కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అదృశ్యుడైన వానిని చూస్తున్నట్టు స్థిరబుద్ధిగలవారై ఉండండి!

అదృశ్యుడైన వానిని చూస్తున్నట్టు స్థిరబుద్ధిగలవారై ఉండండి!

అదృశ్యుడైన వానిని చూస్తున్నట్టు స్థిరబుద్ధిగలవారై ఉండండి!

“విశ్వాసమునుబట్టి [మోషే] అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై [ఉండెను].” ​—⁠హెబ్రీయులు 11:⁠27.

1. యేసు కొండమీది ప్రసంగంలో దేవుని గురించి ఏ గమనార్హమైన వ్యాఖ్యానాన్ని చేశాడు?

యెహోవా అదృశ్య దేవుడు. మోషే ఆయన మహిమను చూడాలని కోరుకున్నప్పుడు యెహోవా ఇలా జవాబిచ్చాడు: “నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుక[డు].” (నిర్గమకాండము 33:​20) అంతేగాక అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు.” (యోహాను 1:​18) యేసుక్రీస్తు మానవునిగా భూమ్మీద ఉన్నప్పుడు ఆయన కూడా దేవుణ్ణి చూడలేకపోయాడు. అయితే, కొండమీది ప్రసంగంలో యేసు ఇలా అన్నాడు: “హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.” (మత్తయి 5:⁠8) అలా అనడంలో యేసు ఉద్దేశం ఏమిటి?

2. మనం దేవుణ్ణి మన భౌతిక కళ్ళతో ఎందుకు చూడలేకపోతున్నాము?

2 యెహోవా ఒక అదృశ్య ఆత్మ అని లేఖనాలు చెప్తున్నాయి. (యోహాను 4:​24; కొలొస్సయులు 1:​15; 1 తిమోతి 1:​17) కాబట్టి మానవులమైన మనం యెహోవాను మన భౌతిక కళ్ళతో చూడగలమని యేసు చెప్పడం లేదు. నిజమే, అభిషిక్త క్రైస్తవులు ఆత్మ ప్రాణులుగా పునరుత్థానం చేయబడినప్పుడు వారు పరలోకంలో యెహోవా దేవుణ్ణి చూస్తారు. కానీ “హృదయశుద్ధి” కలిగివుండి, భూమ్మీద నిరంతరం జీవించాలనే నిరీక్షణ గలవారు కూడా దేవుణ్ణి ‘చూడ’ గలుగుతున్నారు. అదెలా సాధ్యం?

3. మానవులు దేవుని లక్షణాల్లో కొన్నింటిని ఎలా గ్రహించగలరు?

3 యెహోవా సృష్టించిన వాటిని గమనించడం ద్వారా మనం యెహోవాను గురించి కొంత నేర్చుకుంటాం. తద్వారా మనం ఆయన శక్తిని గ్రహించి విస్మయం చెందుతాం, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు అని గుర్తించేలా కదిలించబడతాం. (హెబ్రీయులు 11:3; ప్రకటన 4:​10, 11) దానికి సంబంధించి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “[దేవుని] అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి.” (రోమీయులు 1:​20) కాబట్టి దేవుణ్ణి చూడడం గురించిన యేసు మాటలకుగల భావంలో, యెహోవా లక్షణాల్లో కొన్నింటిని గ్రహించే సామర్థ్యం చేరివుంది. ఆ విధంగా చూడడం అనేది ఖచ్చితమైన పరిజ్ఞానంపై ఆధారపడివుంటుంది, అది “మనోనేత్రముల”తో ఆధ్యాత్మికంగా వివేచించడమై ఉంది. (ఎఫెసీయులు 1:​17) యేసు మాటలు క్రియలు కూడా దేవుని గురించి ఎంతో వెల్లడిచేస్తాయి. అందుకనే యేసు ఇలా అన్నాడు: “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు.” (యోహాను 14:⁠9) యేసు యెహోవా వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబించాడు. అందుకనే యేసు జీవితాన్ని గురించిన ఆయన బోధలను గురించిన పరిజ్ఞానం దేవుని లక్షణాల్లో కొన్నింటిని చూసేందుకు, లేక గ్రహించేందుకు మనకు సహాయం చేయగలదు.

