కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ యౌవనాన్ని సఫలీకృతం చేసుకోండి

మీ యౌవనాన్ని సఫలీకృతం చేసుకోండి

మీ యౌవనాన్ని సఫలీకృతం చేసుకోండి

యూరప్‌లోని ఒక దేశనివాసులను అందం, ఐశ్వర్యం, యౌవనం అనే మూడింటిలో ఒక దాన్ని ఎంపిక చేసుకోమని అడిగినప్పుడు, ఎక్కువ మంది యౌవనాన్నే ఎంచుకున్నారు. అవును, అన్ని వయస్సుల్లోని ప్రజలు కౌమార ప్రాయాన్ని, 20లలోని తొలి భాగాన్ని తమ జీవితంలోని ప్రత్యేకమైన కాలఘట్టంగా ఎంచుతారు. ఆప్రాయంలోనివారు బాల్యదశ నుండి వయోజనులుగా ఎదిగేటప్పుడు సఫలీకృతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఎలా?

బైబిలు సహాయం చేయగలదా? అవును అన్నదే నిశ్చితమైన జవాబు. దేవుని వాక్యం యౌవనస్థులకు ప్రత్యేక సహాయకంగా ఉండగల రెండు రంగాలను పరిశీలిద్దాం. అవి బహుశా వేరే వయస్కులవారికన్నా యౌవనస్థులకే ఎక్కువ సహాయకరంగా ఉండవచ్చు.

ఇతరులతో సత్సంబంధాలను కలిగివుండండి

యూజెంట్‌ 2000 అనేది దృక్పథాలు, విలువలు, ప్రవర్తనలపై జర్మనీలోని 5,000 కన్నా ఎక్కువ మంది యౌవనస్థులపై చేసిన విస్తృత సర్వే నివేదిక. యౌవనస్థులు విరామవేళల్లో చేసే కార్యక్రమాల్లో, అంటే సంగీతం వినడం, క్రీడల్లో పాల్గొనడం, లేదా ఊరకే అటుయిటు తిరగడం వంటివి చేసేటప్పుడు సాధారణంగా ఎల్లవేళలా ఇతర యౌవనస్థులతో పాటు ఉంటారని ఆసర్వే వెల్లడిచేసింది. బహుశా వేరే వయస్సులోని వారి కన్నా, యౌవనస్థులే తమ తోటి వయస్కులతో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి, యౌవనంలో సాఫల్యతకు గల రహస్యాల్లో ఒకటి నిశ్చయంగా ఇతరులతో సత్సంబంధాలను కలిగివుండడమే.

అయితే ఇతరులతో సత్సంబంధాలను కలిగివుండడం అన్నివేళలా అంత సులభం కాదు. నిజానికి, తమకు తరచూ సమస్యలు తలెత్తే ఒక రంగం మానవ సంబంధాలేనని యువతీ యువకులు ఒప్పుకుంటారు. ఈరంగంలో బైబిలు నిజంగా సహాయకంగా ఉండగలదు. యౌవనస్థులు సమతుల్యమైన సంబంధాలను నిర్మించుకునేందుకు అవసరమైన ప్రాథమిక మార్గనిర్దేశం దేవుని వాక్యంలో ఉంది. బైబిలు ఏమని చెబుతోంది?

మానవ సంబంధాలకు సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన సూత్రాల్లో ఒకటి బంగారు సూత్రమని చెప్పబడుతోంది. “ప్రతి విషయంలో యితర్లు మీకోసం ఏం చెయ్యాలని మీరు ఆశిస్తారో మీరు యితర్ల కోసం అదే చెయ్యాలి” అన్నదే ఆనియమం. మీరు గౌరవ మర్యాదలతో దయాపూర్వకంగా ఇతరులతో వ్యవహరించినప్పుడు, ఇతరులు కూడా మీతో అలాగే వ్యవహరించేందుకు ప్రోత్సహించబడతారు. దయాపూర్వకమైన ప్రవర్తన, సంఘర్షణలను ఒత్తిడులను కలిగించే వాతావరణానికి విరుగుడుగా ఉంటుంది. మీరు ఇతరుల కష్టసుఖాలు ఆలోచించి వ్యవహరిస్తారని పేరు తెచ్చుకున్నప్పుడు, మీరు వారి గుర్తింపును, అంగీకారాన్ని గెలుచుకునే అవకాశముంది. ఇతరులు మిమ్మల్ని అంగీకరిస్తున్నప్పుడు మీకు మంచిగా అనిపించదా?​—⁠మత్తయి 7:​12, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

“నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలె”నని బైబిలు మీకు సలహా ఇస్తోంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, అంటే, మీపై మీరు శ్రద్ధ చూపుకోవాలి, అతిగా గానీ, అతి తక్కువగా గానీ కాక, సమతుల్యమైన ఆత్మగౌరవం ఉండాలి. అయితే అలా ఉండడం దేనికి సహాయపడుతుంది? అవును, మీగురించి మీరు మంచిగా భావించుకోకపోతే, మీరు ఇతరుల గురించి అతిగా విమర్శించవచ్చు, అది సత్సంబంధాలను ఆటంకపరుస్తుంది. మీరు బలమైన స్నేహసంబంధాలను నిర్మించుకునేందుకు, సమతుల్యమైన ఆత్మగౌరవం పునాది కాగలదు.​—⁠మత్తయి 22:39.

ఒకసారి స్నేహం అంకురించాక, ఇరుపక్షాల ప్రయత్నాలతో అది బలపడాల్సిన అవసరముంది. “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” కనుక, స్నేహం గురించి సమయాన్ని వెచ్చించడం మీకు మంచి అనుభూతినివ్వాలి. ఒక రకమైన ఇవ్వడం ఏదంటే, అది క్షమా భిక్ష ఇవ్వడమే. అందులో చిన్న చిన్న పొరపాట్లను చూసీ చూడనట్లు వదిలేయడం, ఇతరులనుండి పరిపూర్ణతను ఎదురుచూడకపోవడం ఇమిడి ఉన్నాయి. “మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి” అని బైబిలు చెబుతోంది. నిజానికి, “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.” ఒక స్నేహితుడు మీలోని ఒక బలహీనతను చూపిస్తే, అప్పుడేమిటి? మీరెలా ప్రతిస్పందిస్తారు? “మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును” కనుక, “ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును” అని బైబిలు చెబుతున్న ఆచరణాత్మకమైన సలహా గురించి ఆలోచించి చూడండి. స్నేహితులు మీతలంపులపైనా, మీమాటలపైనా, ప్రవర్తనపైనా ప్రభావం చూపుతారన్నది నిజం కాదా? అందుకే “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అని బైబిలు హెచ్చరిస్తోంది. మరొకవైపు, “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును” అని చెబుతోంది.​—⁠అపొస్తలుల కార్యములు 20:​35; ఫిలిప్పీయులు 4:⁠5; రోమీయులు 12:​17,18; సామెతలు 13:⁠20; 27:⁠6; ప్రసంగి 7:9; 1 కొరింథీయులు 15:​33.

అనేక మంది యువతీ యువకుల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ, “ఇతరులతో సత్సంబంధాలను కాపాడుకోవడానికి బైబిలు సూత్రాలు గొప్ప సహాయకంగా ఉండగలవు. కొందరు కేవలం తమ కోసమే జీవిస్తూ, జీవితంలో వ్యక్తిగత ప్రయోజనాలను ఎలా పొందుతారో నాకు తెలుసు. మన గురించే అతిగా ఆలోచించక, ఇతరుల గురించి ఆలోచించమని బైబిలు మనకు బోధిస్తోంది. నేను చూసినంత మేరకు, తోటి మానవులతో సత్సంబంధాలను కలిగివుండేందుకు అదే శ్రేష్ఠమైన మార్గమని నేను గ్రహించాను” అని మార్కో అంటున్నాడు.

మార్కోలాంటి అనేక మంది యౌవనస్థులకు బైబిలు నుండి వారు నేర్చుకొన్న విషయాలు యౌవనంలోనే కాక, భవిష్యత్తులోనూ వారికి సహాయపడతాయి. భవిష్యత్తు విషయానికి వస్తే, యువ తరానికి బైబిలు ప్రత్యేక సహాయంగా ఉండే మరో విధానాన్ని మనం కనుగొంటాం.

