కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సందేహాలు మీ విశ్వాసాన్ని నశింపజేయనివ్వకండి

సందేహాలు మీ విశ్వాసాన్ని నశింపజేయనివ్వకండి

సందేహాలు మీ విశ్వాసాన్ని నశింపజేయనివ్వకండి

ఒకరోజు మీకు ఒంట్లో చాలా బాగున్నట్లు అనిపిస్తుంది. కానీ మరుసటి రోజు ఆనారోగ్యం పాలవుతారు. అకస్మాత్తుగా మీలో శక్తి, సత్తువ ఏమాత్రం లేనట్లే అనిపిస్తుంది. తల పగిలిపోతున్నట్లు అనిపిస్తుంది, ఒళ్ళంతా నొప్పిగా ఉంటుంది. మీకేమయ్యింది? ప్రమాదకరమైన రోగక్రిములు మీశరీర రక్షణ వ్యవస్థను ఛేదించాయి, కీలకమైన శరీరంలోని అవయవాలపై దాడి చేశాయి. ఒకవేళ చికిత్స చేయకపోతే ఆక్రిములు మీఆరోగ్యాన్ని పూర్తిగా పాడుచేయగలవు​—⁠మిమ్మల్ని మృత్యువాతకు గురిచేయగలవు కూడా.

మీకు ఆరోగ్యం బాగాలేని సమయంలో ఏదైనా అంటువ్యాధి సోకితే అప్పుడు మీరు మరింత భేదనీయంగా తయారవుతారు. ఉదాహరణకు, మీశరీరం కుపోషణ మూలంగా బలహీనమైతే మీరోగనిరోధక శక్తి “ఎంతగా తగ్గిపోతుందంటే చిన్న అంటువ్యాధి సోకినా ప్రాణాల మీదికి వస్తుంది” అని వైద్య అంశాల రచయిత పీటర్‌ విన్‌గేట్‌ అంటున్నాడు.

అలాంటప్పుడు, కరవు పరిస్థితుల్లో జీవించడానికి మనలో ఎవరు ఇష్టపడతారు? మంచి ఆహారం తీసుకోవడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు మీకు సాధ్యమైన ప్రయత్నాలు తప్పక చేస్తారు. బహుశ మీరు వైరస్‌లకు బాక్టీరియాకు దూరంగా ఉండడానికి కూడా మీకు చేతనైనంత ప్రయత్నం చేస్తారు. మరైతే, మీరు “విశ్వాస[మందు] ఆరోగ్యముగలవారునై” ఉండే విషయానికి వస్తే అంతే జాగ్రత్తలు తీసుకుంటారా? (తీతు 2:⁠2, అథస్సూచి.) ఉదాహరణకు, మీరు హానికరమైన సందేహాలు తీసుకురాగల అపాయం విషయంలో అప్రమత్తంగా ఉంటారా? అవి మన మనస్సుపై హృదయంపై చాలా సులభంగా దాడి చేయగలవు, మన విశ్వాసానికి, యెహోవాతో మనకు గల సంబంధానికి చాలా సులభంగా నష్టాన్ని వాటిల్లజేయగలవు. కొందరు వ్యక్తులు ఈప్రమాదాన్ని ఏమాత్రం గ్రహిస్తున్నట్లుగా లేదు. వారు ఆధ్యాత్మికంగా అలమటించడం ద్వారా తమను తాము సందేహాల ప్రమాదంలో పడేలా చేసుకుంటారు. భేద్యులను చేసుకుంటారు. మీరు కూడా అలా పడే అవకాశం ఉందా?

సందేహం​—⁠అది అన్ని సందర్భాల్లో హానికరమా?

