బైబిలు అధ్యయనం మీ జీవితంలో దేనికైనా ప్రయోజనకరమేనా?
బైబిలు అధ్యయనం మీ జీవితంలో దేనికైనా ప్రయోజనకరమేనా?
“ప్రీస్టు సమక్షంలో మాత్రమే చదవాలి.” క్యాథలిక్కుల దగ్గరుండే కొన్ని బైబిళ్ళ మొదటి పేజీల్లో ఈ హెచ్చరిక కనబడుతుంది. “క్యాథలిక్కులమైన మాకు బైబిలుతో ఎక్కువ పరిచయం లేదు, కాని ఆ పరిస్థితి ఇప్పుడు మారుతోంది” అని లాస్ ఏంజెల్స్‌లోని క్యాథలిక్ బైబిల్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కేమర్దీ అంటోంది. పరిశుద్ధ లేఖనాలు తమ జీవితాలను ఎలా ప్రభావితం చేయగలవన్నది క్యాథలిక్కులకు కాస్త తెలిసిందంటే “వాళ్ళు బైబిలు కోసం పరితపించిపోతారు” అని ఆమె పేర్కొంటోంది.
ఈ మార్పు గురించి యు.ఎస్. క్యాథలిక్ అనే ఒక పత్రిక, బైబిలు అధ్యయన తరగతుల్లో చేరిన క్యాథలిక్కుల గురించి ఒక మతపర విద్యా సమన్వయకర్త “క్యాథలిక్కులుగా వాళ్లు మోసగించబడ్డారు, బైబిల్లో విస్తారమైన సంపదలున్నాయి, వాళ్ళు పొందలేకపోయామనుకున్న ఆ సంపదలో కొంత పొందాలని అనుకుంటున్నారు” అని అన్నాడని పేర్కొంది.
అది సరే, ఇంతకూ ఒక బైబిలు విద్యార్థి కనుగొనాల్సిన “విస్తారమైన సంపదలు” ఏమిటి? ఆలోచించండి: అనుదిన జీవితంలోని చింతలను విజయవంతంగా అధిగమించడమెలాగో మీకు తెలుసుకోవాలనుందా? కుటుంబ జీవితాన్ని శాంతిగా ఎలా గడపాలి? సమాజం నిండా ధిక్కారంతో కూడిన, సంఘవిద్రోహకరమైన ప్రవర్తన ఎందుకుంది? నేటి యువతలో హింసాత్మక ధోరణికి కారణమేమిటి? ఈ ప్రశ్నలకూ, మిమ్మల్ని కలవరపరిచే ఇతర ప్రశ్నలకూ నమ్మదగిన జవాబులు దేవుని వాక్యమైన బైబిల్లో లభిస్తాయి. అవి క్యాథలిక్కులకు లేక ప్రొటెస్టెంట్‌లకు మాత్రమే కాదుగానీ బౌద్ధులకూ, హిందువులకూ, ముస్లిములకూ, షింటోయిస్టులతోపాటు చివరికి నాస్తికులకు అజ్ఞేయతావాదులకు కూడా నిజమైన “విస్తారమైన సంపదలు.” కీర్తనకర్త తెలిపిన విధంగా ‘దేవుని వాక్యం ఆయన పాదములకు దీపము, ఆయన త్రోవకు వెలుగు’ అయినట్లే మీకూ అవగలదు.—కీర్తన 119:105.