కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు “మేలు కీడులను వివేచించ”గలరా?

మీరు “మేలు కీడులను వివేచించ”గలరా?

మీరు “మేలు కీడులను వివేచించ”గలరా?

“ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు ... నడుచుకొనుడి.”​—⁠ఎఫెసీయులు 5:⁠10.

1. మన జీవితం నేడు ఏ విధంగా సంక్లిష్టంగా ఉండగలదు, ఎందుకు?

“యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.” (యిర్మీయా 10:​23) యిర్మీయా గుర్తించిన ఈప్రాముఖ్యమైన వాస్తవం నేడు మనకు ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది. ఎందుకని? ఎందుకంటే బైబిలు ముందే చెప్పినట్లుగా మనం ‘అపాయకరమైన కాలములలో’ జీవిస్తున్నాము. (2 తిమోతి 3:⁠1) ప్రతి రోజు మనమెన్నో సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటాము, ఆపరిస్థితుల్లో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దవైనా చిన్నవైనా ఆనిర్ణయాలు మన శారీరక, భావోద్రేక, ఆధ్యాత్మిక సంక్షేమంపై గొప్ప ప్రభావాన్ని చూపించగలవు.

2. ఎలాంటి ఎంపికలు అల్పమైనవిగా కన్పించవచ్చు, అయినా సమర్పిత క్రైస్తవులు వాటిని ఎలా దృష్టిస్తారు?

2 మన అనుదిన జీవితంలో చేసుకునే ఎంపికల్లో చాలా మట్టుకు నిత్యమూ చేసుకునేవే ఉండవచ్చు లేక అల్పమైనవే అయివుండవచ్చు. ఉదాహరణకు, మనం ఏబట్టలు వేసుకోవాలి, ఏమి తినాలి, ఎవరెవర్ని కలవాలి, వగైరా వగైరా ఎంపికలు ప్రతి రోజు చేసుకుంటుంటాము. మనం ఈఎంపికలను దాదాపు యాంత్రికంగా, చాలా అనాలోచితంగానే చేసుకుంటాము. కానీ ఇలాంటి విషయాలు నిజంగానే అల్పమైనవా? సమర్పిత క్రైస్తవులమైన మన విషయంలో చూస్తే, మన వస్త్రధారణ, పైరూపం, అన్నపానీయాలు, మాట, నడత వంటివి మనం అత్యున్నత దేవుడైన యోహోవా సేవకులమని ఎల్లప్పుడు చూపిస్తుంటాయి కాబట్టి, మనకు ఆఎంపికలు చాలా ప్రాముఖ్యమైనవి. అపొస్తలుడైన పౌలు మాటలు మనకు గుర్తు చేయబడుతున్నాయి: “మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.”​—⁠1 కొరింథీయులు 10:​31; కొలొస్సయులు 4:⁠6; 1 తిమోతి 2:9,10.

3. ఎటువంటి ఎంపికలు నిజంగా గంభీరమైన ప్రాముఖ్యతగలవి?

3 ఇవే కాక మరింత గంభీరమైన ప్రాముఖ్యతగల ఎంపికలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు, పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయం లేక అవివాహితులుగా ఉండిపోవాలనే నిర్ణయం ఒక వ్యక్తి జీవితంలో ఎంతో పెద్ద ప్రభావాన్ని దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుందనడంలో సందేహం లేదు. పెళ్ళి చేసుకోవడానికి సరైన వ్యక్తిని, అంటే జీవితాంతం భాగస్వామిగా ఉండే వ్యక్తిని ఎంపిక చేసుకోవడం చిన్న విషయమేమీ కాదన్నది ఒప్పుకోవల్సిందే. * (సామెతలు 18:​22) ఇంకా, స్నేహితులూ సహవాసుల విషయంలోను, విద్యా ఉద్యోగాల విషయంలోను, వినోదమూ ఉల్లాసమూ కలిగించే కార్యకలాపాల విషయంలోను మనం చేసుకునే ఎంపికలు మన ఆధ్యాత్మికతపై పెద్ద ప్రభావాన్ని, నిర్ణయాత్మకమైన ప్రభావాన్ని చూపిస్తాయి​—⁠అలా మన అనంతకాల సంక్షేమంపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి.​—⁠రోమీయులు 13:​13,14; ఎఫెసీయులు 5:3,4.

