కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కృతజ్ఞులై ఉండండి,

కృతజ్ఞులై ఉండండి,

కృతజ్ఞులై ఉండండి,

తద్వారా సంతోషంగా ఉండండి

“కృతజ్ఞులై ఉండడమన్నది ప్రాథమికమైన మానవ లక్షణం” అని కెనడాలోని కాల్గరి హెరాల్డ్‌ అనే వార్తాపత్రిక అన్నది. ఒక ప్రాథమిక పాఠశాలలో తొమ్మిది సంవత్సరాల వయస్సుగల కొంతమంది విద్యార్థులను, వారు వేటి గురించి కృతజ్ఞత కలిగివున్నారో వాటన్నింటినీ వ్రాయమని వారి ఉపాధ్యాయుడు కోరినప్పుడు వారు వ్యక్తపర్చిన భావాలను హెరాల్డ్‌ పేర్కొంది. ‘తన గురించి శ్రద్ధతీసుకున్నందుకు’ తాను తన కుటుంబం పట్ల కృతజ్ఞుడిగా ఉన్నానని ఒక బాలుడు చెప్పాడు. ఒక బాలిక కూడా తన కుటుంబం పట్ల కృతజ్ఞతతో ఇలా చెప్పింది: “వారు నన్ను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచుతారు, నా గురించి శ్రద్ధవహిస్తారు, నన్ను ప్రేమిస్తారు, నన్ను పోషిస్తారు, నా తల్లిదండ్రులు గనుక లేకపోతే నేను అసలు సజీవంగా ఉండేదాన్ని కాదు.”

కృతఘ్నత ధీర్ఘకాలిక అసంతృప్తికి దారితీస్తుంది. తత్త్వ-దైవశాస్త్రజ్ఞుడు అయిన జె.ఐ.పేకర్‌ అభిప్రాయం ప్రకారం, “మనం దేవునిపై ఆధారపడి జీవించేలా, పరస్పరం ఒకరిపై ఒకరం ఆధారపడి జీవించేలా సృష్టించబడ్డాము.” ఇది మనకు, “కృతజ్ఞులై యుండుడి” అని శతాబ్దాల క్రితం చెప్పబడిన బైబిలులోని జ్ఞానయుక్తమైన ఉపదేశాన్ని గుర్తుకు తెస్తోంది. (కొలొస్సయులు 3:​15) ఇతరులపట్ల హృదయపూర్వకమైన కృతజ్ఞతను తెలియజేసే మాటలు పరస్పరం శ్రద్ధగల సంబంధాలను పెంపొందింపజేసుకోవడానికి సహాయం చేస్తాయి.

అంతేగాక, పరస్పరం కృతజ్ఞులై ఉండడం ద్వారా, ఒకరినొకరు విలువైనవారిగా ఎంచడం ద్వారా, మనం యెహోవాపట్ల కృతజ్ఞులమై ఉన్నామని కూడా చూపిస్తాము, ఆయన దాన్ని గమనిస్తాడు. బైబిలు ఇలా చెబుతోంది: “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.” (2 దినవృత్తాంతములు 16:⁠9) మానవులు తన నామముపట్ల చూపించే ప్రేమను తాను గుర్తుంచుకుంటాననీ, దాన్ని విలువైనదిగా ఎంచుతాననీ దేవుడు మనకు హామీ ఇస్తున్నాడు. (హెబ్రీయులు 6:​10) అవును, మనం కృతజ్ఞులమై ఉండడానికి మంచి కారణమే ఉంది, ఎందుకంటే ఈదైవిక లక్షణాన్ని అనుదినం వ్యక్తపర్చడం యెహోవాకు సంతోషం కలిగిస్తుంది, మన సంతోషానికి దోహదపడుతుంది. అది, సామెతలు 15:⁠13 చెబుతున్నట్లుగా ఇలా ఉంటుంది: “సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును.”