కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కోతపనిలో పట్టుదలతో ముందుకు కొనసాగండి!

కోతపనిలో పట్టుదలతో ముందుకు కొనసాగండి!

కోతపనిలో పట్టుదలతో ముందుకు కొనసాగండి!

“కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.”​—⁠కీర్తన 126:⁠5.

1. “తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని” నేడు ఎందుకు వేడుకోవాలి?

యేసుక్రీస్తు గలిలయలో మూడవ ప్రకటనా పర్యటన చేసిన తరువాత తన శిష్యులకు ఇలా చెప్పాడు: “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు.” (మత్తయి 9:​37) యూదయలోనూ అదే పరిస్థితి ఉంది. (లూకా 10:⁠2) ఇది 2,000 సంవత్సరాల క్రిందటి పరిస్థితి, మరి నేటి విషయమేమిటి? గత సేవా సంవత్సరంలో 60,00,000కుపైగా ఉన్న యెహోవాసాక్షులు, ప్రపంచంలోని 600,00,00,000 ప్రజల మధ్య సూచనార్థకమైన కోత పనిలో పట్టుదలతో ముందుకు కొనసాగారు. ఆప్రజల్లో అత్యధికులు “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరి”వున్నారు. కాబట్టి “తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని” యేసు ఇచ్చిన ఉద్బోధకు శతాబ్దాల క్రితం ఎంత విలువ ఉందో నేడు కూడా అంతే ఉంది.​—⁠మత్తయి 9:36,38.

2. మనలను ప్రజల దృష్టికి తెచ్చేదేమిటి?

2 మరి ఎక్కువ పనివారిని పంపమన్న విజ్ఞప్తికి కోత యజమానియైన యెహోవా దేవుడు జవాబిచ్చాడు. దైవనిర్దేశంలో జరుగుతున్న ఈ కోతపనిలో పాలుపంచుకోవడం ఎంత ఆనందకరమైన విషయం! జనాంగాలతో పోల్చుకుంటే మనం సంఖ్యాపరంగా తక్కువగానే ఉన్నప్పటికీ, మనం రాజ్య ప్రకటనా పనిలోను, శిష్యులను చేసే పనిలోను అత్యంతాసక్తితో పాలుపంచుకోవడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. చాలా దేశాల్లో మన గురించి వార్తా మాధ్యమాలు తరచుగా పేర్కొంటున్నాయి. ఒక టీవీ నాటకంలో కాలింగ్‌ బెల్‌ మోగగానే యెహోవాసాక్షులు ఇంటింటినీ సందర్శిస్తున్నారని చెప్పడం జరుగుతోంది. అవును, సూచనార్థక కోతపనివారిగా మన క్రైస్తవ కార్యకలాపాలు ఈ21వ శతాబ్దంలో ప్రసిద్ధికెక్కాయి.

3. (ఎ) మొదటి శతాబ్దపు ప్రకటనా పని ఇతరుల దృష్టిలో పడిందని మనకెలా తెలుసు? (బి)దేవదూతలు మన పరిచర్యకు మద్దతునిస్తున్నారని మనమెందుకు చెప్పగలం?

3 మొదటి శతాబ్దంలోని రాజ్య ప్రకటనా కార్యకలాపాలను కూడా లోకం గుర్తించింది, సువార్తను ప్రకటించేవారిని అది హింసించింది కూడా. అందుకనే అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మరణదండన విధింపబడివారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమును అందరికంటె కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. [అపొస్తలులమైన] మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా నున్నాము.” (1 కొరింథీయులు 4:⁠9) అదే విధంగా రాజ్య ప్రచారకులుగా మనం హింసించబడుతున్నప్పటికీ పట్టుదలతో ఉండడం మనలను ప్రపంచ దృష్టికి తీసుకువస్తుంది, అలా పట్టుదలతో ఉండడం దేవదూతలకు కూడా ప్రాముఖ్యమే. ప్రకటన 14:6 ఇలా అంటోంది: “అప్పుడు [అపొస్తలుడైన యోహానునైన నేను] మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను.” అవును, మన పరిచర్యలో​—⁠మన కోతపనిలో మనకు దేవదూతల మద్దతు ఉంది!​—⁠హెబ్రీయులు 1:​13,14.

