కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మేలు చేయడంలో పట్టువిడువక ఉందాం

మేలు చేయడంలో పట్టువిడువక ఉందాం

మేలు చేయడంలో పట్టువిడువక ఉందాం

“మనము మేలుచేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము.”​—గలతీయులు 6:⁠9.

1, 2. (ఎ) దేవుణ్ణి సేవించేందుకు ఓర్పు ఎందుకవసరం? (బి)అబ్రాహాము ఓర్పును ఎలా చూపించాడు, ఆయనలా ఓర్చుకునేందుకు ఏది సహాయపడింది?

యెహోవాసాక్షులముగా, మనం దేవుని చిత్తం చేయడంలో ఆనందిస్తాం. శిష్యరికపు “కాడి”ని ఎత్తుకోవడంలో మనం సేదదీర్పును కూడా పొందగలం. (మత్తయి 11:​29) అయినప్పటికీ, క్రీస్తుతోపాటు యెహోవా సేవచేయడం అన్నివేళలా అంత సులభం కాదు. ఈవిషయాన్ని, అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులకు బోధించినప్పుడు స్పష్టం చేశాడు. “మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది” అని ఆయన బోధించాడు. (హెబ్రీయులు 10:​36) దేవునికి సేవ చేయడం సవాలుగా ఉండగలదు కాబట్టి ఓర్పు అవసరము.

2 ఆవాస్తవానికి నిశ్చయంగా అబ్రాహాము జీవితం సాక్ష్యంగా ఉంది. అనేకసార్లు సరైన ఎంపిక చేసుకోవడం కష్టంగావున్న పరిస్థితులు, ఒత్తిళ్ళతోకూడిన పరిస్థితులు ఆయనకెదురయ్యాయి. ఊరులోని సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలిపెట్టమని ఆజ్ఞాపించబడడం కేవలం ఆరంభం మాత్రమే. త్వరలోనే ఆయన కరవును తన పొరుగువారి శత్రుత్వాన్నీ, తన భార్యను కోల్పోయే పరిస్థితినీ, తన బంధువులైన కొందరి వైరాన్నీ భయంకరమైన యుద్ధాన్నీ ఎదుర్కోవలసి వచ్చింది. అంత కన్నా పెద్ద శోధనలు ఇంకా రానున్నాయి. కాని అబ్రాహాము మేలైనదాన్ని చేయడం ఎన్నడూ మానలేదు. మనకు నేడున్నట్లు ఆయనకు దేవుని సంపూర్ణ వాక్యం లేదన్న విషయాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే అది నిజంగా గమనార్హమైన విషయమే. అయితే, “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను” అని దేవుడు ప్రకటించిన మొదటి ప్రవచనం ఆయనకు తెలుసన్న విషయంలో సందేహం లేదు. (ఆదికాండము 3:​15) ఆసంతానం వచ్చేది అబ్రాహాము ద్వారానే కనుక, సాతాను ఆయనపై శత్రుత్వాన్ని చూపించడం సహజం. ఈవాస్తవాన్ని గ్రహించడం అబ్రాహాము తనకెదురైన పరీక్షలను ఆనందంగా ఓర్చుకునేందుకు సహాయపడిందనడంలో సందేహం లేదు.

3. (ఎ) నేడు యెహోవా ప్రజలు శ్రమలను ఎందుకు ఎదురుచూడాలి? (బి)గలతీయులు 6:9 మనకు ఏ ప్రోత్సాహాన్నిస్తుంది?

3 నేడు యెహోవా ప్రజలు కూడా శ్రమలు వస్తాయని ఎదురుచూడాలి. (1 పేతురు 1:​6,7) ఎంత కాదన్నా, సాతాను అభిషిక్త శేషముతో ‘యుద్ధము చేస్తున్నాడని’ ప్రకటన 12:⁠17 మనలను హెచ్చరిస్తోంది. “వేరే గొఱ్ఱెలు” అభిషిక్తులతో సన్నిహితంగా సహవసిస్తారు కనుక, వారు కూడా సాతాను ఆగ్రహానికి గురవుతారు. క్రైస్తవులకు బహిరంగ పరిచర్యలో వ్యతిరేకత ఎదురవడమే కాక, వారి వ్యక్తిగత జీవితాల్లో కూడా పరీక్షలుగా ఉండే ఒత్తిళ్ళు రావచ్చు. “మనము మేలుచేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము” అని పౌలు మనకు ఉద్బోధిస్తున్నాడు. (గలతీయులు 6:⁠9) అవును, సాతాను మన విశ్వాసాన్ని పాడుచేయాలని ఉద్దేశించినా, మనం ఆయనకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలి, విశ్వాసంలో దృఢంగా ఉండాలి. (1 పేతురు 5:​8,9) మనం నమ్మకంగా ఉండడం వల్ల ఏం ఫలితం లభిస్తుంది? “నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి” అని యాకోబు 1:2, 3 వివరిస్తుంది.

