కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు నిజంగా సహనశీలురేనా?

మీరు నిజంగా సహనశీలురేనా?

మీరు నిజంగా సహనశీలురేనా?

ఎవరైనా మీతో అనుచితంగా ప్రవర్తించినప్పుడు మీరు ఆగ్రహం చెందారా? మీసన్నిహిత సహచరుల్లో భ్రష్టమైన వైఖరులు పొడచూపుతుంటే మీరు వెంటనే చర్యతీసుకుంటారా?

గంభీరమైన పాపం విస్తరించకుండా నివారించేందుకు కొన్నిసార్లు అప్పటికప్పుడు కఠినమైన చర్యలు తీసుకోవడం అవసరం అవుతుంది. ఉదాహరణకు సా.శ.పూ. 15వ శతాబ్దంలో, ఘోరమైన పాపం ఇశ్రాయేలీయులను మలినపరచే ప్రమాదం జరుగబోతున్నప్పుడు, అహరోను మనుమడైన ఫీనెహాసు చెడును నిర్మూలించడానికి ఒక నిర్ణయాత్మకమైన చర్య తీసుకున్నాడు. ఆయన చేసినదాన్ని యెహోవా ఆమోదించాడు, ఆయనిలా అన్నాడు: “ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను.”​—⁠సంఖ్యాకాండము 25:​1-11.

ఫీనెహాసు మాలిన్యం విస్తరించకుడా ఆపడానికి యుక్తమైన చర్యను తీసుకున్నాడు. కానీ ఇతరులు మానవ సహజమైన పొరబాట్లు చేసినప్పుడు వారిపై నియంత్రణ లేకుండా ఉగ్రతను ప్రదర్శించడం విషయమేమిటి? మనం దురుసుగా లేక సరైన కారణం లేకుండా ప్రవర్తిస్తే నీతి సమర్థకుడన్న పేరు రావడం కాదుగదా సహనం లేని వ్యక్తిగా​—⁠ఇతరుల అపరిపూర్ణతలను పరిగణలోకి తీసుకోని వ్యక్తిగా పేరొందుతాము. ఈప్రమాదంలో పడకుండా మనకేది సహాయం చేయగలదు?

‘యెహోవా నీ దోషములన్నిటిని క్షమించువాడు’

యెహోవా “రోషముగల దేవు[డు].” (నిర్గమకాండము 20:⁠5) ఆయన సృష్టికర్త కాబట్టి మననుండి అనితర భక్తిని కోరే హక్కు ఆయనకు ఉంది. (ప్రకటన 4:​10-11) అయినా మానవ బలహీనతలను యెహోవా సహిస్తాడు. అందుకనే ఆయన గురించి కీర్తనకర్త దావీదు ఇలా పాడాడు: “యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు. ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు [“దోషాలను వెదుకుతూ ఉండడు,” NW] ... మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు; మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు.” అవును, మనం పశ్చత్తాపపడితే దేవుడు ‘మన దోషములన్నిటిని క్షమిస్తాడు.’​—⁠కీర్తన 103:​3,8-10.

మానవుల పాపభరిత స్వభావాన్ని యెహోవా అర్థంచేసుకుంటాడు కాబట్టే, పశ్చాత్తాప పడిన తప్పిదస్థుల్లో ఆయన “దోషాలను వెదుకుతూ” ఉండడు. (కీర్తన 51:⁠5; రోమీయులు 5:​12) నిజానికి పాపాన్ని అపరిపూర్ణతను నిర్మూలించాలన్నదే ఆయన సంకల్పం. అది పూర్తిగా నెరవేరేంత వరకు, మనకు ‘ప్రతికారం చేయడానికి’ బదులుగా దేవుడు కృపతో యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి ఆధారంగా క్షమాపణను అందిస్తాడు. సముచితమైనప్పుడు కరుణను యెహోవా చూపించకపోయినట్లైతే సజీవులుగా ఉండడానికి అర్హులమని మనలో ఎవ్వరమూ తీర్పు తీర్చబడలేము. (కీర్తన 130:⁠3) అనితర భక్తిని యుక్తంగానే కోరే మన పరలోక తండ్రి కరుణామయుడైన దేవునిగా ఉన్నందుకు మనమెంత కృతజ్ఞులమో కదా!

