కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విశ్వాసానికి ఒక మాదిరి—అబ్రాహాము

విశ్వాసానికి ఒక మాదిరి—అబ్రాహాము

విశ్వాసానికి ఒక మాదిరి​—⁠అబ్రాహాము

“నమ్మినవారికందరికి [అబ్రాహాము] తండ్రి.”​—⁠రోమీయులు 4:⁠11.

1, 2. (ఎ) నేడు నిజ క్రైస్తవులు అబ్రాహామును దేనిని బట్టి గుర్తుచేసుకుంటారు? (బి)“నమ్మినవారికందరికి [అబ్రాహాము] తండ్రి” అని ఎందుకు పిలువబడుతున్నాడు?

ఆయన శక్తిమంతమైన ఒక జనాంగపు పితరుడు, ప్రవక్త, వ్యాపారి, నేత. కానీ, నేడు క్రైస్తవులు ఆయనను గుర్తుచేసుకునేది యెహోవా దేవుడు ఆయనను తన స్నేహితునిగా దృష్టించేలా చేసిన ఆయన సద్గుణాన్ని బట్టే, ఆయనకున్న అచంచల విశ్వాసాన్ని బట్టే. (యెషయా 41:8; యాకోబు 2:​23) ఆయన పేరు అబ్రాహాము, “నమ్మినవారికందరికి అతడు తండ్రి” అని బైబిలు ఆయనను పిలుస్తోంది.​—⁠రోమీయులు 4:11.

2అబ్రాహాముకు ముందు, హేబెలు, హనోకు, నోవహు వంటి పురుషులు విశ్వాసాన్ని చూపించలేదా? అవును చూపించారు. కానీ, భూమి మీద ఉన్న సమస్త జనములను ఆశీర్వదిస్తానని ప్రమాణము చేయబడింది అబ్రాహాముతోనే. (ఆదికాండము 22:18) ఆవిధంగా వాగ్దత్త సంతానం మీద విశ్వాసముంచే వారందరికీ ఆయన ఆలంకారిక తండ్రి అయ్యాడు. (గలతీయులు 3:8,9) అబ్రాహాము విశ్వాసము మనం అనుకరించదగిన మాదిరిగా ఉంది కనుక, ఒక విధంగా, మనమాయనను మన తండ్రిగా ఎంచవచ్చు. ఆయన జీవితం అనేకానేక పరీక్షలతోను శోధనలతోను నిండివుంది కనుక, ఆయన జీవితమంతటినీ విశ్వాస వ్యక్తీకరణగా దృష్టించవచ్చు. నిజానికి, అత్యంత పెద్ద విశ్వాస పరీక్షగా పిలువబడుతున్న పరీక్ష పెట్టబడక ముందు, అంటే ఆయన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని ఆయనకు ఆజ్ఞాపించబడడానికి ఎంతో కాలం ముందు, దానికన్నా చిన్నవైన అనేక పరీక్షల్లో ఆయన తన విశ్వాసాన్ని నిరూపించుకున్నాడు. (ఆదికాండము 22:1,2) ఆయనకు పెట్టబడిన తొలి విశ్వాస పరీక్షల్లో కొన్నింటిని పరిశీలించి, అవి నేడు మనకు ఏ పాఠాలను నేర్పించగలవో చూద్దాం.

ఊరును వదిలిపెట్టమన్న ఆజ్ఞ

3బైబిలు, మనకు అబ్రామును (తర్వాత ఆయనే అబ్రాహాము అని పిలువబడ్డాడు) పరిచయం చేస్తూ “తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను” అని ఆదికాండము 11:26లో చెబుతోంది. అబ్రాము దైవభయంగల షేము వంశమువాడు. (ఆదికాండము 11:10-24) ఆదికాండము 11:31 చెబుతున్న దాని ప్రకారం, అబ్రాము “కల్దీయుల ఊరను పట్టణములో” తన కుటుంబంతో పాటు నివసించేవాడు. ఆపట్టణము సుసంపన్నమైనది, అది ఒకప్పుడు యూఫ్రటీసు నదికి తూర్పున ఉండేది. * ఆయన ఊరూరు తిరిగి గుడారాల్లో జీవించేవాడిగా కాక, ఎంతో విలాసవంతంగా జీవించగల పట్టణవాసిగా పెరిగాడని దీన్ని బట్టి అర్థమవుతుంది. విదేశాల నుండి దిగుమతి చేయబడిన వస్తువులు ఊరులోని బజారులో లభించేవి. అక్కడి వీధులకిరువైపులా తెల్లగా సున్నం కొట్టిన ఇళ్ళు వరుసగా ఉండేవి. ప్రతి ఇంట్లోను 14 గదులుండేవి, లోపలే నీటి సరఫరాలు మరితర సదుపాయాలు ఉండేవి.