సూటిగా దాడి

4. దేవుని ప్రజల విశ్వాసాన్ని చెడగొట్టడానికి సాతాను సూటైన దాడులను ఎలా ఉపయోగించాడు?

4 నేడు క్రైస్తవులు ఎదుర్కోగల “నానావిధములైన శోధనల”ను అబ్రాహాము జీవితం ఖచ్చితంగా దృష్టాంతపరుస్తోంది. ఉదాహరణకు, ఆయన షీనారు నుండి వచ్చి దాడి చేసినవారిని ప్రతిఘటించాల్సి ఉండింది. (ఆదికాండము 14:​11-16) సాతాను హింస రూపంలో సూటైన దాడులను ఉపయోగిస్తూనే ఉండడం ఆశ్చర్యకరం కాదు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి డజన్ల కొలది దేశాలు యెహోవాసాక్షుల క్రైస్తవ విద్యా పనిపై ప్రభుత్వ నిషేధాలను పెట్టాయి. అంగోలాలోని క్రైస్తవులు శత్రువుల వేధింపును ఎంతగా ఎదుర్కోవలసి వచ్చిందన్నది 2001 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకము (ఆంగ్లం) చెబుతుంది. అలాంటి దేశాల్లోవున్న మన సహోదరులు యెహోవాపై ఆధారపడుతూ, తమ విశ్వాసాన్ని వదిలిపెట్టడానికి దృఢంగా నిరాకరించారు. వాళ్ళు దౌర్జన్యానికి పూనుకోవడం ద్వారానో తిరుగుబాటు చేయడం ద్వారానో కాక, ప్రకటనా పనిలో వివేచనాపూర్వకంగా కొనసాగడం ద్వారా ప్రతిస్పందించారు.​—⁠మత్తయి 24:⁠14.

5. క్రైస్తవ యౌవనస్థులు స్కూల్లో ఎలా హింసించబడవచ్చు?

5 అయినప్పటికీ, హింసలో అన్నివేళలా శారీరకంగా వేధించడమే ఇమిడి ఉండాలని లేదు. అబ్రాహాముకు చివరికి, ఇష్మాయేలు, ఇస్సాకు అనే ఇద్దరు కుమారులు అనుగ్రహించబడ్డారు. ఇష్మాయేలు ఒక సందర్భంలో ఇస్సాకును ‘పరిహసించాడని’ ఆదికాండము 21:​8-12 చెబుతోంది. అది పిల్లతనం మాత్రమే కాదని పౌలు గలతీయులకు వ్రాసిన ఉత్తరంలో చూపిస్తున్నాడు, అందుకే, ఇష్మాయేలు ఇస్సాకును హింసపెట్టాడని ఆయన వివరిస్తున్నాడు! (గలతీయులు 4:​29) తోటివిద్యార్థుల పరిహాసాన్ని, వ్యతిరేకుల బాణాల్లాంటి దురుసైన మాటలను కూడా హింస అని చెప్పడం సబబే. రైన్‌ అనే యువ క్రైస్తవుడు తాననుభవించిన క్లాసుమేట్ల వేధింపును గుర్తు చేసుకుంటూ, “బస్సులో స్కూల్‌కి వెళ్ళడానికీ, స్కూల్‌ నుండి తిరిగి రావడానికీ పట్టే 15 నిమిషాలూ వాళ్ళు నన్ను మాటలతో చిత్రహింసలు పెడుతుంటే నాకు నిమిషాలే అనేక గంటల్లాగ అనిపించేది, వాళ్ళు పేపర్‌ క్లిప్పులను సిగరెట్‌ లైటర్లతో వేడి చేసి నాకు వాతపెట్టేవారు” అని చెబుతున్నాడు. వాళ్ళలా క్రూరంగా వ్యవహరించడానికి కారణమేమిటి? ఆకారణాన్ని గురించి చెబుతూ, “నాకు లభించిన దైవపరిపాలనా శిక్షణ నన్ను స్కూల్లోని ఇతర పిల్లలకు భిన్నంగా చేసింది” అని ఆయన చెబుతున్నాడు. అయితే, ఆయన తన తల్లిదండ్రుల మద్దతుతో, విశ్వాసంతో ఓర్చుకోగలిగాడు. చిన్నలారా, మీతోటివాళ్ళ పరిహాసపు మాటలు మిమ్మల్ని నిరుత్సాహపరిచాయా? కానీ పట్టువిడువకండి! మీరు విశ్వాసంతో ఓర్చుకుంటే, “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు” అని యేసు చెప్పిన మాటలు మీవిషయంలో కూడా నిజమౌతాయి.​—⁠మత్తయి 5:⁠11.

