కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అబ్రాహాముకున్నటువంటి విశ్వాసాన్ని కలిగివుండండి!

అబ్రాహాముకున్నటువంటి విశ్వాసాన్ని కలిగివుండండి!

అబ్రాహాముకున్నటువంటి విశ్వాసాన్ని కలిగివుండండి!

“విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారు[లు].”​—⁠ గలతీయులు 3:⁠7.

1. అబ్రాము కనానులో ఒక క్రొత్త పరీక్షను ఎలా ఎదుర్కొంటాడు?

అబ్రాము యెహోవా ఆజ్ఞకు విధేయుడై ఊరులోని సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలిపెట్టాడు. తర్వాతి సంవత్సరాల్లో ఆయనకు కలిగిన అసౌకర్యాలు, ఆయనకు ఐగుప్తులో ఎదురుకానున్న విశ్వాసపరీక్షకు ఆయనను సిద్ధపరచాయి. “అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను” అని బైబిలు వృత్తాంతం చెబుతోంది. తన పరిస్థితిని బట్టి అబ్రాముకు ఎంత సులభంగా విసుగు కలుగవచ్చు! కానీ ఆయన అలా చేయక, తన కుటుంబాన్ని పోషించేందుకు ఆచరణాత్మకమైన చర్యలను తీసుకున్నాడు. “ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్లెను.” అబ్రాము యొక్క పెద్ద పరివారము ఐగుప్తీయుల దృష్టిలో పడకపోదు. యెహోవా తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడా, అబ్రామును ప్రమాదం నుండి తప్పిస్తాడా?​—⁠ఆదికాండము 12:10; నిర్గమకాండము 16:2, 3.

2, 3. (ఎ) శారయి తన భార్య అన్న వాస్తవాన్ని అబ్రాము ఎందుకు దాచాడు? (బి)అబ్రాము ఆపరిస్థితిలో తన భార్యతో ఎలా వ్యవహరించాడు?

2 “అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యయయిన శారయితో​—⁠ఇదిగో నీవు చక్కనిదానివని యెరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి యీమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రదుక నిచ్చెదరు. నీవలన నాకు మేలుకలుగునట్లును నిన్నుబట్టి నేను బ్రదుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను” అని ఆదికాండము 12:11-13 లో మనం చదువుతాము. శారయికి 65 ఏండ్లున్నప్పటికీ, చాలా అందంగా ఉండేది. ఆమె అందం అబ్రాము ప్రాణాన్ని ప్రమాదంలో పడవేసింది. * (ఆదికాండము 12:4, 5; 17:​17) అంతకన్నా ముఖ్యంగా, అబ్రాము సంతానం ద్వారా, భూమి మీద ఉన్న సకల జనములు ఆశీర్వదించబడతాయని యెహోవా చెప్పాడు కనుక, ఆసంకల్పానికి సంబంధించిన విషయాలు ప్రమాదంలో ఉన్నాయి. (ఆదికాండము 12:2, 3, 7) అబ్రాముకు అప్పటికీ పిల్లలు లేరు కనుక, ఆయన సజీవంగా ఉండడం ప్రాముఖ్యం.

3 తాను, తన భార్య శారయి ముందు నిర్ణయించుకున్న పథకం ప్రకారం చేయడాన్ని గురించి, అంటే ఆమె ఆయన చెల్లెలు అని చెప్పడాన్ని గురించి అబ్రాము ఆమెతో మాట్లాడాడు. కుటుంబ శిరస్సుగా ఆయనకు అధికారమున్నప్పటికీ, ఆయన తన స్థానాన్ని మిగతావాళ్ళ అనుభూతులను నిర్లక్ష్యం చేస్తూ ఉపయోగించలేదు. ఆమె మనసారా సహకరించేలా, మద్దతునిచ్చేవిధంగా మాట్లాడాడు. (ఆదికాండము 12:​11-13; 20:​13) అబ్రాము ఈవిధంగా, ప్రేమపూర్వక శిరస్సత్వాన్ని చూపించడంలో భర్తలకు మంచి మాదిరినుంచాడు, శారయి లోబడడం ద్వారా నేటి భార్యలకు మాదిరినుంచింది.​—⁠ఎఫెసీయులు 5:23-28; కొలొస్సయులు 4:⁠6.

