కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నీతిమంతునికి ఆశీర్వాదములు వచ్చును’

‘నీతిమంతునికి ఆశీర్వాదములు వచ్చును’

‘నీతిమంతునికి ఆశీర్వాదములు వచ్చును’

“నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు” అని కీర్తనకర్త దావీదు తన వృద్ధాప్యంలో అన్నాడు. (కీర్తన 37:​25) యెహోవా దేవుడు నీతిమంతులను ప్రేమిస్తాడు, వారి పట్ల ఎంతో ఆప్యాయతతో శ్రద్ధవహిస్తాడు. నీతిని అనుసరించమని ఆయన తన వాక్యమైన బైబిలులో సత్యారాధకుల్ని ఉద్బోధిస్తున్నాడు.​—⁠జెఫన్యా 2:⁠3.

మంచి చెడ్డల సంబంధంగా దేవుని ప్రమాణాలను పాటించడమే నీతి. దేవుని చిత్తానికి అనుగుణంగా మారమని ప్రోత్సహిస్తూ బైబిలు పుస్తకమైన సామెతలులోని 10వ అధ్యాయం, అలా చేసేవారికి లభించబోయే సమృద్ధియైన ఆశీర్వాదాలను సూచిస్తోంది. అలాంటి ఆశీర్వాదాల్లో ఆధ్యాత్మికంగా పోషణనిచ్చే సమృద్ధియైన ఆహారం, సంతృప్తినీ ప్రతిఫలాన్ని తెచ్చే పని, దేవునితోను మానవులతోను ఉండే సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మనం సామెతలు 10:​1-14 వచనాలను ధ్యానిద్దాము.

చక్కని ప్రేరకం

అధ్యాయంలోని ప్రారంభ మాటలు సామెతల పుస్తకపు తర్వాతి భాగాన్ని రచించినదెవరో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. “సొలొమోను చెప్పిన సామెతలు” అని ఆమాటలు చెబుతున్నాయి. సరైన మార్గాన్ని అవలంబించడానికి చక్కని ప్రేరకాన్ని గుర్తిస్తూ ప్రాచీన ఇశ్రాయేలు రాజు సొలొమోను ఇలా అంటున్నాడు: “జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును.”​—⁠సామెతలు 10:⁠1.

తమ బిడ్డ సత్యారాధననూ సజీవుడైన దేవుణ్ణీ విడిచిపెట్టినప్పుడు తల్లిదండ్రులకు కలిగే మానసిక క్షోభ వర్ణనాతీతం! జ్ఞానియైన రాజు తల్లి అనుభవించే క్షోభను ఎత్తిచూపుతున్నాడు, బహుశ ఆమె ఎక్కువగా దుఃఖిస్తుందని సూచిస్తున్నట్లున్నాడు. డోరిస్‌ విషయంలో అలా జరిగింది. * ఆమె ఇలా చెబుతోంది: “మా21 ఏండ్ల కుమారుడు సత్యాన్ని విడిచిపెట్టినప్పుడు నేనూ నా భర్త ఫ్రాంక్‌ ఎంతో విలపించాము. ఫ్రాంక్‌కన్నా నేను భావోద్రేకంగా విపరీతంగా బాధపడ్డాను. గతించిన 12 సంవత్సరాలు కూడా ఆగాయాన్ని మాన్పలేకపోయాయి.”

పిల్లలు తమ తండ్రుల సంతోషాన్ని ప్రభావితం చేయగలరు, తమ తల్లులకు దుఃఖాన్ని తీసుకురాగలరు. మనం జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తూ మన తల్లిదండ్రులకు ఆనందాన్ని తీసుకువద్దాము. మరింత ప్రాముఖ్యంగా మన పరలోకపు తండ్రియైన యెహోవా హృదయాన్ని కూడా మనం సంతోషపరుద్దాము.

‘నీతిమంతుడు తృప్తిపర్చబడతాడు’

“భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణమునుండి రక్షించును” అంటున్నాడు జ్ఞానియైన రాజు. (సామెతలు 10:⁠2) అంత్యదినాల్లోనే చివరి దినాల్లో జీవిస్తున్న క్రైస్తవులకు ఆమాటలు నిజంగానే ఎంతో అమూల్యమైనవి. (దానియేలు 12:⁠4) దైవభక్తిలేని లోకానికి నాశనం చాలా త్వరలోనే రాబోతోంది. మానవునిచే ఎటువంటి భద్రతా కలుగదు. అది వస్తుసంపదలతో కూడినదైనా, ఆర్థికమైనదైనా, సైనికపరమైనదైనా మానవుడు అందించే ఎటువంటి భద్రతయైనా రాబోతున్న “మహాశ్రమలనుండి” రక్షణను ఇవ్వలేదు. (ప్రకటన 7:​9, 10, 13,14) “యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు.” (సామెతలు 2:​21) కాబట్టి మనం నిరంతరం “[దేవుని] రాజ్యమును నీతిని మొదట” వెదకుదాము.​—⁠మత్తయి 6:⁠33.