4. (ఎ) ఎలాంటి సామర్థ్యం నిజంగా కోరదగినది? (బి)ఏ ప్రశ్నల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది?

4 చేసుకోవాల్సిన ఎంపికలు ఇన్ని ఉన్నాయి గనుక, మనం మేలైనదేదో కీడైనదేదో వివేచించే సామర్థ్యం లేదా కంటికి మేలైనదిగా కనిపించేదానికీ నిజంగా మేలైన దానికీ తేడాను వివేచించే సామర్థ్యం తప్పకుండా కోరదగినదే. “ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును” అని బైబిలు హెచ్చరిస్తోంది. (సామెతలు 14:​12) కాబట్టి మనమిలా అడుగుతుండవచ్చు: ‘మేలు కీడుల మధ్య తేడాను గ్రహించే సామర్థ్యాన్ని నేనెలా పెంపొందించుకోగలను? నిర్ణయాలు తీసుకోవడంలో అవసరమయ్యే నడిపింపు మనకు ఎక్కడ లభిస్తుంది? గతంలోను, ప్రస్తుతకాలంలోను ప్రజలు ఈవిషయంలో ఏమి చేశారు, ఫలితాలేమిటి?’

ఈ లోకపు “మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము”

5. తొలి క్రైస్తవులు ఎలాంటి లోకంలో జీవించారు?

5 మొదటి శతాబ్దపు క్రైస్తవులు గ్రీక్‌-రోమన్‌ విలువలు, ఆశయాలు ప్రబలంగా ఉన్న లోకంలో జీవించారు. ఒకవైపు చూస్తే, రోమన్ల జీవిత విధానంలో సుఖజీవనం భోగభాగ్యాలు ప్రాముఖ్యంగా కనబడేవి, దాన్ని చూసి అనేకమంది అసూయపడేవారు. మరో వైపు చూస్తే, ఆకాలంలోని మేధావివర్గంవారు ప్లేటో అరిస్టాటిల్‌ల తాత్త్విక తలంపులతో మాత్రమే కాక ఎపికూరీయుల స్తోయికుల కొంగ్రొత్త ఆలోచనా విధానాలతో కూడా ఉత్తేజితులౌతున్నారు. అపొస్తలుడైన పౌలు తన రెండవ మిషనరీ యాత్రపై ఏథెన్సుకు వచ్చినప్పుడు ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న తత్వజ్ఞానులు ఆయన్ను ఎదుర్కొన్నారు, తాము “ఈ వదరుబోతు”కన్నా ఉన్నతవర్గానికి చెందినవారమని వారు భావించారు.​—⁠అపొస్తలుల కార్యములు 17:⁠18.

6. (ఎ) తొలి క్రైస్తవుల్లో కొందరు ఎలాంటి శోధనలో పడిపోయారు? (బి)పౌలు ఏమని హెచ్చరించాడు?

6 కాబట్టి, తొలి క్రైస్తవుల్లో కొందరు తమ చుట్టూ ఉన్న ప్రజల ఆడంబరమైన విధానాలూ జీవితశైలిల పట్ల ఎందుకు ఆకర్షితులయ్యారో అర్థం చేసుకోవడం అంత కష్టంకాదు. (2 తిమోతి 4:​10) ఆవిధానంలో అంతర్గత భాగంగా ఉన్నవారు ఎన్నెన్నో ప్రయోజనాలను సౌకర్యాలను అనుభవిస్తున్నట్లుగా కనిపిస్తుంది, వారు చేసుకున్న ఎంపికలు యుక్తమైనవిగా కనిపిస్తున్నాయి. సమర్పిత క్రైస్తవ జీవిత విధానంలో లేని విలువైనదేదో లోకం అందిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే, అపొస్తలుడైన పౌలు ఇలా హెచ్చరించాడు: “[క్రీస్తును] అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.” (కొలొస్సయులు 2:⁠8) పౌలు అలా ఎందుకు చెప్పాడు?

