కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌లో ప్రకటన 21:1వ వచనం “క్రొత్త ఆకాశమును [ఏకవచనం] క్రొత్త భూమిని” గురించి ప్రవచిస్తుండగా, 2 పేతురు 3:⁠13 ‘క్రొత్త ఆకాశములు [బహువచనం] క్రొత్త భూమి’ గురించి ఎందుకు చెబుతోంది?

ఇది ప్రాథమికంగా మూల భాష వ్యాకరణానికి సంబంధించిన విషయం. భావానికి సంబంధించినంత మట్టుకు దానికి ఎటువంటి ప్రత్యేక ప్రాముఖ్యం ఉన్నట్లు కన్పించడం లేదు.

మొదట హీబ్రూ లేఖనాల్ని పరిశీలించండి. “ఆకాశము(లు)” అని అనువదించబడిన షామాయిమ్‌ అనే హీబ్రూ పదం మూలభాషా పాఠంలో ఎప్పుడూ బహువచన రూపంలోనే ఉంటుంది. ఈ బహువచనం, ఘనతను కాదు గానీ, ఒకే వస్తువు యొక్క అసంఖ్యాకమైన వేర్వేరు విభాగాల్ని సూచిస్తున్నట్లు కనిపిస్తుంది. కోటానుకోట్ల నక్షత్రాలతో కూడిన భౌతిక ఆకాశము మన భూమి నుండి దూరంగా ఎంతో విస్తారమైన పరిధిలో అన్ని దిశల్లోకీ విస్తరిస్తున్నందున అలా వర్ణించబడుతున్నట్లు దీన్ని అర్థం చేసుకోవచ్చు. షామాయిమ్‌ అనే పదానికి ముందు నిర్దిష్ట ఉపపదం ఉన్నప్పుడు న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌​—⁠యెషయా 66:22 లో ఉన్నట్లుగా​—⁠దాన్ని దాదాపు ఎప్పుడూ “ఆకాశములు” అనే అనువదిస్తుంది. షామాయిమ్‌ అనే పదానికి ముందు నిర్దిష్ట ఉపపదం లేనప్పుడు దాన్ని ఏకవచనంగా (న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌లోని ఆదికాండము 1:⁠8; 14:​19, 22; కీర్తన 69:⁠34 వచనాలలో ఉన్నట్లుగా “ఆకాశము” అనీ), లేదా బహువచనంగా (న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌లోని ఆదికాండము 49:​25; న్యాయాధిపతులు 5:⁠4; యోబు 9:⁠8; యెషయా 65:17 వచనాల్లో ఉన్నట్లుగా “ఆకాశములు” అనీ) అనువదించవచ్చు.

యెషయా 65:17 లోనూ 66:22 లోనూ ఆకాశము కోసమైన హీబ్రూ పదం బహువచనంలో ఉంది, ఆ వచనాల్లో “క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి” అని ఒకే విధంగా అనువదించబడింది.

ఔరానోస్‌ అనే గ్రీకు పదానికి “ఆకాశం” అనీ, బహువచన పదమైన ఔరానోయ్‌ అనే పదానికి “ఆకాశములు” అనీ అర్థం. ఆసక్తికరంగా, గ్రీకులోని సెప్టాజింట్‌ అనువాదకులు యెషయా 65:17 లోనూ 66:22 లోను ఏకవచనమే ఉపయోగించారు.

ఇప్పుడు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ‘క్రొత్త ఆకాశము [లేదా ఆకాశములు], క్రొత్త భూమి’ అనే మాట కన్పించే రెండు సందర్భాల సంగతేమిటి?

2 పేతురు 3:13 లో అపొస్తలుడు గ్రీకులో బహువచనాన్ని ఉపయోగించాడు. దానికి కాస్త ముందు (7, 10, 12 వచనాల్లో) ఆయన ప్రస్తుత దుష్ట “ఆకాశముల” గురించి మాట్లాడుతూ బహువచనాన్నే ఉపయోగించాడు. కాబట్టి ఆయన 13వ వచనంలో కూడా బహువచనాన్నే ఉపయోగిస్తూ ఒకే పద్ధతిని అనుసరించాడు. అంతేగాక, సామెతలు 26:⁠11 యొక్క హీబ్రూ పాఠాన్ని 2 పేతురు 2:22 లో ఎత్తి వ్రాసినట్లుగానే, ఆయన 13వ వచనంలో కూడా మూలభాషలోని యెషయా 65:17ను ఎత్తివ్రాసినట్లుగా కన్పిస్తోంది, అక్కడ హీబ్రూలోని పదం బహువచనంలో ఉంది. అలా పేతురు, “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశముల [బహువచనం] కొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము” అని మన దృష్టికి తీసుకువచ్చాడు.

దీనికి కాస్త భిన్నంగా ప్రకటన 21:1 లో అపొస్తలుడైన యోహాను సెప్టాజింట్‌ అనువాదంలోని యెషయా 65:17 నే ఉపయోగించాడని స్పష్టంగా కన్పిస్తోంది. అందులో ముందే చెప్పినట్లుగా “ఆకాశము” కోసమైన గ్రీకు పదం ఏక వచనంలో ఉంది. కాబట్టి, యోహాను వ్రాసింది ఇదీ: “అంతట నేను క్రొత్త ఆకాశమును [ఏకవచనం] క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను.”

ఇవి అనువాదానికి సంబంధించిన వ్యాకరణ వివరణలు. “క్రొత్త ఆకాశము” లేదా “క్రొత్త ఆకాశములు” గురించి చదివినా లేదా మాట్లాడినా అందులో తేడా ఏమీ ఉన్నట్లు కన్పించడం లేదని ఇక్కడ మళ్ళీ పేర్కొనవచ్చును. రెండింటి అన్వయింపు ఒకటే భావాన్నిస్తోంది.

[31వ పేజీలోని చిత్రసౌజన్యం]

నక్షత్రాలు: Frank Zullo