కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆరిజెన్‌ ఆయన బోధలు చర్చిని ఎలా ప్రభావితం చేశాయి?

ఆరిజెన్‌ ఆయన బోధలు చర్చిని ఎలా ప్రభావితం చేశాయి?

ఆరిజెన్‌ ఆయన బోధలు చర్చిని ఎలా ప్రభావితం చేశాయి?

“అపొస్తలుల తర్వాత చర్చి చరిత్రలో అత్యంత ప్రముఖుడాయన.” మూడవ శతాబ్దపు వేదాంతియైన ఆరిజెన్‌ను లాటిన్‌ వల్గేట్‌ బైబిలు అనువాదకుడైన జెరోమ్‌ అలా ప్రస్తుతించాడు. కానీ ఆరిజెన్‌ను అందరూ అంత గౌరవంగా దృష్టించలేదు. మతవిరోధ బోధలు ప్రారంభం కావడానికి హానికర మూలం ఆయనేనని కొందరు అభిప్రాయపడ్డారు. 17వ శతాబ్దంలోని ఒక రచయిత ప్రకారం, ఆరిజెన్‌ విమర్శకులు ఇలా కఠినంగా మాట్లాడారు: “సాధారణంగా ఆయన మత సిద్ధాంతాలు అసంబద్ధమైనవి, హానికరమైనవి; పాము విషంలా ప్రాణాంతకమైనవి, ఆవిషాన్ని ఆయన లోకం మీదికి కక్కాడు.” నిజానికి, ఆరిజెన్‌ మరణించిన దాదాపు మూడు శతాబ్దాల తర్వాత ఆయనను మతవిరోధి అని అధికారికంగా ప్రకటించారు.

ఆరిజెన్‌ అంతటి ప్రశంసల్ని అదే సమయంలో అంతటి వైరాన్ని ఎలా సంపాదించుకున్నాడు? చర్చి సిద్ధాంతాల విస్తరణలో ఆయన ఎలాంటి ప్రభావాన్ని చూపించాడు?

అత్యంతాసక్తిగా చర్చికొరకు పనిచేశాడు

ఆరిజెన్‌ ఈజిప్టులోని నగరమైన అలెగ్జాండ్రియాలో దాదాపు సా.శ. 185 లో జన్మించాడు. ఆయన గ్రీకు సాహిత్యంలో మంచి విద్యను సముపార్జించాడు, కానీ లేఖనాల్లో కూడా అదే విధంగా అధ్యయనం చేయడానికి కృషిచేయమని ఆయన తండ్రి లియోనైడ్స్‌ ఆయనను బలవంతపెట్టాడు. ఆరిజెన్‌కు 17 ఏండ్లున్నప్పుడు, మతం మార్చుకోవడం నేరమని చెబుతూ ఒక రాజశాసనాన్ని రోమా సామ్రాట్టు జారీచేశాడు. ఆరిజెన్‌ తండ్రి క్రైస్తవుడైనందుకు ఆయనను ఖైదులో వేశారు. యువ రక్తంతో పరవళ్ళు త్రొక్కుతున్న ఆరిజెన్‌ ఆయనతోపాటు ఖైదులోకి వెళ్ళడానికీ, హతస్సాక్షి కావడానికీ కూడా సిద్ధపడ్డాడు. దీన్ని చూసి ఆరిజెన్‌ తల్లి ఆయన ఇల్లు విడువకుండా ఆయన బట్టలు దాచేసింది. ఆరిజెన్‌ ఒక లేఖలో తన తండ్రికిలా విజ్ఞప్తి చేశాడు: “జాగ్రత్త నాన్నగారూ, మాకోసం మీరు మీమనస్సును మార్చుకోవద్దు.” లియోనైడ్స్‌ స్థిరచిత్తంతో నిలిచాడు, చివరికి ఆయనకు మరణశిక్ష అమలుచేయబడింది. దాంతో ఆయన కుటుంబం తండ్రిలేని కుటుంబమయ్యింది. కానీ ఆరిజెన్‌ అప్పటికే తన విద్యాభ్యాసంలో చాలా పురోగతి సాధించాడు, అలా గ్రీకు సాహిత్యాన్ని బోధిస్తూ తన తల్లిని ఆరుగురు తమ్ముళ్ళను పోషించగలిగాడు.