యెహోవా సేవకులు ఆయన ఆశీర్వాదాలను అనుభవించడానికి వాగ్దానం చేయబడిన నూతనలోకం వరకు వేచివుండాల్సిన అవసరం లేదు. “యెహోవా నీతిమంతుని ఆకలిగొననియ్యడు, భక్తిహీనుని ఆశను భంగముచేయును.” (సామెతలు 10:⁠3) యెహోవా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ద్వారా ఆధ్యాత్మిక ఆహారాన్ని సమృద్ధిగా అందజేస్తున్నాడు. (మత్తయి 24:​45) నీతిమంతుడు “హృదయానందముచేత కేకలు” వేయడానికి తప్పకుండా ఎన్నో కారణాలు ఉన్నాయి. (యెషయా 65:​14) పరిజ్ఞానం ఆయన ప్రాణానికి ఎంతో సేదదీర్పుగా ఉంటుంది. ఆధ్యాత్మిక సంపదల కోసం అన్వేషించడం ఆయనకు ఆహ్లాదకరంగా ఉంటుంది. భక్తిహీనుడు అలాంటి ఆనందాల్ని ఏమాత్రం ఎరుగడు.

‘శ్రద్ధగలిగి ఉండడం ద్వారా ఐశ్వర్యం వస్తుంది’

నీతిమంతుడు మరో విధంగా కూడా ఆశీర్వదించబడతాడు. “బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు.​—⁠సామెతలు 10:​4,5.

కోతకాలంలో పనిచేసేవారికి ఆరాజు మాటలు ఎంతో వర్తిస్తాయి. కోతకాలంలో మొద్దునిద్ర పోవడం సరికాదు. శ్రద్ధకలిగి కష్టించి పనిచేయాల్సివుంటుంది. నిజంగా అది అత్యవసర పనికాలం.

ధాన్యపు పంటను కాదుగాని మనుష్యుల కోతకాలాన్ని మనస్సులో ఉంచుకొని యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక, తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని [యెహోవా దేవుణ్ణి] వేడుకొను[డి].” (మత్తయి 9:​35-38) 2000వ సంవత్సరంలో యేసు మరణ జ్ఞాపకార్థ దినానికి కోటీ 40 లక్షలమంది హాజరయ్యారు, అంటే యెహోవాసాక్షుల సంఖ్యకు రెండింతలకన్నా ఎక్కువ. ‘పొలములు తెల్లబారి కోతకు వచ్చియున్నవన్న’ విషయాన్ని ఎవరు ఖండించగలరు? (యోహాను 4:​35) మరింతమంది పనివారు కావాలని సత్యారాధకులు యజమానిని అడుగుతున్నారు, అదే సమయంలో వారు తమ ప్రార్థనలకు అనుగుణంగా శిష్యులను చేసే పనిలో చెమటోడ్చి పనిచేస్తున్నారు. (మత్తయి 28:​19,20) యెహోవా వారి ప్రయత్నాలను ఎంతగా ఆశీర్వదించాడో గదా! 2000 సేవా సంవత్సరంలో 2,80,000కుపైగా క్రొత్తవారు బాప్తిస్మం పొందారు. వీరు కూడా దేవుని వాక్య బోధకులుగా తయారు కావడానికి కృషిచేస్తున్నారు. శిష్యులను చేసే పనిలో పూర్తిగా భాగం వహించడం ద్వారా మనమూ ఈకోతకాలంలో ఆనందాన్ని సంతృప్తిని అనుభవించుదాం.

“నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు”

సొలొమోను ఇంకా ఇలా అంటున్నాడు: “నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును.”​—⁠సామెతలు 10:⁠6.

హృదయంలో నిర్మలత్వాన్ని నీతిని కలిగివున్న వ్యక్తి తన నీతికి కావాల్సినంత నిదర్శనాన్ని ఇస్తాడు. ఆయన మాటలు దయాపూర్వకంగా క్షేమాభివృద్ధికరంగా ఉంటాయి, ఆయన చర్యలు నిర్మాణాత్మకంగా ప్రోద్బలపరచేవిగా ఉంటాయి. ఆయనను ఇతరులు సాదరంగా ఆహ్వానిస్తారు. అలాంటి వ్యక్తి వారి మెప్పును, అంటే, వారి ఆశీర్వాదాలను కూడా గెలుచుకుంటాడు; ఏ విధంగానంటే, వారు ఆయనను గురించి మంచిగా మాట్లాడుకుంటారు.