ఆధ్యాత్మికత కీలకం

4. ఆధ్యాత్మిక శూన్యత నేడు అనేకమందిలో ఎలా ప్రదర్శితమౌతోంది?

4 నేడు, విశ్వాసము వాస్తవమైన ఆధ్యాత్మికత నిజంగానే చాలా అరుదైపోయాయి. “విశ్వాసము అందరికి లేదు” అన్నాడు పౌలు. (2 థెస్సలొనీకయులు 3:⁠2) చాలామంది తమ వ్యక్తిగత వ్యాపకాల్లో పూర్తిగా నిమగ్నమైపోయారు, వారికి దేవునిపై విశ్వాసం లేదు. వారి పాపభరిత ప్రవర్తనవల్ల, ఆధ్యాత్మికత లేకపోవడంవల్ల, వారు ఆయనను వివేచనా కన్నులతో చూడలేకపోతున్నారు, ఎందుకంటే అపొస్తలుడైన యెహాను ఇలా వ్రాశాడు: “కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.” (3 యోహాను 11) అటువంటి వ్యక్తులు తమ భౌతిక కళ్ళతో దేవుణ్ణి చూడరు గనుక, ఆయన తాము చేసేవాటిని చూడడన్నట్లు వారు ప్రవర్తిస్తుంటారు. (యెహెజ్కేలు 9:⁠9) ఆధ్యాత్మిక విషయాల్ని వారు చిన్నచూపు చూస్తుంటారు, ఆ కారణంగా వారు “దేవునిగూర్చిన విజ్ఞానము” సంపాదించుకోలేకపోతారు. (సామెతలు 2:⁠5) అందుకే యుక్తమైన రీతిలోనే పౌలు ఇలా వ్రాశాడు: “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.”​—⁠1 కొరింథీయులు 2:⁠14.

5. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని కేంద్రీకరించే ప్రజలకు ఏ వాస్తవాన్ని గురించిన స్పృహ ఉంటుంది?

5 అయితే మనం ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని కేంద్రీకరించినప్పుడు, యెహోవా లోపాలెన్నే దేవుడు కాకపోయినా మనం చెడు తలంపులను కోరికలను అనుసరించి చర్యలు తీసుకున్నప్పుడు ఆయనకు తెలుస్తుందన్న స్పృహ మనకు నిరంతరం ఉంటుంది. నిజానికి, “నరుని మార్గములను యెహోవా యెరుగును, వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.” (సామెతలు 5:​21) మనం ఆయన్ను ప్రేమిస్తాము కాబట్టి, ఆయన్ను నొప్పించడానికి ఇష్టపడము కాబట్టి, మనం పాపం ఉరిలో చిక్కుకుపోయినట్లైతే పశ్చాత్తాపపడి, యెహోవా క్షమాపణను అర్థించేందుకు కదిలించబడాలి.​—⁠కీర్తన 78:​41; 130:⁠3.

మనల్ని స్థిరబుద్ధి గలవారిగా చేసేదేమిటి?

6. స్థిరబుద్ధిగలవారై ఉండడం అంటే ఏమిటి?

6 యెహోవా మన కళ్ళకు అదృశ్యుడే అయినా మనం ఆయనకు కనబడుతున్నామని ఎల్లప్పుడు గుర్తుంచుకుందాం. ఆయన ఉనికిని గురించిన స్పృహ, తనకు మొఱ్ఱపెట్టే వారికందరికీ ఆయన సమీపంగా ఉన్నాడన్న దృఢ నమ్మకం, మనం స్థిరబుద్ధి గలవారిగా అయ్యేలా చేస్తాయి​—⁠ఆయనపట్ల మన విశ్వాసంలో స్థిరంగాను, తొణకకుండాను ఉండేలా చేస్తాయి. (కీర్తన 145:​18) మనమూ మోషేలా ఉండగలం, ఆయన గురించి పౌలు ఇలా వ్రాశాడు: “విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.”​—⁠హెబ్రీయులు 11:⁠27.