ప్రతిదిన ఆందోళనలు

6. నేడు తోటి క్రైస్తవుల మధ్య ఉండాల్సిన సంబంధాలను అణచివేసేవి ఏవి?

6 నేడు మనం ఎదుర్కొంటున్న శోధనల్లో సాధారణంగా ఉండే ప్రతిదిన ఆందోళనలు కూడా ఇమిడివున్నాయి. అబ్రాహాము కూడా ఘర్షణలను ఎదుర్కోవలసి వచ్చింది. తన మందల కాపరులకూ, తన అన్న కుమారుడైన లోతు మందకాపరులకూ మధ్య ఘర్షణ జరిగింది. (ఆదికాండము 13:​5-7) నేడు అదేవిధంగా, వ్యక్తిత్వ భేదాలూ, చిన్న చిన్న అసూయలు వ్యక్తుల మధ్య ఉండే సంబంధాలను అణచివేయగలవు. అవి సంఘ శాంతికి కూడా ముప్పు వాటిల్లజేయగలవు. “మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.” (యాకోబు 3:​16) అబ్రాహాము చేసినట్లుగానే, మనం అహంకారాన్ని వదిలిపెట్టి శాంతికి ప్రాధాన్యతనివ్వడంలో పట్టువదలకుండా, ఇతరుల మేలును చూడడం ఎంత ప్రాముఖ్యం!​—⁠1 కొరింథీయులు 13:5; యాకోబు 3:⁠17.

7. (ఎ) తన తోటి క్రైస్తవుడు తనను నొప్పిస్తుంటే ఏమి చేయాలి? (బి)ఇతరులతో సత్సంబంధాలను కాపాడుకోవడంలో అబ్రాహాము ఎలా మంచి మాదిరినుంచాడు?

7 ఒక తోటి క్రైస్తవుడు మనతో అన్యాయంగా వ్యవహరిస్తున్నట్లయితే, సమాధానంగా ఉండడమన్నది సవాలు కాగలదు. “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు” అని సామెతలు 12:​18 చెబుతోంది. అనాలోచితమైన మాటలు, అవి నిష్కపటంగా పలికినవే అయినా చాలా బాధను కలిగించగలవు. మనపై నిందలు వేసినట్లు, క్రూరంగా మన గురించి మాట్లాడుతున్నట్లనిపిస్తే మనకు ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది. (కీర్తన 6:​6,7) కాని ఒక క్రైస్తవుడు ఆబాధ సత్సంబంధాల కోసం తాను చేసే తన ప్రయత్నాన్ని విడిచిపెట్టేలా చేయడానికి అనుమతించడు! మీరు అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, మిమ్మల్ని బాధపెట్టేవారితో దయాపూర్వకంగా మాట్లాడి విషయాలను చక్కబెట్టడానికి చొరవ తీసుకోండి. (మత్తయి 5:23, 24; ఎఫెసీయులు 4:​26) ఆవ్యక్తిని క్షమించేందుకు మొగ్గు చూపేవారై ఉండండి. (కొలొస్సయులు 3:​13) కోపాన్ని విడిచిపెట్టడం ద్వారా మనం మన సొంత భావోద్వేగపు గాయాలను నయం చేసుకోవడానికి, మన సహోదరునితో మనకున్న సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి వీలవుతుంది. అబ్రాహాముకు లోతుమీద ప్రతికూల భావం కలిగివుండవచ్చు, కానీ ఆయన దాన్ని అలాగే మనస్సులో పెట్టుకోలేదు. అంతెందుకు, అబ్రాహాము లోతును ఆయన కుటుంబాన్నీ కాపాడేందుకు కూడా వెంటనే బయల్దేరాడు!​—⁠ఆదికాండము 14:12-16.