నిజానికి సందేహాలన్నీ చెడ్డవి కావు. కొన్నిసార్లు మీరు ఏదైనా విషయాన్ని నమ్మడానికి ముందు వాస్తవమేమిటో మీరు నిశ్చయపరచుకోవాల్సి ఉంటుంది. మీరు ఊరికే నమ్మేయాలనీ దేన్నీ సందేహించకూడదనీ చెప్పే మతపరమైన ప్రబోధాలు చాలా ప్రమాదకరమైనవి, మోసపూరితమైనవి. ప్రేమ “అన్నిటిని నమ్మును” అని బైబిలు చెబుతుందన్నది నిజమే. (1 కొరింథీయులు 13:⁠7) గతంలో నమ్మకస్థులుగా నిరూపించుకున్నవారిని నమ్మడానికి ప్రేమగల క్రైస్తవుడు తప్పకుండా సిద్ధంగా ఉంటాడు. కానీ, దేవుని వాక్యము ‘ప్రతి మాటను నమ్మే’ అలవాటును గూర్చి కూడా హెచ్చరిస్తోంది. (సామెతలు 14:​15) కొన్నిసార్లు ఒకవ్యక్తి గత చరిత్ర ఆయనను సందేహించేందుకు తగిన కారణాన్ని ఇస్తుంది. “[కపటియైన] వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము” అని బైబిలు హెచ్చరిస్తోంది.​—⁠సామెతలు 26:24,25.

అపొస్తలుడైన యోహాను కూడా గ్రుడ్డి నమ్మకాలకు విరుద్ధంగా క్రైస్తవుల్ని హెచ్చరిస్తున్నాడు. “ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి” అని ఆయన వ్రాస్తున్నాడు. (1 యోహాను 4:1) ఇక్కడి “ఆత్మ” అంటే ఏదైనా బోధ లేదా అభిప్రాయం అని అర్థం, అది దేవుని నుండి వస్తున్నట్లు కనిపించవచ్చు. కానీ అది నిజంగానే ఆయన నుండి వచ్చిందా? కొంచెం సందేహిస్తూ, వెంటనే నమ్మకపోవడం లేదా అంగీకరించకపోవడం నిజమైన రక్షణగా ఉండగలదు, ఎందుకంటే అపొస్తలుడైన యోహాను చెబుతున్నట్లు “వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు.”​—⁠2 యోహాను7.

నిరాధారమైన సందేహాలు

అవును, వాస్తవాల్ని నిష్కపటంగా, వినమ్రంగా పరిశీలించడం ద్వారా సత్యాసత్యాల నిగ్గుతేల్చడం కొన్నిసార్లు అవసరం అవుతుంది. అయితే ఇది, నిరాధారమైన వినాశనకరమైన సందేహాలు మన మనస్సులోను హృదయంలోను వృద్ధిచెందేలా అనుమతించడానికి భిన్నంగా ఉంటుంది. అలాంటి సందేహాలు సుస్థాపితమైన నమ్మకాలను సంబంధాలను ధ్వంసం చేయగలవు. ఇలాంటి సందేహం, “ఏదైనా నిర్ణయం తీసుకోవడంతో జోక్యం చేసుకునే అనిశ్చిత నమ్మకం లేదా అభిప్రాయం” అని నిర్వచించబడింది. సాతాను హవ్వ మనస్సులో యెహోవాను గురించి ఎలా సందేహాలను నాటాడో మీకు గుర్తుందా? “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” అని అడిగాడు. (ఆదికాండము 3:⁠1) ఎంతో అమాయకంగా ధ్వనించే ఆప్రశ్న సృష్టించిన అనిశ్చిత పరిస్థితి ఆమె నిర్ణయం తీసుకునే ప్రక్రియలో జోక్యం చేసుకుంది. సాతాను ఉపయోగించే విలక్షణ పద్ధతుల్లో అదొకటి. విషం కుమ్మరించే ఆకాశరామన్నలా అతడు అన్యాపదేశంగా మాట్లాడడంలో, అర్థసత్యాల్నీ పచ్చి అబద్ధాల్నీ చెప్పడంలో సిద్ధహస్తుడు. సాతాను ఆవిధంగా హానికరమైన సందేహాలను ప్రజల మనస్సుల్లో నాటుతూ, ఎంతో ఆరోగ్యకరమైన పరస్పర నమ్మకమున్న అసంఖ్యాకమైన సంబంధాల్ని నాశనం చేశాడు.​—⁠గలతీయులు 5:​7-9.

