కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?”

“దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?”

“దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?”

“ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?”​—⁠రోమీయులు 8:⁠31.

1. ఇశ్రాయేలీయులతోపాటు వేరెవరు ఐగుప్తు నుండి వెళ్ళిపోయారు, వాళ్ళలా ఐగుప్తును వదిలి వెళ్ళడానికి కారణమేమిటి?

ఇశ్రాయేలీయులు 215 సంవత్సరాలు ఐగుప్తులో నివసించారు. ఎక్కువ కాలం వాళ్ళు దాసత్వంలోనే గడిపారు. ఆ తర్వాత, వాళ్ళు స్వతంత్రంగా జీవించడానికి అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా, ‘అనేకులైన అన్యజనుల సమూహము కూడా వారితో బయలుదేరింది.’ (నిర్గమకాండము 12:​38) ఇశ్రాయేలీయులు కాని వీరు ఐగుప్తును నాశనం చేసిన భయానకమైన పది తెగుళ్ళకు గురయ్యారు. ఆ తెగుళ్ళు అబద్ధ దేవుళ్ళను అవహేళన చేశాయి. అదే సమయంలో, తన ప్రజలను కాపాడుకోగల యెహోవా శక్తిని, ముఖ్యంగా నాలుగవ తెగులు నుండి వాళ్ళు చూడగల్గారు. (నిర్గమకాండము 8:​23, 24) యెహోవా సంకల్పాల గురించి వాళ్ళకు ఎక్కువ తెలియకపోయినా, వాళ్ళకు ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది, అదేంటంటే: ఐగుప్తు దేవుళ్ళు ఐగుప్తీయులను కాపాడడంలో విఫలమయ్యారు, అదే సమయంలో యెహోవా ఇశ్రాయేలీయులకు అండగా ఉన్నానని నిరూపించుకున్నాడు.

2. రాహాబు వేగులవారికి ఎందుకు మద్దతు ఇచ్చింది, వాళ్ళ దేవుని మీద ఆమె నమ్మకముంచడం ఎందుకు సరైనది?

2 నలభై సంవత్సరాల తర్వాత, ఇశ్రాయేలీయులు వాగ్దత్త దేశంలో ప్రవేశించడానికి ముందు, మోషే తరువాత ఆయన స్థానంలోకి వచ్చిన యెహోషువ ఆ దేశాన్ని వేగుచూసేందుకు ఇద్దరు మనుష్యులను పంపాడు. వాళ్ళు అక్కడ యెరికో నివాసియైన రాహాబును కలుసుకున్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తును వదిలిపెట్టాక ఆ 40 సంవత్సరాలూ వాళ్ళను కాపాడేందుకు యెహోవా చేసిన శక్తివంతమైన కార్యాలను గురించి తాను విన్నదాన్ని బట్టి, తనకు దేవుని ఆశీర్వాదం కావాలంటే, తాను ఆయన ప్రజలకు మద్దతు ఇవ్వాలని ఆమె గ్రహించింది. ఆమె జ్ఞానయుక్తంగా తీసుకున్న ఆ నిర్ణయం వల్ల, ఇశ్రాయేలీయులు ఆ నగరాన్ని పట్టుకుని నాశనం చేసినప్పుడు ఆమె, ఆమె ఇంటివారు తప్పించుకున్నారు. వాళ్ళు ఆ విధంగా అద్భుతంగా రక్షించబడడం, దేవుడు వారితో ఉన్నాడన్న దానికి ఖచ్చితమైన రుజువునిచ్చింది. అలా, రాహాబు ఇశ్రాయేలీయుల దేవుని మీద నమ్మకముంచడం సరైనదే.​—⁠యెహోషువ 2:​1, 9-13; 6:​15-17, 25.

