యువతకు సమయానుకూలమైన సలహాలు
సంపూర్ణాత్మ నిశ్చయతగలవారై నిలకడగా ఉండండి
యువతకు సమయానుకూలమైన సలహాలు
మొదటి శతాబ్దపు క్రైస్తవుడైన ఎపఫ్రా ఒకసారి రోముకు వెళ్ళాడు. అయితే ఆయన మనస్సు మాత్రం ఆసియా మైనరులోని నగరమైన కొలొస్సయిలోనే ఉంది. ఆయనక్కడ సువార్తను ప్రకటించి కొలొస్సయి వాసుల్లో కొందరు యేసుక్రీస్తు శిష్యులు కావడానికి సహాయం చేయడమే అందుకు కారణం. (కొలొస్సయులు 1:7) కొలొస్సయిలోని తోటి విశ్వాసుల గురించి ఎపఫ్రా ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నాడు, ఈవిషయాన్ని మనం రోము నుండి అపొస్తలుడైన పౌలు వారికి వ్రాసిన ఉత్తరం నుండి తెలుసుకోవచ్చు: “ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు; మీరు సంపూర్ణులును, ప్రతి విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని యితడెల్లప్పుడును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు.”—కొలొస్సయులు 4:12.
అదేవిధంగా నేటి క్రైస్తవ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆధ్యాత్మిక సంక్షేమం నిమిత్తం ఎంతగానో ప్రార్థిస్తారు. ఈతల్లిదండ్రులు తమ పిల్లల హృదయాల్లో దేవుని పట్ల ప్రేమ నాటడానికీ, తద్వారా వారు విశ్వాసంలో స్థిరులయ్యేలా చేయడానికీ ఎంతో కృషిచేస్తారు.
పాఠశాలల్లోను మరితర స్థలాల్లోను తాము ఎదుర్కొనే సవాళ్ళతో పోరాడడానికి సహాయం కావాలని అనేకమంది క్రైస్తవ యౌవనస్థులు అడిగారు. ఒక 15 ఏండ్ల అమ్మాయి ఇలా అన్నది: “మా సమస్యలు మరీ గంభీరంగా మారుతున్నాయి. జీవితం భయానకంగా తయారవుతోంది. మాకు సహాయం కావాలి!” అలాంటి యౌవనస్థుల విన్నపాలకూ దైవభక్తిగల తల్లిదండ్రుల ప్రార్థనలకూ జవాబులు లభించాయా? తప్పకుండా లభించాయి! “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ద్వారా బైబిలు ఆధారిత ఉపదేశం అందించబడుతోంది. (మత్తయి 24:45) ‘సంపూర్ణాత్మ నిశ్చయతగలవారై నిలకడగా ఉండడానికి’ వందల వేలమంది యౌవనస్థులకు సహాయం చేసిన సాహిత్యాలను గురించి ఈఆర్టికల్లో ప్రస్తావించబడింది. ఈప్రచురణల్లో కొన్నింటిని మనం పరిశీలిద్దాము.
“ఇదిగో ... 15,000 మంది క్రొత్త సాక్షులు!”