భవిష్యత్తు గురించి ఆందోళన

చాలా మంది యౌవనస్థులకు కార్యవిచారణ చేసే మనస్తత్త్వం ఉంది. బహుశా వేరే వయస్సులోవారి కన్నా, వీళ్ళే ఎక్కువగా ఏమి జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అన్నది తెలుసుకోవాలని కోరుకుంటారు. వేరే ఏ పుస్తకాల కన్నా, స్పష్టంగా బైబిలే లోక పరిస్థితులకు కారణాలను వివరిస్తూ, భవిష్యత్తులో ఏమి ఎదురుచూడవచ్చో చెబుతుంది. యువ తరం తెలుసుకోవాలనుకునేది కూడా అదే. అదేనని మనమెందుకు నిశ్చయంగా చెప్పగలం?

యౌవనస్థులు కేవలం వర్తమానం కోసం జీవిస్తారని అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నమ్ముతున్నప్పటికీ, కొన్ని సర్వేలు విభిన్నమైన వాస్తవాన్ని వెల్లడి చేస్తున్నాయి. తమ చుట్టూ ఏమి జరుగుతోంది అన్నది యౌవనస్థులు జాగ్రత్తగా పరిశీలిస్తారనీ, భవిష్యత్తులో జీవితం ఎలా ఉండవచ్చన్నదాని గురించి స్వయంగా కొన్ని నిర్ధారణలకు వస్తారనీ ఆసర్వేలు చూపిస్తున్నాయి. ప్రతి నలుగురు యువతీ యువకుల్లో, ముగ్గురు “తరచుగా”నో లేదా “చాలా తరచుగా”నో భవిష్యత్తు గురించి ఆలోచించడం అందుకు రుజువుగా ఉంది. యౌవనస్థులు సాధారణంగా ఆశావాదులే అయినప్పటికీ, వారిలో అధిక సంఖ్యాకులు భవిష్యత్తును ఎంతో ఆందోళనతో చూస్తారు.

ఆందోళన ఎందుకు? భావి వయోజనులైన నేటి యౌవనస్థులనేకులు ఇప్పటికే నేరం, దౌర్జన్యం, మత్తుమందుల దుర్వినియోగాల వల్ల కలిగే సమస్యల్లో ఉన్నారు. పోటీ స్వభావం అధికంగా ఉన్న నేటి సమాజంలో స్థిరమైన ఉద్యోగం సంపాదించుకోవడం ఎలాగా అని యౌవనస్థులు విచారపడుతుంటారు. స్కూల్లో మంచి గ్రేడులు సంపాదించాలన్న ఒత్తిడికి లేదా అందరికన్నా మంచిగా పనిచేసేవాడన్న పేరు సంపాదించాలన్న ఒత్తిడికి లోనవుతున్నట్లు భావిస్తారు. 17 ఏండ్ల ఒక అమ్మాయి, “స్వార్థపూరిత క్రూర సమాజంలో మనం జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరూ తను కోరుకుంటున్నది జరగాలని చూస్తారు. మీరు ఏం చేయగలరన్నది నిరంతరం రుజువు చేసుకుంటూ ఉండాలి, అదే నన్ను చాలా కలతపరుస్తుంది” అని అంటోంది. 22 ఏండ్ల ఒక యువకుడు, “తమ లక్ష్యాన్ని చేరుకునేవారు, జీవితంలో సఫలీకృతులౌతారు, వాళ్ళు సుఖంగా జీవించగలుగుతారు. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నవారు వివిధ కారణాల వల్ల తోటివారితోపాటు సఫలులుకాలేరు, వాళ్ళు వెనుకబడి పోతుంటారు” అని అంటున్నాడు. జీవితమెందుకింత పోటీమయంగా ఉంది? జీవితం ఎప్పుడూ ఇలాగే ఉంటుందా?