3. (ఎ) పునర్నిర్మించబడిన యెరికో పట్టణం దగ్గర యేసు ఏ అద్భుతాన్ని చేశాడు, దానికి యూదా మత నాయకులు ఎలా ప్రతిస్పందించారు? (బి) కొందరు యూదులూ, ఆ తర్వాత కొందరు యూదేతరులూ ఏమి గ్రహించారు?

3 పదిహేను శతాబ్దాల తర్వాత, పునర్నిర్మించబడిన యెరికో పట్టణం దగ్గర ఒక గ్రుడ్డి భిక్షకుడ్ని యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. (మార్కు 10:​46-52; లూకా 18:​35-43) తనపై కరుణ చూపమని ఆ భిక్షకుడు యేసును కోరాడు, అలా కోరడం ద్వారా, యేసుకు దేవుని మద్దతుందన్న విషయాన్ని తాను గుర్తిస్తున్నానని సూచించాడు. అయితే, యేసు చేసిన అద్భుతాలు ఆయన దేవుని పనిని చేస్తున్నాడన్న దానికి రుజువుగా ఉన్నాయని యూదా మత నాయకులూ వాళ్ళ అనుచరులూ సాధారణంగా అంగీకరించేవారు కాదు. అలా అంగీకరించే బదులు, ఆయనను విమర్శించేవారు. (మార్కు 2:​15, 16; 3:​1-6; లూకా 7:​31-35) తాము ఆయనను చంపిన తర్వాత ఆయన పునరుత్థానం చేయబడ్డాడన్న వాస్తవాన్ని ఎదుర్కోవలసిన వచ్చినప్పుడు కూడా, అది దేవుడు చేసిన కార్యమని ఒప్పుకోవడానికి వాళ్ళు అంగీకరించలేదు. బదులుగా, వాళ్లు యేసు అనుచరులను పీడించడంలో నాయకత్వం వహిస్తూ, ‘ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించే’ వారి పనికి ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించారు. కానీ కొందరు యూదులూ, అటుతర్వాత అనేకమంది యూదేతరులూ, ఈ సంఘటనలను జాగ్రత్తగా పరిశీలించి, సరైన నిర్ధారణకు వచ్చారు. దేవుడు స్వనీతిమంతులైన యూదా మత నాయకులను తిరస్కరించి, వినమ్రులైన యేసుక్రీస్తు అనుచరులకు మద్దతునిస్తున్నాడని వాళ్ళకు స్పష్టమైంది.​—⁠అపొస్తలుల కార్యములు 11:​19-21.

నేడు దేవుని మద్దతు ఎవరికుంది?

4, 5. (ఎ) ఒక మతాన్ని ఎన్నుకోవడం గురించి కొందరు ప్రజలు ఎలా భావిస్తారు? (బి) నిజమైన మతాన్ని గుర్తించేందుకు సహాయపడే ప్రాముఖ్యమైన ప్రశ్న ఏది?

4 “ఒక మతం దాన్ని అవలంబిస్తున్నవారిని మంచి వ్యక్తులుగా మార్చుతున్నట్లయితే అది నిజమైన మతం అని నేనంటాను” అని నిజమైన మతం ఏది అన్న అంశంపై, ఇటీవల జరిగిన ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక మత గురువు అన్నాడు. నిజమైన మతం ప్రజల వ్యక్తిత్వాలను మెరుగుపరుస్తుందని ఒప్పుకోవలసిందే. కానీ, ఒక మతం ప్రజలను మంచి వ్యక్తులుగా మార్చుతున్నంత మాత్రాన దానికి దేవుని మద్దతు ఉందని అర్థమా? ఒక మతం నిజమైనదేనా కాదా అన్నది నిర్ధారించేందుకు, అది ప్రజలను మంచి వ్యక్తులుగా మార్చుతుందన్నదే కొలమానంగా తీసుకోగలమా?