మరోవైపు, భక్తిహీనుడు ద్వేషపూరితుడుగా దుర్బుద్ధితో నిండినవానిగా ఉంటాడు, ఎప్పుడు చూసినా ఇతరులకు హాని తలపెట్టేవాడిగా ఉంటాడు. అతడు తియ్యగా మాట్లాడుతుండవచ్చు, బహుశ అతడి మాటలు తన హృదయంలో ఉన్న ‘బలాత్కారమును మూసివేస్తుండవచ్చు,’ కానీ చివరికి అతడు శారీరకంగా లేదా మౌఖికంగా దాడి చేయడానికి పూనుకుంటాడు. (మత్తయి 12:​34,35) లేదా వేరే మాటల్లో చెప్పాలంటే, “బలాత్కారము భక్తిహీనుల నోళ్ళను కప్పివేస్తుంది [లేదా మూసివేస్తుంది].” (సామెతలు 10:​6,NW) భక్తిహీనుడు ఇతరుల పట్ల ప్రవర్తించే విధంగానే వారు కూడా అతడి పట్ల ప్రవర్తిస్తారని, అంటే హింసాత్మకంగా ప్రవర్తిస్తారని ఇది సూచిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది అతని నోటిని కప్పేస్తుంది, లేదా మూసివేస్తుంది. అలాంటి వ్యక్తి ఇతరుల నుండి ఏ ఆశీర్వాదాలను ఆశించగలడు?

ఇశ్రాయేలు రాజు ఇలా వ్రాస్తున్నాడు: “నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును.” (సామెతలు 10:⁠7) నీతిమంతుడ్ని ఇతరులు ఆప్యాయంగా జ్ఞాపకము చేసుకుంటారు, అందరికన్నా ఎక్కువగా యెహోవా జ్ఞాపకం చేసుకుంటాడు. తుది శ్వాస వరకు విశ్వసనీయంగా ఉన్న యేసు దేవదూతలకంటె ‘శ్రేష్ఠమైన నామము పొందాడు.’ (హెబ్రీయులు 1:​3,4) విశ్వసనీయులైన క్రీస్తుపూర్వపు స్త్రీపురుషుల్ని నేడు నిజ క్రైస్తవులు అనుకరణయోగ్యమైన మాదిరులుగా జ్ఞాపకం చేసుకుంటున్నారు. (హెబ్రీయులు 12:​1,2) భక్తిహీనుల పేర్లకు ఇదెంత భిన్నంగా ఉంది, వారి పేర్లు హేయమైనవి, అవి కంపు కొడుతుంటాయి! అవును, “గొప్ప ఐశ్వర్యముకంటె మంచి పేరును వెండి బంగారములకంటె దయయు కోరదగినవి.” (సామెతలు 22:⁠1) మనం యెహోవా దృష్టిలోను మన తోటి మానవుని దృష్టిలోను మంచి పేరును సంపాదించుకొందాం.

‘యథార్థవంతుడు నిర్భయముగా ప్రవర్తిస్తాడు’

జ్ఞానికి పనికిమాలినవానికి మధ్యనున్న భేదాన్ని చూపిస్తూ సొలొమోను ఇలా వ్రాస్తున్నాడు: “జ్ఞానచిత్తుడు ఉపదేశము నంగీకరించును, పనికిమాలిన వదరుబోతు నశించును.” (సామెతలు 10:⁠8) జ్ఞానికి, “మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదని” బాగా తెలుసు. (యిర్మీయా 10:​23) యెహోవా నుండి నడిపింపును అర్థిస్తూ ఆయన ఆజ్ఞలను సంసిద్ధతతో స్వీకరించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తిస్తాడు. మరోవైపు పనికిమాలిన వదరుబోతు చూస్తే, అతడు ఈప్రాథమిక వాస్తవాన్ని గ్రహించలేకపోతాడు. వాని మూర్ఖమైన ప్రేలాపన వాడికి నాశనమే తెస్తుంది.

దుష్టుడు ఏమాత్రమూ అనుభవించలేని నిర్భయాన్ని నీతిమంతుడు ఎల్లప్పుడు అనుభవిస్తాడు. “యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిలవర్తనుడు బయలుపడును. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును పనికిమాలిన వదరుబోతు నశించును.”​—⁠సామెతలు 10:9,10.

