మీ అభివృద్ధి తేటగా కనబడనివ్వండి
మీ అభివృద్ధి తేటగా కనబడనివ్వండి
“నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.”—1 తిమోతి 4:15.
1. తినబోయే పండు బాగా మాగిందో లేదో మీరెలా చెప్పగలరు?
ఏదైనా మీకిష్టమైన పండును ఊహించుకోండి—జామపండు, బొప్పాయిపండు, మామిడిపండు, లేదా మరింకేదైనా కావచ్చు. అది బాగా మాగిందో లేదో, ఇప్పుడే తినవచ్చో లేదో మీరు చెప్పగలరా? అందులో సందేహం ఎందుకు? దాని వాసన, రంగు, మెత్తదనం మీకు చెప్పకనే చెబుతాయి నోరూరించే కమ్మదనాన్ని ఆస్వాదించబోతున్నారని జిహ్వను తృప్తిపరచే అనుభవాన్ని పొందబోతున్నారని. ఒక్కసారి కొరకగానే ఆహా, ఏమి రుచి! ఎంత కమ్మగా ఉంది! ఎంత తియ్యగా ఉంది! అన్న మాటలు మీనోట్లో నుండి బయటికి వస్తాయి. అది మీకెంతో ఆనందాన్ని సంతృప్తినీ ఇస్తుంది.
2. పరిణతి ఎలా తేటగా ప్రదర్శించబడుతుంది, వ్యక్తుల మధ్య సంబంధాలపై అదెలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది?
2 అతి సామాన్యమైన, అయితే ఆహ్లాదభరితమైన ఈఅనుభవం జీవితంలోని ఇతర రంగాలకు కూడా వర్తిస్తుంది. ఉదాహరణగా, బాగా మాగిన పండు కనబడ్డట్లే ఒక వ్యక్తిలోని ఆధ్యాత్మిక పరిణతి కూడా అనేక విధాల్లో తేటగా కనబడుతుంది. వివేచన, అంతర్దృష్టి, జ్ఞానం వంటివాటిని బట్టి ఒక వ్యక్తిలోని పరిణతిని మనం గుర్తిస్తాము. (యోబు 32:7-9) తమ వైఖరుల ద్వారా, చర్యల ద్వారా అలాంటి లక్షణాలను ప్రదర్శించే వారితో సహవసించడం, వారితో పనిచేయడం నిజంగా ఎంతో ఆహ్లాదకరమైన అనుభవం.—సామెతలు 13:20.
3. యేసు తన కాలంలోని ప్రజలను గురించి ఇచ్చిన వివరణలో, పరిణతి గురించి ఏమి వెల్లడవుతుంది?
3 మరోవైపు చూస్తే, ఒక వ్యక్తి శారీరకంగా ఎదిగి ఉండవచ్చును, కానీ ఆయన భావోద్రేకంగా ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేదని ఆయన మాట తీరు ప్రవర్తించే విధానము వెల్లడిస్తుండవచ్చు. ఉదాహరణకు, తన కాలంలోని దారితప్పిన తరం గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ఇలా అన్నాడు: “యోహాను తినకయు త్రాగకయువచ్చెను గనుక—వీడు దయ్యముపట్టినవాడని వారనుచున్నారు. మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక—ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు [అని] వారనుచున్నారు.” మత్తయి 11:16-19.
ఆతరంవారు శారీరకంగా పరిణతికి ఎదిగిన వారైనా, వారు ‘పిల్లకాయల్లా’ ప్రవర్తించారని, ఏమాత్రం పరిణతికి ఎదగలేదని యేసు చెప్పాడు. అందుకనే, చివరికి ఆయనిలా అన్నాడు: “అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందు[ను].”—4. అభివృద్ధి, పరిణతి ఏయే విధాలుగా ప్రదర్శించబడతాయి?
