కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

విమోచన క్రయధన బలి ఆధారంగా యెహోవా మన పాపాలను క్షమించేందుకు సుముఖతతో ఉండగా, క్రైస్తవులు సంఘంలోని పెద్దల ఎదుట తమ పాపాలను ఒప్పుకోవడం ఎందుకు అవసరం?

దావీదు బత్షెబల విషయంలో మనం చూస్తున్నట్లుగా, దావీదు నిజంగా పశ్చాత్తాపపడ్డాడు గనుక, ఆయన పాపాన్ని, అది ఎంత తీవ్రమైనదైనప్పటికీ, యెహోవా క్షమించాడు. ప్రవక్తయైన నాతాను తన దగ్గరికి వచ్చినప్పుడు, “నేను పాపముచేసితినని” దావీదు దాపరికం లేకుండా ఒప్పుకున్నాడు.​—⁠2 సమూయేలు 12:13.

అయితే, పాపం చేసిన ఒక వ్యక్తి తన పాపాన్ని హృదయపూర్వకంగా ఒప్పుకున్నప్పుడు, యెహోవా దాన్ని అంగీకరించి, ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించడమే కాక, ఆయన ఆధ్యాత్మికంగా తిరిగి కోలుకునేందుకు ప్రేమపూర్వక ఏర్పాట్లను కూడా చేస్తాడు. ప్రవక్తయైన నాతాను ద్వారా దావీదుకు ఆ సహాయం ఇవ్వబడింది. నేడు క్రైస్తవ సంఘంలో, ఆధ్యాత్మిక పరిణతి గల పెద్దలున్నారు. “మీలో ఎవడైనను [ఆధ్యాత్మికంగా] రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థనచేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును” అని శిష్యుడైన యాకోబు వివరిస్తున్నాడు.​—⁠యాకోబు 5:14, 15.

పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపం మూలంగా కలిగే హృదయ వేదననుండి ఉపశమనాన్ని పొందేందుకు అనుభవజ్ఞులైన పెద్దలు ఎంతో సహాయం చేయగలరు. ఆయనతో వ్యవహరించేటప్పుడు వాళ్ళు యెహోవాను అనుకరించడానికి తీవ్రంగా కృషి చేస్తారు. ఆయనకు ఖచ్చితమైన క్రమశిక్షణ ఇవ్వవలసిన అవసరమున్నప్పటికీ, వాళ్ళు ఆయనతో కఠినంగా ఉండాలనుకోరు. బదులుగా, ఆయనకు ఇప్పుడు అత్యవసరమైన వాటిని సానుభూతితో పరిగణనలోకి తీసుకుంటారు. తప్పుచేసిన వ్యక్తి ఆలోచనాసరళిని సరిదిద్దేందుకు దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తూ ఓపికగా గట్టిగా కృషి చేస్తారు. (గలతీయులు 6:⁠1) ఒక వ్యక్తి తనంతట తానే తన పాపాన్ని ఒప్పుకోకపోయినప్పటికీ, నాతాను దావీదు దగ్గరికి వెళ్ళినట్లు, పెద్దలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పశ్చాత్తాపపడేందుకు పురికొల్పబడవచ్చు. పెద్దలు ఆ విధంగా ఇచ్చే మద్దతు, తప్పిదస్థుడు ఆ పాపాన్ని మళ్ళీ చేసే ప్రమాదాన్ని నివారించుకునేందుకు, హృదయాన్ని కఠినపరచుకుని పాపం చేసేవానిగా మారితే రాగల పర్యవసానాలను నివారించుకునేందుకు సహాయపడుతుంది.​—⁠హెబ్రీయులు 10:26-31.

తాను చేసిన సిగ్గుచేటు పనులను ఇతరుల ముందు ఒప్పుకుని, క్షమాపణను కోరడమనేది ఏ మాత్రం సులభం కాదన్నది నిజమే. అలా చేసేందుకు అంతర్గత బలం అవసరం. అయితే, దానికి ప్రత్యామ్నాయమేమైనా ఉందా అని ఒక్క నిమిషం ఆలోచించండి. “నా హృదయంలో కలిగిన వేదన ఎంత మాత్రమూ తగ్గేది కాదు. నేను ప్రకటనా పనిలో మరింత కృషిసల్పాను. అయినా, బాధాకరమైన ఆ అనుభూతి అలాగే మిగిలిపోయింది” అని తాను చేసిన గంభీరమైన పాపాన్ని గురించి సంఘంలోని పెద్దలకు వెల్లడి చేయలేకపోయిన ఒక వ్యక్తి అంటున్నాడు. దేవునికి ప్రార్థన చేసి ఆయన ఎదుట తన పాపాన్ని ఒప్పుకుంటే సరిపోతుందని ఆయన అనుకున్నాడు. కానీ అది సరిపోలేదన్నది స్పష్టం. రాజైన దావీదుకు కలిగినటువంటి అనుభూతులే ఆయనకూ కలిగాయి. (కీర్తన 51:​8, 11) పెద్దల ద్వారా యెహోవా ప్రేమపూర్వకంగా ఇచ్చే సహాయాన్ని తీసుకోవడం ఎంత మేలు!