ఈ విధమైన సందేహాలు తీసుకురాగల హానికరమైన ప్రభావాలను శిష్యుడైన యాకోబు స్పష్టంగా అర్థం చేసుకొన్నాడు. పరీక్షా కాలంలో దేవుని సహాయం కోసం ఆయనను స్వేచ్ఛగా సమీపించే అద్భుతమైన ఆధిక్యతను గురించి ఆయన వ్రాస్తున్నాడు. కానీ మీరు దేవునికి ప్రార్థించేటప్పుడు, “ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను” అని యాకోబు హెచ్చరిస్తున్నాడు. దేవునితో మనకున్న సంబంధంలో సందేహాలుంటే అది “గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలి” ఉంటుంది. మనం “ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు”గా ఉండే వ్యక్తిలా తయారవుతాము. (యాకోబు 1:​6-8) మనం అపనమ్మకాన్ని ఏర్పర్చుకుంటాం దాంతో సందిగ్ధంలో పడిపోతాం. అప్పుడు, హవ్వకు జరిగినట్లుగా మనం ప్రతి విధమైన దయ్యాల బోధలకు తత్త్వజ్ఞానానికీ సులభంగా లోనయ్యే ప్రమాదస్థితిలో ఉంటాము.

మంచి ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం

మరైతే మనల్ని మనం హానికరమైన సందేహాల నుండి ఎలా కాపాడుకోగలం? జవాబు చాలా సులభం: సాతాను ప్రచారాన్ని స్థిరంగా తిరస్కరించి, మనలను “విశ్వాసమందు స్థిరు”లను చేసే దేవుని ఏర్పాట్ల నుండి ప్రయోజనం పొందడమే.​—⁠1 పేతురు 5:​8-10.

ఆధ్యాత్మిక భోజనాన్ని వ్యక్తిగతంగా సుష్టుగా భుజించడం అత్యంత కీలకం. ముందు పేర్కొనబడ్డ పీటర్‌ విన్‌గేట్‌ అనే రచయిత ఇలా వివరిస్తున్నాడు: “శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా, రసాయనిక ప్రక్రియలూ కీలకమైన అవయవాలు పనిచేయడం కొనసాగడానికి శక్తి నిరంతరాయంగా అవసరమవుతూనే ఉంటుంది; అంతేగాక అనేక కణజాలాల్లోని పదార్థాల స్థానే నిరంతరంగా క్రొత్త పదార్థాలు అవసరం అవుతుంటాయి.” మన ఆధ్యాత్మిక ఆరోగ్యం విషయంలో కూడా అంతే. నిరంతరం ఆధ్యాత్మిక ఆహారాన్ని భుజిస్తూ ఉండకపోతే మన విశ్వాసం అనేది ఆహారం కొరవడిన శరీరంలా క్రమేణా నశించి, చివరికి చనిపోతుంది. యేసుక్రీస్తు దీన్ని నొక్కిచెబుతూ ఇలా అన్నాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.”​—⁠మత్తయి 4:⁠4.

దాని గురించి ఆలోచించండి. మనం అసలు మొదట్లో బలమైన విశ్వాసాన్ని ఎలా నిర్మించుకొన్నాం? “వినుట వలన విశ్వాసము కలుగును” అని అపొస్తలుడైన పౌలు వ్రాస్తున్నాడు. (రోమీయులు 10:​17) మనం మొదట్లో యెహోవాపై, ఆయన వాగ్దానాలపై, ఆయన సంస్థపై మన విశ్వాసాన్ని నమ్మకాన్ని దేవుని వాక్యాన్ని ఆహారంగా భుజిస్తూనే నిర్మించుకొన్నామని ఆయన భావం. ఒక్కటి మాత్రం నిజం, మనం విన్నదాన్ని ఊరికే గ్రుడ్డిగా నమ్మేయలేదు. బెరయ పట్టణంలో జీవించిన ప్రజలు చేసిందే మనమూ చేశాము. మనం మనకు ‘చెప్పబడిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చాము.’ (అపొస్తలుల కార్యములు 17:​11) మనం ‘ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొన్నాము,’ మనం విన్నవి సత్యమేనని నిశ్చయపర్చుకొన్నాము. (రోమీయులు 12:⁠2; 1 థెస్సలొనీకయులు 5:​21) అప్పటి నుండి, మనం దేవుని వాక్యము ఆయన వాగ్దానాలు ఎన్నడూ విఫలం కానేరవని మరింత స్పష్టంగా గ్రహిస్తుండగా బహుశ మన విశ్వాసాన్ని దృఢతరం చేసుకొన్నాము.​—⁠యెహోషువ 23:​14; యెషయా 55:10,11.

