కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనాథలకు విధవరాండ్రకు కష్ట సమయాల్లో అండగా నిలవండి

అనాథలకు విధవరాండ్రకు కష్ట సమయాల్లో అండగా నిలవండి

అనాథలకు విధవరాండ్రకు కష్ట సమయాల్లో అండగా నిలవండి

ప్రేమరహిత లోకంలో మనం జీవిస్తున్నామని గుర్తించడం అంత కష్టమేమీ కాదు. “అంత్యదినములలో” ఎటువంటి ప్రజలు జీవిస్తారో సూచిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, . . . అనురాగరహితులు”గా ఉంటారు. (2 తిమోతి 3:​1-3) ఆ మాటలు ఎంత నిజం!

అనేకమంది హృదయాల్లో దయాదాక్షిణ్యాలు లేకపోవడానికి కారణం, మన సమాజంలోని నైతిక పరిసరాలే. ప్రజలు ఇతరుల సంక్షేమం పట్ల అతి తక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు, కొన్ని సందర్భాల్లోనైతే తమ స్వంత కుటుంబ సభ్యుల గురించి కూడా పట్టించుకోవడంలేదు.

వివిధ పరిస్థితుల కారణంగా, నిరాధారులైన అనేకమందిని ఇది చాలా ఘోరంగా ప్రభావితం చేస్తుంది. యుద్ధాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఆశ్రయం కోసం వెతుకుతున్న వారు తప్పిపోవడం వల్ల విధవరాండ్రు అనాథల సంఖ్య దినదినం విపరీతంగా పెరిగిపోతోంది. (ప్రసంగి 3:​19) “యుద్ధంవల్ల పది లక్షలకంటే ఎక్కువ మంది [పిల్లలు] అనాథలయ్యారు లేక తమ కుటుంబాలకు దూరమయ్యారు” అని ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి వెల్లడించిన ఒక నివేదిక పేర్కొంది. వదిలిపెట్టబడిన లేదా విడాకులు పొందిన చాలామంది ఒంటరి తల్లులు కుటుంబాలను తమ స్వంతగా పోషించడానికి, పిల్లల్ని పెంచడానికి పడే పాట్లను గురించీ మీకు తెలుసు. కొన్ని దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాలవల్ల పరిస్థితులు విషమించి, ఆ దేశ ప్రజల్లో అనేకులు కటిక పేదరికంలో గడపాల్సివస్తోంది.

వీటి దృష్ట్యా, కష్టాలనుభవిస్తున్న వారికి ఆశాకిరణం ఏదైనా ఉందా? విధవరాండ్రకు, అనాథలకు బాధలనుంచి ఎలా విముక్తి కలిగించగలం? ఎన్నటికైనా ఈ సమస్య అంతమౌతుందా?

బైబిలు కాలాల్లో ప్రేమపూర్వక శ్రద్ధ

బైబిలు కాలాల్లో విధవరాండ్ర, అనాథల భౌతిక ఆధ్యాత్మికావసరాలపై శ్రద్ధ చూపడం దేవుని ఆరాధనలో ఎప్పుడూ ముఖ్యమైన భాగంగా ఉండేది. ఇశ్రాయేలీయులు ధాన్యాన్ని లేదా పంటను సమకూర్చుకునేటప్పుడు పొలాల్లో మిగిలిపోయే పరిగెను ఏరుకొనకూడదు. ఆ పరిగెను “తండ్రిలేని వారికిని విధవరాండ్రకును” వదిలిపెట్టాలి. (ద్వితీయోపదేశకాండము 24:​19-21) మోషే ధర్మశాస్త్రం స్పష్టంగా నిర్దేశించింది: “విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్టకూడదు.” (నిర్గమకాండము 22:​22, 23) భర్తా, తండ్రీ లేదా తల్లిదండ్రులిద్దరూ చనిపోయిన కుటుంబంలోని మిగిలిన సభ్యులు ఒంటరివారు, అనాథలు అవుతారు కాబట్టి, బైబిల్లో పేర్కొనబడిన విధవరాండ్రు, అనాథలు సబబుగానే పేదవారిని సూచిస్తోంది. పితరుడైన యోబు ఇలా పేర్కొన్నాడు: “మొఱ్ఱపెట్టిన దీనులను తండ్రి లేనివారిని సహాయములేనివారిని నేను విడిపించితిని.”​—⁠యోబు 29:​12.

తల్లిదండ్రులు చనిపోవడంవల్ల లేక భర్త చనిపోవడంవల్ల కష్టాలపాలైన, నిజంగా అవసరాల్లో ఉన్నవారిపై శ్రద్ధ చూపడం క్రైస్తవ సంఘ తొలిరోజుల్లోని సత్యారాధనలో ప్రత్యేకాంశంగా ఉండేది. అలాంటి వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధతో శిష్యుడైన యాకోబు వ్రాశాడు: “తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా​—⁠దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్ను తాను కాపాడుకొనుటయునే.”​—⁠యాకోబు 1:27.

