కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ నమ్మకాలకు ఆధారం ఏమిటి?

మీ నమ్మకాలకు ఆధారం ఏమిటి?

మీ నమ్మకాలకు ఆధారం ఏమిటి?

ఏదైనా విషయాన్ని నమ్మడం అంటే అది వాస్తవమని, నిజమని ఒప్పుకుంటూ దాన్ని స్వీకరించడం అని అర్థం. ప్రతి వ్యక్తి యొక్క “ఆలోచన, మనస్సాక్షి, మత స్వాతంత్ర్యాలు” కాపాడబడాలని ఐక్యరాజ్య సమితి యొక్క మానవ హక్కుల విశ్వ ప్రకటన పేర్కొంటుంది. కావాలనుకుంటే “ఒక వ్యక్తి తన మతాన్ని లేదా నమ్మకాలను మార్చుకునే” స్వాతంత్ర్యం కూడా ఈహక్కులో చేరివుంది.

అయితే, మతాన్ని లేదా నమ్మకాలను మార్చుకోవాలని ఎవరైనా ఎందుకు కోరుకుంటారు? “నా నమ్మకాలు నావి, ఈవిషయంలో నేను సంతృప్తిగానే ఉన్నాను” అన్నది సాధారణంగా వినిపించే మాట. తప్పుడు నమ్మకాలు కూడా ఇతరులకు ఏమాత్రం హానిని కలిగించవని చాలామంది భావిస్తారు. ఉదాహరణకు, భూమి బల్లపరుపుగా ఉందని ఒక వ్యక్తి నమ్మితే ఆయన తనకు తాను గాని లేదా వేరెవరికి గాని హాని తలపెట్టే అవకాశం లేదు. “ఎవరి అభిప్రాయాలు వారివి ఇందులో వాదించడానికేముంది?” అంటారు కొందరు. కానీ అన్ని సందర్భాల్లోను ఇది జ్ఞానయుక్తమైన వాదనేనా? మార్చురీలో శవాలను ముట్టుకుని చేతులు శుభ్రం చేసుకోకుండా తిన్నగా ఆసుపత్రి వార్డులో ఉన్న రోగులను పరీక్షించడానికి వెళ్ళడంలో తప్పేమీ లేదని ఒక వైద్యుడు నమ్ముతూ పనిచేస్తే, మరో వైద్యుడు ఎవరి నమ్మకాలు వారివిలే అనుకుంటూ తన దారిన తాను పోతాడా?

మతం విషయానికి వస్తే తప్పుడు నమ్మకాలు చరిత్రలో ఎంతో పెద్ద హానిని కలిగించాయి. మధ్య యుగాల్లోని పవిత్ర క్రూసేడ్లని పిలువబడిన యుద్ధాల్లో, “క్రైస్తవ ఔత్సాహికులు నిర్దయతో కూడిన హింసాత్మక చర్యలకు పాల్పడేలా” మతనాయకులు “వారిని పురికొల్పినప్పుడు” పరిణమించిన దమనకాండలను గురించి ఆలోచించండి. లేక ఆధునిక కాలంలో, ఇటీవల జరిగిన ఒక అంతర్యుద్ధంలో “తమ ఖడ్గాల పిడులపై సెయింట్ల పేర్లను చెక్కుకున్న మధ్యయుగంలోని యోధుల్లా, తమ రైఫిళ్ళకు కన్యక మరియ చిత్రాలను అంటించుకున్న” “క్రైస్తవ” ఆయుధధారులను గురించి ఆలోచించండి. ఈఔత్సాహికులందరూ తాము చేస్తున్నవి సరైనవేనని నమ్మారు. కానీ వీటిలోనూ, ఇలాంటి మరితర మతపర సంఘర్షణలు పోరాటాల్లోనూ పెద్ద పొరబాటు ఉందని స్పష్టంగా కనిపిస్తోంది.