4. నేడు దేవుని నమ్మకస్థులైన సేవకులు తమ సహోదరులు ప్రమాదంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి?

4 శారయి అబ్రాముకు సవతి సహోదరి కనుక ఆమె నిజంగానే సహోదరిని అని చెప్పగలిగింది. (ఆదికాండము 20:​12) అంతేకాక, సమాచారం తెలపనవసరం లేని వారికి ఆయన దానిని తెలపబద్ధుడూ కాదు. (మత్తయి 7:⁠6) ఆధునిక కాలాల్లో దేవుని నమ్మకమైన సేవకులు సత్యసంధులుగా ఉండాలన్న బైబిలు ఆజ్ఞను అనుసరిస్తారు. (హెబ్రీయులు 13:​18) ఉదాహరణకు, వాళ్ళు న్యాయస్థానము ఎదుట సత్యప్రతిజ్ఞ చేసి అబద్ధం చెప్పరు. వేధించబడుతున్న లేక పౌర సంక్షోభంవున్న సమయాల్లో, తమ సహోదరుల ప్రాణాలు లేక ఆధ్యాత్మికత ప్రమాదంలో ఉన్నప్పుడు, వారు, “పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి” అని యేసు చెప్పిన ఉపదేశాన్ని అనుసరిస్తారు.​—⁠మత్తయి 10:​16; 1996, నవంబరు 1, కావలికోట, 18వ పేజీ 19వ పేరా చూడండి.

5. శారయి అబ్రాము అభ్యర్థనకు విధేయత చూపేందుకు ఎందుకు సుముఖత చూపింది?

5 అబ్రాము అభ్యర్థనకు శారయి ఎలా ప్రతిస్పందించింది? అపొస్తలుడైన పేతురు ఆమెలాంటి స్త్రీలను “దేవుని ఆశ్రయించిన” స్త్రీలుగా వర్ణిస్తున్నాడు. అంటే, ఇమిడివున్న ఆధ్యాత్మిక వివాదాల గురించి శారయి అర్థం చేసుకుందన్నమాట. అంతేకాక, ఆమె తన భర్తను ప్రేమించింది, గౌరవించింది. ఆవిధంగా ఆమె ‘తన స్వపురుషుడికి లోబడియుండి,’ తాను వివాహిత అన్న విషయాన్ని దాచింది. (1 పేతురు 3:⁠5) నిజమే, ఆవిధంగా చేయడం వల్ల ఆమె ప్రమాదానికి గురైంది. “అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియయి యుండుట చూచిరి ఫరోయొక్క అధిపతులు ఆమెను చూచి ఫరోయెదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో యింటికి తేబడెను.”​—⁠ఆదికాండము 12:14,15.

యెహోవా విడుదల

6, 7. అబ్రాము శారయిలకు ఎటువంటి విషమపరిస్థితి ఎదురయ్యింది, యెహోవా శారయిని ఎలా విడిపించాడు?

6 అబ్రాము శారయిలను ఇదెంత కలతపరచి ఉండవచ్చు! శారయి మానభంగానికి గురయ్యే పరిస్థితిలో ఉన్నట్లు అగుపించింది. అంతేకాక, శారయి నిజానికి వివాహిత అన్న విషయం తెలియక, ఫరో అబ్రాముకు అనేక కానుకలను బహుకరించాడు. “అతనికి గొఱ్ఱెలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను.” * (ఆదికాండము 12:​16) ఈబహుమానాలపై అబ్రాముకు ఎంత ఏవగింపు కలిగివుండవచ్చు! పరిస్థితులు ఎంత విషమకరంగా కనిపించినప్పటికీ, యెహోవా అబ్రామును విడిచిపెట్టలేదు.

