కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వివాహ జతను ఎంపిక చేసుకోవడంలో దైవిక మార్గనిర్దేశం

వివాహ జతను ఎంపిక చేసుకోవడంలో దైవిక మార్గనిర్దేశం

వివాహ జతను ఎంపిక చేసుకోవడంలో దైవిక మార్గనిర్దేశం

“నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించె[]ను. నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.”​—⁠కీర్తన 32:⁠8.

1. మంచి వివాహ బంధానికి ఏ విషయాలు ప్రాముఖ్యం?

సర్కస్‌ చేసే ఒక వ్యక్తి, తాను పట్టుకుని వ్రేలాడుతున్న తాడును వదిలేసి గాలిలో అతి నైపుణ్యంగా పల్టీలు కొట్టి, అతి వేగంతో నిటారుగా అయ్యి చేతులను ముందుకు చాపుతాడు, అప్పుడు ఎదురుగా మరొక తాడుకి తలక్రిందులుగా వ్రేలాడుతున్న మరొకరు ఆయనను పట్టుకుంటారు. ఒక ఐస్‌-స్కేటింగ్‌ జంట రింక్‌లో కలిసి ముందుకు వెళ్తుంది. అకస్మాత్తుగా ఆ జంటలోని ఒక వ్యక్తి తన భాగస్వామిని పైకెత్తి గాలిలోకి విసురుతాడు. ఆమె గాలిలో గిరాగిరా తిరిగి రింక్‌ మీదకి ఒక్క కాలి మీద ఆకర్షణీయంగా దిగి ఆయనతోపాటు మళ్ళీ తిరుగుతుంది. ఈ రెండు ప్రదర్శనలు సునాయాసంగా చేస్తున్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ ప్రాక్టీస్‌ చెయ్యకుండా, సామర్థ్యంగల భాగస్వామి లేకుండా, సరైన మార్గనిర్దేశం గానీ ఉపదేశం గానీ లేకుండా ఎవరూ ఈ ప్రదర్శనలను చేయడానికి ప్రయత్నించరు. అలాగే, మంచి వివాహ బంధం అన్నది యాదృచ్ఛికం అనిపించవచ్చు. అయితే, అది కూడా మంచి భాగస్వామి మీద, సామరస్యముతో కృషి చేయడం మీద, ముఖ్యంగా జ్ఞానయుక్తమైన ఉపదేశం మీద ఆధారపడి ఉంటుంది. నిజంగానే, సరైన మార్గనిర్దేశం ప్రాముఖ్యమైనది.

2. (ఎ) వివాహ ఏర్పాటును ఎవరు ఏ సంకల్పంతో స్థాపించారు? (బి) కొన్ని వివాహ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి?

2 అవివాహితుడైన ఒక యువకుడు లేదా యువతి కాబోయే వివాహ జతను గురించి, తన జీవిత భాగస్వామిని గురించి ఆలోచించడం సహజమే. యెహోవా దేవుడు వివాహ ఏర్పాటును స్థాపించినది మొదలుకొని స్త్రీపురుషులు వివాహం చేసుకుని కలిసి జీవించడం సహజ జీవన శైలిగా ఉంది. కానీ మొదటి మానవుడైన ఆదాము తనంతట తాను భార్యను ఎన్నుకోలేదు. యెహోవాయే ప్రేమపూర్వకంగా ఆమెను ఆయనకిచ్చాడు. (ఆదికాండము 2:​18-24) ఆ మొదటి దంపతులు పిల్లలను కని, విస్తరించి చివరికి భూమి మానవులతో నిండాలని ఆయన సంకల్పించాడు. ఆ మొదటి వివాహం తర్వాత, సాధారణంగా వధూవరుల తల్లిదండ్రులే వివాహ ఏర్పాట్లను చేయడం జరిగింది. ఒక్కోసారి వివాహం చేసుకోబోయేవారి అంగీకారాన్ని తీసుకున్న తర్వాత అలా చేసేవారు. (ఆదికాండము 21:⁠21; 24:2-4, 58; 38:​6; యెహోషువ 15:​16, 17) ఇప్పటికీ, కొన్ని దేశాల్లోను సంస్కృతుల్లోను సాధారణంగా పెద్దలే పెళ్ళిళ్ళు కుదుర్చుతారు. అయినా, నేడు అనేకులు తమ వివాహ జతను సొంతంగా ఎంపిక చేసుకుంటున్నారు.

