కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అలవాటు ప్రభావం మీకు మేలు చేయనివ్వండి

అలవాటు ప్రభావం మీకు మేలు చేయనివ్వండి

అలవాటు ప్రభావం మీకు మేలు చేయనివ్వండి

ఏథెన్స్‌ శివారు ప్రాంతంలో ఒక వ్యక్తి 12 ఏళ్ళు నివసించాడు. పనిచేసే స్థలం నుండి ఇంటికి ప్రతి రోజు ఆయన ఒకే మార్గంలో వెళ్ళేవాడు. తర్వాత ఆయన ఆపట్టణానికి అవతలివైపునున్న మరో శివారు ప్రాంతానికి మారాడు. ఒకరోజు పని తర్వాత ఆయన ఇంటికని బయల్దేరాడు. చివరికి పరిసరాలను చూస్తే తాను మునుపున్న ప్రాంతానికి వచ్చానని గుర్తించాడు, అప్పుడు అర్థమయ్యింది ఆయనకు తను వేరే దిశలో వెళ్లినట్లు. అలవాటు ప్రభావం మూలంగా ఆయన పాత ఇంటికి చేరుకున్నాడు!

అలవాట్ల ప్రభావాన్ని అలవర్చుకున్న స్వభావంగా కొన్నిసార్లు వ్యవహరిస్తారు. అది మన జీవితాలపై శక్తివంతమైన రీతులలో ప్రభావం చూపగలదు. ఈభావంలో చూస్తే అలవాట్లను మంటలతో పోల్చవచ్చు. చీకటిగా ఉన్నప్పుడు మంట వెలుగునిస్తుంది, చలిలో వేడినిస్తుంది, మంటపైన మన ఆహారాన్ని వేడి చేసుకోవచ్చు. అయితే, మంటలు జీవితాలను ఆస్తులను నాశనం చేయగల భయంకరమైన శత్రువుగా కూడా ఉండగలవు. అలవాట్ల విషయం కూడా అంతే. సరిగ్గా పెంపొందించుకున్నట్లైతే అవి మనకు గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చగలవు. కానీ అవి వినాశకరంగా కూడా మారగలవు.

ముందు చెప్పిన వ్యక్తి, అలవాటు ప్రభావం మూలంగా ట్రాఫిక్‌లో కొద్ది సమయాన్ని మాత్రమే పోగొట్టుకున్నాడు. అయితే మరింత ప్రాముఖ్యమైన విషయాలకు వస్తే అలవాట్లు మనకు విజయాన్నివ్వగలవు, లేదా వినాశనాన్ని తీసుకురాగలవు. దేవునికి మనం చేసే సేవలోను, ఆయనతో మనకుగల సంబంధంలోను అలవాట్లు మనకు ఎలా సహాయం చేయగలవో లేక ఎలా ఆటంకంగా ఉండగలవో చూపించే, బైబిలులోని కొన్ని నిజజీవిత ఉదాహరణలను పరిశీలించండి.

మంచి, చెడు అలవాట్ల బైబిలు ఉదాహరణలు

నోవహు, యోబు, దానియేలు వంటివారు దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగివుండి ఆశీర్వదించబడ్డారు. వారి “నీతి”ని బట్టి బైబిలు వారిని ఎంతగానో మెచ్చుకుంటుంది. (యెహెజ్కేలు 14:​14) గమనార్హమైన విషయమేమిటంటే వారి ముగ్గురి జీవిత విధానాలూ వారు మంచి అలవాట్లను పెంపొందించుకున్నారని చూపిస్తున్నాయి.

