కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలును అర్థం చేసుకోవడానికి సహాయం

బైబిలును అర్థం చేసుకోవడానికి సహాయం

బైబిలును అర్థం చేసుకోవడానికి సహాయం

బైబిలు అసమానమైన పుస్తకం. దాని రచయితలు దేవుడు తమను ప్రేరేపించాడని చెప్పుకుంటారు, దానిలోని విషయాలు వాళ్లు చెప్పుకుంటున్నది నిజమనడానికి తగినంత సాక్ష్యాధారాన్ని ఇస్తున్నాయి. (2 తిమోతి 3:​16,17) ఇతర విషయాలతోపాటు, మనం ఎక్కడి నుండి వచ్చామో, మనమెందుకు ఇక్కడున్నామో, మనమెటు పయనిస్తున్నామో బైబిలు చూపిస్తుంది. నిజంగా అది మనం పరిశీలించదగిన పుస్తకం!

బహుశా మీరు బైబిలు చదవడానికి ప్రయత్నించి, దాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నట్లు కనుగొని ఉండవచ్చు. మీప్రశ్నలకు సమాధానాల కోసం ఎక్కడ వెదకాలో బహుశా మీకు తెలియకపోవచ్చు. అయితే, అలాంటి పరిస్థితిలో ఉన్నది మీరొక్కరే కాదు. మీపరిస్థితి, మొదటి శతాబ్దానికి చెందిన ఒక వ్యక్తి పరిస్థితిలాగే ఉంది. ఆయన యెరూషలేము నుండి తన స్వదేశమైన ఇథియోపియాకు రథంలో ప్రయాణిస్తున్నాడు. ఐతియోపీయుడైన ఈఅధికారి, అంతకు ముందే ఏడు వందల సంవత్సరాలకన్నా ఎక్కువకాలం క్రితం వ్రాయబడిన బైబిల్లోని ప్రవచనార్థక పుస్తకమైన యెషయా గ్రంథాన్ని బిగ్గరగా చదువుతున్నాడు.

హఠాత్తుగా, తన రథం పక్కనుండి పరుగెత్తుతున్న ఒక వ్యక్తి ఆయనను పలకరించాడు. ఆవ్యక్తి ఫిలిప్పు, యేసు శిష్యుల్లో ఒకడు. ఆయన “నీవు చదువునది గ్రహించుచున్నావా?” అని ఆఐతియోపీయుడ్ని అడిగాడు. దానికి ఆఐతియోపీయుడు, “ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగల[ను]” అని సమాధానమిచ్చాడు. ఆతర్వాత ఆయన ఫిలిప్పును తన రథంలోకి ఆహ్వానించాడు. ఫిలిప్పు ఆవ్యక్తి చదువుతున్న ప్రకరణ భావాన్ని వివరించి, ఆయనకు “యేసును గూర్చిన సువార్త” ప్రకటించడం మొదలుపెట్టాడు.​—⁠అపొస్తలుల కార్యములు 8:30-35.

పూర్వం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఫిలిప్పు ఆఐతియోపీయుడికి సహాయం చేసినట్లే, నేడు యెహోవాసాక్షులు బైబిలును అర్థం చేసుకోవడానికి ప్రజలకు సహాయం చేస్తారు. మీకు కూడా సహాయం చేయడానికి వారు ఇష్టపడతారు. సాధారణంగా, ప్రాథమికమైన లేఖన బోధలతో మొదలుపెట్టి, బైబిలును ఒక క్రమపద్ధతిలో అధ్యయనం చేయడం మంచిది. (హెబ్రీయులు 6:⁠1) మీరు అభివృద్ధి సాధిస్తుండగా, అపొస్తలుడైన పౌలు “బలమైన ఆహారము” అని చెప్పినదాన్ని అంటే లోతైన సత్యాలను ఆకళింపు చేసుకోగల్గుతారు. (హెబ్రీయులు 5:​14) మీరు అధ్యయనం చేసేది బైబిలే అయినా, బైబిలు అధ్యయన సహాయక ప్రచురణల వంటివి, వివిధ అంశాలపై బైబిలు ప్రకరణాలను కనుగొనడానికీ, అర్థం చేసుకోవడానికీ మీకు తోడ్పడతాయి.

సాధారణంగా మీకు అనుకూలమైన సమయంలో, అనువైన స్థలంలో అధ్యయనాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కొంతమంది ఫోను ద్వారా సహితం అధ్యయనం చేస్తారు. అధ్యయనం తరగతి గదిలాంటి వాతావరణంలో జరగదు; అది మీపూర్వాపరాలు, విద్య వంటివాటితో సహా మీవ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడిన ప్రత్యేక ఏర్పాటు. అలాంటి బైబిలు అధ్యయనం కోసం మీరు డబ్బు చెల్లించవలసిన అవసరం ఉండదు. (మత్తయి 10:⁠8) పరీక్షలు ఉండవు, మీరు ఇబ్బందిపడాల్సిన పనే ఉండదు. మీప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడతాయి, దేవునికి ఎలా సన్నిహితం కావచ్చో మీరు నేర్చుకుంటారు. ఏదైనా, అసలు మీరెందుకు బైబిలు అధ్యయనం చేయాలి? బైబిలు అధ్యయనం మీజీవితాన్ని ఎందుకు ఆనందభరితం చేయగలదో, కొన్ని కారణాలను పరిశీలించండి.