పాపాన్ని ఒప్పుకోవడం స్వస్థతకు నడిపిస్తుంది
పాపాన్ని ఒప్పుకోవడం స్వస్థతకు నడిపిస్తుంది
“నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నా యెముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను, నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను.” (కీర్తన 32:3, 4) బాధతోనిండివున్న ఆ మాటలు, ప్రాచీన కాలపు రాజైన దావీదు అనుభవించిన భావోద్వేగపరమైన వ్యధను, తాను చేసిన గంభీరమైన పాపాన్ని ఒప్పుకునే బదులు మరుగు చేయడం ద్వారా తనకు తానే తెచ్చిపెట్టుకున్న వ్యధను ప్రతిబింబించివుండవచ్చు.
దావీదు గొప్ప శక్తి సామర్థ్యాలు గలవ్యక్తి. పరాక్రమంగల యుద్ధశూరుడు, నైపుణ్యంగల రాజనీతిజ్ఞుడు, కవి, సంగీతజ్ఞుడు. అయినప్పటికీ, ఆయన తన సామర్థ్యాల మీద కాక, తన దేవుని మీదే ఆధారపడ్డాడు. (1 సమూయేలు 17:45, 46) “యెహోవాయెడల యథార్థ” హృదయము గల వ్యక్తిగా ఆయన వర్ణించబడ్డాడు. (1 రాజులు 11:4) అయితే ఆయన చేసిన ఒక పాపం నిజంగా శిక్షార్హమైనది. దాని గురించే 32వ కీర్తనలో ఆయన సూచించివుండవచ్చు. ఆయన ఆ పాపం చేసేలా నడిపిన పరిస్థితులను పరిశీలించడం ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. పాపంలో పడకుండా నివారించుకోవాల్సిన ప్రమాదకరమైన పరిస్థితులను గ్రహిస్తాము, అలాగే, మనం పాపం చేసినట్లయితే, యెహోవాతో మనకున్న సంబంధాన్ని పునఃస్థాపించుకునేందుకు దాన్ని ఒప్పుకోవలసిన అవసరాన్ని గ్రహిస్తాము.
నమ్మకస్థుడైన రాజు పాపంలో పడిపోయాడు
ఇశ్రాయేలు జనాంగం, అమ్మోనీయుల మీద దాడి చేస్తున్నారు, కానీ దావీదు యెరూషలేములోని తన భవనంలోనే ఉన్నాడు. ఒక సాయంకాలం వేళ, తన రాజభవనపు మిద్దెమీద ఆయన పచార్లు చేస్తుండగా, తన పొరుగింటి అందమైన స్త్రీ స్నానం చేయడం గమనించాడు. ఆయన తనను తాను అదుపు చేసుకోక, ఆమెపై కోరికను పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఆమె తన సైన్యంలోని ఒక సైనికుడైన ఊరియా భార్య బత్షెబ అని తెలుసుకుని, ఆమెను పిలిపించి, ఆమెతో వ్యభిచరించాడు. కొన్నాళ్ళ తర్వాత, తాను గర్భవతినయ్యానని బత్షెబ దావీదుకు కబురు పంపింది.—2 సమూయేలు 11:1-5.
దావీదు ఇరుక్కుపోయాడు. వాళ్ళ పాపం బయటపడిందంటే, వాళ్ళిద్దరికీ మరణశిక్ష పడుతుంది. (లేవీయకాండము 20:10) అందుకే, దావీదు ఒక పథకం వేశాడు. దాని ప్రకారం, బత్షెబ భర్తయైన ఊరియాను యుద్ధ క్షేత్రం నుండి పిలిపించాడు. ఆయనను యుద్ధాన్ని గురించి అనేక వివరాలు అడిగిన తర్వాత, ఇంటికి తిరిగి వెళ్ళమని ఆయనను ఆదేశించాడు. ఆ విధంగా బిడ్డ తండ్రి ఊరియానే అని అనుకుంటారని దావీదు ఆశించాడు.—2 సమూయేలు 11:6-9.