ఒక ఓడను నిర్మించమని నోవహుకు చెప్పబడింది, అది ఒక ఫుట్‌బాల్‌ గ్రౌండు కన్నా పొడుగ్గాను, ఐదంతస్తుల భవనమంత ఎత్తుగాను ఉండాలి. అంతటి బృహత్‌ కార్యాన్ని సాధించాలంటే ప్రాచీన కాలంలోని ఏ నౌకా నిర్మాణకుడైనా గుండెల మీద చెయ్యివేసుకుంటాడు. నోవహు, ఆయన ఏడుగురు కుటుంబ సభ్యులు కలిసి ఆధునిక పరికరాల సాయమేమీ లేకుండానే ఓడను నిర్మించారు. దానికి తోడు నోవహు తన సమకాలీనులకు దేవుని సందేశాన్ని ప్రకటిస్తూ ఉండేవాడు. ఆయన తన కుటుంబ ఆధ్యాత్మిక భౌతిక అవసరాలను తీరుస్తూనే ఉండేవాడని కూడా మనం నమ్మకం కలిగివుండవచ్చు. (2 పేతురు 2:⁠5) ఇవన్నీ చేయడానికి నోవహుకు మంచి అలవాట్లు ఉండివుండవచ్చు. అంతేకాదు, “నోవహు దేవునితోకూడ నడచినవాడు. ... తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను” అని ఆయన గురించి బైబిలు చరిత్రలో వ్రాయబడింది. (ఆదికాండము 6:​9,22; 7:⁠5) ఆయన బైబిలులో “నిందారహితుడు” అని ప్రకటించబడ్డాడంటే, ఆయన జలప్రళయం తర్వాత, అలాగే బాబెలువద్ద యెహోవాకు విరుద్ధంగా చెలరేగిన తిరుగుబాటు తర్వాత కూడా ఆయన దేవునితో నడవడం కొనసాగించివుంటాడు. నిజంగానే, నోవహు 950 సంవత్సరాల వయస్సులో చనిపోయినంత వరకు కూడా దేవునితో నడిచాడు.​—⁠ఆదికాండము 9:⁠29.

యోబుకున్న మంచి అలవాట్లు ఆయన ‘యథార్థవర్తనుడిగా న్యాయవంతుడిగా’ అయ్యేందుకు సహాయపడ్డాయి. (యోబు 1:​1,8; 2:⁠3) ఆయన తన పిల్లలు “పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని” వాళ్ళు విందు చేసుకున్న ప్రతిసారీ వారి పక్షాన ఆచారబద్ధంగా లేదా అలవాటుగా బలులు అర్పిస్తూ కుటుంబ యాజకుడిగా వ్యవహరిస్తూ వచ్చాడు. “యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.” (ఇటాలిక్కులు మావి.) (యోబు 1:⁠5) యోబు కుటుంబంలో యెహోవా ఆరాధనను కేంద్రంగా చేసుకుని వాడుకగా చేసే కార్యాలు నిస్సందేహంగా ప్రాముఖ్యమైనవిగా ఉండేవి.

దానియేలు తన జీవితమంతా యెహోవాను “అనుదినము తప్పక సేవించుచు” ముందుకు సాగాడు. (దానియేలు 6:​16,20) దానియేలుకు ఎంత మంచి అలవాట్లు ఉన్నాయి? ఒకటేమిటంటే, ఆయన యెహోవాకు క్రమంగా ప్రార్థించాడు. ఈఅలవాటుకు విరుద్ధంగా రాజాజ్ఞ బయలువెళ్ళినా ఆయన “యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, ... తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.” (ఇటాలిక్కులు మావి.) (దానియేలు 6:​10-11) దేవునికి ప్రార్థించే అలవాటును ఆయన త్యజించలేకపోయాడు, ఆకారణంగా ప్రాణానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నా ఆయన మానలేకపోయాడు. దేవునిపట్ల అనితరమైన యథార్థతను కలిగివుండే జీవిత విధానంలో దానియేలును ఈఅలవాటు బలపరచిందనడంలో సందేహం లేదు. దానియేలు పులకరింపజేసే దేవుని వాగ్దానాలను అధ్యయనం చేస్తూ వాటిని ధ్యానిస్తూ ఉండేవాడని తెలుస్తుంది. (యిర్మీయా 25:​11,12; దానియేలు 9:⁠2) ఈమంచి అలవాట్లు ఆయన జీవిత పరుగు పందెంలో అంతము వరకు సహిస్తూ, నమ్మకంగా పరుగెట్టేందుకు సహాయపడ్డాయని నిశ్చయంగా చెప్పవచ్చు.

ఇందుకు భిన్నంగా ఒక చెడ్డ అలవాటు మూలంగా దీనా చాలా విషాదకర పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆమె యెహోవా ఆరాధకులు కాని “ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళేది.” (ఆదికాండము 34:​1, NW) నిరపాయకరమైనదిగా కనిపించిన ఈఅలవాటు నాశనానికి దారితీసింది. మొదటిగా, ఆమెను షెకెము అనే యౌవనస్థుడు మానభంగం చేశాడు, అతడు “తన తండ్రి యింటి వారందరిలో ఘనుడు.” ఆతర్వాత, ఆమె ఇద్దరు సహోదరులు ప్రతీకార భావంతో ఒక పట్టణంలోని పురుషులందర్నీ ఊచకోతకోశారు. ఎంత ఘోరమైన పరిణామమది!​—⁠ఆదికాండము 34:​19, 25-29.

