కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీలో అమర్త్యమైన ఆత్మ ఉందా?

మీలో అమర్త్యమైన ఆత్మ ఉందా?

మీలో అమర్త్యమైన ఆత్మ ఉందా?

“దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (2 తిమోతి 3:​16) అవును బైబిలు సత్య దేవుడైన యెహోవా నుండి వచ్చిన సత్య వాక్యం.​—⁠కీర్తన 83:⁠18.

మానవులతో సహా సమస్తానికీ యెహోవా సృష్టికర్త కాబట్టి మనం చనిపోయినప్పుడు మనకేమి జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. (హెబ్రీయులు 3:​3,4; ప్రకటన 4:​10,11) ఆయన ప్రేరేపిత వాక్యమైన బైబిల్లో ఆయన మరణానంతర స్థితిని గురించి సత్యమైన సంతృప్తికరమైన జవాబులనిచ్చాడు.

ఆత్మ ఏమిటి?

బైబిలులో “ఆత్మ” అని అనువదించబడిన పదాలకు ప్రాథమికంగా “ఊపిరి” అన్న అర్థం ఉంది. కానీ వాటికి కేవలం ఊపిరి పీల్చడం అనేదాని కన్నా ఎక్కువ భావమే ఉంది. ఉదాహరణకు బైబిలు రచయిత అయిన యాకోబు ఇలా చెబుతున్నాడు: “ఆత్మలేని శరీరం ఏ విధంగా నిర్జీవమైందో అదే విధంగా క్రియలేని విశ్వాసము నిర్జీవమైనది.” (యాకోబు 2:​26, ఈజీ-టు-రీడ్‌ వెర్షన్‌) కాబట్టి, శరీరాన్ని సజీవంగా ఉంచేదే ఆత్మ.

ఈ సజీవంగా ఉంచే శక్తి కేవలం ఊపిరితిత్తుల్లోని ఊపిరి లేదా గాలి మాత్రమే కానేరదు. ఎందుకని? ఎందుకంటే ఊపిరి ఆగిపోయిన తర్వాత కూడా శరీర కణాల్లో కొద్దిసేపు జీవం ఉంటుంది​—⁠ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం “కొద్ది నిమిషాలపాటు ఉంటుంది.” ఆకారణంగా ఊపిరి ఆగిపోయినా మళ్ళీ బ్రతికించేందుకు చేసే ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారి శరీర కణాల్లోని జీవపు నిప్పుకణిక ఆరిపోయిందంటే జీవింపజేయడానికి చేసే ప్రయత్నాలన్నీ వృథా అవుతాయి. లోకంలోని ఊపిరంతా, లేదా గాలి అంతా ఉపయోగించినా కూడా కనీసం ఒక్క కణాన్నైనా జీవింపజేయలేదు. కాబట్టి ఆత్మ అనేది అదృశ్యమైన జీవశక్తి, అంటే ఒక వ్యక్తిలోని కణాలను సజీవంగా ఉంచి, అతణ్ణి సజీవంగా ఉంచే జీవపు నిప్పుకణిక మాత్రమే. ఈజీవశక్తి ఊపిరి పీల్చడం ద్వారా నిలిచివుంటుంది.​—⁠యోబు 34:​14,15.

ఆ ఆత్మ మనుషుల్లో మాత్రమే ఉంటుందా? ఈవిషయంలో బైబిలు సరియైన నిర్ధారణకు రావడానికి సహాయపడుతుంది. జ్ఞానియైన సొలొమోను రాజు మానవులకు జంతువులకు “ఒకే ఆత్మ” ఉంటుందని గుర్తిస్తూ ఆయనిలా అడిగాడు: “మనిషి ఆత్మకి ఏమి జరుగుతుందో ఎవరికెరుక? జంతువు ఆత్మ పాతాళానికి పోతే, మనిషి ఆత్మ పైకి దేవుని దగ్గరికి వెళ్తుందేమో ఎవరికి తెలుసు?” (ప్రసంగి 3:​19-21, అధస్సూచి, ఈజీ-టు-రీడ్‌ వెర్షన్‌) కాబట్టి జంతువులు, మనుష్యులు ఒకే విధమైన ఆత్మను కలిగివున్నట్లు చెప్పబడింది. అదెలా సాధ్యం?

