కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ అభివృద్ధికి అడ్డువచ్చే ఆటంకాలను అధిగమించండి!

మీ అభివృద్ధికి అడ్డువచ్చే ఆటంకాలను అధిగమించండి!

మీ అభివృద్ధికి అడ్డువచ్చేఆటంకాలను అధిగమించండి!

మీ కారు గేరులో ఉంది, ఇంజను ఆన్‌లోనే ఉంది, కానీ ఒక్క అడుగు ముందుకు వెళ్ళడం లేదు. మెకానికల్‌ ప్రాబ్లమా? సమస్య అది కాదు, ఒక పెద్ద రాయి ఒక చక్రానికి అడ్డంగా ఉంది. కారు ముందుకు వెళ్ళాలంటే ఆరాయిని తీస్తే సరిపోతుంది.

అదే విధంగా, యెహోవాసాక్షులతో బైబిలును అధ్యయనం చేస్తున్న కొందరికి వారి ఆధ్యాత్మిక అభివృద్ధిని నిరోధించే కొన్ని ఆటంకాలున్నాయి. ఉదాహరణకు ‘ఐహికవిచారము, ధనమోసము’ వంటివి సత్య ‘వాక్యాన్ని అణచివేసి’ అది ఎదగకుండా ఆపగలవని యేసు హెచ్చరించాడు.​—⁠మత్తయి 13:⁠22.

మరి కొందరి విషయంలో వారి వ్యక్తిత్వంలో లోతుగా పాతుకుపోయిన అలవాట్లు లేదా బలహీనతలు వారి అభివృద్ధిని ఆటంకపరచగలవు. యూటాకా అనే జపనీయుడు బైబిలు సందేశాన్ని ఇష్టపడ్డాడు, అయితే ఆయనకు జూదం పెద్ద వ్యసనంగా ఉంది. ఈదురలవాటును జయించడానికి ఆయన చాలాసార్లు ప్రయత్నించాడు కానీ సఫలుడు కాలేదు. ఈవ్యసనం వల్ల ఆయనకు గొప్ప నష్టాలు వచ్చాయి, మూడిళ్ళను పోగొట్టుకున్నాడు, కుటుంబ సభ్యుల దృష్టిలో గౌరవాన్ని కోల్పోయాడు, చివరికి సమాజంలో కూడా గౌరవాన్ని కోల్పోయాడు. ఆయన ఈఆటంకాన్ని తొలగించుకొని క్రైస్తవుడు కాగలడా?

కేకో అనే స్త్రీ విషయమే తీసుకోండి. బైబిలు సహాయంతో ఆమె విగ్రహారాధన, అనైతికత, జోస్యం చెప్పడం వంటి దుష్కార్యాలను వదిలించుకుంది. అయితే కేకో ఇలా ఒప్పుకుంటోంది: “నాకున్న అతి పెద్ద ఆటంకం పొగతాగడమే. మానేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ మానలేకపోయాను.”

కదల్చడమే అసాధ్యంగా ఉన్నట్లు అనిపించే ఒక అడ్డంకి మీఅభివృద్ధి మార్గంలో కూడా ఉండవచ్చు. అదేమైనప్పటికీ దేవుని సహాయంతో మీరు దాన్ని అధిగమించగలరని నిశ్చయత కలిగివుండండి.

యేసు శిష్యులు చాంద్ర రోగంతో బాధపడుతున్న వ్యక్తి నుండి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినప్పుడు వారికాయన ఇచ్చిన ఉపదేశాన్ని గుర్తు తెచ్చుకోండి. వారు చేయలేకపోయినదాన్ని యేసు చేసిన తర్వాత వారితో ఇలా అన్నాడు: “మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి​—⁠ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును; మీకు అసాధ్యమైనది ఏదియు నుండ[దు].” (మత్తయి 17:​14-20; మార్కు 9:​17-29) అవును, మన ముందు మేరు పర్వతంలా ఉన్నట్లు కనిపించే సమస్య, సర్వశక్తిమంతుడైన మన సృష్టికర్తకు చీమలాంటిది, స్వల్పమైనది.​—⁠ఆదికాండము 18:​14; మార్కు 10:⁠27.