7, 8. ఫరో ఎదుట మోషేకు ధైర్యాన్నిచ్చినదేమిటి?

7 ఇశ్రాయేలీయులను ఐగుప్తులోని దాసత్వం నుండి బయటికి నడిపించాలని దేవుడిచ్చిన నియామకాన్ని నిర్వర్తించడంలో భాగంగా, మోషే ఎన్నోసార్లు మతాధినేతలు సైనికాధికారులు బారులు తీరివున్న రాజాస్థానంలో నిరంకుశుడైన ఫరో ఎదుట హజరయ్యాడు. బహుశ ఆ రాజాస్థానం గోడల వెంబడి వరుసగా విగ్రహాలు ఉండివుండవచ్చు. కానీ నిర్జీవ ఐగుప్తు దేవుళ్ళను సూచిస్తున్న విగ్రహాలన్నిటికీ భిన్నంగా యెహోవా అదృశ్యుడైనప్పటికీ, మోషేకు ఆయన ఎంతో వాస్తవిక వ్యక్తిగా ఉన్నాడు. ఫరోను చూసి మోషే భయపడకపోవడంలో ఆశ్చర్యపోవల్సిందేమీ లేదు మరి!

8 ఫరో ఎదుట మళ్ళీ మళ్ళీ హాజరుకావడానికి మోషేకు ధైర్యాన్నిచ్చిందేమిటి? “మోషే భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు” అని లేఖనాలు మనకు చెబుతున్నాయి. (సంఖ్యాకాండము 12:⁠3) స్పష్టంగా, మోషేకున్న బలమైన ఆధ్యాత్మికత, దేవుడు తనతో ఉన్నాడన్న సంపూర్ణ నమ్మకం ఆయనకు, కర్కశుడైన ఐగుప్తు రాజు ఎదుట “అదృశ్యుడైనవాని”కి ప్రాతినిధ్యం వహించేందుకు అవసరమయ్యే శక్తినిచ్చాయి. అదృశ్యుడైన దేవుణ్ణి “చూసే” వారు, నేడు ఆయన మీద తమకున్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్న కొన్ని మార్గాలేవి?

9. మనం స్థిరబుద్ధి గలవారమై ముందుకు కొనసాగగల్గే ఒక మార్గం ఏమిటి?

9 విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, అదృశ్యుడైనవానిని చూస్తున్నట్లుగా స్థిరబుద్ధి గలవారమై ముందుకు కొనసాగడానికి ఒక మార్గం ఏమిటంటే హింసలు ఉన్నప్పటికీ ధైర్యంగా ప్రకటించడమే. “నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు” అని యేసు తన శిష్యులను హెచ్చరించాడు. (లూకా 21:​17) ఆయన వారికిలా కూడా చెప్పాడు: “దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు [కాడు] . . . లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు.” (యోహాను 15:​20) యేసు చెప్పిన మాటలు పొల్లుపోకుండా నెరవేరాయి, ఆయన చనిపోయిన అనతి కాలానికే ఆయన శిష్యులు బెదిరింపులు, నిర్బంధాలు, దెబ్బలు వంటి హింసల్ని ఎదుర్కొన్నారు. (అపొస్తలుల కార్యములు 4:​1-3, 18-21; 5:​17, 18, 40) హింసలు ఉప్పెనలా మీదపడినప్పటికీ యేసు అపొస్తలులూ మరితర శిష్యులూ సువార్తను ధైర్యంగా ప్రకటిస్తూనే కొనసాగారు.​—⁠అపొస్తలుల కార్యములు 4:​29-31.

10. యెహోవా కాపుదలలో నమ్మకముంచడం పరిచర్యలో మనకెలా సహాయపడగలదు?

