కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మీద మీ నమ్మకాన్ని బలపరచుకోండి

యెహోవా మీద మీ నమ్మకాన్ని బలపరచుకోండి

యెహోవా మీద మీ నమ్మకాన్ని బలపరచుకోండి

ఒక హత్యకు పన్నాగం పన్నుతున్నారు. దేశంలోని పెద్ద పెద్ద అధికారులందరూ సమాలోచనచేసి చివరికి ఒక కొత్త చట్టాన్ని ప్రతిపాదించారు. ప్రభుత్వం నిషేధించే ఆరాధనలో ఎవరైనా పాల్గొంటే వారికి మరణశిక్ష విధించాలని వాళ్ళంతా కోరుకున్నారు.

ఇది సుపరిచితమైన విషయంలా ఉందా? చట్టాన్ని ఆసరా చేసుకుని కీడును తలపెట్టే ప్రజల ఉదాహరణలు చరిత్ర నిండా ఉన్నాయి. పైన చెప్పిన సంఘటన పారసీకుల సామ్రాజ్యంలో ప్రవక్తయైన దానియేలు కాలంలో జరిగింది. రాజగు దర్యావేషు విధించిన ఆ చట్టం అమల్లోకి వచ్చింది: “ముప్పది దినములవరకు [రాజు] యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును.”​—⁠దానియేలు 6:​7-9.

అటువంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో దానియేలు ఏం చేస్తాడు? ఆయన తన దేవుడైన యెహోవా మీద నమ్మకంతో కొనసాగుతాడా లేక రాజీపడి రాజు శాసించినట్లే చేస్తాడా? లిఖిత వృత్తాంతం మనకు చెబుతోంది: “ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.” (దానియేలు 6:​10) దాని తర్వాత ఏం జరిగిందన్నది విదితమే. దానియేలు సింహాల బోనులో పడవేయబడతాడు, కాని ఆయన విశ్వాసాన్ని బట్టి యెహోవా ‘సింహముల నోళ్లు మూయించి’ విశ్వసనీయుడైన తన సేవకుడ్ని రక్షిస్తాడు.​—⁠హెబ్రీయులు 11:33; దానియేలు 6:​16-22.

ఆత్మపరిశీలన చేసుకోవడానికి సమయం

నేడు యెహోవా సేవకులు వైరభావంతో నిండిన లోకంలో జీవిస్తున్నారు, తమ భౌతిక ఆధ్యాత్మిక సంక్షేమానికి ముప్పు వాటిల్లే అనేక ప్రమాదాల్ని ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు, అతి క్రూరమైన జాతి విద్వేషాలు పెల్లుబికిన కొన్ని దేశాల్లో అనేకమంది యెహోవాసాక్షులు చంపబడ్డారు. మరికొన్ని చోట్లలో యెహోవాసాక్షులు ఆహార కొరతను, ఆర్థిక సమస్యలను, ప్రకృతి వైపరీత్యాలను, తీవ్రమైన అనారోగ్యాలను, ప్రాణాపాయకరమైన ఇతర పరిస్థితులను ఎదుర్కొన్నారు. అంతేగాక, వాళ్ళు హింసను సహించారు, పనిలో వత్తిడులను, చెడు చేయాలనే వివిధ ప్రలోభాలనూ వాళ్ళు ఎదుర్కోవాల్సివచ్చింది, ఇవన్నీ వారి ఆధ్యాత్మికతకు ప్రమాదకరమైనవే. నిజంగానే, బద్ధశత్రువైన సాతాను యెహోవా సేవకులను ఏ విధంగానైనా సరే నాశనం చేయాలని నిశ్చయించుకున్నాడు.​—⁠1 పేతురు 5:⁠8.

మనం అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఏమి చేయగలం? ప్రాణాపాయాన్ని ఎదుర్కొన్నప్పుడు భయపడడం సహజమే, అయినా అపొస్తలుడైన పౌలు చెప్పిన అభయపూర్వకమైన మాటలను మనం మనసులో పెట్టుకోవచ్చు: “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి​—⁠ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.” (హెబ్రీయులు 13:​5, 6) నేటి తన సేవకుల గురించి యెహోవా అలాగే భావిస్తాడని మనం నమ్మవచ్చు. అయితే, యెహోవా వాగ్దానం గురించి తెలుసుకోవడం వేరు, ఆయన మన తరపున చర్యలు తీసుకుంటాడని నమ్మకం కలిగి ఉండడం వేరు. అందుకే, యెహోవా మీది నమ్మకాన్ని ఏ ఆధారమ్మీద నిర్మిస్తున్నామని పరీక్షించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం, అలాగే ఆ నమ్మకాన్ని బలపరచుకొని కాపాడుకోవడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. మనం అలా చేస్తే, ‘సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకును మన తలంపులకును కావలియుండును.’ (ఫిలిప్పీయులు 4:⁠7) అందువల్ల, మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం స్పష్టంగా ఆలోచించగలం, జ్ఞానయుక్తంగా వ్యవహరించగలం.