ఈ ఆత్మను, లేదా జీవశక్తిని ఒక యంత్రంలో లేదా ఉపకరణంలో ప్రవహించే విద్యుచ్ఛక్తితో పోల్చవచ్చు. ఆఉపకరణ రీతిని బట్టి ఆఅదృశ్య విద్యుచ్ఛక్తి వేర్వేరు పనులు నిర్వర్తిస్తుంది. ఉదాహరణకు అది, ఒక విద్యుత్‌ పొయ్యి వేడిని పుట్టించేలా చేయగలదు, ఒక కంప్యూటరు సమాచారాన్ని దాచివుంచేలా చేయగలదు, ఒక టెలివిజను చిత్రాల్ని శబ్దాల్ని ఉత్పత్తిచేసేలా చేయగలదు. అయితే, ఈవిద్యుచ్ఛక్తి ఏ ఉపకరణాలనైతే చైతన్యవంతం చేస్తుందో ఆఉపకరణాల రూపాన్ని ఎన్నడూ ధరించదు. అది కేవలం శక్తిగానే మిగిలిపోతుంది. అదే విధంగా జీవశక్తి తాను ఏజీవినైతే చైతన్యవంతం చేస్తుందో దాని రూపాన్ని ధరించదు. దానికి వ్యక్తిత్వం లేదు, ఆలోచనా సామర్థ్యం లేదు. మానవులకు జంతువులకు “ఒకే ఆత్మ” ఉంటుంది. (ప్రసంగి 3:​19, అధస్సూచి, ఈజీ-టు-రీడ్‌ వెర్షన్‌) కాబట్టి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన ఆత్మ వేరే ఏ లోకంలోకో వెళ్ళి అక్కడ ఆత్మ ప్రాణిగా ఉనికిలో ఉండదు.

మరైతే మృతుల స్థితి ఏమిటి? మరి మనిషి చనిపోయినప్పుడు ఆత్మకు ఏమవుతుంది?

“తిరిగి మన్నైపోదు[వు]”

మొదటి మానవుడు ఆదాము దేవుని ఆజ్ఞకు ఉద్దేశపూర్వకంగా అవిధేయుడైనప్పుడు దేవుడాయనతో ఇలా అన్నాడు: “నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.” (ఆదికాండము 3:​19) యెహోవా ఆదామును మంటి నుండి సృష్టించక మునుపు ఆయన ఎక్కడున్నాడు? అందులో సందేహమెందుకు, ఆయనెక్కడా లేడు! ఆయనసలు ఉనికిలోనే లేడు. కాబట్టి “తిరిగి మన్నైపోదువని” యెహోవా దేవుడు ఆదాముతో అన్నప్పుడు, ఆదాము చనిపోయి భూమిలోని మూల ధాతువులలో తిరిగి కలిసిపోతాడని ఆయన భావం. ఆదాము ఏ ఆత్మ లోకానికి వెళ్ళడు. మరణించినప్పుడు ఆదాము మళ్ళీ ఉనికిలో ఉండకుండా పోయాడు. ఆయనకు ఇవ్వబడిన శిక్ష మరణం​—⁠జీవం లేకపోవడం అన్నమాట​—⁠అంతేగాని, మరో లోకానికి బదిలీ కాదు.​—⁠రోమీయులు 6:⁠23.

అయితే చనిపోయిన ఇతరుల విషయమేమిటి? మృతుల స్థితి ప్రసంగి 9:⁠5,10 లో స్పష్టం చేయబడింది: “చనిపోయిన మనుష్యులకి యేమీ తెలియదు. ... సమాధిలో పనేమీ ఉండదు, అక్కడ ఆలోచన, జ్ఞానం, వివేకం ఏ ఒక్కటి ఉండదు.” (ఈజీ-టు-రీడ్‌ వెర్షన్‌) కాబట్టి మరణం అనేది ఉనికిలో లేకుండా పోయే స్థితి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏమి జరుగుతుందో కీర్తనకర్త వ్రాశాడు: “వారి ప్రాణము [“ఆత్మ,” NW] వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును.”​—⁠కీర్తన 146:⁠4.

స్పష్టంగా, మృతులు ఉనికిలో ఉండరు. వారు ఏమీ తెలుసుకోలేరు. వారు మిమ్మల్ని చూడలేరు, మీరు చెప్పేది వినలేరు, మీతో మాట్లాడనూ లేరు. వారు మీకు సహాయమూ చేయలేరు, హానీ తలపెట్టలేరు. మీరు మృతుల గురించి భయపడాల్సిందేమీ లేదు. అయితే ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆయనలోనుండి ఆత్మ ఎలా ‘వెడలిపోతుంది’?