“అందరిచేత ద్వేషింపబడుదురు”

4, 5. (ఎ) యేసు తన శిష్యులకు ఎటువంటి హెచ్చరికను ఇచ్చాడు? (బి)దేవుని నేటి సేవకులు ఎందుకు ‘ద్వేషించబడుతున్నారు’?

4 యేసు అపొస్తలులు కోతపనివారిగా పంపించబడినప్పుడు వారు “పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి” అన్న యేసు ఉపదేశాన్ని పాటించారు. యేసు ఆసందర్భంలో ఇంకా ఇలా అన్నాడు: “మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు. ... మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షింపబడును.”​—⁠మత్తయి 10:​16-22.

5 మనం నేడు ‘ద్వేషించబడుతున్నాము.’ ఎందుకంటే “లోకమంతయు దుష్టుని యందున్న[ది],” వాడు దేవునికీ ఆయన ప్రజలకూ ప్రధాన శత్రువైన అపవాదియైన సాతానే. (1 యోహాను 5:​19) మనం ఆధ్యాత్మికంగా వర్ధిల్లడం శత్రువులు చూస్తారు కానీ దాని ఘనతను యెహోవాకు ఇవ్వడానికి ఒప్పుకోరు. మనం కోతపనిలో ఆనందంగా పాల్గొంటుండగా వ్యతిరేకులు మన సంతోషాన్నీ, చిరునవ్వులు చిందిస్తున్న ముఖాలనూ చూస్తారు. వారు మన ఐక్యతను చూసి ఆశ్చర్యపోతుంటారు! నిజానికి, తాము వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా యెహోవాసాక్షులు తమ స్వదేశంలో తాము గమనించిన అదే పనిని చేస్తున్నారని వారు అయిష్టంగానే ఒప్పుకుంటారు. మన సమర్థకుడూ మన ఐక్యతకు మూలమూ అయిన యెహోవాను యుక్తమైన కాలంలో మన శత్రువులు కూడా తెలుసుకుంటారని మనకు తెలుసు.​—⁠యెహెజ్కేలు 38:10-12,23.

6. మనం కొతపనిలో కొనసాగుతుండగా మనకు ఎటువంటి హామీ ఉంది, కానీ ఏ ప్రశ్న ఉత్పన్నమౌతుంది?

6 కోత యజమాని తన కుమారుడైన యేసు క్రీస్తుకు “పరలోకమందును భూమిమీదను ... సర్వాధికారము” ఇచ్చాడు. (మత్తయి 28:​18) పరలోకంలోని దేవదూతల ద్వారా భూమ్మీద అభిషిక్తులైన “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ద్వారా కోతపనిని నెరవేర్చే నిమిత్తం ఆపనికి నడిపింపునివ్వడానికి యెహోవా యేసును అలా ఉపయోగించుకుంటాడు. (మత్తయి 24:​45-47; ప్రకటన 14:​6,7) కానీ మనం శత్రువుల వ్యతిరేకతను తాళుకుంటూ, అదే సమయంలో కోతపనిలో పట్టుదలతో ముందుకు కొనసాగుతూ మన ఆనందాన్ని ఎలా కాపాడుకోగలము?

7. మనకు వ్యతిరేకత లేదా హింసలు ఎదురైనప్పుడు ఎటువంటి దృక్పథాన్ని కలిగివుండడానికి కృషిచేయాలి?

7 మనం వ్యతిరేకతను లేదా చివరికి ఏకంగా హింసనే నేరుగా ఎదుర్కొన్నప్పుడు మనం పౌలులాంటి దృక్పథాన్ని కలిగివుండేందుకుగాను దేవుని సహాయం కోసం ప్రార్థిద్దాం. ఆయనిలా వ్రాశాడు: “నిందింపబడియు దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము; దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము.” (1 కొరింథీయులు 4:​12,13) ఇటువంటి స్ఫూర్తిని కలిగివుండడం, అలాగే యుక్తితో కూడిన బహిరంగ పరిచర్య మన వ్యతిరేకుల వైఖరిని కొన్నిసార్లు మారుస్తుంది.

8. మీరు మత్తయి 10:28 లోని యేసు మాటలనుండి ఎటువంటి గట్టి హామీ పొందుతారు?

