కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వెలుగు నగరంలో ప్రకాశిస్తున్న జ్యోతులు

వెలుగు నగరంలో ప్రకాశిస్తున్న జ్యోతులు

వెలుగు నగరంలో ప్రకాశిస్తున్న జ్యోతులు

ఫ్లుక్టుఆట్‌ నెక్‌ మెర్గీటుర్‌, అంటే “దానిపై అలలు బలంగా లేచినా మునిగిపోదు” అన్నది పారిస్‌ నగర ముఖవాక్యం.

ఒక ఓడలాగ, గత 2,000 సంవత్సరాలుగా, పారిస్‌ లెక్కలేనన్ని విదేశీ తుపానులను, అంతర్గత తిరుగుబాటులను ధైర్యంగా తాళుకుంటూ వచ్చింది. అది ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత అందమైన నగరాల్లో ఒకటి. ఆడంబరంతోకూడిన భవననిర్మాణ శైలికి, ఇరువైపుల చెట్లు బారులు తీరివున్న రోడ్లకు, లోక ప్రఖ్యాతి గాంచిన మ్యూజియమ్‌లకు అది ప్రశంసలను పొందుతోంది. కొందరు దాన్ని, కవుల, చిత్రకారుల, తత్త్వశాస్త్రవేత్తల నివాసస్థానంగా ఎంచుతారు. మరి కొందరు అక్కడి పాకశాస్త్ర నిపుణుల వంటలను గుర్తు చేసుకొంటారు, అక్కడి స్త్రీల ఫ్యాషన్‌లను మెచ్చుకొంటారు.

చరిత్రాత్మకం  పారిస్‌, క్యాథలిక్‌ మతానికి ముఖ్యస్థానంగా ఉంది. పారిస్‌, రెండు వందల సంవత్సరాల క్రితం, జ్ఞానాగమనం (ఎన్‌లైటెన్‌మెంట్‌) అని పిలువబడిన యూరోపియన్‌ మేధావికాస ఉద్యమంలో వహించిన ముఖ్య పాత్ర మూలంగా, వెలుగు నగరమని పిలువబడుతుంది. నేడు తెలిసో తెలియకనో, పారిస్‌ నివాసుల్లో అధిక సంఖ్యాకులు, మతానికన్నా ఆకాలం నాటి మత తత్త్వశాస్త్రానికే ప్రభావితులవుతున్నారు.

అయినప్పటికీ, మానవుని జ్ఞానము ప్రజల జీవితాలపై ఎదురుచూసినంత వెలుగును ప్రసరించలేదు. నేడు అనేకులు జ్ఞానోదయం కోసం వేరే చోట్లలో వెతుకుతున్నారు. ఇప్పటికి 90 సంవత్సరాలుగా యెహోవాసాక్షులు పారిస్‌లో, “జ్యోతులవలె కనబడుచున్నారు.” (ఫిలిప్పీయులు 2:​16) “అన్యజనులందరియొక్క యిష్టవస్తువుల”ను ఎక్కించుకొనేందుకు నిపుణులైన నావికుల్లా, వారు మారుతున్న ప్రవాహాలకు, లేదా సంఘటనలకు తగినట్లుగా సర్దుబాట్లు చేసుకొంటూ ఉండాలి.​—⁠హగ్గయి 2:⁠7.

సవాలుగా ఉన్న నగరం

వెనుకటికి 1850 లో, పారిస్‌ నగరంలో 6,00,000 మంది నివాసులు ఉండేవారు. నేడు దాని జనాభా, నగర శివార్లతో సహా 90 లక్షల కన్నా ఎక్కువగా ఉంది. జనాభా అంతగా పెరగడంతో, ఆనగరం ఫ్రాన్స్‌లోని అత్యంత వైవిధ్యంగల నగరంగా మారింది. అది ఉన్నత విద్యలకు ప్రపంచ కేంద్రంగా ఉంది. లోకంలోని అత్యంత పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటి అక్కడ ఉంది. అక్కడ దాదాపు 2,50,000 మంది విద్యార్థులున్నారు. పారిస్‌ యొక్క కొన్ని శివార్లలో ఉన్న ఎంతో ఎత్తైన భవనాలు నేరాలకూ నిరుద్యోగాలకూ మారుపేరుగా ఉండి, పారిస్‌ యొక్క చీకటి కోణానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అన్ని రకాల ప్రజలకు సువార్తను ఆకర్షణీయమైన విధంగా అందజేసేందుకు నిపుణత, సువార్తను తెలిపే విధానాలను పరిస్థితులకు తగ్గట్లు మలుచుకునే సామర్థ్యమూ యెహోవాసాక్షులకు అవసరమనడంలో సందేహం లేదు.​—⁠1 తిమోతి 4:⁠10.

