మీకు డబ్బు కావాలా, జీవితం కావాలా?
మీకు డబ్బు కావాలా, జీవితం కావాలా?
తాము దోచుకోబోయేవారి ముఖం మీద తుపాకిని అటూ ఇటూ ఆడిస్తూ, “నీకు డబ్బు కావాలా లేక నీ ప్రాణాలు కావాలా!” అని బందిపోట్లు చేసే దబాయింపుల గురించి మీరు వినే ఉంటారు. చిరపరిచితమైన ఈ దబాయింపు, నేడు మనమందరం, ప్రాముఖ్యంగా సంపన్న దేశాల్లో జీవిస్తున్నవారందరు ఎదుర్కొంటున్న క్లిష్టమైన సందిగ్ధావస్థలో మారుమ్రోగుతోంది. కానీ, ఇప్పుడు దబాయించేది ఏ బందిపోటూ కాదు. బదులుగా డబ్బుకూ వస్తుసంపదలకూ సమాజం ఇచ్చే అత్యధికమైన ప్రాముఖ్యత అలా దబాయిస్తోంది.
అలాంటి ప్రాముఖ్యత పూర్తి క్రొత్త అంశాలను ఆలోచనలను లేవనెత్తింది. డబ్బునూ వస్తుసంపదలనూ సంపాదించుకోవడానికి దేన్ని పణంగా పెట్టవచ్చు? మనం తక్కువ వస్తుసంపదలతో తృప్తి పొందగలమా? ప్రజలు వస్తుసంపదల కోసం నిజంగా తమ “వాస్తవమైన జీవమును” బలి చేసుకుంటున్నారా? సంతోషకరమైన జీవితానికి డబ్బే మార్గమా?
డబ్బు పిచ్చి
మంచివైనా లేక చెడ్డవైనా, మానవుని కోరికల్లో మోహాల్లో ధనాపేక్షే అగ్రస్థానాన్ని ఆక్రమిస్తోంది. లైంగిక సంబంధం కోసం, ఆహారం కోసం ఉండే కోరికలా కాకుండా డబ్బు పిచ్చి తీవ్రంగా, అంతమనేది లేకుండా ఉంటుంది. వృద్ధాప్యంతోనైనా ఆ కోరిక అంతమవుతుందని అనిపించడంలేదు. నిజానికి, చాలా సందర్భాల్లో, పైబడుతున్న వయస్సు ఒక వ్యక్తికి డబ్బు మీదా, దాంతో కొనగల వాటిమీదా ఆసక్తిని లేక శ్రద్ధను పెంచవచ్చు.
డబ్బు కోసం అత్యాశ రోజురోజుకు మితిమీరిపోతున్నట్లు కనబడుతోంది. ఎంతో ప్రజాదరణపొందిన ఒక సినిమాలోని ముఖ్య పాత్రధారుడు ఇలా అన్నాడు: “అత్యాశ కోరుకున్న ఫలితాన్నిస్తుంది. అత్యాశ లాభకరమైనది.” చాలామంది 1980ల కాలాన్ని అత్యాశ యుగముగా సూచించినప్పటికీ, దానికంటే ముందూ దాని తర్వాతి సంవత్సరాల్లోనూ జరిగిందాన్నిబట్టి చూస్తే డబ్బుపట్ల మానవుని ప్రతిస్పందన అంతగా మారనట్లు కనిపిస్తోంది.
బహుశా క్రొత్త సంగతి ఏమిటంటే, ఇప్పుడు చాలామంది వస్తుసంపదల కోరికను తక్షణం తీర్చే అవకాశాల కోసం చూస్తున్నారు. ప్రపంచంలోని అధిక శాతం ప్రజలు అపరిమితంగా సుఖసంబంధమైన వస్తువులను తయారు చేయడానికీ వాటిని సంపాదించడానికీ తమ శక్తినీ సమయాన్నీ అత్యధికంగా వెచ్చిస్తున్నట్లు గోచరమవుతోంది. ఆధునిక-దిన జీవితంలో వస్తుసంపదలు ఉండడం, డబ్బు ఖర్చుపెట్టడం తీవ్రమైన కోరికగా, తరచూ అత్యంత కల్పనాశక్తిగల ఆకాంక్షగా మారిన విషయాన్ని మీరు అంగీకరిస్తుండవచ్చు.