దావీదుకు నిరాశే ఎదురయ్యింది. ఊరియా తన భార్య దగ్గరికి వెళ్ళలేదు. యుద్ధం తీవ్రంగా జరుగుతుండగా సైనికులు ఎన్నో యాతనలు పడుతుండగా, తాను ఇంటికి తిరిగివెళ్ళాలన్న తలంపును రానివ్వలేనని ఊరియా చెప్పాడు. ఇశ్రాయేలీయుల్లోని సైనికులు యుద్ధం చేస్తున్న రోజుల్లో సొంత భార్యలతోనైనా సంపర్కం పెట్టుకునేవారు కాదు. వాళ్ళు ఆచారం ప్రకారం పవిత్రంగా ఉండాలి. (1 సమూయేలు 21:5) తర్వాత దావీదు ఊరియాను విందుకు పిలిచి, బాగా తాగించాడు. అయినా కూడా ఆయన ఇంటికి తన భార్య దగ్గరికి వెళ్ళలేదు. ఊరియా నమ్మకమైన ప్రవర్తన దావీదు చేసిన గంభీరమైన పాపాన్ని వేలెత్తి చూపింది.—2 సమూయేలు 11:10-13.
తన సొంత పాపం పన్నిన వల దావీదు చుట్టూ బిగుసుకుంటోంది. నిరాశానిస్పృహలతో ఉన్న ఆయనకు ఒక్కటే మార్గం కనిపించింది. ఆయన ఊరియాను యుద్ధానికి తిరిగి పంపాడు. ఒక ఉత్తరాన్ని ఊరియా చేతికిచ్చి సైన్యాధిపతియైన యోవాబుకు ఇవ్వమని చెప్పాడు. “యుద్ధము మోపుగా జరుగుచున్నచోట ఊరియాను ముందుపెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్దనుండి వెళ్లి పొ[మ్ము]” అన్నదే ఆ చిన్న ఉత్తరంలోని సారాంశం. శక్తిమంతుడైన దావీదు కలం శక్తితో ఊరియాను మృత్యుముఖంలోకి పంపుతూ తన తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూసినట్లు కనిపిస్తుంది.—2 సమూయేలు 11:14-17.
బత్షెబ తన భర్త కోసం విలపించే కాలం ముగిసిన వెంటనే దావీదు ఆమెను వివాహం చేసుకున్నాడు. అలా నెలలు గడిచాయి. బిడ్డ పుట్టాడు. ఇవన్నీ జరిగినా తాను చేసిన పాపాలను గురించి దావీదు మాట్లాడలేదు. బహుశా ఆయన తనను తాను యిర్మీయా 17:9; 2 సమూయేలు 11:25.
సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండివుండవచ్చు. ఇతరుల్లాగే ఊరియా కూడా యుద్ధంలో గౌరవనీయంగానే చనిపోలేదా? అంతేకాక, భార్య దగ్గరికి వెళ్ళకుండా రాజాజ్ఞను ఆయన ఉల్లంఘించలేదా? అని అనుకొని ఉండవచ్చు. ‘మోసకరమైన హృదయము’ తను చేసిన పాపాలను సమర్థించుకునేందుకు సమస్త విధాలుగా తర్కిస్తుంది.—పాపానికి దారితీసిన తప్పటడుగులు
నీతి ప్రేమికుడైన దావీదు వ్యభిచారమూ, హత్యా చేసేంతగా ఎలా దిగజారగలిగాడు? ఆయనలో పాపపు బీజాలు నాటుకునేందుకు కొంతకాలం పట్టివుంటుందన్నది స్పష్టం. యెహోవా శత్రువులపై దండయాత్ర చెయ్యడంలో తనవారికి మద్దతునిచ్చేందుకు, వారితోపాటు దావీదు ఎందుకు వెళ్ళలేదు అని మనం ఆశ్చర్యపోవచ్చు. వాళ్ళతోపాటు వెళ్ళే బదులు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన భవనం నమ్మకస్థుడైన ఒక సైనికుని భార్యపై కలిగిన కోరికను మనస్సులో నుండి పారద్రోలేలా యుద్ధ సన్నివేశాలను గుర్తుచేసేంత దగ్గర్లో లేదు. నేడు నిజ క్రైస్తవులు తమ సంఘాలతోపాటు ఆధ్యాత్మిక లక్ష్యసాధనలో చురుకుగా నిమగ్నమవ్వడం సువార్త పనిలో క్రమంగా పాల్గొనడం రక్షణ కవచంగా ఉంటుంది.—1 తిమోతి 6:12.