ప్రతి సంవత్సరం రెండు కోట్లకన్నా ఎక్కువ మంది పర్యాటకులు పారిస్‌ని సందర్శిస్తున్నారు. వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ఐఫెల్‌ టవర్‌పైకి ఎక్కుతూ, సీన్‌ నదీ తీరంలో నడుస్తూ, కాఫీ దుకాణాల, రెస్టారెంట్ల కాలిబాటల్లో అటూ ఇటూ తిరుగుతూ, అక్కడి వాతావరణాన్ని ఆనందించవచ్చు.

అయితే, పారిస్‌ నివాసుల దైనందిన జీవితం మాత్రం అవిశ్రాంతంగా ఉంటుండవచ్చు. “ప్రజలు ఎప్పుడూ ఉరుకులు పరుగులు పెడుతూనే ఉంటారు. వాళ్ళు ఇంటికి తిరిగి చేరుకునేసరికి బాగా అలసిపోయివుంటారు” అని పూర్తికాల పరిచారకుడైన ఒక క్రైస్తవుడు అంటున్నాడు. ఎప్పుడూ తొందరలో ఉండే ఈప్రజలతో మాట్లాడడం సులభం కాదు.

అయితే, పారిస్‌లోని యెహోవాసాక్షులకు ఎదురయ్యే పెద్ద సమస్యల్లో ఒకటి, ప్రజలను వాళ్ళ ఇండ్లలో కలవలేకపోవడమే. కొన్ని భవనాల్లో ఇంటర్‌కామ్‌ సదుపాయం ఉంటుంది. నేరాలు పెరుగుతున్నందువల్ల, తరచూ అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లలో ప్రవేశించాలంటే ఎలక్ట్రానిక్‌ కోడ్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది, కనుక ఇంటివారితో మాట్లాడడం అసాధ్యమవుతుంది. ఈకారణం వల్ల కొన్ని ప్రాంతాల్లో, ప్రతి 1,400 మంది వ్యక్తులకు ఒక సాక్షి మాత్రమే ఉన్నాడు. కాబట్టి, ఎక్కువగా టెలిఫోన్‌ సాక్ష్యము, అనియత సాక్ష్యము ఇస్తున్నారు. యెహోవాసాక్షులు ఇతర మార్గాల్లో తమ “వెలుగు ప్రకాశింప”జేయగలుగుతున్నారా?​—⁠మత్తయి 5:⁠16.

అనియత సాక్ష్యమివ్వగల అవకాశాలు, స్థలాలు బోలెడున్నాయి. బస్‌స్టాపులో ఒక స్త్రీ నిరాశగా నిలబడి ఉండడం మార్టీన్‌ చూసింది. ఆమె కూతురు ఈమధ్యనే చనిపోయింది. బైబిలిచ్చే ఓదార్పుకరమైన పునరుత్థాన నిరీక్షణను గురించి చెబుతున్న ఒక బ్రోషూర్‌ని మార్టీన్‌ ఆమెకిచ్చింది. ఆతర్వాత కొన్ని నెలల వరకూ ఆమెను కలవలేదు. మార్టీన్‌కి ఆస్త్రీ మళ్ళీ కనిపించినప్పుడు, ఆమెతో బైబిలు అధ్యయనం మొదలుపెట్టగలిగింది. తన భర్త వ్యతిరేకించినప్పటికీ, ఆమె యెహోవాసాక్షి అయ్యింది.

