మీరు డబ్బు గురించి సమతుల్యమైన దృక్కోణాన్ని ఎలా కలిగివుండగలరు?
మీరు డబ్బు గురించి సమతుల్యమైన దృక్కోణాన్ని ఎలా కలిగివుండగలరు?
ధనాపేక్ష, ఆస్తుల కోసం తీరని ఆశ క్రొత్తవీ కావు; అవేవో ఈ మధ్యనే దృగ్గోచరమవుతున్న విషయాలన్నట్లు వాటిగురించి ప్రస్తావించకుండా బైబిలు మిన్నకుండనూ లేదు. అవి చాలా పాత అంశాలు. మోషే ధర్మశాస్త్రంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇలా ఆదేశించాడు: “నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. . . . నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.”—నిర్గమకాండము 20:17.
డబ్బునూ ఆస్తులనూ అపేక్షించడం యేసు కాలంలో సర్వసాధారణ విషయం. “మిక్కిలి ధనవంతుడు” అయిన ఒక యువకునికీ యేసుకూ మధ్య జరిగిన ఈ సంభాషణా నివేదికను పరిశీలించండి: “యేసు—‘నీకింక ఒకటి కొదువగా నున్నది; నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపు’మని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనప[డెను].”—లూకా 18:17-23.
డబ్బు గురించి సరైన దృక్కోణం
అయినా, బైబిలు డబ్బునైనా, లేక దాని ప్రాథమిక ఉపయోగాల్లో వేటినైనా ఖండిస్తోందనే నిర్ణయానికి వస్తే పొరబడ్డట్టే. ప్రజలు తమ నిత్యావసరాలను తీర్చుకోవడానికి దోహదపడుతూ, పేదరికాన్ని, దానివల్ల వచ్చే కష్టాలను తట్టుకోవడానికి డబ్బు ఉపయోగకరమైన రక్షణనిస్తుందని బైబిలు సూచిస్తోంది. సొలొమోను రాజు ఇలా వ్రాశాడు: “జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము.” అంతేకాదు, “మనుష్యులకు తిండి సంతృప్తినిస్తుంది, ద్రాక్షారసం వాళ్లని మరింత ఆనందపరుస్తుంది, అయితే డబ్బుంటే అనేక సమస్యలు పరిష్కారమవుతాయి.”—ప్రసంగి 7:12; 10:19, పరిశుద్ధ బైబల్.
డబ్బును సరైన రీతిలో వినియోగించడాన్ని దేవుడు ఆమోదిస్తున్నాడు. ఉదాహరణకు, యేసు ఇలా అన్నాడు: “అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి.” (లూకా 16:9) దీంట్లో దేవుని సత్యారాధనను ముందుకు కొనసాగించడానికి విరాళాలివ్వడమూ ఉంది, ఎందుకంటే యెహోవాను మన స్నేహితుడిగా తప్పకుండా కావాలనుకుంటాం. సొలొమోను స్వయంగా, తన తండ్రి దావీదును అనుకరిస్తూ, యెహోవా మందిర నిర్మాణం కోసం పెద్ద పెద్ద మొత్తాలనూ, విలువైన వస్తువులనూ విరాళంగా ఇచ్చాడు. అవసరాల్లో ఉన్నవారికి ఆసరాగా ఉండాలన్నది క్రైస్తవులు పాటించాల్సిన మరొక ఆజ్ఞ. “పరిశుద్ధుల అవసరములలో పాలుపొందు[డి]” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. అంతేకాదు, “శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి” అని కూడా అన్నాడు. (రోమీయులు 12:13) దీంట్లో కాస్త డబ్బును వెచ్చించడం తరచుగా ఇమిడి ఉంటుంది. అయితే, ధనాపేక్ష విషయమేమిటి?
‘వెండి మీది ప్రీతి’
పౌలు తనకంటే చిన్నవాడూ తన తోటి క్రైస్తవుడూ అయిన తిమోతికి వ్రాసినప్పుడు “ధనాపేక్ష,” లేక అక్షరార్థంగా చెప్పాలంటే “వెండి మీది ప్రీతి” గురించి విస్తృతంగా చర్చించాడు. పౌలు హెచ్చరికను 1 తిమోతి 6:6-19 లో కనుగొనవచ్చు. ఆయన ముఖ్యంగా వస్తుసంపదల గురించి మాట్లాడేటప్పుడు అందులో భాగంగా “ధనాపేక్ష” గురించి వ్యాఖ్యానించాడు. నేటి సమాజం డబ్బుకు ఇచ్చే ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని, పౌలు ప్రేరేపిత వ్యాఖ్యానాలను మనం జాగ్రత్తగా అధ్యయనం చేయడం మంచిది. అలాంటి పరిశీలన తప్పకుండా ప్రయోజనకరమైనది, ఎందుకంటే అది ఎలా “వాస్తవమైన జీవమును సంపాదించు”కొనవచ్చుననే రహస్యాన్ని బయల్పరుస్తుంది.