10 మోషేలానే, యేసు తొలి శిష్యులు కూడా కట్టెదుట కనబడుతున్న తమ శత్రువుల్ని చూసి బెదిరిపోలేదు. యేసు శిష్యులకు దేవునిమీద విశ్వాసం ఉంది, దాని ఫలితంగా వారు తామనుభవించిన కఠోరమైన హింసల్ని సహించగలిగారు. అవును, వారు అదృశ్యుడైనవానిని చూస్తున్నట్లుగా స్థిరబుద్ధి గలవారై ముందుకు కొనసాగారు. యెహోవా కాపుదల మనపై నిరతమూ నిలిచివుంటుందన్న గ్రహింపు మనకు ధైర్యాన్నిస్తుంది, నిర్భీతిగా మనో నిబ్బరంతో రాజ్య ప్రకటనా పనిలో కొనసాగేలా చేస్తుంది. “భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును” అని దేవుని వాక్యం చెబుతోంది. (సామెతలు 29:​25) అందుకే, మనం హింసలు వస్తాయన్న భయంతో వెనక్కు తగ్గము, అదే సమయంలో మన పరిచర్య విషయంలో సిగ్గూ పడము. మనం మన పొరుగువారికి, తోటి పనివారికి, తోటి విద్యార్థులకు, మరితరులకు ధైర్యంగా సాక్ష్యాన్నిచ్చేందుకు మన విశ్వాసం మనల్ని పురికొల్పుతుంది.​—⁠రోమీయులు 1:​14-16.

అదృశ్యుడైనవాడు తన ప్రజల్ని నడిపిస్తాడు

11. పేతురు యూదాలు వ్రాసినదాని ప్రకారం, క్రైస్తవ సంఘంతో సహవసించే కొందరు తమకు ఆధ్యాత్మికత కొరవడిందని ఎలా చూపించుకున్నారు?

11 యెహోవాయే తన భూ సంస్థను నడిపిస్తున్నాడని గ్రహించడానికి విశ్వాసం మనకు సహాయం చేస్తుంది. తద్వారా మనం, సంఘంలోని బాధ్యతల్ని తమ భుజస్కంధాలపై మోస్తున్న వారిపట్ల విమర్శనాత్మక దృక్కోణాన్ని కలిగివుండము. అటు అపొస్తలుడైన పేతురు, ఇటు యేసు మారుటి సహోదరుడైన యూదా, ఆధ్యాత్మికత తీవ్రంగా కొరవడిన కొందరి గురించి హెచ్చరించారు. వీరు క్రైస్తవుల్లో నాయకత్వం వహిస్తున్న పురుషులను గురించి దూషణకరంగా మాట్లాడారు. (2 పేతురు 2:​9-12; యూదా 8) ఇతర్లలో లోపాలెన్నే ఇలాంటి వ్యక్తులు, యెహోవా సమక్షంలో ఉన్నట్లైతే, ఒకవేళ ఆయన తమ కంటికి కనబడుతున్నట్లైతే ఆ విధంగా మాట్లాడేవాళ్ళా? నోరు పెగలివుండేది కాదు! కానీ దేవుడు అదృశ్యుడు గనుక, ఆ శరీరానుసారులు తాము ఆయనకు జవాబుదారులమన్న విషయాన్ని మర్చిపోయారు.

12. సంఘంలో నాయకత్వం వహిస్తున్న వారిపట్ల మనం ఎటువంటి దృక్కోణాన్ని ప్రదర్శించాలి?

12 నిజమే, క్రైస్తవ సంఘం అపరిపూర్ణ మనుష్యులతో రూపొందింది. పెద్దలుగా సేవచేసేవారు పొరబాట్లు చేస్తుంటారు, కొన్నిసార్లు వాటి మూలంగా వ్యక్తిగతంగా మనపై ప్రభావం పడుతుండవచ్చు. అయినప్పటికీ, యెహోవా అటువంటి పురుషుల్ని తన మందకు కాపరులుగా ఉపయోగించుకుంటున్నాడు. (1 పేతురు 5:​1, 2) ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని కేంద్రీకరించే స్త్రీపురుషులు యెహోవా తన ప్రజల్ని నడిపించే విధానాల్లో ఇది ఒకటని గుర్తిస్తారు. అందుకని క్రైస్తవులుగా మనం విమర్శనాత్మకమైన స్ఫూర్తిని, ఫిర్యాదులు చేసే స్ఫూర్తిని విడనాడి దేవుడు తన ప్రజల్ని నడిపించేందుకు చేసిన ఏర్పాట్లపట్ల మన గౌరవాన్ని ప్రదర్శిద్దాం. మన మధ్య నాయకత్వం వహిస్తున్న వారికి విధేయతగా ఉండడం ద్వారా మనం అదృశ్యుడైన వానిని చూస్తున్నామని చూపిస్తాము.​—⁠హెబ్రీయులు 13:⁠17.