ఫలభరితమైన అనియత సాక్ష్యం

పారిస్‌లోని ప్రజారవాణా వ్యవస్థ లోకంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యవస్థల్లో ఒకటి. ప్రఖ్యాత భూగర్భ రైల్వే ప్రతిరోజూ 50,00,000 మంది ప్రయాణికులను తీసుకువెళ్తుంది. పారిస్‌లోని సెంట్రల్‌ అండర్‌గ్రౌండ్‌ స్టేషన్‌ షాట్‌లే-లే-అల్‌, లోకంలోని అత్యంత పెద్దదైన రద్దీయైన స్టేషన్‌ అని చెప్పబడుతుంది. అక్కడ ప్రజలను కలిసే అవకాశాలు అనేకం. అదే రైల్వేలో, అలెగ్జాండ్ర, ప్రతిరోజూ ఉద్యోగానికి వెళ్తుంది. ఆమె ఒక రోజు ప్రాణాంతకమైన లుకేమియాతో బాధపడుతున్న ఒక యువకునితో మాట్లాడింది. పరదైసు నిరీక్షణను గురించిన ఒక కరపత్రాన్ని అలెగ్జాండ్ర ఆయనికిచ్చింది. అప్పటి నుండి ఆరువారాలపాటు, అదే సమయంలో, అదే స్థలంలో ప్రతిరోజు వాళ్ళ మధ్య బైబిలు చర్చ జరిగింది. తర్వాత, ఆవ్యక్తి రావడం మానేశాడు. కొన్నాళ్ళ తర్వాత ఆయన భార్య అలెగ్జాండ్రకు ఫోన్‌ చేసి, తన భర్త ఆసుపత్రిలో ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాడనీ, ఆసుపత్రికి రమ్మనీ చెప్పింది. విచారకరంగా అలెగ్జాండ్ర అక్కడికి చేరుకోవడం ఆలస్యమైపోయింది. ఆయన మరణం తర్వాత, ఆయన భార్య ఆగ్నేయ ఫ్రాన్స్‌లో ఉన్న బోర్డేక్స్‌కి వెళ్ళిపోయింది. అక్కడ స్థానిక సాక్షులు ఆమెను సందర్శించారు. ఆవిధవరాలు, తన భర్త పునరుత్థానం పొంది వచ్చినప్పుడు ఆయనను తిరిగి చూడవచ్చన్న నిరీక్షణతో, ఒక సంవత్సరం తర్వాత బాప్తిస్మం తీసుకొని యెహోవా యొక్క క్రైస్తవ సాక్షి అయ్యిందని వినడం అలెగ్జాండ్రకు ఎంత అద్భుతమైన వార్త.​—⁠యోహాను 5:28,29.

పారిస్‌ నుండి మధ్య ఫ్రాన్స్‌లోని లిమోగెస్‌కు ట్రైన్‌లో ప్రయాణిస్తున్న రెనెటాతో పెద్దవయస్కురాలైన ఒక క్రైస్తవురాలు మాట్లాడింది. రెనెటా తన స్వదేశమైన పోలండ్‌లో దైవశాస్త్రాన్ని, హీబ్రూ, గ్రీకు భాషలను ఐదు సంవత్సరాలు అధ్యయనం చేసింది, కాని ఆమె తన విశ్వాసాన్ని కోల్పోయింది. మూడు నెలల క్రితం, ఆమె దేవునికి ప్రార్థన చేసింది. ఆపెద్దవయస్కురాలు చెబుతున్న విషయాల్లో తనకు నిజంగా ఆసక్తి లేకపోయినప్పటికీ, ఆమె ఫోన్‌ చేస్తుందని తను అనుకోకపోయినప్పటికీ, ఆమెకు తన ఫోన్‌ నెంబరు ఇచ్చింది. అయితే, ఆసహోదరి పట్టుదలతో, ఎవరైనా రెనెటాను తప్పకుండా సందర్శించేలా చూసింది. ఒక సాక్షి దంపతులు తనను చూడడానికి వచ్చినప్పుడు, ‘వీళ్ళు నాకేమి నేర్పించబోతున్నారు?’ అని రెనెటా అనుకుంది. అయినా, తనకు సెమినరీ ట్రైనింగ్‌ ఉన్నా, ఆమె బైబిలు సత్యంవైపుకు సవినయంగా ఆకర్షించబడింది. “అది సత్యమని నేను వెంటనే అర్థం చేసుకున్నాను” అని ఆమె చెబుతోంది. ఆమె ఇప్పుడు బైబిలు సందేశాన్ని ఇతరులతో పంచుకోవడంలో సంతోషిస్తుంది.