యెహోవాను నమ్మడానికి ఆధారం

మన సృష్టికర్తయైన యెహోవాను నమ్మడానికి మనకెన్నో కారణాలున్నాయి. వాటిలో మొదటిది, యెహోవా ప్రేమగల దేవుడు, ఆయన తన సేవకుల పట్ల మనఃపూర్వక శ్రద్ధను చూపిస్తాడన్న వాస్తవం. యెహోవా తన సేవకులపట్ల చూపిన ప్రేమపూర్వక శ్రద్ధకు లెక్కలేనన్ని ఉదాహరణలు బైబిల్లో నమోదు చేయబడి ఉన్నాయి. తాను ఎన్నుకొన్న ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఆయన వ్యవహరించిన విధానాన్ని వర్ణిస్తూ మోషే వ్రాశాడు: “అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను.” (ద్వితీయోపదేశకాండము 32:​10) ఆధునిక కాలాల్లో కూడా, గుంపుగానూ ఒక్కొక్క వ్యక్తిగానూ రెండు విధాలుగా యెహోవా తన సేవకుల పట్ల నిరంతరం మంచి శ్రద్ధ చూపిస్తున్నాడు. ఉదాహరణకు, బోస్నియాలో అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు కొందరు యెహోవాసాక్షులకు తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది, క్రోయేషియా, ఆస్ట్రియాలలోని సహోదరులు చాలా ప్రమాదకరమైన ప్రాంతంగుండా ప్రాణాలకు తెగించి మరీ ప్రయాణం చేసిన ధైర్యవంతమైన ప్రయత్నాలద్వారా బోస్నియాలోని సహోదరులకు అవసరమైన వస్తువులను అందజేసేలా యెహోవా చూశాడు. *

యెహోవా దేవుడు సర్వాధికారి కాబట్టి, తన సేవకులు ఎట్టి పరిస్థితుల్లోవున్నా వారిని రక్షించే శక్తి ఆయనకుందనడంలో సందేహం లేదు. (యెషయా 33:​22; ప్రకటన 4:⁠8) కానీ యెహోవా తన సేవకులను కొందరిని, తాము విశ్వసనీయులమని రుజువుపరచుకోవడానికి వారిని చివరికి మరణాన్ని ఎదుర్కునేంత వరకు అనుమతించినప్పటికీ, వారు తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆయన వారిని బలపరుస్తాడు సహాయం చేస్తాడు, వారు చివరి వరకు స్థిరంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలిగేలా శక్తినిస్తాడు. ఆ కారణంగా, కీర్తనకర్తలాగే మనం కూడా ప్రగాఢవిశ్వాసాన్ని కలిగి ఉండగలం: “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను . . . మనము భయపడము.”​—⁠కీర్తన 46:1-3.

యెహోవా సత్యానికి దేవుడని కూడా బైబిలు తెలియజేస్తోంది. అంటే ఆయన తాను చేసే వాగ్దానాలను నెరవేరుస్తాడని దానర్థం. వాస్తవానికి బైబిలు ఆయనను “అబద్ధమాడనేరని దేవుడు” అని వర్ణించింది. (తీతు 1:​2-4) యెహోవా తన సేవకులను కాపాడ్డానికి ఆపదల్లోనుండి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటానని ఎన్నోసార్లు చూపించాడు కాబట్టి, మనం ఆయన కేవలం వాగ్దానాలను నెరవేర్చగలడు అని మాత్రమే కాదు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడని కూడా దృఢనిశ్చయం కలిగి ఉండగలం.​—⁠యోబు 42:⁠2.

మన నమ్మకాన్ని బలపరచుకోవడానికి మార్గాలు

మనం యెహోవాను నమ్మడానికి అనేక కారణాలున్నప్పటికీ, మనం ఎల్లప్పుడూ ఆయన మీద నమ్మకం ఉంచుకుంటామని అనుకోవద్దు. ఎందుకంటే, సాధారణంగా లోకానికి దేవుని మీది విశ్వాసం చాలా తక్కువుంది, అలాంటి ధోరణి యెహోవా మీది మన నమ్మకాన్ని చాలా సులభంగా బలహీనపరుస్తుంది. ఆ కారణంగా, మన నమ్మకాన్ని బలపరచుకోవడానికీ, కాపాడుకోవడానికీ మనం పట్టుదలతో ప్రయత్నించాలి. ఈ విషయం యెహోవాకు బాగా తెలుసు, మనమలా చేయడానికి కావలసిన మార్గాలను ఆయన ఏర్పాటు చేశాడు.