అనాథలు విధవరాండ్ర గురించి ప్రస్తావించడంతోపాటు యాకోబు ఇతర పేదవారి గురించీ కటిక పేదరికాన్ని అనుభవించేవారి గురించీ అత్యంత శ్రద్ధ చూపించాడు. (యాకోబు 2:5, 6, 15, 16) అపొస్తలుడైన పౌలు అదే ఆలోచనను వ్యక్తం చేశాడు. ఆయనా, బర్నబా ప్రకటనా పనిలో ఉన్నప్పుడు వారికివ్వబడిన ఆదేశాల్లో ‘బీదలను జ్ఞాపకము చేసికొనవలెను’ అనే ఆదేశమూ ఉంది. “ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి యుంటిని” అని పౌలు స్వచ్ఛమైన మనస్సాక్షితో చెప్పగలిగాడు. (గలతీయులు 2:​8-10) క్రైస్తవ సంఘం స్థాపించబడిన కొద్దికాలం తర్వాతి కార్యకలాపాల వృత్తాంతం పేర్కొంది: “వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను.” (అపొస్తలుల కార్యములు 4:​35) అవును, అనాథలూ, విధవరాండ్రతోపాటు దిక్కులేనివారినీ ఆదుకోవడానికి ప్రాచీన ఇశ్రాయేలీయుల్లో స్థాపించబడిన ఏర్పాటు నేటి క్రైస్తవ సంఘం వరకు కొనసాగుతూ వచ్చింది.

ఏర్పాటు చేసిన సహాయం పరిమితంగా, ఆయా సంఘాల వనరులకు అనుగుణంగా ఉండేది. డబ్బు వృథాగా ఖర్చు చేసేవారు కాదు, సహాయం పొందినవారు నిజంగా అవసరమున్నవారే. ఏ క్రైస్తవుడు కూడా ఆ ఏర్పాటును దుర్వినియోగపరచకూడదు, సంఘంపై అనవసరమైన భారాన్ని మోపకూడదు. 1 తిమోతి 5:​3-16 లో పౌలు ఇచ్చిన ఆదేశాల్లో ఇది స్పష్టమౌతుంది. అవసరాల్లో ఉన్నవారి బంధువులు వారికి సహాయం చేయగలిగితే వారే ఆ బాధ్యత వహించాలి అని మనం అక్కడ చూస్తాం. అవసరాల్లో ఉన్న విధవరాండ్రు సహాయం పొందాలనుకుంటే కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఇవన్నీ అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి యెహోవా వినియోగించే జ్ఞానవంతమైన ఏర్పాటును ప్రతిబింబిస్తున్నాయి. అంతేగాక, చూపించబడిన దయను, ఎవరూ అనవసరంగా దుర్వినియోగపరచకుండా సమతుల్యతను కలిగివుండాలని కూడా అది చూపిస్తోంది.​—⁠2 థెస్సలొనీకయులు 3:​10-12.

నేడు అనాథలనూ విధవరాండ్రనూ ఆదుకోవడం

కష్టాలను అనుభవిస్తున్నవారిపై శ్రద్ధ చూపిస్తూ, ఆదుకునే విషయానికి వస్తే, దేవుని సేవకులు గతంలో పాటించిన సూత్రాలు యెహోవా సాక్షుల సంఘాల్లో నేటికీ ఆచరణీయమైనవే. యేసు పేర్కొన్నట్లుగా సహోదర ప్రేమ ఒక గుర్తింపు చిహ్నం: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందు[రు].” (యోహాను 13:​35) ఎవరైనా అవసరాల్లో ఉండి బాధపడుతుంటే లేక ప్రకృతి వైపరీత్యాలకు లేక యుద్ధాలకు లేక అంతఃకలహాలకు గురైతే, వారికి ఆధ్యాత్మికంగా భౌతికంగా సహాయం చేయడానికి మిగతా అంతర్జాతీయ సౌభ్రాత్రుత్వం ఆతురతతో మార్గాలను వెతుకుతుంది. అలాంటి సందర్భాల్లో ఏం చేశారో చూపించే కొన్ని ఆధునిక-దిన అనుభవాలను గమనించుదాం.

కేవలం సంవత్సరంన్నర వయస్సున్నప్పుడే తల్లి చనిపోయిన పేద్రోకు, వాళ్ళమ్మ గురించి ఏమాత్రం జ్ఞాపకం లేదు. పేద్రోకు ఐదేండ్ల వయసప్పుడు వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. అలా పేద్రో తల్లిదండ్రుల్లేని వాడిగా తన అన్నయ్యల దగ్గరే పెరిగాడు. వాళ్ళ నాన్న ఉన్నప్పటినుండే యెహోవా సాక్షులు వాళ్ళింటికి వస్తుండేవారు కాబట్టి, ఆయనా ఆయన అన్నయ్యలూ వారితో గృహ బైబిలు అధ్యయనం ప్రారంభించారు.