3. వివాహ జతను ఎలా ఎంపిక చేసుకోవాలి?

3 వివాహ జతను ఎలా ఎంపిక చేసుకోవాలి? కొందరు తమ కంటికి అందంగా ఆకర్షణీయంగా కనిపించే పైరూపాలకు ప్రభావితులవుతారు. ఇతరులు వస్తుపర ప్రయోజనాల కోసం, తమను మంచిగా చూసుకునే వ్యక్తి కోసం, తమ అవసరాలనూ కోరికలనూ తీర్చేవారి కోసం చూస్తారు. అయితే, ఈ రెండింటిలో ఏదైనా సంతోషకరమైన సంతృప్తికరమైన సంబంధానికి దారితీయగలదా? “అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము” అని సామెతలు 31:⁠30 చెబుతోంది. “యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును” అని కూడా అదే వచనం చెబుతోంది. వివాహ జతను ఎంపికచేసుకునేటప్పుడు యెహోవాను పరిగణనలోకి తీసుకోవడమే చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం.

దేవుడిచ్చే ప్రేమపూర్వక మార్గనిర్దేశం

4. వివాహ జతను ఎంపికచేసుకునే విషయంలో యెహోవా ఏ సహాయాన్ని ఇస్తున్నాడు?

4 మన ప్రేమగల పరలోక తండ్రియైన యెహోవా అన్ని విషయాల్లోను మనకు మార్గనిర్దేశమిచ్చేందుకు తన లిఖిత వాక్యాన్ని ఇచ్చాడు. “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును” అని ఆయన అంటున్నాడు. (యెషయా 48:​17) కనుక, వివాహ జతను ఎంపికచేసుకునే విషయంలో కాలపరీక్షను తట్టుకుని నిలబడగలిగిన మార్గనిర్దేశాలను బైబిలులో కనుగొనడం మనలను ఆశ్చర్యపరచదు. మన వివాహాలు సంతోషంగా కలకాలం నిలవాలని యెహోవా కోరుకుంటున్నాడు. అందుకనే, మనం ఆ మార్గనిర్దేశాలను అర్థం చేసుకుని ఆచరించేందుకు కావలసిన సహాయాన్ని కూడా ఆయన మనకిచ్చాడు. ప్రేమగల మన సృష్టికర్త నుండి మనం ఎదురుచూసేది అదే కదా?​—⁠కీర్తన 19:⁠8.

5. వైవాహిక జీవితం కలకాలం సంతోషకరంగా ఉండడానికి ప్రాముఖ్యమైనదేమిటి?

5 యెహోవా వివాహ ఏర్పాటును స్థాపించినప్పుడు, అది ఒకరికొకరు కట్టుబడి ఉండే అనుబంధమై ఉండాలనే ఉద్దేశించాడు. (మార్కు 10:6-12; 1 కొరింథీయులు 7:​10, 11) అందుకే ‘భార్యను పరిత్యజించడం ఆయనకు అసహ్యమైన క్రియ.’ విడాకులు తీసుకోవడానికి “వ్యభిచారము” తప్ప మరే కారణాన్నీ ఆయన అనుమతించలేదు. (మలాకీ 2:13-16; మత్తయి 19:⁠9) కనుక వివాహ జతను ఎంపిక చేసుకోవడమనేది, మనం తీసుకునే అత్యంత గంభీరమైన నిర్ణయాల్లో ఒకటి, దాన్ని తేలికగా దృష్టించకూడదు. సంతోషానికి గానీ విచారానికి గానీ దీనంత ప్రభావం చూపగల నిర్ణయాలు ఎక్కువ లేవు. మంచి ఎంపిక ఒకరి జీవితాన్ని మరింత సుసంపన్నం చేస్తుంది, మరింత సంతృప్తికరమైనదిగా చేస్తుంది. అయితే అవివేకంతో చేసుకున్న ఎంపిక అంతులేని విషాదానికి దారితీస్తుంది. (సామెతలు 21:​19; 26:​21) సంతోషం నిలిచివుండాలంటే, జ్ఞానయుక్తమైన ఎంపిక చేసుకోవడమూ, కలకాలం కట్టుబడి ఉండడానికి ఇష్టపడడమూ చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు వివాహాన్ని, సామరస్యము సహకారము అనే వాటిపై వర్థిల్లే భాగస్వామ్యంగా ఉండేలా స్థాపించాడు.​—⁠మత్తయి 19:6.