అభివృద్ధికి ఆటంకాలను గుర్తించండి

మీరు ఆటంకాలను అధిగమించడానికి ముందు అసలా ఆటంకాలేమిటో గుర్తించాలి. ఎలా గుర్తించవచ్చు? కొన్నిసార్లు సంఘంలోని ఒక సభ్యుడు, బహుశ ఒక పెద్ద గానీ మీతో బైబిలును అధ్యయనం చేస్తున్న వ్యక్తి గానీ ఏదైనా విషయాన్ని మీదృష్టికి తీసుకు వస్తుండవచ్చు. అలాంటి ప్రేమపూర్వకమైన సలహాను విని కోపం తెచ్చుకోకండి, “ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి.” (సామెతలు 8:​33) మరి కొన్నిసార్లు మీరు బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు మీ బలహీనతల గురించి మీకు తెలిసిపోతుంది. అవును, దేవుని వాక్యము “సజీవమై బలముగలదై” ఉంది. (హెబ్రీయులు 4:​12) బైబిలును, బైబిలు ఆధారిత ప్రచురణలను చదవడం మీ అంతరాంతరాల్లో ఉన్న ఆలోచనలను, భావాలను, ఉద్దేశాలను బయటపెట్టగలదు. అత్యున్నతమైన యెహోవా ప్రమాణాలను బట్టి చూస్తే మీరు ఎక్కడున్నారో చూసుకోవడానికి మీకు అది సహాయం చేస్తుంది. అది మీ ఆధ్యాత్మిక అభివృద్ధిని ఆటంకపరచే విషయాలను వెల్లడిచేసి మీరు వాటిని గుర్తించేలా చేస్తుంది.​—⁠యాకోబు 1:​23-25.

ఉదాహరణకు, ఒక బైబిలు విద్యార్థికి లైంగికపరంగా అనైతికమైన ఊహాలోకాల్లో తేలిపోయే అలవాటు ఉందనుకోండి. అలా చేయడంలో హాని ఏమీ లేదని ఆయన అనుకోవచ్చు, తాను నిజానికి ఎలాంటి తప్పూ చేయడం లేదు కదాని ఆయన తర్కించుకుంటుండవచ్చు. అధ్యయనం చేస్తుండగా యాకోబు 1:​14,15 లోని మాటలు ఆయనకు ఎదురుపడతాయి: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.” అప్పుడు ఆయన తను నడుస్తున్న మార్గం తన అభివృద్ధిని ఎంతగా పాడుచేయగలదో గ్రహిస్తాడు! ఆయనీ ఆటంకాన్ని ఎలా అధిగమించగలడు?​—⁠మార్కు 7:21-23.

ఆటంకాలను అధిగమించండి

పరిణతి చెందిన క్రైస్తవుని సహాయంతో ఆవిద్యార్థి వాచ్‌ టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ ఉపయోగిస్తూ దేవుని వాక్యంలో కొంత అదనపు పరిశోధన చేయవచ్చు. * ఉదాహరణకు, “ఆలోచనలు” అన్న శీర్షిక, లైంగికపరంగా అనైతికమైన ఊహాలోకాల్లో తేలిపోవడమనే హానికరమైన అలవాటును అధిగమించడం గురించి చర్చించే అనేక ప్రచురిత ఆర్టికల్‌ల దగ్గరికి పాఠకుడ్ని తీసుకువెళ్తుంది. ఈఆర్టికల్‌లు ఫిలిప్పీయులు 4:8 వంటి సహాయకరమైన బైబిలు వచనాలను వివరిస్తాయి, ఆవచనంలో ఇలా ఉంది: “మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటిమీద ధ్యానముంచుకొనుడి.” అవును, లైంగికపరంగా అనైతికమైన ఆలోచనల స్థానంలో పవిత్రమైన, క్షేమాభివృద్ధికరమైన ఆలోచనలను భర్తీచేయాలి!