స్వయంగా కొనితెచ్చుకునే శోధనలు

8. (ఎ) క్రైస్తవులు, ‘నానాబాధలతో తమను తాము’ ఎలా ‘పొడుచుకోగలరు’? (బి)అబ్రాహాము భౌతిక విషయాల గురించి సమతుల్యమైన దృక్కోణాన్ని ఎలా కలిగివుండగలిగాడు?

8 కొన్ని శోధనలు స్వయంగా తెచ్చిపెట్టుకునేవేనని ఒప్పుకోవలసిందే. ఉదాహరణకు, “భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు” అని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. (మత్తయి 6:​19) అయితే, కొందరు సహోదరులు రాజ్య సంబంధ విషయాల కన్నా భౌతిక విషయాలకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం ద్వారా ‘నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొంటారు.’ (1 తిమోతి 6:​9,10) దేవుణ్ణి ప్రీతిపరచేందుకు భౌతిక సౌకర్యాలను త్యాగం చేయడానికి అబ్రాహాము సుముఖత చూపించాడు. “విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునైయున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.” (హెబ్రీయులు 11:​9,10) భవిష్యత్‌ “పట్టణము” అంటే దైవిక ప్రభుత్వం మీద అబ్రాహాముకున్న విశ్వాసం, ఆయన సిరిసంపదలపై ఆధారపడకుండా ఉండేందుకు సహాయం చేసింది. మనం కూడా అలా చేయడం జ్ఞానయుక్తం కాదా?

9, 10. (ఎ) ఉన్నత స్థానం కావాలన్న కోరిక శోధనలను ఎలా తీసుకురాగలదు? (బి)నేడు ఒక సహోదరుడు తాను ‘అత్యల్పుడు’ అన్న భావంతో ఎలా ఉండవచ్చు?

9 మరో విషయాన్ని గురించి ఆలోచించండి. “ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్ను తానే మోసపరచుకొనును” అన్న గట్టి హెచ్చరికను బైబిలు ఇస్తోంది. (గలతీయులు 6:⁠3) అంతేకాక, “కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై” ఉండాలని మనకు బోధించబడుతోంది. (ఫిలిప్పీయులు 2:⁠3) కొందరు ఈఉపదేశాన్ని అనుసరించక తమంతట తాము శోధనలను కొనితెచ్చుకుంటారు. “దొడ్డపనిని” చేయాలన్న కోరికతో ప్రేరేపించబడక, తమకు ప్రముఖ స్థానం కావాలన్న కోరికతో పురికొల్పబడిన వారు సంఘంలో ఆధిక్యతలను పొందనప్పుడు, నిరుత్సాహాన్ని అసంతృప్తిని పొందుతారు.​—⁠1 తిమోతి 3:​1.