6. యువతీ యువకులు ప్రాముఖ్యంగా వివాహ జతను ఎంపిక చేసుకునేటప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, అత్యంత జ్ఞానయుక్తమైన నిర్ణయాన్ని వాళ్ళెలా తీసుకోగలరు?

6 యువతీ యువకులు ప్రాముఖ్యంగా వివాహ జతను ఎంపిక చేసుకునేటప్పుడు శారీరక ఆకర్షణ, తమలో కలిగే బలమైన కోరికలు వంటివి తమ వివేచనను తప్పుదోవపట్టించకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. కేవలం అలాంటి విషయాలే పునాదిగా ఉన్న బంధం చాలా త్వరగా ఏవగింపుకు, చివరికి ద్వేషానికి కూడా గురికాగలదు. (2 సమూయేలు 13:​15) మరొకవైపు, ఒక వ్యక్తి తన జతను బాగా తెలుసుకుంటూ తనను తాను మరెక్కువగా అర్థం చేసుకుంటూ ఉండడం ద్వారా కలకాలం నిలిచే ప్రేమను పెంపొందించుకోవడం సాధ్యమౌతుంది. మన హృదయం మొదట్లో వాంఛించేది మనకు మేలైనది కాకపోవచ్చని కూడా మనం గుర్తించాల్సిన అవసరముంది. (యిర్మీయా 17:⁠9) అందుకే మనకు బైబిలులో కనిపించే దైవిక మార్గనిర్దేశం అంత ప్రాముఖ్యం. మన జీవితంలో అత్యంత జ్ఞానయుక్తమైన నిర్ణయాలను మనమెలా తీసుకోవచ్చో వివేచించేందుకు అది మనకు సహాయం చేస్తుంది. దావీదు యెహోవాకు ప్రాతినిధ్యం వహిస్తూ, “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించె[ద]ను, నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” అని అన్నాడు. (కీర్తన 32:8; హెబ్రీయులు 4:​12) ప్రేమా, సహచర్యమూ కావాలన్న సహజమైన కోరికను వివాహం తీర్చగలదు, అయితే, అది సవాళ్ళను కూడా తీసుకువస్తుంది. వాటిని అధిగమించేందుకు పరిణతి, వివేచన అవసరం.

7. వివాహ జతను ఎంపిక చేసుకునే విషయంలో బైబిలు ఆధారిత ఉపదేశాన్ని కొందరెందుకు నిర్లక్ష్యం చేస్తారు, అలా నిర్లక్ష్యం చేయడం వల్ల పర్యవసానాలు ఎలా ఉండవచ్చు?

7 వివాహ జతను ఎంపిక చేసుకునే విషయంలో వివాహ ఆరంభకుడు చెబుతున్నదాన్ని అనుసరించడం జ్ఞానయుక్తమైన పని. అయితే, తల్లిదండ్రులు లేదా క్రైస్తవ పెద్దలు బైబిలు ఆధారిత ఉపదేశమిచ్చినప్పుడు మనం తిరస్కరిస్తుండవచ్చు. వాళ్ళు మనలను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదని మనం భావిస్తుండవచ్చు, హృదయం దేని వైపు మొగ్గుచూపితే దాన్ని అనుసరించేలా భావోద్వేగపరమైన బలమైన కోరికలు మనలను బలవంతపెడుతుండవచ్చు. కానీ, తర్వాత వాస్తవ పరిస్థితులను ఎదుర్కున్నప్పుడు, మన మంచి కోసం ఇవ్వబడిన జ్ఞానయుక్తమైన ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేసినందుకు పశ్చాత్తాపపడవలసి రావచ్చు. (సామెతలు 23:​19; 28:​26) వైవాహిక జీవితంలో ప్రేమలేకపోవడం, పిల్లల ఆలనా పాలనా చూడడంలో ఇబ్బందులు రావడం, బహుశా అవిశ్వాసియైన వివాహ జతతో జీవించాల్సి రావడం వంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మనకు ఎంతో సంతోషాన్నివ్వగల్గే వివాహ ఏర్పాటు ఒకవేళ ఎంతో దుఃఖాన్ని కల్గించేదిగా మారినట్లైతే అదెంత విచారకరంగా ఉంటుంది!