మీషెల్‌ డ్రైవింగ్‌ క్లాసులకు వెళ్తోంది. ఆమె క్లాసులోని మిగతా విద్యార్థులు వివాహానికి ముందు లైంగిక సంబంధాలు పెట్టుకోవడం గురించి మాట్లాడనారంభించారు. మీషెల్‌ తన అనంగీకారాన్ని తెలిపింది. ఒక వారం తర్వాత, వాళ్ళ డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ సిల్వీ, “నువ్వు యెహోవాసాక్షివా?’ అని అడిగింది. బైబిలుపై ఆధారపడిన మీషెల్‌ దృక్కోణానికి సిల్వీ ముగ్ధురాలైంది. ఒక బైబిలు అధ్యయనం మొదలైంది, ఒక సంవత్సరం తర్వాత సిల్వీ బాప్తిస్మం తీసుకుంది.

పారిస్‌లోని అసంఖ్యాకమైన పార్కులు గార్డెన్‌లు ప్రజలతో మాట్లాడడానికి చక్కని స్థలాలుగా ఉన్నాయి. జోసెట్‌ మధ్యాహ్న భోజన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, పార్కుకు వెళ్ళింది, అక్కడ అలీన్‌ అనే పెద్దవయస్కురాలైన ఒక మహిళ వాకింగ్‌ చేస్తోంది. బైబిలులో కనిపిస్తున్న అద్భుతమైన వాగ్దానాల గురించి జోసెట్‌ ఆమెకు వివరించింది. అప్పుడు, ఒక బైబిలు అధ్యయనం ఏర్పాటు చేయబడింది, త్వరలోనే అలీన్‌ బాప్తిస్మం తీసుకునే స్థాయి వరకు ప్రగతిని సాధించింది. ఇప్పుడు, 74 ఏండ్ల వయస్సులో ఆమె చాలా ఫలవంతమైన క్రమ పయినీరు పరిచారకురాలుగా సేవచేస్తోంది, ఇతరులతో క్రైస్తవ సత్యాన్ని పంచుకునేందుకు ఆమె సంతోషిస్తుంది.

సర్వ దేశాలకు వెలుగు

పారిస్‌లోని సాక్షులు గొప్ప సాంస్కృతిక వైవిధ్యాలను తిలకించడానికి సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. అక్కడి జనాభాలో దాదాపు 20 శాతం మంది విదేశీయులే. అక్కడ దాదాపు 25 వేర్వేరు భాషల క్రైస్తవ సంఘాలు గుంపులు ఉన్నాయి.

ఇక్కడి ప్రత్యేక తరహా సువార్తపని నియామకంలో మంచి ఫలితాలను పొందేందుకు దేన్నైనా సద్వినియోగం చేసుకొనే సామర్థ్యమూ, భావనాశక్తి తోడ్పడతాయి. ఫిలిప్పీన్స్‌ దేశస్థురాలైన ఒక సాక్షి సొంతంగా తనకొక ప్రత్యేక టెరిటరీని సృష్టించుకుంది. షాపింగ్‌ చేసేటప్పుడు, ఆమె దుకాణాల్లో ఫిలిప్పీన్స్‌ దేశస్థులతో సంభాషణలను ఆరంభించడం ద్వారా అనేక బైబిలు అధ్యయనాలను ప్రారంభించింది.

ప్రకటనాపనిలో చొరవ తీసుకోవడం నిష్ప్రయోజనం కాదు. 1996 డిసెంబరులో నగరంలో లోక ప్రఖ్యాత సర్కస్‌ జరగబోతోందని తెలుసుకున్న విదేశ భాషా సంఘంలోని సాక్షులు సర్కస్‌ చేసేవారితో మాట్లాడి చూడాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు సాయంకాలం సర్కస్‌ అయిపోయిన తర్వాత, ఆకళాకారులు తాముండే హోటళ్ళకు తిరిగివెళ్తుండగా వారితో మాట్లాడగలిగారు. అలా చొరవ తీసుకోవడం వల్ల 28 బైబిళ్ళను, 59 క్రైస్తవ పుస్తకాలను, 131 బ్రోషూర్లను, 290 పత్రికలను వాళ్ళకు ఇవ్వగలిగారు. వాళ్ళక్కడ మూడు వారాలున్నారు. మూడవ వారం చివరన, వారిలో ఒక వ్యక్తి, “నేను యెహోవాసాక్షుల్లో ఒకరిగా ఎలా అవ్వగలను?” అని అడిగాడు. మరొక వ్యక్తి, “నేను నా స్వదేశంలో ప్రకటిస్తాను!” అని ఉద్ఘాటించాడు.