వాస్తవికమైన వివరణ

యౌవనస్థులు ఎంతో కలవరంతో లేదా భయంతో సమాజాన్ని చూస్తున్నప్పుడు, వారు తెలిసో తెలియకో, బైబిలుతో ఏకీభవిస్తున్నారు. నేటి “స్వార్థపూరిత క్రూర సమాజం” నిర్దిష్ట కాలాలకు సూచన అని దేవుని వాక్యం చూపిస్తోంది. తిమోతి అనే యువకునికి అపొస్తలుడైన పౌలు వ్రాసిన ఉత్తరంలో, ఆయన మన రోజుల గురించి పేర్కొంటూ, “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని” వ్రాశాడు. ఎందుకివి అపాయకరంగా ఉంటాయి? ఎందుకంటే, అపొస్తలుడైన పౌలు వ్రాసినట్లుగా ప్రజలు “స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు ... కృతజ్ఞతలేనివారు అపవిత్రులు ... క్రూరులు”గా ఉంటారు. నేటి అనేకమంది ప్రవర్తనకు ఆవివరణ సరిగ్గా అతికినట్టు లేదూ?​—⁠2 తిమోతి 3:1-3.

“అంత్యదినముల”లో సమస్త మానవ సమాజంపై గొప్ప మార్పులు జరగకముందు ఈ అపాయకరమైన కాలాలు వస్తాయని బైబిలు పేర్కొంటోంది. ఆమార్పులు పిన్నలు పెద్దలు అన్న తేడా లేకుండా అందరిపైనా ప్రభావం చూపుతాయి. అవి ఎలాంటి మార్పులై ఉండవచ్చు? త్వరలోనే ఒక పరలోక ప్రభుత్వం మానవులను పరిపాలిస్తుంది, దాని ప్రజలు అన్ని ప్రాంతాల్లో, “బహు క్షేమము కలిగి సుఖించెదరు.” “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” ఆందోళన, భయము అనే అనుభూతులు గతకాల విషయాలుగా మారుతాయి.​—⁠కీర్తన 37:​11,29.

కేవలం బైబిలు మాత్రమే, భవిష్యత్తును గురించి నమ్మదగిన అంతర్దృష్టిని ఇస్తుంది. రాబోయే సంవత్సరాల్లో, ఏమి ఎదురుచూడవచ్చో ఒక యౌవనస్థునికి తెలిసినప్పుడు, రానున్న పరిణామాలకు తగిన విధంగా ఆయన సిద్ధపడగలడు, అలా, భవిష్యత్తులో భద్రత ఉంటుందనీ, తన జీవితంపై తనకు మరింత పట్టు ఉంటుందనీ భావించగలడు. ఈఅనుభూతులు ఒత్తిడినీ, చింతనూ తగ్గిస్తాయి. ఈవిధంగా, యువ తరం యొక్క ప్రత్యేక అవసరంపై, అంటే సమాజాన్ని అర్థం చేసుకొని, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరంపై బైబిలు శ్రద్ధ కేంద్రీకరిస్తుంది.

యౌవనంలో సాఫల్యత

యౌవనంలో సాఫల్యతను కొలిచే ప్రమాణం ఏమిటి? ఉన్నత విద్యాభ్యాసం, సిరి సంపదలు, విస్తృతమైన స్నేహితుల బృందమేనా? అనేకులు అలాగే అనుకుంటుండవచ్చు. కౌమార ప్రాయము, 20ల తొలి భాగము, ఒక వ్యక్తి భావి జీవితానికి మంచి ఆరంభాన్నివ్వాలి. మరో మాటలో చెప్పాలంటే, యౌవనంలో సాఫల్యము, తర్వాత ఏమి జరుగుతుందన్నదానికి సూచన కావచ్చు.

మనం ముందు చూసినట్లు, ఒక యౌవనస్థుడు తన యౌవనాన్ని సఫలీకృతం చేసుకొనేందుకు బైబిలు సహాయపడగలదు. తమ జీవితాల్లో ఇది నిజమైందని అనేక మంది యౌవనస్థులు ఇప్పటికే కనుగొన్నారు. వారు దేవుని వాక్యాన్ని ప్రతిరోజూ చదువుతారు, తాము నేర్చుకునేవాటిని ఆచరణలో పెడతారు. (6వ పేజీలోని “యెహోవా యొక్క ఒక యువ సేవకుని సూచన” చూడండి.) నిజానికి, బైబిలు నేటి యౌవనస్థులకు అవసరమైన పుస్తకము, ఎందుకంటే, అది ఒక యౌవనస్థుడు “సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు” సహాయపడగలదు.​—⁠2 తిమోతి 3:​16,17.