ఆధ్యాత్మికంగా అలమటించకుండా ఉండండి

ఇప్పుడు మన ముందున్న సవాలు ఏమిటంటే మన విశ్వాసాన్ని కాపాడుకొంటూ యెహోవాపై ఆయన సంస్థపై మనకు గల నమ్మకం బలహీనమై అపనమ్మకంగా మారిపోకుండా నివారించడమే. దీనిని చేయడానికి మనం లేఖనాలను ప్రతి దినము పరిశీలించడంలో కొనసాగాలి. “కడవరి దినములలో కొందరు [మొదట్లో బలమైన విశ్వాసం ఉన్నవారిగా కనబడినా] అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని” అపొస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. (1 తిమోతి 4:⁠1) ఆమోసపరచు ఆత్మలు, బోధలు కొందరిలో సందేహాలను సృష్టించి వారు దేవునికి దూరమైపోయేలా చేస్తాయి. మనకు రక్షణ ఏది? “[మనం] అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు” ఉండడంలో కొనసాగడమే.​—⁠1 తిమోతి 4:⁠6.

అయితే విచారకరంగా, అలాంటి సుబోధ ధారాళంగా అందుబాటులో ఉన్నప్పటికీ నేడు కొందరు “విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు” ఉండవద్దని ఎంపిక చేసుకొన్నారు. సామెతల పుస్తక రచయితల్లో ఒకాయన సూచిస్తున్నట్లుగా మంచి ఆధ్యాత్మిక ఆహారం మన చుట్టూ, అంటే ఒక ఆధ్యాత్మిక విందులో మనం ఉండవచ్చు, అయినా ఏమీ తిని, జీర్ణం చేసుకోకుండా ఉండే అవకాశం ఉంది.​—⁠సామెతలు 19:​24; 26:⁠15.

ఇది చాలా ప్రమాదకరం. రచయిత విన్‌గేట్‌ ఇలా చెబుతున్నాడు: “శరీరం తన స్వంత మాంసకృత్తులను తినివేస్తుండగా దాని ఆరోగ్యం క్షిణించడం ప్రారంభిస్తుంది.” మీరు ఆహారం తినకుండా ఉంటే మీశరీరం తనలోని ఇంధన నిలువలను వినియోగించడం ప్రారంభిస్తుంది. ఈఇంధన నిలువలు ఖర్చయిపోయిన తర్వాత, మీశరీరంలోని కణజాలాల పెరుగుదలకు మరమ్మతుకు ఎంతో అవసరమున్న మాంసకృత్తులను వినియోగించడం ప్రారంభిస్తుంది. దాంతో కీలకమైన అవయవాలు కూలబడతాయి. మీఆరోగ్యం వెంట వెంటనే పాడైపోతుంది.