దేవుణ్ణి మన మహా గొప్ప ఉపదేశకునిగా చూడడం

13, 14. యెహోవాను మహా ఉపదేశకునిగా దృష్టించడం అంటే మన విషయంలో దానర్థం ఏమిటి?

13 ఆధ్యాత్మిక గ్రహణశక్తి అవసరమయ్యే రంగం మరొకటి ఉంది. యెషయా ఇలా ప్రవచించాడు: “మీ ఉపదేశకుని మీరు మీ కళ్లారా చూస్తారు.” (యెషయా 30:​20, పరిశుద్ధ బైబల్‌) తన భూసంస్థ ద్వారా మనకు బోధించేది యెహోవాయేనని గుర్తించడానికి మనకు విశ్వాసం అవసరమౌతుంది. (మత్తయి 24:​45-47) దేవుణ్ణి మన మహా ఉపదేశకునిగా దృష్టించడం అంటే, మంచి బైబిలు అధ్యయన అలవాట్లు కలిగివుండడం, క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరుకావడం వంటివి మాత్రమే కాదు. దేవుడు చేసే ఆధ్యాత్మిక ఏర్పాట్ల నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందడం అని దానర్థం. ఉదాహరణకు, మనం ఆధ్యాత్మికంగా దూరంగా కొట్టుకొనిపోకుండా ఉండేందుకు, యెహోవా యేసు ద్వారా అందజేసే నడిపింపుపై విశేష శ్రద్ధను కనపర్చాల్సిన అవసరం ఉంది.​—⁠హెబ్రీయులు 2:⁠1.

14 కొన్నిసార్లు ఆధ్యాత్మిక ఆహారం నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి ఎంతో ప్రత్యేకమైన కృషి అవసరం అవుతుంది. ఉదాహరణకు, మనం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్న కొన్ని బైబిలు వృత్తాంతాలను పైపైన మాత్రమే చూసి పేజీలు తిరగేసేసే అలవాటు మనకు ఉండవచ్చు. కావలికోట, తేజరిల్లు! పత్రికలను చదివేటప్పుడు చివరికి మనం కొన్ని ఆర్టికల్‌లను చదవకుండానే విడిచిపెట్టేస్తుండవచ్చు. దానికి కారణం, ఆయా విషయాంశాలపై మనకు అంతగా ఆసక్తి లేకపోవడమే కావచ్చు. లేక, క్రైస్తవ కూటాల్లో మన మనస్సులు అటూ ఇటూ వెళ్ళేందుకు అనుమతిస్తుండవచ్చు. అయితే, అక్కడ చర్చించబడుతున్న అంశాలను మనం జాగ్రత్తగా వింటూ మనలో మనం తర్కించుకుంటూ ఉంటే మన శ్రద్ధ మళ్ళకుండా ఉంటుంది. మనం పొందే ఆధ్యాత్మిక ఉపదేశం పట్ల మనకుండే ప్రగాఢమైన మెప్పుదల మనం యెహోవాను మన మహా ఉపదేశకునిగా గుర్తిస్తున్నామని చూపిస్తుంది.

మనం లెక్క ఒప్పజెప్పాల్సి ఉంది

15. తాము యెహోవాకు కనిపించము అన్నట్లుగా కొందరు ఎలా ప్రవర్తించారు?

