కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా చేసిన గొప్పకార్యములను బట్టి ఆయనను స్తుతించండి!

యెహోవా చేసిన గొప్పకార్యములను బట్టి ఆయనను స్తుతించండి!

యెహోవా చేసిన గొప్పకార్యములను బట్టి ఆయనను స్తుతించండి!

“నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది . . . సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను.”​—⁠లూకా 1:46-49.

1. ఏ గొప్ప కార్యాలను బట్టి మనం యెహోవాను సముచితంగా స్తుతిస్తాము?

యెహోవా తాను చేసిన గొప్ప కార్యాలను బట్టి స్తోత్రార్హుడు. ప్రవక్తయైన మోషే, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల విడుదలను గురించి చెబుతూ, “యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా” అని ప్రకటించాడు. (ద్వితీయోపదేశకాండము 11:​1-7) అదేవిధంగా, యేసు జననాన్ని గురించి గబ్రియేలు దూత కన్యకయైన మరియకు ప్రకటించినప్పుడు ఆమె, “నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది . . . సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను” అని అంది. (లూకా 1:46-49) యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు దాసత్వం నుండి విడిపించడం, తన ప్రియ కుమారుడు అద్భుత రీతిన జన్మించేలా చేయడం వంటి గొప్ప కార్యాలను ఆయన చేశాడు గనుక, యెహోవాసాక్షులముగా మనం ఆయనను స్తుతిస్తాము.

2. (ఎ) విధేయతగల మానవాళిని గురించిన దేవుని “నిత్యసంకల్పము” ఏమిటి? (బి) పత్మాసు దీవిలో యోహానుకు ఎలాంటి అనుభవం కలిగింది?

2 యెహోవా చేసిన అనేక గొప్ప కార్యాలు, విధేయతగల మానవాళిని మెస్సీయ ద్వారా ఆయన రాజ్యపరిపాలన ద్వారా ఆశీర్వదించాలన్న ఆయన “నిత్యసంకల్పము”తో ముడిపడి ఉన్నాయి. (ఎఫెసీయులు 3:​8-13) వృద్ధుడైన అపొస్తలుడైన యోహానుకు దర్శనంలో తెరవబడిన ద్వారము గుండా పరలోకంలోకి తొంగి చూసే అనుమతి లభించినప్పుడు, ఆ సంకల్పం క్రమానుగతంగా నెరవేరుతూవుంది. ఆ దర్శనంలో బూరధ్వనిలాంటి ఒక స్వరము, “ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెద[ను]” అని ఆయనతో చెప్పగా విన్నాడు. (ప్రకటన 4:⁠1) తాను ‘దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడినందుకూ, యేసును గురించి సాక్ష్యమిచ్చినందుకూ’ రోమా ప్రభుత్వం విధించిన తీర్పు ప్రకారం, పత్మాసు దీవిలో యోహాను ప్రవాసశిక్ష అనుభవిస్తున్నప్పుడు, “యేసుక్రీస్తు ప్రత్యక్షత”ను పొందాడు. అపొస్తలుడైన యోహానుకు దర్శనంలో కనిపించిన వినిపించిన విషయాలు దేవుని నిత్యసంకల్పాన్ని గురించి మరెక్కువగా వెల్లడిచేస్తూ, నిజక్రైస్తవులకందరికీ ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్నీ, సమయోచితమైన ప్రోత్సాహాన్నీ ఇస్తున్నాయి.​—⁠ప్రకటన 1:9, 10.

3. దర్శనంలో యోహాను చూసిన 24 మంది పెద్దలు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు?