8 చంపుతామన్న బెదిరింపులు కూడా కోతపనివారిగా మన ఆసక్తిని ఆర్పివేయలేవు. మనం నిర్భీతిగా రాజ్య సందేశాన్ని సాధ్యమైనంత బహిరంగంగా ప్రకటిస్తాం. మనం యేసు మాటల నుండి కూడా గట్టి హామీని పొందుతాము: “ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో [“గెహెన్నా,” NW] నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.” (మత్తయి 10:​28) మన పరలోకపు తండ్రి జీవదాత అని మనకు తెలుసు. ఆయన తన పట్ల యథార్థతను కాపాడుకుంటూ కోతపనిలో పట్టుదలతో ముందుకు కొనసాగేవారికి ప్రతిఫలమిస్తాడు.

జీవ రక్షణ సందేశం

9. యెహెజ్కేలు మాటలకు కొందరు ఎలా ప్రతిస్పందించారు, నేడు ఆవిధంగానే ఏమి జరుగుతోంది?

9 ప్రవక్తయైన యెహెజ్కేలు యెహోవా సందేశాలను “తిరుగుబాటు చేసిన జనుల”కు​—⁠ఇశ్రాయేలు యూదా రాజ్యాలకు​—⁠ధైర్యంగా ప్రకటించినప్పుడు ఆయన చెప్పింది విని కొందరు ఆనందించారు. (యెహెజ్కేలు 2:⁠3) యెహోవా ఇలా అన్నాడు: “నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు.” (యెహెజ్కేలు 33:​32) వాళ్ళకు యెహెజ్కేలు మాటలు వినసొంపుగా ఉన్నా వాటి ప్రకారం నడుచుకోవడంలో వారు విఫలమయ్యారు. నేడు ఏమి జరుగుతోంది? అభిషిక్త శేషము, వారి సహవాసులు యెహోవా సందేశాలను ధైర్యంగా ప్రకటిస్తున్నప్పుడు, కొందరు ఆరాజ్య ఆశీర్వాదాలను గురించి వినడానికి ఇష్టపడతారు, కానీ వారు మెప్పుదలతో ప్రతిస్పందించి, శిష్యులై, కోతపనిలో చేరరు.

10, 11. మన జీవదాయక సందేశాన్ని ప్రచురం చేయడానికి 20వ శతాబ్దం తొలి అర్ధభాగంలో ఏమి చేశారు, దాని ఫలితాలేమిటి?

10 మరోవైపున చాలామంది కోతపనికి అనుకూలంగా ప్రతిస్పందించి దేవుని సందేశాలను ప్రకటించడంలో పాల్గొన్నారు. ఉదాహరణకు, 1922 నుండి 1928 వరకు జరిగిన క్రైస్తవ సమావేశాల పరంపరలలో, సాతాను దుష్ట విధానంపై తీర్పు సందేశాలు స్పష్టంగా ప్రతిధ్వనించాయి. ఆసమావేశాల్లో చేయబడిన అధిక్షేపణలను రేడియో స్టేషన్లు ప్రసారం చేశాయి. అటు తర్వాత దేవుని ప్రజలు వాటిని ముద్రించి కోట్లాది ప్రతులను పంచిపెట్టారు.

11 మరో సాక్ష్యపు విధానం 1930ల చివరి భాగంలో ప్రారంభమైంది​—⁠అది సమాచార ప్రదర్శనలు. మొదట్లో యెహోవా ప్రజలు బహిరంగ ప్రసంగాలను ప్రకటించే అట్టలను ముందు వెనుకల తగిలించుకుని వీధుల్లో నడిచారు. అటుతర్వాత వారు “మతం ఒక ఉరి, అదొక కుంభకోణం” అనీ, “దేవునికీ రాజైన క్రీస్తుకూ సేవచేయండి” అనీ వ్రాసివున్న అట్టలను ప్రదర్శించారు. వారు వీధుల్లో ప్రదర్శిస్తూ నడుస్తుండగా అటుగా వెళ్తున్న అనేకమంది అవధానాన్ని వారు ఆకర్షించారు. ‘యెహోవాసాక్షులను ప్రజల దృష్టికి తీసుకురావడానికీ వారిని ధైర్యవంతులను చేయడానికీ ఇదెంతో సహాయపడింది’ అని ఇంగ్లాండ్‌లోని లండన్‌లో రద్దీయైన వీధుల్లో ఈపనిలో క్రమంగా పాల్గొన్న ఒక సహోదరుడు వ్యాఖ్యానించాడు.