దాగివున్న నిధులను కనుగొనవలసి ఉంది

పారిస్‌కి వచ్చే పర్యాటకులు ఎక్కడ చూసినా, ప్రాచీన యుగాలకు చెందిన ఆనందకరమైన వాస్తుశిల్ప కళను వెల్లడిచేసే భవనాలు కనిపిస్తాయి. అయితే అంతకన్నా విలువైనవాటిని ఇంకా కనుగొనవలసి ఉంది. అనీజ, ఒక దేశపు అధికార ప్రతినిధియైన తన అంకుల్‌తో పాటు ఫ్రాన్స్‌కి వచ్చింది. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు క్రమంగా బైబిలు చదివేది. ఒక రోజు ఆమె ఆదరాబాదరాగా ఇంటి నుండి బయలుదేరుతుండగా, ఒక పయినీరు, ఆమెకు బైబిలును మీరెందుకు నమ్మవచ్చును? అన్న కరపత్రాన్నిచ్చింది. ఆతర్వాత తిరిగి కలిసేందుకు ఆమె అనుమతిని తీసుకోవడం జరిగింది. అలా బైబిలు అధ్యయనం ప్రారంభించబడింది. అనీజ తన కుటుంబం నుండి చాలా వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. ఆమె బాప్తిస్మం తీసుకొనే స్థాయికి ప్రగతిని సాధించింది. ఇతరులతో సత్యాన్ని పంచుకొనే ఆధిక్యతను ఆమె ఎలా దృష్టిస్తుంది? “నేను బిడియస్థురాలిని కనుక, మొదట్లో ప్రకటనాపని చాలా కష్టంగా ఉండేది. అయినప్పటికీ, నేను బైబిలును చదివినప్పుడు అది నన్ను ప్రేరేపిస్తుంది. ఏమి చేయకుండా విశ్రాంతిగా ఉండలేను” అని ఆమె అంటోంది. ఆదృక్పథమే, పారిస్‌లోని అనేక మంది సాక్షులకూ ఉంది, వారికి ‘ప్రభువు పనియందు చేయడానికి చాలా ఉంది.’​—⁠1 కొరింథీయులు 15:​58, NW.

బైబిలు సత్యం పారిస్‌ పొలిమేరల్లోని, భవన సముదాయాల్లో కూడా ప్రకాశిస్తూ, వేరే “వజ్రాలను” బయటికి తీసుకువస్తోంది. కొన్ని క్యాసెట్లను అరువుకు తెచ్చుకోవాలని, ఈమధ్యే యెహోవాసాక్షి అయిన తన స్నేహితుని దగ్గరికి బ్రూస్‌ వెళ్ళాడు. అక్కడ ఆస్నేహితుడు బ్రూస్‌కు పరిచయమున్న కొందరితో బైబిలు చర్చిస్తుండడం చూసి, తనూ వాళ్ళ సంభాషణను ఆలకించాడు. అప్పుడు బ్రూస్‌ బైబిలు అధ్యయన ప్రతిపాదనను అంగీకరించాడు కానీ, ఆయనకు కొన్ని సమస్యలుండేవి. “ఈ ప్రాంతంలో వారికి నేను బాగా తెలుసు. మాపెద్దన్నయ్య ఎప్పుడూ దెబ్బలాడేవాడు, నేను రొదగా ఉండే డ్యాన్స్‌ ప్రోగ్రాములను ఏర్పాటుచేసేవాణ్ణి. అలాంటి నేను సాక్షినవుతున్నానన్న వాస్తవాన్ని ఇతరులెలా అంగీకరిస్తారు?” అన్నాడు. తర్వాత కూడా డ్యాన్స్‌ ప్రోగ్రాములను ఏర్పాటు చేయమన్న అభ్యర్థనలు ఎడతెగక వచ్చినా ఆయన వాటిని ఏర్పాటు చేయడం పూర్తిగా మానేశాడు. ఒక నెల తర్వాత ఆయన ప్రకటనా పని మొదలుపెట్టాడు. “మాప్రాంతంలోని అందరూ నేనెందుకు యెహోవాసాక్షినయ్యాను అన్నది తెలుసుకోవాలనుకున్నారు” అని ఆయన అంటున్నాడు. ఆతర్వాత, కొద్దికాలానికే ఆయన బాప్తిస్మం పొందాడు. కొంత కాలం తర్వాత, మినిస్టీరియల్‌ ట్రైనింగ్‌ స్కూల్‌కి హాజరయ్యే ఆధిక్యత ఆయనకు లభించింది.