7 “అయితే యెహోవా అబ్రాము భార్యయయిన శారయినిబట్టి ఫరోను అతని యింటివారిని మహావేదనలచేత బాధించెను.” (ఆదికాండము 12:​17) ఏదో తెలియని విధంగా, ఆ“వేదనల” నిజమైన కారణమేమిటో ఫరోకు వెల్లడి చేయబడింది. అప్పుడు ఆయన వెంటనే ప్రతిస్పందించాడు. “అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి​—⁠నీవు నాకు చేసినది యేమిటి? ఈమె నీ భార్య అని నా కెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని యేల చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసికొందునేమో అయితే నేమి, ఇదిగో నీ భార్య; ఈమెను తీసికొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనుల కాజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి.”​—⁠ఆదికాండము 12:18-20; కీర్తన 105:14,15.

8. యెహోవా నేటి క్రైస్తవులకు ఎటువంటి రక్షణనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు?

8 మరణం, నేరం, కరవు, లేదా ప్రకృతి వైపరీత్యాలు అనే ప్రమాదాల నుండి మనకు రక్షణనిస్తానని యెహోవా నేడు మనకు హామీ ఇవ్వడం లేదు. మన ఆధ్యాత్మికతను అపాయంలో పడవేసే విషయాల నుండి మనకన్నివేళలా రక్షణ లభించేలా యెహోవా చేస్తాడని మనకు వాగ్దానం చేయబడింది. (కీర్తన 91:​1-4) ప్రాథమికంగా, తన వాక్యం ద్వారా, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు”ని ద్వారా ఆయన మనకు సరైన సమయాల్లో హెచ్చరికలనివ్వడం ద్వారా అలాంటి రక్షణనిస్తాడు. (మత్తయి 24:​45) హింసించబడి మరణానికి గురికాగల ప్రమాదం విషయమేమిటి? వ్యక్తులు చనిపోవడానికి అనుమతించబడినప్పటికీ, తన ప్రజలు మొత్తంగా తుడిచిపెట్టబడడానికి దేవుడు ఏనాడూ అనుమతించడు. (కీర్తన 116:​15) నమ్మకస్థులైన కొందరిని మృత్యువు పొట్టనపెట్టుకుంటే, వాళ్ళు పునరుత్థానం చేయబడతారని మనం నమ్మకం కలిగివుండగలం.​—⁠యోహాను 5:28,29.

శాంతిని కాపాడుకోవడానికి త్యాగం చేయడం

9. అబ్రాము కనానులో సంచరిస్తూ వచ్చాడని ఏది సూచిస్తుంది?

9 కనానులో కరవు ముగిసిందని స్పష్టమైనప్పుడు, “అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతోకూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు [యూదా పర్వత ప్రాంతానికి దక్షిణాన కొంచెం వర్షపాతం ఉన్న ప్రాంతం] వెళ్లెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై యుండెను.” (ఆదికాండము 13:​1,2) స్థానిక నివాసులు ఆయనను శక్తీ, పలుకుబడీ గల వ్యక్తిగా, శక్తిమంతుడైన అధిపతిగా దృష్టించారు. (ఆదికాండము 23:​5, 6) అక్కడే స్థిరపడి, కనానీయుల రాజకీయాల్లో చేరాలన్న కోరిక అబ్రాముకు ఏ మాత్రం లేదు. బదులుగా, “అతడు ప్రయాణము చేయుచు దక్షిణమునుండి బేతేలువరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమువరకు వె[ళ్ళెను].” అబ్రాము ఎప్పటిలాగే, తాను ఎక్కడికి వెళ్ళినా యెహోవా ఆరాధనకు ప్రథమ స్థానాన్నిచ్చాడు.​—⁠ఆదికాండము 13:3, 4.

10. అబ్రాము లోతుల మందకాపరుల మధ్య ఏ సమస్య తలెత్తింది, దాన్ని త్వరగా పరిష్కరించడమెందుకు ప్రాముఖ్యము?

10 “అబ్రాముతో కూడ వెళ్లిన లోతుకును గొఱ్ఱెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను; ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి.” (ఆదికాండము 13:​5-7) ఆదేశములో అబ్రాము మందలకు, లోతు మందలకు సరిపడేంత నీళ్ళుగానీ మేతగానీ లేవు. అలా ఆఇరువురి మందకాపరుల మధ్యన సంఘర్షణలు, శత్రు భావాలు అంకురించాయి. అలాంటి జగడాలు సత్య దేవుని ఆరాధకుల ప్రమాణాలకు తగవు. కొట్లాటలు అలాగే సాగితే, వారిద్దరి మధ్య శాశ్వత అగాధం ఏర్పడుతుంది. మరి అలాంటి పరిస్థితిలో అబ్రాము ఎలా వ్యవహరించాడు? లోతు తండ్రి మరణించిన తర్వాత, బహుశా ఆయనను అబ్రాము దత్తత తీసుకుని తన సొంత కుమారుడిగా పెంచుకొని ఉండవచ్చు. తామిద్దరిలో తానే పెద్దవాడు కనుక, మంచి భాగం తీసుకునే హక్కు అబ్రాముకే కదా ఉన్నది?

11, 12. అబ్రాము లోతుకు ఏ ఉదారమైన ప్రతిపాదన చేస్తాడు, లోతు ఎంపిక జ్ఞానయుక్తమైనది కాదని ఎందుకు చెప్పవచ్చు?

11 కాని “అబ్రాము​—⁠మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ యెదుట నున్నదిగదా, దయచేసి నన్ను విడిచి వేరుగానుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లిన యెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడమతట్టునకును వెళ్లుదునని లోతుతో చె[ప్పెను].” బేతేలుకు సమీపాన “పాలస్తీనాలో చుట్టుప్రక్కల ప్రాంతాలను చక్కగా చూడగల ఎత్తైన ప్రాంతాల్లో ఒకటి” అని పిలువబడే స్థలముంది. బహుశా, అక్కడి నుండే “లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని” చూసి ఉంటాడు. “యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లుపారు దేశమైయుండెను.”​—⁠ఆదికాండము 13:8-10.

12 లోతు “నీతిమంతుడ”ని బైబిలాయనను వర్ణిస్తున్నప్పటికీ, ఏదో కారణాన, ఈవిషయంలో అబ్రాము ఇష్టానికి పరిగణనివ్వలేదు, ఆపెద్ద మనిషి సలహాను కనీసం అడిగినట్లు కూడా కనిపించడం లేదు. (2 పేతురు 2:⁠7) “లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణముచేసెను. అట్లు వారు ఒకరి నొకరు వేరై పోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమదగ్గర తన గుడారము వేసికొనెను.” (ఆదికాండము 13:​11,12) సొదొమ సంపన్నమైనది, అక్కడ భౌతికంగా అనేక లాభాలను పొందవచ్చు. (యెహెజ్కేలు 16:​49,50) భౌతిక దృక్కోణంలో నుండి చూస్తే, లోతు ఎంపిక జ్ఞానవంతమైనదిగా కనిపించవచ్చు, కానీ అది ఆధ్యాత్మికంగా జ్ఞానరహితమైన ఎంపిక. ఎందుకని? “సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి” అని ఆదికాండము 13:​13 చెబుతోంది. అక్కడికి వెళ్ళిపోవాలన్న లోతు నిర్ణయం, చివరికి ఆయన కుటుంబం చాలా దుఃఖించడానికి కారణమవుతుంది.

13. అబ్రాము ఉదాహరణ, ఆర్థిక వివాదం రాగల ప్రమాదంలో ఉన్న క్రైస్తవులకు ఎలా సహాయపడగలదు?

13 అయితే, తన సంతానం చివరికి ఆదేశాన్నంతటినీ సొంతం చేసుకుంటుందని యెహోవా చేసిన వాగ్దానం మీద అబ్రాము విశ్వాసాన్ని కనబరుస్తాడు; ఆయన చిన్న భూభాగం గురించి వాదించలేదు. “ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను” అని ఆయన కాలం తర్వాత వ్రాయబడిన 1 కొరింథీయులు 10:24 లో పేర్కొనబడిన సూత్రానికి పొందికగా ఆయన ఉదారంగా ప్రవర్తించాడు. తన తోటి విశ్వాసితో ఆర్థిక వివాదం రాగలవారికి ఇది మంచి జ్ఞాపికగా ఉంది. మత్తయి 18:15-17 లో ఇవ్వబడిన నిర్దేశానికి పొందికగా నడుచుకునే బదులు, కొందరు తమ సహోదరులను కోర్టుకెక్కించారు. (1 కొరింథీయులు 6:​1,7) యెహోవా నామము మీదికి నింద తీసుకువచ్చే బదులు, లేదా క్రైస్తవ సంఘానికి శాంతి లేకుండా చేసే బదులు ఆర్థిక నష్టాన్ని సహించడమే మిన్న అని అబ్రాము మాదిరి చూపిస్తుంది.​—⁠యాకోబు 3:⁠18.

14. అబ్రాము చూపిన ఔదార్యానికి ఆయనెలా ఆశీర్వదించబడనున్నాడు?

14 అబ్రాము చూపిన ఔదార్యానికి ఆయన ఆశీర్వదించబడ్డాడు. “నీ సంతానమును భూమిమీదనుండు రేణువులవలె విస్తరింప చేసెదను; ఎట్లనగా ఒకడు భూమిమీదనుండు రేణువులను లెక్కింప గలిగినయెడల నీ సంతానమునుకూడ లెక్కింపవచ్చును” అని దేవుడు ప్రకటించాడు. సంతానం లేని అబ్రాముకు ఈప్రకటన ఎంత ప్రోత్సాహకరంగా ఉండివుండవచ్చు! తర్వాత, దేవుడు “నీవు లేచి యీ దేశముయొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదనని” ఆజ్ఞాపించాడు. (ఆదికాండము 13:​16,17) అబ్రాము ఒక పట్టణంలోవున్న సౌకర్యవంతమైన పరిస్థితుల్లో స్థిరపడడానికి అనుమతించబడలేదు. ఆయన కనానీయుల నుండి వేరుగా ఉండవలసి ఉంది. అలాగే నేడు క్రైస్తవులు కూడా తప్పనిసరిగా లోకం నుండి వేరై ఉండాలి. వారు తమను తాము ఇతరులకన్నా ఘనులుగా ఎంచుకోరు, గానీ తాము లేఖనవిరుద్ధమైన ప్రవర్తనలో పడేలా తమను ప్రలోభపెట్టగల ఎవరితోనైనా మరీ సన్నిహితంగా సహవసించరు.​—⁠1 పేతురు 4:3, 4.

15. (ఎ) అబ్రాము సంచారం నిరంతరం దేనిని గుర్తు చేసేది? (బి)అబ్రాము నేటి క్రైస్తవ కుటుంబాలకు ఏ మాదిరినుంచాడు?

15 బైబిలు కాలాల్లో, ఒక వ్యక్తి కొంత భూమిని సంపాదించుకునే ముందు, ఆయనకు దానిని పరిశీలించే హక్కుండేది. అబ్రాము ఆప్రాంతంలో అలా సంచరించడం, అది తన సంతానానికి చెందబోతుందన్న దానికి ఆయనకు నిరంతర జ్ఞాపికగా పనిచేసివుండవచ్చు. విధేయతాపూర్వకంగా “అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రేదగ్గరనున్న సింధూర వృక్ష వనములోదిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.” (ఆదికాండము 13:18) తాను ఆరాధనకిచ్చిన అత్యధిక ప్రాధాన్యతను అబ్రాము మరోసారి ప్రదర్శించాడు. కుటుంబ అధ్యయనానికి, కుటుంబ ప్రార్థనకు, కూటాలకు హాజరుకావడానికి మీకుటుంబంలో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుందా?

శత్రువుల దాడులు

16. (ఎ) ఆదికాండము 14:1 లోని ప్రారంభమాటలు ఎందుకు ప్రమాదాన్ని సూచిస్తున్నాయి? (బి)ఆ నలుగురు ప్రాచ్య రాజుల ఆక్రమణకు కారణమేమిటి?

16 “షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము * రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు ... యుద్ధము చేసిరి.” (... వారి దినములలో) అని అంటూ అశుభసూచకంగా ఉన్న ఈ ప్రారంభ మాటలు హీబ్రూ మూలపాఠంలో “ఆశీర్వాదాలతో ముగిసే శ్రమల కాలాన్ని” సూచిస్తున్నాయి. (NW అధస్సూచి) (ఆదికాండము 14:1,2) ఆనలుగురు రాజులు, వారి సైన్యాలు, కనానుపై దురాక్రమణ చేయడంతో ఆపరీక్ష మొదలైంది. వాళ్ళ లక్ష్యమేమిటి? సొదొమ, గొమొఱ్ఱా, జెబోయిము, బేలా అనే ఐదు నగరాల తిరుగుబాటును అణచివేయాలన్నదే వాళ్ళ లక్ష్యం. ఎదురు తిరిగిన ఈనగరాలన్నింటినీ అణచివేస్తూ, వారందరు “ఉప్పు సముద్రమైన సిద్దీములోయలో ఏకముగా కూడి[రి].” లోతు, ఆయన కుటుంబమూ ఆప్రాంతానికి సమీపంలోనే నివసిస్తున్నారు.​—⁠ఆదికాండము 14:3-7.

17. లోతు చెర కొనిపోబడడం అబ్రాముకు ఎందుకు విశ్వాస పరీక్షగా ఉంది?

17 కనాను రాజులు తమపై దండెత్తివచ్చినవారిని తీవ్రంగా ఎదిరించారు, కాని, వాళ్ళు చాలా అవమానకరమైన ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. వాళ్ళను జయించిన రాజులు “సొదొమ గొమొఱ్ఱాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థము లన్నియు పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొనిపోగా” ఈదుర్ఘటనలను గురించిన వార్త అబ్రాముకు అందింది. “తప్పించుకొనిన యొకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసికొనినవారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని వి[నెను.]” (ఆదికాండము 14:​8-14) అదెంతటి విశ్వాస పరీక్ష! తన అన్న కుమారుడు మంచి భూభాగాన్ని తీసుకున్నందుకు అబ్రాము వ్యతిరేకభావాలను పెంచుకుని ఉంటాడా? ఈదురాక్రమణదారులు తన స్వదేశమైన షీనారు నుండి వచ్చారని కూడా గుర్తుంచుకోండి. వారితో తలపడడమంటే, మళ్ళీ ఎప్పుడైన తన స్వదేశానికి తిరిగివెళ్ళాలంటే ఆసాధ్యతను లేకుండా చేసుకోవడమే అవుతుంది. అంతేకాక, కనాను దేశపు సంకీర్ణ సైనికశక్తులు ఓడించలేకపోయిన సైన్యానికి వ్యతిరేకంగా అబ్రాము మాత్రం ఏమి చేయగలుగుతాడు?

18, 19. (ఎ) అబ్రాము లోతునెలా రక్షించగలిగాడు? (బి)ఈ విజయానికి ఎవరికి ఘనత చెల్లించబడింది?

18 అబ్రాము యెహోవా మీద మళ్ళీ దృఢమైన విశ్వాసాన్నుంచాడు. “అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన యింట పుట్టి అలవరచబడిన మూడువందల పదునెనమండుగురిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులును వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసికొని వచ్చెను.” (ఆదికాండము 14:14-16) యెహోవా మీద తనకున్న దృఢమైన విశ్వాసాన్ని కనబరుస్తూ, అబ్రాము సంఖ్యలో చాలా తక్కువగానున్న తన మనుష్యులతో వెళ్ళి, విజయం సాధించి లోతును ఆయన కుటుంబాన్ని రక్షించాడు. అబ్రాముకు ఇప్పుడు షాలేముకు రాజూ యాజకుడూ అయిన మెల్కీసెదెకు ఎదురవుతాడు. “షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి​—⁠ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని​—⁠వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి పదియవంతు ఇచ్చెను.”​—⁠ఆదికాండము 14:18-20.

19 అవును, విజయం యెహోవా నుండే వచ్చింది. తనకున్న విశ్వాసం మూలంగా అబ్రాము మరొకసారి యెహోవా ప్రసాదించిన విడుదలను చవిచూడగలిగాడు. నేడు దేవుని ప్రజలు అక్షరార్థ యుద్ధంలో పాల్గొనరు, కానీ వారికి అనేక పరీక్షలూ సవాళ్ళూ ఎదురవుతూనే ఉంటాయి. తరువాతి ఆర్టికల్‌, మనం వాటిని విజయవంతంగా ఎదుర్కొనేందుకు అబ్రాము మాదిరి ఎలా సహాయపడుతుందో చూపిస్తుంది.

[అధస్సూచీలు]

^ పేరా 2 (యెహోవాసాక్షులు ప్రచురించిన) లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) ప్రకారం, “ఆకర్షణీయమైన ఒక యువతిని పేర్కొని ఆమెను పట్టుకొని రమ్మనీ, ఆమె భర్తను చంపమనీ ఒక ఫరో తన సాయుధ సైనికులకు ఆదేశించినట్లు ఒక ప్రాచీన పపైరస్‌ చెబుతోంది.” అంటే అబ్రాము భయాలు అనవసరమైనవి కావు.

^ పేరా 6 తర్వాత అబ్రాముకు ఉపపత్ని అయిన హాగరు, ఆసమయంలో అబ్రాముకివ్వబడిన పనికత్తెల్లో ఒకరై ఉండవచ్చు.​—⁠ఆదికాండము 16:⁠1.

^ పేరా 16 ఏలాముకు షీనారులో అంత ప్రభావం లేదనీ, కదొర్లాయోమెరు దాడి చేశాడన్న వృత్తాంతం అబద్ధమనీ ఒకప్పుడు విమర్శకులనేవారు. బైబిలు వృత్తాంతాన్ని ధ్రువీకరించే పురావస్తుశాస్త్ర చర్చ కోసం, జూలై 1, 1989, కావలికోట, (ఆంగ్లం) 4-7 పేజీలు చూడండి.

మీరు గమనించారా?

• కనాను దేశంలోని కరవు అబ్రాముకు విశ్వాస పరీక్షగా ఎలా పరిణమించింది?

• అబ్రాము శారయిలు నేటి భార్యాభర్తలకు ఎలా మంచి మాదిరినుంచారు?

• తన సేవకులకు, లోతు సేవకులకు మధ్య వచ్చిన వివాదాన్ని అబ్రాము పరిష్కరించిన విధానాన్నుండి మనమే పాఠాలను నేర్చుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[22వ పేజీలోని చిత్రం]

అబ్రాము తన హక్కులకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వక, తన ఇష్టాయిష్టాలకన్నా లోతు ఇష్టాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు

[24వ పేజీలోని చిత్రం]

తన అన్న కుమారుడైన లోతును రక్షించడంలో అబ్రాము యెహోవా మీద ఆధారపడుతున్నానని చూపించాడు