ధర్మశాస్త్రపు నకలు వ్రాసుకుని దానిని ప్రతిరోజూ చదువుకోవాలని ఇశ్రాయేలీయుల రాజులకు నిర్దేశించబడింది. అందుకు కారణమేమిటో బైబిలు చెబుతోంది: “తాను తన సహోదరులమీద గర్వించి, యీ ధర్మమును విడిచిపెట్టి కుడికిగాని యెడమకు గాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని యీ కట్టడలను అనుసరించి నడువ నేర్చు[కొనవలెను].” (ద్వితీయోపదేశకాండము 17:18-20) తాను అంత గంభీరమైన పాపాన్ని చేసినప్పుడు దావీదు ఆ నిర్దేశాన్ని అనుసరించనట్లు కనిపిస్తోంది. దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేసి ధ్యానించడం, ఈ క్లిష్టమైన దినాల్లో మనం తప్పుచేయకుండా మనల్ని మనం కాపాడుకునేందుకు తప్పకుండా సహాయపడుతుంది.—సామెతలు 2:10-12.
అంతేకాక, “పొరుగువాని భార్యనైనను . . . ఆశింపకూడదు” అని పదవ ఆజ్ఞ ప్రత్యేకంగా పేర్కొంది. (నిర్గమకాండము 20:17) ఆ సమయానికి దావీదుకు అనేక మంది భార్యలు ఉపపత్నులు ఉన్నారు. (2 సమూయేలు 3:2-5) కానీ అంత మంది ఉన్నా, ఆకర్షణీయమైన మరొక స్త్రీని ఆయన కోరకుండా ఉండలేకపోయాడు. “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును” అని యేసు చెప్పిన మాటలను ఎంత గంభీరంగా తీసుకోవాలో ఈ వృత్తాంతం గుర్తుచేస్తుంది. (మత్తయి 5:28) అలాంటి అనుచితమైన కోరికలను మనస్సులో పెట్టుకోక, వాటిని మన హృదయాల్లో నుండీ మనస్సుల్లో నుండీ వెంటనే తీసివేసుకుందాం.
పశ్చాత్తాపము - కరుణ
దావీదు చేసిన పాపాన్ని గురించి నిజాయితీతో కూడిన బైబిలు వృత్తాంతం, ఎవరి అనుచితమైన లైంగిక కోరికలనో తృప్తిపరచడానికి కాదు. యెహోవా దేవుని విశిష్టమైన గుణాల్లో ఒకటైన ఆయన కరుణ ఎంత శక్తివంతంగా పురికొల్పేవిధంగా వ్యక్తీకరించబడిందో చూసే అవకాశాన్ని ఆ వృత్తాంతం మనకిస్తుంది.—నిర్గమకాండము 34:6, 7.
బత్షెబ తన కుమారునికి జన్మనిచ్చిన తర్వాత, దావీదును కలుసుకునేందుకు ప్రవక్తయైన నాతానును యెహోవా పంపాడు. అది కరుణతో కూడిన చర్య. దావీదు దగ్గరికి ఎవరైనా వెళ్ళి, ఆయన చేసిన పాపాన్ని గురించి మాట్లాడకపోతే, ఆయన హృదయం పాపం చేసే విషయంలో మరింత కఠినమయ్యే సాధ్యత ఉంది. (హెబ్రీయులు 3:13) దేవుడు చూపిన కరుణకు దావీదు ప్రతిస్పందించడం సంతోషకరమైన విషయం. నాతాను చాలా నైపుణ్యంతో స్పష్టంగా చెప్పిన మాటలు దావీదు మనస్సాక్షిని దెప్పిపొడిచాయి. తాను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానని ఆయన అప్పుడు నమ్రతగా ఒప్పుకున్నాడు. వాస్తవానికి 51వ కీర్తన, దావీదు బత్షెబతో చేసిన పాపాన్ని గురించి మాట్లాడుతుంది, ఆయన చేసిన గంభీరమైన పాపాన్ని గురించి పశ్చాత్తాపపడి ఒప్పుకున్న తర్వాత కూర్చినదది. మనం గంభీరమైన పాపమేదైనా చేసినట్లైతే, మన హృదయం కఠినమయ్యేందుకు మనమెన్నడూ అనుమతించకుండా ఉందాం.—2 సమూయేలు 12:1-13.