ఇంత గలిబిలి, ఇన్ని సంఘర్షణలు ఎందుకున్నాయి? అపవాదియైన సాతాను “సర్వలోకమును మోసపుచ్చుచు” ఉన్నాడన్నదే బైబిలు ఇచ్చే సమాధానం. (ప్రకటన 12:⁠9; 2 కొరింథీయులు 4:⁠4; 11:⁠3) మతనిష్ఠగల అనేకమంది ‘నానావిధములైన సూచకక్రియలను, మహత్కార్యములను’ ప్రదర్శించే సాతానుచే మోసగించబడతారు గనుక విచారకరంగా వారు ‘నశిస్తారు’ అని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. అలాంటివారు “రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి” అనీ, అందుకనే వారు ‘అబద్ధమును నమ్మునట్లు మోసముచేయబడతారు’ అనీ పౌలు అన్నాడు. (2 థెస్సలొనీకయులు 2:​9-12) అబద్ధాన్ని నమ్మే సాధ్యతను మీరెలా తగ్గించగలరు? అసలు, మీ నమ్మకాలకు ఆధారం ఏమిటి?

పెంపకంతోపాటు నమ్మకాలూ వచ్చాయా?

బహుశ మీకుటుంబం నమ్మే విషయాలు మీకూ పెంపకంలో భాగంగా అలవడివుంటాయి. అది మంచిదే అయివుండవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించాలని దేవుడు కోరుతున్నాడు. (ద్వితీయోపదేశకాండము 6:​4-9; 11:​18-21) ఉదాహరణకు, యౌవనస్థుడైన తిమోతి తన తల్లి, అవ్వ చెప్పేవి వినడం ద్వారా ఎంతో ప్రయోజనం పొందాడు. (2 తిమోతి 1:​3-5; 3:​14,15) తల్లిదండ్రులు నమ్మే విషయాల పట్ల గౌరవం కలిగివుండాలని లేఖనాలు ప్రోత్సహిస్తున్నాయి. (సామెతలు 1:⁠8; ఎఫెసీయులు 6:⁠1) కానీ, కేవలం మీతల్లిదండ్రులు నమ్ముతున్న కారణంగా మీరూ ఆయా నమ్మకాలను కలిగివుండాలని మీసృష్టికర్త ఉద్దేశిస్తున్నాడా? ముందటి తరాలవారి నమ్మకాలను, ఆచారాలను ఆలోచనా రహితంగా అంటిపెట్టుకోవడం నిజానికి చాలా ప్రమాదకరంగా పరిణమించగలదు.​—⁠కీర్తన 78:⁠7; ఆమోసు 2:⁠4.

యేసుక్రీస్తును కలిసిన ఒక సమరయ స్త్రీకి సమరయుల మతం పెంపకంలో భాగంగా సంక్రమించింది. (యోహాను 4:​20) తాను నమ్మాలనుకునే విషయాలను ఎంపిక చేసుకునేందుకు ఆమెకున్న స్వాతంత్ర్యాన్ని యేసు గౌరవించాడు, కానీ ఆయన ఆమెకు ఈవిషయాన్ని కూడా చెప్పాడు: “మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు.” నిజానికి ఆమె మత నమ్మకాల్లో అనేకం తప్పుడువి, ఆమె గనుక దేవుణ్ణి ఆమోదయోగ్యమైన విధంగా అంటే “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించాలంటే తన నమ్మకాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన ఆమెకు చెప్పాడు. తాను ఎంతో ప్రీతికరమైనవిగా ఎంచిన నమ్మకాలకు అంటిపెట్టుకుని ఉండడానికి బదులుగా, ఆమె, అలాగే ఆమెలాంటి ఇతరులు కూడా క్రమేణ యేసుక్రీస్తు ద్వారా వెల్లడిపరచబడిన ‘విశ్వాసమునకు లోబడాల్సి’ ఉంటుంది.​—⁠యోహాను 4:​21-24,39-41; అపొస్తలుల కార్యములు6:⁠7.

నమ్మేలా శిక్షణా?