4. (ఎ) సత్య దేవుని ఆరాధకులకు ఊరు ఏ సవాళ్ళనుంచింది? (బి)అబ్రాము యెహోవా మీద ఎలా విశ్వాసముంచగలిగాడు?

4 ఊరను పట్టణంలో భౌతికంగా ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ, ఆపట్టణం సత్య దేవుణ్ణి ఆరాధించాలనుకున్నవారికి గంభీరమైన సవాలునుంచింది. అది విగ్రహారాధనలోను మూఢ నమ్మకాల్లోను కూరుకుపోయిన నగరం. నిజానికి, నన్నా అనే చంద్ర దేవుణ్ణి ఘనపరచే ఆలయం ఆప్రాంతమంతటిలో కొట్టొచ్చినట్లు కనిపించేది. ఆభ్రష్టారాధనలో భాగం వహించేందుకు అబ్రాము చాలా ఒత్తిడికి గురై ఉంటాడు, బహుశా ఆయన బంధువుల ఒత్తిడికి కూడా గురై ఉంటాడనడంలో సందేహం లేదు. కొన్ని యూదుల గ్రంథములు చెబుతున్నట్లు, అబ్రాము తండ్రి తెరహు కూడా విగ్రహములను చేసేవాడు. (యెహోషువ 24:2,14,15) ఏది ఏమైనప్పటికీ, అబ్రాము మాత్రం దిగజారిన ఆఆరాధనను చేసేవాడు కాదు. అబ్రాము యొక్క వృద్ధ పితరుడు షేము అప్పటికీ సజీవంగానే ఉన్నాడు. ఆయన సత్య దేవుని గురించి తనకున్న జ్ఞానాన్ని అబ్రాముతో పంచుకొని ఉంటాడనడంలో సందేహం లేదు. తత్ఫలితంగా, అబ్రాము, నన్నా మీద కాక, యెహోవా మీదే విశ్వాసముంచాడు!—గలతీయులు 3:6.

ఒక విశ్వాస పరీక్ష

5. అబ్రాము ఊరులో ఉన్నప్పుడు, దేవుడు ఆయనకు ఏమని ఆజ్ఞాపించాడు, ఏమి వాగ్దానం చేశాడు?

5 అబ్రాము విశ్వాసము పరీక్షించబడనుంది. దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, “నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువులయొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని” ఆజ్ఞాపించాడు.​—⁠ఆదికాండము 12:1-3; అపొస్తలుల కార్యములు 7:2, 3.

6. అబ్రాము ఊరును వదిలిపెట్టి వెళ్ళేందుకు నిజమైన విశ్వాసమెందుకు అవసరమైంది?

6 అబ్రాము వృద్ధుడు, సంతానం లేనివాడు. ఆయనెలా “గొప్ప జనము”గా చేయబడగలడు? ఆయన ఏ దేశానికి వెళ్ళాలని ఆజ్ఞాపించబడ్డాడు? ఏ దేశానికి వెళ్ళాలో దేవుడాయనకు చెప్పలేదు. కనుక, సంపన్న పట్టణమైన ఊరుని, అక్కడి సౌకర్యాలను అన్నింటినీ విడిచివెళ్ళేందుకు అబ్రాముకు విశ్వాసం అవసరమైంది. కుటుంబం, ప్రేమ, మరియు బైబిల్‌ (ఆంగ్లం) అనే పుస్తకం, ప్రాచీన కాలాల గురించి చెబుతూ, “ఇంటినుండి వెళ్ళగొట్టి, కుటుంబంలో తనకు ‘సభ్యత్వం’ లేకుండా చేయడమే పెద్ద నేరం చేసిన ఒక కుటుంబ సభ్యుడికి విధించే కఠినమైన శిక్ష. ... కనుకనే, దైవిక పిలుపుననుసరించి, తన దేశాన్నే కాక, తనవాళ్ళను కూడా వదిలిపెట్టి వెళ్ళడం అబ్రాహాముకున్న ఎదురుచెప్పని విధేయతనూ, దేవుని మీద ఆయనకున్న నమ్మకాన్నీ అసాధారణమైన రీతిలో వెల్లడి చేసింది” అని పేర్కొంది.