7. నిజానికి ఈ లోకపు జ్ఞానం విలువ ఎంత?

7 పౌలు ఎందుకలా హెచ్చరించాడంటే, లోకం ఆకర్షణలో పడిపోయినవారి ఆలోచనా విధానంలో పెను ప్రమాదం పొంచివుందని ఆయన గ్రహించాడు. ఆయన “మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము” అన్న మాటలు ఉపయోగించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. “తత్వ జ్ఞానము” అని అనువదించబడిన గ్రీకు పదానికి అక్షరార్థంగా “జ్ఞానాన్ని ప్రేమించి, దాన్ని సముపార్జించడం” అని భావం. అది మంచిదే అయివుండవచ్చు. నిజానికి చెప్పాలంటే బైబిలు, ప్రాముఖ్యంగా సామెతల పుస్తకంలో నిజమైన పరిజ్ఞానాన్ని, నిజమైన జ్ఞానాన్ని సముపార్జించడాన్ని ప్రోత్సహిస్తోంది. (సామెతలు 1:​1-7; 3:​13-18) అయితే పౌలు ‘తత్వజ్ఞానాన్ని’ “మోసకరమైన నిరర్థక” అన్న పదాలకు జోడించాడు. వేరే మాటల్లో చెప్పాలంటే లోకం అందించే జ్ఞానం మోసకరమైనదని, నిరర్థకమైనదనీ పౌలు దృష్టించాడు. ఉబ్బిన గాలిబుడగలా అది గట్టిదిగానే కనిపిస్తుంది, కానీ లోపల గాలి తప్ప ఎలాంటి గట్టి పదార్థమూ లేదు. మేలు కీడులను ఎంపిక చేసుకునేటప్పుడు ఈలోకపు “మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము” లాంటి సారహీనమైన దాన్ని ఆధారంగా చేసుకోవడం నిశ్చయంగా వ్యర్థమే, చెప్పాలంటే పూర్తిగా నాశనకరమే.

“కీడు మేలనియు మేలు కీడనియు” చెప్పేవారు

8. (ఎ) ప్రజలు సలహాల కోసం ఎవరివైపు మరలుతున్నారు? (బి)ఎలాంటి సలహాలు లభ్యమౌతున్నాయి?

8 నేడు కూడా పరిస్థితులు అందుకు భిన్నంగా ఏమీ లేవు. మానవుడు కృషి సల్పిన దాదాపు ప్రతి రంగంలోను నిపుణులు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. వివాహ కుటుంబ సలహాదారులు, శీర్షికా రచయితలు, స్వయం-ప్రకటిత వైద్యులు, జ్యోతిష్కులు, మాంత్రికులు, మరితరులు డబ్బు తీసుకుని మరీ సలహాలివ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. కానీ ఎలాంటి సలహాలు ఇవ్వబడుతున్నాయి? తరచు నైతికత విషయంలో బైబిలు ప్రమాణాలను ప్రక్కకు నెట్టి నూతన నైతికత అని పిలువబడే దానికి స్థానం కల్పిస్తున్నారు. ఉదాహరణకు, “సమలింగ వ్యక్తుల వివాహాలను” రిజిస్టరు చేయడానికి ప్రభుత్వం నిరాకరించడం గురించి మాట్లాడుతూ, కెనడాలోని ప్రధాన వార్తాపత్రిక అయిన ద గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌లోని ఒక సంపాదకీయం ఇలా ఉద్ఘోషించింది: “ప్రేమానురాగాలు విశ్వాసనిష్ఠలు గల దంపతుల హృదయపూర్వకమైన కోరికను, కేవలం వారు ఒకే లింగవ్యక్తులు కావడం కారణంగా, తీర్చడానికి నిరాకరించడం ఈ 2000వ సంవత్సరంలో ఘోరాతి ఘోరమైన విషయం.” నేటి ధోరణి ఎలాంటి విషయంలోనైనా సరే సహనాన్ని కనబరచాలన్నదే, విమర్శనాత్మకంగా ఉండడం కాదు. ప్రతి విషయానికీ తన దృక్కోణానికి అనుగుణంగా అర్థం మార్చుకోవచ్చునని, ఖచ్చితమైన మేలు ఖచ్చితమైన కీడు అంటూ ఏమీ లేవని పరిగణిస్తున్నారు.​—⁠సామెతలు 10:​3,4.