1941 ఆగస్టులో అమెరికాలోని మిస్సూరీ, సెయింట్ లూయిస్‌లో 1,15,000 మంది సమావేశమయ్యారు, అదే అప్పటి వరకు జరిగిన అతి పెద్ద యెహోవాసాక్షుల సమావేశం. చివరిరోజు “పిల్లల రోజు,” ఆరోజు 15,000 మంది పిల్లలు వేదికకు దగ్గరగా కూర్చుని జోసెఫ్ ఎఫ్. రూథర్‌ఫోర్డ్ “రాజుకి చెందిన పిల్లలు” అనే ప్రసంగాన్ని ఇస్తుండగా విన్నారు. ఆప్రసంగం చివర్లో 71 సంవత్సరాల సహోదరుడు రూథర్‌ఫోర్డ్ వాత్సల్యం ఉట్టిపడే స్వరంతో ఇలా అన్నాడు:
“మీలో దేవునికీ, ఆయన రాజుకీ విధేయత చూపించడానికి ఒప్పుకున్న పిల్లలందరూ దయచేసి లేచి నిలబడండి.” పిల్లలందరూ ఒకే గుంపుగా లేచినిలబడ్డారు. సహోదరుడు రూథర్‌ఫోర్డ్ పెద్ద స్వరంతో ఇలా అన్నాడు: “ఇదిగో, రాజ్యాన్ని ప్రకటించే 15,000 మంది క్రొత్త సాక్షులు!” ఒక్కసారిగా పెద్దపెట్టున కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. ప్రసంగీకుడు ఇంకా ఇలా అన్నాడు: “దేవుని రాజ్యాన్ని గురించి సాధ్యమైనంతగా ఇతరులకు తెలియజేస్తామనుకునే వారు ... దయచేసి చేస్తాము అని అనండి.” దాంతో పిల్లలందరూ గట్టిగా “చేస్తాము!” అని బిగ్గరగా చెప్పారు. తర్వాత సహోదరుడు రూథర్‌ఫోర్డ్ పిల్లలు (ఆంగ్లం) అనే క్రొత్త పుస్తకాన్ని చూపించాడు, ప్రేక్షకుల చప్పట్లతో ఆప్రాంతం మారుమ్రోగింది.
ఉత్తేజభరితమైన ఆప్రసంగం తర్వాత, క్రొత్త పుస్తకం ఉచిత కాపీని తీసుకోవడానికి వేదిక వద్దకు యౌవనస్థులు పెద్ద వరుసలో వచ్చారు. ఆదృశ్యాన్ని చూసి ప్రేక్షకుల కళ్ళు చెమర్చాయి. ఒక ప్రత్యక్ష సాక్షి ఇలా అన్నాడు: “తమ దేవుడైన యెహోవాపై సంపూర్ణ నమ్మకాన్ని విశ్వాసాన్ని చూపిస్తున్న యౌవనస్థుల్ని చూశాక కేవలం పాషాణ హృదయమే ఉప్పొంగదు.”
ఆ చిరస్మరణీయమైన సమావేశంలో 1,300 మంది యౌవనస్థులు యెహోవాకు తాము చేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం పొందారు. వారిలో చాలామంది నేటి వరకూ విశ్వాసంలో స్థిరంగా నిలిచివున్నారు. వారు స్థానిక సంఘాలకు మద్దతునిస్తున్నారు, బేతేలులో స్వచ్ఛంద సేవకులుగా ఉన్నారు, లేదా విదేశాల్లో మిషనరీలుగా సేవచేస్తున్నారు. నిజంగానే, “పిల్లల రోజు” అలాగే పిల్లలు పుస్తకమూ అనేకమైన చిన్నారి హృదయాలపై చెరగని ముద్రను వేశాయి!
“సరిగ్గా సరైన సమయానికి వస్తున్నట్లుగా ఉంటాయి”
లక్షలాదిమంది యౌవనస్థుల హృదయాల్ని గెలుచుకున్న మరో మూడు పుస్తకాలను 1970లలో యెహోవాసాక్షులు ప్రచురించారు. అవి, గొప్ప బోధకుడు చెప్పేది వినడం (ఆంగ్లం), మీయౌవనం—దాన్ని శ్రేష్ఠంగా అనుభవించడం (ఆంగ్లం), నా బైబిలు కథల పుస్తకము. 1982 నుండి తేజరిల్లు! పత్రికలో “యువత ఇలా అడుగుతోంది ...” అనే శీర్షిక మొదలైంది. దీంట్లోని ఆర్టికల్లు ఇటు పిన్న వయస్కుల వారినీ అటు పెద్ద
