కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలును—ఎందుకు అధ్యయనం చేయాలి?

బైబిలును—ఎందుకు అధ్యయనం చేయాలి?

బైబిలును—ఎందుకు అధ్యయనం చేయాలి?

బిల్‌ యౌవనస్థుడు, శరీర దారుఢ్యం గలవాడు, విద్యావంతుడు, ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నాడు. అయినా ఆయనకు సంతృప్తి లేదు. ఆయన జీవితానికి ఏసంకల్పమూ లేదు, అది ఆయనకు విపరీతమైన చింత కలిగించేది. జీవితానికొక సంకల్పాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తూ, ఆయన వివిధ మతాలను పరిశీలించాడు, కానీ ఆయన దేని కోసం వెతుకుతున్నాడో దాన్ని కనుగొనలేకపోయాడు. ఆయన 1991 లో ఒక యెహోవా సాక్షిని కలిశాడు, ఆసాక్షి ఈయనకొక పుస్తకాన్ని ఇచ్చాడు, అందులో జీవితార్థాన్ని గురించి బైబిలు ఏమి చెబుతోందో చర్చించబడింది. బిల్‌ అలాగే మరితరులు ఈఅంశానికి అవధానం ఇవ్వగలిగేలా అందరికీ ఒక బైబిలు అధ్యయనం ఏర్పాటు చేయబడింది.

బిల్‌ ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “మా మొదటి అధ్యయనం జరుగుతున్నప్పుడు మేము తరచు బైబిలు తెరిచి చూశాము గనుక, నేను వెతుకుతున్నది దీనికోసమేనని నాకర్థమైపోయింది. బైబిల్లోని సమాధానాలు చాలా ఉత్తేజకరంగా ఉన్నాయి. ఆఅధ్యయనం తర్వాత నేను నా ట్రక్కు తీసుకుని కొండలపైకి వెళ్లి, పట్టలేని ఆనందంతో బిగ్గరగా కేకలు వేశాను. చివరికి నా ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోగలుగుతున్నందుకు నేను పులకించిపోయాను.”

నిజమే, బైబిలు సత్యాన్ని కనుగొనే ప్రతి ఒక్కరూ పట్టలేని ఆనందంతో అక్షరార్థంగా అలా కేకలు వేయకపోవచ్చు. అయినా, జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడం చాలామందికి ఆనందకరమైన అనుభవమే. వాళ్లు యేసు చెప్పిన ఉపమానంలోని, ఒక పొలంలో దాచబడివున్న ధనాన్ని కనుగొన్న వ్యక్తిలా భావిస్తారు. ఆవ్యక్తి గురించి యేసు ఇలా చెప్పాడు: “[అతడు] సంతోషముతో వెళ్లి, తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును.”​—⁠మత్తయి 13:​44.

అర్థవంతమైన జీవితానికి కీలకం

జీవిత సంకల్పమేమిటనే ప్రాథమికమైన ప్రశ్న గురించి బిల్‌ మనస్కరించాడు. తత్త్వవేత్తలు, వేదాంతులు, శాస్త్రవేత్తలు, ఆప్రశ్నకు సమాధానం కనుగొనడానికి సహస్రాబ్దాలుగా తంటాలు పడ్డారు. దానికి సమాధానం చెప్పాలని ప్రయత్నించిన వ్యక్తులు అసంఖ్యాకమైన గ్రంథాలను రచించారు. వాళ్ళ ప్రయాసలన్నీ వ్యర్థమయ్యాయి, చాలామంది ఆప్రశ్నకు సమాధానం కనుగొనలేమనే ముగింపుకు వచ్చారు. అయితే, ఆప్రశ్నకు సమాధానం ఉంది. ఆసమాధానం గంభీరమైనదే అయినప్పటికీ, క్లిష్టమైనది కాదు. అది బైబిల్లో వివరించబడింది. అర్థవంతమైన, ఆనందభరితమైన జీవితానికి కీలకమిదే: మన సృష్టికర్తా, పరలోక తండ్రీ అయిన యెహోవాతో మనకు సరైన సంబంధం ఒకటి ఉండాలి. దాన్ని మనమెలా సాధించవచ్చు?