4 యేసు మాటల నుండి మనం, ఒక వ్యక్తి దగ్గర నిజమైన జ్ఞానము—పరిణతికి స్పష్టమైన ఒక చిహ్నం—ఉన్నదో లేదో ఆయన చేసే పనులను బట్టి, అవి తీసుకువచ్చే ఫలితాలను బట్టి చెప్పవచ్చని గ్రహిస్తాము. దీని సంబంధంగానే అపొస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చిన సలహాను పరిశీలించండి. తిమోతి చేయాల్సిన పనులను పేర్కొన్న తర్వాత పౌలు ఇలా అన్నాడు: “నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.” (1 తిమోతి 4:15) అవును, ఒక క్రైస్తవుడు పరిణతివైపు అభివృద్ధి చెందడం ‘తేటగా కనబడుతుంది,’ లేదా స్పష్టంగా అర్థమవుతుంది. క్రైస్తవ పరిణతి అనేది అంతర్గతమైన లేదా మరుగున ఉండే లక్షణం కాదు, అది ప్రకాశవంతమైన దీపంలాంటిది. (మత్తయి 5:14-16) కాబట్టి అభివృద్ధిని, పరిణతిని తేటగా ప్రదర్శించే రెండు ప్రధానమైన విధానాలను మనం పరిశీలిద్దాం: (1)పరిజ్ఞానము, అవగాహన, జ్ఞానములలో ఎదగడము; (2)ఆత్మ ఫలాలను ప్రదర్శించడం.
విశ్వాస, జ్ఞానములలో ఏకత్వం
5. పరిణతిని ఎలా నిర్వచించవచ్చు?
5 చాలా నిఘంటువులు పరిణతిని, పూర్తిగా అభివృద్ధిచెందిన, ఎదిగిన స్థితి అనీ, చివరిస్థాయికి చేరుకోవడం లేదా కావాల్సిన ప్రమాణాన్ని చేరుకోవడం అనీ వర్ణిస్తాయి. ముందు చెప్పినట్లుగా, ఒక పండు పక్వానికి ఎదిగే సహజ చక్రాన్ని పూర్తి చేసినప్పుడు, దాని రూపు, రంగు, వాసన, రుచి చేరుకోవలసిన స్థాయికి చేరుకుంటాయి. కాబట్టి, పరిణతి అనేది శ్రేష్ఠత్వానికి, సంపూర్ణతకు, చివరికి పరిపూర్ణతకు కూడా సమానార్థకమైన పదంగా ఉంది.—యెషయా 18:5; మత్తయి 5:45-48; యాకోబు 1:4.
6, 7. (ఎ) తన ఆరాధకులందరూ ఆధ్యాత్మిక పరిణతికి అభివృద్ధి చెందాలని యెహోవా దేవుడు ప్రగాఢంగా ఆశిస్తున్నాడని ఏమి రుజువుచేస్తుంది? (బి)ఆధ్యాత్మిక పరిణతి దేనితో సన్నిహిత సంబంధం కలిగివుంది?
6 తన ఆరాధకులందరూ ఆధ్యాత్మిక పరిణతికి అభివృద్ధి చెందాలని యెహోవా దేవుడు ప్రగాఢంగా ఆశిస్తున్నాడు. దాన్ని సాధించడానికి గాను, ఆయన క్రైస్తవ సంఘంలోనే అద్భుతమైన ఏర్పాట్లను చేశాడు. ఎఫెసులోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మనమందరము విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది, సంపూర్ణ పురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండ[కుందము].”—ఎఫెసీయులు 4:11-14.
7 దేవుడు సంఘంలో అంత సమృద్ధియైన ఆధ్యాత్మిక ఏర్పాట్లను చేయడానికిగల కారణాలను పౌలు ఆవచనాల్లో వివరించాడు. అందరూ ‘విశ్వాసవిషయములోను జ్ఞానవిషయములోను ఏకత్వముపొందాలి,’ ‘సంపూర్ణపురుషులుగా అవ్వాలి,’ ‘క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత’ కలిగివుండాలి. అప్పుడు మాత్రమే మనం
తప్పుడు తలంపులచేత, తప్పుడు బోధలచేత ఆధ్యాత్మిక పసిపిల్లల్లా ఎగురగొట్టబడడం నుండి కాపాడబడతాము. తత్ఫలితంగా, క్రైస్తవ పరిణతికి అభివృద్ధి చెందడానికీ, “విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వము” పొందడానికీ మధ్యగల సన్నిహిత సంబంధాన్ని మనం చూడగలుగుతాము. పౌలు ఇచ్చిన సలహాలో మనం పాటించాల్సిన ఎన్నో విషయాలున్నాయి.8. విశ్వాసవిషయములోను జ్ఞానమువిషయములోను “ఏకత్వము” పొందడానికి ఏమి అవసరం?
