కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మధ్యప్రాచ్యంలో ప్రకాశిస్తున్న ఆధ్యాత్మిక వెలుగు

మధ్యప్రాచ్యంలో ప్రకాశిస్తున్న ఆధ్యాత్మిక వెలుగు

జీవిత కథ

మధ్యప్రాచ్యంలో ప్రకాశిస్తున్న ఆధ్యాత్మిక వెలుగు

నజీబ్‌ సాలెం చెప్పినది

సా.శ. మొదటి శతాబ్దంలో దేవుని వాక్యపు వెలుగు మధ్యప్రాచ్యం నుండి ప్రకాశించి భూమి నలుమూలలకూ ప్రసరించింది. 20వ శతాబ్దంలో ఆవెలుగు మళ్ళీ ఆప్రాంతాన్ని ప్రకాశింపజేయడానికి అక్కడికి ప్రవేశించింది. ఇదెలా సంభవించిందో నన్ను చెప్పనివ్వండి.

నేను ఉత్తర లెబనాన్‌లో ఉన్న ఆమ్యూన్‌ పట్టణంలో 1913 లో జన్మించాను. ప్రపంచంలో స్థిరత్వం, శాంతిలాంటివేమైనా కాస్త ఉన్నాయనుకుంటే వాటికది చివరి సంవత్సరం. ఎందుకంటే ఆతర్వాతి సంవత్సరమే మొదటి ప్రపంచ యుద్ధం విరుచుకుపడింది. 1918 లో ఆయుద్ధం ముగిసేసరికి, అప్పట్లో మధ్యప్రాచ్యంలోని ముత్యం అని పిలువబడిన లెబనాన్‌ అటు ఆర్థికంగాను ఇటు రాజకీయంగాను పూర్తిగా చితికిపోయింది.

1920 లో లెబనాన్‌లో తపాలా సేవలు పునఃప్రారంభం కావడంతో విదేశాల్లో నివసించే లెబనాన్‌ దేశస్థులు ఉత్తరాలు వ్రాయడం ప్రారంభించారు. మామావయ్యలు అబ్దుల్లా ఘాంటూస్‌, జార్జ్‌ ఘాంటూస్‌లు కూడా ఉత్తరాలు వ్రాశారు. వారు తమ తండ్రిగారికి అంటే మాతాతగారు హబీబ్‌ ఘాంటూస్‌కి దేవుని రాజ్యం గురించి వివరిస్తూ వ్రాశారు. (మత్తయి 24:​14) తన కొడుకుల ఉత్తరాల్లోని విషయాలను గురించి తన పొరుగువారికి చెప్పినందుకే మాతాతగారు వారి ఎగతాళికి గురయ్యారు. అంతటితోనే ఆగకుండా, హబీబ్‌ కొడుకులు తమ తండ్రిచేత ఆయన భూమిని అమ్మించి, ఒక గాడిదను కొనిపించి, దానిపై తిరుగుతూ సువార్త ప్రకటింపజేయాలని ఆయనను పురికొల్పుతున్నారని వాళ్ళు ఒక పుకారును లేవదీశారు.

ఉషోదయపు తొలి కిరణం

ఆ తర్వాతి సంవత్సరం అంటే 1921 లో అమెరికాలోని న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో నివసిస్తున్న మిశాల్‌ ఆబూద్‌ లెబనాన్‌లోని ట్రిపోలికి తిరిగివచ్చాడు. ఆయన బైబిలు విద్యార్థి అయ్యాడు, అప్పట్లో యెహోవాసాక్షులు అలా పిలువబడేవారు. సహోదరుడు ఆబూద్‌ స్నేహితులు చుట్టాల్లో అధిక సంఖ్యాకులు బైబిలు సందేశానికి స్పందించకపోయినా, పేరొందిన ఇద్దరు వ్యక్తులు ప్రతిస్పందించారు, వారు ఇబ్రాహీం ఆట్యా అనే ప్రొఫెసరు, హన్నా షామాస్‌ అనే ఒక దంతవైద్యుడు. నిజానికి డా.షామాస్‌ తన ఇంట్లోను తన క్లినిక్‌లోను క్రైస్తవ కూటాలను జరుపుకోవడానికి అనుమతించాడు.