9. సమాజంలో గౌరవనీయులని పరిగణించబడేవారు తరచు ఏమి చేస్తుంటారు?

9 ఇతరులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంఘంలోను, ఆర్థికంగాను విజయవంతులైనవారిని, సిరిసంపదలు పేరుప్రతిష్ఠలు సంపాదించినవారిని తమ ఆదర్శవ్యక్తులుగా చేసుకుంటారు. ఆధనవంతులు ప్రఖ్యాతిగాంచినవారు నేటి సమాజంలో గౌరవనీయులుగా పరిగణించబడినా వారు సాధారణంగా నిజాయితీ, నమ్మకం వంటి సద్గుణాల గురించి ధారాళంగా మాట్లాడతారు గానీ వాటిని పాటించరు. అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు లాభాన్ని ఆర్జించేందుకు అనేకమంది వక్రమార్గాలను అన్వేషించడానికీ, నైతిక సూత్రాలను గాలికొదలడానికీ ఏమాత్రం సందేహించరు. ఖ్యాతినార్జించడానికి ప్రజాదరణను పొందడానికి కొందరు సుస్థాపితమైన విలువలను ప్రమాణాలను నిరభ్యంతరంగా విసర్జించి, వికారమైన విభ్రాంతికరమైన ప్రవర్తనకు ఒడిగడతారు. లాభార్జనే ధ్యేయంగా ఉండి సమస్తాన్నీ అనుమతించే సమాజమే వీటన్నిటి ఫలితం; “ఏం చేసినా ఫర్వాలేదు” అనేదే ఆసమాజపు నినాదం. మరి ప్రజలు మేలు కీడుల విషయంలో దిక్కుతోచని పరిస్థితిలో గలిబిలికి లోనై ఉండడంలో ఆశ్చర్యమేముంది?—⁠లూకా 6:⁠39.

10. మేలు కీడుల విషయంలో యెషయా చెప్పిన మాటలు ఎలా నెరవేరాయి?

10 తప్పుడు నడిపింపు ఆధారంగా తీసుకున్న అజ్ఞానపూరితమైన నిర్ణయాల విషాదకర ఫలితాలు మన చుట్టూ కోకొల్లలు​—⁠విచ్ఛిన్నమైన వివాహాలు, కల్లోలభరిత కుటుంబాలు, మాదకద్రవ్యాలకు మత్తుపానీయాలకు బానిసలైనవారు, హింసాత్మకంగా ప్రవర్తించే యువకుల గ్యాంగులు, లైంగిక విచ్చలవిడితనం, లైంగికంగా సంక్రమించే వ్యాధులు, మచ్చుకివి కొన్ని మాత్రమే. నిజంగా చూస్తే, ప్రజలు మేలు కీడుల సంబంధంగా ప్రమాణాలన్నింటినీ విడనాడి నిర్దేశక సూత్రాలన్నింటినీ ఉపేక్షించినప్పుడు పరిస్థితులు ఇంతకన్నా మెరుగ్గా ఎలా ఉంటాయి? (రోమీయులు 1:​28-32) పరిస్థితి ఖచ్చితంగా ప్రవక్తయైన యెషయా ప్రకటించినట్లుగానే ఉంది: “కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొనువారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొనువారికి శ్రమ.”​—⁠యెషయా 5:20,21.