మన అలవాట్లు మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయని, హానికలుగజేయవని మనం ఎలా నిశ్చయత కలిగివుండగలము?

మంచి అలవాట్లను పెంపొందించుకోవడం

“అలవాట్లు మన విధిని లిఖిస్తాయి” అని ఒక తత్త్వవేత్త వ్రాశాడు. కానీ అవి అలా ఉండనవసరం లేదు. మనం చెడు అలవాట్లను మార్చుకొని మంచి అలవాట్లను అలవరచుకోవాలన్న నిర్ణయం తీసుకోగలమని బైబిలు స్పష్టంగా చూపిస్తోంది.

మంచి అలవాట్లు ఉన్నప్పుడు క్రైస్తవ జీవన విధానం మరింత ఫలవంతమైనదిగాను సులభంగాను మారుతుంది. గ్రీసులోని అలెక్స్‌ అనే క్రైస్తవుడు ఇలా చెబుతున్నాడు: “వివిధ పనులు చేయడానికి వేసుకున్న సమయ పట్టిక ప్రకారం పనులు చేసే అలవాటు నాకు విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది.” థియోఫిలస్‌ అనే ఒక క్రైస్తవ పెద్ద ప్రణాళిక వేసుకునే అలవాటు తాను మరింత ప్రభావవంతంగా ఉండేందుకు సహాయం చేస్తుందని చెబుతున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “మంచి ప్రణాళిక వేసుకొనే అలవాటు లేకపోతే నా క్రైస్తవ కర్తవ్యాలను నిర్వర్తించలేనని గ్రహించాను.”

క్రైస్తవులుగా మనం “ఇప్పటివరకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము” అని ఉద్బోధించబడ్డాము. (ఇటాలిక్కులు మావి.) (ఫిలిప్పీయులు 3:​16) ఇప్పటివరకు లభించిన వాటినిబట్టి నడుచుకోవడమంటే, ఇప్పటికే పాటిస్తున్న ఏదైనా పద్ధతిని అలవాటుగా కొనసాగించడం అని కూడా అర్థం. అలాంటి మంచి అలవాట్లు మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి, ఎందుకంటే మనం వేయాల్సిన ప్రతి అడుగును గురించి ఆలోచించడానికి సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉండదు, మనం అప్పటికే ఒక మంచి పద్ధతిని అలవరచుకొని ఉంటాము. అలవాటు ప్రభావంతో ఆపద్ధతినే అనుసరిస్తుంటాము. మనకు ఏదైనా బాగా అలవాటైన తర్వాత మనకు తెలియకుండానే మనమలా చేస్తుంటాము. సురక్షితమైన రీతిలో వాహనాలు నడిపే అలవాటు, ఒక డ్రైవరుకు రోడ్డుమీద ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఎలాగైతే లిప్తపాటులో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందో, అదే విధంగా మంచి అలవాట్లు మనం మన క్రైస్తవ మార్గంలో నడుస్తుండగా యుక్తమైన నిర్ణయాలను వేగంగా తీసుకునేందుకు సహాయపడగలవు.

జెరిమీ టెయిలర్‌ అనే ఆంగ్ల రచయిత చెబుతున్నట్లుగా “అలవాట్లు క్రియల కుమార్తెలు.” మన అలవాట్లు మంచివైతే మనం మంచి కార్యాలను సునాయాసంగా నిర్వర్తించగలము. ఉదాహరణకు, క్రైస్తవ పరిచారకులుగా మనకు ప్రకటనా పనిలో క్రమంగా పాల్గొనే అలవాటు ఉంటే మనం క్షేత్ర సేవకు వెళ్ళడం మరింత సులభమవుతుంది, మరింత ఆనందించగల్గుతాము. అపొస్తలులు “ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి” అని మనం చదువుతాము. (ఇటాలిక్కులు మావి.) (అపొస్తలుల కార్యములు 5:​42; 17:⁠2) మరోవైపు చూస్తే, మనం అప్పుడప్పుడు మాత్రమే పరిచర్యలో పాల్గొంటుంటే మనలో భయం ఏర్పడుతుంది, ఈకీలకమైన క్రైస్తవ కార్యకలాపంలో సునాయాసంగా నిమగ్నమవ్వాలంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది.