12. దేవుని తీర్పు సందేశాలతోపాటు, మనం మన పరిచర్యలో ఏ అంశాలు కూడా చేరుస్తాము, ఇప్పుడు సువార్తను ప్రకటించడంలో ఎవరు ఐక్యమైవున్నారు?

12 మనం దేవుని తీర్పు సందేశాలను ప్రకటిస్తుండగా మనం రాజ్య సందేశమందలి అనుకూల అంశాల వైపుకి ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంటాము. ప్రపంచ వేదికపై మనం ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడం యోగ్యులైన వారిని అన్వేషించి కనుగొనేందుకు మనకు సహాయం చేస్తుంది. (మత్తయి 10:​11) అభిషిక్తుల్లో చివరి సభ్యులు చాలామంది 1920లలోను 1930లలోను కోతకు సంబంధించి ఇవ్వబడిన విస్పష్టమైన పిలుపుకు ప్రతిస్పందించారు. 1935 లో ఒక సమావేశంలో, “వేరే గొఱ్ఱెల” ఒక “గొప్ప సమూహము”కు సంబంధించి ఒక అద్భుతమైన వార్త వెలువడింది. భూపరదైసులో వారు ఆశీర్వాదకరమైన భవిష్యత్తును అనుభవిస్తారన్నదే ఆవార్త. (ప్రకటన 7:⁠9; యోహాను 10:​16) వారు దేవుని తీర్పు సందేశాలను లక్ష్యపెడుతూ, జీవదాయకమైన సువార్తను ప్రకటించడంలో అభిషిక్తులతో ఐక్యమయ్యారు.

13, 14. (ఎ) కీర్తన 126:​5,6 వచనాల నుండి మనమెటువంటి సాంత్వనను పొందవచ్చు? (బి)మనం విత్తడంలో నీరు పోయడంలో కొనసాగినట్లైతే ఏమి జరుగుతుంది?

13 దేవుని కోతపనివారికి, ప్రత్యేకంగా హింసలను అనుభవిస్తున్నవారికి కీర్తన 126:​5,6 లోని మాటలు ఎంతో సాంత్వననిస్తున్నాయి: “కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును.” విత్తడము, పంట కోయడము గురించిన కీర్తనకర్త మాటలు ప్రాచీన బబులోను చెర నుండి తిరిగివచ్చిన శేష ప్రజల పట్ల యెహోవా శ్రద్ధనూ వారిపై ఆయన ఆశీర్వాదాలనూ దృష్టాంతపరుస్తున్నాయి. తాము విడుదలైనందుకు వారెంతో ఆనందంగా ఉన్నారు, కానీ 70 ఏళ్ళు తాము పరవాసంలో ఉన్నప్పుడు సాగుచేయక బీడుగా ఉన్న భూమిలో విత్తుతున్నప్పుడు బహుశ కన్నీరు విడిచివుంటారు. అయితే విత్తే పనిలోను, నిర్మాణ కార్యకలాపాల్లోను అలాగే ముందుకు సాగినవారు తమ కష్టానికి తగ్గ ఫలితాలను అనుభవించారు, సంతృప్తి చెందారు.

14 మనం పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు లేదా మనం గాని మన తోటి విశ్వాసులు గాని నీతి నిమిత్తం శ్రమపడుతున్నప్పుడు మనం కన్నీరు విడుస్తుండవచ్చు. (1 పేతురు 3:​14) పరిచర్యలో మనం సాధించిన విజయాలకు నిదర్శనాలుగా ఏమీ చూపించలేకపోతున్నట్లు భావించడం మూలంగా కోత పని మొదట్లో చాలా కష్టంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుండవచ్చు. కానీ మనం విత్తడంలో నీరు పోయడంలో కొనసాగినట్లైతే మనమూహించని రీతిలో దేవుడు వృద్ధిచెందేలా చేస్తాడు. (1 కొరింథీయులు 3:⁠6) బైబిళ్ళను లేఖనాధారిత ప్రచురణలను పంపిణీ చేయడం ద్వారా లభించిన ఫలితాలతో ఈవిషయం చక్కగా స్పష్టమవుతోంది.

15. కోతపనిలో క్రైస్తవ ప్రచురణల ప్రయోజనాలను వివరించే ఒక ఉదాహరణను ఇవ్వండి.

