కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

దానియేలు 9:24లో ప్రవచించబడినట్లు “అతి పరిశుద్ధ స్థలము” ఎప్పుడు అభిషేకించబడింది?

దానియేలు 9:⁠24-27 లో “అభిషిక్తుడగు అధిపతి”యైన క్రీస్తు కనబడేదాని గురించిన ప్రవచనముంది. కాబట్టి, “అతి పరిశుద్ధ స్థలము” అభిషేకించబడడాన్ని గురించిన ప్రవచనం, యెరూషలేములోని దేవాలయపు అతి పరిశుద్ధ స్థలము యొక్క అభిషేకాన్ని సూచించడంలేదు. బదులుగా, “అతి పరిశుద్ధ స్థలము” అన్న మాట పరలోకపు అతిపరిశుద్ధ స్థలమైనటువంటి, యెహోవా గొప్ప ఆధ్యాత్మిక దేవాలయములోని దేవుని పరలోకపు పవిత్ర స్థలాన్ని సూచిస్తుంది. *​—⁠హెబ్రీయులు 8:⁠1-5; 9:​2-10, 23.

దేవుని ఆధ్యాత్మిక దేవాలయం పనిచేయడం ఎప్పుడు ప్రారంభించింది? ముందుగా, సా.శ. 29 లో యేసు తనను బాప్తిస్మం కొరకు అర్పించుకున్నప్పుడు ఏమి జరిగిందో పరిశీలించండి. యేసు తన జీవితంలోని ఆ సమయం నుంచి, కీర్తన 40:6-8 నందలి మాటలను స్పష్టంగా నెరవేర్చాడు. యేసు దేవునికిలా ప్రార్థించాడని అపొస్తలుడైన పౌలు తర్వాత సూచించాడు: “బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి.” (హెబ్రీయులు 10:⁠5) యెరూషలేము ఆలయంలో జంతు బలుల అర్పణలు కొనసాగాలని దేవుడు “కోరలేదు” అన్న విషయం యేసుకు తెలుసు. వాటికి బదులుగా, బలిగా అర్పించడానికి దేవుడు యేసుకొక పరిపూర్ణ మానవ శరీరాన్ని సిద్ధం చేశాడు. తన హృదయపూర్వక కోరికను చూపిస్తూ, యేసు ప్రార్థించడాన్ని ఇలా కొనసాగించాడు: “గ్రంథపుచుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, నీ చిత్తము నెరవేర్చుటకు దేవా, ఇదిగో నేను వచ్చియున్నా[ను].” (హెబ్రీయులు 10:⁠7) అందుకు యెహోవా ఎలా ప్రతిస్పందించాడు? మత్తయి సువార్త దాన్నిలా తెలియజేస్తోంది: “యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు​—⁠ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.”​—⁠మత్తయి 3:​16, 17.

యేసు తన శరీరాన్ని బలిగా అర్పించడాన్ని యెహోవా దేవుడు అంగీకరించడమంటే, యెరూషలేము ఆలయంలోని బలిపీఠం కంటే గొప్ప బలిపీఠమొకటి ఉనికిలోకి వచ్చిందని అర్థం. అది, దేవుని “చిత్తము” అనే బలిపీఠము లేక యేసు మానవ జీవాన్ని బలిగా అంగీకరించడానికి దేవుడు చేసిన ఏర్పాటు. (హెబ్రీయులు 10:​10) యేసును పరిశుద్ధాత్మతో అభిషేకించడమంటే, దేవుడు తన మొత్తం ఆధ్యాత్మిక దేవాలయ ఏర్పాటును అప్పుడు ఉనికిలోకి తీసుకువచ్చాడని అర్థం. * ఆ విధంగా, యేసు బాప్తిస్మం సమయంలో, దేవుని పరలోకపు నివాస స్థలం అభిషేకించబడింది, లేక గొప్ప ఆధ్యాత్మిక ఆలయ ఏర్పాటులో “అతి పరిశుద్ధ స్థలము”గా ప్రత్యేకించబడింది.

[అధస్సూచీలు]

^ పేరా 3 దేవుని ఆధ్యాత్మిక దేవాలయపు వివిధ అంశాల చర్చ కొరకు, కావలికోట జూలై 1, 1996 లోని 14-19 పేజీలను చూడండి.

[27వ పేజీలోని చిత్రం]

యేసు బాప్తిస్మం పొందినప్పుడు, “అతి పరిశుద్ధ స్థలము” అభిషేకించబడింది