తన పరిశోధనలో విద్యార్థి తన సమస్య తీవ్రతరం కాకుండా జాగ్రత్తపడేందుకు సహాయం చేసే బైబిలు సూత్రాలను తప్పకుండా కనుగొంటాడు. ఉదాహరణకు, సామెతలు 6:​27, మత్తయి 5:⁠28 ఒక వ్యక్తి తన మనస్సును లైంగికంగా ఉద్రేకపరచే వాటితో నింపుకోకూడదని హెచ్చరిస్తున్నాయి. “వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము” అని ప్రార్థించాడు కీర్తనకర్త. (కీర్తన 119:​37) నిజమే, ఈబైబిలు వచనాలను చదవడం మాత్రం సరిపోదు. “నీతిమంతుని హృదయం ... ధ్యానిస్తుంది” అని జ్ఞాని చెబుతున్నాడు. (సామెతలు 15:​28, NW) యెహోవా ఏమి ఆజ్ఞాపిస్తున్నాడన్నది మాత్రమే కాక ఆయన ఎందుకు అలా ఆజ్ఞాపిస్తున్నాడో కూడా తలపోయడం ద్వారా విద్యార్థి యెహోవా మార్గాలు ఎంత జ్ఞానయుక్తమైనవో ఎంత సహేతుకమైనవో మరింత లోతుగా అవగాహన చేసుకుంటాడు.

చివరిగా, తన అభివృద్ధి మార్గంలో ఉన్న ఈఆటంకాన్ని అధిగమించడానికి కృషి చేస్తున్న వ్యక్తి యెహోవా సహాయం కోసం నిస్సందేహంగా అర్థించాలి. ఎలాగూ, మనం నిర్మించబడిన రీతిని గురించి దేవునికి బాగా తెలుసు, మనం అపరిపూర్ణులమని, మంటివారమని బాగా తెలుసు. (కీర్తన 103:​14) సహాయం కోసం దేవునికి నిరంతరం ప్రార్థించడం, అలాగే లైంగికపరంగా అనైతికమైన ఊహల్లోకి వెళ్ళకుండా ఉండేందుకు తీవ్రంగా శ్రమించడం చివరికి ఎంతో మంచి ఫలితాన్ని తీసుకువస్తుంది​—⁠మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది, కుదుటపడుతుంది.​—⁠హెబ్రీయులు 9:⁠14.

పట్టు విడువకండి

మీరెటువంటి సమస్యతో పోరాడుతున్నప్పటికీ కొన్నిసార్లు మళ్ళీ దానికే లొంగిపోయే అవకాశం ఉందని గ్రహించండి. అలా జరిగినప్పుడు నిరాశా నిస్పృహలకు గురికావడం సహజమే. అయితే, గలతీయులు 6:9 లోని మాటలను గుర్తుంచుకోండి: “మనము మేలుచేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము.” దావీదు, పేతురు వంటి దైవభక్తిగల సేవకులు కొన్ని అవమానకరమైన వైఫల్యాలను చవిచూశారు. కానీ వారు పట్టు విడువలేదు. వారు నమ్రతగా ఉపదేశాన్ని స్వీకరించి, అవసరమైన మార్పులు చేసుకొని దేవునికి విశిష్టమైన సేవకులుగా రుజువు చేసుకుంటూ కొనసాగారు. (సామెతలు 24:​16) దావీదు తప్పులు చేసినప్పటికీ యెహోవా ఆయనను గురించి చెబుతూ, “నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని” అన్నాడు. (అపొస్తలుల కార్యములు 13:​22) పేతురు అదే విధంగా తన తప్పులను అధిగమించి క్రైస్తవ సంఘంలో ఒక స్తంభంగా తయారయ్యాడు.

నేడు చాలామంది అదే విధంగా ఆటంకాలను అధిగమించడంలో విజయం సాధించారు. ముందు చెప్పిన యూటాకాకు బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించినప్పుడు ఆయన అందుకు ఒప్పుకున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “నేను అభివృద్ధి వైపు వేసిన ఒక్కొక్క అడుగులో యెహోవా మద్దతు ఆయన ఆశీర్వాదాలు నేను జూదమనే వ్యసనాన్ని అధిగమించేందుకు నాకు సహాయం చేశాయి. విశ్వాసంతో ‘కొండలనే’ కదిలించడం సాధ్యమన్న యేసు మాటల్లోని వాస్తవాన్ని వ్యక్తిగతంగా చవిచూడగలిగినందుకు నాకెంతో ఆనందంగా ఉంది.” కొంతకాలానికి యూటాకా సంఘంలో పరిచర్య సేవకుడయ్యాడు.