15 జిమ్‌ అనే పేరుగల వ్యక్తి ఉదాహరణను పరిశీలించండి. ఆయన తల్లి చనిపోయినప్పుడు ఆమె వస్తువుల్లో ఆయనకు జీవం​—⁠అది ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) అనే పుస్తకం దొరికింది. * ఆయన దాన్ని ఎంతో ఆసక్తితో చదివాడు. ఒకసారి వీధిలో ఆయనను కలిసిన ఒక సాక్షితో చేసిన చర్చలో జిమ్‌ పునర్దర్శనానికి ఒప్పుకున్నాడు, అది బైబిలు అధ్యయనానికి నడిపించింది. జిమ్‌ త్వరితగతిన అభివృద్ధి సాధించాడు, తనను తాను యెహోవాకు సమర్పించుకొన్నాడు, బాప్తిస్మం పొందాడు. ఆయన తాను నేర్చుకొన్న వాటి గురించి తన కుటుంబంలోని ఇతర సభ్యులకు చెప్పాడు. ఫలితంగా ఆయన అక్క, అన్నలు యెహోవాసాక్షులయ్యారు, అటుతర్వాత జిమ్‌ లండన్‌లోని బేతేలులో పూర్తికాల స్వచ్ఛంద సేవకునిగా సేవచేసే ఆధిక్యతను అనుభవించాడు.

హింసించబడ్డారు, అయినా ఆనందమే

16. (ఎ) కోతపనిలో విజయం ఎందుకు లభిస్తోంది? (బి)సువార్త చూపించే ప్రభావాన్ని గురించి యేసు ఏ హెచ్చరికను ఇచ్చాడు, అయితే, మనం ప్రజలను ఎటువంటి ఉద్దేశంతో సమీపిస్తాము?

16 కోతపనిలో అంతటి ఘనవిజయం ఎలా లభిస్తోంది? ఎందుకంటే అభిషిక్త క్రైస్తవులు, వారి సహవాసులు యేసు ఉపదేశాలను పాటించారు: “చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి.” (మత్తయి 10:​27) అయితే, మనం కష్టాలు వస్తాయని ఎదురుచూడవచ్చు, ఎందుకంటే యేసు ఇలా హెచ్చరించాడు: “సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు.” యేసు ఇంకా ఇలా చెప్పాడు: “నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.” (మత్తయి 10:​21,34) కావాలని కుటుంబాలను విభజించాలని యేసు ఉద్దేశించలేదు. కానీ సువార్త కొన్నిసార్లు అటువంటి పరిణామాలను తీసుకువచ్చే అవకాశం ఉంది. నేటి దేవుని సేవకుల విషయంలో కూడా అది నిజం. మనం కుటుంబాలను సందర్శించినప్పుడు వారిలో విభజనలను తీసుకురావాలన్నది మన ఉద్దేశం కాదు. ప్రతి ఒక్కరూ సువార్తను హత్తుకోవాలన్నదే మన కోరిక. అందుకని మనం “నిత్యజీవమునకు నిర్ణయింపబడిన” వారికి ఆకర్షణీయంగా ఉండేలా కుటుంబంలోని సభ్యులందరినీ దయాపూర్వకంగా, సహానుభూతితో సమీపిస్తాము.​—⁠అపొస్తలుల కార్యములు 13:⁠48.

17. దేవుని సర్వాధిపత్యాన్ని సమర్థించేవారు ఎలా విభిన్నంగా ఉన్నారు, ఇందుకు ఒక ఉదాహరణ ఏమిటి?