దైవభక్తి ఒక కీలకాంశం

8. వివాహ బంధం కలకాలం నిలిచేందుకు సంతోషాన్నిచ్చేందుకు దైవ భక్తి ఎలా సహాయపడుతుంది?

8 పరస్పర ఆకర్షణ వివాహ బంధాన్ని దృఢపర్చుకోవడానికి దోహదం చేస్తుందని ఒప్పుకోవలసిందే. అయితే వివాహ బంధం కలకాలం నిలవాలంటే సంతోషాన్ని తీసుకురావాలంటే ఇద్దరూ విలువిచ్చే విషయాలు ఒకటే అయ్యుండడం ఇంకా ప్రాముఖ్యం. మరే విషయం కన్నా, యెహోవా దేవుని మీద ఇద్దరికీ ఉండే భక్తే, వివాహ బంధాన్ని కలకాలం నిలిచే అనుబంధంగా చేస్తుంది, ఇద్దరి మధ్య ఐకమత్యాన్ని పెంపొందిస్తుంది. (ప్రసంగి 4:​12) క్రైస్తవ దంపతులు తమ జీవితాల్లో యెహోవా సత్యారాధనకు ముఖ్య స్థానం ఇచ్చినప్పుడు, వాళ్ళు ఆధ్యాత్మికంగా, మానసికంగా, నైతికంగా ఐక్యంగా ఉంటారు. వాళ్ళు దేవుని వాక్యాన్ని కలిసి అధ్యయనం చేస్తారు. కలిసి ప్రార్థన చేస్తారు, ఇది వారి హృదయాలను ఐక్యపరుస్తుంది. క్రైస్తవ కూటాలకు వెళ్ళడానికి ఒకరికొకరు తోడుగా ఉంటారు, క్షేత్ర పరిచర్యలో కలిసి పనిచేస్తారు. ఇవన్నీ వారిరువురి మధ్య ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడడానికి దోహదపడతాయి, అది వాళ్ళను సన్నిహితులను చేస్తుంది. అంత కన్నా ముఖ్యంగా, అది యెహోవా ఆశీర్వాదాలను పొందేలా చేస్తుంది.

9. ఇస్సాకుకు భార్యను వెదకడానికి అబ్రాహాము ఏమి చేశాడు, దాని ఫలితమేమిటి?

9 విశ్వాసంగా ఉన్న మూలపురుషుడైన అబ్రాహాముకు దైవ భక్తి ఉన్నందువల్లే, తన కుమారుడు ఇస్సాకుకు భార్యను ఎంపిక చేసే సమయం వచ్చినప్పుడు, దేవుణ్ణి ప్రీతిపరచేందుకు ప్రయత్నించాడు. ఆయన నమ్మకస్థుడైన తన సేవకునితో “నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెద[ను]. . . . యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును; అక్కడనుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొనివచ్చెదవు” అని అన్నాడు. రిబ్కా తాను మంచి భార్యనని నిరూపించుకుంది, ఇస్సాకు ఆమెను గాఢంగా ప్రేమించాడు.​—⁠ఆదికాండము 24:3, 4, 7, 14-21, 67.

10. లేఖనాధారంగా భార్యాభర్తలు ఏం చేయ బద్ధులై ఉన్నారు?