5 మతాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛతోపాటు, ఇతర ఎంపికలను వ్యక్తిగతంగా చేసుకోగల స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ విలువైనదిగా ఎంచుతారు. కానీ, ఒక వ్యక్తికి ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యం ఉన్నంత మాత్రాన, సరైన ఎంపికే చేసుకుంటాడని చెప్పలేం. ఉదాహరణకు, కొందరు ప్రజలు, ఫలాని మతంలో ఎంతమంది ఉన్నారు, దానికెంత సంపాదన ఉంది, దానికి ఆడంబరంతో కూడిన ఆచారాలు ఉంటాయా, ఎలాంటి కుటుంబ సంబంధాలుంటాయి అనేవాటిని బట్టి ఒక మతాన్ని ఎంపిక చేసుకుంటారు. ఒక మతం నిజమైనదేనా కాదా అన్నది నిర్ధారించడానికి వీటిలో ఏదీ కూడా నిర్ణాయకం కాదు. ఏ మతం దేవుని చిత్తాన్ని చేయమని తన అనుచరులకు బోధిస్తోంది, ఏ మతం ‘దేవుడు మన పక్షమున ఉన్నాడు’ అని దాన్ని అవలంబించేవాళ్ళు నమ్మకంగా చెప్పగల్గేలా, దానికి దేవుని మద్దతుందనేదానికి గట్టి రుజువునిస్తోంది అన్నదే ప్రాముఖ్యమైన ప్రశ్న.

6. నిజమైన మతమేదో అబద్ధ మతమేదో గుర్తించే విషయంలో యేసు చెప్పిన ఏ మాటలు వెలుగును ప్రసరింపజేశాయి?

6 “అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు” అని యేసు అన్నప్పుడు, అబద్ధ మతమేదో నిజమైన మతమేదో గుర్తించేందుకు సహాయపడే సూత్రాన్ని పేర్కొన్నాడు. (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 7:​15, 16; మలాకీ 3:​18) నిజమైన మతం యొక్క కొన్ని “ఫలముల”ను లేదా దాని గుర్తింపు చిహ్నాలను కొన్నింటిని పరిశీలిద్దాం, తద్వారా, నేడు దేవుని మద్దతు ఎవరికుందన్నది యథార్థంగా నిర్ణయించుకోగల్గుతాం.

దేవుని మద్దతున్నవారి గుర్తింపు చిహ్నాలు

7. బైబిలు ఆధారంగానే బోధించడమంటే ఏమిటి?

7వాళ్ళ బోధలు బైబిలుపై ఆధారపడి ఉంటాయి. “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నాయంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును” అని యేసు అన్నాడు. “దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును” అని కూడా ఆయన అన్నాడు. (యోహాను 7:​16, 17; 8:​47) కనుక, ఎవరికైనా దేవుని మద్దతు ఉండాలంటే, దేవుడు తన వాక్యంలో వెల్లడిచేసే వాటిని మాత్రమే బోధించాలి; మానవ జ్ఞానముపైన లేదా పారంపర్యాచారంపైన ఆధారపడిన బోధల్ని విసర్జించాలి.​—⁠యెషయా 29:​13; మత్తయి 15:​3-9; కొలొస్సయులు 2:⁠8.

8. ఆరాధనలో దేవుని నామాన్ని ఉపయోగించడం ఎందుకు ప్రాముఖ్యం?

8యెహోవా అనే దేవుని నామాన్ని వాళ్ళు ఉపయోగిస్తారు, ప్రచురం చేస్తారు. “ఆ దినమున మీరీలాగందురు​—⁠యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవానుగూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను భూమియందంతటను ఇది తెలియబడును” అని యెషయా ప్రవచించాడు. (యెషయా 12:​3-5) “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అని ప్రార్థించమని యేసు తన శిష్యులకు బోధించాడు. (మత్తయి 6:⁠9) కనుక, క్రైస్తవులు యూదుల వంశానికి చెందినవారైనా కాకపోయినా, “[దేవుని] నామముకొరకు ఒక జనము”గా సేవచేయాల్సి ఉంది. (అపొస్తలుల కార్యములు 15:​14) “తన నామముకొరకు ఒక జనము”గా సేవచేయడాన్ని గర్వించదగిన విషయంగా భావించేవారికి మద్దతునిచ్చేందుకు యెహోవా సంతోషిస్తాడన్నది స్పష్టం.