సహోదరులు ఆబూద్‌, షామాస్‌లు నేనుంటున్న ఆమ్యూన్‌ని సందర్శించేటప్పటికి నేనింకా చిన్నవాణ్ణే. వారి రాక నన్నెంతో ప్రభావితం చేసింది, నేను సహోదరుడు ఆబూద్‌తో ప్రకటనా పనికి వెళ్ళడం ప్రారంభించాను. 40 సంవత్సరాలపాటు, 1963 లో సహోదరుడు ఆబూద్‌ చనిపోయేంత వరకు మేమిద్దరమూ పరిచర్యలో క్రమంగా కలిసి పనిచేశాం.

1922, 1925 సంవత్సరాల మధ్యలో బైబిలు సత్యపు వెలుగు ఉత్తర లెబనాన్‌లోని అనేక గ్రామాల్లో బాగా ప్రసరించింది. ఆమ్యూన్‌లోని మాఇంట్లో కూడుకున్నట్లే, 20,30 మంది బైబిలును గురించి చర్చించేందుకు తమ గృహాల్లో కూడుకునేవారు. రేకు డబ్బాలను గట్టిగా కొడుతూ అరుస్తూ కేకలు పెడుతూ మాకూటాలకు భంగం కలిగించమని పాదిరీలు పిల్లలను పంపించేవారు, ఆకారణంగా కొన్నిసార్లు మేము పైన్‌ వృక్షాల అడవిలో కూడుకున్నాము.

నేను యౌవనస్థుడిగా ఉన్నప్పుడు పరిచర్యలో నేను చూపించే అత్యంతాసక్తి మూలంగా ప్రతి క్రైస్తవ కూటానికి హాజరు కావడం మూలంగా నాకు తిమోతి అనే పేరు లభించింది. మాస్కూలు డైరెక్టరు “ఆ కూటాలకు” వెళ్ళడం మానుకో అని ఆజ్ఞాపించారు. నేను తిరస్కరించినందుకు నన్ను స్కూలు నుండి బహిష్కరించారు.

బైబిలు ప్రాంతాల్లో సాక్ష్యం

నేను 1933 లో బాప్తిస్మం తీసుకున్న తర్వాత వెంటనే పయినీరు సేవ ప్రారంభించాను, పూర్తికాల సేవను యెహోవాసాక్షులు పయినీరు సేవ అని పిలుస్తారు. అప్పట్లో మేము చాలా కొద్ది మందిమి మాత్రమే ఉన్నప్పటికీ ఉత్తర లెబనాన్‌లో మేము అత్యధిక గ్రామాల్లో ప్రకటించడమే కాక మేము బీరూట్‌ వరకు చేరుకున్నాం, దాని శివారు ప్రాంతాల్లోనూ అలా ముందుకెళ్తూ దక్షిణ లెబనాన్‌ వరకూ చేరుకున్నాం. ఆతొలిదినాల్లో మేము సాధారణంగా కాలినడకనే ప్రయాణించేవాళ్ళం, లేదా యేసుక్రీస్తూ మొదటి శతాబ్దంలోని ఆయన అనుచరుల్లాగే మేము గాడిదలపై వెళ్ళేవాళ్ళం.