10 మనం అవివాహిత క్రైస్తవులమైతే, వివాహ జీవితానికి అవసరమైన లేఖనాధార యోగ్యతలను పొందడానికి సహాయపడే లక్షణాలను పెంపొందించుకునేందుకు దైవ భక్తి మనకు సహాయపడుతుంది. భార్యాభర్తలు చేయ బద్ధులైవున్నవాటిని అపొస్తలుడైన పౌలు పేర్కొన్నాడు: “స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. . . . పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. . . . పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. . . . ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను [“భర్తను గౌరవించాలి,” పరిశుద్ధ బైబల్‌].” (ఎఫెసీయులు 5:​22-33) ఇక్కడ మనం చూస్తున్నట్లుగా, దైవప్రేరేపణతో పౌలు చెప్పిన మాటలు ప్రేమా గౌరవాల అవసరాన్ని నొక్కివక్కాణిస్తున్నాయి. ఈ ఉపదేశాన్ననుసరించి నడుచుకోవడంలో యెహోవా పట్ల భక్తితో కూడిన భయం ఉండడం ఇమిడి ఉంది. అందుకు సుఖదుఃఖాల్లో ఒకరికొకరు హృదయపూర్వకంగా కట్టుబడి ఉండడం అవసరం. వివాహాన్ని గురించి ఆలోచిస్తున్న క్రైస్తవులు ఈ బాధ్యతను స్వీకరించే స్థితిలో ఉండాలి.

ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలో నిర్ణయించుకోవడం

11. (ఎ) ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలనే విషయంలో లేఖనాలిస్తున్న ఉపదేశం ఏమిటి? (బి) 1 కొరింథీయులు 7:36 లో వ్రాయబడిన బైబిలు ఉపదేశాన్ని అనుసరించడం జ్ఞానయుక్తమని ఏ ఉదాహరణ చూపిస్తుంది?

11 మనం పెళ్ళి చేసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నామన్నది తెలుసుకోవడం ప్రాముఖ్యం. అందరూ ఒకే వయస్సులో పెళ్ళికి సిద్ధంగా ఉండరు గనుక, పలాని వయస్సులో చేసుకోవాలనేమీ లేఖనాలు నిర్ణయించి చెప్పడం లేదు. అయితే, బలమైన లైంగిక ప్రేరణలు కలిగి వివేచనను తప్పుదోవ పట్టించే ‘ఈడు దాటేంత’ వరకు వేచి ఉండడం మంచిదని లేఖనాలు సూచిస్తున్నాయి. (1 కొరింథీయులు 7:​36) “నా స్నేహితులు డేటింగ్‌ చేయడమూ పెళ్ళిళ్ళు చేసుకోవడమూ నేను చూశాను, వారిలో చాలామంది టీనేజ్‌లోనివారే. అలాంటి పరిస్థితుల్లో ఈ ఉపదేశాన్ని అనుసరించడం కష్టంగా ఉన్నట్లు అప్పుడప్పుడు అనిపించింది” అని మీషెల్‌ అంటుంది. “అయితే ఈ ఉపదేశం యెహోవా ఇచ్చినదని, ఆయన ఏది చెప్పినా మన ప్రయోజనార్థమే చెప్తాడని నేను గుర్తించాను. పెళ్ళి చేసుకోవడానికి కొంత కాలం వేచివుండడం ద్వారా యెహోవాతో నాకున్న సంబంధంపై నేను నా మనస్సును కేంద్రీకరించుకోగల్గాను, కౌమారప్రాయంలో అంతగా ఉండని జీవితానుభవాన్ని కొంత సంపాదించుకోగల్గాను. కొన్ని సంవత్సరాల తర్వాత, వైవాహిక జీవితంలో ఉండే బాధ్యతలను నిర్వర్తించేందుకు, రాగల సమస్యలతో వ్యవహరించేందుకు సంసిద్ధంగా ఉన్నాను” అని ఆమె చెబుతుంది.

12. మరీ చిన్న వయస్సులోనే పెళ్ళికి తొందరపడడం ఎందుకు జ్ఞానయుక్తం కాదు?

