కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆయన ‘అంతము వరకు సహించాడు’

ఆయన ‘అంతము వరకు సహించాడు’

ఆయన ‘అంతము వరకు సహించాడు’

యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయంలో కొత్తగా చేరిన సభ్యులకు 1993 లో చూపించిన ఒక వీడియో ప్రదర్శనలో లైమన్‌ అలెగ్జాండర్‌ స్వింగిల్‌ యెహోవాను సేవించే విషయంలో తానెలా భావిస్తున్నారన్నది ఇలా వ్యక్తం చేశారు: “డై విత్‌ యువర్‌ బూట్స్‌ ఆన్‌!” *

తొంభై సంవత్సరాల సహోదరుడు స్వింగిల్‌ ఇతరులను ఏమి చేయమని ప్రోత్సహించారో తానూ అదే చేశారు. ఆయన ‘అంతము వరకు సహించారు.’ (మత్తయి 24:​13) చాలా అస్వస్థతగా ఉన్నా, ఆయన మార్చి 7న బుధవారంనాడు యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యునిగా ఒక సమావేశానికి హాజరయ్యారు. తర్వాతి మంగళవారానికి ఆయన పరిస్థితి విషమించింది, చివరికి మార్చి 14న ఉదయం 4:⁠26 గంటలకు ఆయన మరణించినట్లు డాక్టరు చెప్పాడు.

లైమన్‌ స్వింగిల్‌ న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయంలో 1930, ఏప్రిల్‌ 5న తన సేవను ప్రారంభించారు. ఆయన దాదాపు 71 సంవత్సరాలు అక్కడ సేవచేశారు. సహోదరుడు లైమన్‌ మొదట్లో బైండింగు విభాగంలోను, తర్వాత ప్రెస్‌రూమ్‌లోను నిమమించబడ్డారు, ఆయన ఇంకు తయారీలో కూడా సహాయం చేశారు. నిజానికి సహోదరుడు స్వింగిల్‌ ఇంకు తయారీ విభాగంలో దాదాపు 25 సంవత్సరాలు పనిచేశారు, ఆయన ప్రధాన కార్యాలయంలోని రచనా విభాగంలో కూడా దాదాపు 20 సంవత్సరాలు సేవచేశారు. తన జీవితంలోని చివరి 17 సంవత్సరాలు ఆయన కోశాగారంలో పనిచేశారు.

లైమన్‌ దేవుని రాజ్యాన్ని ధైర్యంగా ప్రకటించారు. బ్రూక్లిన్‌లో తన తొలి సంవత్సరాల్లో ఆయనా ఆయన గదిలో ఉండే ఆర్థర్‌ వోర్స్‌లీ కలిసి హడ్సన్‌ నదిపై సాక్షుల పడవల్ని నడిపేవారు. గ్రామఫోన్‌ ఉపకరణాలను ఉపయోగిస్తూ వారు తీరాన ఉన్న వారికి రాజ్య సందేశాన్ని వారాంతాల్లో ప్రసారం చేసేవారు.

సహోదరుడు స్వింగిల్‌ 1910, నవంబరు 6న నెబ్రాస్కాలోని లింకన్‌లో జన్మించారు, ఆకుటుంబం త్వరలోనే యూటాలోని సాల్ట్‌ లేక్‌ సిటీకి తరలిపోయింది. అక్కడ 1913 లో ఆయన తల్లిదండ్రులు బైబిలు విద్యార్థులయ్యారు, యెహోవాసాక్షులు అప్పట్లో అలా పిలువబడేవారు. ఎన్నో సంవత్సరాలుగా స్వింగిల్‌ పరివారం బ్రూక్లిన్‌లోని ప్రధాన కార్యాలయానికి చెందిన అనేకమంది ప్రసంగీకులకు ఆతిథ్యం ఇచ్చింది, వారంతా లైమన్‌పై చక్కని ప్రభావాన్ని కనబర్చారు. 1923 లో 12 ఏండ్ల ప్రాయమున్నప్పుడు ఆయన దేవునికి తను చేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం పొందారు.

బ్రూక్లిన్‌లో 26 సంవత్సరాలకుపైగా అవివాహితునిగా సేవ చేశాక 1956, జూన్‌ 8న క్రిస్టల్‌ జర్కర్‌ను వివాహం చేసుకున్న తర్వాత లైమన్‌ జీవితం ఎంతగానో వర్ణరంజితమైంది. వారు ఒకరిని వీడి మరొకరు ఉండేవారు కాదు, 1998 లో క్రిస్టల్‌ మరణించేంత వరకు పరిచర్యలో కలిసే పాల్గొనేవారు. అంతకు మూడు సంవత్సరాల పూర్వం క్రిస్టల్‌కు పక్షవాతం రావడంతో చాలా అశక్తురాలైపోయింది. అనుదినము లైమన్‌ ఆమెకు చేసిన సపర్యలు ఆయన అంకిత భావానికే ప్రతీకగా ఉన్నాయి, ఆయనను ఎరిగిన వారందరికీ ఎంతో ప్రేరణగా ఉండేవారు. ప్రత్యేకంగా, లైమన్‌ ఎంతో ప్రేమతో తన భార్య కూర్చున్న చక్రాల కుర్చీని ఇరుగు పొరుగు ప్రాంతాల్లో పేవ్‌మెంట్‌పై తోస్తూ ఉండగా, ఆమె దారినపోతున్న వారికి కావలికోట, తేజరిల్లు! పత్రికల్ని ప్రతిపాదించే దృశ్యాన్ని చూసినవారికి ఎంతో పురికొల్పుగా ఉండేది.

సహోదరుడు స్వింగిల్‌ చాలా ముక్కు సూటియైన మనిషి, ఆయనతో పరిచయం పెంచుకున్నవారి హృదయాలకు చేరువైన వ్యక్తి. ఆయన తల్లిదండ్రుల్లానే ఆయన కూడా యేసుక్రీస్తుతో పాటు పరలోక రాజ్యంలో జీవించే నిరీక్షణను కలిగివున్నాడు. ఇప్పుడా నిరీక్షణ ఫలించిందని మనం పూర్తిగా నమ్మగలం.​—⁠1 థెస్సలొనీకయులు 4:​15-18; ప్రకటన 14:⁠13.

[అధస్సూచీలు]

^ పేరా 1 అంటే, ఒక వ్యక్తి కొన ఊపిరిదాకా క్రియాశీలంగా పనిచేస్తూ ఉండాలని అర్థం.

[31వ పేజీలోని చిత్రం]

సహోదరుడు స్వింగిల్‌ ఇంక్‌ తయారీ విభాగంలో 25 సంవత్సరాలు సేవచేశారు

[31వ పేజీలోని చిత్రం]

లైమన్‌ క్రిస్టల్‌లు ఒకరిని విడిచి మరొకరు ఉండేవారు కాదు