మొట్టమొదటిగా, ఆయన తన వాక్యమైన బైబిలును అందించాడు, అందులో ఆయన తన సేవకుల పక్షాన చేసిన లెక్కలేనన్ని చర్యలు నమోదు చేయబడ్డాయి. కేవలం పేరు మాత్రం తెలిసిన ఒక వ్యక్తి మీద మీకు ఎంత నమ్మకముండగలదో ఒకసారి ఆలోచించండి? నమ్మకమున్నా బహుశా చాలా తక్కువగా ఉండవచ్చు. ప్రగాఢ నమ్మకముండాలంటే ఆ వ్యక్తి కార్యాలు చేసే విధానం గురించీ ఆయన చేసిన కార్యాల గురించీ మీకు తెలిసుండాలి, కాదంటారా? అలాంటి బైబిలు వృత్తాంతాలను చదివి ధ్యానించడం వల్ల మనలో యెహోవా గురించిన పరిజ్ఞానమూ, ఆయన వ్యవహరించే అద్భుతమైన విధానాల గురించిన పరిజ్ఞానమూ అధికమవుతుంది, ఆయన నమ్మతగినవాడనే గ్రహింపు అంతకంతకూ పెరుగుతుంది. ఆ విధంగా ఆయన మీద మన నమ్మకం బలపడుతుంది. కీర్తనకర్త దేవునికి చేసిన హృదయపూర్వకమైవ ప్రార్థనలో ఇలా అనడం ద్వారా చాలా చక్కని మాదిరుంచాడు: “యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును.”​—⁠కీర్తన 77:​11, 12.

మనకు బైబిలుతోపాటు, యెహోవా సంస్థ ద్వారా ఉత్పత్తి చేయబడుతున్న బైబిలు ఆధారిత ప్రచురణల్లో సమృద్ధికరమైన ఆధ్యాత్మిక ఆహారం ఉంది. ఈ ప్రచురణల్లో ఆయన ఆధునిక కాలపు సేవకుల ఉత్తేజపరిచే వృత్తాంతాలు తరచుగా ఉంటాయి, తన సేవకులు క్లిష్ట పరిస్థితుల్లో పడ్డప్పుడు యెహోవా వారికి సహాయాన్నీ ఉపశమనాన్నీ ఎలా అందజేయగలిగాడో ఆ వృత్తాంతాలు తెలుపుతాయి. ఉదాహరణకు మార్టిన్‌ పోయెట్‌జింగర్‌, యెహోవాసాక్షుల పరిపాలక సభలో సభ్యుడవడానికి ముందు, తన స్వదేశానికి దూరంగా ఐరోపా ప్రాంతంలో పయినీరు సేవ చేస్తున్నప్పుడు చాలా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. అప్పుడాయన దగ్గర డబ్బుల్లేవు, ఆయనను చూడ్డానికి ఏ డాక్టరూ ముందుకు రాలేదు. కానీ యెహోవా ఆయనను వదిలిపెట్టలేదు. చివరికి, స్థానిక హాస్పిటల్లోని ఒక సీనియర్‌ డాక్టర్‌ను సంప్రదించడం జరిగింది. ఆ దయగల వ్యక్తి బైబిలు మీద దృఢ విశ్వాసమున్న వాడవడం వల్ల, సహోదరుడు పోయెట్‌జింగర్‌ను తన కొడుకును చూసినట్టు చూసుకున్నాడు, అదీ ఉచితంగానే. అలాంటి జీవిత కథలను చదివితే మన పరలోకపు తండ్రి మీద మనకున్న నమ్మకాన్ని అవి తప్పకుండా బలపరుస్తాయి.

ఆయన మీది మన నమ్మకాన్ని బలపర్చుకోడానికి యెహోవా అందిస్తున్న మరొక వెలకట్టలేని సహాయకం ప్రార్థన, అది అమూల్యమైన ఆధిక్యత. అపొస్తలుడైన పౌలు మనకు ప్రేమపూర్వకంగా చెబుతున్నాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.” (ఫిలిప్పీయులు 4:⁠6) “ప్రతి విషయము” అన్నప్పుడు మన భావాలు, అవసరాలు, భయాలు, చింతలు అన్నీ వస్తాయి. మన ప్రార్థనలు ఎంత తరచుగా ఎంత హృదయపూర్వకంగా ఉంటాయో, యెహోవా మీది మన నమ్మకం అంత బలంగా ఉంటుంది.