సమతుల్యత అవసరం

ఈ విశ్వానికి సర్వాధిపతియైన ప్రభువే అపరిపూర్ణ మానవులతో వ్యవహరించేటప్పుడు సహనాన్ని కనబరుస్తుంటే, మనం కూడా అలానే చేయవద్దా? సహనం అనే పదాన్ని, ఇతరుల అభిప్రాయాల పట్ల, రివాజుల పట్ల ఓర్పుగా ఉండేందుకు సుముఖత కలిగివుండడం అని నిర్వచించవచ్చును. ఇతరులు మాటలోను క్రియలోను ఘోరమైన పాపాలే చేయకపోయినా బహుశ అనుచితమైన విధంగా ప్రవర్తించినప్పుడు మనం ఓర్పుగా తాలిమి వహిస్తూ ఆవిధంగా సుముఖంగా ఉంటామా, అలాంటి వైఖరిని కలిగివుంటామా?

నిజమే, మనం సహనాన్ని అతిగా కనబరచకుండా కూడా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు ప్రీస్టులు, అమ్మాయిలపై అబ్బాయిలపై మళ్ళీ మళ్ళీ అత్యాచారాలు చేసినా మతాధికారులు సహించడం ఘోరాతి ఘోరమైన విషయం. ఐర్లాండ్‌లోని ఒక వార్తా విలేఖరి ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “పిల్లలపై అత్యాచారాలను చిన్న పొరపాట్లుగా మాత్రమే దృష్టిస్తూ చర్చి అధికారులు ప్రీస్టులను కేవలం [మరో ప్రాంతానికి] బదిలీ చేస్తున్నారు అంతే.”

అలాంటి మనిషిని కేవలం బదిలీ చేయడం నిజమైన సహనానికి ఉదాహరణా? ఎంత మాత్రం కాదు! బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న ఒక శస్త్రవైద్యుడు శస్త్రచికిత్సలు చేస్తూ రోగులను చంపుతూనే ఉన్నా అంగవికలులను చేస్తూనే ఉన్నా వైద్య మండలివారు ఆయనను ఒక ఆసుపత్రి నుండి మరో ఆసుపత్రికి బదిలీ చేస్తూ ఆయన శస్త్రచికిత్సలు చేస్తూనే ఉండడానికి అనుమతిస్తున్నారనుకోండి. వైద్యవృత్తిలో ఉన్నవారి మధ్య బంధాన్ని పటిష్ఠపరచడానికే వారు అలాంటి “సహనాన్ని” కనబరుస్తుండవచ్చు. కానీ ఆవైద్యుని నిర్లక్ష్యపూరిత, నేరపూరిత ధోరణి మూలంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వ్యక్తుల మాటేమిటి, ఎంతో నష్టపోయిన వ్యక్తుల మాటేమిటి?

మరీ తక్కువ సహనాన్ని కనబరచే ప్రమాదం కూడా ఉంది. యేసు భూమ్మీద ఉన్నప్పుడు జీలట్లు అని పిలువబడిన కొందరు యూదులు తమ చర్యలను సమర్థించుకోవడానికి ఫీనెహాసు మాదిరిని తప్పుగా ఉపయోగించడానికి ప్రయత్నించారు. కొందరు జీలట్ల అతివాద చర్య ఏమిటంటే, “పండుగ రోజుల్లోను అలాంటి మరితర సందర్భాల్లోను యెరూషలేములోని వీధుల్లో ప్రజలతో కలసిపోయి తమ శత్రువులను కత్తులతో ఎవరికీ తెలియకుండా పొడిచేవారు.”

క్రైస్తవులుగా మనం, మనలను బాధపెట్టిన వ్యక్తులపై అలా జీలట్లలా శారీరకంగా దాడిచేసేంత దూరం ఎన్నడూ వెళ్ళము. కానీ కొంతమేరకు అసహనాన్ని కలిగివుండడం మూలంగా మనకిష్టం లేనివారిపై వేరే విధాల్లో, బహుశ వారి గురించి దూషణాత్మకంగా మాట్లాడుతూ వారిపై దాడిచేస్తామా? మనం నిజంగా సహనం కలిగివున్నవారమైతే అటువంటి దూషణకరమైన మాటలు మాట్లాడడానికి పూనుకోము.