నిధుల కోసం వెతకడానికి చాలా ప్రయత్నం అవసరం కావచ్చు. అయితే, శ్రమకు తగ్గ ఫలితం లభించినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది! జాకీ, బ్రూనో, డామియన్‌ పారిస్‌లో బేకర్లుగా పనిచేసేవారు. “మమ్మల్ని కలవడం అసాధ్యం. మేమెప్పుడూ పని చేస్తూనే ఉండేవాళ్ళం, ఎప్పుడూ ఇంట్లో ఉండేవాళ్ళం కాదు” అని జాకీ వివరిస్తున్నాడు. పాట్రిక్‌ అనే క్రమ పయినీరు ఆబిల్డింగ్‌ పైన చిన్న గదులుండడం చూశాడు. కనీసం ఒక్క గదిలోనైనా ఎవరో ఒకరుంటారని ఆయన నిర్ణయించుకున్నాడు. అక్కడుండేవాళ్ళను కలవాలని ఆయన పట్టుదలతో మళ్ళీ మళ్ళీ చేసిన ప్రయత్నాలకు ఫలితం లభించింది. చివరికి ఒక రోజు మధ్యాహ్నం, అక్కడ తాత్కాలికంగా ఉంటున్న జాకీని ఆయన కలిశాడు. ఫలితమేమిటి? ఆముగ్గురు స్నేహితులు సాక్షులయ్యారు, దైవపరిపాలనా కార్యక్రమాల్లో పూర్తి భాగం కలిగివుండేందుకు వీలయ్యే వేరొక పనిని సంపాదించుకోగలిగారు.

తుపానును అణచివేయడం

ఆ మధ్య, ఫ్రాన్స్‌లోని కొన్ని సమాచార మాధ్యమాలు యెహోవాసాక్షులను ప్రమాదకరమైన మత తెగగా చిత్రీకరించాయి. 1996 లో ప్రత్యేక సమాచారం కలిగి, యెహోవాసాక్షుల గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు అనే శీర్షికగల కరపత్రం యొక్క 90 లక్షల కన్నా ఎక్కువ ప్రతులను పంపిణీ చేయడంలో యెహోవాసాక్షులు హృదయపూర్వకంగా పాల్గొన్నారు. దానివల్ల మంచి ఫలితాలు లభించాయి.

ప్రతి ఒక్కరినీ చేరుకునేందుకు ప్రత్యేక ప్రయత్నాలు జరిగాయి. చాలా మంది అధికారులు సాక్షుల పట్ల తమ మెప్పుదలను వ్యక్తం చేశారు. ఒక మునిసిపల్‌ కౌన్సిలర్‌, “యెహోవాసాక్షులు ఈకరపత్రాన్ని పంపిణీ చేయడం మంచిదైంది. అది అబద్ధాలను బయటపెట్టింది” అని వ్రాశాడు. ఒక డాక్టర్‌, “నేనెంతో కాలంగా దీని కోసం ఎదురుచూస్తున్నాను” అని వ్యాఖ్యానించాడు. పారిస్‌లోని ఒక వ్యక్తి, “యెహోవాసాక్షుల గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు అనే కరపత్రాన్ని యాదృచ్చికంగా చదివాను. నేనింకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఉచిత గృహ బైబిలు అధ్యయనాన్నుండి ప్రయోజనం పొందాలనుకుంటున్నాను” అని వ్రాశాడు. “మీ సత్యసంధతకు కృతజ్ఞతలు” అని మరొక వ్యక్తి వ్రాశాడు. “చివరికి, మీరీ అబద్ధాలకు ప్రతిస్పందించారన్నమాట!” అని ఒక క్యాథలిక్‌ మహిళ సాక్షులతో అంది.