పేద్రో వివరిస్తున్నాడు: “మరుసటి వారంనుండే మేము కూటాలకు హాజరవ్వడం ప్రారంభించాం. మేము సహోదరులతో సహవసిస్తుండగా, వాళ్ళు మాపై చూపించిన ప్రేమను గ్రహించగలిగాం. సంఘం నాకు ఆశ్రయదుర్గం లాంటిది, ఎందుకంటే అచ్చం నా తల్లిదండ్రుల్లాగే సహోదర సహోదరీలు నాపై ప్రేమ చూపించారు.” ఒక క్రైస్తవ పెద్ద ఆయనను వాళ్ళింటికి ఆహ్వానించిన సందర్భాన్ని పేద్రో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అక్కడ పేద్రో ఆ కుటుంబంతో మాట్లాడుతూ ఎంతో ఆనందంగా కాలక్షేపం చేశాడు. 11వ ఏటనే తన విశ్వాసం గురించి ప్రకటించడం ప్రారంభించి, 15వ ఏట బాప్తిస్మం పొందిన పేద్రో “అవి నాకు మధుర స్మృతులు” అంటున్నాడు. ఆయన అన్నలూ అదే మాదిరి సంఘంలోని వారి సహాయంతో ఆధ్యాత్మికంగా ఎంతో వృద్ధి చెందారు.

డేవిడ్‌ విషయమూ అలాంటిదే. ఆయన తల్లిదండ్రులు విడిపోయినప్పుడు, ఆయన కవల సహోదరీ ఆయనా ఒంటరివారయ్యారు. వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ, చిన్నమ్మ వాళ్ళను పెంచారు. “మేము పెరిగి పెద్దవాళ్ళమై పరిస్థితిని అవగాహన చేసుకునేసరికి, మాలో అభద్రతా, విషాదపు భావాలు నిండుకున్నాయి. మాకు ఆధారం కావాలి. మా చిన్నమ్మ యెహోవా సాక్షిగా మారింది, ఆ కారణంగా మాకు బైబిలు సత్యం నేర్పించబడింది. సహోదరులు మాపై వారి ప్రేమను స్నేహాన్ని చూపించారు. వారికి మేమంటే ఎంతో మక్కువుండేది, మా లక్ష్యాలను చేరుకోవడానికీ, యెహోవా సేవలో కొనసాగడానికీ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించేవారు. నేను దాదాపు 10 ఏండ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు, ఒక పరిచర్యా సేవకుడు నన్ను క్షేత్రసేవకు తీసుకువెళ్ళేవాడు. నేను సమావేశాలకు హాజరైనప్పుడు మరొక సహోదరుడు నా ఖర్చులు భరించేవాడు. చివరికి నేను రాజ్య మందిరంలో విరాళం ఇవ్వడానికి కూడా ఒక సహోదరుడు సహాయం చేసేవాడు.”

డేవిడ్‌ తన 17వ ఏట బాప్తిస్మం పొందాడు, తర్వాత మెక్సికోలోని యెహోవా సాక్షుల బ్రాంచి కార్యాలయంలో పని చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు కూడా ఆయనిలా ఒప్పుకుంటున్నాడు: “కొందరు పెద్దలు నా చదువులోనూ నాకు సహాయకరమైన సలహాలనివ్వడంలోనూ గమనార్హమైన సహాయం చేశారు. ఆ విధంగా నేను అభద్రతా, ఒంటరితనపు భావాలను అధిగమించాను.”

ఏబెల్‌, మెక్సికోలోని ఒక సంఘంలో పెద్ద. అక్కడ సహాయం అవసరమున్న కొందరు విధవరాండ్రు ఉన్నారు. ఆయన అంటున్నాడు: “ఆ విధవరాండ్రకు మానసిక మద్దతు చాలా అవసరముందని నేను దృఢంగా నమ్ముతున్నాను, కొన్నిసార్లు వాళ్ళు క్రుంగిపోయే సమయాలుంటాయి; అప్పుడు వాళ్ళు ఒంటరివాళ్ళుగా భావిస్తారు. అందుకే వారికి మద్దతుగా ఉండడమూ, వారు చెప్పింది వినడమూ చాలా ప్రాముఖ్యం. మేము [సంఘ పెద్దలు] తరచుగా వాళ్ళను సందర్శిస్తాం. వారి సమస్యల గురించి శ్రద్ధ వహించడానికి సమయాన్ని తీసుకోవడం ప్రాముఖ్యం. వారు ఆధ్యాత్మికంగా ఓదార్పును పొందినట్లు భావించడానికి అది వారికి దోహదపడుతుంది.” అయినప్పటికీ, ఆర్థిక సహాయం కూడా కొన్నిసార్లు అవసరమవుతుంది. “విధవరాలైన ఒక సహోదరి కోసం మేమిప్పుడు ఒక ఇల్లు కడుతున్నాం, కొన్ని శనివారాలూ, వారంలో కొన్ని మధ్యాహ్నాలూ ఆమె ఇంటి కోసం మేము పని చేస్తున్నాం” అని కొంతకాలం క్రితం ఏబెల్‌ అన్నాడు.