“దేవునియొద్దకు మరల పోవును”

ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన “ఆత్మ దాని దయచేసిన దేవునియొద్దకు మరల పోవును” అని బైబిలు చెబుతోంది. (ప్రసంగి 12:⁠7) అంటే, ఆత్మ అక్షరార్థంగా అంతరిక్షంలో ప్రయాణించి దేవుని సమక్షానికి చేరుకుంటుందనా? ఎంతమాత్రమూ కాదు! ‘మరలు’ అనే బైబిలు మాటకు మరో స్థలానికి స్థానాంతరం పొందడం అనే భావం లేదు. ఉదాహరణకు, అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పబడింది: “మీరు నా తట్టు తిరిగిన [“నా వద్దకు మరలిన,” NW] యెడల నేను మీతట్టు తిరుగుదునని [“మీ వద్దకు మరలెదనని,” NW] సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవి[చ్చాడు].” (మలాకీ 3:⁠7) ఇశ్రాయేలీయులు యెహోవా ‘వద్దకు మరలడం’ అంటే, వారు తమ తప్పుడు మార్గం నుండి మరలి దేవుని నీతియుక్తమైన మార్గానికి అనుగుణంగా మారడం అని అర్థం. అదే విధంగా, యెహోవా ఇశ్రాయేలీయుల ‘వద్దకు మరలడం’ అంటే ఆయన తన ప్రజల వైపు అనుగ్రహంతో కూడిన అవధానాన్ని మరల్చడం అని అర్థం. ఈరెండు సందర్భాల్లోను ‘మరలడం’ అనేదాన్లో దృక్పథం ఇమిడివుంది, అంతేగాని అక్షరార్థంగా ఒక స్థలం నుండి మరో స్థలానికి పయనించడం కాదు.

అదే విధంగా, మరణమందు ఆత్మ దేవుని వద్దకు ‘మరలి పోయే’టప్పుడు భూమి నుండి పరలోకానికి నిజంగా ప్రయాణించడం అనేది సంభవించదు. ఒక్కసారి జీవశక్తి ఒక వ్యక్తిని వదిలిందంటే కేవలం దేవునికి మాత్రమే దాన్ని తిరిగి ఆయనకు ప్రసాదించే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఆత్మ “దేవునియొద్దకు మరల పోవును” అంటే, భవిష్యత్తులో ఆవ్యక్తి జీవించే నిరీక్షణేదైనా ఉంటే అది పూర్తిగా దేవుని చేతిలోనే ఉందని అర్థం.

ఉదాహరణకు యేసుక్రీస్తు మరణం గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో చూడండి. సువార్త రచయిత లూకా ఇలా వివరిస్తున్నాడు: “యేసు గొప్ప శబ్దముతో కేకవేసి​—⁠తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.” (లూకా 23:​46) యేసు ఆత్మ ఆయన నుండి బయటికి వస్తుండగా ఆయన అక్షరార్థంగా పరలోకానికి ప్రయాణం కాలేదు. యేసు మరణం తర్వాత మూడవ రోజుకు గానీ పునరుత్థానుడు కాలేదు, అటు తర్వాత 40 రోజులకు గానీ ఆయన పరలోకానికి ఆరోహణం కాలేదు. (అపొస్తలుల కార్యములు 1:​3,9) అయితే, తను మరణిస్తున్నప్పుడు యేసు తన ఆత్మను నమ్మకంగా తన తండ్రి చేతులకు అప్పగించాడు, తనను తిరిగి సజీవునిగా లేపే యెహోవా సామర్థ్యంలో ఆయనకు పూర్తి నమ్మకం ఉంది.

అవును, దేవుడు ఒక వ్యక్తిని తిరిగి సజీవునిగా చేయగలడు. (కీర్తన 104:​30) ఇది ఎంత గొప్ప నిరీక్షణను అందిస్తోంది!