పౌలు ఇలా హెచ్చరించాడు: “ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.” (1 తిమోతి 6:10) ఈ పాఠ్యాంశంగానీ వేరే ఇతర లేఖనంగానీ డబ్బే హానికరమైనదని చెప్పడంలేదు. అంతేగాక, అపొస్తలుడు డబ్బే “కీడులకు” ప్రధానమైన కారణమనీ లేక డబ్బే ప్రతీ సమస్యకు మూలకారణమనీ అనలేదు. బదులుగా, సమస్తమైన “కీడులకు” ధనాపేక్షే ఏకైక మూలకారకం కాకపోయినప్పటికీ, అది ఒక ముఖ్య కారకమే.
అత్యాశ విషయంలో జాగ్రత్తగా ఉండండి
లేఖనాల్లో డబ్బు ఖండించబడలేదన్న వాస్తవం పౌలు హెచ్చరిక వాడిని తగ్గించదు. ధనాన్ని అపేక్షించడం ప్రారంభించిన క్రైస్తవులు అన్ని రకాల సమస్యలకు గురయ్యే ప్రమాదముంది, అందులో చాలా ఘోరమైనది విశ్వాసమునుండి తొలగిపోవడం. కొలొస్సయిలో ఉన్న క్రైస్తవులకు పౌలు చెప్పినదాన్ని బట్టి ఈ నిజం పునరుద్ఘాటించబడింది: “కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా . . . దురాశను, విగ్రహరాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి.” (కొలొస్సయులు 3:5) దురాశ, అత్యాశ, లేక “ధనాపేక్ష” విగ్రహారాధన ఎలా అవుతుంది? అంటే, ఒక పెద్ద ఇల్లూ, ఒక క్రొత్త కారూ, లేక మరింత లాభదాయకమైన ఉద్యోగం కావాలనుకోవడం తప్పని దానర్థమా? కాదు, వాటిలో ఏవి కూడా వాటంతటవే చెడ్డవి కావు. వాటిలో ఏవైనా కావాలని ఒకరి హృదయాన్ని పురిగొల్పేదేమిటి, అవి నిజంగా అవసరమేనా? అన్నది అసలు ప్రశ్న.
మామూలు కోరికకూ, దురాశకూ మధ్య తేడా వంట చేసుకోవడానికి రాజేసే చిన్న మంటకూ, అడవంతటినీ తినేసే దావానలానికీ మధ్య ఉండే తేడావలె ఉంటుంది. ఆరోగ్యకరమైన, సరైన కోరిక ప్రయోజనకరంగా ఉండగలదు. మనం కష్టపడేలా, ఫలవంతంగా పనిచేసేలా అది మనల్ని పురికొల్పుతుంది. సామెతలు 16:26 ఇలా చెబుతోంది: “కష్టము చేయువాని ఆకలి వానికొరకు వానిచేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందరపెట్టును.” కానీ దురాశ ప్రమాదకరమైనది, వినాశకరమైనది. అది అడ్డూ ఆపుల్లేని కోరిక.
మనకున్న ధనాపేక్షను అదుపులో పెట్టుకోవడమనేది ముఖ్యమైన సమస్య. మనం సమకూర్చుకునే డబ్బు లేదా మనం కావాలనుకునే వస్తుసంపదలు, మనకు దాసోహంగా ఉంటాయా లేక మనమే వాటికి దాసోహమంటామా? అందుకే పౌలు “అత్యాశాపరులు—నిజానికి . . . విగ్రహారాధకులతో సమానము” అని అంటున్నాడు. (ఎఫెసీయులు 5:5, పరిశుద్ధ బైబల్) దేనికోసమైనా అత్యాశ కలిగి ఉన్నామంటే నిజానికి మనం దానికి సేవ చేయడానికి దాన్ని మన నియంతగా, మన దైవంగా చేసుకుని లొంగిపోయామని అర్థం. అందుకు భిన్నంగా దేవుడు నిక్కచ్చిగా ఇలా చెప్తున్నాడు: “నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.”—నిర్గమకాండము 20:3.