కానీ దాని ఫలితంగా ప్రజలు సంతోషంగా ఉంటున్నారా? ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ, జ్ఞానియూ చాలా ఐశ్వర్యవంతుడూ అయిన సొలొమోను రాజు 3,000 సంవత్సరాల క్రితం ఇలా వ్రాశాడు: “ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తినొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తినొందడు; ఇదియు వ్యర్థమే.” (ప్రసంగి 5:10) ప్రస్తుత సామాజిక శాస్త్రం కూడా అలాంటి ఆసక్తికరమైన ముగింపులనే వెల్లడిస్తోంది.
డబ్బు, సంతోషం
మానవుని ప్రవర్తన గురించి కనుగొన్నవాటిలో అత్యంతాశ్చర్యకరమైన ఒక విషయమేమిటంటే, ధనార్జన, వస్తుసంపదలను సమకూర్చుకోవడం సాధారణంగా సంతృప్తినీ సంతోషాన్నీ అధికం చేయవన్నదే. ఒక వ్యక్తి ఆర్థికపరంగా ఒక స్థాయికి చేరుకున్నాక, అతని తృప్తీ సంతోషమూ ఎన్ని వస్తుసంపదలు అతనికి అందుబాటులో ఉన్నాయన్నదాని మీద ఆధారపడి ఉండవని అనేకమంది పరిశోధకులు గుర్తించారు.
అందుకే, వస్తుసంపదల కోసం డబ్బు కోసం అదుపుల్లేకుండా చేసే వేట చాలామంది ఇలా అడిగేలా చేసింది,
‘మేము కొనే ప్రతి క్రొత్త వస్తువు ద్వారా సంతోషాన్ని పొందుతున్నట్లు అనిపించేది, అయినప్పటికీ అన్నీ పరికించిన తర్వాత, ఆ సంతోషం మా తృప్తిని ఎందుకు ఏమాత్రం అధికం చేయదు?’జోనాతన్ ఫ్రీడ్‌మాన్ అనే రచయిత సంతోషభరిత ప్రజలు (ఆంగ్లం) అనే తన పుస్తకంలో ఇలా పేర్కొన్నాడు: “ఓ మోస్తరు ఆదాయం పొందిన వెంటనే, మీ దగ్గరున్న డబ్బుకూ మీ సంతోషానికి పెద్దగా సంబంధం ఉండదు. దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారిలో ఆదాయానికి సంతోషానికి మధ్యగల సంబంధం అతి స్వల్పమైనది.” వ్యక్తిగత సంతోషానికి దోహదపడేవి ఆధ్యాత్మిక సంపదలూ, జీవితంలోని అర్థవంతమైన కార్యకలాపాలూ, నైతిక విలువలేనని అనేకమంది గ్రహించారు. ఇతరులతో సత్సంబంధాలు కలిగి ఉండడం, మన దగ్గరున్న వాటినుండి సంతోషాన్ని పొందకుండా అడ్డుకునే కలహాలకూ లేక సంకుచిత స్వభావాలకూ దూరంగా ఉండడం కూడా ప్రాముఖ్యమే.