11. మేలు కీడులను నిర్ధారించేటప్పుడు ఒక వ్యక్తి తనపై తాను ఆధారపడడం ఎందుకు యుక్తం కాదు?

11 “తమ దృష్టికి తాము జ్ఞానులని” ఎంచుకున్న ప్రాచీన యూదులను దేవుడు లెక్క ఒప్పజెప్పమని అడిగాడన్న వాస్తవం, మేలు కీడులను నిర్ధారించే విషయంలో మనపై మనం ఆధారపడకుండా ఉండడం ఎంత ప్రాముఖ్యమో నొక్కిచెబుతున్నాయి. “మీ మనసు చెప్పేది వినండి, చాలు” అనే మాటకు లేదా, “మీకు సరియైనదని అనిపించినదే చేయండి” అనే మాటలతో నేడు చాలామంది ప్రజలు సమ్మతిస్తారు. అలాంటి వైఖరి యుక్తమైనదేనా? బైబిలు ప్రకారమైతే కాదు, అది స్పష్టంగా ఇలా చెబుతోంది: “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?” (యిర్మీయా 17:⁠9) మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని నడిపించడానికి మోసకరమైన వ్యక్తిపైనా మానసిక వ్యాధిగల వ్యక్తిపైనా ఆధారపడతారా? ఎంతమాత్రమూ లేదు. నిజానికి మీరు అలాంటి వ్యక్తి చెప్పేదానికి బహుశ పూర్తి వ్యతిరేకంగా చేస్తారేమో. అందుకనే బైబిలు మనకిలా గుర్తుచేస్తుంది: “తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును.”​—⁠సామెతలు 3:​5-7; 28:⁠26.

దేవునికి ఆమోదకరమైనదాన్ని నేర్చుకుందాం

12. “దేవుని చిత్తమేదో” మనం పరీక్షించి తెలుసుకోవలసిన అవసరం ఎందుకుంది?

12 మనం మేలు కీడుల విషయంలో అటు లోకపు జ్ఞానంపైనా ఇటు మనపైనా ఆధారపడకూడదు కాబట్టి, మనమిప్పుడేం చేయాలి? అపొస్తలుడైన పౌలు ఇచ్చిన విస్పష్టమైన ఈసలహాను గమనించండి: “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” (రోమీయులు 12:⁠2) దేవుని చిత్తమేదో మనం పరీక్షించి తెలుసుకోవలసిన అవసరం ఎందుకుంది? బైబిలులో యెహోవా ఖచ్చితమైన, శక్తిమంతమైన కారణాన్ని ఇస్తున్నాడు: “ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో, మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.” (యెషయా 55:⁠9) కాబట్టి, మన స్వంత వివేచనపై లేదా మనకు సంతృప్తికరమనిపించే వ్యక్తిగత భావాలపై ఆధారపడక ఇలా చేయాలని ఉద్బోధించబడ్డాము: “ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు [ఉండండి].”​—⁠ఎఫెసీయులు 5:⁠10.

13. యోహాను 17:3 లో వ్రాయబడివున్న యేసు మాటలు దేవునికి ఏది ఆమోదకరమో తెలుసుకోవాల్సిన అవసరాన్ని ఎలా నొక్కిచెబుతున్నాయి?

