కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనేకమంది యౌవనస్థులు ఆసక్తి చూపని ఒక పుస్తకం

అనేకమంది యౌవనస్థులు ఆసక్తి చూపని ఒక పుస్తకం

అనేకమంది యౌవనస్థులు ఆసక్తి చూపని ఒక పుస్తకం

“బైబిలు నిజంగా దేవుని వాక్యమే అని నాకెలా తెలుస్తుంది? ఈపుస్తకమంటే నాకే మాత్రం ఆసక్తి లేదు” అని బీట్‌ అనే యువతి వ్యాఖ్యానించింది.

బీట్‌ ఉంటున్నది జర్మనీలో. అక్కడ, దాదాపు యౌవనస్థులందరి అభిప్రాయం అదే, వాళ్ళు బైబిలు చదవడానికి ఏ మాత్రం ప్రాముఖ్యతనివ్వరు. అక్కడ ఇటీవల జరిగిన ఒక సర్వే, దాదాపుగా ఒక్క శాతం మంది యౌవనస్థులు బైబిలును చాలా తరచుగా చదువుతారు, రెండు శాతం మంది తరచుగా చదువుతారు, పంతొమ్మిది శాతం మంది అరుదుగా చదువుతారు, దాదాపు ఎనభై శాతం మంది అసలు చదవనే చదవరు అని వెల్లడించింది. ఇతర దేశాల్లో కూడా ఇలాగే ఉండవచ్చు, బహుశా మీరు నివసించే చోట కూడా ఇలాగే ఉండవచ్చు. దీన్నిబట్టి బైబిలు, చాలా మంది యౌవనస్థులు ఆసక్తి చూపని ఒక పుస్తకమని స్పష్టం అవుతోంది.

కాబట్టి, యువ తరానికి బైబిలు గురించి ఏ మాత్రం తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు! 2000వ సంవత్సరపు తొలి భాగంలో జరిపిన ఒక సర్వే, పది ఆజ్ఞలు ఎరిగివుండి, వాటిని తమ జీవితంలో మార్గనిర్దేశకాలుగా ఉపయోగించుకుంటున్నవారు ఎంత మందో వెల్లడిచేసిందని లాసిట్జర్‌ రండాషో అనే వార్తాపత్రిక నివేదించింది. 60 ఏళ్ళు పైబడినవారిలో 67 శాతం మందికి పది ఆజ్ఞల గురించి తెలుసు, వాళ్ళు వాటిని అనుసరించి జీవించారు; 30 ఏళ్ళకు తక్కువున్న వారిలో కేవలం 28 శాతం మంది మాత్రమే అలా చేశారు. అవును, చాలా మంది యౌవనస్థులకు, దేవుని వాక్యం అపరిచిత ప్రాంతంలాంటిది.

కొందరికి భిన్నమైన దృక్కోణముంది

మరొకవైపు, దేవుని వాక్యం ఎంతో విలువైనదని కనుగొన్న యౌవనస్థులు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఉన్నారు. ఉదాహరణకు, అలెగ్జాండర్‌కి 19 ఏళ్ళు, ఆయన ప్రతి ఉదయం పనికి వెళ్ళే ముందు బైబిలు చదువుతాడు. “అంతకన్నా చక్కగా ఒక రోజును ఎలా ప్రారంభించాలో నేను ఊహించలేను” అని ఆయన అంటున్నాడు. సాండ్రా, ప్రతి రోజు సాయంకాలం బైబిలులో కొంత భాగాన్ని చదవడం లక్ష్యంగా పెట్టుకుంది. “అది నా దినచర్యలో భాగమైంది” అని ఆమె చెబుతోంది. 13 ఏండ్ల యూల్యా, రాత్రి పడుకునే ముందు కనీసం ఒక్క అధ్యాయమైనా చదివే అలవాటును ఇప్పటికే అలవరచుకుంది. “అలా చదవడంలో నిజంగా నేను చాలా ఆనందిస్తాను, భవిష్యత్తులో కూడా ఈఅలవాటును ఇలాగే కొనసాగించాలని అనుకుంటున్నాను” అని ఆమె అంటోంది.

ఏ దృక్కోణం సరైనది, జ్ఞానయుక్తమైనది? బైబిలు చదవడం నిజంగా ప్రయోజనకరమేనా? ఈఅలవాటు యువ తరానికి విలువైనదేనా, ప్రాముఖ్యమైనదేనా? మీరేమనుకుంటున్నారు?