కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆయన ఆధ్యాత్మిక అవసరాలు తీరాయి

ఆయన ఆధ్యాత్మిక అవసరాలు తీరాయి

రాజ్య ప్రచారకుల నివేదిక

ఆయన ఆధ్యాత్మిక అవసరాలు తీరాయి

సైప్రస్‌, మధ్యధరా సముద్రానికి ఈశాన్య దిక్కున ఉన్న ఒక ద్వీపం. బైబిలు కాలంలో సైప్రస్‌ (కుప్ర) రాగికీ, నాణ్యమైన కలపకూ ప్రసిద్ధిగాంచింది. పౌలు, బర్నబాలు తమ మొదటి మిషనరీ ప్రయాణంలో అక్కడ రాజ్య సువార్తను ప్రకటించారు. (అపొస్తలుల కార్యములు 13:​4-12) నేటికీ సైప్రస్‌ దేశస్థుల మీద సువార్త సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తోంది. నలభయ్యోపడిలో ఉన్న లూకాస్‌ విషయంలో ఇది నిజమైంది. ఆయనిలా అంటున్నాడు:

“ఏడుగురు పిల్లలున్న కుటుంబంలో నేను పుట్టాను, మా ఇల్లు పశువుల దొడ్ల పరిసరాల్లో ఉండేది. నా చిన్నతనంనుండే నాకు చదివే అలవాటు బాగా ఉంది. క్రైస్తవ గ్రీకు లేఖనాల పాకెట్‌ సైజ్‌ ఎడిషన్‌ నా ప్రియమైన పుస్తకంగా ఉండేది. నాకు పది సంవత్సరాల వయసున్నప్పుడు నేనూ నా స్నేహితులు కొందరు కలిసి ఒక చిన్న బైబిలు అధ్యయన గుంపుగా ఏర్పడ్డాము. కానీ, మా గ్రామంలోని కొందరు పెద్దలు మమ్మల్ని చర్చివిరోధులు అని పిలవడం మూలంగా మా గుంపు ఎక్కువ కాలం నిలవలేకపోయింది.

“తర్వాత, అమెరికాలో నేను స్కూలుకు వెళ్ళే రోజుల్లో, వివిధ మతాల నేపథ్యంనుండి వచ్చినవారిని కలిశాను. అది ఆధ్యాత్మిక విషయాలపట్ల నాలో ఉన్న కోరికను మళ్ళీ రగిలించింది. నేను యూనివర్సిటీలోని గ్రంథాలయంలో వివిధ మతాల గురించి చదువుతూ చాలా రోజులు గడిపాను. కొన్ని చర్చీలకు కూడా వెళ్ళాను, ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆధ్యాత్మికంగా నేను సంతృప్తి చెందలేకపోయాను.

“నా చదువు పూర్తయిన తర్వాత నేను సైప్రస్‌కు తిరిగి వెళ్ళాను, అక్కడ ఒక మెడికల్‌ లాబొరెటరీ డైరెక్టరుగా ఉద్యోగంలో చేరాను. ఆండోనీస్‌ అనే పేరుగల ఒక వృద్ధ యెహోవాసాక్షి నేను పనిచేసే చోట నన్ను కలుస్తుండేవాడు. ఆయన రాకపోకలు గ్రీకు ఆర్థడాక్స్‌ చర్చివాళ్ళ కంటపడకపోలేదు.

“వెంటనే ఒక దైవశాస్త్ర పండితుడు నన్ను కలవడానికి వచ్చాడు, యెహోవాసాక్షులతో మాట్లాడకూడదని నన్ను నిరుత్సాహపరిచాడు. గ్రీకు ఆర్థడాక్స్‌ చర్చిలోనే సత్యం ఉందని చిన్నప్పటినుండి నాకు బోధించబడింది కాబట్టి, సరేనని ఒప్పుకొని ఆండోనీస్‌తో మాట్లాడడం మానేసి, ఆ పండితునితో బైబిలు గురించి చర్చించడం మొదలెట్టాను. సైప్రస్‌లోని అనేక క్రైస్తవ సన్యాసుల మఠాలను కూడా సందర్శించాను. ఆర్థడాక్స్‌ క్రైస్తవులు ఉత్తర గ్రీసులో ఉన్న ఏథోస్‌ పర్వతాన్ని అతి పరిశుద్ధ పర్వతంగా ఎంచుతారు, నేను దాన్ని సందర్శించడానికి కూడా వెళ్ళాను. అయినప్పటికీ నా బైబిలు ప్రశ్నలకు జవాబులు దొరకలేదు.

“నేను సత్యాన్ని కనుగొనేలా నాకు సహాయం చేయమని అప్పుడు నేను దేవుడ్ని ప్రార్థించాను. ఆ తర్వాత కొద్దికాలానికే, ఆండోనీస్‌ నన్ను కలవడానికి నేను పనిచేసే చోటుకు మళ్లీ వచ్చాడు, అది నా ప్రార్థనకు జవాబనే నేను భావించాను. అందుకే నేను ఆ పండితుడ్ని కలవడం మానేసి, ఆండోనీస్‌తో బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించాను. అలా నేను ముందుకు సాగి చివరికి 1997 అక్టోబరులో, యెహోవాకు నా సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా తెలిపాను.

“నా భార్యా, 14, 10 యేండ్ల నా పెద్ద కూతుళ్ళిద్దరూ మొదట్లో వ్యతిరేకించారు. కానీ నా మంచి ప్రవర్తన కారణంగా, రాజ్య మందిరంలో ఒక కూటానికి హాజరుకావడానికి నా భార్య నిర్ణయించుకుంది. అక్కడ యెహోవాసాక్షుల స్నేహశీలత, వ్యక్తిగతంగా వారు చూపిన శ్రద్ధ ఆమెను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వారు బైబిలును ఉపయోగించడం ఆమెను ఆకట్టుకుంది. దాని ఫలితంగా ఆమే, నా పెద్ద కూతుళ్ళిద్దరూ యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడానికి అంగీకరించారు. 1999 లో జరిగిన “దేవుని ప్రవచన వాక్యం” జిల్లా సమావేశంలో వాళ్ళు ముగ్గురు బాప్తిస్మం తీసుకున్నప్పుడు నేను ఎంత ఆనందించానో ఊహించండి!

“అవును, నా సత్యాన్వేషణకు తనివితీరింది. ఇప్పుడు, మా మొత్తం కుటుంబం, అంటే నా భార్యా నలుగురు పిల్లల సమేతం, యెహోవా స్వచ్ఛమైన ఆరాధనలో ఐక్యంగా ఉన్నాం.”