9. (ఎ) ఆనందం నిజమైన మత సభ్యుల విశిష్ట లక్షణంగా ఎందుకుంది? (బి) యెషయా నిజమైన మతం అబద్ధ మతానికి ఎలా భిన్నంగా ఉన్నట్లు చూపిస్తున్నాడు?

9వాళ్ళు దేవుని ఆనందభరితమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తారు. “సువార్త”కు మూలమైన యెహోవా “సంతోషముగల దేవుడు.” (1 తిమోతి 1:​11, NW) కనుక, ఆయన సేవకులు సంతోషం లేనివారిగా, లేక నిరంతరమూ నిరాశావాదులుగా ఎలా ఉండగలరు? లోకంలో విపత్తులు ఎదురవుతున్నా, వ్యక్తిగత సమస్యలున్నా, నిజక్రైస్తవులు ఆనందమయ స్ఫూర్తిని కాపాడుకుంటారు, ఎందుకంటే, వాళ్ళు పోషక సమృద్ధిగల ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రమంగా తీసుకుంటారు. యెషయా వాళ్ళను, అబద్ధ మతస్థులకు భిన్నంగా ఉన్నట్లు చూపుతూ, ఇలా అన్నాడు: “ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు​—⁠ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు మనో దుఃఖముచేత ప్రలాపించెదరు.”​—⁠యెషయా 65:13, 14.

10. సరైనది ఏది అన్నది అనేక పద్ధతులను పరీక్షించి తెలుసుకోవలసిన పరిస్థితిని నిజమైన మతానికి చెందినవారు ఎలా నివారించుకోగల్గుతారు?

10వాళ్ళ ప్రవర్తనా, వాళ్ళ నిర్ణయాలూ బైబిలు సూత్రాలపై ఆధారపడి ఉంటాయి. “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” అని సామెతల రచయిత మనకు సలహా ఇస్తున్నాడు. (సామెతలు 3:​5, 6) దైవిక జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేసే మానవుల పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాల వైపుకు చూసే బదులు తన నిర్దేశం కోసం చూసేవారికి దేవుడు మద్దతునిస్తాడు. ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవుని వాక్యానుసారంగా మలుచుకోవడానికి సుముఖతను చూపించినంత మేరకు, సరైన పద్ధతి ఏదన్నది అనేక సార్లు పరీక్షించి తెలుసుకోవలసిన పరిస్థితిని నివారించుకోగల్గుతాడు.​—⁠కీర్తన 119:33; 1 కొరింథీయులు 1:19-21.

11. (ఎ) నిజమైన మత సభ్యుల్ని పాదిరీలు, సామాన్యులు అని విభజించడం ఎందుకు కుదరదు? (బి) దేవుని ప్రజల్లో నాయకత్వాన్ని వహిస్తున్నవారు మందకు ఎలాంటి మాదిరిని ఉంచాలి?

11మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘం ఏ పద్ధతిలో సంస్థీకరించబడివుందో అదే పద్ధతిలో వాళ్ళు సంస్థీకరించబడి ఉంటారు. యేసు ఈ సూత్రాల్ని పెట్టాడు: “మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను.” (మత్తయి 23:​8-11) గొప్ప బిరుదులతో తమను తాము ఘనపరచుకుంటూ, సామాన్యులకన్నా తమను తాము ఉన్నతపరచుకుంటూ అహంభావంతో ఉండే పాదిరీల గుంపుకు సహోదరుల సంఘంలో స్థానం లేదు. (యోబు 32:​21, 22) దేవుని మందను కాసేవారు “బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతోను” కాయాలనీ, తమకు “అప్పగింపబడినవారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా” ఉండాలనీ వారికి చెప్పబడింది. (1 పేతురు 5:​2, 3) నిజమైన క్రైస్తవ కాపరులు, ఇతరుల విశ్వాసంపై తమను తాము ప్రభువులనుగా చేసుకోవడానికి ప్రయత్నించరు. దేవుని సేవలో తోటిపనివారిగా, వాళ్ళు మంచి మాదిరిని ఉంచడానికి శ్రమిస్తారు.​—⁠2 కొరింథీయులు 1:⁠24.

12. తన మద్దతు కావాలని కోరుకునేవారు, మానవ ప్రభుత్వాలను గురించి ఎటువంటి సంతులితమైన దృక్పథాన్ని కలిగివుండాలని దేవుడు కోరుతున్నాడు?

12వాళ్ళు మానవ ప్రభుత్వాలకు లోబడుతున్నప్పటికీ, తటస్థంగా ఉంటారు. “పై అధికారులకు లోబడియుండ”లేని వ్యక్తి తనకు దేవుని మద్దతు ఉంటుందని ఎదురుచూడలేడు. ఎందుకని? ఎందుకంటే, “దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.” (రోమీయులు 13:​1, 2) అయినా, “కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని” యేసు చెప్పినప్పుడు, ప్రభుత్వాలు కోరే విషయాలూ, దేవుడూ కోరే విషయాలూ కొన్నిసార్లు పరస్పర విరుద్ధంగా ఉండగలవని గుర్తించాడు. (మార్కు 12:​17) దేవుని మద్దతు కావాలని కోరుకునేవారు, తప్పనిసరిగా “ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకు”తూనే, మరొకవైపు, దేవుని పట్ల తమకున్న అత్యున్నత బాధ్యతలకు విరుద్ధం కాని దేశ చట్టాలకు లోబడుతూ ఉండాలి. (మత్తయి 6:33; అపొస్తలుల కార్యములు 5:​29) “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు” అని తన శిష్యులను గురించి యేసు చెప్పినప్పుడు తటస్థతను గురించి నొక్కి చెప్పాడు. తరువాత ఆయన ఈ మాటల్ని జోడించాడు: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు.”​—⁠యోహాను 17:​16; యోహాను 18:⁠36.

13. ఇతరులు దేవుని ప్రజలను గుర్తించేలా చేయడంలో ప్రేమకెలాంటి పాత్ర ఉంది?

13‘అందరి ఎడల మేలు చేస్తూ’ వాళ్ళు నిష్పక్షపాతంగా ఉంటారు. (గలతీయులు 6:​10) క్రైస్తవ ప్రేమకు పక్షపాతం తెలియదు, ఏ వర్ణంలోనివారైనా, ఎటువంటి ఆర్థిక స్థోమత లేదా విద్యార్హత ఉన్నా, ఏ దేశపువారైనా, ఏ భాషవారైనా సరే అది అందరినీ స్వీకరిస్తుంది. అందరికీ, ముఖ్యంగా విశ్వాస సంబంధులకు మేలు చేయడం, దేవుని మద్దతున్నవారిని ఇతరులు గుర్తించేందుకు సహాయపడుతుంది. “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందు[రు]” అని యేసు అన్నాడు.​—⁠యోహాను 13:​35; అపొస్తలుల కార్యములు 10:34, 35.

14. దేవుని మద్దతు గల ప్రజలకు అందరి ఆమోదం ఉండాలని ఉందా? వివరించండి.

