్జన్యం, మానభంగం, దొంగతనం లేదా ఇతర నేరాలేవీ ఉండవు.
దేవుని నూతన లోకంలో జీవించే విధేయులైన మానవులకు అద్భుతమైన భౌతిక సంబంధ ప్రయోజనాలు చేకూరుతాయి. దేవుని పరిపాలనపై తిరుగుబాటు చేయడం వల్ల వచ్చిన దుష్ఫలితాలు తొలగించబడతాయి. అపరిపూర్ణత, అనారోగ్యం, వృద్ధాప్యం, మరణం గతంలోని విషయాలవుతాయి. బైబిలు మనకిలా దృఢంగా చెబుతోంది: “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” అంతేకాదు, లేఖనాలింకా ఇలా వాగ్దానం చేస్తున్నాయి: “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును.” (యెషయా 33:24; 35:5,6) ప్రతిరోజూ—నిరంతరం—ఉర్రూతలూగించే ఆరోగ్యాన్ని అనుభవించడం ఎంత చక్కని అనుభూతో కదా!
దేవుని ప్రేమపూర్వక నిర్వహణలో, నూతన లోకపు వాసులు భూవ్యాప్త పరదైసును తయారుచేయడానికి తమ శక్తి, సామర్థ్యాలను ఉపయోగిస్తారు. పేదరికం, ఆకలి, నిరాశ్రయతలు శాశ్వతంగా లేకుండా పోతాయి, ఎందుకంటే యెషయా ప్రవచనమిలా పేర్కొంటుంది: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు.” (యెషయా 65:21, 22) నిజంగానే, “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును.”—మీకా 4:4.
దేవుడు మరియు ఆయనకు విధేయులైన మానవులు చూపే ప్రేమపూర్వక శ్రద్ధవల్ల భూమి దాని పూర్తి ప్రతిఫలాన్నిస్తుంది. అందుకు హామీగా మనకు ఈ లేఖనాలున్నాయి: “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును. . . . అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును.” (యెషయా 35:1, 6) “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.”—కీర్తన 72:16.
చనిపోయిన కోట్లాదిమంది విషయమేమిటి? దేవుని జ్ఞాపకంలో ఉన్నవారు తిరిగి జీవానికి తేబడతారు, “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్న[ది].” (అపొస్తలుల కార్యములు (24:14, 15) అవును, మరణించిన వారు పునరుజ్జీవింపజేయబడతారు. వారికి దేవుని పరిపాలనను గురించిన అద్భుత సత్యాలు నేర్పించబడతాయి, పరదైసులో నిరంతరం జీవించే సదవకాశమూ ఇవ్వబడుతుంది.—యోహాను 5:28, 29.
వీటన్నింటి ద్వారా యెహోవా దేవుడు, మానవజాతిని వేలాది సంవత్సరాలుగా తమ కబంధహస్తాల్లో చిక్కించుకున్న బాధలు, అనారోగ్యము, మరణాలను పూర్తిగా తీసివేస్తాడు. ఇకపైన అనారోగ్యం ఉండదు! అంగవైకల్యం ఉండదు! మరణం ఉండదు! దేవుడు “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపో[వును].”—ప్రకటన 21:3, 4.
ఆ విధంగా దేవుడు బాధలను అంతమొందిస్తాడు. ఆయన ఈ భ్రష్టలోకాన్ని నిర్మూలించి దాని స్థానంలోనే పూర్తిగా నూతనమైన ఒక వ్యవస్థను ప్రవేశపెడతాడు, “[దాని]యందు నీతి నివసించును.” (2 పేతురు 3:13) ఆహా! ఇది ఎంత చక్కని సువార్త! మనకు ఆ నూతన లోకం త్వరగా కావాలి. దాన్ని చూడడానికి మనం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నెరవేరిన బైబిలు ప్రవచనాలనుబట్టి, మనం నూతన లోకానికి అతి సమీపంగా ఉన్నామనీ, దేవుడు అనుమతించిన బాధలకు అంతం సమీపించిందనీ మనకు తెలుస్తోంది.—మత్తయి 24:3-14.
[8వ పేజీలోని బాక్సు]
మానవ పరిపాలన వైఫల్యం
మానవ పరిపాలనను గురించి, జర్మన్ మాజీ ఛాన్స్‌లర్ హెల్‌మూట్ ష్మిట్ ఇలా ప్రకటించాడు: “మానవులమైన మనం . . . మొత్తం ప్రపంచాన్ని ఎప్పుడూ శాంతిగా పరిపాలించలేదు, ఎక్కడైతే పరిపాలించామో అక్కడ ఎక్కువ కాలం చాలా ఘోరంగానే పరిపాలించాము . . . మనం పూర్తి శాంతిగా ఎప్పుడూ పరిపాలించలేదు.” హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 1999 ఇలా పేర్కొంది: “సమాజంలోని అల్లకల్లోలాలు, పెరిగిన నేరాలు, కుటుంబాల్లో ఎక్కువైన దౌర్జన్యాలవల్ల తమ సామాజిక వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతున్నాయని అన్ని దేశాలు నివేదిస్తున్నాయి. . . భౌగోళిక విపత్తులు ఎంతగా అధికమౌతున్నాయంటే, వాటిని ఎదుర్కోవడానికి దేశస్థాయి శక్తి సామర్థ్యాలే కాదు అంతర్జాతీయ ప్రతిస్పందనలు కూడా సరిపోవడం లేదు.”
[5వ పేజీలోని చిత్రసౌజన్యం]
పైనుంచి మూడవది, తల్లీబిడ్డలు: FAO photo/B. Imevbore; దిగువ, ప్రేలుడు: U.S. National Archives photo
[8వ పేజీలోని చిత్రాలు]
“[వారు] బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:11