అసహనాన్ని ప్రదర్శించిన వారిలో మరో గుంపు మొదటి శతాబ్దంలోని పరిసయ్యులు. వారు నిరంతరం ఇతరులను నిందిస్తూనే ఉన్నారు, మానవ సహజమైన అపరిపూర్ణతకు వారు తావివ్వనే లేదు. గర్విష్ఠులైన పరిసయ్యులు సామాన్య ప్రజానీకం “శాపగ్రస్తమైనదని” దూషిస్తూ వారిని చిన్నచూపు చూసేవారు. (యోహాను 7:​49) అలాంటి స్వనీతిపరులను సకారణంగానే యేసు ఇలా అంటూ నిందించాడు: “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను.”​—⁠మత్తయి 23:⁠23.

ఆ వ్యాఖ్యానాన్ని చేయడం ద్వారా యేసు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన ఆవశ్యకతను తక్కువ చేయడం లేదు. ధర్మశాస్త్రంలోని “ప్రధానమైన” అంశాలు లేక మరింత ప్రాముఖ్యమైన అంశాలు, వారా ధర్మశాస్త్రాన్ని సహేతుకతతో కరుణతో అన్వయించాలని చెబుతున్నాయని మాత్రమే ఆయన చూపిస్తున్నాడు. అసహనంతో ఉన్న పరిసయ్యులు జీలట్లకు యేసు, ఆయన శిష్యులు ఎంత భిన్నంగా ఉన్నారో కదా!

అటు యెహోవా దేవుడు గానీ ఇటు యేసుక్రీస్తు గానీ చెడును చూసీ చూడనట్లు ఊరుకోరు. త్వరలోనే ‘దేవుని నెరుగనివారికిని, సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేసే సమయం వస్తుంది.’ (2 థెస్సలొనీకయులు 1:​6-10) అయితే యేసు నీతి నిమిత్తమై అత్యంతాసక్తితో ఉంటూనే, సరియైనది చేయాలని కోరుకునేవారి పట్ల తన పరలోక తండ్రి కలిగివుండే ఓర్పు, కరుణ, ప్రేమలతో కూడిన చింతను తను కూడా ప్రతిబింబిస్తాడు. (యెషయా 42:​1-3; మత్తయి 11:​28-30; 12:​18-21) యేసు మనకోసం ఎంత చక్కని మాదిరిని ఉంచాడో కదా!

ఓర్పుగా ఒకరినొకరు సహించండి

సరియైన దాని విషయంలో మనకు అత్యంతాసక్తి ఉండవచ్చు, కానీ అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాను మనం అన్వయించుకుందాం: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.” (కొలొస్సయులు 3:​13; మత్తయి 6:​14,15) సహనం కలిగివుండాలంటే ఈఅపరిపూర్ణ లోకంలో ఒకరి తప్పులనూ పొరబాట్లనూ మరొకరు క్షమించుకోవాలి. మనం ఇతరుల నుండి ఆశించేదానిలో సహేతుకంగా ఉండాలి.​—⁠ఫిలిప్పీయులు 4:⁠5.

కానీ సహనం కలిగివుండడం అంటే ఎంతమాత్రమూ తప్పులను ఆమోదించడం అనీ లేదా దోషాలను చూసీ చూడకుండా విడిచిపట్టడం అనీ కాదు. తోటి విశ్వాసిలోని ఒక ఆలోచనా విధానం గానీ లేదా ప్రవర్తన గానీ యెహోవా ప్రమాణాలకు కాస్త భిన్నంగా ఉండవచ్చు. ఆవిధంగా వైదొలగడం దేవునిచే తిరస్కరింపబడేంత గంభీరమైనదిగా ఉండకపోయినా కొంచెం సర్దుబాట్లు అవసరం ఉన్నాయన్న దానికి అది సూచన. (ఆదికాండము 4:​6,7) ఆధ్యాత్మిక అర్హతలు ఉన్నవారు తప్పు చేస్తున్న వ్యక్తిని సాత్వికమైన మనస్సుతో దారికి తీసుకురావడానికి ప్రయత్నించడం ఎంత ప్రేమపూర్వకమైన పని! (గలతీయులు 6:⁠1) అయితే ఆప్రయత్నంలో సఫలులు కావాలంటే ఆవ్యక్తిపట్ల శ్రద్ధతో పనిచేయాలి, అంతేగాని విమర్శనాత్మక దృక్పథంతో కాదు.