పొగతాగే వ్యసనం ఉన్న కేకో సంగతేమిటి? ఆమెతో అధ్యయనం చేస్తున్న సహోదరి, పొగతాగే వ్యసనంపై చర్చిస్తున్న అనేక తేజరిల్లు! ఆర్టికల్‌లను చదవమని సూచించింది. తాను యెహోవా దృష్టిలో పరిశుభ్రంగా ఉండాలన్న విషయాన్ని ప్రతి రోజు తనకు గుర్తు చేయడానికి కేకో 1 కొరింథీయులు 7:1వ వచనంలోని మాటలను తన కారులో వ్రాసి పెట్టుకుంది. అయినా పొగతాగడం మానలేకపోయింది. “నామీద నాకే చికాకు కలిగింది” అని కేకో గుర్తు చేసుకుంటోంది. “అందుకనే నేను నిజంగా ఏమి కోరుకుంటున్నానని నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. నేను యెహోవాను సేవించాలని కోరుకుంటున్నానా లేక సాతానునా?” తాను యెహోవాను సేవించాలని కోరుకుంటుందని ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత ఇక సహాయం కోసం తీవ్రంగా ప్రార్థించింది. ఆమె ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది: “ఆశ్చర్యకరంగా, ఎక్కువ బాధలు పడకుండానే నేను పొగతాగడం మానేయగలిగాను. ఇంకా ముందే ఎందుకు చర్య తీసుకోలేదా అని మాత్రమే నేను బాధపడతాను.”

మీరు కూడా మీఅభివృద్ధికి అడ్డుపడుతున్న ఆటంకాలను అధిగమించడంలో విజయాన్ని సాధించగలరు. మీతలంపులను, కోరికలను, మాటలను, చర్యలను బైబిలు ప్రమాణాలకు ఎంత పొందిక కలిగివుండేలా మలచుకుంటారో ఆత్మగౌరవాన్ని, నమ్మకాన్ని అంతగా మీరు మళ్ళీ పొందుతారు. మీఆధ్యాత్మిమిక సహోదర సహోదరీలు, అలాగే మీకుటుంబ సభ్యులు మీతో సహవసించేటప్పుడు నూతన ఉత్తేజాన్ని ప్రోత్సాహాన్ని పొందుతారు. అన్నింటికన్నా ముఖ్యంగా, యెహోవా దేవునితో మీకుగల సంబంధాన్ని ప్రగాఢంగా చేసుకుంటారు. సాతాను పట్టు నుండి దూరంగా పారిపోతుండగా ‘అడ్డు చేయుదానిని తన జనుల మార్గములోనుండి తీసివేస్తానని’ ఆయన వాగ్దానం చేశాడు. (యెషయా 57:​14) మీఆధ్యాత్మిక అభివృద్ధికి ఉన్న ఆటంకాలను తీసివేసుకోవడానికీ వాటిని అధిగమించడానికీ మీరు కృషిచేసినట్లైతే యెహోవా ఆశీర్వాదాలు మీపై సమృద్ధిగా ఉంటాయని మీరు నిశ్చయతను కలిగివుండగలరు.

[అధస్సూచి]

^ పేరా 12 అనేక భాషల్లో యెహోవాసాక్షులచే ప్రచురించబడింది.

[28వ పేజీలోని చిత్రం]

విశ్వాసంతో కొండల్లాంటి ఆటంకాలను కూడా అధిగమించవచ్చని యేసు వాగ్దానం చేశాడు

[30వ పేజీలోని చిత్రం]

ఆధ్యాత్మిక లోపాలను అధిగమించడానికి చేసే కృషిలో బైబిలు పఠనం మనకు సహాయం చేయగలదు