8 మొట్టమొదటిగా, “ఏకత్వము” కొనసాగాలి గనుక, పరిణతి చెందిన క్రైస్తవుడు విశ్వాసము జ్ఞానములకు సంబంధించినంత వరకు తన తోటి విశ్వాసులతో ఐక్యంగా సంపూర్ణ సామరస్యంతో ఉండాలి. బైబిలు అవగాహన విషయంలో ఆయన వ్యక్తిగత అభిప్రాయాలను ప్రచురం చేయడు లేదా వాటిని నెగ్గించుకోవడానికి పంతం పట్టడు లేక స్వంత తలంపులను కలిగివుండడు. బదులుగా ఆయన, యెహోవా దేవునిచే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ద్వారా క్రమేణ వెల్లడిపరచబడే సత్యాలపై సంపూర్ణ నమ్మకాన్ని కలిగివుంటాడు. క్రైస్తవ ప్రచురణలు, కూటాలు, అసెంబ్లీలు, సమావేశాల ద్వారా “తగినవేళ” అందించబడే ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రమంగా భుజిస్తూ, మనం తోటి క్రైస్తవులతో విశ్వాస విషయములోను జ్ఞానము విషయములోను “ఏకత్వమును” కొనసాగిస్తున్నామని నిశ్చయతను కలిగివుండగలము.—మత్తయి 24:45.
9. పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖలో ‘విశ్వాసము’ అన్న పదాన్ని ఏ భావంలో ఉపయోగించాడో వివరించండి.
9 రెండవదిగా, ‘విశ్వాసము’ అనే మాట, ప్రతి క్రైస్తవుడు కలిగివుండే వ్యక్తిగత నిశ్చయతను సూచించడంలేదు, బదులుగా మన సంపూర్ణ నమ్మకాలను సూచిస్తుంది, ఆనమ్మకాల “వెడల్పు పొడుగు లోతు ఎత్తు”ను సూచిస్తుంది. (ఎఫెసీయులు 3:15-18; 4:5; కొలొస్సయులు 1:23; 2:7) నిజానికి చూస్తే, ఒక క్రైస్తవుడు ఆ‘విశ్వాసములోని’ కొంత భాగాన్ని మాత్రమే నమ్మినట్లైతే లేక, స్వీకరించినట్లైతే ఆయన తన తోటి విశ్వాసులతో ఏకత్వమును ఎలా కలిగివుంటాడు? అంటే, మనం కేవలం బైబిలులోని ప్రాథమిక బోధలను తెలుసుకోవడంతోనే లేదా సత్యాన్ని గురించి అస్పష్టమైన అవగాహనతోనే తృప్తి చెందకూడదని దాని భావం. బదులుగా, మనం యెహోవా తన సంస్థ ద్వారా చేసిన ఏర్పాట్లన్నింటి నుండి ప్రయోజనం పొందడానికి, ఆయన వాక్యంలో లోతుగా త్రవ్వడానికి ప్రగాఢమైన ఆసక్తిని కలిగివుండాలి. మనం దేవుని చిత్తాన్ని గురించి సంకల్పాలను గురించి సాధ్యమైనంతగా ఖచ్చితమైన సంపూర్ణమైన అవగాహనను పొందడానికి కృషిచేయాలి. ఇందులో భాగంగా, మనం బైబిలును బైబిలు ఆధారిత ప్రచురణలను చదవడానికీ అధ్యయనం చేయడానికీ, సహాయం కోసం నడిపింపు కోసం దేవునికి ప్రార్థించడానికీ, క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరుకావడానికీ, రాజ్య ప్రకటనా పనిలోను, శిష్యులను చేసే పనిలోను పూర్తిగా భాగం వహించడానికీ సమయాన్ని వెచ్చించాలి.—సామెతలు 2:1-5.