3 రాజుల్లా కిరీటాలు ధరించుకుని సింహాసనాసీనులై ఉన్న ఇరవై నాలుగు మంది పెద్దలను పరలోకంలో తెరవబడివున్న ద్వారం గుండా యోహాను చూశాడు. వాళ్ళు యెహోవా ఎదుట సాగిలపడి, “ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని” చెప్పారు. (ప్రకటన 4:​10, 11) ఆ పెద్దలు, పునరుత్థానం చేయబడి, దేవుడు వాగ్దానం చేసిన ఉన్నత స్థానాల్లో ఉన్న అభిషిక్త క్రైస్తవులందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన సృష్టికి సంబంధించి యెహోవా చేసిన గొప్ప కార్యాలనుబట్టి ఆ పెద్దలు ఆయనను స్తుతించడానికి పురికొల్పబడ్డారు. యెహోవా ‘నిత్యశక్తికీ దేవత్వానికీ’ గల సాక్ష్యాధారాలను చూసి మనం కూడా ఆశ్చర్యచకితులమవుతాము. (రోమీయులు 1:​20) మనం యెహోవాను గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయనను స్తుతించేందుకు కారణాలు అంత ఎక్కువగా కనిపిస్తాయి.

యెహోవా చేసిన స్తోత్రార్హమైన కార్యాలను ప్రకటించండి

4, 5. దావీదు యెహోవాను ఎలా స్తుతించాడో చూపే ఉదాహరణలను ఇవ్వండి.

4 దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి కీర్తనకర్తయైన దావీదు ఆయనను స్తుతించాడు. ఉదాహరణకు ఆయన ఇలా పాడాడు: “సీయోను వాసియైన యెహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధిచేయుచు సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణనుబట్టి హర్షించునట్లు యెహోవా, నన్ను కరుణించుము. మరణద్వారమున ప్రవేశింపకుండ నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము.” (కీర్తన 9:​11, 13, 14) దావీదు తన కుమారుడైన సొలొమోనుకు, ఆలయ నిర్మాణ పథకాన్ని ఇచ్చిన తర్వాత, “యెహోవా, . . . మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు. . . . మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము” అంటూ దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తించాడు.​—⁠1 దినవృత్తాంతములు 29:10-13.

5 దావీదు చేసినట్లే మనం కూడా దేవుణ్ణి స్తుతించాలని లేఖనాలు మళ్ళీ మళ్ళీ ఆహ్వానిస్తున్నాయి, అలా చేయమని పురికొల్పుతున్నాయి. కీర్తనల గ్రంథంలో దేవుణ్ణి స్తుతించే మాటలు అనేకం ఉన్నాయి. ఈ కీర్తనల్లో దాదాపు సగం దావీదు రచించినట్లు తెలుస్తుంది. ఆయన యెహోవాను ఎల్లప్పుడూ స్తుతించేవాడు, కృతజ్ఞతలు తెలిపేవాడు. (కీర్తన 69:​30) అంతేకాక, దావీదూ ఇతరులూ దైవప్రేరేపితులై కూర్చిన కీర్తనలు యెహోవాను స్తుతించేందుకు మొదట్లో నుండే ఉపయోగించబడుతున్నాయి.

6. ప్రేరేపిత కీర్తనలు మనకెలా ఉపయోగకరంగా ఉంటాయి?

6 యెహోవా ఆరాధకులకు కీర్తనలు ఎంత ఉపయోగకరమైనవి! మన కోసం యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నింటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నప్పుడు కీర్తనల్లో ఉన్న రమ్యమైన మాటలు మన మనస్సుల్లోకి రావచ్చు. ఉదాహరణకు, ప్రతి రోజూ నిద్ర లేచినప్పుడు, “యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను . . . ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను” వంటి భావవ్యక్తీకరణలను చేసేందుకు మనం కదిలించబడవచ్చు. (కీర్తన 92:​1-4) మన ఆధ్యాత్మిక అభివృద్ధికి కలిగిన ఆటంకాన్ని మనం అధిగమించినప్పుడు మనకు కలిగిన ఆనందాన్నీ కృతజ్ఞతా భావాన్నీ ప్రార్థనలో వ్యక్తీకరించేందుకు మనం కదిలించబడవచ్చు. దావీదు ఇలా పాడినప్పుడు చేసిందదే: “రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.”​—⁠కీర్తన 95:1, 2.