క్రైస్తవత్వ వ్యాప్తిని అరికట్టాలన్నది సామ్రాజ్యాధినేత ఉద్దేశం. ఆయన రాజశాసనం కేవలం విద్యార్థులపై మాత్రమే కాకుండా బోధకులపై కూడా గురిపెట్టబడినందున క్రైస్తవమత బోధకులందరూ అలెగ్జాండ్రియా నుండి పారిపోయారు. క్రైస్తవులు కానివారు లేఖనాధార ఉపదేశాన్ని పొందాలని అభిలషిస్తూ యువకుడైన ఆరిజెన్‌ను అర్థించినప్పుడు, అది దైవ నియామకమని దృష్టిస్తూ ఆయన ఆకార్యాన్ని చేపట్టాడు. ఆయన విద్యార్థుల్లో చాలామంది హతస్సాక్షులయ్యారు, కొందరైతే తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేయక ముందే హతమార్చబడ్డారు. ప్రాణాలను సహితం లెక్కచేయకుండా ఆరిజెన్‌ తన విద్యార్థులను, వారు న్యాయాధిపతి ముందున్నప్పుడు, ఖైదులో ఉన్నప్పుడు, లేదా వారికి మరణశిక్షను అమలు చేస్తున్నప్పుడు వారిని బహిరంగంగానే ప్రోత్సహించాడు. నాలుగవ శతాబ్దపు చరిత్రకారుడైన యూసేబియస్‌ వారికి మరణశిక్ష అమలుచేయడానికి వారిని తీసుకెళ్తున్నప్పుడు ఆరిజెన్‌ “ఎంతో సాహసంతో వారిని ముద్దు పెట్టుకోవడం ద్వారా వారికి జోహార్లర్పించాడు.”

తమ స్నేహితుల మతమార్పిడికీ వారి మరణానికీ ఆరిజెన్‌ కారకుడని క్రైస్తవేతరులనేకులు ఆయన్ను నిందించారు. ఆయన వారి ఉగ్రతకు గురయ్యాడు. ఆయన తరచు అల్లరిమూకల దాడి నుండీ, హింసాత్మక మరణం నుండీ త్రుటిలో తప్పించుకున్నాడు. తనను వెంటాడేవారిని తప్పించుకోవడానికి ఆయన ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పారిపోవాల్సివచ్చినా ఆరిజెన్‌ తన బోధను విడిచిపెట్టలేదు. ఆయనలా నిర్భీతిగా అకుంఠిత దీక్షతో ముందుకు సాగడం అలెగ్జాండ్రియా బిషప్‌ అయిన దీమిత్రీస్‌ను చాలా ఆకర్షించింది. అందువల్ల ఆరిజెన్‌ కేవలం 18 ఏండ్ల వాడిగా ఉన్నప్పుడే దీమిత్రీస్‌ ఆయనను అలెగ్జాండ్రియాలోని మతోపదేశ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా నియమించాడు.

చివరికి, ఆరిజెన్‌ ప్రఖ్యాతిగాంచిన విద్వాంసుడిగా అత్యుత్తమ రచయితగా తయారయ్యాడు. కొందరు ఆయన 6,000 పుస్తకాలను వ్రాశాడంటారు, బహుశ అది అతిశయోక్తితో పలికిన మాట కావచ్చు. అన్నింటికీ మించి ఆయన తాను రచించిన హెక్సాప్లా మూలంగా ప్రసిద్ధికెక్కాడు, హీబ్రూ లేఖనాల 50 సంపుటిల భారీ గ్రంథం అది. ఆరిజెన్‌ హెక్సాప్లాను ప్రక్కప్రక్కన ఆరు సమాంతర నిలువు విభాగాలుగా ఈక్రిందివాటిని సమకూర్చాడు: (1)హీబ్రూ అరామిక్‌ మూల పాఠం, (2)దాని గ్రీకు లిప్యంతరీకరణ, (3)అక్విల చేసిన గ్రీకు అనువాదం, (4)సిమ్మాకస్‌ చేసిన గ్రీకు అనువాదం, (5)గ్రీకు సెప్టాజింట్‌, దీన్ని ఆరిజెన్‌ హీబ్రూ మూల పాఠానికి మరింత దగ్గరగా ఉండేలా సంస్కరించాడు, (6)థియోడోషన్‌ చేసిన గ్రీకు అనువాదం. “కేవలం సెప్టాజింట్‌ మాత్రమే ఉన్న పాఠకుడు బహుశ అనేక వచనాల అర్థం తెలీక గలిబిలికి గురికాగలడు, లేదా తప్పుగా కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంది; ఈవిధంగా మూలపాఠాల్ని ఒక్క చోట చేర్చడం ద్వారా అలాంటి భాగాలను స్పష్టపరుద్దామని ఆరిజెన్‌ ఆశించాడు” అని బైబిలు విద్వాంసుడైన జాన్‌ హార్ట్‌ వ్రాశాడు.