10. ఎఫెసీయులు 4:11,12 వచనాల్లో ఉపయోగించబడిన “మనమందరము” అన్న మాటకు అర్థమేమిటి?
10 మూడవదిగా, పౌలు త్రికోణ లక్ష్యాన్ని గురించిన వివరణలో “మనమందరము” అన్న మాటను ఉపయోగించాడు. “మనమందరము” అనే మాటను గురించి ఒక బైబిలు రెఫరెన్సు పుస్తకం, “అందరూ ఒకరి తర్వాత ఒకరుగా, వేర్వేరుగా కాదుగానీ అందరూ సమష్టిగా” అని అర్థాన్ని చెబుతోంది. వేరే మాటల్లో చెప్పాలంటే, మనలో ప్రతి ఒక్కరం క్రైస్తవ పరిణతి అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి పూర్తి సహోదరత్వంతోపాటుగా కనీస ప్రయత్నాన్ని చేయాలి. ది ఇంటర్‌ప్రెటర్స్ బైబిల్ ఇలా వ్యాఖ్యానిస్తోంది: “శరీరమంతా ఆరోగ్యకరమైన రీతిలో ఎదుగుతున్నప్పుడు తప్ప ఎలాగైతే ఒక అవయవం తానుగా పరిణతికి ఎదగలేదో అలానే ఆధ్యాత్మిక లక్ష్యం అనేది ఒక వ్యక్తి ఏకాంతంగా ఉండి సాధించాల్సినది కాదు.” విశ్వాసాన్ని గురించిన పూర్తి అర్థాన్ని మనస్సుతో గ్రహించడానికి కృషి చేయాల్సినది “సమస్త పరిశుద్ధులతోకూడ” అని పౌలు ఎఫెసులోని క్రైస్తవులకు గుర్తుచేశాడు.—ఎఫెసీయులు 3:15-18.
11. (ఎ) ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడం దేన్ని సూచించడం లేదు? (బి)అభివృద్ధి చెందాలంటే మనం ఏమి చేయాలి?
11 ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం అంటే కేవలం మన మెదడులో గొప్ప పరిజ్ఞానాన్ని నింపుకోవడమో, అతి విద్యను గడించడమో కాదని పౌలు మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పరిణతి చెందిన క్రైస్తవుడంటే తన ప్రజ్ఞాపాటవాల ప్రదర్శనతో ఇతరులను దిగ్భ్రమపరిచే వ్యక్తి కాదు. బదులుగా, బైబిలు ఇలా చెబుతోంది: “పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.” (సామెతలు 4:18) అవును, ‘అంతకంతకు తేజరిల్లేది’ వ్యక్తి కాదు, “మార్గము.” యెహోవా తన ప్రజలకు అందిస్తున్న తన వాక్యపు అవగాహన అంతకంతకు తేజరిల్లుతూ ఉండగా, మనం ఆఅవగాహనకు అనుగుణంగా కొనసాగడానికి నిరంతరం శ్రమిస్తేనే మనం ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తున్నట్లు అర్థం. ఈసందర్భంలో అనుగుణంగా కొనసాగడమంటే అడుగులు ముందుకు వేయడం అని అర్థం, అలా మనందరమూ తప్పకుండా చేయగలము.—కీర్తన 97:11; 119:105.
‘ఆత్మ ఫలాన్ని’ ప్రదర్శించండి
12. ఆధ్యాత్మిక అభివృద్ధికై శ్రమించడంలో మనం ఆత్మ ఫలాలను ప్రదర్శించడం ఎందుకు ప్రాముఖ్యం?