7. (ఎ) క్రైస్తవులు పాడే అనేక పాటల్లో గమనించదగిన విషయం ఏమిటి? (బి) కూటాలకు ముందుగా చేరుకుని, చివరి వరకూ ఉండడానికి ఒక కారణమేమిటి?

7 సంఘ కూటాల్లోను, అసెంబ్లీల్లోను, సమావేశాల్లోను మనం గళమెత్తి యెహోవాకు స్తుతికీర్తనలను పాడుతాం. ఈ పాటల్లో అనేకము కీర్తనల గ్రంథంలోని దైవప్రేరేపిత తలంపులపై ఆధారపడినవేనన్నది గమనించదగిన విషయం. యెహోవాను హృదయపూర్వకంగా స్తుతించే ఆధునిక-దిన పాటల పుస్తకం మనకున్నందువల్ల మనమెంత ధన్యులము! మనం కూటాలకు ముందుగా చేరుకుని, చివరివరకూ ఉండడానికి ఒక బలమైన కారణం, దేవునికి స్తుతులను పాడవచ్చన్నదే. అలా చేయడం ద్వారా, పాటలతోను ప్రార్థనతోను యెహోవాను స్తుతించడంలో తోటి విశ్వాసులతోపాటు భాగం వహించవచ్చు.

“యెహోవాను స్తుతించుడి!”

8. “హల్లెలూయా” అనే మాటలో ఏ భావం ఇమిడి ఉంది, తరచూ అదెలా అనువదించబడింది?

8 హీబ్రూ లిప్యంతరీకరణయైన “హల్లెలూయా” అనే మాటలో యెహోవాను స్తుతించడం అన్న భావం ఇమిడి ఉంది. ఈ మాట తరచూ, “యెహోవాను స్తుతించుడి” అని అనువదించబడింది. ఉదాహరణకు, కీర్తన 135:1-3 లో, “యెహోవాను స్తుతించుడి! యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము” అన్న ఆప్యాయతతోకూడిన బలమైన ఆహ్వానం మనకు లభిస్తుంది.

9. యెహోవాను స్తుతించేందుకు మనలను ఏది పురికొల్పుతుంది?

9 సృష్టిలో దేవుడు చేసిన అద్భుతమైన పనులను గురించి, మనకోసం ఆయన చేసిన గొప్ప కార్యాలన్నింటి గురించి ఆలోచించినప్పుడు, మనకు కలిగే హృదయపూర్వకమైన మెప్పుదల మనమాయనను స్తుతించేలా కదిలిస్తుంది. తన ప్రజల కోసం యెహోవా గత కాలాల్లో చేసిన అద్భుతమైన కార్యాలను గురించి ఆలోచించినప్పుడు, ఆయనను స్తుతించేందుకు మన హృదయాలు మనలను కదిలిస్తాయి. యెహోవా ఇంకా చేయబోయే గొప్ప విషయాలను గూర్చిన వాగ్దానాలను మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆయనను స్తుతించడానికి ఆయనకు కృతజ్ఞతను తెలపడానికి మార్గాల కోసం వెదుకుతాం.

10, 11. మనం దేవుణ్ణి స్తుతించేందుకు మన ఉనికే ఎలా మంచి కారణాన్నిస్తుంది?

10 యెహోవాను స్తుతించేందుకు మన ఉనికే మంచి కారణాన్నిస్తుంది. “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను” అని దావీదు పాడాడు. (కీర్తన 139:​14) అవును, మనము ‘ఆశ్చర్యము గొలిపే విధంగా కలుగజేయబడ్డాము,’ చూపు, వినికిడి, ఆలోచించే సామర్థ్యం అనే ప్రశస్తమైన బహుమానాలు మనకు ఇవ్వబడ్డాయి. కనుక, మన జీవన విధానం మనలను కలుగజేసినవాడు స్తుతించబడే విధంగా ఉండవద్దా? పౌలు కూడా ఇదే విధమైన తలంపుతో, “మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి” అని వ్రాశాడు.​—⁠1 కొరింథీయులు 10:⁠31.