చాలా సంవత్సరాలుగా అమెరికాలో ఉన్న యూసుఫ్‌ రాఖాల్‌ అనే ఒక లెబనీస్‌ సాక్షి, 1936 లో లెబనాన్‌ను సందర్శించడానికి వచ్చాడు. ఆయన తనతోపాటు గ్రామఫోను పరికరాలను రెండు ఫోనోగ్రాఫులను తీసుకువచ్చాడు. మేమా పరికరాలను 1931 మోడల్‌ ఫోర్డ్‌ కారుపైకి ఎక్కించి లెబనాన్‌, సిరియా అంతటినీ చుట్టాము, రాజ్య సందేశాన్ని మారుమూల ప్రాంతాలకు చేరవేశాం. మాగ్రామఫోను 10 కిలోమీటర్ల దూరం వరకు వినిపించేది. ప్రజలు తమ ఇండ్ల పైకప్పుల మీదికి ఎక్కి వినేవారు, వాళ్ళు తమకు వినబడేవి పరలోకం నుండి వచ్చే స్వరాలు అని అనేవారు. పొలాల్లో పనులు చేసుకునేవారు తమ పనులు విడిచిపెట్టి దగ్గరగా వచ్చి వినేవాళ్ళు.

యూసుఫ్‌ రాఖాల్‌తో నా చివరి యాత్రల్లో, ఆయనతో కలిసి నేను 1937వ సంవత్సరం చలికాలంలో సిరియాలోని అలెప్పోకి వెళ్ళాను. ఆయన అమెరికాకు తిరిగి వెళ్ళకముందు మేము పాలస్తీనాకు కూడా వెళ్ళాం. అక్కడ మేము హైఫా, జెరూసలేమ్‌ నగరాలను సందర్శించాము, అలాగే అక్కడి గ్రామాల్లోకి కూడా వెళ్ళాం. అక్కడ మేము ఇబ్రాహీమ్‌ షీహాదీ అనే వ్యక్తిని కలిశాము, ఆయనతో నాకు ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా పరిచయం ఉంది. ఇబ్రాహీమ్‌ బైబిలు పరిజ్ఞానాన్ని పొందుతూ పురోభివృద్ధి చెందుతూ మేము సందర్శించే సరికి మాతోపాటు ఇంటింటి పరిచర్యలో పాల్గొనేంతగా అభివృద్ధి చెందాడు.​—⁠అపొస్తలుల కార్యములు 20:⁠20.

నేను ప్రొఫెసర్‌ ఖలీల్‌ కోబ్రోసీని కలవాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాను, ఆయన ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేస్తున్న నిష్ఠగల క్యాథలిక్కు. లెబనాన్‌లోని సాక్షుల చిరునామాలను ఆయనెలా సంపాదించాడు? ఎలాగంటే, హైఫాలోని ఒక దుకాణంలో ఖలీల్‌ కొన్ని వస్తువులను కొన్నప్పుడు ఆదుకాణదారుడు పొట్లం కట్టిచ్చిన కాగితం యెహోవాసాక్షుల ప్రచురణల్లో ఒకదానికి చెందినది. ఆకాగితంలో మన చిరునామా ఉంది. మేము ఆయనను కలుసుకొని చాలా ఆనందించాం, అటు తర్వాత అంటే 1939 లో ఆయన బాప్తిస్మం పొందడానికి ట్రిపోలికి వచ్చాడు.

1937 లో పెట్రోస్‌ లాగాకోస్‌ సతీసమేతంగా ట్రిపోలికి వచ్చాడు. మేం ముగ్గురం కలిసి తర్వాతి కొద్ది సంవత్సరాల్లో లెబనాన్‌ సిరియా దేశాలను దాదాపు పూర్తిగా చుడుతూ రాజ్య సందేశాన్ని ప్రజల గృహాల వద్దకు చేరవేశాము. 1943 లో సహోదరుడు లాగాకోస్‌ చనిపోయే లోపల సాక్షులు లెబనాన్‌, సిరియా, పాలస్తీనాల్లోని దాదాపు అన్ని నగరాలకు, గ్రామాలకు ఆధ్యాత్మిక వెలుగును ప్రసరింపజేశారు. కొన్నిసార్లు దాదాపు 30 మందిమి కలిసి వ్యానులోనో బస్సులోనో మారుమూల ప్రాంతాలను చేరుకోగలిగేలా తెల్లవారు జామున 3 గంటలకే బయలుదేరేవాళ్ళం.