యథార్థవంతుడు తన వ్యవహారాల్లో ఎల్లప్పుడు నిజాయితీగా ఉంటాడు. ఆయన ఇతరుల గౌరవాన్ని నమ్మకాన్ని గెల్చుకుంటాడు. నిజాయితీగల వ్యక్తిని ఉద్యోగంలో పెట్టుకోవడానికి ఎంతో ఆనందిస్తారు, తరచు ఆయనకు మరింత పెద్ద బాధ్యతలను అప్పజెబుతారు. నిజాయితీకి ఆయన పేరుగాంచాడు కాబట్టి ఉద్యోగాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఆయన నిరుద్యోగిగా ఉండడు. అంతేకాదు ఆయన నిజాయితీ, ఇంట్లో కూడా ఒక ఆహ్లాదకరమైన సమాధానకరమైన వాతావరణం పెంపొందించడానికి దోహదపడుతుంది. (కీర్తన 34:​13,14) తన కుటుంబ సభ్యులతో తనకుగల సంబంధాల్లో ఆయన నిర్భయంగా ఉంటాడు. నిర్భయంతో కూడిన భావన నిజంగానే యథార్థతకు లభించే ప్రతిఫలం.

అయితే స్వార్థంతో లాభాలను ఆర్జించడానికి నీతి నిజాయితీలను గాలికి వదిలేసే వ్యక్తి పరిస్థితి వేరుగా ఉంటుంది. ఒక మోసగాడు తన కపటత్వాన్ని కుటిలమైన మాటలతో లేదా శరీర భంగిమలతో కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తుండవచ్చు. (సామెతలు 6:​12-14) హానికరమైన మోసపూరితమైన ఉద్దేశంతో చేసే కనుసైగలు అతడి మోసానికి బలయ్యే వ్యక్తులకు ఎంతో మానసిక వ్యధను కలిగిస్తాయి. కానీ ఈరోజు కాకపోతే రేపైనా అలాంటి వ్యక్తి కుటిలత్వం బయటపడుతుంది. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారివెంట వెళ్లుచున్నవి. అటువలె మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు.” (1 తిమోతి 5:​24,25) అదెవరైనా సరే, తల్లైనా తండ్రైనా, స్నేహితుడైనా, వివాహ భాగస్వామైనా, లేదా పరిచయస్థుడైనా మోసం చివరికి బయటపడుతుంది. నిజాయితీ లేని మనిషని పేరుతెచ్చుకున్న వ్యక్తిని ఎవరు మాత్రం నమ్మగలరు?

‘ఆయన నోరు జీవపు ఊట’

నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును” అంటున్నాడు సొలొమోను. (సామెతలు 10:​11) నోటిమాటలు గాయాలను మాన్పగలవు లేదా గాయపరచనూ గలవు. అవి ఒక వ్యక్తిని సేదదీర్చి చైతన్యవంతునిగా చేయగలవు, లేదా అవి నిలువునా చీల్చనూగలవు.

నోటిమాటల వెనుక గల ఉద్దేశాన్ని గుర్తిస్తూ ఇశ్రాయేలు రాజు ఇలా అంటున్నాడు: “పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పును.” (సామెతలు 10:​12) పగ అనేది మానవ సమాజంలో పోరాటాలను సృష్టిస్తుంది, వివాదాలను రేపుతుంది. యెహోవాను ప్రేమించేవారు తమ జీవితాల్లోనుండి పగను సమూలంగా తీసివేయాలి. ఎలా? దాని స్థానే ప్రేమను అలవరచుకోవడం ద్వారా. “ప్రేమ అనేక పాపములను కప్పును.” (1 పేతురు 4:⁠8) ప్రేమ “అన్నిటికి తాళుకొనును,” అంటే “అన్నిటిని కప్పును.” (1 కొరింథీయులు 13:⁠7, అధస్సూచి.) దైవిక ప్రేమ అపరిపూర్ణ మానవుల నుండి పరిపూర్ణతను ఎదురుచూడదు. ఇతరుల తప్పులను టాంటాం చేయడానికి బదులుగా, గంభీరమైన పాపం ఇమిడి లేనంత వరకు, వారి తప్పులను ఉపేక్షించడానికి అలాంటి ప్రేమ సహాయం చేస్తుంది. క్షేత్ర పరిచర్యలో, ఉద్యోగ స్థలంలో, లేదా స్కూల్లో ఉన్నప్పుడు మనతో ఇతరులు అనుచితంగా ప్రవర్తించినప్పుడు కూడా ప్రేమ తాళుకుంటుంది.