‘వ్రాసియున్న సంగతులను అతిక్రమించడం’

అయితే, మూడవ శతాబ్దపు గలిబిలి వాతావరణం ఆరిజెన్‌ లేఖనాలను బోధించే విధానాన్ని చాలా ప్రభావితం చేశాయి. అప్పట్లో క్రైస్తవమత సామ్రాజ్యం శైశవదశలోనే ఉన్నా, అది అప్పటికే లేఖనరహిత నమ్మకాలతో కలుషితం అయిపోయింది, అక్కడక్కడా చెదిరిపోయిన చర్చీలు వేర్వేరు సిద్ధాంతాలను బోధిస్తూ ఉన్నాయి.

ఈలేఖనరహిత బోధల్లో కొన్నింటిని ఆరిజెన్‌ స్వీకరించాడు, అవి అపొస్తలుల బోధలని ఆయన అన్నాడు. కానీ ఆయన ఇతర వివాదాస్పద అంశాలపై ఊహాకల్పనలు చేస్తూ స్వేచ్ఛా వ్యాఖ్యానానికి పూనుకున్నాడు. ఆయన విద్యార్థుల్లో చాలామంది అప్పట్లో సమకాలీన తత్త్వజ్ఞాన సంబంధిత వివాదాంశాలతో కుస్తీపట్లు పడుతున్నారు. వారికి సహాయపడాలన్న ఉద్దేశంతో, ఆయువ మనస్సులను ప్రభావితం చేస్తున్న వేర్వేరు తత్త్వాలను ఆరిజెన్‌ జాగ్రత్తగా పరిశీలన చేశాడు. వారి తత్త్వజ్ఞాన సంబంధిత ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులను ఇవ్వడానికి ఆరిజెన్‌ ఉద్యుక్తుడయ్యాడు.

బైబిలును తత్త్వజ్ఞానంతో సమాధానపరచే ప్రయత్నంలో ఆరిజెన్‌, లేఖనాలకు అర్థం చెప్పడానికి వాటి సూచనార్థక భావంపై చాలా ఆధారపడ్డాడు. ప్రతి లేఖనానికి ఆధ్యాత్మిక అర్థం ఉందని, అక్షరార్థమైన భావమే ఉండాల్సిన అవసరం లేదనీ ఆయన అభిప్రాయపడ్డాడు. ఒక విద్వాంసుడు పేర్కొన్నట్లుగా, ఆరిజెన్‌ అలా చేయడం, “లేఖనాధారితం కాని తన స్వంత వేదాంతపరమైన సిద్ధాంతాలకు బైబిలు మద్దతునిస్తుందని నిరూపించుకోవడానికి మార్గాన్ని సులువు చేసింది. తాను బైబిలుకు ఔత్సాహికంగా నమ్మకంగా అర్థం చెబుతున్నాడని చెప్పుకున్నాడు (ఆయన పూర్ణమనస్సుతో అలా భావించాడనడంలో సందేహం లేదు).”

తన విద్యార్థికి ఆరిజెన్‌ వ్రాసిన ఒక ఉత్తరం ఆయన ఆలోచనా విధానంపై మనకు అంతర్దృష్టిని ఇస్తుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి తెచ్చుకున్న బంగారంతో యెహోవా ఆలయంలోని ఉపకరణాలను తయారు చేశారని ఆరిజెన్‌ సూచించాడు. గ్రీకు తత్త్వజ్ఞానంతో కూడిన క్రైస్తవత్వాన్ని బోధించడానికి దీనిలో భావసూచక మద్దతు ఉందని ఆయన చెప్పుకున్నాడు. ఆయనిలా వ్రాశాడు: “ఇశ్రాయేలు సంతానం ఐగుప్తు నుండి తెచ్చుకున్న వస్తువులు వారికెంతగా ఉపయోగపడ్డాయంటే, వాటిని ఐగుప్తీయులు సరిగా ఉపయోగించుకోలేక పోయారు, కానీ ఆహెబ్రీయులు దేవుని జ్ఞానంచే నడిపించబడుతూ దేవుని సేవకై వినియోగించుకున్నారు.” “క్రైస్తవత్వాన్ని అధ్యయనం చేయడానికీ దాన్ని వివరించడానికీ ఉపయుక్తం కాగల విషయాలను గ్రీకుల తత్త్వజ్ఞానం నుండి సేకరించమని” ఆయన ఆవిద్యార్థిని ప్రోత్సహించాడు.