మన క్రైస్తవ దినచర్యలో భాగమైన ఇతర రంగాల్లో కూడా అంతే. మంచి అలవాట్లు మనం దేవుని వాక్యాన్ని ‘నిత్యము పఠిస్తూ’ కొనసాగడానికి దోహదపడగలవు. (యెహోషువ 1:​8, క్యాతలిక్‌ అనువాదము; కీర్తన 1:⁠2) రాత్రి పడుకోబోయేముందు ఒక క్రైస్తవునికి 20,30 నిమిషాలు బైబిలు చదివే అలవాటు ఉంది. ఆయన చాలా అలసిపోయినప్పుడు కూడా, బైబిలు చదవకుండా నిద్రకు ఉపక్రమిస్తే ఆయనకు నిద్ర సరిగా పట్టదు. మళ్ళీ లేచి ఆఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకోవలసిందే. ఈమంచి అలవాటు మూలంగా ఆయన ప్రతి సంవత్సరం బైబిలును పూర్తిగా చదవగలుగుతున్నాడు, ఇలా గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతోంది.

మన మాదిరికర్త యేసుక్రీస్తుకు బైబిలు చర్చించబడే స్థలాల్లో కూటాలకు హాజరయ్యే అలవాటు ఉండేది. “తన వాడుకచొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచు[న్నాడు].” (లూకా 4:​16) పెద్ద కుటుంబం ఉన్న జో అనే ఒక క్రైస్తవ పెద్ద ఎన్నో గంటలు పనిచేస్తాడు, కానీ కూటాలకు హజరయ్యే అలవాటు, క్రమంగా హాజరు కావాల్సిన అవసరాన్ని గుర్తించడానికీ, హాజరు కావాలనే కోరిక ఆయనలో కలగడానికీ సహాయపడింది. ఆయనిలా అంటున్నాడు: “ఈ అలవాటు నేను ముందుకు కొనసాగేందుకు సహాయం చేస్తుంది, సవాళ్ళను సమస్యలను విజయవంతంగా ఎదుర్కోవడానికి నాకు ఎంతో అవసరమైన ఆధ్యాత్మిక బలాన్నిస్తుంది.”​—⁠హెబ్రీయులు 10:​24,25.

అలాంటి అలవాట్లు క్రైస్తవుని జీవపు పరుగుపందెంలో అత్యావశ్యకం. యెహోవా ప్రజలు హింసలకు గురవుతున్న దేశం నుండి వచ్చిన ఒక నివేదిక ఇలా చెబుతోంది: “మంచి ఆధ్యాత్మిక అలవాట్లూ సత్యంపట్ల ప్రగాఢమైన మెప్పుదలా ఉన్నవారికి పరీక్షలు ఎదురైనప్పుడు స్థిరంగా ఉండడం కష్టంగా లేదు. కానీ ‘అనుకూల సమయాల్లో’ కూటాలకు హాజరు కానివారు, క్షేత్ర సేవను క్రమంగా చేయకుండా చిన్న చిన్న వివాదాంశాల్లోనే రాజీపడిపోయేవారు తరచు ‘అగ్నివంటి’ పరీక్షల్లో పడిపోతుంటారు.”​—⁠2 తిమోతి 4:⁠2, క్యాతలిక్‌ అనువాదము.

చెడు అలవాట్లను నివారించుకోండి, మంచివాటిని అలవరచుకోండి

‘తనపై ఆధిపత్యం చెలాయించడానికి తాను ఇష్టపడే అలవాట్లను మాత్రమే మనిషి అలవరచుకోవాలి’ అని అంటారు. చెడు అలవాట్లు నిజంగానే మనలను అణగద్రొక్కుతూ ఆధిపత్యం చెలాయిస్తాయి. అయినప్పటికీ, వాటితో తెగదెంపులు చేసుకోవచ్చు.