దేవునికి సన్నిహితం కావడానికి విభిన్నంగా ఉన్నట్లు కనిపించే రెండు అంశాలున్నాయి. దేవునికి సన్నిహితమయ్యేవారు ఆయనకు భయపడతారు, ఆయనను ప్రేమిస్తారు. ఆవ్యాఖ్యానాన్ని సమర్థించే రెండు లేఖనాలను మనం పరిశీలిద్దాం. పూర్వకాలంలోని జ్ఞానవంతుడైన సొలొమోను రాజు మానవజాతిని జాగ్రత్తగా అధ్యయనం చేసి, తాను కనుగొన్న విషయాలను బైబిలు పుస్తకమైన ప్రసంగిలో వ్రాశాడు. తాను కనిపెట్టినవాటిని సంక్షిప్తంగా ఆయనిలా వ్రాశాడు: “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.” (ఇటాలిక్కులు మావి.) (ప్రసంగి 12:​13) శతాబ్దాల తర్వాత, మోషేకివ్వబడిన ధర్మశాస్త్రంలో అత్యంత గొప్ప ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు, యేసు ఇలా సమాధానమిచ్చాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును [“యెహోవాను,” NW] ప్రేమింపవలె[ను].” (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 22:​37) మనం దేవునికి భయపడాలి, అలాగే ఆయనను ప్రేమించాలి అంటే మీకు వింతగా అనిపిస్తుందా? భయమూ ప్రేమల ప్రాముఖ్యతను మనం పరిశీలిద్దాం, అలాగే దేవునితో సంతృప్తికరమైన సంబంధాన్ని కలిగివుండటానికి ఈరెండిటి కలయిక ఎలా సహాయం చేస్తుందో కూడా చూద్దాం.

దేవునికి భయపడడమంటే అర్థమేమిటి?

దేవునికి అంగీకారయుక్తంగా మనం ఆయనను ఆరాధించాలంటే, ఆయనపట్ల మనం గౌరవపూర్వకమైన భయం కలిగివుండడం ఆవశ్యకం. బైబిలు ఇలా చెబుతోంది: “యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము.” (కీర్తన 111:​10) అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దైవ కృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము.” (హెబ్రీయులు 12:​28) అలాగే, అపొస్తలుడైన యోహాను తన దర్శనమందు చూసిన మధ్యాకాశంలో ఎగురుతున్న దేవదూత, “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి” అనే మాటలతో తన సువార్త ప్రకటనను ప్రారంభించాడు.​—⁠ప్రకటన 14:6,7.

ఈ దైవభయం మరణకరమైన భయం వంటిది కాదు. క్రూరమైన ప్రమాదకరమైన నేరస్థుడు బెదిరిస్తే మనం భయపడతాం, అయితే దేవుని పట్ల భయం, అంటే దైవభయం సృష్టికర్త ఎడల కలిగే లోతైన భక్తితో కూడిన భయం. ఆయన అవిధేయులను శిక్షించే అధికారమున్న, శక్తి గల సర్వోన్నత న్యాయాధిపతీ సర్వశక్తిమంతుడూ గనుక, ఆదేవుణ్ణి అప్రీతిపర్చకూడదనే ఆరోగ్యకరమైన భయం దీనిలో చేరివుంది.

భయం, ప్రేమ కలిసి పనిచేస్తాయి

అయితే, ప్రజలు తనపట్ల భయంతో తన సేవ చేయాలని యెహోవా కోరుకోవడం లేదు. యెహోవా ఎంతో విశేషంగా, ప్రేమామయుడైన దేవుడు. అపొస్తలుడైన యోహాను, “దేవుడు ప్రేమాస్వరూపి” అని వ్రాసేందుకు పురికొల్పబడ్డాడు. (1 యోహాను 4:⁠8) యెహోవా దేవుడు మానవజాతితో ఎంతో ప్రేమగా వ్యవహరించాడు, వారు తిరిగి తనను ప్రేమించడం ద్వారా ప్రతిస్పందించాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే అలాంటి ప్రేమ దైవ భయంతో ఎలా పొందిక కలిగివుంది? వాస్తవానికి రెండూ పరస్పరం సన్నిహిత సంబంధం కలిగివున్నాయి. కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “యెహోవాకు భయపడేవారు ఆయనకు సన్నిహితులవుతారు.”​—⁠కీర్తన 25:​14, NW.