దావీదుకు క్షమాభిక్ష లభించింది, కానీ క్రమశిక్షణ నుండి లేదా తాను చేసిన పాపపు పర్యవసానం నుండి ఆయన తప్పించబడలేదు. (సామెతలు 6:27) దావీదు ఎలా తప్పించుకోగలడు? దేవుడు ప్రతిదాన్నీ చూసీచూడనట్లు వదిలేస్తే, తన ప్రమాణాలను తనే ఖచ్చితంగా పాటించనట్లవుతుంది. దుష్టులైన తన కుమారులను మృదువుగా మాత్రమే మందలించి, వాళ్ళు చెడు పనులను కొనసాగించేలా వాళ్ళ మానాన వాళ్ళను వదిలేసిన ప్రధాన యాజకుడైన ఏలీలా, యెహోవా కూడా ఖచ్చితంగా ఉండనివాడయ్యేవాడు. (1 సమూయేలు 2:22-25) అయితే, యెహోవా తన ప్రేమపూర్వక దయను పూర్తిగా చూపించకుండా ఉండ లేదు. తప్పిదస్థుడు తన పాపపు పర్యవసానాలను తట్టుకునేందుకు నూతనోత్తేజాన్నిచ్చే చల్లని నీళ్ళలా ఆయన కరుణ సహాయపడుతుంది. దైవిక క్షమాపణలోని ఆప్యాయతా, తోటి ఆరాధకులతో నిర్మాణాత్మకంగా సహవసించడమూ, ఆధ్యాత్మికంగా తిరిగి కోలుకునేలా చేస్తాయి. అవును, క్రీస్తు విమోచన క్రయధన బలి ఆధారంగా, పశ్చత్తాపపడుతున్న వ్యక్తి “దేవుని కృపామహదైశ్వర్యమును” రుచిచూడగలడు.—ఎఫెసీయులు 1:7.
‘శుద్ధహృదయమూ, నూతన మనస్సూ’
దావీదు తన పాపాన్ని ఒప్పుకున్న తర్వాత, తానిక దేనికీ పనికిరాడన్న భావానికి లోనుకాలేదు. ఆయన తన పాపాన్ని ఒప్పుకుంటూ వ్రాసిన కీర్తనలోని వ్యక్తీకరణలు, ఆయనకు కలిగిన ఉపశమనాన్నీ, దేవుణ్ణి నమ్మకంగా సేవించాలన్న ఆయన కృతనిశ్చయాన్నీ చూపిస్తున్నాయి. ఉదాహరణకు 32వ కీర్తనను చూడండి. “తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు” అని మొదటి వచనంలో మనం చదువుతాం. ఒక వ్యక్తి చేసినది ఎంత గంభీరమైన పాపమైనప్పటికీ, హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడితే సంతోషకరమైన ఫలితాన్ని పొందడం సాధ్యమే. పాపం చేసిన వ్యక్తి, దావీదు చేసినట్లు తాను చేసిన పాపానికి బాధ్యతనంతటినీ అంగీకరించడం ద్వారా హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడుతున్నానని చూపిస్తాడు. (2 సమూయేలు 12:13) యెహోవా ఎదుట తనను తాను సమర్థించుకోవాలని ప్రయత్నించడం గానీ, తప్పును ఇతరులపై నెట్టడానికి ప్రయత్నించడం గానీ దావీదు చేయలేదు. “నా దోషము కప్పుకొనక నీ యెదుట నా పాపము ఒప్పుకొంటిని—యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు” అని 5వ వచనం చెబుతోంది. ఒక వ్యక్తి తన పాపాన్ని యథార్థంగా ఒప్పుకున్నప్పుడు ఉపశమనం కలుగుతుంది, అలా, తాను గతంలో చేసిన పాపాన్ని గురించి మనస్సాక్షి పెట్టే వేధింపుకు తను ఇక లోనవ్వవలసిన అవసరం లేదు.