14దేవుని చిత్తాన్ని చేసే నిమిత్తం వారు హింసననుభవించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. “లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల, మీమాట కూడ గైకొందురు” అని యేసు తన అనుచరులను ముందుగానే హెచ్చరించాడు. (యోహాను 15:​20; మత్తయి 5:​11, 12; 2 తిమోతి 3:​12) తన విశ్వాసము ద్వారా లోకాన్ని ఖండించిన నోవహులాగే, దేవుని మద్దతుగలవారికి అందరి ఆమోదం ఎన్నడూ ఉండదు. (హెబ్రీయులు 11:⁠7) నేడు, దేవుని మద్దతు కావాలని కోరుకునేవారు, దేవుని వాక్యాన్ని నీరుగార్చడానికి గానీ, హింసను తప్పించుకునేందుకు దైవిక సూత్రాలను అనుసరించకుండా రాజీపడడానికి గానీ సాహసించరు. తాము దేవునికి నమ్మకంగా సేవ చేసినంత కాలం, ప్రజలు ‘ఆశ్చర్యపడుచు తమను దూషిస్తూనే’ ఉంటారు అని వాళ్ళకు తెలుసు.​—⁠1 పేతురు 2:​12; 3:​15, 16; 4:⁠4.

వాస్తవాలను మదింపుచేయవలసిన సమయం

15, 16. (ఎ) దేవుని మద్దతున్న మత గుంపును గుర్తించేందుకు ఏ ప్రశ్నలు మనకు సహాయపడతాయి? (బి) లక్షలాది మంది ఏ నిర్ధారణకు వచ్చారు, ఎందుకని?

15 మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘దేవుని వాక్య బోధలు దాదాపు ప్రజలందరి నమ్మకాలకు భిన్నంగా ఉన్నప్పుడు కూడా ఏ మత గుంపు వాటికి హత్తుకుని ఉన్నట్లు ఖ్యాతిగాంచింది? దేవుని వ్యక్తిగత నామానికి ప్రాముఖ్యతనిస్తున్నదీ, తమకు గుర్తింపుగా ఆ నామాన్ని ఉపయోగిస్తున్నదీ ఎవరు? మానవుల సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారం దేవుని రాజ్యమేనని ఆశావాద దృక్పథంతో దానివైపు చూపిస్తున్నదెవరు? పాతకాలం వాళ్ళు అని అనిపించుకోవాల్సి వచ్చినా కూడా ప్రవర్తన విషయంలో బైబిలు ప్రమాణాలనే సమర్థిస్తున్నదెవరు? జీతం తీసుకునే పాదిరీలు లేరని, సభ్యులందరూ సువార్తను ప్రకటించేవారేనని ఖ్యాతిగాంచిన గుంపు ఏది? రాజకీయాల్లో పాల్గొనకపోయినప్పటికీ, చట్టాన్ని అనుసరించే పౌరులుగా ప్రశంసించబడుతున్నవారెవరు? దేవుని గురించీ, ఆయన సంకల్పాలను గురించీ ఇతరులకు తెలియజేసేందుకు తమ సమయాన్నీ డబ్బునూ ప్రేమపూర్వకంగా వెచ్చిస్తున్నదెవరు? ప్రశంసనీయమైన ఈ విషయాలన్నీ ఉన్నా, చిన్నచూపు చూడబడుతున్న, ఎగతాళి చేయబడుతున్న, హింసించబడుతున్న వారు ఎవరు?’

16 ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు, ఈ వాస్తవాలను గ్రహించి, యెహోవాసాక్షులు మాత్రమే నిజమైన మతాన్ని ఆచరిస్తున్నారన్న నిర్ధారణకు వచ్చారు. వాళ్ళు, యెహోవా సాక్షులు ఏమి బోధిస్తున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, అలాగే వాళ్ళ మతం వాళ్ళకు చేకూర్చిన ప్రయోజనాలేమిటి అన్నవాటి ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. (యెషయా 48:​17) దాని ఫలితంగా, జెకర్యా 8:23 లో ప్రవచించబడినట్లుగానే, లక్షలాదిమంది ప్రజలు “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తు[ము]” అని అంటున్నారు.