అనేకమంది విద్యా బోధకులూ, వివిధ రంగాల్లో నిష్ణాతులైన అనేకమంది నిపుణులూ ప్రగాఢ గౌరవానికి అర్హులు. అయినా, శుద్ధ తప్పులని అటు తర్వాత తేలిన విషయాలను బోధించిన ప్రఖ్యాత విద్యాబోధకుల ఉదాహరణలు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి. ఉదాహరణకు, వైజ్ఞానిక విషయాలపై గ్రీకు తత్వవేత్త అయిన అరిస్టాటిల్‌ వ్రాసిన రెండు పుస్తకాల గురించి చరిత్రకారుడైన బెర్ట్రాండ్‌ రస్సెల్‌, “ఆధునిక విజ్ఞానశాస్త్రం వెలుగులో, ఈరెండు పుస్తకాల్లోను కనీసం ఒక్క వాక్యాన్ని కూడా అంగీకరించడానికి లేదు” అని అన్నాడు. చివరికి ఆధునిక కాలాల్లోని నిపుణులు కూడా కొన్నిసార్లు పూర్తి తప్పుడు నిర్ధారణలకు చేరుకుంటారు. బ్రిటీష్‌ శాస్త్రజ్ఞుడైన లార్డ్‌ కెల్విన్‌, “గాలికన్నా బరువైన ఎగిరే యంత్రాల తయారీ అసాధ్యం” అని 1895 లో కుండ బద్దలుకొట్టి మరీ చెప్పాడు మరి! కాబట్టి, జ్ఞానవంతుడైన వ్యక్తి, నిష్ణాతుడైన ఒక విద్యాబోధకుడు చెప్పినంత మాత్రాన ఫలాని విషయం సత్యమని గుడ్డిగా నమ్మేయడు.​—⁠కీర్తన 146:⁠3.

మత విద్య విషయానికి వచ్చినప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలే అవసరం. అపొస్తలుడైన పౌలు తన మత బోధకుల దగ్గర ఎంతో ఉన్నత విద్యనభ్యసించాడు, “[తన] పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గల వా[డై]” ఉన్నాడు. కానీ, తన పితరుల ఆచారబద్ధమైన నమ్మకాల పట్ల ఆయనకున్న అత్యంతాసక్తి నిజానికి ఆయనకు సమస్యలను తెచ్చిపెట్టింది. ఆయన “దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము” చేస్తూ ఉండేందుకు నడిపించింది. (గలతీయులు 1:​13,14; యోహాను 16:​2,3) అంతకన్నా ఘోరమేమిటంటే, పౌలు ఎంతోకాలంపాటు ‘మునికోలలకు ఎదురు తన్నుతూ’ ఉన్నాడు, అంటే ఆయన యేసుక్రీస్తును నమ్మడానికి నడిపించాల్సిన ప్రభావాలను నిరోధిస్తూ ఉన్నాడు. అందుకే ప్రత్యక్షంగా యేసే అద్భుతరీతిలో జోక్యం చేసుకుని పౌలు తన నమ్మకాలను సరిదిద్దుకునేలా ఆయనను కదిలించాల్సివచ్చింది.—⁠అపొస్తలుల కార్యములు 9:​1-6; 26:⁠14.

ప్రసార సాధనాల ప్రభావమా?

మీ నమ్మకాలపై ప్రసార సాధనాలు పెద్ద ప్రభావాన్ని చూపించి ఉండవచ్చు. ప్రసార సాధనాలకు వాక్‌ స్వాతంత్ర్యం ఉన్నదని చాలామంది తృప్తిపడుతుంటారు, దాని మూలంగానే ఉపయోగకరమైన సమాచారాన్ని వారు పొందగలుగుతున్నారు. అయితే, ప్రసార సాధనాలను తరచుగా వక్రీకరించగల శక్తివంతమైన ప్రభావాలు కొన్ని ఉన్నాయి. తరచూ మీకు అందించబడేది పక్షపాతంతో కూడిన సమాచారమే, అది మీకు తెలియకుండానే మీఆలోచనా విధానాన్ని మోసకరమైన విధంగా ప్రభావితం చేయగలదు.

దీనికి తోడు, ప్రజలను పెద్ద సంఖ్యలో ఆకర్షించడానికిగాను ప్రసార సాధనాలు సంచలనాత్మకమైన, అసాధారణమైన విషయాలకు ప్రాచుర్యం కల్పిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కేవలం కొద్ది సంవత్సరాల క్రితం చదవడానికీ వినడానికీ అభ్యంతరకరమైనవిగా ఉన్న విషయాలు నేడు అతి సాధారణమైన విషయాలుగా అయిపోయాయి. నెమ్మదిగా ప్రవర్తన విషయంలో సుస్థాపిత ప్రమాణాలు దాడికి గురై, గాలికి కొట్టుకుపోతున్నాయి. ప్రజల ఆలోచనా విధానం క్రమేణ వక్రీకరిస్తోంది. వారు “కీడు మేలనియు మేలు కీడనియు” నమ్మడం ప్రారంభించారు.​—⁠యెషయా 5:​20; 1 కొరింథీయులు 6:9,10.