13 యేసుక్రీస్తు ఈఅవసరాన్ని నొక్కి చెబుతూ ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:⁠3) “ఎరుగుట” అని అనువదించబడిన మూల గ్రీకు పదానికి చాలా లోతైన భావం ఉంది. వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ప్రకారం ఆపదం, “ఎరుకవున్న వ్యక్తికీ తాను ఎరిగిన వ్యక్తికీ మధ్యగల ఒక సంబంధాన్ని సూచిస్తుంది; ఇక్కడ, ఎరుకవున్న వ్యక్తికి తానెరిగిన వ్యక్తి చాలా విలువైనవాడు లేక ప్రాముఖ్యమైనవాడు, అందుకని వాళ్ళ మధ్య స్థాపించబడిన ఆసంబంధం కూడా విలువైనదే ప్రాముఖ్యమైనదే.” ఎవరితోనైనా మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడమంటే ఆవ్యక్తి ఎవరు లేక ఆయన పేరేమిటి అన్నది తెలుసుకోవడం మాత్రమే కాదు. అందులో ఆయన ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం, ఆయన విలువలేమిటో తెలుసుకోవడం, ఆయన ప్రమాణాలను తెలుసుకోవడం, వాటిని గౌరవించడం ఇమిడివున్నాయి.​—⁠1 యోహాను 2:⁠3; 4:⁠8.

మన జ్ఞానేంద్రియాలకు శిక్షణనిద్దాం

14. ఆధ్యాత్మిక శిశువులకు పరిణతిచెందిన ప్రజలకు మధ్యగల ముఖ్యమైన తేడా ఏమిటని పౌలు చెప్పాడు?

14 మరైతే, మనం మేలు కీడులను వివేచించే సామర్థ్యాన్ని ఎలా పెంపొందించుకోగలం? మొదటి శతాబ్దపు హీబ్రూ క్రైస్తవులకు పౌలు వ్రాసిన మాటలు ఆప్రశ్నకు జవాబిస్తున్నాయి. ఆయనిలా వ్రాశాడు: “పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు శిక్షణనివ్వబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.” ఇక్కడ పౌలు, “దేవోక్తులలో మొదటి మూలపాఠముల”ని ముందటి వచనంలో తాను వర్ణించిన ‘పాలను,’ “మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన [“శిక్షణనివ్వబడిన,” NW] జ్ఞానేంద్రియములు” కలిగివున్న “పరిణతిచెందిన ప్రజల”కు తగినదైన “బలమైన ఆహారము”తో పోల్చి తేడాను చూపిస్తున్నాడు.​—⁠హెబ్రీయులు 5:​12-14, NW.

15. దేవుని గూర్చిన ఖచ్చితమైన పరిజ్ఞానాన్ని పొందడానికి యథాశక్తి కృషిచేయాల్సిన అవసరం ఎందుకు ఉంది?

15 అంటే, మొట్టమొదటిగా మనం దేవుని ప్రమాణాలేమిటో ఆయన వాక్యంలో ఉన్నట్లుగా ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి గట్టి కృషి చేయాలని దానర్థం. ఇక్కడ మనం ఏమి చేయవచ్చో ఏమి చేయకూడదో చెప్పే, “ఇలా చేయండి” “ఇలా చేయవద్దు” అని చెప్పే నియమాల పట్టిక కోసం మనం వెదకడం లేదు. బైబిలు అలాంటి పుస్తకం కాదు. బదులుగా, పౌలు ఇలా వివరించాడు: “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.” (2 తిమోతి 3:​16,17) మనమా ఉపదేశం నుండి, ఖండన నుండి, క్రమశిక్షణ నుండి ప్రయోజనం పొందాలంటే మన మనస్సుకీ ఆలోచనా సామర్థ్యానికీ పనికల్పించాలి. ఇందుకు యథాశక్తి కృషిచేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఫలితంగా మనం ‘సన్నద్ధులమై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడివుంటాము.’ అది కృషికి తగ్గ ఫలితమే.​—⁠సామెతలు 2:3-6.

16. జ్ఞానేంద్రియాలకు శిక్షణనివ్వడం అంటే అర్థం ఏమిటి?

16 పౌలు సూచించినట్లుగా, పరిణతిచెందిన ప్రజలు “మేలు కీడులను వివేచించుటకు శిక్షణనివ్వబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు” కూడా. సరిగ్గా ఇక్కడే మనం అసలు విషయానికి వస్తున్నాము. ‘జ్ఞానేంద్రియములకు శిక్షణనివ్వడం’ అంటే అక్షరార్థంగా ‘(జిమ్నాస్టిక్స్‌ చేసే వ్యక్తి పొందేలాంటి) శిక్షణను మన ఇంద్రియాలకు ఇవ్వడమని’ అర్థం. (కింగ్‌డమ్‌ ఇంటర్లీనియర్‌ ట్రాన్స్‌లేషన్‌) అనుభవజ్ఞుడైన జిమ్నాస్ట్‌ రింగులపైన లేదా హారిజాంటల్‌ బార్స్‌పైన (ఒకే ఎత్తులో సమాంతరంగా ఉన్న రెండు కడ్డీలు) మెరుపు వేగంతో, నిజానికి భూమ్యాకర్షణశక్తిని మరితర ప్రకృతి నియమాలను ధిక్కరిస్తున్నట్లు అనిపించే, వైవిధ్యంగల వ్యాయామాలను చేస్తాడు. ఆయనకు తన శరీర అవయవాలపై ప్రతి క్షణం పూర్తి నియంత్రణ ఉంటుంది, తన ప్రదర్శనను పూర్తి చేయగలిగేలా తానెలాంటి కదలికలను చేయాలో తనకు సహజసిద్ధ జ్ఞానం ఉన్నట్లుగా ఆయనకు అప్పటికప్పుడు తెలుస్తుంది. ఇదంతా కఠినమైన శిక్షణ, నిరంతర అభ్యాసం ఫలితమే.

17. మనమే భావంలో జిమ్నాస్ట్‌లలా ఉండాలి?

17 మనం తీసుకునే నిర్ణయాలు, చేసుకునే ఎంపికలు ఎల్లప్పుడు యుక్తమైనవిగా ఉండాలంటే మనం కూడా ఆధ్యాత్మిక భావంలో చెప్పాలంటే జిమ్నాస్ట్‌లా శిక్షణ పొందాలి. మనం అనుక్షణం మన జ్ఞానేంద్రియాలపైనా మన శరీర అవయవాలపైనా పూర్తి పట్టును కలిగివుండాలి. (మత్తయి 5:​29,30; కొలొస్సయులు 3:​5-10) ఉదాహరణకు, ఏవైనా లైంగికంగా అనైతికమైన విషయాలను చూడకుండా మీకళ్ళకూ, లేదా ద్వందార్థాల పాటలనూ సంభాషణనూ వినకుండా మీచెవులకూ మీరు క్రమశిక్షణను ఇస్తారా? అలాంటి అనారోగ్యకరమైన విషయాలు మన చుట్టూ ఉన్నాయన్నది నిజమే. అయితే, అవి మన హృదయంలోను మనస్సులోను వేళ్ళూనేలా చేసుకుంటామా లేదా అన్నది మన ఎంపికపైనే ఆధారపడివుంది. మనం ఇలా చెప్పిన కీర్తనకర్తను అనుకరించవచ్చు: “నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్యములు; అవి నాకు అంటనియ్యను. ... అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు.”​—⁠కీర్తన 101:3,7.

అభ్యాసముచేత జ్ఞానేంద్రియాలకు శిక్షణనివ్వండి

18. ఒకరి జ్ఞానేంద్రియాలకు శిక్షణనివ్వడం గురించి పౌలు ఇచ్చిన వివరణలో “అభ్యాసముచేత” అన్న మాట దేన్ని సూచిస్తోంది?

18 మనం మేలు కీడులను వివేచించేలా మన జ్ఞానేంద్రియాలకు శిక్షణనివ్వగలిగేది “అభ్యాసముచేత”నే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మరో మాటలో చెప్పాలంటే, మనం నిర్ణయం తీసుకోవల్సిన ప్రతీసారి, ఏ బైబిలు సూత్రాలు ఇమిడివున్నాయో, వాటిని ఎలా అన్వయించుకోవచ్చో వివేచించడానికి మన జ్ఞానేంద్రియాలను ఉపయోగించడం నేర్చుకోవాలి. ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా అందించబడుతున్న బైబిలు ప్రచురణలను పరిశోధించడం అలవాటుగా చేసుకోండి. (మత్తయి 24:​45) మనం పరిణతి చెందిన క్రైస్తవుల సహాయాన్ని కూడా అర్థించవచ్చు. అయినా, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి మనం వ్యక్తిగతంగా కృషి చేయడం, అలాగే నడిపింపునూ ఆత్మనూ ఇవ్వమని యెహోవాకు ప్రార్థించడం చివరికి మనకు విస్తారమైన ప్రతిఫలాలను ఇస్తాయి.​—⁠ఎఫెసీయులు 3:​14-19.

19. మన జ్ఞానేంద్రియాలకు క్రమేణ శిక్షణనిస్తూ ఉండగా మనం ఎలాంటి ఆశీర్వాదాలను అనుభవించగలము?

19 మనం మన జ్ఞానేంద్రియాలకు క్రమేణ శిక్షణనిస్తూ ఉండగా, “మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లు” ఉండకూడదన్నదే మన లక్ష్యమై ఉండాలి. (ఎఫెసీయులు 4:​14) దేవునికి ఏది ఆమోదకరమన్న విషయాన్ని గురించిన జ్ఞానము, గ్రహింపుల ఆధారంగా మనం చిన్నవైనా పెద్దవైనా జ్ఞానయుక్తమైన నిర్ణయాలను తీసుకోగలము. ఫలితంగా అవి మనకు ప్రయోజనకరంగాను, మన తోటి ఆరాధకులకు క్షేమాభివృద్ధికరంగాను, అన్నింటికీ మించి మన పరలోక తండ్రికి ప్రీతికరంగాను ఉంటాయి. (సామెతలు 27:​11) అపాయకరమైన ఈకాలాల్లో ఇవి ఎంతటి ఆశీర్వాదాలను, ఎంతటి కాపుదలను ఇస్తాయి!

[అధస్సూచి]

^ పేరా 3 ప్రజల జీవితాల్లో అత్యంత ఒత్తిడిని కలుగజేసే 40 అనుభవాలను థామస్‌ హోమ్స్‌, రిచర్డ్‌ రే అనే వైద్యులు కూర్చారు, వాటిలో మొదటి మూడు స్థానాలను భార్య/భర్త వియోగం, విడాకులు, భార్య/భర్త నుండి వేరుపడడం ఆక్రమించాయి. పెండ్లి చేసుకోవడం ఏడవ స్థానంలో ఉంది.

మీరు వివరించగలరా?

• యుక్తమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఎలాంటి సామర్థ్యం అవసరం?

• మేలు కీడులను నిర్ణయించుకునేటప్పుడు మనం ప్రసిద్ధ వ్యక్తులవైపు చూడడం లేదా మన స్వంత భావాలపై ఆధారపడడం ఎందుకు జ్ఞానయుక్తం కాదు?

• నిర్ణయాలను తీసుకునేటప్పుడు దేవునికి ఆమోదకరమైనదేమిటో ఎందుకు, ఎలా నిశ్చయపరచుకోవాలి?

• మన ‘జ్ఞానేంద్రియాలకు శిక్షణనివ్వడం’ అంటే ఏమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

[9వ పేజీలోని చిత్రం]

నడిపింపు కోసం సిరిసంపదలు పేరుప్రతిష్ఠలు సంపాదించినవారి వైపు చూడడం వ్యర్థం

[10వ పేజీలోని చిత్రం]

ఒక జిమ్నాస్ట్‌లా మనం అనుక్షణం మన జ్ఞానేంద్రియాలపైనా మన శరీర అవయవాలపైనా పూర్తి పట్టును కలిగివుండాలి