11 మనం యెహోవాను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే, ఆయనను మహిమపరచే విధంగానే అన్ని కార్యాలనూ చేస్తాము. “నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునది” ప్రధానమైన ఆజ్ఞ అని యేసు అన్నాడు. (మార్కు 12:30; ద్వితీయోపదేశకాండము 6:⁠5) యెహోవా, మనలను కలుగజేసినవాడు, “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” ఇచ్చేవాడు కనుక, మనం ఆయనను నిశ్చయంగా ప్రేమించాలి, స్తుతించాలి. (యాకోబు 1:17; యెషయా 51:13; అపొస్తలుల కార్యములు 17:​28) ఎంత కాదన్నా, మనకున్న తర్కించే సామర్థ్యాలూ, ఆధ్యాత్మికత కలిగివుండే సామర్థ్యమూ, శారీరక బలమూ, మన సమస్త ప్రత్యేకతలూ, ఇతర సామర్థ్యాలూ యెహోవా నుండి వచ్చినవే. మన సృష్టికర్తగా, మన ప్రేమకూ స్తుతులకూ ఆయన అర్హుడు.

12. యెహోవా చేసిన గొప్పకార్యాలను గురించి, కీర్తన 40:5 లోని మాటలను గురించి మీరు ఎలా భావిస్తారు?

12 యెహోవా చేసిన గొప్ప కార్యాలు మనం ఆయనను ప్రేమించేందుకూ స్తుతించేందుకూ అసంఖ్యాకమైన కారణాలను ఇస్తాయి! “యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి, నీకు సాటియైనవాడొకడును లేడు” అని దావీదు పాడాడు. (కీర్తన 40:⁠5) దావీదు యెహోవా చేసిన అద్భుత కార్యాలన్నింటినీ వివరించి చెప్పలేకపోయాడు, మనం కూడా అంతే. అందుకని, ఆయన చేసిన గొప్ప కార్యాలు మన దృష్టికి తేబడిన ప్రతిసారీ మనం ఆయనను స్తుతించుదాం.

దేవుని నిత్యసంకల్పంతో ముడిపడివున్న కార్యాలు

13. మన నిరీక్షణ దేవుని గొప్ప కార్యాలతో ఎలా ముడిపడి ఉంది?

13 భవిష్యత్తు గురించి మన నిరీక్షణ, దేవుని నిత్య సంకల్పానికి సంబంధించిన స్తోత్రార్హమైన గొప్ప కార్యాలతో ముడిపడివుంది. ఏదెనులో తిరుగుబాటు జరిగిన తర్వాత, యెహోవా నిరీక్షణతో కూడిన మొదటి ప్రవచనాన్ని ప్రవచించాడు. దేవుడు సర్పానికి శిక్షను విధిస్తూ, “నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదు[వు]” అని చెప్పాడు. (ఆదికాండము 3:​15) ఒక దుష్ట లోకాన్ని తుడిచిపెట్టేసిన భూగోళవ్యాప్త జలప్రళయం నుండి నోవహును ఆయన కుటుంబాన్ని కాపాడడం ద్వారా యెహోవా ఒక గొప్ప కార్యాన్ని చేసిన తర్వాత కూడా, నమ్మకస్థులైన మానవుల హృదయాల్లో వాగ్దానం చేయబడిన స్త్రీసంతానాన్ని గురించిన నిరీక్షణ సజీవంగా ఉంది. (2 పేతురు 2:⁠5) అబ్రాహాము, దావీదు వంటి విశ్వాసులైన మనుష్యులకు ఇవ్వబడిన ప్రవచన వాగ్దానాలు, యెహోవా ఆ సంతానం ద్వారా ఏమి సాధించబోతున్నాడన్న దాన్ని గురించి మరింత అంతర్దృష్టిని కలిగిస్తున్నాయి.​—⁠ఆదికాండము 22:15-18; 2 సమూయేలు 7:⁠12.

14. మానవాళి కోసం యెహోవా చేసిన గొప్ప కార్యాల్లో అత్యుత్కృష్టమైన ఒక ఉదాహరణ ఏమిటి?