10 “తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొన”కుండా ఉండడంలో అబ్రాహాము మంచి మాదిరినుంచాడు. (రోమీయులు 12:⁠3) తనకు మెల్కీసెదెకు ఎదురైనప్పుడు, తనకు దేవుని అనుగ్రహం ఉన్నందువల్ల, ఆయన కంటే తానే గొప్పవాడన్నట్లుగా అబ్రాహాము ప్రవర్తించలేదు. బదులుగా, ఆయన యాజకుడుగా తనకన్నా ఉన్నత స్థానంలో ఉన్నాడని గుర్తించి, ఆయనకు దశమ భాగాన్ని చెల్లించాడు. (హెబ్రీయులు 7:​4-7) నేడు క్రైస్తవులు కూడా తమను తాము ‘అత్యల్పులుగా’ ఎంచుకునేందుకు, ఉన్నత స్థానాన్ని కోరకుండా ఉండేందుకు సుముఖత చూపించాలి. (లూకా 9:​48) సంఘంలో నాయకత్వం వహించేవారు, మీకు కొన్ని ఆధిక్యతలు దొరక్కుండా ఆపుతున్నట్లు అనిపిస్తే, మీరు మీవ్యక్తిత్వంలో, లేదా మీరు కార్యాలను చేసే తీరులో మీరు మెరుగుపరచుకోగల విషయాలేమిటో మీకై మీరే తెలుసుకునేందుకు నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోండి. మీకు లేని ఆధిక్యతల గురించి ప్రతికూల భావాలను కలిగివుండే బదులు, మీకు ఉన్న ఆధిక్యతను, అంటే యెహోవాను తెలుసుకోవడానికి ఇతరులకు సహాయపడే ఆధిక్యతను పూర్తిగా ఉపయోగించుకోండి. అవును, “దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.”​—⁠1 పేతురు 5:⁠6.

అదృశ్యమైనవాటిలో విశ్వాసం

11, 12. (ఎ) సంఘంలోని కొందరు తమ అత్యవసర భావాన్ని ఎందుకు కోల్పోవచ్చు? (బి)తన జీవితాన్ని దేవుని వాగ్దానాల చుట్టూ పరిభ్రమించేలా నిర్మించుకోవడంలో అబ్రాహాము ఎలా ఒక మంచి మాదిరినుంచాడు?

11 ప్రస్తుత దుష్ట విధానాంతం ఆలస్యమవుతున్నట్లు కనిపించడం కూడా ఒక శోధనే కావచ్చు. 2 పేతురు 3:⁠12 ప్రకారం, క్రైస్తవులు “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు” ఉండాలి. అనేకులు ఆ‘దినం’ కోసం సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఎదురుచూస్తూ వచ్చారు. అందువల్ల, వారిలో కొందరు నిరుత్సాహం చెందవచ్చు, లేదా అత్యవసర భావాన్ని కోల్పోతుండవచ్చు.

12 మరొకసారి అబ్రాహాము మాదిరిని చూద్దాం. ఆయన తన జీవితమంతటినీ దేవుని వాగ్దానాల మీద తనకున్న విశ్వాసం చుట్టూ పరిభ్రమించేలా నిర్మించుకున్నాడు, తన జీవిత కాలంలోనే ఆవాగ్దానాలన్నీ నెరవేరే అవకాశం ఏ మాత్రం లేకపోయినప్పటికీ అలా చేశాడు. నిజమే ఆయన తన కుమారుడు ఇస్సాకు పెరిగి పెద్దవడం చూడగలిగేంత కాలం జీవించాడు. కానీ అబ్రాహాము సంతానం, “ఆకాశ నక్షత్రముల”తోను లేదా “సముద్రతీరమందలి యిసుక”తోను పోల్చగలిగేందుకు కొన్ని శతాబ్దాలు పడుతుంది. (ఆదికాండము 22:​17) అయినప్పటికీ, అబ్రాహాము దాని గురించి ప్రతికూలంగా ఆలోచించలేదు, నిరుత్సాహపడనూ లేదు. కనుకనే అపొస్తలుడైన పౌలు, అబ్రాహామును గురించి, ఇతర పితరుల గురించి చెబుతూ, “వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమిమీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి” అని వ్రాశాడు.​—⁠హెబ్రీయులు 11:⁠13.

13. (ఎ) నేడు క్రైస్తవులు ఎలా “యాత్రికులు”గా ఉన్నారు? (బి)యెహోవా ఈవిధానానికి అంతాన్నెందుకు తెస్తాడు?