7. అబ్రాము ఎదుర్కొన్నటువంటి పరీక్షలను నేడు క్రైస్తవులెలా ఎదుర్కోవచ్చు?

7 నేడు క్రైస్తవులు కూడా అలాంటి పరీక్షలనెదుర్కోవచ్చు. అబ్రాములాగ, మనం కూడా దైవపరిపాలనా విషయాల కన్నా భౌతిక విషయాలకే ప్రాముఖ్యతనివ్వాలని ఒత్తిడి చేయబడుతుండవచ్చు. (1 యోహాను 2:​16) సంఘం నుండి బహిష్కరించబడిన బంధువులతో సహా, అవిశ్వాసులైన కుటుంబ సభ్యుల నుండి మనం వ్యతిరేకతను ఎదుర్కొంటుండవచ్చు. ఆబంధువులు మనం అనారోగ్యకరమైన సహవాసం చేసేలా మనలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తుండవచ్చు. (మత్తయి 10:34-36; 1 కొరింథీయులు 5:​11-13; 15:​33) అబ్రాము మనకు మంచి మాదిరినుంచాడు. ఆయన అన్నింటికన్నా, కుటుంబ అనుబంధాల కన్నా కూడా యెహోవాతో స్నేహానికే ప్రథమ స్థానమిచ్చాడు. దేవుని వాగ్దానాలు ఎలా, ఎప్పుడు, లేదా ఎక్కడ నెరవేరుతాయన్నది ఆయనకు ఖచ్చితంగా తెలియదు. అయినప్పటికీ, ఆవాగ్దానాలనే తన జీవితానికి ఆధారంగా చేసుకొనేందుకు ఆయన సుముఖత చూపించాడు. నేడు మన సొంత జీవితాల్లో రాజ్యాన్ని మొదట ఉంచేందుకు మనకిదెంత చక్కని ప్రోత్సాహంగా ఉంది!​—⁠మత్తయి 6:⁠33.

8. అబ్రాము విశ్వాసం తన కుటుంబ సభ్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది, దీని నుండి క్రైస్తవులు ఏమి నేర్చుకోవచ్చు?

8 అబ్రాము కుటుంబ సభ్యుల విషయమేమిటి? అబ్రాము భార్యయైన శారయి, అనాధ అయిన ఆయన అన్న కుమారుడు లోతు దేవుని పిలుపుకు విధేయులై ఊరును వదిలిపెట్టడానికి కదిలించబడ్డారు కనుక, అబ్రాము విశ్వాసము నమ్మకము వారిపై గొప్ప ప్రభావము చూపాయని రుజువవుతోంది. తర్వాత అబ్రాము సహోదరుడైన నాహోరు, ఆయన పిల్లల్లో కొందరు ఊరును వదిలిపెట్టి, హారానులో నివసించి, అక్కడ యెహోవాను ఆరాధించడం మొదలుపెట్టారు. (ఆదికాండము 24:​1-4, 10,31; 27:​43; 29:​4,5) అంతెందుకు, అబ్రాము తండ్రి తెరహు కూడా తన కుమారునితో పాటు అక్కడి నుండి బయలుదేరడానికి ఒప్పుకున్నాడు! కాబట్టి, కుటుంబసమేతంగా కనానుకు బయలుదేరిన కుటుంబ శిరస్సుగా బైబిలు ఆయనను ఘనపరచింది. (ఆదికాండము 11:​31) మనం మన బంధువులను నొప్పించకుండా వారికి నెమ్మదిగా సాక్ష్యమివ్వడం ద్వారా మనం కూడా కొంత మేరకు విజయాన్ని సాధించవచ్చునేమో?