12 ‘విశ్వాసవిషయములోను జ్ఞానవిషయములోను ఏకత్వము’ పొందడం ప్రాముఖ్యమే అయినప్పటికీ, మన జీవితంలోని ప్రతి కోణంలోను దేవుని ఆత్మ ఫలాలను ప్రదర్శించడం కూడా అంతే ప్రాముఖ్యము. ఎందుకని? ఎందుకంటే, మనం ముందే గమనించినట్లుగా, పరిణతి అనేది అంతర్గతమైనదో లేదా మరుగున ఉండేదో కాదు, ప్రస్ఫుటంగా కనిపించే గుణాలు దానికి గుర్తింపు చిహ్నాలు, ఆగుణాలు ఇతరులకు ప్రయోజనాన్నీ ప్రోత్సాహాన్నీ అందించగలవు. కానీ ఒక్క మాట. ఆధ్యాత్మిక అభివృద్ధికై శ్రమించడం అంటే కేవలం మంచీ మర్యాదలూ నేర్చుకోవడానికి పాటుపడడం మాత్రమే కాదు. బదులుగా, మనం దేవుని ఆత్మ నడిపింపును అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా ఎదుగుతుండగా మన వైఖరుల్లోను మన చర్యల్లోను ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. “నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు” అన్నాడు అపొస్తలుడైన పౌలు.—గలతీయులు 5:16.
13. అభివృద్ధికి ఏ మార్పు స్పష్టమైన సూచనగా ఉంది?
13 తర్వాత పౌలు, “శరీరకార్యముల” పట్టికను పేర్కొన్నాడు, అవి అసంఖ్యాకం, అవి “స్పష్టమైయున్నవి.” ఒక వ్యక్తి దేవుని ఆవశ్యకతల మూల్యాన్ని అర్థం చేసుకోవడానికి ముందు, ఆయన జీవితం బహుశ పౌలు పేర్కొన్న “జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైన” వాటితో నిండివుండి, ఆయన ఈలోకరీతిని అనుసరించి నడుచుకుంటూ ఉండవచ్చు. (గలతీయులు 5:19-21) కానీ ఆవ్యక్తి ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించేకొలది క్రమేణా అవాంఛితమైన ఈ“శరీరకార్యముల”పై పట్టును సాధిస్తాడు, తర్వాత వాటి స్థానే ‘ఆత్మ ఫలమును’ పెంపొందించుకుంటాడు. బయటికి కనిపించే ఈమార్పు ఒక వ్యక్తి క్రైస్తవ పరిణతికి వృద్ధిచెందుతున్నాడన్న దానికి ఒక స్పష్టమైన సూచన.—గలతీయులు 5:22.
14. “శరీరకార్యములు” ‘ఆత్మ ఫలము’ అనే రెండు మాటలను వివరించండి.
14 “శరీరకార్యములు” ‘ఆత్మ ఫలము’ అనే రెండు మాటలను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక్కడ “కార్యములు” అనేవి ఒక వ్యక్తి తీసుకునే చర్యల ఫలితాలై ఉన్నాయి. వేరే మాటల్లో చెప్పాలంటే, పౌలు శరీర కార్యములు అని పేర్కొన్న చిట్టాలోని విషయాలు, ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసుకున్న ఎంపికల లేదా ఆతని అపరిపూర్ణ స్వభావం మూలంగా తీసుకున్న చర్యల ఫలితాలై ఉన్నాయి. (రోమీయులు 1:24; 28; 7:21-25) మరోవైపు, ‘ఆత్మ ఫలము’ అనే మాట, అక్కడ పేర్కొనబడిన లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం కోసం లేదా వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడం కోసం చేసిన కృషికి లభించిన ఫలితాలు కాదు గానీ ఒక వ్యక్తిపైన దేవుని ఆత్మ పనిచేయడం మూలంగా ఏర్పడిన ఫలితాలేనని సూచిస్తుంది. ఒక చెట్టును జాగ్రత్తగా పెంచినప్పుడు అది ఫలాలను ఉత్పన్నం చేసినట్లే, ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ ధారాళంగా ప్రవహించినప్పుడు ఆయన ఆత్మ ఫలాలను ప్రదర్శిస్తాడు.—కీర్తన 1:1-3.
15. ‘ఆత్మ ఫలములోని’ అన్ని ఫలాలకూ అవధానం ఇవ్వడం ఎందుకు ప్రాముఖ్యం?