14 యెహోవా తన ఏకైక కుమారుడ్ని, అంటే వాగ్దత్త సంతానమైన యేసుక్రీస్తును విమోచన క్రయధన బలిగా ఇచ్చినప్పుడు, ఆయన మానవాళి కోసం గొప్ప కార్యాలను చేసేవాడన్న విషయం అత్యుత్కృష్టమైన విధంగా వెల్లడిచేయబడింది. (యోహాను 3:16; అపొస్తలుల కార్యములు 2:​29-36) విమోచన క్రయధనము, దేవునితో సమాధానపడేందుకు ఆధారాన్నిచ్చింది. (మత్తయి 20:28; రోమీయులు 5:​11) సమాధానపర్చబడిన తొలి వ్యక్తుల్ని సా.శ. 33 పెంతెకొస్తునాడు స్థాపించబడిన క్రైస్తవ సంఘంలోకి యెహోవా తీసుకువచ్చాడు. వాళ్ళు పరిశుద్ధాత్మ సహాయంతో, సువార్తను సుదూరాల వరకూ ప్రకటిస్తూ, యేసు మరణ పునరుత్థానాలు విధేయతగల మానవులు దేవుని పరలోక రాజ్యం క్రింద అనంతకాల ఆశీర్వాదాలను పొందే మార్గాన్ని ఎలా తెరిచాయో చూపించారు.

15. యెహోవా మన కాలంలో ఎలా అద్భుతంగా చర్య తీసుకున్నాడు?

15 మన కాలంలో, యెహోవా దేవుడు చివరి అభిషిక్త క్రైస్తవులను సమకూర్చేందుకు అద్భుతమైన రీతిలో చర్య తీసుకున్నాడు. పరలోకంలో క్రీస్తుతోపాటు పరిపాలించనున్న 1,44,000 మందిలో శేషించినవారు ముద్రించబడడం వీలయ్యేందుకు గాను వినాశక వాయువులు పట్టివుంచబడ్డాయి. (ప్రకటన 7:​1-4; 20:⁠6) ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహా బబులోను”కు ఆధ్యాత్మిక దాసత్వంలో ఉన్న అభిషిక్త క్రైస్తవులు విడుదల పొందేలా దేవుడు చూశాడు. (ప్రకటన 17:​1-5) 1919 లో అభిషిక్త క్రైస్తవుల ఆ విడుదలా, వాళ్ళు అప్పటి నుండి అనుభవిస్తున్న దైవిక కాపుదలా, వాళ్ళు ఏమి చేసేందుకు అవకాశాన్నిచ్చాయి? వేగంగా సమీపిస్తున్న “మహాశ్రమల”లో సాతాను దుష్ట విధానాన్ని యెహోవా అంతమొందించక ముందు వారు చివరి సాక్ష్యాన్నివ్వడంలో ప్రకాశించే అవకాశాన్నిచ్చాయి.​—⁠మత్తయి 24:21; దానియేలు 12:3; ప్రకటన 7:⁠14.

16. నేటి ప్రపంచవ్యాప్త రాజ్య ప్రకటనా పని ఫలితంగా ఏమి జరుగుతోంది?

16 యెహోవా అభిషిక్త సాక్షులు అత్యంతాసక్తితో ప్రపంచవ్యాప్త రాజ్య ప్రకటనా పనికి నాయకత్వం వహించారు. ఫలితంగా, “వేరే గొఱ్ఱెలు” అయిన అనేకానేక మంది ఇప్పుడు యెహోవా ఆరాధకులు అవుతున్నారు. (యోహాను 10:​16) యెహోవాను స్తుతించడంలో మనతో కలిసే అవకాశం భూమిమీద ఉన్న సౌమ్యత గలవారికి ఇప్పటికీ ఉన్నందుకు మనం ఆనందిస్తున్నాం. ‘రండి’ అన్న ఆహ్వానానికి ప్రతిస్పందించేవారు, మహా శ్రమలనుండి తప్పించబడి, అనంతకాలం యెహోవాను స్తుతించే నిరీక్షణగలవారి కోవలో ఉంటారు.​—⁠ప్రకటన 22:⁠17.