మన అత్యాశ, దేవుడు మనకు కావలసినవి సమకూరుస్తానని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడేమోనని మనం శంకిస్తున్నట్లు కూడా సూచిస్తుంది. (మత్తయి 6:33) అప్పుడు, అత్యాశ, దేవునికి దూరంగా వెళ్లడంతో సమానమౌతుంది. ఆ విధంగా కూడా అది “విగ్రహారాధన” అవుతుంది. అందుకే దానికి విరుద్ధంగా పౌలు అంత స్పష్టంగా హెచ్చరించడంలో ఆశ్చర్యమేమీ లేదు!
యేసు కూడా అత్యాశ గురించి సూటిగా హెచ్చరించాడు. మన దగ్గర లేనిదాని కోసం మనం అతిగా ఆశపడకుండా జాగ్రత్త వహించమని ఆయన మనకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కా[దు].” (లూకా 12:15) బైబిల్లోని ఈ వచనం ప్రకారం, దాని తర్వాత యేసు చెప్పిన దృష్టాంతం ప్రకారం, అత్యాశ అనేది ఒకరి దగ్గర ఎంతుంది అన్నదే జీవితంలో ప్రాముఖ్యమైన విషయం అనే మూర్ఖపు నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. బహుశా అది డబ్బే కావచ్చు, అంతస్తే కావచ్చు, అధికారమే కావచ్చు, లేక తత్సంబంధితమైనవేవైనా కావచ్చు. మనం సంపాదించుకోగల దేని మీదైనా అత్యాశ కలిగే అవకాశముంది. దాన్ని సంపాదించుకుంటే మనకు సంతృప్తి కలుగుతుందని మనం అనుకోవచ్చు. కానీ బైబిలు ప్రకారం, మానవుని అనుభవం ప్రకారం, యేసు తన శిష్యులతో తర్కించినట్లుగా, కేవలం దేవుడు మాత్రమే మన నిజమైన అవసరాలను తీర్చగలడు, తీరుస్తాడు కూడా.—లూకా 12:22-31.
కొనుగోలుదారునికి ప్రాధాన్యమిచ్చే నేటి సమాజం అత్యాశను పురికొల్పుతోంది. అనేకమంది వెంటనే గుర్తించలేని విధంగా, అయినప్పటికీ చాలా బలమైన విధంగా ప్రభావితులై, తమ దగ్గర ఏమి ఉన్నా అది సరిపోదు అని భావిస్తున్నారు. వాళ్ళకు ఇంకా ఎక్కువ, ఇంకా పెద్దవీ, ఇంకా మంచివీ కావాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చాలని మనం ఆశించలేము కానీ వ్యక్తిగతంగా మనలో ఈ ధోరణిని ఎలా నిరోధించగలం?
సంతృప్తికి వ్యతిరేకంగా అత్యాశ
పౌలు అత్యాశకు ప్రత్యామ్నాయాన్ని సూచిస్తున్నాడు, అదే సంతృప్తి. ఆయనిలా అంటున్నాడు: “అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.” (1 తిమోతి 6:7, 8) మనకు నిజంగా కావలసినదానంతటిని గూర్చిన అంటే “అన్నవస్త్రముల”ను గూర్చిన వివరణ నిరాండబరమైనదిగా లేక సాదా సీదాగా అనిపించవచ్చు. అనేకమంది టెలివిజన్‌లోని ప్రోగ్రాముల ద్వారా ప్రసిద్ధ వ్యక్తుల విలాసలాలసమైన గృహాలను సందర్శించి వినోదిస్తారు. తృప్తిని పొందే మార్గం అది కాదు.
సామెతలు 30:8, 9) అయినా, నిజమైన పేదరికమంటే ఏమిటో పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు: ఒక వ్యక్తి జీవించడానికి చాలినంత కూడూ, గుడ్డా, గూడూ లేకపోవడమే పేదరికం. మరొక చెంప, మనకు అవి ఉంటే సంతృప్తికి ఆధారమున్నట్టే.
