కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్వచ్ఛమైన బంగారం కంటే మన్నికైనది

స్వచ్ఛమైన బంగారం కంటే మన్నికైనది

స్వచ్ఛమైన బంగారం కంటే మన్నికైనది

బంగారం అందంగా ఉండడమే కాకుండా మన్నికైనదీ కాబట్టే దాన్ని అందరూ అంతగా ఇష్టపడతారు. దాన్ని అంతగా కాంక్షించడానికి కారణం అది ప్రకాశవంతంగా ఉండడంతోపాటు కాలప్రభావం లేనట్లుగా ఎప్పుడూ ధగ ధగా మెరవడమే. దానికి కారణం ఏమిటంటే, బంగారం నీరు, ఆమ్లజని, గంధకంలతోపాటు దాదాపు అన్నింటినీ తట్టుకొని మనగలుగుతుంది. సముద్రాల్లో మునిగిపోయిన నౌకల్లోను, ఇతర ప్రాంతాల్లోను కనుగొనబడిన అనేక బంగారు వస్తువులు వందల సంవత్సరాల తర్వాత కూడా ప్రకాశవంతంగా ఉన్నాయి.

అయితే ఆసక్తికరంగా, ‘అగ్ని పరీక్షవలన శుద్ధపరచబడినప్పటికీ నశించిపోవు సువర్ణము’ కంటే మన్నికైనదీ ఎంతో “అమూల్యమైన”దీ ఒకటుందని బైబిలు పేర్కొంటోంది. (1 పేతురు 1:⁠7) అగ్నిచేత, ఇతర ప్రక్రియల చేత ‘శుద్ధిపరచబడిన’ బంగారం 99.9 శాతం స్వచ్ఛతను పొందుతుంది. అలా శుద్ధిచేయబడ్డ బంగారం కూడా, మూడు వంతులు హైడ్రో క్లోరిక్‌ ఆసిడ్‌, ఒక వంతు నైట్రిక్‌ ఆసిడ్‌ మిశ్రమం అయిన ఆక్వా రెజియా (రాయల్‌ వాటర్‌) అనే ద్రావణంతో కలిస్తే నశించిపోతుంది లేక కరిగిపోతుంది. కాబట్టి, బైబిలు “నశించుపోవు సువర్ణము” అని పేర్కొనడం శాస్త్రీయంగా సరైనదే.

దానికి భిన్నంగా, నిజమైన క్రైస్తవ విశ్వాసం ‘ఆత్మను రక్షిస్తుంది.’ (హెబ్రీయులు 10:​39) యేసు క్రీస్తును చంపినట్లే, బలమైన విశ్వాసమున్న ఒక వ్యక్తిని మనుషులు చంపగలరు. కానీ నిజమైన విశ్వాసమున్నవారికి, “మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను” అని వాగ్దానం ఇవ్వబడింది. (ప్రకటన 2:​10) విశ్వసనీయులుగా ఉండి మరణించేవారు దేవుని జ్ఞాపకంలో ఉంటారు, ఆయన వారిని పునరుత్థానం చేస్తాడు. (యోహాను 5:​28,29) ఎంత బంగారమైనా దాన్ని సాధించలేదు. దీని దృష్ట్యా, విశ్వాసం నిజంగా, బంగారం కంటే ఎంతో అమూల్యమైనది. అయితే, విశ్వాసం అంతటి ప్రశస్తమైన విలువ పొందాలంటే, అది కూడా తప్పకుండా నిరూపించబడాలి లేదా పరీక్షించబడాలి. వాస్తవానికి, “శోధనలచేత పరీక్షకు నిలిచిన” విశ్వాసము బంగారం కంటే ఎంతో గొప్ప విలువైనది అని పేతురు అన్నాడు. సత్య దేవుడు యెహోవాపై, ఆయన కుమారుడు యేసు క్రీస్తుపై బలమైన విశ్వాసాన్ని వృద్ధిచేసుకొని దాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడే బైబిలు అధ్యయనం చేయడానికి మీకు సహాయం చేసేందుకు యెహోవాసాక్షులు ఆనందంగా ముందుకు వస్తారు. యేసు మాటల ప్రకారం అలాంటి అధ్యయనం, “నిత్యజీవము”ను తెస్తుంది.​—⁠యోహాను 17:⁠3.