9. అబ్రాము తన ప్రయాణం కోసం ఏయే సిద్ధపాట్లు చేసుకోవలసి ఉండింది, అందులో త్యాగం ఎందుకు ఇమిడి ఉండవచ్చు?

9 అబ్రాము తన ప్రయాణాన్ని మొదలుపెట్టకముందు, చాలా పనులు చేసుకోవలసి ఉంది. ఆయన తన ఆస్తిని, వస్తువులను అమ్ముకోవాలి, గుడారాలను, ఒంటెలను, ఆహార పదార్థాలను, అవసరమైన పరికరాలను కొనుక్కోవాలి. అలా హడావుడిగా సిద్ధపడడంవల్ల ఆయన ఆర్థికంగా కొంత నష్టపోయుండవచ్చు. కానీ ఆయన యెహోవాకు విధేయత చూపించడంలో ఆనందించాడు. సిద్ధపాట్లన్ని ముగిసి, ఊరు పట్టణ ప్రాకారముల అవతల తమ ఒంటెలు ప్రయాణానికి సిద్ధమై నిలబడి ఉన్న ఆరోజు ఎంత గుర్తుంచుకోదగినదిగా ఉండి ఉండవచ్చు! యూఫ్రటీసు నది వంపు వెంబడి, ఆఒంటెలు వాయవ్యదిశగా ప్రయాణించాయి. కొన్ని వారాలపాటు దాదాపు 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత, అవి మెసపొతేమియకు ఉత్తరాన ఉన్న హారాను అనే పట్టణానికి చేరుకున్నాయి. అది ఒంటెలు ఆగే ముఖ్య స్థలం.

10, 11. (ఎ) అబ్రాము కొంతకాలం హారానులోనే ఎందుకు ఉండిపోయి ఉంటాడు? (బి)వృద్ధులైన తమ తల్లిదండ్రులను చూసుకునే క్రైస్తవులకు ఏ ప్రోత్సాహాన్నివ్వవచ్చు?

10 అబ్రాము హారానులో నివాసమేర్పరచుకున్నాడు. ఆయనక్కడ నివాసమేర్పరచుకున్నది బహుశా తన వృద్ధ తండ్రి తెరహు గురించే కావచ్చు. (లేవీయకాండము 19:​32) నేడు అనేక మంది క్రైస్తవులకు కూడా వృద్ధులైన లేదా రోగులైన తమ తల్లిదండ్రులను చూసుకునే ఆధిక్యత ఉంది, కొందరు అలా చూసుకునేందుకు కొన్ని సర్దుబాట్లు కూడా చేసుకోవలసిన అవసరముంది. అది అవసరమైనప్పుడు, అలాంటివారు, తాము ప్రేమపూర్వకంగా చేసే త్యాగాలు “దేవుని దృష్టికనుకూలమైయున్న”వన్న దృఢనమ్మకం కలిగివుండగలరు.​—⁠1 తిమోతి 5:⁠4.

11 కాలం అలా గడిచింది. “తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను.” అబ్రాము తప్పకుండా ఈనష్టానికి ఎంతో దుఃఖపడి ఉంటాడు, కానీ విలాప కాలం పూర్తయిన వెంటనే ఆయన మళ్ళీ బయల్దేరాడు. “అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు. అబ్రాము తన భార్యయయిన శారయిని తన సహోదరుని కుమారుడయిన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైనవారిని తీసికొని కనానను దేశమునకు వెళ్లుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి.”​—⁠ఆదికాండము 11:⁠32; 12:​4,5.

12. అబ్రాము హారానులో ఉన్నప్పుడు ఏమి చేశాడు?