జ్ఞానియైన రాజు ఇంకా ఇలా అంటున్నాడు: “వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును.” (సామెతలు 10:​13) వివేకి యొక్క జ్ఞానము ఆయన నడతలను నిర్దేశిస్తుంది. ఆయన పెదవులపై క్షేమాభివృద్ధికరమైన మాటలు ఇతరులు నీతి మార్గంలో నడిచేందుకు సహాయం చేస్తాయి. ఆయన గాని ఆయన మాటలు వినేవారు గాని సరైన మార్గంలో నడవడానికి బలాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదు​—⁠బెత్తాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు.

‘పరిజ్ఞానాన్ని సమకూర్చుకోండి’

మనం అల్పమైన విషయాలపై ఎగిరెగిరిపడే ఎండుటాకులా ఉండడానికి బదులుగా మన మాటలు ‘నదీ ప్రవాహమువంటి జ్ఞానపు ఊట’గా ఉండాలంటే ఏది సహాయం చేస్తుంది? (సామెతలు 18:⁠4) సొలొమోను జవాబిస్తున్నాడు: “జ్ఞానులు జ్ఞానము [“పరిజ్ఞానాన్ని,” NW] సమకూర్చుకొందురు, మూఢుల నోరు అప్పుడే నాశనముచేయును.”​—⁠సామెతలు 10:⁠14.

మొట్టమొదటి ఆవశ్యక విషయం ఏమిటంటే, మన మనస్సు క్షేమాభివృద్ధికరమైన దేవుని గూర్చిన పరిజ్ఞానంతో నింపుకోవాలి. ఆపరిజ్ఞానానికి ఒకే ఒక్క మూలం ఉంది. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాస్తున్నాడు: “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.” (2 తిమోతి 3:​16,17) మనం పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలి, అలాగే దాచబడిన నిధికోసం అన్వేషిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో త్రవ్వాలి. అదెంత ఉత్తేజభరితంగా ఎంత ప్రతిఫలదాయకంగా ఉంటుందో కదా!

మన పెదవులపై జ్ఞానం కదలాడాలంటే, లేఖనాలను గురించిన పరిజ్ఞానం మన హృదయాలకు కూడా చేరాలి. యేసు తన శ్రోతలకు ఇలా చెప్పాడు: “సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.” (లూకా 6:​45) అందుకని మనం నేర్చుకొంటున్న విషయాలను ధ్యానించడాన్ని అలవాటుగా చేసుకోవాలి. నిజమే, అధ్యయనం చేయడానికీ ధ్యానించడానికి ఎంతో కృషి అవసరమవుతుంది, కానీ అలాంటి అధ్యయనం ఆధ్యాత్మికంగా మనలను ఎంత సుసంపన్నులను చేస్తుందో కదా! వదరుబోతులా ఆలోచనలేని మాటలు మాట్లాడే వ్యక్తి నడిచే మార్గం వినాశనానికి నడిపిస్తుంది, అందులో ఎవరూ నడవాల్సిన అవసరం లేదు.

అవును జ్ఞానియైన వ్యక్తి దేవుని దృష్టిలో సరైనది చేస్తాడు, ఇతరులపై మంచి ప్రభావాన్ని కనబరుస్తాడు. ఆయన ఆధ్యాత్మిక ఆహారాన్ని సమృద్ధిగా భుజిస్తాడు, ప్రతిఫలదాయకమైన ప్రభువు కార్యాభివృద్ధిలో ఎల్లప్పుడు ఆసక్తిని కలిగివుంటాడు. (1 కొరింథీయులు 15:​58) యథార్థవర్తనుడుగా ఆయన నిర్భయంగా నడుస్తాడు, దేవుని ఆమోదాన్ని పొందుతాడు. నిజంగానే, నీతిమంతుని ఆశీర్వాదాలు అనేకం. మనం మన జీవితాల్ని మంచి చెడ్డల విషయంలో దేవుని ప్రమాణాలకు అనుగుణంగా మలచుకుంటూ నీతిని వెదుకుదము గాక!

[అధస్సూచి]

^ పేరా 6 పేరు మార్చబడింది.

[25వ పేజీలోని చిత్రం]

నిజాయితీ కుటుంబ జీవితంలో ఆనందానికి దోహదపడుతుంది

[26వ పేజీలోని చిత్రం]

‘జ్ఞానులు పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటారు’