“ఫ్రాన్స్‌లో ఏం జరుగుతోంది?”
“ఫ్రాన్స్‌లో ఏం జరుగుతోంది?”
“స్వాతంత్ర్యం, ప్రియమైన స్వాతంత్ర్యం” అనే ఈపదాలు, “లా మార్సేయాజ్” అనే ఫ్రాన్స్ జాతీయ గీతంలోనివి. నిశ్చయంగా, స్వాతంత్ర్యం ఎంతో విలువైనదిగా ఎంచదగినదే. కానీ, ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన సంఘటనలు ప్రాథమిక స్వాతంత్ర్యాలు అణచివేయబడుతున్నాయనే చింతను కలిగిస్తున్నాయి. అందుకే, 2000, నవంబరు 3, శుక్రవారం రోజు వేలాదిమంది యెహోవా సాక్షులు కలిసి, “ఫ్రాన్స్‌లో ఏం జరుగుతోంది? స్వాతంత్ర్యం తిరోగమించగలదా?” అనే ప్రత్యేక కరపత్రాలను, మొత్తం కోటి ఇరవై లక్షల ప్రతులను పంచిపెట్టారు.
ఇప్పటికి కొన్ని సంవత్సరాలుగా ఫ్రాన్స్‌లోని యెహోవాసాక్షులపై వివిధ రాజకీయవేత్తలు, మత తెగల వ్యతిరేక వర్గాలవారు దాడి చేస్తున్నారు. ఇది, సాక్షులకు వ్యక్తిగతంగానూ సంఘపరంగానూ జాతీయ స్థాయిలోనూ కష్టాలను తెచ్చింది. అయితే, 2000, జూన్ 23న ఫ్రాన్స్‌లోని అత్యున్నతమైన అడ్మినిస్ట్రేటివ్ కోర్టు కాన్‌సే డేట చెప్పిన తీర్పు ఒక మైలురాయిగా ఉంది, ఆతీర్పు గతంలో 1,100 కన్నా ఎక్కువ కేసులలో 31 క్రింది కోర్టులు వెలిబుచ్చిన దృఢమైన అభిప్రాయాన్నే ధ్రువీకరించింది. యెహోవాసాక్షులు చేసే ఆరాధన ఫ్రాన్స్ చట్టానికి పొందికగా ఉందనీ, వారి రాజ్యమందిరాలు ఇతర మతాలకు ఇవ్వబడిన ఆర్థిక మినహాయింపులను పొందడానికి అర్హమైనవనీ హైకోర్టు ధ్రువీకరించింది.
అయితే, ఈనిర్ణయాన్ని పూర్తిగా అలక్ష్యం చేస్తూ ఫ్రెంచ్ మినిస్ట్రీ ఆఫ్ ఫ్రాన్స్, చట్టం మతసంస్థలకు ఇచ్చిన పన్ను మినహాయింపును యెహోవాసాక్షుల విషయంలో తిరస్కరిస్తూనే ఉంది. ఫ్రాన్స్‌లోని 1,500 స్థానిక సంఘాలతో సహవసించే సాక్షులు, వారి స్నేహితులు ఇచ్చిన చందాలపై ఫ్రెంచ్ మినిస్ట్రీ ఆఫ్ ఫ్రాన్స్ 60 శాతం పన్ను విధించింది. ప్రస్తుతం ఈకేసు పెండింగులో ఉంది.
పైన చెప్పిన ప్రచారపు లక్ష్యమేమిటంటే, ఈవైపరీత్యాన్ని బహిర్గతం చేసి అలాంటి నిర్హేతుకమైన పన్ను విధింపుల్లోనూ, అందరి మత స్వాతంత్ర్యాన్ని అణచివేసే *
ప్రతిపాదిత చట్టాల్లోనూ దాగివున్న ప్రమాదాలను నొక్కి చెప్పాలన్నదే.ఒక సుదీర్ఘమైన రోజు
ఉదయం రెండు గంటల వేళ, కొన్ని సంఘాల్లోని సాక్షులు రైల్వే స్టేషన్ల వెలుపల, ఫ్యాక్టరీల బయట, విమానాశ్రయాల వద్ద కరపత్రాలు పంచిపెట్టడం మొదలుపెట్టారు. ఆరు గంటలకు పారిస్ మేలుకొంటుంది. ఉద్యోగరీత్యా నగరానికి వచ్చే ప్రయాణీకులను మార్గమధ్యంలో కలిసేందుకు కీలకమైన స్థలాల్లో దాదాపు 6,000 మంది స్వచ్ఛంద సేవకులను ఉంచడం జరిగింది. ఒక యౌవనస్థురాలు ఇలా వ్యాఖ్యానించింది: “మత స్వాతంత్ర్యం కోసం మీరు చేస్తున్నది ప్రశంసనీయం. దీంట్లో ఇమిడివున్నది కేవలం యెహోవాసాక్షులు మాత్రమే కాదు.” మార్సైల్స్‌లో, 350 కన్నా ఎక్కువమంది సాక్షులు భూగర్భ రైల్వే స్టేషన్ల వద్దా, వీధుల్లోనూ కరపత్రాలను ఉచితంగా పంచిపెట్టారు. ఒక్క గంటలోనే, జాతీయ రేడియో ఈప్రచారం గురించి ప్రకటిస్తూ, యెహోవా సాక్షులు మీవద్దకు వస్తే ఆశ్చర్యపోవద్దని శ్రోతలకు చెప్పింది. యురోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యొక్క ప్రధాన కార్యాలయమున్న స్ట్రాస్‌బర్గ్‌లో, ప్రయాణీకులు ఈకరపత్రం ప్రతిని అందుకోవడానికి సెంట్రల్ స్టేషన్ వద్ద ఓపిగ్గా లైనులో నిలబడ్డారు. ఒక న్యాయవాది, మన నమ్మకాలు ఆయన నమ్మకాలు ఒకటి కానప్పటికీ, మన పోరాటం ప్రాముఖ్యమైనదీ, న్యాయమైనదీ గనుక మన కేసును తాను ఆసక్తిగా గమనిస్తున్నానని వ్యాఖ్యానించాడు.
ఎత్తైన ప్రాంతములోనున్న గ్రెనోబుల్ నగరంలో ఎనిమిది గంటల వేళ, భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, 507 మంది సాక్షులు వీధులను క్షుణ్ణంగా చుట్టివచ్చారు లేదా లెటర్ బాక్సుల్లో కరపత్రాలు వేశారు. కారు డ్రైవర్లు, ట్రామ్ డ్రైవర్లు ఏదో జరుగుతోందని చూసి, తమ వాహనాలను నిలిపి మరీ కరపత్రం అడిగి తీసుకున్నారు. ట్రెయిన్‌లో తొమ్మిది గంటలకల్లా ప్రాచ్య నగరమైన ప్వాట్యీయేకు చేరుకునే ప్రయాణీకులు తాము బయలుదేరిన చోటే కరపత్రాలను అందుకున్నారు. జర్మను సరిహద్దుకు దగ్గరున్న మల్‌హౌస్‌లో అప్పటికే 40,000 ప్రతులు పంచిపెట్టడం జరిగింది.
పది గంటలకల్లా, చాలా సంఘాలు తమ దగ్గరున్న కరపత్రాల్లో సగానికిపైగా పంచిపెట్టారు. సమయం గడుస్తుండగా, అతి తక్కువమంది కరపత్రం తీసుకోవడానికి నిరాకరించారు, ఆసక్తికరమైన అనేక చర్చలు జరిగాయి. స్విట్జర్‌లాండ్ సరిహద్దుకు కేవలం 80 కన్నా ఎక్కువ కిలోమీటర్ల దూరంలో ఉన్న బెసాన్‌సోన్‌లో, ఒక యువకుడు బైబిలుపై ఆసక్తిని వ్యక్తపరుస్తూ, దేవుడు బాధను ఎందుకు అనుమతిస్తున్నాడని అడిగాడు. సమీపంలో ఉన్న రాజ్యమందిరంలో చర్చను కొనసాగించడానికి సాక్షి అతడిని ఆహ్వానించాడు, అక్కడ దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? బ్రోషూరుతో వెంటనే బైబిలు అధ్యయనం ప్రారంభించబడింది.
మధ్యాహ్నం చాలామంది సాక్షులు ఒకటి లేక రెండు గంటలపాటు ప్రకటించడానికి తమ మధ్యాహ్న భోజన విరామ సమయాన్ని ఉపయోగించుకున్నారు. మధ్యాహ్నమంతా కరపత్రాలను పంచిపెట్టడం కొనసాగింది, ఆమధ్యాహ్నం మూడు, నాలుగు గంటలకల్లా అనేక సంఘాలు తమ కరపత్రాలను పంచిపెట్టే పనిని ముగించాయి. షాంపేన్ ఉత్పత్తికి పేరుపొందిన రెయిమ్స్ నగరంలో, గతంలో యెహోవా సాక్షులతో అధ్యయనం చేసిన లేక సహవసించిన కొంతమంది ప్రజలు సంఘంతో తమ సంబంధాన్ని తిరిగి పెంపొందింపజేసుకోవాలన్న కోరికను వెలిబుచ్చారు. బోర్డేక్స్‌లో మూడు గృహ బైబిలు అధ్యయనాలు ప్రారంభించబడ్డాయి. అదే నగరంలో, వార్తాపత్రిక కొనుక్కోవడానికి ఒక దుకాణంలోకి వచ్చిన ఒక సాక్షి, కౌంటర్ వద్ద చాలా కరపత్రాలను చూసింది. ఆదుకాణం యజమానురాలు ఒకప్పుడు సాక్షి, ఆమెకు ఆ కరపత్రం అందగానే దాని ప్రాముఖ్యతను గ్రహించి, దాన్ని తాను ఇతరులకు పంచి పెట్టేందుకు జిరాక్సు కాపీలు తీసిపెట్టుకుంది.
నార్మండీలోని లిహవ్రేలో ఉండే ఒక ప్రొటెస్టెంట్ స్త్రీ, యెహోవాసాక్షుల చందాలపై పన్ను విధించబడిందని రేడియోలో విని దిగ్భ్రాంతి చెందింది. ఆమె ఆత్రంగా కరపత్రాన్ని
స్వీకరించి, అలాంటి అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నందుకు సాక్షులను అభినందించింది. రాత్రి 7:20కి లయన్స్‌లోని ప్రాంతీయ టీవీ వార్తల్లో, కరపత్రాన్ని పంచిపెట్టడంపై వ్యాఖ్యానిస్తూ ఇలా చెప్పారు: “ఈ ఉదయం యెహోవాసాక్షుల కరపత్రాలను తప్పించుకోవడం కంటే వాన చినుకులను తప్పించుకోవడం సులభమయ్యింది.” ఇద్దరు సాక్షులను ఇంటర్వ్యూ చేశారు, వారు ప్రచారానికి కారణాలను వివరించారు.తమ పని సమయం ముగిసిన తర్వాత ప్రచారపనిలో పాల్గొనాలని కోరుకున్న ఉద్యోగస్థులు, ఉద్యోగరీత్యా నగరానికి వచ్చి తిరిగి వెళుతున్న వారికి కరపత్రాలను పంచిపెట్టారు, లెటర్ బాక్సుల్లో కరపత్రాలను వేశారు. పింగాణికి పేరుపొందిన బ్రెస్ట్ మరియు లిమోగెస్ వంటి పట్టణాల్లో, ఆరోజులో చివరిగా కరపత్రాలను అందుకున్నది రాత్రి పదకొండు గంటలకు సినిమా నుండి తిరిగివస్తున్నవారే. మిగిలిన కరపత్రాలను సేకరించి మరునాడు ఉదయం పంచిపెట్టడం జరిగింది.
ఫలితాలు
ఒక సాక్షి ఇలా వ్రాశాడు: “మనలను బలహీనపరుస్తున్నామని మన శత్రువులు అనుకుంటారు. వాస్తవానికి దానికి పూర్తిగా భిన్నమైనది జరుగుతోంది.” అనేక సంఘాల్లో, 75 శాతం కంటే ఎక్కువమంది సాక్షులు ఆరోజున కరపత్రాలను పంచిపెట్టడంలో పాల్గొన్నారు, కొందరు ఈపనిలో 10,12, లేక 14 గంటలు గడిపారు. ఉత్తర ఫ్రాన్స్‌లోని యెమ్‌లో, ఒక సాక్షి రాత్రి షిఫ్టు చేసిన తర్వాత ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కరపత్రాలను పంచిపెట్టాడు. సమీపంలోని డెనెన్‌లో 1906 నుండి ఒక సంఘం ఉంది, అక్కడ శుక్రవారం కరపత్రాలను పంచిపెట్టడంలో 75మంది సాక్షులు 200 గంటలు గడిపారు. ఇతరులు వృద్ధాప్యం, అనారోగ్యం, అంత బాగా లేని వాతావరణం వంటి పరిస్థితుల్లో కూడా కరపత్రాలను పంచిపెట్టడంలో పాల్గొనాలని నిశ్చయించుకున్నారు. ఉదాహరణకు, లమాన్స్‌లో, 80వ పడిలో ఉన్న ముగ్గురు సహోదరీలు కరపత్రాలను లెటర్ బాక్సుల్లో వేస్తూ రెండు గంటలు గడిపారు, చక్రాల కుర్చీలో ఉండే ఒక సాక్షి రైల్వే స్టేషన్ ఎదురుగా కరపత్రాలను పంచిపెట్టాడు. ఇంతకుముందు నిష్క్రియులుగా ఉన్న అనేకమంది సాక్షులు ఈప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడాన్ని చూడడం ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించింది!
నిస్సందేహంగా, ఈకరపత్రాలను పంచిపెట్టడం ద్వారా గొప్ప సాక్ష్యం ఇవ్వబడింది. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా ఇండ్లల్లో అరుదుగా ఉండే అనేకులు ఒక ప్రతిని అందుకున్నారు. ఈచర్య సాక్షుల హక్కులను కాపాడడం కంటే ఎంతో ఎక్కువే సాధించిందని అనేకమంది భావించారు. చాలామంది దాన్ని, ఫ్రాన్స్‌వాసులందరి మనస్సాక్షి స్వాతంత్ర్యం కోసం, ఆరాధనా స్వాతంత్ర్యం కోసం సమర్థింపు వాదన చేయడంగా దృష్టించారు. దీనికి సాక్ష్యాధారంగా, ప్రజలు తమ స్నేహితులకు, సహోద్యోగులకు, లేక బంధువులకు ఇవ్వడానికి అదనపు ప్రతులను తమకివ్వమని కోరారు.
అవును, ఫ్రాన్స్‌లోని యెహోవాసాక్షులు యెహోవా నామమును తెలియజేస్తున్నందుకు, రాజ్యాసక్తుల కోసం సమర్థింపు వాదన చేస్తున్నందుకు గర్వంగా భావిస్తున్నారు. (1 పేతురు 3:15) తాము “సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను” జీవితం కొనసాగించగలగాలన్నదీ, తమ పరలోక తండ్రి అయిన యెహోవాను స్తుతించడంలో ఇంకా వేలాదిమంది తమతో కలుస్తారన్నదీ వారి యథార్థమైన నిరీక్షణ.—1 తిమోతి 2:1.
[అధస్సూచి]
^ పేరా 5 మత విచక్షణ పట్ల తమ అసమ్మతిని తెలియజేయడానికి 1999 జనవరిలో ఇటువంటి ప్రచారమే జరిగింది. కావలికోట, ఆగస్టు1, 1999, 9వ పేజీ, యెహోవాసాక్షుల వార్షికపుస్తకం 2000, (ఆంగ్లం) 24-6 పేజీలు చూడండి.