తొలి క్రైస్తవ సంఘంలోని కొందరికి ఆధ్యాత్మిక భావంలో అలానే జరిగింది. వారు తమ ఆధ్యాత్మిక నిలువలపై జీవించడానికి ప్రయత్నించారు. బహుశా వారు తమ వ్యక్తిగత అధ్యయనాన్ని నిర్లక్ష్యం చేసివుంటారు, దాంతో వారు ఆధ్యాత్మికంగా బలహీనులైపోయారు. (హెబ్రీయులు 5:​12) అపొస్తలుడైన పౌలు హీబ్రూ క్రైస్తవులకు వ్రాసినప్పుడు ఇలా చేస్తే రాగల ప్రమాదాన్ని గురించి వివరించాడు: “మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.” “ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినయెడల” చెడు అలవాట్లలో ఎంత సులభంగా కొట్టుకు పోగలమో ఆయనకు తెలుసు.​—⁠హెబ్రీయులు 2:1,3.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి కుపోషణకు గురైతే ఆయన జబ్బు మనిషిలా లేదా బక్కచిక్కినట్లుగా ఏమీ కనబడడు. అదే విధంగా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా అలమటిస్తే బహుశ వెంటనే బయటికి కనబడకపోవచ్చు. మీరు సరైన విధంగా పోషణను పొందకపోయినా ఆధ్యాత్మికంగా మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు కన్పించవచ్చు​—⁠కానీ అది కొంత కాలమే! మీరు ఆధ్యాత్మికంగా బలహీనులు కావడం తథ్యం; నిరాధారమైన సందేహాలకు లోనుకావడం, విశ్వాసం నిమిత్తం గట్టి పోరాటాన్ని పోరాడలేకపోవడం అనివార్యంగా జరుగుతుంది. (యూదా3) వేరే ఎవ్వరికీ తెలియకపోవచ్చేమో గాని​—⁠ఆధ్యాత్మిక భోజనాన్ని వ్యక్తిగతంగా నిజంగా ఎంత భుజిస్తున్నారన్న విషయం మీకు తెలుస్తుంది.

కాబట్టి, మీవ్యక్తిగత అధ్యయనాన్ని కొనసాగించండి. సందేహాలతో హోరాహోరిగా పోరాడండి. నిరంతరం సతాయించే సందేహాల్ని ఏదో చిన్న అంటువ్యాధిలాంటిదిలే అని నిర్లక్ష్యం చేయడం చాలా వినాశకరమైన పరిణామాలకు నడిపించవచ్చు. (2 కొరింథీయులు 11:⁠3) ‘మనం నిజంగానే అంత్యదినాల్లో జీవిస్తున్నామా? బైబిలు చెప్పేదంతా మనం నమ్మగలమా? ఇది నిజంగా యెహోవా సంస్థేనా?’ ఇలాంటి సందేహాల్ని మీమనస్సులో నాటడానికి సాతాను పూర్తి ఉత్సాహంతో ఉన్నాడు. ఆధ్యాత్మికంగా భుజించే అవసరం పట్ల మీరు నిర్లక్ష్య ధోరణిని అలవరచుకోకండి, దాని మూలంగా మీరు వాని మోసపూరితమైన బోధలకు సులభంగా బలవుతారు. (కొలొస్సయులు 2:​4-7) తిమోతికి ఇవ్వబడిన సలహాను అనుసరించండి. “పరిశుద్ధలేఖనములను” శ్రద్ధగా అధ్యయనం చేసే విద్యార్థిగా ఉండండి, అలాగైతే మీరు “నేర్చుకొని రూఢియని తెలిసికొన్న ... వాటియందు నిలుకడగా” ఉంటారు. (2 తిమోతి 3:​13-15)

మీరిలా చేయడానికి మీకు సహాయం అవసరం కావచ్చు. మునుపు పేర్కొన్న రచయిత ఇంకా ఇలా అంటున్నాడు: “తీవ్రమైన ఆహారలేమికి గురైనప్పుడు, విటమిన్లు మరితర ఆవశ్యకమైన పదార్థాల కొరత ఏర్పడడంతో జీర్ణకోశం పూర్తిగా పాడవుతుంది, అది ఎంతగానంటే మామూలు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కూడా ఇక అది ఎంతమాత్రం జీర్ణించుకోలేదు. ఇలాంటి పరిస్థితికి చేరుకొన్న వ్యక్తులు కొంతకాలంపాటు జీర్ణించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉండని ఆహారాన్ని తీసుకోవలసి ఉంటుంది.” ఆహారలేమి శరీరంపై చూపించే ప్రభావాలను సరిచేయడానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం అవుతుంది. అదే విధంగా ఎవరైనా తన వ్యక్తిగత బైబిలు అధ్యయనాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఆయన తన ఆధ్యాత్మిక ఆకలిని తిరిగి సంపాదించుకొనేందుకు ఎంతో సహాయం ప్రోత్సాహం అవసరమవుతుంది. మీరా పరిస్థితిలో ఉంటే సహాయాన్ని అర్థించండి, మీఆధ్యాత్మిక ఆరోగ్యాన్నీ బలాన్నీ పునర్నిర్మించేందుకు అందించబడే సహాయాన్ని ఆనందంగా స్వీకరించండి.​—⁠యాకోబు 5:14,15.