ఇబ్రాహీమ్‌ ఆట్యా 1940లలో కావలికోటను అరబిక్‌లోకి అనువదించాడు. ఆయన అనువదించిన తర్వాత నేను నాలుగు కాపీలను చేత్తో వ్రాసి పాలస్తీనా, సిరియా, ఈజిప్టుల్లోని సాక్షులకు పంపించేవాడిని. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో మాప్రకటనా పనికి చాలా వ్యతిరేకత ఎదురయ్యేది, కానీ మేము మధ్యప్రాచ్యంలో బైబిలు సత్యాన్ని ప్రేమించే వారందరితో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేవాళ్లం. నేను వ్యక్తిగతంగా నగరాల, చుట్టుప్రక్కలున్న గ్రామాల మ్యాపులను గీసి ఆయా ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాలని గట్టిగా నిశ్చయించుకున్నాను.

ఒక ప్రక్క రెండవ ప్రపంచ యుద్ధం చెలరేగుతున్న కాలంలో నేను నా పయినీరు సహవాసి మిశాల్‌ ఆబూద్‌ కుమార్తె అయిన ఈవ్లీన్‌ను పెళ్ళి చేసుకున్నాను. మాకు ముగ్గురు పిల్లలు పుట్టారు, ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు.

మిషనరీలతో సేవ

యుద్ధం ముగిసిన వెంటనే గిలియడ్‌ స్కూలు యొక్క తొలి పట్టభద్రులు లెబనాన్‌కి వచ్చారు. దాంతో లెబనాన్‌లో మొట్టమొదటి సంఘం ఏర్పడింది, నేను దానికి కంపెనీ సర్వెంట్‌గా నియమించబడ్డాను. ఆతర్వాత 1947 లో నేథన్‌ హెచ్‌. నార్‌, ఆయన సెక్రటరీ మిల్టన్‌ జి.హెన్షెల్‌లు లెబనాన్‌ను సందర్శించారు, సహోదరులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. కొద్దికాలానికే మరి కొంతమంది మిషనరీలు వచ్చారు. మాపరిచర్యను సంస్థీకరించడంలోను, సంఘ కూటాలను నిర్వహించడంలోను మాకెంతో సహాయాన్ని అందించారు.

ఒకసారి మేము సిరియాలోని ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళినప్పుడు స్థానిక బిషప్‌ నుండి మాకు వ్యతిరేకత ఎదురైంది. మేము యూదువాద ప్రచురణలను పంచిపెడుతున్నామని ఆయన మమ్మల్ని నిందించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 1948కి ముందు పాదిరీలు మమ్మల్ని “కమ్యూనిస్టులు” అని పిలిచేవారు. ఈసందర్భంలో పోలీసులు మమ్మల్ని అరెస్టు చేసి రెండు గంటలపాటు విచారణ చేశారు, అప్పుడు అద్భుతమైన సాక్ష్యం వారికి ఇవ్వబడింది.

చివరికి, మాకేసును విన్న జడ్జి ఇలా అన్నాడు: “మీకు విరుద్ధంగా నిందారోపణలు చేసినందుకు ఆగెడ్డపాయనను [బిషప్‌ని అలా పిలిచాడు] తిట్టుకున్నాను గానీ, మిమ్మల్ని కలిసి మీబోధలను గురించి తెలుసుకునేందుకు అవకాశాన్ని కల్పించినందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి.” తర్వాత ఆయన మాకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపాడు.

పది సంవత్సరాల తర్వాత బస్సులో బీరూట్‌కి వెళ్తుండగా నా ప్రక్క సీటాయనతో మాట్లాడడం ప్రారంభించాను, ఆయన వ్యవసాయ రంగంలో ఇంజనీరు. నేను మన నమ్మకాల గురించి వివరిస్తుంటే కొద్ది నిమిషాల తర్వాత, సిరియాలోని తన స్నేహితుని దగ్గర ఇలాంటి విషయాలే విన్నానని ఆయన అన్నాడు. ఆస్నేహితుడు ఎవరనుకుంటున్నారు? పది సంవత్సరాల క్రితం మాకేసును పరిశీలించిన జడ్జి!