12 చాలా చిన్న వయస్సులోనే తొందరపడి పెళ్ళిచేసుకునేవాళ్ళు, తర్వాత తాము పరిణతి చెందుతుండగా తమ అవసరాలూ కోరికలూ మారడాన్ని తరచూ గుర్తిస్తారు. మొదట్లో కావాలనిపించిన విషయాలు ఇక ఏ మాత్రం ప్రాముఖ్యమైనవిగా లేవని వాళ్ళప్పుడు గుర్తిస్తారు. ఒక క్రైస్తవ అమ్మాయి, తనకు 16 ఏళ్ళున్నప్పుడే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంది. వాళ్ళ అమ్మా, అమ్మమ్మా ఆ వయస్సులోనే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. తనిష్టపడిన అబ్బాయి ఆ సమయంలో పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించగానే, అప్పుడే చేసుకోవడానికి సిద్ధపడిన మరొక అబ్బాయిని ఆమె పెళ్ళి చేసేసుకుంది. అయితే, తాను తొందరపడి నిర్ణయం తీసుకున్నానని అటు తర్వాత జీవితంలో చాలా బాధపడింది.

13. పరిణతి చెందకముందే వివాహం చేసుకునేవాళ్ళకు తరచూ ఏమి లేకపోవచ్చు?

13 వివాహం చేసుకోవాలనుకుంటున్నప్పుడు, వివాహంలో ఇమిడి ఉండే విషయాలన్నింటి గురించీ మంచి అవగాహన కలిగివుండడం చాలా ప్రాముఖ్యం. చిన్నవయస్సులో పెళ్ళి చేసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు రాగలవు. వాళ్ళు ఆ సమస్యలతో వ్యవహరించేందుకు అంత సిద్ధపడి ఉండరు. వైవాహిక జీవితంలోను, పిల్లల పెంపకంలోను రాగల ఒత్తిళ్ళను తట్టుకోగల అనుభవంగానీ పరిణతి గానీ వారికి లేకపోవచ్చు. కలకాలం నిలిచే వివాహభాగస్వామ్యంలోకి ప్రవేశించేందుకు శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను సిద్ధంగా ఉన్నప్పుడే పెళ్ళిచేసుకోవాలి.

14. వైవాహిక జీవితంలో ఒత్తిళ్ళను కలిగించే పరిస్థితులతో వ్యవహరించేందుకు ఏమి అవసరం?

14 పెళ్ళి చేసుకునేవారికి “శరీరసంబంధమైన శ్రమలు కలుగును” అని పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 7:​28) సమస్యలు తప్పక తలెత్తుతాయి, ఎందుకంటే ఇద్దరివీ విభిన్నమైన వ్యక్తిత్వాలు, అంతేకాక దృక్కోణాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. వివాహ ఏర్పాటులో లేఖనాధారిత పాత్రను నిర్వహించడం మానవ అపరిపూర్ణత వల్ల చాలా కష్టంగా ఉండవచ్చు. (1 కొరింథీయులు 11:3; కొలొస్సయులు 3:18, 19; తీతు 2:4, 5; 1 పేతురు 3:​1, 2, 7) ఒత్తిళ్ళను కలిగించే పరిస్థితులను ప్రేమపూర్వకంగా చక్కదిద్దుకునేందుకు దైవిక మార్గనిర్దేశాన్ని పొంది, దాన్ననుసరించాలంటే, పరిణతీ, ఆధ్యాత్మిక స్థిరత్వమూ అవసరం.

15. వివాహానికి తమ పిల్లలను సిద్ధం చేయడంలో తల్లిదండ్రులు ఏ పాత్రను నిర్వహించగల్గుతారు? ఉదాహరణ ఇవ్వండి.