“అవిశ్వాసమువలన ... సందేహింపకం[డి]”

పితరుడైన అబ్రాహాము పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుంటే ఆయన సందేహించడానికి సరైన ఆధారాలున్నాయని కొందరు అనుకోవచ్చు. ఆయన ‘అనేక జనములకు తండ్రి అయ్యే నిరీక్షణకు ఆధారం లేదన్న’ నిర్ధారణకు రావడం సహేతుకమే అన్నట్లు కన్పించవచ్చు​—⁠అదీ దేవుడు వాగ్దానం చేసినా కూడా. ఎందుకని? కేవలం మానవ దృక్కోణం నుండి చూస్తే భవిష్యత్తు అంత ఆశాజనకంగా లేదు. “అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును [ఆయన] ఆలోచించెను” అని బైబిలు వృత్తాంతం చెబుతోంది. అయినా, ఆయన దేవుని గురించి, ఆయన వాగ్దానాల గురించి సందేహాలు తన మనస్సులోను హృదయంలోను నాటుకోవడానికి ఖండితంగా తిరస్కరించాడు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాస్తున్నాడు: ‘అతడు విశ్వాసమునందు బలహీనుడు కాలేదు,’ లేదా ‘అవిశ్వాసము వలన సందేహింపలేదు.’ అబ్రాహాము “[దేవుడు] వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి” ముందుకు కొనసాగాడు. (రోమీయులు 4:​18-21) ఆయన యెహోవాతో సంవత్సరాల తరబడి ఒక బలమైన, వ్యక్తిగతమైన, నమ్మకంతోకూడిన సంబంధాన్ని నిర్మించుకొన్నాడు. ఆసంబంధాన్ని బలహీనపర్చగల ఎటువంటి సందేహానికీ తావివ్వలేదు.

మీరు “ఆరోగ్యముగల వాక్యప్రమాణమును” గైకొనినట్లైతే​—⁠ఆధ్యాత్మికంగా సుష్టుగా భోంచేస్తున్నట్లైతే మీరు కూడా అలా చేయగలరు. (2 తిమోతి 1:​13, అథస్సూచి.) సందేహాల విషయంలోని ప్రమాదాన్ని గంభీరంగా ఎంచండి. సాతాను చేసేది ఆధ్యాత్మిక సూక్ష్మక్రిమి యుద్ధం అని పిలువవచ్చును. మీరు వ్యక్తిగత బైబిలు అధ్యయనం ద్వారా, క్రైస్తవ కూటాలకు హాజరుకావడం ద్వారా మంచి ఆధ్యాత్మిక ఆహారాన్ని మీరు భుజించకుండా నిర్లక్ష్యం చేస్తే మీకై మీరు అలాంటి దాడులకు పూర్తిగా అప్పగించుకున్న వారవుతారు. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ద్వారా సమృద్ధిగా, సమయానుకూలంగా లభిస్తున్న ఆధ్యాత్మిక ఆహారం నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందండి. (మత్తయి 24:​45) ఎడతెగక ‘ఆరోగ్యకరమైన వాక్యములను ... అంగీకరిస్తూ’ ‘విశ్వాసమందు ఆరోగ్యముగలవారునై’ ఉండండి. (1 తిమోతి 6:⁠3; తీతు 2:⁠2, అథస్సూచి.) సందేహాలు మీవిశ్వాసాన్ని నశింపజేయనివ్వకండి.

[21వ పేజీలోని చిత్రాలు]

మీరు ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎంత సమృద్ధిగా భుజిస్తారు?