బైబిలును వివరించడానికి చేయబడిన ఇలాంటి అనియంత్రిత ప్రయత్నం క్రైస్తవ సిద్ధాంతాలకూ గ్రీకు తత్త్వజ్ఞానానికీ మధ్య హద్దులను చెరిపేసింది. ఉదాహరణకు, ఆన్‌ ఫస్ట్‌ ప్రిన్సిపల్స్‌ అనే తన పుస్తకంలో ఆరిజెన్‌, యేసు ‘జనితైక కుమారుడు; ఆయన జన్మించాడు, గానీ ఆయనకు ఆది లేదు’ అని వివరించాడు. ఇంకా ఇలా అన్నాడు: ‘ఆయన ఉద్భవం నిత్యమైనది, నిరంతరమైనది. ఆయన ఏదో జీవశ్వాసను పొందడం మూలంగా లేదా బాహ్య చర్య మూలంగా కుమారుడు కాలేదు, బదులుగా ఆయన దేవుని స్వకీయ సహజరూపమై ఉన్నాడు.’

ఆరిజెన్‌కి ఈబోధ బైబిలులో దొరకలేదు, ఎందుకంటే లేఖనాలు యెహోవా జనితైక కుమారుడు “సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు” అనీ, “దేవుని సృష్టికి ఆదియునైనవాడు” అనీ బోధిస్తున్నాయి. (కొలొస్సయులు 1:​15; ప్రకటన 3:​14) మత చరిత్రకారుడైన ఆగస్టస్‌ నియాండర్‌ ప్రకారం ‘నిత్య ఉద్భవం’ అనే భావన ఆరిజెన్‌కు ‘ప్లేటో తత్త్వజ్ఞాన అభ్యాసం ద్వారా లభించింది.’ ఆవిధంగా ఆరిజెన్‌ ఈప్రాథమిక లేఖనాధార సూత్రాన్ని ఉల్లంఘించాడు: “వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడ[దు].”​—⁠1 కొరింథీయులు 4:⁠6.

మతవిరోధిగా నిందించబడ్డాడు

బోధకుడిగా పనిచేసిన తొలి సంవత్సరాల్లో ఆయనను అలెగ్జాండ్రియాలోని మతగురువుల సభ ప్రీస్టు పదవి నుండి తొలగించింది. బిషప్‌ దీమిత్రీస్‌ ఆరిజెన్‌కు పెరుగుతున్న ఖ్యాతిని చూసి బహుశ అసూయపడి అలా చేసివుంటాడు. దాంతో ఆరిజెన్‌ పాలస్తీనాకు తరలివెళ్ళాడు, అక్కడాయన క్రైస్తవ సిద్ధాంతాలను సమర్థించే వాడిగా ప్రశంసలను పొందాడు ఖ్యాతినార్జించాడు, ఆయనకు ఇక అవధుల్లేకుండా పోయింది. ఆయనక్కడ ప్రీస్టుగా కొనసాగాడు. నిజానికి, తూర్పున “మతవిరోధ బోధలు” ప్రారంభమైనప్పుడు బిషప్పులు సాంప్రదాయిక నమ్మకాల వైపు మళ్ళేలా వారిని ఒప్పించడానికి ఆయన సేవలను అర్థించడం జరిగింది. అయితే, ప్రత్యేకంగా ఆరిజెన్‌ సా.శ. 254 లో చనిపోయిన తర్వాత, ఆయన పేరు బాగా పాడైపోయింది. ఎందుకని?

నామకార్థ క్రైస్తవత్వం ప్రముఖ మతంగా మారిన తర్వాత, చర్చీలు సాంప్రదాయిక బోధ అంటే ఏమిటో చాలా ఖచ్చితంగా నిర్వచించడం ప్రారంభమైంది. అందుకని అటుతర్వాతి తరానికి చెందిన వేదాంతులు ఆరిజెన్‌ ఊహాకల్పనలనూ, నిర్దుష్టంకాని ఆయన తత్త్వబోధలనూ చాలా మట్టుకు స్వీకరించలేదు. అందువల్ల ఆయన బోధలు చర్చి వ్యవస్థలోనే పెద్ద వివాదాలను సృష్టించాయి. ఈవివాదాలను పరిష్కరించి, చర్చీల ఐక్యతను కాపాడడానికీ అవి ఆరిజెన్‌ను మతవిరోధి అని అధికారికంగా నిర్ధారించాయి.