15 దైవిక మార్గనిర్దేశాన్ని అనుసరించవలసిన ప్రాముఖ్యతను పిల్లలు గ్రహించేలా తల్లిదండ్రులు వారికి సహాయం చేయడం ద్వారా, వారిని వివాహానికి సిద్ధం చేయగలరు. పిల్లలు, తాము గానీ తాము పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తులు గానీ వివాహబంధానికి బద్ధులై ఉండేందుకు సిద్ధంగా ఉన్నామా లేదా అని నిర్ణయించుకోవడానికి తల్లిదండ్రులు లేఖనాలను క్రైస్తవ ప్రచురణలను నైపుణ్యంగా ఉపయోగించడం ద్వారా సహాయం చేయగలరు. * పద్దెనిమిదేండ్ల బ్లాసమ్‌కు, వాళ్ళ సంఘంలో ఉన్న ఒక యువకునితో తను ప్రేమలో పడినట్లు అనిపించింది. ఆయన పూర్తికాల పయినీరు పరిచారకుడు. వాళ్ళు వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ, ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఇంకా వయస్సు తక్కువగానే ఉందని భావించి, ఒక సంవత్సరం ఆగమని ఆమెకు చెప్పారు. “ఆ జ్ఞానయుక్తమైన సలహాను విన్నందుకు నేను చాలా కృతజ్ఞురాలను. ఆ ఒక్క సంవత్సరంలో నేను కొంత పరిణతిని సాధించాను, మంచి వివాహ జతకు ఉండవలసిన మంచి లక్షణాలు ఈ అబ్బాయికి లేవని గ్రహించనారంభించాను. చివరకు, ఆయన సంస్థను వదిలిపెట్టాడు. నా జీవితంలో ఒక గొప్ప విపత్తును నేను తప్పించుకున్నాను. జ్ఞానవంతులైన తల్లిదండ్రులు ఉండటమూ, వాళ్ళ నిర్ణయంపై ఆధారపడగల్గడమూ ఎంత ఆశీర్వాదకరం!” అని బ్లాసమ్‌ తర్వాత వ్రాసింది.

“ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను”

16. (ఎ) క్రైస్తవులు “ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను” అన్న విషయంలో ఎలా పరీక్షించబడవచ్చు? (బి) అవిశ్వాసిని పెళ్ళి చేసుకునేలా శోధించబడినప్పుడు క్రైస్తవులు దేని గురించి ఆలోచించడం మంచిది?

16 క్రైస్తవులకు యెహోవా నిర్దేశం స్పష్టంగా ఉంది: “ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను.” (1 కొరింథీయులు 7:​39) క్రైస్తవ తల్లిదండ్రులూ, వాళ్ళ పిల్లలూ ఈ విషయంలో పరీక్షించబడుతుండవచ్చు. ఎలా? యౌవనస్థులు పెళ్ళి చేసుకోవాలని కోరుకోవచ్చు, కానీ భాగస్వామిని ఎంపిక చేసుకునే అవకాశం సంఘంలో అంతగా లేకపోవచ్చు. బహుశా, అలా కేవలం అనిపించడం మాత్రమేనేమో. ఒక ప్రాంతంలో, స్త్రీలకన్నా పురుషులు చాలా తక్కువగా ఉండవచ్చు, లేదా తగినవాళ్ళు లేరని అనిపించవచ్చు. యెహోవాకు సమర్పించుకోని ఎవరైనా ఒక వ్యక్తి ఒక క్రైస్తవ వ్యక్తి మీద ఆసక్తిని చూపించవచ్చు, అప్పుడు యెహోవా ఏర్పర్చిన ప్రమాణాల్ని ప్రక్కకు పెట్టి, రాజీ పడిపోవాలన్న ఒత్తిడి బలంగా కలగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో, అబ్రాహాము మాదిరిని గురించి ఆలోచించడం మంచిది. ఆయన, దేవునితో తనకున్న చక్కని సంబంధాన్ని కాపాడుకున్న ఒక విధమేమిటంటే, తన కుమారుడు ఇస్సాకు యెహోవా సత్యారాధకురాలినే పెళ్ళిచేసుకునేలా చూడడం. ఇస్సాకు తన కుమారుడు యాకోబు విషయంలో అలాగే చేశాడు. అందుకు తత్సంబంధిత వ్యక్తులందరూ కృషి చేయవలసి వచ్చింది. అయితే వాళ్ళు చేసిన కృషి దేవుణ్ణి సంతోషపరచింది, తత్ఫలితంగా వారికి ఆయన ఆశీర్వాదాలు లభించాయి కూడా.​—⁠ఆదికాండము 28:1-4.

17. అవిశ్వాసిని పెళ్ళి చేసుకోవడం ఎందుకు వినాశకరం కావచ్చు, ‘ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకోవడానికి’ అతి ముఖ్యమైన కారణమేమిటి?