12 అబ్రాము హారానులో ఉన్నప్పుడు ‘ఆస్తిని సంపాదించాడు’ అన్నది ఆసక్తికరమైన విషయం. ఆయన ఊరును వదిలిపెట్టడానికి వస్తుపరమైన త్యాగం చేయాల్సివచ్చినప్పటికీ, ఆయన హారానునుండి బయలుదేరే సమయానికి ధనికుడయ్యాడు. దానికి కారణం దేవుని ఆశీర్వాదమేనన్నది స్పష్టం. (ప్రసంగి 5:​19) నేడు తన ప్రజలకందరికీ దేవుడు సిరిసంపదలను వాగ్దానం చేయకపోయినప్పటికీ, రాజ్యము నిమిత్తము ‘ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను విడిచిపెట్టిన’ వారి అవసరాలను తీరుస్తానని తాను చేసిన వాగ్దానాన్ని నమ్మకంగా నెరవేరుస్తాడు. (మార్కు 10:​29,30) అబ్రాము అనేక మంది సేవకులను కూడా ‘సంపాదించాడు.’ అబ్రాము వారిని ‘తన మత విశ్వాసానికి మార్చుకున్నాడు’ అన్న తాత్పర్యాన్ని జెరూసలేమ్‌ టార్గమ్‌, కల్దీ పారాఫ్రేజ్‌లు చెప్పాయి. (ఆదికాండము 18:​19) మీవిశ్వాసం, మీరు మీపొరుగువారితోను, మీతో పాటు పనిచేస్తున్నవారితోను లేదా తోటి విద్యార్థులతోను దాని గురించి మాట్లాడేందుకు మిమ్మల్ని కదిలిస్తోందా? అబ్రాము హారానులో నివాసమేర్పరచుకొని, దేవుని ఆజ్ఞను మరచిపోయే బదులు, అక్కడ తాను గడిపిన సమయాన్ని ఫలవంతంగా ఉపయోగించుకున్నాడు. కానీ ఇప్పుడు అక్కడ నుండి బయలుదేరాల్సిన సమయం వచ్చింది. “యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్లెను.”​—⁠ఆదికాండము 12:⁠4.

యూఫ్రటీసు నది మీదుగా

13. అబ్రాము యూఫ్రటీసు నదిని ఎప్పుడు దాటాడు, ఆచర్యకున్న ప్రాముఖ్యత ఏమిటి?

13 అబ్రాము మరోసారి ప్రయాణించవలసి వచ్చింది. ఆయన ఒంటెలు హారాను నుండి బయలుదేరి, పశ్చిమదిశగా దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించాయి. యూఫ్రటీసు నదికి అవతలివైపు ప్రాచీన వర్తక కేంద్రమైన కర్కెమీషు ఉంది, నదికి ఇవతలవైపు అబ్రాము ప్రయాణం ఆపి ఉండవచ్చు. ఒంటెలు ఆనదిని దాటేందుకు ఆగే ప్రముఖ స్థలం అదే. * అబ్రాము బృందం ఆనదిని ఏ తేదీన దాటింది? ఇది, సా.శ.పూ. 1513, నీసాను 14న ఐగుప్తు నుండి యూదులు నిర్గమించడానికి 430 సంవత్సరాల ముందు దాటిందని బైబిలు సూచిస్తోంది. “ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగిన దేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములో నుండి బయలుదేరిపోయెను” అని నిర్గమకాండము 12:⁠41 చెబుతోంది. (ఇటాలిక్కులు మావి.) అంటే, అబ్రాముతో దేవుడు చేసిన నిబంధన, సా.శ.పూ. 1943, నీసాను 14న అబ్రాము విధేయతాపూర్వకంగా యూఫ్రటీస్‌ నదిని దాటినప్పుడు అమలులోకి వచ్చిందని రుజువవుతోంది.

14. (ఎ) అబ్రాము తన మనో నేత్రాలతో ఏమి చూడగలిగాడు? (బి)నేడు దేవుని ప్రజలు అబ్రాము కన్నా ఎక్కువగా ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు?