సత్యారాధన కోసం వేలాది మంది సమకూడుతున్నారు

17. (ఎ) మన ప్రకటనా పనికి సంబంధించి యెహోవా గొప్ప కార్యాలను ఎలా చేస్తున్నాడు? (బి) జెకర్యా 8:​23 ఎలా నెరవేరుతోంది?

17 మన ప్రకటనా పని సంబంధంగా స్తోత్రార్హమైన గొప్ప పనులను యెహోవా ఇప్పుడు చేస్తున్నాడు. (మార్కు 13:​10) ఆయన, ఇటీవలి సంవత్సరాల్లో ‘కార్యానుకూలమైన గొప్ప ద్వారాలు తెరిచాడు.’ (1 కొరింథీయులు 16:​9, అధఃసూచి) కాబట్టి, గతకాలాల్లో సత్యపు శత్రువులు ఆటంకంగా ఉండిన పెద్ద పెద్ద ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడం ఇప్పుడు సాధ్యమవుతోంది. ఒకప్పుడు ఆధ్యాత్మిక అంధకారంలో ఉండిన అనేకులు, ఇప్పుడు యెహోవాను ఆరాధించడానికి రమ్మన్న ఆహ్వానానికి ప్రతిస్పందిస్తున్నారు. “సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా​—⁠ఆ దినములలో ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని​—⁠దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు” అన్న ప్రవచన మాటలను వాళ్ళు నెరవేర్చుతున్నారు. (జెకర్యా 8:​23) “పదేసిమంది” ఎవరితో మాట్లాడారో వాళ్ళు ఆధ్యాత్మిక యూదులను, అంటే ప్రస్తుత దిన అభిషిక్త క్రైస్తవుల శేషమును సూచిస్తున్నారు. పది అన్నది భూసంబంధ సంపూర్ణతకు ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక, “పదేసిమంది” అన్నమాట, “దేవుని ఇశ్రాయేలు”తో సహవసించేందుకు తీసుకురాబడిన వారినందరిని సూచిస్తుంది. వీరు వారితో కలిసి ‘ఒక్క మందగా’ అవుతారు. (ప్రకటన 7:9, 10; గలతీయులు 6:​16) నేడు అనేకులు యెహోవా ఆరాధకులుగా కలిసి పవిత్ర సేవచేయడాన్ని చూడడం ఎంత ఆనందాన్నిస్తుంది!

18, 19. ప్రకటనా పనిని యెహోవా ఆశీర్వదిస్తున్నాడన్నదానికి ఏమిటి రుజువు?

18 కొన్ని దేశాల్లో ఒకప్పుడు అబద్ధ మతం ఎంతో అధికారం చెలాయించేది కాబట్టి, అక్కడి ప్రజలు సువార్తను ఎన్నడూ అంగీకరించరని అనిపించింది. అలాంటి దేశాల్లోని వేలాది మంది, నిజానికి లక్షలాది మంది ఇప్పుడు సత్యారాధన చేస్తున్నందుకు మనం పులకించిపోతున్నాం. యెహోవాసాక్షుల క్రొత్త వార్షిక పుస్తకమును తెరిచి, ప్రచారకుల సంఖ్య 1,00,000 మొదలుకొని 10,00,000 వరకు ఉన్న దేశాలను చూడండి. రాజ్య ప్రకటనా పనికి యెహోవా ఆశీర్వాదముందనేదానికి ఇది శక్తివంతమైన రుజువు.​—⁠సామెతలు 10:⁠22.