స్టెల్లాకు ఒకప్పుడు టీవీ చూసే వ్యసనం ఉండేది. ఆమె ఇలా ఒప్పుకుంటోంది: “నేను లోనైన ప్రతి చెడు అలవాటు వెనుక ఒక ‘నిరపాయకరమైన’ కారణం ఉంది.” టీవీని అతిగా చూసే అలవాటు వెనుక కూడా అంతే. తాను కేవలం “కాస్త వినోదం” కోసం లేదా “కొంత మార్పు” కోసం మాత్రమే టీవీ చూద్దామని తనలో తాను అనుకునేది. కానీ ఆమె అలవాటు అదుపు తప్పింది, గంటల కొద్దీ ఆమె టీవీ ముందు కూర్చోవడం మొదలుపెట్టింది. “ఈచెడు అలవాటు వల్ల వేరే నష్టమేమీ జరగకపోయినా అది నా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని చాలా కుంటుపరచింది” అని ఆమె అంటోంది. కానీ కృత నిశ్చయంతో కృషి చేసి చివరికి తాను టీవీ చూసే సమయాన్ని తగ్గించుకుంది, ఏమి చూడాలో ముందే నిర్ధారించుకుంటుంది. “ఈ అలవాటును మానుకోవాలని నేనెందుకు కోరుకుంటున్నానో నేనెప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను, నా తీర్మానానికి అనుగుణంగా ఉండడానికి నేను యెహోవాపై ఆధారపడతాను” అని స్టెల్లా అంటోంది.

కారాలాంబూస్‌ అనే ఒక క్రైస్తవుడు తాను ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించకుండా అడ్డుకున్న ఒక చెడు అలవాటును పేర్కొన్నాడు​—⁠అదే వాయిదా వెయ్యడం. “పనులను వాయిదా వేసే అలవాటు హానికరమైనదని నేను గ్రహించినప్పుడు నా జీవితాన్ని మార్చుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టాను. లక్ష్యాలను పెట్టుకునేటప్పుడు వాటిని సాధించేందుకు నేను ఆపనులను ఎప్పుడు, ఎలా ప్రారంభించాలో ఖచ్చితంగా ప్రణాళిక వేసుకున్నాను. నా నిర్ణయాలను, ప్రణాళికలను క్రమంగా ఆచరణలో పెట్టడం నా చెడు అలవాటుకు విరుగుడుగా పని చేసింది, అదిప్పటికీ నాకు మంచి అలవాటుగా ఉంది.” నిజంగానే, చెడు అలవాట్ల స్థానంలో మంచి అలవాట్లు అలవర్చుకోవడం అత్యుత్తమం.

మన సహవాసులు కూడా మనం అలవాట్లు పెంపొందించుకునేలా చేయగలరు​—⁠అవి మంచివైనా, చెడ్డవైనా. మనకు వేరే వ్యక్తుల నుండి ఎలాగైతే చెడు అలవాట్లు అబ్బుతాయో మంచి అలవాట్లు కూడా అలాగే అబ్బుతాయి. “దుష్టసాంగత్యము మంచి నడవడిని [“అలవాట్లను,” NW] చెరుపును” అన్నట్లే మంచి సహవాసులు కూడా మనం అనుకరించగల ఆరోగ్యకరమైన అలవాట్ల మాదిరులను మనకు అందించగలరు. (1 కొరింథీయులు 15:​33) అన్నింటికన్నా ప్రాముఖ్యంగా అలవాట్లు దేవునితో మన సంబంధాన్ని బలపర్చనూ గలవు, బలహీనం చేయనూ గలవు. స్టెల్లా ఇలా అంటోంది: “మన అలవాట్లు మంచివైతే యెహోవాను సేవించడానికి మనం చేసే పోరాటాన్ని సులభతరం చేస్తాయి. అవి హానికరమైనవైతే మన ప్రయత్నాలను అడ్డగిస్తాయి.”

మంచి అలవాట్లను ఏర్పరచుకోండి, అవి మిమ్మల్ని నడిపించనివ్వండి. అవి మీజీవితంలో శక్తివంతమైన ప్రయోజనకరమైన ప్రభావం చూపగలవు.

[19వ పేజీలోని చిత్రం]

మంటలా అలవాట్లు ప్రయోజనకరమైనవిగానైనా ఉండగలవు, వినాశకరంగానైనా ఉండగలవు

[21వ పేజీలోని చిత్రాలు]

దేవుని వాక్యాన్ని చదివేందుకు సబ్బాతు రోజున సమాజమందిరములో ఉండడం యేసుకు వాడుక

[22వ పేజీలోని చిత్రాలు]

మంచి ఆధ్యాత్మిక అలవాట్లు దేవునితో మన సంబంధాన్ని బలపరుస్తాయి