కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కాలపరీక్షకు తట్టుకునే వృక్షాలు

కాలపరీక్షకు తట్టుకునే వృక్షాలు

కాలపరీక్షకు తట్టుకునే వృక్షాలు

ఇల్లు కట్టుకోవడానికి ఎవరూ నిటారుగా ఉన్న కొండను ఎన్నుకోరు, ప్రత్యేకంగా అది ఎత్తైన పర్వతాల మీద అయితే అలాంటి తలంపు కూడా రాదు. అయితే ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా కొన్ని పైన్‌ వృక్షాలు నిటారుగా ఉన్న కొండచరియల్లో దృఢంగా పాతుకుని ఉంటాయి. శీతాకాలపు ఎముకలు కొరికే చలిని, ఎండాకాలంలోని నీటికొరతను లక్ష్యపెట్టకుండా ఇవి మనగలుగుతాయి.

సాధారణంగా దృఢమైన ఈవృక్షాలు సమతల భూమిపై పెరిగే సజాతి వృక్షాలంత ఠీవిగా కనబడవు. వాటి కాండాలు మెలికలు తిరిగిపోయి బుడిపెలతో నిండివుంటాయి, కాండాల పెరుగుదల కూడా బాగా గిడసబారి ఉంటుంది. కొన్నైతే కఠోరమైన వాతావరణ పరిస్థితుల మూలంగా, వేళ్ళదగ్గర నేల సరిపోకపోవడం మూలంగా సహజ బోన్సాయ్‌ చెట్లలా కూడా కనబడతాయి.

భూమ్మీది అత్యంత ప్రతికూలమైన పర్యావరణాన్ని అవి సహించగలుగుతాయి గనుక వాటి జీవితకాలం చాలా తక్కువగా ఉంటుందని మీరనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. మెతూషెలా అని కొందరు పిలిచే బ్రిస్టల్‌కోన్‌ పైన్‌ వృక్షాలు కాలిఫోర్నియాలోని వైట్‌ మౌంటైన్స్‌లో 10,000 అడుగుల ఎత్తులో పెరుగుతాయి, వీటికి 4,700 సంవత్సరాల వయసుంటుందని కొందరు అంటారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ 1997 ఈవృక్షాన్ని మన గ్రహంపై సజీవంగా ఉన్న అతి పెద్ద వయస్సుగల వృక్షమని చెబుతోంది. ఈప్రాచీన వృక్షాల గురించి అధ్యయనం చేసిన ఎడ్మండ్‌ షూల్మన్‌ ఇలా వివరిస్తున్నాడు: “బ్రిస్టల్‌కోన్‌ పైన్‌ ప్రతికూల పరిస్థితుల్లోనైనా మనగలుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇతర అధికాయుష్షుగల [పైన్‌ వృక్షాలన్నీ] వైట్‌ మౌంటైన్స్‌లో 10,000 అడుగుల ఎత్తున పొడి వాతావరణంలో రాళ్ళురప్పల్లోనే కనిపించాయి.” పురాతనమైన ఇతర పైన్‌ వృక్షాలు అదే విధంగా కఠిన వాతావరణ పరిస్థితుల్లో జీవిస్తున్నట్లు షూల్మన్‌ కనుగొన్నాడు.

సహనానికే మారు పేర్లయిన ఈవృక్షాలు అలాంటి పరిస్థితుల్ని అధిగమించాల్సి ఉన్నప్పటికీ వీటికి ఉన్న రెండు అనుకూలతల నుండి పూర్తిగా ప్రయోజనం పొందుతాయి. ఒకటి, దరిదాపుల్లో వేరే వృక్షాలేవీ ఉండకపోవడం వల్ల ఇవి దావానలాల బారిన పడవు. దావానలం వృక్షాలకు అత్యంత ప్రమాదకారిగా ఉంటోంది. రెండు, వీటి వేర్లు నిటారుగా ఉన్న కొండచరియల్లో ఎంత దృఢంగా పాతుకుపోయి ఉంటాయంటే భూకంపం వస్తేగాని అవి వాటి స్థానభ్రంశం చెందవు.

బైబిలులో విశ్వసనీయులైన దేవుని సేవకులు చెట్లతో పోల్చబడ్డారు. (కీర్తన 1:​1-3; యిర్మీయా 17:​7,8) వారు కూడా అనేకమైన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవచ్చు. హింసలు, అస్వస్థత, కడు బీదరికం వంటివి వారి విశ్వాసాన్ని చివరికంటా పరీక్షిస్తుండవచ్చు; ప్రత్యేకంగా శ్రమలు ఏటేటా ఎడతెగక ఉంటున్నప్పుడు. అయినప్పటికీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా అంత చక్కగా మనగలుగుతున్న చెట్లను రూపొందించిన వారి సృష్టికర్త వారికి మద్దతునిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిలదొక్కుకుని నిలబడేవారికి బైబిలు ఇలా వాగ్దానం ఇస్తోంది: “తానే మిమ్మును ... స్థిరపరచి బలపరచును.”​—⁠1 పేతురు 5:9,10.

బైబిలులో తరచు “సహనం” అని అనువదించబడిన గ్రీకు క్రియాపదం వెనుక ‘నిలదొక్కుకొని నిలబడడం, స్థిరంగా ఉండడం, లేదా పట్టుదలతో కొనసాగడం’ అన్న భావం ఉంది. ఆల్పైన్‌ వృక్షాల విషయంలోలానే సహనానికి చక్కగా వేళ్ళూనుకుని ఉండడం కీలకం. క్రైస్తవుల విషయంలో చూస్తే వారు స్థిరంగా నిలబడాలంటే యేసుక్రీస్తులో వారు దృఢంగా వేరుపారివుండాలి. పౌలు ఇలా వ్రాశాడు: “మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి.”​—⁠కొలొస్సయులు 2:6,7.

పౌలు బలమైన ఆధ్యాత్మిక వేర్లు ఉండాల్సిన అవసరాన్ని గుర్తించాడు. ఆయన తానుగా “శరీరములో ఒక ముల్లు”తో పోరాడాడు, తన పరిచర్య అంతట్లో ఘోరమైన హింసలను సహించాడు. (2 కొరింథీయులు 11:​23-27; 12:⁠7) కానీ ఆయన దేవుని శక్తితో ముందుకు కొనసాగడాన్ని కనుగొన్నాడు. “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” అన్నాడాయన.​—⁠ఫిలిప్పీయులు 4:⁠13.

పౌలు మాదిరి చూపిస్తున్నట్లుగా విజయవంతమైన క్రైస్తవ సహనం అనుకూల పరిస్థితులపై ఆధారపడదు. మనం క్రీస్తునందు వేరుపారిన వారమైతే, మనల్ని బలపర్చే దేవునిపై ఆధారపడితే శతాబ్దాలపాటు తుపానుల్ని విజయవంతంగా సహించే ఆల్పైన్‌ వృక్షాల్లా మనం కూడా నిలదొక్కుకుని నిలబడగలము. అంతేకాదు, మనం అంతం వరకు సహిస్తే మరో దైవిక వాగ్దానం నెరవేరడాన్ని అనుభవిస్తాము: “నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును.”​—⁠యెషయా 65:22; మత్తయి 24:⁠13.