[5వ పేజీలోని బ్లర్బ్‌]

యౌవనంలో సాఫల్యతకు గల రహస్యాల్లో ఒకటి ఇతరులతో సత్సంబంధాలను కాపాడుకోవడం

[6వ పేజీలోని బ్లర్బ్‌]

ఏమి జరుగుతోంది, ఎందుకు జరుగుతోందన్నది బహుశా వేరే వయస్సులోవారి కన్నా, యౌవనస్థులే ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటారు

[6, 7వ పేజీలోని బాక్సు]

యెహోవా యొక్క ఒక యువ సేవకుని సూచన

అలెగ్జాండర్‌కి 19 ఏళ్ళు. ఆయన యెహోవాసాక్షుల కుటుంబంలో పెరిగాడు. ఆయన తన విశ్వాసాన్ని పూర్ణ హృదయంతో ఆచరణలో పెట్టడంలో ఎంతో ఆనందిస్తాడు. కానీ ఒకప్పుడు అలా చేసేవాడు కాదు. అలెగ్జాండర్‌ ఇలా వివరిస్తున్నాడు:

“మీరు నమ్మండి నమ్మకపోండి, నేను బాప్తిస్మం తీసుకోని యౌవనుడిగా ఏడు సంవత్సరాలకంటే ఎక్కువ కాలం యెహోవాసాక్షులతో సహవసించాను. అప్పట్లో, నేను ఆరాధనను అర్ధ హృదయంతో ఏదో దినచర్య అన్నట్లుగా చేసేవాడిని. నన్ను నేను నిజాయితీగా పరిశీలించుకునే ధైర్యం నాకు లేకపోయిందనుకుంటా.”

తర్వాత అలెగ్జాండర్‌ దృక్పథం మారిపోయింది. ఆయనింకా ఇలా అంటున్నాడు:

“నా తల్లిదండ్రులూ సంఘంలోని నా స్నేహితులూ, యెహోవాను వ్యక్తిగతంగా తెలుసుకునేందుకు ప్రతిరోజూ బైబిలు చదవమని నాకు చెబుతూనే వచ్చారు. ప్రయత్నించి చూద్దామని చివరికి నేను నిర్ణయించుకున్నాను. అలా నేను టీవీ చూసే సమయాన్ని తగ్గించుకున్నాను, బైబిలు చదవడాన్ని ప్రతి రోజూ ఉదయం చేసే దినచర్యగా చేసుకున్నాను. అలా బైబిలు అంటే ఏమిటో నేను అర్థం చేసుకోనారంభించాను. అది నాకు వ్యక్తిగతంగా ఎలా సహాయపడగలదో చూడగలిగాను. అన్నింటికన్నా ముఖ్యంగా, నేను యెహోవాను గురించి తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడని అర్థం చేసుకున్నాను. నేను ఒక్కసారి ఆవిషయాన్ని మనస్సులో పెట్టుకున్న తర్వాత, ఆయనతో నాకున్న వ్యక్తిగత అనుబంధం పెరగనారంభించింది, సంఘంలో స్నేహాలు మెరుగుపడ్డాయి. బైబిలు నా జీవితంలో ఎంత గొప్ప మార్పులను తీసుకువచ్చింది! యెహోవా యొక్క ప్రతి యువ సేవకుడు ప్రతిరోజు బైబిలు చదవాలని నేను సిఫారసు చేస్తున్నాను.”

యెహోవాసాక్షులతో సహవసించే యౌవనస్థులు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఉన్నారు. మీరు వారిలో ఒకరా? ప్రతిరోజూ బైబిలు చదివి ప్రయోజనం పొందాలని మీరు ఇష్టపడతారా? అలెగ్జాండర్‌ మాదిరిని ఎందుకు అనుసరించకూడదు? తక్కువ ప్రాధాన్యతగల కార్యకలాపాలను తగ్గించుకొని, బైబిలు చదవడం మీదినచర్యలో భాగంగా చేసుకోండి. మీరు తప్పక ప్రయోజనం పొందుతారు.