15 ప్రత్యేకంగా ఈ “అంత్యకాలము”లో దుష్టత్వం ఇంతగా ఎక్కువైపోయింది గనుక అదృశ్యుడైన వానిపై విశ్వాసం ఉంచడం ఎంతో ఆవశ్యకం. (దానియేలు 12:⁠4) మోసం, లైంగిక అనైతికత సర్వవ్యాప్తమై ఉన్నాయి. అయితే, మనల్ని మనుష్యులు చూడలేనప్పుడు కూడా యెహోవా మన చర్యల్ని గమనిస్తాడని గుర్తుంచుకోవడం ఎంతో జ్ఞానయుక్తం. కొందరు ఈ విషయాన్ని మర్చిపోయారు. వారు తమను ఎవరూ చూడనప్పుడు లేఖన విరుద్ధంగా ప్రవర్తిస్తుండవచ్చు. ఉదాహరణకు కొందరు, ఇంటర్నెట్‌, టీవీ, ఇంకా ఇతర ఆధునిక టెక్నాలజీ ఉత్పాదనల ద్వారా హానికరమైన వినోద కార్యక్రమాల్నీ అశ్లీలతనూ చూడాలన్న శోధనను నిరోధించుకోలేకపోయారు. అటువంటి వాటిని చేయడం ఏకాంతంగా ఉన్నప్పుడు జరుగుతుంది కాబట్టి, కొందరు తమ ప్రవర్తన యెహోవాకు కనిపించదన్నట్లు నడుచుకున్నారు.

16. యెహోవా యొక్క అత్యున్నతమైన ప్రమాణాలకు విధేయంగా ఉండడానికి మనకేమి సహాయం చేయాలి?

16 అపొస్తలుడైన పౌలు వ్రాసిన ఈ మాటల్ని మనస్సులో ఉంచుకోవడం మంచిది: “మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.” (రోమీయులు 14:​12) మనం పాపం చేసిన ప్రతీసారి యెహోవాకు విరుద్ధంగా పాపం చేస్తున్నామని గ్రహించవలసిన అవసరం ఉంది. ఇది తెలుసుకుని ఉండడం, మనం అత్యున్నతమైన ఆయన ప్రమాణాలకు విధేయంగా ఉండేందుకూ, అశుద్ధ ప్రవర్తనకు దూరంగా ఉండేందుకూ మనకు సహాయం చేయాలి. బైబిలు మనకిలా జ్ఞాపకం చేస్తోంది: “ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.” (హెబ్రీయులు 4:​13) మనం దేవునికి లెక్క ఒప్పజెప్పాల్సి ఉందన్నది నిజమే, కానీ మనం ఆయన చిత్తాన్ని చేయడానికిగల కారణం, నీతియుక్తమైన ఆయన ప్రమాణాలను అంటిపెట్టుకుని ఉండడానికిగల కారణం యెహోవా పట్ల మనకున్న ప్రగాఢమైన ప్రేమే. కాబట్టి మన వినోద కార్యకలాపాల ఎంపిక విషయంలోను, ఆడవారు మగవారితో మగవారు ఆడవారితో ప్రవర్తించే విధానంలోను వివేచనను ఉపయోగిద్దాం.

17. ఎటువంటి ఆసక్తితో యెహోవా మనల్ని గమనిస్తాడు?

17 యెహోవా మన విషయంలో ఎంతో ఆసక్తిని కలిగివున్నాడు, కానీ దీనర్థం మనల్ని తాను శిక్షించగలిగేలా మనం తప్పులు చేయాలని ఆయన ఎదురుచూస్తున్నాడని కాదు. బదులుగా, విధేయులైన తన పిల్లలకు ప్రతిఫలాన్ని ఇవ్వాలని కోరుకునే ఒక తండ్రిలాంటి ప్రేమపూర్వక శ్రద్ధతో మనల్ని గమనిస్తాడు. మన పరలోకపు తండ్రి మన విశ్వాసాన్ని బట్టి సంతోషిస్తున్నాడని, ఆయన “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడని” తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరంగా ఉందో కదా! (హెబ్రీయులు 11:⁠6) మనం యెహోవా మీద సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచుదాం, ‘మనఃపూర్వకముగా ఆయనను సేవించుదాం.’​—⁠1 దినవృత్తాంతములు 28:⁠9.