అలాగని, దేవుని సేవకులు ఉన్నవన్నీ వదిలేసి పేదరికంలో జీవించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. (సంతృప్తి గురించి పౌలు ఇచ్చిన ఈ వివరణ సమంజసమైనదేనా? కేవలం చాలినంత కూడూ, గుడ్డా, గూడులతో సంతృప్తి చెందడం నిజంగా సాధ్యమవుతుందా? పౌలుకు తెలిసే ఉండాలి. ఆయన యూదా సమాజంలో తనకున్న అగ్రస్థానం మూలంగా, రోమా పౌరసత్వం మూలంగా ఐశ్వర్యాన్నీ, ప్రత్యేక ప్రయోజనాలను స్వయంగా అనుభవించాడు. (అపొస్తలుల కార్యములు 22:28; 23:6; ఫిలిప్పీయులు 3:5) పౌలు తన మిషనరీ పనుల్లో తీవ్రమైన కష్టాలనూ ఎదుర్కొన్నాడు. (2 కొరింథీయులు 11:23-28) అలాంటి సందర్భాలన్నిటిలోను ఆయన తన సంతృప్తిని కాపాడుకోవడానికి సహాయపడే ఒక రహస్యాన్ని తెలుసుకున్నాడు. ఏమిటది?
“రహస్యమేమిటో నేను తెలుసుకున్నాను”
పౌలు తన పత్రికలలో ఒక దాంట్లో ఇలా వివరించాడు: “అవసరంలో ఉండటం అంటే ఏమిటో, అధికంగా కలిగి ఉండటం అంటే ఏమిటో నాకు తెలుసు. అన్ని పరిస్థితుల్లో, అంటే కడుపు నిండి ఉండుటను ఆకలితో ఉండుటను, అవసరాలలో ఉన్నప్పుడును అధికంగా కలిగి ఉన్నప్పుడును సంతృప్తికరంగా ఎలా ఉండాలో, దాని రహస్యమేమిటో, నేను తెలుసుకున్నాను.” (ఫిలిప్పీయులు 4:12, పరిశుద్ధ బైబల్) పౌలు మాటలు ఎంతో దృఢవిశ్వాసంగానూ, ఎంతో ఆశావాదంగానూ ఉన్నాయి! అలా వ్రాసినప్పుడు ఆయన జీవితం చాలా ఆశాజనకంగా ఉండివుండవచ్చని తేలిగ్గా ఊహించవచ్చు, కాని అది నిజం కాదు. ఆయన రోములోని చెరసాలలో ఉన్నాడు!—ఫిలిప్పీయులు 1:12-14.
ఆలోచింపజేసే ఆ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, వస్తుసంపదల సంతృప్తి గురించే కాకుండా, పరిస్థితులతో కూడా ఎలా సంతృప్తి చెందాలో ఈ వృత్తాంతం చాలా బలమైన సందేశాన్ని ఇస్తోంది. విపరీతమైన ధనము లేక కష్టాలు మనం వేటికి ప్రాధాన్యతనిస్తామన్న విషయాన్ని పరీక్షిస్తాయి. ఎలాంటి భౌతిక పరిస్థితుల్లోనైనా సంతృప్తి చెందగలిగేలా తనకు దోహదపడిన ఆధ్యాత్మిక ఆధారం గురించి మాట్లాడుతూ పౌలు ఇలా అన్నాడు: “నన్ను బలపరచు [దేవుని] యందే నేను సమస్తమును చేయగలను.” (ఫిలిప్పీయులు 4:13) తన ఆస్తులు అనేకమున్నా లేక కొన్నే ఉన్నా లేదా పరిస్థితులు మంచివైనా లేక చెడ్డవైనా వాటిమీద ఆధారపడడానికి బదులుగా పౌలు తనకు కావలసిన వాటి కోసం దేవుని మీద ఆధారపడ్డాడు. ఫలితం, సంతృప్తి.
పౌలు మాదిరి, ప్రత్యేకంగా తిమోతికి చాలా ప్రాముఖ్యం. ధనం కంటే దైవభక్తికీ, దేవునితో సన్నిహిత సంబంధానికీ ప్రాధాన్యతనిచ్చే జీవనశైలిని కొనసాగించమని అపొస్తలుడు ఆ యువకునికి ఉద్బోధించాడు. పౌలు ఇలా అన్నాడు: “దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.” (1 తిమోతి 6:11) ఆ మాటలు తిమోతికే చెప్పబడి ఉండవచ్చు, కానీ దేవుణ్ణి గౌరవించాలని, నిజంగా సంతోషభరితమైన జీవితం కావాలని అనుకునేవారెవరికైనా సరే ఆ మాటలు వర్తిస్తాయి.
ఇతర క్రైస్తవుల్లాగే తిమోతి అత్యాశ విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంది. పౌలు ఆయనకు వ్రాసినప్పుడు, ఆయన ఉంటున్న ఎఫెసులోని సంఘంలో ధనవంతులైన విశ్వాసులు ఉండే ఉండవచ్చు. (1 తిమోతి 1:3) భోగభాగ్యాలతో విలసిల్లుతున్న ఆ వాణిజ్య కేంద్రానికి పౌలు క్రీస్తు గురించిన సువార్తతో ప్రవేశించాడు, అనేకమందిని మార్చాడు. నేటి క్రైస్తవ సంఘంలోని కొందరు క్రైస్తవుల్లాగే, వారిలోనూ ధనవంతులు ఉండేవారనడంలో సందేహం లేదు.
ఇప్పుడు ప్రశ్నేమిటంటే, ప్రత్యేకంగా 1 తిమోతి 6:6-10 వచనాల్లోని పాఠం ప్రకారం: సంపన్నులైనవారు దేవుణ్ణి గౌరవించాలంటే ఏమి చేయాలి? వాళ్ళు తమ మనోవైఖరిని పరీక్షించుకోవడంతో ఆరంభించాలని పౌలు అంటున్నాడు. డబ్బుకు, అహంకారపూరిత భావాలను కలిగించే గుణం ఉంది. పౌలు ఇలా అంటున్నాడు: “ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.” (1 తిమోతి 6:17) ధనవంతులు వారి డబ్బును మించి చూడడాన్ని నేర్చుకోవాలి; అన్ని ధనాలకు అసలైన మూలమగు దేవుని మీద ఆధారపడవలసిన అవసరం ఉంది.
కానీ విజయం సాధించడానికి మనోవైఖరి కేవలం కొంతవరకే సహాయపడుతుంది. ధనిక క్రైస్తవులు తమ ధనాన్ని సరైన విధంగా వినియోగించడం నేర్చుకోవాలి. పౌలు ఇలా ఆదేశిస్తున్నాడు: ‘మేలు చేయండి, సత్‌క్రియలు అను ధనము గలవారై ఉండండి, ఔదార్యముగలవారై ఉండండి, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండండి.’—1 తిమోతి 6:18.
“వాస్తవమైన జీవము”
వస్తుసంపదల నిజమైన విలువను మనకు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరముందన్నదే, పౌలు ఆదేశంలోని ముఖ్యమైన సూత్రం. దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది యెత్తయిన ప్రాకారము.” (సామెతలు 18:11) అవును, ధనమివ్వగల భద్రత చివరికి ఊహ మాత్రమే, వాస్తవానికి అది మోసకరమైనది. దేవుని ఆమోదం పొందడం కంటే వాటిమీదే మన జీవితాలను కేంద్రీకరించడం పొరపాటు.
భౌతిక సంపదలకున్న అస్థిరత్వం వాటిని, మనం వాటినుంచి ఏమీ నిరీక్షించలేనంత బలహీనమైనవిగా చేస్తుంది. నిజమైన నిరీక్షణ బలమైన, అర్థవంతమైన, శాశ్వతమైన దానిపై ఆధారపడి ఉండాలి. క్రైస్తవ నిరీక్షణ మన సృష్టికర్తయైన యెహోవా దేవునిమీదా, నిత్యజీవాన్ని గూర్చిన ఆయన వాగ్దానం మీదా ఆధారపడి ఉంది. డబ్బుతో సంతోషాన్ని కొనలేమన్నది నిజం, అయితే డబ్బుతో రక్షణను కొనలేమన్నది అంతకంటే పచ్చి నిజం. కేవలం దేవునిపై మన విశ్వాసం మాత్రమే మనకు అలాంటి నిరీక్షణనివ్వగలదు.
కాబట్టి మనం ధనవంతులమైనా లేక పేదవారిమైనా, మనం “దేవునియెడల ధనవంతు”లమయ్యేలా చేసే జీవనశైలిని చేపడదాం. (లూకా 12:21) సృష్టికర్త ఎదుట ఆమోదయోగ్యమైన స్థానాన్ని పొందడం కంటే విలువైనది ఏదీలేదు. దాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ ‘వాస్తవమైన జీవమును సంపాదించుకునేందుకు, రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకునేందుకు’ దోహదపడతాయి.—1 తిమోతి 6:18, 19.
[7వ పేజీలోని చిత్రం]
పౌలు సంతృప్తి రహస్యాన్ని తెలుసుకున్నాడు
[8వ పేజీలోని చిత్రాలు]
మనకున్న వాటితోనే మనం సంతోషంగానూ సంతృప్తిగానూ ఉండగలం