నిశ్చితమైన నిరీక్షణ

బైబిలు ఇలా చెబుతోంది: “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో [“జ్ఞాపకార్థ సమాధులలో,” NW] నున్నవారందరు [యేసు] శబ్దము విని ... బయటికి వచ్చెదరు.” (యోహాను 5:​28,29) అవును, యెహోవా జ్ఞాపకంలో ఉన్నవారందరు పునరుత్థానులవుతారని, అంటే తిరిగి సజీవులవుతారని యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు. వారిలో యెహోవా సేవకులుగా నీతియుక్తమైన జీవితాన్ని గడిపిన వారందరూ తప్పకుండా ఉంటారు. అయితే కోట్ల మంది ఇతర ప్రజలు తామసలు దేవుని నీతియుక్త ప్రమాణాలకు అనుగుణ్యంగా జీవిస్తామో లేదో చూపించకుండానే చనిపోయారు. బహుశ వారు యెహోవా ఆజ్ఞలను తెలుసుకోలేకపోయి ఉండవచ్చు, లేదా వారికి అవసరమైన మార్పులు చేసుకునేందుకు సరిపడే సమయం లేకపోయి ఉండవచ్చు. అలాంటి ప్రజలు కూడా దేవుని జ్ఞాపకంలో ఉన్నారు, వారు కూడా పునరుత్థానం చేయబడతారు, ఎందుకంటే బైబిలు ఇలా చెబుతోంది: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్న[ది].”​—⁠అపొస్తలుల కార్యములు 24:​14-15.

నేడు భూమంతా ద్వేషంతో అల్లకల్లోలంతో నిండిపోయి ఉంది, హింసాత్మక సంఘటనలు సంభవిస్తున్నాయి, రక్తపుటేర్లు ప్రవహిస్తున్నాయి, కాలుష్యం అధికమైపోయింది, వ్యాధులు విపరీతంగా ఉన్నాయి. ఇలాంటి భూమ్మీదికి మృతులు తిరిగివస్తే, వారి ఆనందం క్షణికమే అవుతుంది. కానీ, సృష్టికర్త తాను త్వరలోనే అపవాదియైన సాతాను నియంత్రణలో ఉన్న ప్రస్తుత లోక సమాజానికి అంతాన్ని తీసుకువస్తానని వాగ్దానం చేశాడు. (సామెతలు 2:​21,22; దానియేలు 2:​44; 1 యోహాను 5:​19) ఒక నీతియుక్తమైన మానవ సమాజం​—⁠ఒక “క్రొత్త భూమి” మన కన్నుల ముందు వాస్తవంగా ఏర్పడుతుంది.​—⁠2 పేతురు 3:⁠13.

అప్పుడు “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” (యెషయా 33:​24) మరణపాశం కూడా తీసివేయబడుతుంది, ఎందుకంటే దేవుడు “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయె[ను].” (ప్రకటన 21:⁠4) “జ్ఞాపకార్థ సమాధులలోనున్న” వారికి ఇదెంత గొప్ప నిరీక్షణో కదా!

యెహోవా భూమి నుండి దుష్టత్వాన్ని తుడిచిపెట్టేసినప్పుడు ఆయన దుష్టులతోపాటు నీతిమంతులను కూడా నాశనం చేయడు. (కీర్తన 37:​10,11; 145:​20) నిజానికి “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు” వచ్చిన ఒక “గొప్ప సమూహము” “మహాశ్రమలనుండి” తప్పించుకొంటుంది. ఆ‘మహాశ్రమలు’ ప్రస్తుత దుష్ట లోకాన్ని నాశనం చేస్తాయి. (ప్రకటన 7:​9-14) కాబట్టి మృతులు సజీవులైనప్పుడు వారిని ఆహ్వానించడానికి ఒక గొప్ప జనసమూహము సిద్ధంగా ఉంటుంది.

మీరు ప్రేమించినవారిని మళ్ళీ చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారా? మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించాలని కోరుకుంటున్నారా? అలాగైతే మీరు దేవుని చిత్తాన్ని గూర్చిన, సంకల్పాలను గూర్చిన ఖచ్చితమైన పరిజ్ఞానాన్ని పొందాలి. (యోహాను 17:⁠3) “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని” యెహోవా ఇచ్ఛయిస్తున్నాడు.​—⁠1 తిమోతి 2:3,4.

[4వ పేజీలోని చిత్రం]

“నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు[వు]”

[5వ పేజీలోని చిత్రం]

ఆత్మను విద్యుత్‌శక్తితో పోల్చవచ్చు

[7వ పేజీలోని చిత్రం]

పునరుత్థానం నిత్యానందాన్ని తీసుకువస్తుంది