1997 లో క్యాథలిక్‌ వరల్డ్‌ యూత్‌ డేస్‌ కోసం సంస్థీకరించిన ప్రకటనా కార్యక్రమం పారిస్‌ ప్రాంతంలోని యువ సాక్షులకు ప్రత్యేక ఆనందాన్నిచ్చింది. ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌ కన్నా ఎక్కువగా ఉన్నప్పటికీ, దాదాపు 2,500 మంది సాక్షులు పాల్గొన్నారు. కేవలం కొన్ని రోజుల్లో, వారు సర్వమానవాళి కొరకైన గ్రంథము అనే బ్రోషూర్‌ యొక్క 18,000 ప్రతులను భూగోళపు నలుమూలల నుండి వచ్చిన యౌవనస్థులకు పంచిపెట్టారు. ఆకార్యక్రమం యెహోవా నామానికి చక్కని సాక్ష్యమివ్వడమూ, సత్యపు విత్తనాలను నాటడమూ మాత్రమే కాక ఆయువ సాక్షులను ఉత్సాహభరితులను కూడా చేసింది. ఒక యువ సహోదరి ఈప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు సెలవులను తీసుకుంది. “యెహోవాకు భూమి మీద సంతోషంగల ప్రజలున్నారు. వారు ఆయన నామాన్ని స్తుతించేందుకు తమ బలాన్ని ఉపయోగిస్తారు. ఈరెండు రోజులు ఎంతో ప్రతిఫలదాయకమైనవి. నా జీవితంలో నేను సెలవు తీసుకున్న రోజులన్నింటిలోకెల్లా ఈరెండు రోజులు నిజంగా ఎంతో ప్రయోజనకరమైనవి! (కీర్తన 84:10)” అని ఆమె వ్రాసింది.

జర్మనీలోని యెహోవాసాక్షులపై నిషేధానికి దారితీసే విధంగా ఇచ్చిన హిట్లర్‌ ఆజ్ఞకు 1998, ఫిబ్రవరి 28, 65వ వార్షికంగా గుర్తించబడింది. ఫ్రాన్స్‌లోని సహోదరులు, ఆతేదీని ఉపయోగించుకుంటూ, యెహోవాసాక్షులు నాజీ దాడి సమయంలో స్థిరంగా నిలబడ్డారు (ఆంగ్లం) అనే వీడియోను అద్దెకు తీసుకున్న హాళ్ళలో ప్రజలకు చూపించారు. ఆవీడియో యెహోవా ప్రజలు అనుభవించిన బాధలను విశదంగా చూపిస్తుంది. ఆవీడియో చూడడానికి రమ్మని ఆహ్వానించే 70 లక్షల కన్నా ఎక్కువ ఆహ్వాన పత్రికలను పంపిణీ చేయడం జరిగింది. చరిత్రకారులు, మునుపు క్యాంపుల్లో ఖైదీలుగా ఉన్నవారు కదిలింపజేసే సాక్ష్యాలనిచ్చారు. పారిస్‌ ప్రాంతంలో, దాదాపు 5,000 మంది హాజరయ్యారు, వారిలో అనేక మంది సాక్షేతరులు కూడా ఉన్నారు.

పారిస్‌లోని అనేకులు ఆధ్యాత్మిక వెలుగును ఎంతో మెచ్చుకుంటారు. రాజ్య ప్రచారకులు జ్యోతులవలె ప్రకాశవంతంగా వెలుగుతున్నందుకు వాళ్లు సంతోషిస్తున్నారు. యేసు చెప్పినట్లు, “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు.” (మత్తయి 9:​37) ఆనగరంలో ప్రకటనాపనికి ఎదురయ్యే సవాళ్ళను అధిగమించాలన్న దృఢనిశ్చయంతో కూడిన యెహోవాసాక్షుల స్ఫూర్తి, పారిస్‌ని యెహోవా నామాన్ని స్తుతించేవిధంగా ప్రత్యేక అర్థంలో వెలుగు నగరంగా చేసింది.

[9వ పేజీలోని చిత్రం]

సిటీ హాల్‌

[9వ పేజీలోని చిత్రం]

లావర్‌ మ్యూజియమ్‌

[9వ పేజీలోని చిత్రం]

ఒపేరా గార్నియర్‌

[10వ పేజీలోని చిత్రాలు]

పని తొందరలో పరుగెట్టే ప్రజలు ఎక్కడ కనబడితే అక్కడ వారితో బైబిలు సందేశాన్ని పంచుకోవడం