క్షమాభిక్ష ఇవ్వమని యెహోవాను యాచించిన తర్వాత, “దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము” అని దావీదు కోరుకున్నాడు. (కీర్తన 51:10) “శుద్ధహృదయము”ను అలాగే, ‘నూతన మనస్సును’ దావీదు కోరడం, తనలో ఉన్న పాపపు వైఖరిని గురించి ఆయనకు తెలుసనీ, తన హృదయాన్ని శుద్ధి చేసుకునేందుకూ మనస్సును నూతనపరచుకునేందుకూ దేవుని సహాయం అవసరముందని ఆయనకు తెలుసనీ చూపిస్తుంది. తనపై తాను జాలితో కుమిలిపోయే బదులు, దేవుని సేవ చేయడంలో ముందుకు సాగిపోవాలన్న దృఢనిశ్చయాన్ని ఆయన చేసుకున్నాడు. “ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము” అని ఆయన ప్రార్థించాడు.—కీర్తన 51:15.
దావీదు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడి, తన సేవచేయడంలో కొనసాగాలన్న కృతనిశ్చయతతో చేస్తున్న ప్రయత్నాన్ని చూసినప్పుడు యెహోవా ఎలా ప్రతిస్పందించాడు? “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెను. నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” అన్న ప్రోత్సాహకరమైన హామీని ఆయన దావీదుకిచ్చాడు. (కీర్తన 32:8) పశ్చాత్తాపపడే వ్యక్తుల అనుభూతులకూ, అవసరాలకూ యెహోవా వ్యక్తిగత అవధానాన్నిస్తాడనే దానికి ఇది హామీనిస్తుంది. దావీదుకు అంతర్దృష్టి ఇవ్వడానికి అంటే, విషయాలను పైకి కనిపించేదాని కన్నా లోతుగా చూడగల్గే శక్తిని ఇవ్వడానికి యెహోవా బాధ్యత తీసుకున్నాడు. ఆయన, భవిష్యత్తులో ఏదైనా శోధనకు గురైతే, దానికి లొంగిపొవడం వల్ల కలిగే పర్యవసానాలనూ, అది ఇతరులపై చూపే ప్రభావాన్నీ గ్రహించి వివేచనాపూర్వకంగా ప్రవర్తించగల్గుతాడు.
దావీదు జీవితంలోని ఈ అనుభవం, గంభీరమైన పాపంలో పడిపోయినవారికందరికీ ప్రోత్సాహాన్నిచ్చేందుకు ఉపకరిస్తుంది. మనం మన పాపాలను ఒప్పుకొని, హృదయపూర్వకమైన పశ్చాత్తాపాన్ని కనపరచడం ద్వారా, మనకు అత్యంత విలువైన ఆస్తిని, అంటే యెహోవా దేవునితో మనకున్న సంబంధాన్ని తిరిగి పొందగల్గుతాం. పాపాన్ని ఒప్పుకోకపోవడం వల్ల కలిగే మానసిక వ్యధ కన్నా లేదా, తిరుగుబాటు ధోరణితో మనం మన హృదయాలను కఠినపరచుకోవడం వల్ల భయంకరమైన పర్యవసానాలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కలిగే మానసిక వ్యధ కన్నా, తాత్కాలికంగా బాధపడాల్సిరావడమూ సిగ్గుపడాల్సిరావడమూనే మేలు. (కీర్తన 32:9) మనం చేసిన పాపాన్ని ఒప్పుకుంటే “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” అయిన ప్రేమా కరుణలుగల దేవుని ఆప్యాయతతో కూడిన క్షమాపణను పొందుతాము.—2 కొరింథీయులు 1:3.
[31వ పేజీలోని చిత్రం]
ఊరియాను మృత్యుముఖంలోకి పంపడం ద్వారా తాను చేసిన పాపపు పర్యవసానాలను తప్పించుకోవచ్చని దావీదు ఆశించాడు