కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మానవుల బాధలు ఒక పెద్ద వివాదాంశం

మానవుల బాధలు ఒక పెద్ద వివాదాంశం

మానవుల బాధలు ఒక పెద్ద వివాదాంశం

“ఎందుకు దేవా ఎందుకు?” అన్న ఒక పెద్ద శీర్షిక, ప్రఖ్యాతి గాంచిన ఒక వార్తాపత్రిక మొదటి పేజీ మీద కనబడింది. ఆసియా మైనరులో విధ్వంసకరమైన భూకంపం గురించిన వార్త అది. ఆ వార్తతోపాటు ఉన్న చిత్రంలో, గాయపడిన తన కూతురుని దుఃఖవదనంతో ఎత్తుకుని వస్తున్న ఒక తండ్రి కనిపిస్తాడు, ఆయన వెనక కుప్పకూలిన ఆయన ఇల్లు కనబడుతుంది.

యుద్ధాలు, కరువులు, అంటువ్యాధులు, ప్రకృతి వైపరీత్యాల మూలంగా కన్నీళ్ళు కాలువలయ్యాయి, రక్తపుటేరులు ప్రవహించాయి, ప్రజల గుండెల్ని పిండేశాయి. వాటికి తోడు మానభంగానికి గురైనవారి బాధలూ, అత్యాచారానికి గురైన పిల్లల బాధలూ, ఇతర నేరాలకు గురైనవారి బాధలూ ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలవల్ల కలిగే తీవ్రమైన గాయాలు, సంభవించే మరణాల గురించి ఆలోచించండి. అంతేగాక, అనారోగ్యం, వృద్ధాప్యం, తమ ప్రియమైనవారి మరణాల కారణంగా కోట్లాదిమంది తీవ్రమైన క్షోభను అనుభవిస్తున్నారు.

ఇంతకుముందెన్నడూ లేనంత ఘోరాతి ఘోరమైన బాధలను 20వ శతాబ్దం చవిచూసింది. 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు కోటిమంది సైనికులు చనిపోయారు. అంతేమంది పౌరులు కూడా చనిపోయారని కొందరు చరిత్రకారులు చెబుతారు. రెండవ ప్రపంచ యుద్ధంలో, యుద్ధంలో పాల్గొన్నవారూ పౌరులూ కలిపి దాదాపు ఐదు కోట్లమంది చనిపోయారు, వారిలో అమాయకులైన లక్షలాదిమంది స్త్రీలూ, పిల్లలూ, వృద్ధులు కూడా ఉన్నారు. గత శతాబ్దంలో జాతిపోరాటాలకూ, విప్లవాలకూ, జాత్యాంతర కలహాలకూ, ఆకలిదప్పులకూ, పేదరికానికీ కోట్లమంది బలయ్యారు. ఇరవయ్యో శతాబ్దపు చారిత్రక అట్లాస్‌ (ఆంగ్లం) అంచనా ప్రకారం ఇలాంటి “ఘోరాతి ఘోరమైన సంఘటనల” కారణంగా 18 కోట్లకు పైగా ప్రజలు చనిపోయారు.

1918/19 నాటి స్పానిష్‌ ఇన్‌ఫ్లూయెంజా రెండు కోట్లమందిని చంపింది. గత రెండు దశాబ్దాల్లో దాదాపు 1.9 కోట్లమంది ఎయిడ్స్‌వల్ల చనిపోగా, మరో 3.5 కోట్లమంది దాని వైరస్‌కు గురయ్యారు. ఎయిడ్స్‌ కారణంగా తల్లిదండ్రులు చనిపోవడంవల్ల లక్షలాదిమంది పిల్లలు అనాథలయ్యారు. అంతేగాక, గర్భంలో ఉన్నప్పుడే తమ తల్లుల ద్వారా ఎయిడ్స్‌ వ్యాధి సోకడం మూలంగా లెక్కలేనంత మంది శిశువులు చనిపోతున్నారు.

పిల్లలు మరెన్నో విధాలుగా తీవ్రమైన బాధకు గురౌతున్నారు. 1995వ సంవత్సరం చివర్లో ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి (యూనిసెఫ్‌) అందించిన సమాచారాన్ని ఇంగ్లాండులోని మాంచెస్టర్‌ గార్డియన్‌ వీక్లీ పత్రిక ఇలా పేర్కొంది: “గత దశాబ్దంలోని యుద్ధాల్లో, 20 లక్షలమంది పిల్లలు చంపబడ్డారు, 40 నుంచి 50 లక్షలమంది వరకు వికలాంగులయ్యారు, 1.2 కోట్లమంది నిరాశ్రయులయ్యారు, 10 లక్షలకు పైగా అనాథలయ్యారు లేదా తల్లిదండ్రులకు దూరమయ్యారు, కోటిమంది మానసికంగా గాయపడ్డారు.” వాటికి తోడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 నుంచి 5 కోట్ల గర్భస్రావాలు చేయబడుతున్నాయి!

భవిష్యత్తులో ఏమి జరుగుతుంది?

భవిష్యత్తులో భయంకరమైన విపత్తేదో జరగబోతోందని చాలామంది అనుకుంటారు. శాస్త్రజ్ఞుల బృందమొకటి ఇలా పేర్కొంది: “మానవ కార్యకలాపాలు . . . జీవ ప్రపంచాన్ని ఎంతగా మార్చగలవంటే, చివరికి మనకు తెలిసిన రీతిలో జీవం మనగల్గే సాధ్యత లేకుండా పోవచ్చు.” ఆ బృందం ఇంకా ఇలా చెప్పింది: “ఈ క్షణంలో కూడా అయిదుగురిలో ఒకరు సరైన తిండి కూడా లేనంత కటిక పేదరికంతో, పదిమందిలో ఒకరు తీవ్రమైన కుపోషణతో బాధపడుతున్నారు.” శాస్త్రజ్ఞులు “భవిష్యత్తులో జరుగబోయేదాని గురించి మొత్తం మానవజాతిని హెచ్చరించడానికి” అదే సందర్భంలో ఇంకా ఇలా అన్నారు: “మానవకోటి దుఃఖసాగరంలో మునిగిపోకుండా తప్పించుకోవాలన్నా, మన నివాసస్థలమైన ఈ భూగ్రహం బాగుపర్చలేని విధంగా నశించకుండా ఉండాలన్నా, భూమిపట్ల దానిమీది జీవజాలంపట్ల మన విధి నిర్వహణలో ఒక గొప్పమార్పు అవసరం.”

ఇన్ని బాధల్నీ, ఇంత దుష్టత్వాన్నీ దేవుడు ఎందుకు అనుమతించాడు? ఈ పరిస్థితి చక్కబరచడానికి ఆయనేం చేయాలని సంకల్పిస్తున్నాడు? ఎప్పుడు చక్కబరుస్తాడు?

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

పైన, చక్రాల కుర్చీ: UN/DPI Photo 186410C by P.S. Sudhakaran; మధ్యలో, ఆకలితో అలమటిస్తున్న పిల్లలు: WHO/OXFAM; దిగువ, కుపోషణకు గురైన మనిషి: FAO photo/B. Imevbore