17 దేవుని సర్వాధిపత్యాన్ని సమర్థించే వారిని రాజ్య సందేశం విభిన్నంగా ఉంచుతోంది. ఉదాహరణకు, జర్మనీలో నేషనల్‌ సోషలిజమ్‌ ఉన్న కాలంలో మన తోటి ఆరాధకులు ‘కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి’ చెల్లించినందున వారు విభిన్నంగా ఎలా కనబడ్డారో పరిశీలించండి. (లూకా 20:​25) క్రైస్తవమత సామ్రాజ్యంలోని చర్చీలతో సహవసిస్తున్న మత నాయకులకు నామకార్థ క్రైస్తవులకు విభిన్నంగా యెహోవా సేవకులు, బైబిలు సూత్రాలను అతిక్రమించడానికి తిరస్కరించి దృఢంగా నిలబడ్డారు. (యెషయా 2:⁠4; మత్తయి 4:​10; యోహాను 17:​16) నాజీ దేశము, క్రొత్త మతాలు (ఆంగ్లం) అనే పుస్తక రచయిత్రి ప్రొఫెసర్‌ క్రిస్టీన్‌ కింగ్‌ ఇలా వ్యాఖ్యానించింది: “[నాజీ] ప్రభుత్వం ఒక్క సాక్షులపైనే విజయం సాధించడంలో విఫలమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం వేలాదిమంది సాక్షులను హతం చేసినా వారి పని ఏమాత్రం ఆగకుండా కొనసాగింది, 1945 మేలో యెహోవాసాక్షుల ఉద్యమం చూస్తే చురుకుగా కొనసాగుతోంది, కానీ నేషనల్‌ సోషలిజమ్‌ మాత్రం అంతరించిపోయింది.”

18. హింసలు ఉన్నప్పటికీ యెహోవా ప్రజలు ఎలాంటి వైఖరిని ప్రదర్శిస్తారు?

18 హింసలను ఎదుర్కొన్నప్పుడు యెహోవా ప్రజలు ప్రదర్శించిన వైఖరి నిజంగా అమోఘం. లౌకిక అధికారులు మన విశ్వాసాన్ని చూసి ముగ్ధులవుతారు, అదే సమయంలో వారు మనలో ఎటువంటి శత్రుభావమూ లేదా ఉక్రోషమూ లేకపోవడం చూసి తమ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతారు. ఉదాహరణకు, నాజీ మారణహోమాన్ని తాళుకుని బయటపడిన సాక్షులు తమ గతకాల అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నప్పుడు, తరచూ ఆనందాన్ని సంతృప్తిని వ్యక్తం చేశారు. యెహోవా తమకు ఎంతో “బలాధిక్యము”ను ఇచ్చాడని వారికి తెలుసు. (2 కొరింథీయులు 4:⁠7) మన మధ్యనున్న అభిషిక్తులైనవారు, తమ “పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవ[న్న]” హామీని కలిగివున్నారు. (లూకా 10:​20) వారి సహనం నిరాశకు నడిపించని నిరీక్షణను కలిగిస్తుంది, అలాగే భూమిపై జీవించే నిరీక్షణతో విశ్వసనీయంగా కోతపనిని చేసేవారికి కూడా అలాంటి దృఢ నమ్మకమే ఉంది.​—⁠రోమీయులు 5:​3-5.

కోతపనిలో పట్టుదలతో కొనసాగండి

19. క్రైస్తవ పరిచర్యలో ఎలాంటి ప్రభావవంతమైన విధానాలు ఉపయోగించబడ్డాయి?

19 సూచనార్థక కోతపనిలో కొనసాగేలా మనలను యెహోవా ఇంకెంతకాలం అనుమతిస్తాడో వేచి చూడాల్సిందే. ఈలోగా, కోతపనివారు తమ పనికి సంబంధించి కొన్ని నిర్దిష్టమైన విధానాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. అదే విధంగా, మనం కాల పరీక్షకు నిలిచిన ప్రకటనా విధానాలను విశ్వసనీయంగా ఉపయోగిస్తూ ఉంటే ఫలితాలు లభిస్తాయని నమ్మకంతో ఉండగలము. పౌలు తోటి క్రైస్తవులతో ఇలా అన్నాడు: “మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” (1 కొరింథీయులు 4:​15,16) పౌలు మిలేతులో ఎఫెసులోని పెద్దలను కలిసినప్పుడు, తాను వారికి “బహిరంగముగాను, ఇంటింటను” బోధించకుండా ఉండలేదని గుర్తుచేశాడు. (అపొస్తలుల కార్యములు 20:​20,21) పౌలు సహవాసియైన తిమోతికి, అపొస్తలుని విధానాలు ఏమిటో తెలుసు, అందుకనే వాటిని గురించి కొరింథీయులకు తెలియజేయగలిగాడు. (1 కొరింథీయులు 4:​17) దేవుడు పౌలు విధానాలను ఆశీర్వదించాడు, అలాగే మనం పునర్దర్శనాల్లోను, గృహ బైబిలు అధ్యయనాల్లోను, ఇంకా ప్రజలెక్కడ ఉన్నా అక్కడ సువార్తను పట్టుదలతో ప్రకటించడాన్ని ఆశీర్వదిస్తాడు.​—⁠అపొస్తలుల కార్యములు 17:⁠17.