13 ఆ కాలంలో ఆ వాగ్దానాల నెరవేర్పు “దూరము”లో ఉన్నప్పటికీ తన జీవితం వాటి చుట్టూ పరిభ్రమించేలా అబ్రాహాము చేసుకున్నట్లయితే, వాటి నెరవేర్పు ఎంతో సమీపించిన ఈకాలంలో మనం ఇంకా ఎంత ఎక్కువగా అలా చేసుకోవాలి! సొంత కార్యాల్లో మాత్రమే శ్రద్ధ చూపే జీవిత విధానంలో స్థిరపడిపోక అబ్రాహాములా, మనం కూడా సాతాను విధానంలో మనలను మనం ‘యాత్రికులుగా’ తప్పక దృష్టించాలి. “అంతము” సమీపించడమే కాదు వచ్చేయాలని కూడా మనం సహజంగా కోరుకుంటాం. (1 పేతురు 4:⁠7) బహుశా మనం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండవచ్చు. లేదా తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్ళతో కృంగిపోతుండవచ్చు. అయితే, యెహోవా అంతం తెచ్చేది తన నామాన్ని పరిశుద్ధపరచుకునేందుకని, కేవలం మనలను దుఃఖకరమైన పరిస్థితుల నుండి కాపాడడానికే కాదని మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. (యెహెజ్కేలు 36:​23; మత్తయి 6:​9,10) అంతం వస్తుంది, అయితే మనకు సౌకర్యంగా ఉండే సమయంలో కాదు, కానీ యెహోవా సంకల్పాలు పూర్తిగా నెరవేరగల సమయంలో వస్తుంది.

14. దేవుని దీర్ఘశాంతము నేడు క్రైస్తవులకు ఎలా ప్రయోజనకరంగా ఉంది?

14 “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు” అని కూడా గుర్తుంచుకోండి. (2 పేతురు 3:⁠9) క్రైస్తవ సంఘ సభ్యులారా దేవుడు “మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు” అని గుర్తుంచుకోండి. (ఇటాలిక్కులు మావి.) “ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు” మార్పులను సవరింపులను చేసుకోవడానికి మనలో కొందరికి ఎక్కువ సమయం పడుతుందన్నది స్పష్టం. (2 పేతురు 3:​14) దేవుడు మన యెడల అలా దీర్ఘశాంతము చూపిస్తున్నందుకు మనం కృతజ్ఞులముగా ఉండవద్దా?

అవాంతరాలున్నప్పటికీ ఆనందాన్ని కనుగొనడం

15. శోధనల మధ్యన కూడా యేసు ఆనందాన్ని ఎలా కాపాడుకున్నాడు, నేడు ఆయనను అనుకరించడం వల్ల క్రైస్తవులు ఎలా ప్రయోజనం పొందగలరు?

15 అబ్రాహాము జీవితం నేటి క్రైస్తవులకు అనేక పాఠాలను నేర్పిస్తుంది. ఆయన విశ్వాసాన్ని మాత్రమే కాక, ఓర్పును, సూక్ష్మబుద్ధిని, ధైర్యాన్ని, నిస్వార్థ ప్రేమను చూపించాడు. ఆయన తన జీవితంలో యెహోవా ఆరాధనకే ప్రథమ స్థానాన్నిచ్చాడు. అయితే, మనం అనుకరించడానికి అత్యంత శ్రేష్ఠమైన మాదిరి యేసుక్రీస్తు ఉంచిన మాదిరేనని మనం తప్పక గుర్తుంచుకోవాలి. ఆయన కూడా అనేక శోధనలను పరీక్షలను ఎదుర్కొన్నాడు, వాటన్నింటి మూలంగా ఆయనెన్నడూ ఆనందాన్ని కోల్పోలేదు. ఎందుకని? ఎందుకంటే ఆయన తన మనస్సును ముందున్న నిరీక్షణపై ఉంచాడు. (హెబ్రీయులు 12:​1-3) “క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు [‘క్రీస్తుయేసుకున్న అదే మనోభావము మీకూ ఉండునట్లు,’ NW] ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక” అని పౌలు కోరుకున్నాడు. (రోమీయులు 15:⁠5) సాతాను మన మార్గంలో అవాంతరాలను పెట్టినప్పటికీ, మనకు సరైన మనోభావం ఉంటే ఆనందాన్ని పొందగలం.

16. మన సమస్యలు మనలను ముంచెత్తుతున్నట్లుంటే అప్పుడేమి చేయాలి?