14 అబ్రాము సంపన్న పట్టణాన్ని విడిచిపెట్టాడు. అయితే, ఆయన ఇప్పుడు ‘పునాదులుగల నిజమైన పట్టణము’ను అంటే మానవజాతిపై నీతిమంతమైన ప్రభుత్వాన్ని ఊహించుకోగలిగాడు. (హెబ్రీయులు 11:​10) అవును, చనిపోయే మానవజాతిని విడిపించాలన్న దేవుని సంకల్పానికి సంబంధించిన ఏర్పాటును తనకు తెలిసిన కొద్దిపాటి సమాచారంతో గ్రహించనారంభించాడు. దేవుని సంకల్పాన్ని గురించి అబ్రాముకు తెలిసిన దానికన్నా ఎంతో విస్తృతమైన గ్రహింపుతో నేడు మనం ఆశీర్వదించబడ్డాము. (సామెతలు 4:​18) అబ్రాము ఎదురుచూసిన ఆ‘పట్టణము’ లేదా రాజ్య ప్రభుత్వము నేడు నిజమైంది. అది పరలోకంలో 1914 మొదలుకొని సుస్థాపితంగా ఉంది. కనుక, మనం కూడా విశ్వాస క్రియలను చేసేందుకూ, యెహోవా మీద నమ్మకముంచేందుకు పురికొల్పబడవద్దా?

వాగ్దాన దేశంలో తాత్కాలిక నివాసం మొదలవుతుంది

15, 16. (ఎ) యెహోవాకు బలిపీఠాన్ని కట్టాలంటే అబ్రాముకు ధైర్యమెందుకు అవసరమైంది? (బి)నేడు క్రైస్తవులు అబ్రాములా ఎలా ధైర్యంగా ఉండగలరు?

15 వారు “కనానను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక స్థలముదాక ఆ దేశ సంచారముచేసి మోరేదగ్గరనున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను” అని ఆదికాండము 12:5, 6 వచనాలు చెబుతున్నాయి. షెకెము యెరూషలేముకు ఉత్తరంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అది ఫలవంతమైన లోయలో ఉండేది. అది “పవిత్ర భూమిలోని పరదైసు” అని వర్ణించబడుతుంది. అయితే “అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి.” కనానీయులు నైతికంగా చాలా చెడ్డవారు కనుక, అబ్రాము తన కుటుంబాన్ని వారి చెడ్డ ప్రభావం నుండి కాపాడేందుకు చాలా కష్టపడి ఉండవచ్చు.​—⁠నిర్గమకాండము 34:11-16.

16 రెండవసారి, ‘యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై​—⁠నీ సంతానానికి ఈ దేశాన్నిస్తాను’ అని చెప్పాడు. అప్పుడు ఆయనెంత పులకించి పోయుంటాడు! నిజమే, కేవలం తన భావి సంతానం మాత్రమే అనుభవించగలదాని విషయమై ఆనందించేందుకు అబ్రాముకు విశ్వాసం అవసరమైంది. అయినప్పటికీ, దానికి ప్రతిస్పందనగా అబ్రాము “తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.” (ఆదికాండము 12:⁠7) “ఒక దేశంలో బలిపీఠాన్ని కట్టడమంటే వాస్తవానికి, తన విశ్వాసాన్ని ఆచరించేందుకు సంపాదించుకొన్న హక్కు ఆధారంగా ఒక రకంగా ఆభూమిని అధీనం చేసుకోవడం” అని ఒక బైబిలు పండితుడు సూచిస్తున్నాడు. అలాంటి బలిపీఠాన్ని నిర్మించడమన్నది ధైర్యసమేతమైన ఒక చర్య కూడా. ఆయన బలిపీఠాన్ని సహజమైన (తొలుచని) రాళ్ళతో కట్టాడు. నిస్సందేహంగా, ఆబలిపీఠం తర్వాతి కాలంలో ధర్మశాస్త్ర నిబంధనలో నిర్దిష్టంగా తెలియజేయబడినటువంటిదే. (నిర్గమకాండము 20:​24,25) అది కనానీయులు ఉపయోగించే బలిపీఠానికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ఆవిధంగా చేస్తే, తాను దుర్మార్గుల దృష్టిలో పడి, ప్రమాదానికి గురయ్యే అవకాశమున్నా కూడా అబ్రాము సత్య దేవుడైన యెహోవా ఆరాధకునిగా బహిరంగంగా తన స్థానాన్ని ధైర్యంగా వెల్లడి చేసుకున్నాడు. నేడు మన విషయం ఏమిటి? మనం యెహోవాను ఆరాధిస్తున్నామని మన పొరుగువారికి తోటివిద్యార్థులకు తెలియజేయడానికి మనలో కొందరు, ముఖ్యంగా యౌవనస్థులు వెనుకంజవేస్తున్నారా? అబ్రాము యొక్క ధైర్యసమేతమైన మాదిరి, మనం యెహోవా సేవకులుగా ఉన్నందుకు గర్వించడానికి మనల్నందరినీ ప్రోత్సహించును గాక!