18. యెహోవా మనల్ని గమనిస్తున్నాడు గనుక, మన విశ్వసనీయతను గుర్తుంచుకుంటాడు గనుక, మనకు లేఖనాల నుండి ఎటువంటి హామీ లభిస్తోంది?

18సామెతలు 15:3 ఇలా అంటోంది: “యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.” అవును, దేవుడు చెడ్డవారిని చూస్తూవున్నాడు, వారి ప్రవర్తనకు తగ్గట్లు ఆయన వారితో వ్యవహరిస్తాడు. అయితే మనం “మంచివారి”లో ఉన్నట్లైతే, యెహోవా మన విశ్వాస క్రియల్ని గుర్తుంచుకుంటాడని గట్టి నమ్మకం మనం పెట్టుకోవచ్చు. ‘ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదనీ,’ అదృశ్యుడైనవాడు ‘మన కార్యములను, తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచిపోడనీ’ తెలుసుకోవడం మన విశ్వాసాన్ని ఎంత బలపర్చేదిగా ఉందో కదా!​—⁠1 కొరింథీయులు 15:​58; హెబ్రీయులు 6:⁠10.

మనల్ని పరీక్షించమని యెహోవాను ఆహ్వానించడం

19. యెహోవాపై బలమైన విశ్వాసం ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాల్లో కొన్ని ఏమిటి?

19 విశ్వసనీయులైన యెహోవా సేవకులముగా మనం ఆయనకు అమూల్యమైనవారం. (మత్తయి 10:​29-31) ఆయన అదృశ్యుడైనా మనకాయన వాస్తవికమైన వ్యక్తిగా ఉండగలడు, ఆయనతో అమూల్యమైన సంబంధాన్ని మనం కలిగివుండగలము. మన పరలోకపు తండ్రిపట్ల ఇలాంటి దృక్కోణం కలిగివుండడం మనకెన్నో ప్రయోజనాల్ని తెస్తుంది. బలమైన మన విశ్వాసం యెహోవా ఎదుట పవిత్రమైన హృదయాన్నీ, మంచి మనస్సాక్షినీ కలిగివుండేందుకు సహాయపడుతుంది. నిష్కపటమైన విశ్వాసం మనం రెండు రకాల జీవితాల్ని గడపకుండా కూడా ఆపుతుంది. (1 తిమోతి 1:​5, 18, 19) దేవునిపై అచంచలమైన మన విశ్వాసం ఇతరులకు మంచి మాదిరిని ఉంచుతుంది, మన చుట్టూ ఉన్నవారిపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. (1 తిమోతి 4:​12) అంతేగాక, అలాంటి విశ్వాసం దేవుని అంగీకారంగల ప్రవర్తనను వృద్ధిచేస్తుంది, యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తుంది.​—⁠సామెతలు 27:⁠11.

20, 21. (ఎ) యెహోవా కన్నులు మనల్ని చూస్తూ ఉండడం ఎందుకు వాంఛనీయమైనది? (బి) కీర్తన 139:23, 24 వచనాల్ని మనకెలా అన్వయించుకోగలము?

20 మనం నిజంగా జ్ఞానవంతులమైతే, యెహోవా కన్నులు మనల్ని చూస్తూ ఉన్నందుకు ఆనందిస్తాము. ఆయన మనల్ని చూడాలని మనం కోరుకోవడమే కాక, మన ఆలోచనల్నీ చర్యల్నీ ఆయన కూలంకషంగా పరీక్షించాలని కూడా మనం ప్రగాఢంగా కోరుకుంటాం. మనల్ని పరిశోధించి మనలో ఏమైనా అనుచితమైన మనోవైఖరులున్నాయేమో చూడమని ప్రార్థనలో మనమాయన్ని కోరడం మనకే శ్రేయస్కరం. మన సమస్యల్ని పరిష్కరించుకునేందుకు, అవసరమైన సర్దుబాట్లు చేసుకునేందుకు ఆయన మనకు తప్పకుండా సహాయం చేయగలడు. యుక్తమైన రీతిలోనే కీర్తనకర్తయైన దావీదు ఇలా పాడాడు: “దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము, నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్యమార్గమున నన్ను నడిపింపుము.”​—⁠కీర్తన 139:23, 24.