నిజానికి అంతరంగిక సమస్యలను పరిష్కరించడానికి ధనసంపత్తులనే వినియోగించటానికి మొగ్గు చూపడం నేటి సమాజంలోని అసంతోషానికి మూలకారణమని అనేకులు గమనించారు. కొందరు సమాజ వ్యాఖ్యాతలు సర్వసాధారణమైన నిరాశావాదం, అసంతృప్తి భావాల గురించి మాట్లాడతారు. సంపన్న సమాజాల్లోని ప్రజలు థెరపిస్టులనూ లేదా జీవిత అర్థాన్ని అన్వేషించడానికి, మనశ్శాంతిని పొందడానికి గురువులను, మతవ్యవస్థలను, ఔషధోపచారము చేస్తామని చెప్పుకునే ఇతర గ్రూపులను సంప్రదించడానికే అధికంగా మొగ్గు చూపడాన్ని కూడా వాళ్ళు పేర్కొంటారు. జీవితానికి నిజమైన అర్థాన్ని చేకూర్చడంలో వస్తుసంపదల వైఫల్యాన్ని ఇది ధ్రువీకరిస్తోంది.
డబ్బుకున్న బలమూ, బలహీనతా
డబ్బుకు బలం ఉందన్నది నిజమే. డబ్బుతో మంచి ఇండ్లనూ, మంచి మంచి బట్టలనూ, కళ్ళు జిగేల్‌మనే ఫర్నీచరునూ కొనుక్కోవచ్చు. మనల్ని పొగిడేవారిని మన అడుగులకు మడుగులొత్తేవారిని లేక ముఖస్తుతి చేసేవారిని కూడా డబ్బుతో కొనుక్కోవచ్చు. చివరికి, తాత్కాలికంగా మనతో ఉండే, మనకు ఏమైనా మేలు చేసే కొంతమంది స్నేహితులను కూడా సంపాదించుకోవచ్చు. అయితే డబ్బుకున్న బలం అంతే. మనకు ముఖ్యంగా కావలసినవాటిని, అంటే నిజమైన ఒక స్నేహితుడి ప్రేమను, మనశ్శాంతిని, మనం మరణశయ్యమీద ఉన్నప్పుడు హృదయపూర్వకమైన ఊరడింపు మాటలను డబ్బు కొనివ్వలేదు. సృష్టికర్తతో తమకున్న సంబంధమే గొప్ప సంపదగా భావించేవారికి దేవుని ఆమోదాన్ని డబ్బు కొనివ్వలేదు.
తన రోజుల్లో డబ్బుతో కొనగలిగిన ఆనందాలన్నింటినీ అనుభవించిన సొలొమోను రాజు, వస్తుసంపదల్లో నమ్మకం ఉంచడం శాశ్వత సంతోషానికి నడిపించదని గుర్తించాడు. (ప్రసంగి 5:12-15) బ్యాంకు దివాలా తీసినా లేక ద్రవ్యోల్బణం ఏర్పడినా డబ్బును కోల్పోగలం. తీవ్రమైన తుపానుల్లో స్థిరాస్తులు నాశనమైపోగలవు. ఇన్సూరెన్స్ పాలసీలు, వస్తు నష్టాన్ని కొంత మేరకు తీర్చగలిగినా మానసిక నష్టాలను మాత్రం భర్తీ చేయలేవు. స్టాకులూ, బాండ్లూ అకస్మాత్తు ఆర్థిక సంక్షోభాలవల్ల రాత్రికి రాత్రే విలువలేనివిగా అయిపోవచ్చు. మంచి జీతమున్న ఉద్యోగం కూడా ఇవ్వాళుండి రేపు ఊడిపోవచ్చు.
మరి అలాంటప్పుడు డబ్బు గురించి సమతుల్యమైన దృక్కోణాన్ని ఎలా కలిగివుండగలం? మన జీవితంలో డబ్బుకు లేక ఆస్తులకు ఏ స్థానముండాలి? నిజమైన విలువ గల “వాస్తవమైన జీవమును” మీరు ఎలా పొందగలరో తెలుసుకోవడానికి దయచేసి ఈ అంశాన్ని ఇంకా పరిశీలించండి.
[4వ పేజీలోని చిత్రాలు]
వస్తు సంపదలు శాశ్వతమైన సంతోషాన్ని తీసుకురావు