అనాథలకు విధవరాండ్రకు సహాయాన్ని అందించడంలో తన స్వంత అనుభవం గురించి మరొక సంఘ పెద్ద అంటున్నాడు: “క్రైస్తవ ప్రేమ విధవరాండ్రకంటే అనాథలకే చాలా ఎక్కువగా అవసరముందని నేను నమ్ముతున్నాను. వాళ్ళు తల్లిదండ్రులిద్దరూ ఉన్న చిన్న పిల్లల కంటే, కౌమారదశలో ఉన్న పిల్లల కంటే ఎక్కువగా తిరస్కరింపబడినవారిగా భావించే అవకాశం ఉందని నేను గమనించాను. సహోదర ప్రేమను వ్యక్తం చేసే చర్యలు ఎక్కువగా వారికే అవసరమున్నాయి. కూటం అయిపొయిన తర్వాత వారిని కలిసి పరామర్శించడం మంచిది. చిన్నప్పుడే అనాథైన ఒక పెళ్ళైన సహోదరుడు ఉన్నాడు. నేను ఆయనను ఎప్పుడూ స్నేహపూర్వకంగా పలకరిస్తాను, ఆయన నన్ను చూడగానే కౌగిలించుకుంటాడు. అది నిజమైన సహోదర ప్రేమానుబంధాన్ని బలపరుస్తుంది.”

యెహోవా ‘దరిద్రులను విడిపించును’

విధవరాండ్ర, అనాథల పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కోవడానికి యెహోవా మీద నమ్మకముంచడం ప్రాముఖ్యం. ఆయన గురించి ఇలా చెప్పబడింది: “యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించువాడు.” (కీర్తన 146:⁠9) ఇలాంటి సమస్యల నుండి పూర్తి విముక్తి కేవలం యేసు క్రీస్తు పరిపాలన క్రింద ఉండే దేవుని రాజ్యంలో మాత్రమే లభిస్తుంది. మెస్సీయ చేసే ఆ పరిపాలన గురించి ప్రవచనరూపంలో వర్ణిస్తూ కీర్తనకర్త వ్రాశాడు: “దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును.”​—⁠కీర్తన 72:​12, 13.

ప్రస్తుత విధానానికి అంతం సమీపిస్తుండగా, క్రైస్తవులు సాధారణంగా ఎదుర్కొనే ఒత్తిడులు తప్పకుండా అధికమవుతాయి. (మత్తయి 24:​9-13) ఇప్పుడు ప్రతిరోజూ ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపిస్తూ, “ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై” ఉండే అవసరం ఎక్కువగా ఉంది. (1 పేతురు 4:​7-10) క్రైస్తవ సహోదరులు, ప్రత్యేకంగా పెద్దలు, అనాథలైన వారిపై శ్రద్ధా, కనికరమూ చూపించాల్సిన అవసరముంది. సంఘంలోని పరిణతిచెందిన స్త్రీలు విధవరాండ్రకు ఎక్కువగా మద్దతును అందించవచ్చు, వారు ఓదార్పునిచ్చే వారిగా ఉండాలి. (తీతు 2:​3-5) వాస్తవానికి, కష్టాలెదుర్కొంటున్నవారిని ఆదుకోవడంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా చేయూతనివ్వవచ్చు.

నిజ క్రైస్తవులు ‘తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపకుండా’ ఉండరు. వారికి అపొస్తలుడైన యోహాను చేసిన మందలింపును లక్ష్యపెట్టాలని బాగా తెలుసు: “చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.” (1 యోహాను 3:​17, 18) కాబట్టి మనం ‘దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందుల్లో పరామర్శించుదాం.’​—⁠యాకోబు 1:​27.

[11వ పేజీలోని బ్లర్బ్‌]

“మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.” 1 యోహాను 3:18

[10వ పేజీలోని చిత్రాలు]

నిజ క్రైస్తవులు అనాథల, విధవరాండ్ర భౌతికావసరాలను, ఆధ్యాత్మికావసరాలను, మానసికావసరాలనూ తీరుస్తారు