19 మన తండ్రియైన యెహోవా మన జీవితానికి నిజమైన సంకల్పాన్నీ, ఆయన సేవలో ఫలదాయకమైన పనినీ, భవిష్యత్తును గురించిన ఉజ్జ్వలమైన దృక్పథాన్నీ మనకిచ్చినందుకు, ఆయన ప్రజలముగా మనం ఆయనను స్తుతిస్తాము, ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాము. మనం దైవిక వాగ్దానాలన్నింటి నెరవేర్పు కోసం ఎంతో ఆతురతతో ఎదురుచూస్తూ జీవిస్తాము, ‘నిత్యజీవార్థమై . . . దేవుని ప్రేమలో నిలిచి’ ఉండాలన్న కృత నిశ్చయంతో ఉంటాము. (యూదా 20, 21) ఇప్పుడు దేవుడ్ని స్తుతిస్తున్న గొప్ప సమూహము దాదాపు 60,00,000 కావడాన్ని చూడడం మనకు ఎంత ఆహ్లాదాన్నిస్తుంది! అభిషిక్త శేషము, వేరే గొఱ్ఱెలు అనే తమ సహచరులతో కలిసి 235 దేశాల్లో దాదాపు 91,000 సంఘాలుగా వ్యవస్థీకరించబడి ఉండగా, యెహోవా ఆశీర్వాదం స్పష్టంగా వెల్లడవుతోంది. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[డు]” అలుపెరుగక చేసే ప్రయత్నాల ద్వారా మనమందరమూ ఆధ్యాత్మికంగా చక్కగా పోషించబడుతున్నాం. (మత్తయి 24:​45) ప్రగతిపథంలో ఉన్న దైవపరిపాలనా సంస్థ, యెహోవాసాక్షుల 110 బ్రాంచి కార్యాలయాల ద్వారా ప్రేమపూర్వక పైవిచారణ చేస్తూ రాజ్య పనిని నిర్వహిస్తోంది. ‘తమ ఆస్తిలో భాగమును ఇచ్చి తనను ఘనపరచేలా’ తన ప్రజల హృదయాలను యెహోవా కదిలించినందుకు మనం కృతజ్ఞులము. (సామెతలు 3:​9, 10) ఆ విధంగా, మన ప్రపంచవ్యాప్త ప్రకటనా పని కొనసాగుతోంది, దానితో పాటు అవసరాన్ని బట్టి ముద్రణా సదుపాయాలు, బేతేలు గృహాలు, మిషనరీ హోమ్‌లు, రాజ్య మందిరాలు, అసెంబ్లీ హాళ్ళు నిర్మించబడుతున్నాయి.

20. యెహోవా దేవుని స్తోత్రార్హమైన గొప్ప కార్యాలను ధ్యానించినప్పుడు, అది మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపాలి?

20 మన పరలోక తండ్రి చేసిన స్తోత్రార్హమైన గొప్ప పనులన్నింటినీ పేర్కొనడం మనకు సాధ్యం కాదు. నిజాయితీగల హృదయమున్న ఎవరైనా యెహోవాను స్తుతించేవారి సమూహంతో కలవకుండా ఉండగలరా? ఉండలేరు! కనుక, దేవుణ్ణి ప్రేమించేవారందరూ ఆనందంగా బిగ్గరగా ఇలా పాడుదురుగాక: “యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి ఆయన దూత[లు] . . . యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.” (కీర్తన 148:1, 2, 12, 13) అవును, యెహోవా చేసే గొప్ప కార్యాలను బట్టి, ఇప్పుడూ ఎల్లప్పుడూ ఆయనను స్తుతించుదాం!

మీరెలా జవాబిస్తారు?

యెహోవా చేసిన స్తోత్రార్హమైన కొన్ని కార్యాలు ఏవి?

మీరు యెహోవాను స్తుతించాలని ఎందుకు పురికొల్పబడతారు?

దేవుని గొప్ప కార్యాలతో మన నిరీక్షణ ఎలా ముడిపడివుంది?

రాజ్య ప్రకటనా పనికి సంబంధించి యెహోవా స్తోత్రార్హమైన పనులను ఎలా చేస్తున్నాడు?

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని చిత్రం]

యెహోవాకు స్తుతికీర్తనలు పాడడంలో మీరు హృదయపూర్వకంగా పాల్గొంటారా?

[13వ పేజీలోని చిత్రాలు]

యెహోవాను స్తుతించడంలో పాల్గొనే అవకాశం సౌమ్యతగలవారికి ఇప్పటికీ ఉన్నందుకు మనం ఆనందిస్తున్నాం