“సాత్వికముతోను ప్రగాఢ గౌరవముతోను”

మన మతనమ్మకాలకు ఇతరుల మతనమ్మకాలకు తేడా ఉన్నప్పుడు సహనం ప్రదర్శించడం సంగతి ఏమిటి? ఐర్లాండ్‌లో 1831 లో స్థాపించబడిన నేషనల్‌ స్కూల్స్‌లో అంటించబడిన ఒక “సాధారణ పాఠం”లో ఇలా ఉంది: “యేసుక్రీస్తు తన మతాన్ని ఇతరులపై హింసాత్మక చర్యల ద్వారా రుద్దాలని ఉద్దేశించలేదు. ... మనది ఒప్పు వారిది తప్పు అని మన పొరుగువారిని ఒప్పించడానికి వారితో పోరాడడం, వారిని దూషించడం సరైన పద్ధతులు కావు. అలా చేస్తే మనకు క్రైస్తవ స్ఫూర్తి లేదని నమ్మేలా మాత్రమే అవి వారిని ఒప్పించవచ్చు.”

ప్రజలు దేవుని వాక్యానికి సన్నిహితులయ్యేలా యేసు బోధించాడు, ప్రవర్తించాడు, మనమూ అలానే చేయాలి. (మార్కు 6:​34; లూకా 4:​22,32; 1 పేతురు 2:​21) ఒక పరిపూర్ణ పురుషునిగా దైవదత్తమైన అంతర్దృష్టి ఆధారంగా ఆయన ప్రజల మనస్సులను చదవగలిగాడు. అందుకనే యేసు యెహోవా శత్రువులపై అవసరమైనప్పుడు తీవ్రమైన నిందారోపణలను చేయగలిగాడు. (మత్తయి 23:​13-33) అలా చేయడం ఆయనలో అసహనం ఉందని సూచించడంలేదు.

యేసులా మనకు ప్రజల మనస్సుల్లో ఏముందో చదివే సామర్థ్యం లేదు. అందుకని మనం అపొస్తలుడైన పేతురు సలహాను పాటించాలి: “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను [“ప్రగాఢ గౌరవముతోను,” NW] సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి.” (1 పేతురు 3:​15) యెహోవా సేవకులముగా మనం నమ్మే విషయాలను సమర్థించుకోవాలి, ఎందుకంటే అవి దేవుని వాక్యంలో దృఢంగా ఆధారపడివున్నాయి. కానీ మనమలా చేసేటప్పుడు ఇతరులపట్లా, తాము నిజాయితీగా నమ్మే నమ్మకాలపట్లా గౌరవంతో చేయాల్సిన అవసరం ఉంది. పౌలు ఇలా వ్రాశాడు: “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.”​—⁠కొలొస్సయులు 4:⁠6.

ప్రఖ్యాతి గాంచిన కొండమీది ప్రసంగంలో యేసు ఇలా అన్నాడు: “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:​12) కాబట్టి మనం ఓర్పుగా ఒకరినొకరం సహించుకుంటూ, మనం సువార్త ప్రకటించే వ్యక్తుల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉందాము. మనలోని నీతి విషయమైన అత్యంతాసక్తిని బైబిలు ఆధారిత సహనంతో సమతూకం చేయడం ద్వారా మనం యెహోవాను ప్రీతిపరుస్తాము, నిజమైన సహనం కలిగివుంటాము.

[23వ పేజీలోని చిత్రం]

పరిసయ్యుల అసహనంతో కూడిన వైఖరిని విసర్జించండి

[23వ పేజీలోని చిత్రం]

యేసు తన తండ్రియొక్క సహనంతో కూడిన స్ఫూర్తిని ప్రతిబింబించాడు, మరి మీరు?