యేసు క్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు, ప్రార్థనకు భంగం కలగకూడదని ఆయన కొన్నిసార్లు ఏకాంత స్థలానికి వెళ్ళి ప్రార్థించేవాడు. (మత్తయి 14:23; మార్కు 1:​35) ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముందు ఆయన తన తండ్రికి ప్రార్థిస్తూ రాత్రంతా కూడా గడిపేవాడు. (లూకా 6:​12, 13) ఎవరి మీదకూ రానంతటి అతి దారుణమైన శోధనను సహించగలిగేంత బలమైన నమ్మకం యేసుకు యెహోవా మీద ఉండడం అంత ఆశ్చర్యపర్చాల్సిన విషయమేమీ కాదు. హింసాకొయ్య మీదున్నప్పుడు ఆయన చివరి మాటలివి: “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను.” ప్రగాఢవిశ్వాసాన్ని వ్యక్తపరిచే ఆ మాటలు, ఆయనను రక్షించడానికి యెహోవా మధ్యలో కలుగజేసుకోకున్నా చివరి వరకు తండ్రిమీద ఆయన నమ్మకం చెక్కుచెదరలేదన్నది స్పష్టం చేశాయి.​—⁠లూకా 23:​46.

యెహోవా మీద మన నమ్మకాన్ని బలపరచుకోవడానికి మరొక మార్గం, ఆయనను సంపూర్ణంగా నమ్మేవారితో క్రమబద్ధమైన సహవాసం. తన గురించి ఎక్కువగా తెలుసుకోవడానికీ, ఒకర్నొకరు ప్రోత్సహించుకోవడానికీ క్రమంగా కూడుకొమ్మని యెహోవా తన ప్రజలను ఆజ్ఞాపించాడు. (ద్వితీయోపదేశకాండము 31:12; హెబ్రీయులు 10:​24, 25) అటువంటి సహవాసం యెహోవా మీది వారి నమ్మకాన్ని బలపరిచింది, విశ్వాసానికి ఎదురయ్యే విషమమైన పరీక్షలను సహించగలిగేలా చేసింది. ప్రకటనా పని నిషేధించబడిన ఒక ఆఫ్రికా దేశంలో, యెహోవా సాక్షులకు పోలీసు సంరక్షణ, ప్రయాణ సంబంధిత పత్రాలు, పెళ్ళి సర్టిఫికెట్లు, ఆస్పత్రుల్లో వైద్యం, చివరికి ఉద్యోగాలు కూడా లేకుండా చేశారు. ఆ ప్రాంతంలో అంతర్యుద్ధం మొదలైనప్పుడు, అక్కడికి దగ్గర్లోనే ఉన్న సంఘములోని, పిల్లలతో కలిపి 39 మంది సభ్యులు తమ పట్టణంలో బాంబులదాడినుంచి తప్పించుకోవడం కోసం మరుభూమిలోని ఒక వంతెన క్రింద దాదాపు నాలుగు నెలలపాటు తలదాచుకున్నారు. అటువంటి దుర్లభమైన పరిస్థితుల్లో వారికి బైబిలు లేఖనాల ప్రతిదిన చర్చ, ఇతర కూటాలు ఎంతో బలాన్నిచ్చాయి. ఆ విధంగా వాళ్ళు లోపరహితమైన తమ ఆధ్యాత్మికత సహాయంతో విషమ పరీక్షలను కూడా తట్టుకోగలిగారు. ఈ అనుభవం యెహోవా ప్రజలతో క్రమంగా కలుసుకోవడంలో ఉన్న విలువను స్పష్టంగా చూపిస్తోంది.

చివరిగా, యెహోవా మీది మన నమ్మకాన్ని బలపరచుకోవడానికి రాజ్య ప్రకటనా పనిలో మనం చురుగ్గా పాల్గొనాలి, సువార్తను ఇతరులతో పంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. కెనడాలోని ఉత్సాహవంతురాలైన ఒక యువ ప్రచారకురాలి కదిలింపజేసే అనుభవంలో ఇది స్పష్టమైంది. చికిత్స చేయలేని లుకేమియాతో బాధపడుతున్న ఆమె తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పటికీ, తాను క్రమ పయినీరు అంటే, పూర్తికాల సేవకురాలు కావాలనుకుంది. మధ్యలో కొన్ని రోజులు ఆరోగ్యం కాస్త కుదురుగా ఉండడంతో, ఆమె సహాయ పయినీరుగా ఒక నెల పరిచర్య చేయగలిగింది. తర్వాత ఆమె పరిస్థితి విషమించి కొన్ని నెలలకు మరణించింది. అయితే, ఆమె చివరి వరకూ ఆధ్యాత్మికంగా బలంగా నిలబడింది, యెహోవా మీది ఆమె నమ్మకం ఒక్క క్షణం కూడా సడలిపోలేదు. వాళ్ళ అమ్మ జ్ఞాపకం చేసుకుంటూ అన్నది: “చివరి వరకు ఆమె తనకంటే ఇతరుల గురించే ఎక్కువగా ఆలోచించేది. ఆమె వాళ్ళను బైబిలు అధ్యయనం చేయమని ప్రోత్సహించేది, ‘మనం పరదైసులో కలుసుకుంటాం’ అని వాళ్ళతో చెప్పేది.”

యెహోవా మీది మన నమ్మకాన్ని నిరూపించుకోవడం

“ప్రాణము లేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.” (యాకోబు 2:​26) యెహోవా మీది విశ్వాసం గురించి యాకోబు అన్న ఆ మాటలు యెహోవా మీది మన నమ్మకానికి కూడా వర్తిస్తాయి. యెహోవా మీద నాకు నమ్మకముంది అని మనమెంత చెప్పినా, దాన్ని మన క్రియల్లో చూపించకపోతే అది నిరర్థకమే. అబ్రాహాము యెహోవాను గాఢంగా నమ్మాడు, ఆయన ఆజ్ఞలను మరో తలంపు లేకుండా శిరసావహించడం ద్వారా ఆ నమ్మకాన్ని నిరూపించాడు. చివరికి తన కుమారుడు ఇస్సాకును బలిగా ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అటువంటి సాటిలేని నమ్మకం, విధేయతల మూలంగా అబ్రాహాము యెహోవా స్నేహితుడిగా పేరుగాంచాడు.​—⁠హెబ్రీయులు 11:​8-10, 17-19; యాకోబు 2:​23.

యెహోవా మీద మనకున్న నమ్మకాన్ని చూపించడానికి కఠినమైన శోధన కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. యేసు తన శిష్యులకు చెప్పాడు: “మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.” (లూకా 16:​10) మన దినచర్యలన్నింటిలోనూ యెహోవా మీద నమ్మకముంచడం నేర్చుకోవాలి, చాలా అల్పమైనవనిపించిన వాటిలో కూడా విధేయత చూపాలి. అలా విధేయతగా ఉండడంవల్ల వచ్చే ప్రయోజనాలను మనం గమనించినప్పుడు మన పరలోక తండ్రిమీది నమ్మకం బలపడుతుంది, తీవ్రమైన లేక భయంకరమైన కష్టాలను కూడా ఎదుర్కొనగలిగేలా చేస్తుంది.

లోకం ఘోరమైన అంతానికి దగ్గరవుతుండగా యెహోవా ప్రజలు అనేక శ్రమలనూ ఆపదలనూ నిశ్చయంగా అనుభవిస్తారు. (అపొస్తలుల కార్యములు 14:​22; 2 తిమోతి 3:​12) యెహోవా మీది నమ్మకాన్ని దృఢంగానూ, గాఢంగానూ నిర్మించుకోవడం ద్వారా, మనం మహా శ్రమగుండా జీవముతోనైనా లేక పునరుత్థానం పొందడంద్వారానైనా ఆయన వాగ్దానం చేసిన నూతన లోకంలోకి రక్షింపబడతామని ఆశించవచ్చు. (2 పేతురు 3:​13) యెహోవాతో మనకున్న అమూల్యమైన సంబంధానికి హాని కలిగించేటువంటి ఏ అపనమ్మకమూ మనలో కలుగకుండా చూసుకుందాం. అప్పుడు, సింహాలనుంచి తప్పించబడిన తర్వాత దానియేలు గురించి చెప్పబడిన ఈ మాటలే మన గురించీ చెప్పబడతాయి: “దానియేలు తన దేవున్ని విశ్వసించిన కారణంగా, అతనికి సింహాలవల్ల ఎలాంటి హాని జరుగలేదు.”​—⁠దానియేలు 6:​23, పరిశుద్ధ బైబల్‌.

[అధస్సూచి]

^ పేరా 9 వివరాలకు కావలికోట, నవంబరు 1, 1994, 23-27 పేజీలు చూడండి.

[9వ పేజీలోని చిత్రం]

మార్టిన్‌ పొయెట్‌జింగర్‌లాంటి యథార్థవంతులైన యెహోవా సేవకుల వృత్తాంతాలను చదవడం నమ్మకాన్ని బలపరుస్తుంది