17. అబ్రాము దేవుని నామాన్ని ప్రకటించేవాడని ఎలా నిరూపించుకున్నాడు, అది నేడు క్రైస్తవులకు దేన్ని గుర్తుచేస్తోంది?

17 అబ్రాము ఎక్కడికి వెళ్ళినప్పటికీ, యెహోవా ఆరాధనకే ప్రాముఖ్యతనిచ్చాడు. తర్వాత “అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను.” (ఆదికాండము 12:⁠8) “నామమున ప్రార్థన చేసెను” అన్న హీబ్రూ మాటలకు “ఆ నామాన్ని ప్రకటించు” అనే అర్థం కూడా ఉంది. అబ్రాము యెహోవా నామాన్ని కనానీయులైన తన పొరుగువారికి ధైర్యంగా ప్రకటించాడనడంలో సందేహం లేదు. (ఆదికాండము 14:​22-24) ఇది, నేడు మనం ‘ఆయన నామాన్ని బహిరంగంగా ప్రకటించడంలో’ సాధ్యమైనంత ఎక్కువగా భాగం కలిగివుండవలసిన మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తోంది.​—⁠హెబ్రీయులు 13:​15, NW; రోమీయులు 10:⁠10.

18. కనాను నివాసులతో అబ్రాముకు ఎలాంటి సంబంధముండేది?

18 అబ్రాము ఆప్రాంతాల్లో దేనిలోనూ మరీ దీర్ఘకాలమేమీ నివసించలేదు. “ఆ తర్వాత అబ్రాము మరల ప్రయాణం మొదలు పెట్టాడు. నెగెబు దిశగా అతడు ప్రయాణం చేసాడు.” (ఆదికాండము 12:​9, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) నెగెబు అన్నది యూదా పర్వతప్రాంతాలకు దక్షిణాన ఉన్న పైరుపచ్చలు అంతగా లేని ప్రాంతం. అబ్రాము, ఆయన ఇంటివారు ఒక చోట నుండి మరో చోటికి బయలుదేరుతూ, ప్రతి క్రొత్త ప్రాంతంలోను, తాము యెహోవా ఆరాధకులమని తెలియజేసుకుంటూ, ‘తాము భూమిమీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొన్నారు [“బహిరంగంగా ప్రకటించారు,” NW].’ (హెబ్రీయులు 11:​13) అదే సమయంలో వారు, అన్యమతస్థులైన పొరుగువారితో మరీ అమితంగా సన్నిహితులవ్వకుండా జాగ్రత్తపడ్డారు. నేడు క్రైస్తవులు కూడా, ‘లోకసంబంధులు కాకుండా’ ఉండడం తప్పనిసరి. (యోహాను 17:​16) మన పొరుగువారితోను మనతో కలిసి పనిచేస్తున్నవారితోను దయగాను, మర్యాదపూర్వకంగాను నడుచుకుంటున్నప్పటికీ, దేవుని నుండి దూరమైన ఈలోకపు స్ఫూర్తిని ప్రతిఫలించే వైఖరి మన ప్రవర్తనలో చోటుచేసుకోకుండా మనం జాగ్రత్తపడుతాము.​—⁠ఎఫెసీయులు 2:2, 3.

19. (ఎ) సంచార జీవితం అబ్రాము శారయిలకు ఎందుకు సవాళ్ళను ముందుంచుతుంది? (బి)అబ్రాముకు త్వరలోనే ఇంకా ఏయే సవాళ్ళు రాబోతున్నాయి?