16 సమస్యలు మనలను ముంచెత్తుతున్నట్లు అనిపించినప్పుడు, యెహోవా అబ్రాహామును ప్రేమించినట్లే మిమ్మల్ని కూడ ప్రేమిస్తున్నాడని గుర్తుచేసుకోండి. మీరు సఫలీకృతులవాలని ఆయన కోరుకుంటున్నాడు. (ఫిలిప్పీయులు 1:​3-6) “మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును” అన్న నమ్మకంతో మీరు పూర్తిగా యెహోవా మీదే ఆధారపడండి. (1 కొరింథీయులు 10:​13) ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని చదివే అలవాటును పెంపొందించుకోండి. (కీర్తన 1:⁠2) ఓర్చుకోవడానికి సహాయం చేయమని యెహోవాను కోరుతూ ప్రార్థనలో పట్టుదలగా ఉండండి. (ఫిలిప్పీయులు 4:⁠6) ఆయన “తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు[ను].” (లూకా 11:​13) మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పోషించేందుకు బైబిలు ఆధారిత ప్రచురణలు వంటి యెహోవా చేసిన ఏర్పాట్లను ఉపయోగించుకోండి. అలాగే, సహోదరుల మద్దతును తీసుకోండి. (1 పేతురు 2:​17) క్రైస్తవ కూటాలకు మానక హాజరుకండి, మీరు ఓర్చుకునేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని మీరక్కడ పొందుతారు. (హెబ్రీయులు 10:​24,25) మీఓర్పు దేవుని అనుగ్రహాన్ని పొందేందుకు నడిపిస్తుంది, మీరువిశ్వాసంగా ఉండడం ఆయన హృదయాన్ని ఆనందపరుస్తుంది అన్న నమ్మకాన్ని బట్టి ఆనందించండి!​—⁠సామెతలు 27:11; రోమీయులు 5:​3-5.

17. క్రైస్తవులు నేడు నిరాశలో ఎందుకు మగ్గిపోరు?

17 దేవుడు అబ్రాహామును తన ‘స్నేహితుడిగా’ ప్రేమించాడు. (యాకోబు 2:​23) అయినప్పటికీ, అబ్రాహాముకు జీవితంలో ఒత్తిళ్ళతో కూడిన శోధనలు శ్రమలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉండేవి. కీడుతో నిండివున్న ఈ“అంత్యదినముల”లో శ్రమలు అంతకన్నా తక్కువగా ఉంటాయని క్రైస్తవులు ఎదురుచూడలేరు. “దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు” అని బైబిలు హెచ్చరిస్తోంది. (2 తిమోతి 3:​1,13) నిరాశలో మగ్గిపోయే బదులు, మనకు నేడు ఎదురవుతున్న ఒత్తిడులు ఈసాతాను దుష్ట విధానానికి అంతం సమీపించిందని సూచిస్తున్నాయని గ్రహించండి. “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును” అని యేసు మనకు గుర్తు చేస్తున్నాడు. (మత్తయి 24:​13) కనుక, ‘మేలు చేయడంలో పట్టు విడువకండి!’ అబ్రాహామును అనుకరించి, “విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను”వారిలో ఒకరై ఉండండి.​—⁠హెబ్రీయులు 6:​11,12.

మీరు గమనించారా?

• నేడు యెహోవా ప్రజలు పరీక్షలను శ్రమలను ఎందుకు ఎదురుచూడవచ్చు?

• సాతాను ఏ విధాల్లో సూటైన దాడులను ఉపయోగిస్తున్నాడు?

• క్రైస్తవుల మధ్య వ్యక్తిగత ఘర్షణలు తలెత్తితే వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చు?

• అహంకారమూ, వృథాతిశయమూ శోధనలను ఎలా సృష్టించగలవు?

• దేవుని వాగ్దానాల నెరవేర్పుకోసం వేచివుండడంలో అబ్రాహాము ఏ విధంగా మంచి మాదిరినుంచాడు?

[అధ్యయన ప్రశ్నలు]

[26వ పేజీలోని చిత్రం]

చాలా మంది యౌవన క్రైస్తవులు హింసించబడుతున్నారు, తోటివాళ్ళ పరిహాసపు మాటలకు గురవుతున్నారు

[29వ పేజీలోని చిత్రం]

అబ్రాహాము కాలంలో దేవుని వాగ్దానాల నెరవేర్పు చాలా “దూరము”లో ఉంది, అయినప్పటికీ ఆయన తన జీవితాన్ని వాటి చుట్టూ నిర్మించుకున్నాడు