17 కొన్ని సందర్భాల్లో అవిశ్వాసి చివరికి క్రైస్తవుడయ్యాడు. అయినప్పటికీ, అవిశ్వాసులను పెళ్ళి చేసుకోవడం వినాశకరమని తరచూ నిరూపించబడింది. అవిశ్వాసులను జతగా చేసుకున్నప్పుడు, ఇద్దరి నమ్మకాలు, ప్రమాణాలు, లేదా లక్ష్యాలు ఒకే విధంగా ఉండవు. (2 కొరింథీయులు 6:​14) ఈ విషయాలు ఇద్దరి మధ్య జరిగే సంభాషణపైనా, వివాహ జీవితంలోని సంతోషంపైనా హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు, ఒక క్రైస్తవ సహోదరి ఆధ్యాత్మికంగా ఎంతో బలపరచే కూటం తర్వాత, ఇంటికి వెళ్ళి అవిశ్వాసియైన తన భర్తతో తాను ఆధ్యాత్మిక విషయాలను చర్చించలేనన్న వాస్తవాన్ని బట్టి ఎంతగానో దుఃఖించింది. అయితే, అన్నింటికన్నా ముఖ్యంగా, ‘ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకోవడానికి’ యెహోవాకు నమ్మకంగా ఉండడానికీ సంబంధంవుంది. మనం దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్నప్పుడు, మన హృదయాలు మనలను ఖండించవు, ఎందుకంటే అప్పుడు మనం “ఆయన దృష్టికి ఇష్టమైనవి” చేస్తున్నవాళ్ళమవుతాం.​—⁠1 యోహాను 3:21, 22.

18. పెళ్ళి గురించి ఆలోచించేటప్పుడు, ప్రాముఖ్యమైన ఏ విషయాలకు అవధానాన్నివ్వాలి, ఎందుకని?

18 పెళ్ళి గురించి ఆలోచించేటప్పుడు, భావి జత యొక్క సద్గుణాలు, ఆధ్యాత్మికత అత్యంత ప్రధాన విషయాలై ఉండాలి. అందం ఆకర్షణల కన్నా దేవుని మీద ప్రేమా, ఆయన మీద సంపూర్ణ భక్తీ, వాటితో పాటు, క్రైస్తవ వ్యక్తిత్వమూ చాలా విలువైనవి. ఆధ్యాత్మికంగా బలమైన వివాహభాగస్వాములుగా ఉండాలన్న తమ నిబద్ధతను గుర్తించి దాన్ని నెరవేర్చేవారికి దైవిక ఆమోదం ఉంటుంది. దంపతులిద్దరికీ సృష్టికర్త మీద భక్తి ఉండి ఇద్దరూ ఆయన మార్గనిర్దేశాన్ని సంపూర్ణంగా అంగీకరించినప్పుడు వారికి అత్యధిక బలం చేకూరుతుంది. ఈ విధంగా, యెహోవా ఘనపరచబడుతాడు, కలకాలం ఐక్యంగా ఉండేందుకు సహాయపడే ఆధ్యాత్మిక పటుత్వంతో వివాహజీవితం ప్రారంభమౌతుంది.

[అధస్సూచి]

^ పేరా 15 కావలికోట ఫిబ్రవరి 15, 1999, 4-8 పేజీలు చూడండి.

మీరెలా జవాబిస్తారు?

మంచి వివాహ జతను ఎంపికచేసుకోవడంలో దైవిక మార్గనిర్దేశం ఎందుకవసరం?

వివాహ బంధాన్ని బలపరచేందుకు దైవ భక్తి ఎలా సహాయపడుతుంది?

తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెళ్ళికి ఎలా సిద్ధం చేయగలరు?

‘ప్రభువునందు మాత్రమే పెళ్ళిచేసుకోవడం’ ఎందుకంత ప్రాముఖ్యం?

[అధ్యయన ప్రశ్నలు]

[17వ పేజీలోని చిత్రాలు]

వివాహ జతను ఎంపిక చేసుకునే విషయంలో దేవుని ఉపదేశాన్ని అనుసరించడం ద్వారా ఎంతో సంతోషాన్ని పొందవచ్చు

[18వ పేజీలోని చిత్రాలు]

‘ప్రభువునందు మాత్రమే పెళ్ళిచేసుకోవడం’ వల్ల గొప్ప ఆశీర్వాదాలు లభిస్తాయి