21 తనను పరిశోధించి తనలో ఏమైనా ‘ఆయాసకరమైన మార్గము’ ఉందేమో చూడమని దావీదు యెహోవాను ప్రాధేయపడ్డాడు. కీర్తనకర్తలానే మనమూ, దేవుడు మన హృదయాల్ని పరిశోధించి, మనకేమైనా అనుచితమైన తలంపులు ఉన్నాయేమో చూడాలని కోరుకోమా? కాబట్టి మనల్ని పరిశోధించమని విశ్వాసంతో మనం యెహోవాను అడుగుదాం. కానీ, మనలో ఏదైనా తప్పు ఉండడం మూలంగా లేదా హానికరమైన విషయం ఉండడం మూలంగా మనం చింతాక్రాంతులమైతే అప్పుడేమిటి? అప్పుడు, మన ప్రేమగల దేవుడైన యెహోవాకు మరింత మనఃపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఉందాం, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపునూ ఆయన వాక్య సలహానూ విధేయతతో అనుసరిద్దాం. ఆయన మనకు మద్దతునిస్తాడనీ, నిత్యజీవానికి నడిపించే మార్గంలో మనం నడవడానికి సహాయం చేస్తాడనీ మనం నమ్మకం కలిగివుండగలం.​—⁠కీర్తన 40:​11-13.

22. అదృశ్యుడైనవాని విషయంలో మన కృత నిశ్చయం ఏమై ఉండాలి?

22 అవును, మనం యెహోవా కోరుతున్నవాటి అనుసారంగా జీవిస్తే ఆయన మనల్ని నిత్యజీవంతో ఆశీర్వదిస్తాడు. అయితే ఒక్క విషయం, మనం ఆయన శక్తినీ అధికారాన్నీ మాత్రం గుర్తించాలి. అపొస్తలుడైన పౌలు కూడా దాన్ని గుర్తిస్తూ ఇలా వ్రాశాడు: “సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్‌.” (1 తిమోతి 1:​17) మనం ఎల్లప్పుడు యెహోవా పట్ల అలాంటి హృదయపూర్వకమైన భక్తిని ప్రదర్శిస్తూ ఉందుము గాక. ఎటువంటి పరిస్థితైనా సరే, మనం అదృశ్యుడైనవానిని చూస్తున్నట్లుగా స్థిరబుద్ధితో ముందుకు కొనసాగాలనే మన కృత నిశ్చయం విషయంలో మనం అచంచలమైన మనస్కులమై ఉండాలి.

మీరెలా జవాబిస్తారు?

• మానవులు దేవుణ్ణి చూడడం ఎలా సాధ్యం?

• యెహోవా మనకు వాస్తవికమైన వ్యక్తి అయితే, మనం హింసించబడినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తాం?

• యెహోవాను మన మహా ఉపదేశకునిగా దృష్టించడం అంటే ఏమిటి?

• యెహోవా మనల్ని పరీక్షించాలని మనమెందుకు కోరుకోవాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[18వ పేజీలోని చిత్రం]

మోషే, ఫరోకి బెదిరిపోకుండా తాను అదృశ్య దేవుడైన యెహోవాను చూస్తున్నట్లే ప్రవర్తించాడు

[21వ పేజీలోని చిత్రం]

మనం చేస్తున్నవి యెహోవా చూడలేడన్న దృక్పథంతో మనమెన్నడూ ప్రవర్తించవద్దు

[23వ పేజీలోని చిత్రం]

మనం దేవుని గూర్చిన పరిజ్ఞానం కోసం హృదయపూర్వకంగా వెదుకుతాం, ఎందుకంటే మనమాయన్ని మన మహా ఉపదేశకునిగా దృష్టిస్తాం