19 సంచార జీవితంలోని కఠిన పరిస్థితులకు సర్దుకోవడం అబ్రాముకుగానీ శారయికిగానీ సులభమై ఉండదన్న విషయం మనం మరచిపోవద్దు. ఊరనే పట్టణంలో, కావలసినవన్ని లభ్యమయ్యే అక్కడి బజారులో ఆహార పదార్థాలను కొనుక్కొని తినే బదులు ఆహారం కోసం తమ పశువుల మందల మీదే ఆధారపడ్డారు; మంచి ఇళ్లలో ఉండే బదులు వాళ్ళు గుడారాల్లో నివసించారు. (హెబ్రీయులు 11:9) అబ్రాముకు పని ఒత్తిడి రోజూ ఉండేది; ఆయన తన మందలను సేవకులను చూడడంలో చాలా పనులు చేయవలసి వచ్చేది. శారయి నిస్సందేహంగా, అప్పటి సంస్కృతిలోని స్త్రీలు పారంపర్యంగా చేసే పిండి పిసకడం, రొట్టెలు చేయడం, ఉన్ని వడకడం, బట్టలు కుట్టడం వంటి పనులను చేసేది. (ఆదికాండము 18:6, 7; 2 రాజులు 23:7; సామెతలు 31:19; యెహెజ్కేలు 13:​18) అయినప్పటికీ, క్రొత్త పరీక్షలు ఇంకా రాబోతున్నాయి. అబ్రాము, ఆయన ఇంటివారు త్వరలోనే ఒక పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు, ఆపరిస్థితి వారి ప్రాణాలనే ప్రమాదంలో పడవేస్తుంది! అబ్రాము విశ్వాసం, ఆసవాలును ఎదుర్కోగలిగేంత బలంగా ఉందా?

[అధస్సూచీలు]

^ పేరా 6 మునుపు ఊరున్న స్థలానికి తూర్పున 16 కిలోమీటర్ల దూరంలో యూఫ్రటీస్‌ నది ఇప్పుడు ప్రవహిస్తున్నప్పటికీ, ప్రాచీన కాలాల్లో, ఈనది ఈపట్టణానికి పశ్చిమాన ప్రవహించేదని రుజువులు సూచిస్తున్నాయి. కాబట్టే, అబ్రాము “[యూఫ్రటీసు] నది అద్దరినుండి” వచ్చినవాడని తర్వాత పేర్కొనగలిగారు.​—⁠యెహోషువ 24:⁠3.

^ పేరా 13 శతాబ్దాల తర్వాత, అష్షూరు రాజైన అషర్‌నసిర్‌పాల్‌II కర్కెమీషు దగ్గర నుండి యూఫ్రటీసు నదిని దాటేందుకు బల్లకట్లను ఉపయోగించాడు. అబ్రాము కూడ అలాగే చేశాడా లేక తన ఒంటెలను నది గుండా నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడా అన్నది బైబిలు చెప్పడం లేదు.

మీరు గమనించారా?

• “నమ్మినవారికందరికి [అబ్రాహాము] తండ్రి” అని ఎందుకు పిలువబడ్డాడు?

• కల్దీయుల ఊరనే పట్టణాన్ని వదిలిపెట్టేందుకు అబ్రాముకు విశ్వాసమెందుకు అవసరమైంది?

• తాను యెహోవా ఆరాధనకే ప్రథమ స్థానాన్ని ఇచ్చాడని అబ్రాము ఎలా చూపించాడు?

[అధ్యయన ప్రశ్నలు]

3. అబ్రాము పెరిగిన నేపథ్యాన్ని గురించి బైబిలు ఏమని చెబుతోంది?

[16వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

అబ్రాము ప్రయాణం

ఊరు

హారాను

కర్కెమీషు

కనాను

మహా సముద్రం

[చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel వారి మ్యాప్‌ ఆధారంగా తీసుకున్నది

[15వ పేజీలోని చిత్రం]

ఊరులోని జీవిత సౌకర్యాలను వదిలివెళ్ళేందుకు అబ్రాముకు విశ్వాసం అవసరమైంది

[18వ పేజీలోని చిత్రం]

గుడారాల్లో నివసిస్తూ, అబ్రాము ఆయన ఇంటివారూ ‘తాము పరదేశులమును యాత్రికులమునై యున్నామని బహిరంగంగా ప్రకటించారు’