15 పౌలు ఉపయోగించిన ‘ఫలము’ అనే పదం తాను పేర్కొన్న అభిలషణీయమైన లక్షణాలన్నింటినీ ఇముడ్చుకునే రీతిని కూడా మనం పరిశీలించాలి. ఆత్మ మనకిష్టమైన ఫలాలను ఎంపిక చేసుకునేలా వేర్వేరు ఫలాలను ఉత్పన్నం చేయదు. పౌలు పేర్కొన్న లక్షణాలన్నీ—ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము—ప్రాముఖ్యమే, అవన్నీ కలిసి నూతన క్రైస్తవ వ్యక్తిత్వాన్ని సాధ్యం చేస్తాయి. (ఎఫెసీయులు 4:24; కొలొస్సయులు 3:9,10) కాబట్టి, మన వ్యక్తిత్వం మూలంగా, అభిరుచుల మూలంగా ఈలక్షణాల్లో కొన్ని మాత్రమే మన జీవితాల్లో మరింత స్పష్టంగా కనిపిస్తున్నట్లు మనకు అనిపిస్తే, పౌలు పేర్కొన్న అన్ని ఫలాలకూ అవధానం ఇవ్వడం చాలా ప్రాముఖ్యం. అలా చేయడం ద్వారా మనం మన జీవితంలో క్రీస్తు లాంటి వ్యక్తిత్వాన్ని మరింత ఎక్కువగా ప్రతిబింబించగలుగుతాము.—1 పేతురు 2:12,21.
16. క్రైస్తవ పరిణతికి ఎదగడానికి మనం చేసే కృషికి లక్ష్యం ఏమిటి, దాన్ని ఎలా సాధించవచ్చు?
16 పౌలు చేసిన చర్చ నుండి మనం నేర్చుకోగల ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏమిటంటే, క్రైస్తవ పరిణతికి ఎదగడానికి మనం చేసే కృషికి లక్ష్యం, గొప్ప పరిజ్ఞానాన్ని, అతి విద్యను సంపాదించడమో, లేదా మంచీ మర్యాదలూ నేర్చుకోవడమో కాదు. లక్ష్యం ఏమిటంటే, మన జీవితాల్లో దేవుని ఆత్మ ధారాళంగా ప్రవహించేలా చేసుకోవడమే. మన ఆలోచనలు, చర్యలు దేవుని ఆత్మ నడిపింపుకు ఎంత మేరకు స్పందిస్తాయో అంత మేరకు మనం ఆధ్యాత్మికంగా పరిణతికి ఎదుగుతాము. ఈలక్ష్యాన్ని ఎలా సాధించగలం? మన మనస్సునూ హృదయాన్నీ దేవుని పరిశుద్ధాత్మ ప్రభావానికి లోబరచుకోవాలి. అందుకు మనం క్రైస్తవ కూటాలకు నమ్మకంగా హాజరవుతూ వాటిలో పాల్గొనడం అవసరం. అలాగే మనం దేవుని వాక్యాన్ని అనుదినము అధ్యయనం చేస్తూ దానిపై ధ్యానించాలి, అందులోని సూత్రాలు మనం ఇతరులతో ప్రవర్తించే తీరును, మనం చేసుకునే ఎంపికలను, తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయనివ్వాలి. అప్పుడు నిశ్చయంగా మన అభివృద్ధి తేటగా కనబడుతుంది.
దేవుని మహిమ కోసం అభివృద్ధి సాధించండి
17. అభివృద్ధిని సాధించడానికి, మన పరలోక తండ్రిని మహిమపరచడానికి ఏమి సంబంధం ఉంది?
17 చివరిగా, మన అభివృద్ధి తేటగా కనిపించేలా చేయడం ద్వారా, మహిమ స్తుతి మనకు కాదు గాని, మన పరలోక తండ్రియైన యెహోవాకు కలుగుతాయి. మనం ఆధ్యాత్మిక పరిణతి పొందగలిగేలా చేసేది ఆయనే. యేసు తాను హత్య చేయబడడానికి ముందు రాత్రి శిష్యులకు ఇలా చెప్పాడు: “మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు.” (యోహాను 15:8) ఆశిష్యులు, ఆత్మ ఫలాలను ఫలించడం ద్వారా, అలాగే తమ పరిచర్యలో రాజ్య ఫలాలను ఉత్పన్నం చేయడం ద్వారా యెహోవాకు మహిమను తీసుకువచ్చారు.—అపొస్తలుల కార్యములు 11:4,18; 13:48.
18. (ఎ) నేడు ఏ ఆనందకరమైన కోతపని కొనసాగుతోంది? (బి)ఈకోతపని ఎలాంటి సవాలును ముందుంచుతుంది?
18 నేడు యెహోవా ప్రజలు భూవ్యాప్త ఆధ్యాత్మిక కోత పనిలో ముందుకు సాగుతుండగా ఆయన ఆశీర్వాదాలు తన ప్రజలపై ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దాదాపు 3,00,000 మంది క్రొత్తవారు తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకుని తమ సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచిస్తున్నారు. ఇది మనకు సంతోషాన్ని కలిగిస్తుంది, యెహోవా హృదయాన్ని కూడా సంతోషపరుస్తుందనడంలో సందేహం లేదు. (సామెతలు 27:11) అయితే ఇది ఇలాగే యెహోవాకు ఆనందాన్నీ స్తుతినీ తీసుకురావాలంటే, ఆక్రొత్త వారందరూ “[క్రీస్తు] యందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, ... విశ్వాసమందు స్థిరపరచబడుచు, ... ఆయనయందుండి నడుచు[కోవాలి].” (కొలొస్సయులు 2:6,7) ఇది దేవుని ప్రజలకు రెండు కోణాల సవాలును ముందుంచుతుంది. ఒక వైపు, మీరు క్రొత్తగా బాప్తిస్మం పొందినవారైతే, మీ“అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము” కృషిచేసే సవాలును స్వీకరిస్తారా? మరోవైపు, మీరు సత్యంలో చాలా కాలంగా ఉంటున్నట్లైతే క్రొత్తవారి ఆధ్యాత్మిక సంక్షేమం కోసం పాటుపడే బాధ్యతను సవాలుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? రెండు విధాలుగాను, పరిణతికి ఎదగాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.—ఫిలిప్పీయులు 3:16; హెబ్రీయులు 6:1.
19. మీరు మీఅభివృద్ధి తేటగా కనబడేలా చేస్తే ఎలాంటి ఆధిక్యత, ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి?
19 తమ అభివృద్ధి తేటగా కనిపించేందుకు యథాశక్తి కృషి చేసే వారందరి కోసమూ అద్భుతమైన ఆశీర్వాదాలు వేచివున్నాయి. అభివృద్ధి చెందమని తిమోతిని ఉద్బోధించిన తర్వాత పౌలు పలికిన ప్రోత్సాహకరమైన మాటలను గుర్తు చేసుకోండి: “నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.” (1 తిమోతి 4:16) మీఅభివృద్ధి తేటగా కనబడేందుకు గట్టిగా కృషి చేయడం ద్వారా మీరు కూడా దేవుని నామాన్ని మహిమపరచే, ఆయన ఆశీర్వాదాలను అనుభవించే మహదవకాశాన్ని పొందుతారు.
మీరు గుర్తు తెచ్చుకోగలరా?
• ఆధ్యాత్మిక పరిణతి ఏయే మార్గాల్లో తేటగా కనబడగలదు?
• ఎలాంటి పరిజ్ఞానం, అవగాహనలు పరిణతిని ప్రతిబింబిస్తాయి?
• ‘ఆత్మ ఫలము’ యొక్క ప్రదర్శన, ఆధ్యాత్మిక అభివృద్ధిని ఎలా సూచిస్తుంది?
• మనం పరిణతికి ఎదుగుతుండగా ఎలాంటి సవాలును స్వీకరించాలి?
[అధ్యయన ప్రశ్నలు]
[13వ పేజీలోని చిత్రం]
పండినదీ పక్వానికి వచ్చినదీ స్పష్టంగా కనబడుతుంది
[15వ పేజీలోని చిత్రం]
వెల్లడిపరచబడిన సత్యానికి అనుగుణంగా అడుగులు ముందుకు వేయడం ద్వారా మనం ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తాము
[17వ పేజీలోని చిత్రం]
‘ఆత్మ ఫలాన్ని’ ఫలించడానికి మనకు ప్రార్థన సహాయం చేస్తుంది