నమ్మకానికి స్థిరమైన ఆధారాలను కనుగొనండి

మనుష్యుల తలంపులను, తత్త్వజ్ఞానాలను ఆధారం చేసుకోవడం ఇసుకమీద ఇల్లు కట్టుకోవడం లాంటిది. (మత్తయి 7:​26; 1 కొరింథీయులు 1:​19,20) మరైతే మీనమ్మకాలను దేనిమీద నిస్సంకోచంగా ఆధారం చేసుకోగలరు? మీచుట్టూ ఉన్న లోకాన్ని పరిశోధిస్తూ, ఆధ్యాత్మిక విషయాలను గురించి ప్రశ్నలను వేసే మేధస్సును దేవుడే మీకిచ్చాడు గనుక, మీప్రశ్నలకు ఖచ్చితమైన జవాబులను కూడా ఆయనే అందజేస్తాడన్న విషయం తర్కబద్ధంగా లేదా? (1 యోహాను 5:​20) అవును, ఆయన తప్పకుండా ఇస్తాడు! మరైతే మీరు ఆరాధనకు సంబంధించి వాస్తవమైనవి, నిజమైనవి ఏమిటో ఎలా నిర్ధారించగలరు? దేవుని వాక్యమైన బైబిలు మాత్రమే అందుకు ఆధారాన్నిస్తోందని నిస్సంకోచంగా చెప్పవచ్చు.​—⁠యోహాను 17:​17; 2 తిమోతి 3:16,17.

“కానీ ఒక్క నిమిషం ఆగండి. బైబిలు ఉన్నవాళ్ళే కదా ఈలోక వ్యవహారాల్లో ఘోరమైన సంఘర్షణలను, గలిబిలిని సృష్టించింది?” అని ఎవరైనా అనవచ్చు. నిజమే, బైబిలును అనుసరిస్తున్నామని చెప్పుకునే మత నాయకులు ఎంతో గలిబిలితో కూడిన, పరస్పర విరుద్ధమైన తలంపులను ప్రతిపాదించారు. దానికి కారణం వారు వాస్తవానికి తమ నమ్మకాలకు బైబిలును ఆధారం చేసుకోకపోవడమే. అపొస్తలుడైన పేతురు వారిని, “నాశనకరమగు భిన్నాభిప్రాయములను” సృష్టించే “అబద్ధప్రవక్తలు” అని, “అబద్ధబోధకులు” అని వర్ణిస్తున్నాడు. వారి కార్యకలాపాల ఫలితంగా “సత్యమార్గము దూషింపబడును” అని పేతురు చెబుతున్నాడు. (2 పేతురు 2:​1,2) పేతురు ఇంకా ఇలా వ్రాస్తున్నాడు: “ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. ... ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.”​—⁠2 పేతురు 1:​19; కీర్తన 119:105.

బైబిలు బోధించే వాటితో మన నమ్మకాలను పోల్చిచూసుకోమని అది మనలను ప్రోత్సహిస్తోంది. (1 యోహాను 4:⁠1) అలా చేయడం మూలంగా తమ జీవితాలకు ఒక సంకల్పం చేకూరిందని, స్థిరత్వం ఏర్పడిందని ఈపత్రికను చదివే లక్షలాదిమంది సాక్ష్యం ఇవ్వగలరు. కాబట్టి ఆదర్శవంతులైన బెరయలోని వారిలా ఉండండి. ఏమి నమ్మాలో నిర్ణయించుకోవడానికి ముందు ‘ప్రతిదినము లేఖనములను పరిశోధించండి.’ (అపొస్తలుల కార్యములు 17:​11) మీరలా చేయడానికి యెహోవాసాక్షులు ఆనందంగా సహాయం చేస్తారు. నిజమే, ఏమి నమ్మాలన్నది మీనిర్ణయమే. అయితే మీనమ్మకాలు మానవ జ్ఞానంచేత, వాంఛలచేత కాక దేవుడు వెల్లడిచేసిన సత్యవాక్యంచేత రూపుదిద్దుకున్నాయని నిశ్చయపరచుకోవడం జ్ఞానయుక్తమైన పని.​—⁠1 థెస్సలొనీకయులు 2:⁠13; 5:​21.

[6వ పేజీలోని చిత్రాలు]

మీరు నిస్సంకోచంగా మీనమ్మకాలకు బైబిలును ఆధారం చేసుకోవచ్చు