20. గొప్ప ఆధ్యాత్మిక కోతపని ముందుందని యేసు ఎలా సూచించాడు, ఇటీవలి సంవత్సరాల్లో అది వాస్తవమని ఎలా నిరూపించబడింది?

20 యేసు సా.శ. 30 లో సుఖారనే ఊరిలో ఒక సమరయ స్త్రీకి సాక్ష్యం ఇచ్చిన తరువాత ఆయన ఆధ్యాత్మిక కోత గురించి మాట్లాడాడు. ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్న[వి]. ... విత్తువాడును కోయువాడును కూడ సంతోషించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు.” (యోహాను 4:​34-36) బహుశ యేసు తాను సమరయ స్త్రీతో మాట్లాడడం మూలంగా ఏర్పడిన ఫలితాలను చూసి ఉంటాడు, ఎందుకంటే అప్పటికే ఆమె ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా అనేకమంది ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నారు. (యోహాను 4:​39) ఇటీవలి సంవత్సరాల్లో, అనేక దేశాల్లో యెహోవాసాక్షులపై ఆంక్షలను ఎత్తివేయడం లేదా వారికి చట్టబద్ధమైన గుర్తింపును ఇవ్వడం జరిగింది. అలా కోతకు క్రొత్త క్షేత్రాలు కనిపించనారంభించాయి. దీని ఫలితంగా గొప్ప ఆధ్యాత్మిక కోతపని జరుగుతోంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా, మనం ఆధ్యాత్మిక కోతపనిలో పాల్గొంటూ ఆనందంగా ముందుకు సాగుతుండగా సమృద్ధికరమైన ఆశీర్వాదాలు అనుభవంలోకి వస్తున్నాయి.

21. ఆనందభరితులైన కోతపనివారిగా మనం పట్టుదలతో ముందుకు కొనసాగడానికి ఎందుకు కారణముంది?

21 పొలాలు పండి కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు పనివారు అత్యవసర భావంతో పనిచేయాలి. వారు ఆలస్యం చేయకుండా శ్రమించి పనిచేయాలి. నేడు, మనం అత్యవసర భావంతో పరిశ్రమించాలి, ఎందుకంటే మనం “అంత్యకాలము”లో జీవిస్తున్నాము. (దానియేలు 12:⁠4) అవును, మనం పరీక్షలను ఎదుర్కొంటాము, కానీ మునుపెన్నడూ చూడనంత ఎక్కువగా యెహోవా ఆరాధకుల సమకూర్పు ఇప్పుడు జరుగుతోంది. కాబట్టి ఇది సంతోషం వెల్లువై ఉప్పొంగే సమయం. (యెషయా 9:⁠3) అందుకని, ఆనందభరితులైన పనివారిగా మనం కోతపనిలో పట్టుదలతో ముందుకు కొనసాగుదాం!

[అధస్సూచి]

^ పేరా 15 యెహోవాసాక్షులు ప్రచురించి పంపిణీ చేసింది.

మీరెలా జవాబిస్తారు?

• ఇంకా ఎక్కువ పనివారు కావాలన్న విజ్ఞప్తికి కోత యజమాని ఎలా జవాబిచ్చాడు?

• మనం ‘ద్వేషించబడుతున్నా’ ఎలాంటి దృక్పథాన్ని కలిగివుండగలం?

• మనం హింసించబడినా ఎందుకు ఆనందభరితంగా ఉంటాము?

• మనం కోతపనిలో అత్యవసర భావంతో ఎందుకు పట్టుదల కలిగి ఉండాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[16, 17వ పేజీలోని చిత్రాలు]

ఆధ్యాత్మిక కోతపనిలో పాల్గొనే వారికి దేవదూతల మద్దతు ఉంది

[18వ పేజీలోని చిత్రం]

సమాచార ప్రదర్శనలు రాజ్య సందేశాన్ని అనేకమంది దృష్టికి తీసుకువచ్చాయి

[18వ పేజీలోని చిత్రం]

మనం నాటి నీరు పోస్తాము, కానీ దేవుడు అభివృద్ధిని కలుగజేస్తాడు