వయస్కుల వారినీ అలరించాయి. “వాటిని ప్రచురింపజేస్తున్నందుకు నేను దేవునికి ప్రతి రాత్రి కృతజ్ఞతలు చెల్లిస్తాను” అన్నాడు 14 ఏండ్ల ఒక అబ్బాయి. “నాకా ఆర్టికల్లంటే ఎంతో ఇష్టం” అంటుంది 13 ఏండ్ల ఒక అమ్మాయి, “అవి సరిగ్గా సరైన సమయానికి వస్తున్నట్లుగా ఉంటాయి.” తల్లిదండ్రులు క్రైస్తవ పెద్దలు కూడా ఈఆర్టికల్లు ఎంతో సమయోచితంగాను ప్రయోజనకరంగాను ఉన్నట్లు ఒప్పుకుంటారు.1989కల్లా తేజరిల్లు!లో “యువత ఇలా అడుగుతోంది ...” ఆర్టికల్లు 200 వచ్చాయి. ఆసంవత్సరంలో “దైవిక భక్తి” జిల్లా సమావేశంలో యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన జవాబులు (ఆంగ్లం) అనే పుస్తకం విడుదల చేయబడింది. యువత విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి అది సహాయం చేసిందా? ముగ్గురు యువకులు ఇలా వ్రాశారు: “మాసమస్యలను అర్థం చేసుకోవడానికి వాటిని అధిగమించడానికి ఈ పుస్తకం గొప్ప సహాయకంగా ఉంది. మాయోగక్షేమాల పట్ల ఇంత శ్రద్ధ కలిగివున్నందుకు మీకు కృతజ్ఞతలు.” ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేకమంది యౌవనస్థులు ఆమాటలతో ఏకీభవిస్తారు.
“అది మాఆకలిని తీర్చింది”
యెహోవాసాక్షులు 1999 లో యౌవనస్థులకు ఉపదేశాన్ని మరో రీతిలో మారుతున్న కాలానికి అనుగుణంగా అందించారు, అదే—యువత ఇలా అడుగుతోంది—నేను నిజమైన స్నేహితులను ఎలా సంపాదించగలను? (ఆంగ్లం) అనే వీడియో. అది గొప్ప ప్రతిస్పందనను తీసుకువచ్చింది. “ఈ వీడియో సూటిగా నా గుండెల్లోకే దూసుకుపోయింది” అంది 14 ఏండ్ల ఒక అమ్మాయి. “అది మాఆధ్యాత్మిక ఆహారంలో భాగంగా ఉంటుంది” అని ఒక ఒంటరి తల్లి చెబుతోంది. “మా ప్రాణస్నేహితుడైన యెహోవా యౌవనస్థుల్ని నిజంగా ప్రేమిస్తాడనీ మాపట్ల శ్రద్ధ వహిస్తాడనీ తెలుసుకోవడం హృదయాన్ని ఉప్పొంగజేస్తుంది” అని ఒక యువతి వ్రాసింది.
ఆ వీడియో సాధించినదేమిటి? యౌవనస్థులు ఇలా అంటున్నారు: “అది నా సహవాసాన్ని జాగ్రత్తగా పరిశీలించుకునేందుకు, సంఘంలో మరింతమంది స్నేహితులను సంపాదించుకునేందుకు, యెహోవాను నా స్నేహితునిగా చేసుకునేందుకు సహాయం చేసింది.” “అది నా తోటివారి ఒత్తిడిని తట్టుకునేందుకు సహాయం చేసింది.” “నాకు సాధ్యమైనంతలో యథాశక్తి యెహోవాను సేవించాలనే నా దృఢ నిశ్చయాన్ని స్థిరపర్చింది.” అంతేకాదు, ఒక వివాహిత జంట ఇలా వ్రాసింది: “మాకీ ‘ఆహారాన్ని’ దయచేసినందుకు మాహృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అది మాఆకలిని తీర్చింది.”
దైవదత్తమైన తన నియామకానికి అనుగుణంగా “నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసు[డు],” స్వీకరించాలనుకునే వారికి సమయానుకూలమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని అందజేస్తున్నాడు. అలాంటి లేఖనాధారిత ఉపదేశం నేడు యౌవనస్థులు ‘సంపూర్ణాత్మ నిశ్చయతగలవారై నిలకడగా ఉండడానికి’ సహాయం చేస్తుండడం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది!