కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

యోబు ఎంత కాలం బాధలను అనుభవించాడు?

యోబు అనేక సంవత్సరాలు బాధలను అనుభవించాడని కొందరనుకుంటారు, కాని యోబు గ్రంథం ఆయనంత దీర్ఘకాలం బాధలుపడ్డట్లు సూచించడం లేదు.

కుటుంబ సభ్యులను, ఆస్తులను కోల్పోవడం యోబుకు ఎదురైన పరీక్షల్లో మొదటిది, అది చాలా స్వల్పకాలంలో జరిగినట్లు స్పష్టమవుతుంది. కాబట్టే, “ఒకదినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్న యింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానము చేయుచునుండగా” అని మనం చదువుతాం. యోబుకు జరిగిన నష్టం గురించిన వార్తలు ఒక దాని తర్వాత ఒకటి ఆయనకు అందాయి. ఆయన తన ఎద్దులను గాడిదలను గొఱ్ఱెలను ఒంటెలను వాటిని చూసుకునే తన సేవకులను కూడా కోల్పోతాడు. ఆతర్వాత, తన కుమారులు కుమార్తెలు “తమ అన్న యింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా” చనిపోయారన్న వార్తను యోబు తెలుసుకున్నాడని స్పష్టమవుతుంది. ఇవన్నీ ఒక్కరోజులోనే జరిగినట్లు కనిపిస్తుంది. (ఇటాలిక్కులు మావి.)​—⁠యోబు 1:13-19.

యోబుకు ఎదురైన తర్వాతి పరీక్షకు ఎక్కువ సమయం పట్టివుండాలి. సాతాను యెహోవాను సమీపించి, యోబునే శారీరకంగా బాధపెడితే ఆయన ఓడిపోతాడని అంటాడు. తర్వాత యోబు “అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో” మొత్తబడతాడు. ఆవ్యాధి ఆయన శరీరమంతా పాకేందుకు కొంత సమయం పట్టివుండవచ్చు. ఆయనను ఓదార్చడానికి వచ్చినట్లు నటించినవారికి ఈ“ఆపదలన్నిటిని” గురించిన వార్త తెలిసేందుకు, వారు యోబు దగ్గరకు వచ్చేందుకు సమయం పట్టివుంటుంది.​—⁠యోబు 2:​3-11.

ఎలీఫజు ఏదోము దేశంలోని తేమాను నుండి వచ్చాడు, జోఫరు వాయవ్య అరేబియాలోని ఒక ప్రాంతం నుండి వచ్చాడు. అంటే వాళ్ళ ఊళ్ళు యోబు ఉన్న ఊజుకు ఎక్కువ దూరాన లేవు. ఊజు బహుశా ఉత్తర అరేబియాలో ఉండివుండవచ్చు. అయితే, బిల్దదు షూహీయుడు. వాళ్ళ జనాంగము యూఫట్రీసుకు సమీపంలో నివసిస్తుందని అర్థమవుతుంది. ఆసమయంలో బిల్దాదు తన సొంత ఊరులో ఉన్నట్లయితే, ఆయనకు యోబు పరిస్థితి గురించి తెలిసేందుకు, ఊజుకు ప్రయాణించేందుకు కొన్ని వారాలు లేదా కొన్ని నెలలుపట్టివుంటాయి. నిజమే, యోబుకు కష్టాలు మొదలైనప్పుడు, ఈముగ్గురు ఆయన ఊరికి చుట్టుప్రక్కల ప్రాంతంలోనే ఉండివుండవచ్చు. ఏది ఏమైనప్పటికీ, యోబును ఓదార్చడానికి వచ్చిన ముగ్గురు స్నేహితులు, అతనితో ఒక్క మాటైనా పలుకకుండా “రేయింబగలు ఏడు దినములు అతనితోకూడ నేలను కూర్చుండిరి.”​—⁠యోబు 2:12,13.

ఇప్పుడు యోబు చివరి పరీక్ష మొదలైంది, ఈగ్రంథంలోని అనేక అధ్యాయాలు ఆపరీక్షను గురించిన వివరాలతో నిండివున్నాయి. ఆయనను ఓదార్చడానికి వచ్చినట్లు నటించిన వారు చేసిన తర్కవాదాల, వ్యాఖ్యానాల పరంపరలు ఆఅధ్యాయాల్లో ఉన్నాయి, యోబు తరచూ వాళ్ళ వాదనలకు ప్రతిస్పందించాడు కూడా. అది ముగిసిన తర్వాత యువకుడైన ఎలీహు వారిని గద్దించాడు, యెహోవా యోబును పరలోకం నుండి సరిదిద్దాడు.​—⁠యోబు 32:​1-6; 38:⁠1; 40:​1-6; 42:⁠1.

దీన్నిబట్టి, యోబు బాధలు వాటి పరిష్కారం కొన్నినెలల్లో, బహుశ ఒక సంవత్సరం కన్నా తక్కువ కాలంలోనే జరిగివుండవచ్చని చెప్పవచ్చు. క్లిష్టమైన పరీక్షలు ఎల్లకాలం అలాగే కొనసాగుతాయన్నట్లు అనిపిస్తాయని సొంత అనుభవం ద్వారా మీకు తెలిసి ఉండవచ్చు. యోబు పరీక్షలు ముగిసినట్లే మనకు వచ్చే క్లిష్టమైన పరీక్షలు కూడా ముగుస్తాయని మనం మరిచిపోకూడదు. మనకు కలిగే పరీక్షలు ఎంత కాలం కొనసాగినా, “క్షణమాత్రముండు ... చులకని శ్రమ ... అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది” అన్న ప్రేరేపిత మాటల్లో సూచించబడినట్లు, మనకు దేవుని మద్దతుందన్న విషయాన్ని మనసులో పెట్టుకుందాం. (2 కొరింథీయులు 4:​18) “తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును” అని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు.​—⁠1 పేతురు 5:⁠10.