బలవంతుడైన, జ్ఞానవంతుడైన తండ్రిపట్ల ఒక పిల్లవాడికి ఉండే గౌరవం గురించీ, భయం గురించీ ఆలోచించండి. అదే సమయంలో ఆపిల్లవాడు తండ్రి ప్రేమకు ప్రతిస్పందిస్తాడు. ఆపిల్లవాడు తండ్రిమీద ప్రగాఢమైన విశ్వాసం ఉంచి, ఆయన నడిపింపు ప్రయోజనం చేకూరుస్తుందన్న దృఢనమ్మకంతో నడిపింపు కోసం ఆయనవైపు చూస్తాడు. అలాగే, మనం యెహోవాకు భయపడి ఆయనను ప్రేమిస్తే మనం ఆయనిచ్చే నిర్దేశానికి విధేయులమవుతాము, ఇది మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇశ్రాయేలీయుల గురించి యెహోవా ఏం చెప్పాడో గమనించండి: “వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు.”​—⁠ద్వితీయోపదేశకాండము 5:29.

అవును, దైవభయం బంధకాలకు కాదు గానీ స్వేచ్ఛకూ, దుఃఖానికి కాదు గానీ ఆనందానికీ నడిపిస్తుంది. యేసు గురించి యెషయా ఇలా ప్రవచించాడు: “యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.” (యెషయా 11:⁠3) కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “యెహోవాయందు భయభక్తులుగలవాడు, ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.”​—⁠కీర్తన 112:⁠1.

నిజానికి దేవుడు మనకు తెలియకపోతే మనం ఆయనకు భయపడనూ లేము, ఆయనను ప్రేమించనూ లేము. అందుకే బైబిలు అధ్యయనం అంత ప్రాముఖ్యం. అలాంటి అధ్యయనం, దేవుని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికీ, ఆయనిచ్చే నిర్దేశాన్ని అనుసరించడంలోని జ్ఞానాన్ని మెప్పుదలతో గ్రహించడానికీ మనకు సహాయం చేస్తుంది. మనం దేవునికి సన్నిహితమవుతుండగా, మనం ఆయన చిత్తాన్ని చేయాలని కోరుకుంటాము, ఆయన ఆజ్ఞలు మనకు ప్రయోజనం చేకూరుస్తాయని తెలుసుకుని వాటిని అనుసరించడానికి పురికొల్పబడతాము.​—⁠1 యోహాను 5:⁠3.

జీవితంలో సరైన మార్గంలో ఉన్నామని తెలుసుకోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్టికల్‌ ఆరంభంలో ప్రస్తావించిన బిల్‌ విషయంలో ఇదే నిజమైంది. ఇటీవల ఆయనిలా చెప్పాడు: “నేను మొదటిసారి బైబిలు అధ్యయనం చేసినప్పటి నుండీ ఇప్పటి వరకూ గడిచిన తొమ్మిదేళ్లలో యెహోవాతో నా సంబంధం మరింత సన్నిహితమైంది. సత్యం తెలుసుకొన్న క్రొత్తలో నేను పొందిన ఆతొలి ఆనందపు పొంగు, నిజంగా ఆనందభరితమైన జీవన మార్గంగా వృద్ధి చెందింది. జీవితంపట్ల నాకేర్పడిన ఆశాజనకమైన దృక్కోణంలో పొందిక ఏర్పడింది. నా దైనందిన జీవితమంతా గమ్యంలేని ఆనందాన్వేషణతో కాదుగానీ అర్థవంతమైన కార్యకలాపాలతో నిండిపోయింది. యెహోవా నాకు నిజమైన వ్యక్తిగా ఉన్నాడు, ఆయన నా యోగక్షేమాల పట్ల నిజంగా శ్రద్ధ కలిగివున్నాడని నాకు తెలుసు.”

తర్వాతి ఆర్టికల్‌లో, యెహోవాను గురించిన పరిజ్ఞానాన్ని తమ జీవితాల్లో అన్వయించుకునే వారికి అది ఆనందాన్నీ ప్రయోజనాలనూ ఎలా చేకూరుస్తుందో మనం మరింతగా పరిశీలిస్తాము.

[5వ పేజీలోని బ్లర్బ్‌]

దేవునికి సన్నిహితం కావాలంటే మనం ఆయనను ప్రేమించాలి అలాగే ఆయనకు భయపడాలి

[6వ పేజీలోని చిత్రం]

యెహోవా పట్ల భయంతో యేసు ఆనందభరితుడిగా ఉన్నాడు