పొరబాట్లు చేయడంలో ఆరిజెన్‌ ఒక్కడు మాత్రమే లేడు. నిజానికి, నిర్మలమైన క్రీస్తు బోధల నుండి ప్రక్కదారి మళ్ళడం జరుగుతుందని బైబిలు ముందే చెప్పింది. ఈమతభ్రష్టత్వం మొదటి శతాబ్దం ముగింపులోనే, యేసు అపొస్తలులు చనిపోయిన తర్వాత విస్తరించడం ప్రారంభమైంది. (2 థెస్సలొనీకయులు 2:​6,7) చివరికి క్రైస్తవులమని చెప్పుకున్న కొందరు తాము “సాంప్రదాయికవాదులు” అని చెప్పుకుని ఇతరులందరూ “మతవిరోధులు” అని ప్రకటించారు. కానీ నిజానికి, క్రైస్తవమత సామ్రాజ్యమే నిజ క్రైస్తవత్వం నుండి బహుగా పెడత్రోవ పట్టింది.

‘జ్ఞానమని అబద్ధముగా చెప్పబడినది’

ఆరిజెన్‌ ఎన్నెన్నో ఊహాకల్పనలు చేసినప్పటికీ, ఆయన కృతుల్లో కొన్ని ప్రయోజనకరమైన అంశాలున్నాయి. ఉదాహరణకు, హెక్సాప్లాలో దేవుని నామం టెట్రాగ్రమాటన్‌ అని పిలువబడే నాలుగక్షరాల హీబ్రూ పదం ఉపయోగించబడింది. తొలి క్రైస్తవులకు యెహోవా అనే దేవుని వ్యక్తిగత నామం తెలుసనీ వారు దాన్ని ఉపయోగించారనీ చెప్పడానికి ఇది ప్రాముఖ్యమైన సాక్ష్యాధారం. అయినప్పటికీ, ఐదవ శతాబ్దపు చర్చి పితామహుడైన థియోఫెలస్‌ ఒకసారిలా హెచ్చరించాడు: “ఆరిజెన్‌ కృతులు అనేక రకాల పూలున్న తోటలాంటివి. నాకేదైనా అందమైన పువ్వు కనిపించినప్పుడు దాన్ని నేను తెంపుకుంటాను; కానీ ఏదైనా ముళ్ళున్నట్లు నాకు కనిపిస్తే దాని జోలికి పోను, ఎందుకంటే అది గుచ్చుకుంటుంది.”

బైబిలు బోధలను గ్రీకు తత్త్వజ్ఞానంతో మిళితం చేయడం మూలంగా ఆరిజెన్‌ బోధలు తప్పుల తడకలుగా అయ్యాయి, వాటి పర్యవసానం క్రైస్తవమత సామ్రాజ్యానికి వినాశకరంగా పరిణమించింది. ఉదాహరణకు, ఆరిజెన్‌ పగ్గాల్లేకుండా చేసిన ఊహాకల్పనలు చాలా మట్టుకు అటుతర్వాత తిరస్కరించబడినా, క్రీస్తు యొక్క ‘నిత్య ఉద్భవం’ విషయంలో ఆయన అభిప్రాయం బైబిలు ఆధారితంకాని త్రిత్వ సిద్ధాంతానికి పునాదిని వేసింది. మొదటి మూడు శతాబ్దాల్లోని చర్చి అనే పుస్తకం ఇలా వ్యాఖ్యానిస్తోంది: “తత్త్వజ్ఞానంపట్ల మక్కువను [ఆరిజెన్‌ ప్రవేశపెట్టాడు,] అది చాలాకాలంపాటు నిలిచింది.” ఫలితమేమిటి? “క్రైస్తవ నమ్మకాల్లోని సరళత్వం భ్రష్టమైపోయింది, అసంఖ్యాకమైన తప్పుడు బోధలు చర్చిలోకి వెల్లువలా ప్రవహించాయి.”

ఆరిజెన్‌ అపొస్తలుడైన పౌలు మందలింపును అనుసరించి, “అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా” ఉండి ఈమతభ్రష్టత్వానికి దోహదపడకుండా నివారించాల్సింది. కానీ తన బోధలను అలాంటి ‘జ్ఞానంపై’ ఆధారితం చేసుకోవడం ద్వారా ఆరిజెన్‌ ‘విశ్వాస విషయంలో తప్పిపోయాడు.’​—⁠1 తిమోతి 6:​20,21; కొలొస్సయులు 2:⁠8.

[31వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో దేవుని నామం ఉపయోగించబడిందని ఆరిజెన్‌ యొక్క “హెక్సాప్లా” చూపిస్తోంది

[చిత్రసౌజన్యం]

Published by permission of the Syndics of Cambridge University Library, T-S 12.182

[29వ పేజీలోని చిత్రసౌజన్యం]

Culver Pictures