17. తమ దగ్గర నిజమైన మతముందని యెహోవాసాక్షులు అనడం దురహంకారాన్ని చూపించడం కాదని ఎందుకు చెప్పవచ్చు?

17 యెహోవాసాక్షులు తమకు మాత్రమే దేవుని మద్దతుందని అనడం దురహంకారాన్ని చూపుతోందా? నిజానికి, ఐగుప్తీయుల నమ్మకం ఎలాగున్నప్పటికీ, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు తమకు దేవుని మద్దతు ఉందని ఎలా భావించారో, లేక యూదా మతవాదులకు లేని దేవుని మద్దతు తమకుందని మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా భావించారో అలాగే సాక్షులూ భావిస్తున్నారు. వాస్తవాలు దానికి రుజువులుగా ఉన్నాయి. “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని అంటూ అంత్య దినాల్లో, తన నిజమైన అనుచరులు చేస్తారని యేసు ప్రవచించిన పనిని 235 దేశాల్లో యెహోవాసాక్షులు చేస్తున్నారు.​—⁠మత్తయి 24:​14.

18, 19. (ఎ) యెహోవాసాక్షులకు వ్యతిరేకత ఎదురైనప్పటికీ, వాళ్ళు ప్రకటనా పనిని ఎందుకు ఆపవలసినవసరం లేదు? (బి) సాక్షులకు దేవుని మద్దతుందనే వాస్తవాన్ని కీర్తన 41:⁠11 ఎలా ధ్రువీకరిస్తుంది?

18 యెహోవాసాక్షులు ఈ నియామకాన్ని నిర్వర్తించడంలో కొనసాగుతారు, హింస గానీ వ్యతిరేకత గానీ తమ పనిని ఆపేందుకు అనుమతించరు. యెహోవా పని తప్పకుండా జరగాలి, అది జరుగుతుంది కూడా. గత శతాబ్దంలో దేవుని పనిని నెరవేర్చనీయకుండా యెహోవాసాక్షులను ఆటంకపర్చేందుకు ఇతరులు చేసిన ప్రతి ప్రయత్నమూ విఫలమైపోయింది, ఎందుకంటే, “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు, న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము” అని యెహోవాయే వాగ్దానం చేశాడు.​—⁠యెషయా 54:⁠17.

19 యెహోవాసాక్షులకు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైనప్పటికీ, వాళ్ళు మునుపెన్నటికన్నా మరింత బలంగాను, చురుగ్గాను ఉండడం, వాళ్ళు చేస్తున్న పనిలో యెహోవా ఆనందిస్తున్నాడన్న దానికి రుజువుగా ఉంది. “నా శత్రువు నామీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను” అని దావీదు అన్నాడు. (కీర్తన 41:​11; 56:​9, 11) దేవుని శత్రువులు ఎన్నడూ యెహోవా ప్రజలపై విజయోత్సాహంతో ఉల్లసించలేరు, ఎందుకంటే వారి నాయకుడైన యేసుక్రీస్తు అంతిమ విజయం వైపుగా ముందుకు సాగుతున్నాడు!

మీరు జవాబివ్వగలరా?

• దేవుని మద్దతున్న ప్రాచీన ప్రజల కొన్ని ఉదాహరణలేవి?

• నిజ క్రైస్తవత్వపు గుర్తింపు చిహ్నాలు కొన్ని ఏవి?

• యెహోవాసాక్షులకు దేవుని మద్దతుందని మీకు నమ్మకమెలా కుదిరింది?

[అధ్యయన ప్రశ్నలు]

[13వ పేజీలోని చిత్రం]

తమకు దేవుని మద్దతు ఉండాలని కోరుకునేవారు కేవలం దేవుని వాక్యాన్నే ఆధారంగా చేసుకుని బోధించాలి

[15వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ పెద్దలు మందకు మాదిరిలుగా ఉంటారు