1950లలో నేను ఇరాక్‌లోని సాక్షులను సందర్శించి వారితోపాటు ఇంటింటి సాక్ష్యం ఇచ్చాను. నేను అనేకసార్లు జోర్డాన్‌, వెస్ట్‌బ్యాంక్‌లకు కూడా ప్రయాణించాను. 1951 లో బేత్లెహేము వెళ్ళిన నలుగురు సాక్షుల్లో నేనూ ఉన్నాను. మేమక్కడ ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించాము. అదే రోజు కొద్దిగా ముందు, అక్కడున్న వారందరం కలిసి బస్సులో జోర్డాన్‌ నదీ తీరానికి వెళ్ళాము, అక్కడ 22 మంది యెహోవాకు తాము చేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నారు. ఆప్రాంతంలో ఏమైనా వ్యతిరేకత ఎదురైనప్పుడు మేము ఇలా అనేవాళ్ళం: “మీ దేశ పుత్రుల్లోనే ఒకాయన భూమి అంతటిపైనా రాజుగా ఏలతాడని చెప్పడానికి మేము వచ్చాం! ఎందుకంత కోపం తెచ్చుకుంటారు? నిజానికి మీరు ఆనందించాలి!”

కష్టాల మధ్య ప్రకటనా పని

మధ్యప్రాచ్యంలోని ప్రజలు సాధారణంగా సహృదయం గలవారు, వినమ్రులు, అతిథిప్రియులు. దేవుని రాజ్య సందేశాన్ని అనేకులు ఆసక్తిగా వింటారు. నిజంగా, త్వరలోనే ఈబైబిలు ప్రవచనం నెరవేరుతుందని తెలుసుకోవడం కన్నా ఓదార్పునిచ్చేదేముంది: “దేవుడు [తన ప్రజలకు] తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.”​—⁠ప్రకటన 21:3,4.

మన కార్యకలాపాలను వ్యతిరేకించే ప్రజల్లో అత్యధికులు మన పనిని గురించి గాని మనం తీసుకువచ్చే సందేశాన్ని గురించి గాని చక్కగా అర్థం చేసుకోని వారేనని నేను కనుగొన్నాను. మనలను తప్పుగా చిత్రీకరించడానికి క్రైస్తవమత సామ్రాజ్యంలోని పాదిరీలు ఎంతో ప్రయాసపడ్డారు. ఆకారణంగా లెబనాన్‌లో, 1975 లో ప్రారంభమై 15 సంవత్సరాలకుపైగా కొనసాగిన అంతర్యుద్ధంలో సాక్షులు ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వచ్చింది.

ఒకసారైతే, ఎంతో ఆసక్తితో చర్చికి వెళ్ళే ఒక కుటుంబ సభ్యులతో నేను బైబిలు అధ్యయనాన్ని నిర్వహిస్తున్నాను. బైబిలు సత్యాలను నేర్చుకోవడంలో వారి పురోభివృద్ధిని చూసి పాదిరీకి కన్నుకుట్టింది. దాని ఫలితంగా ఒక రోజు రాత్రి స్థానిక మత గుంపొకటి వారి దుకాణాన్ని సర్వనాశనం చేయాలని తన సభ్యులను ప్రేరేపించింది, దాంతో వారు దాదాపు 4,50,000 రూపాయలు ఖరీదు చేసే వస్తువులను దహనం చేశారు. అదే రాత్రి వారు నా దగ్గరికి వచ్చి నన్ను కిడ్నాప్‌ చేశారు. అయితే నేను వారి నాయకుడితో సహేతుకంగా తర్కించగలిగాను, వారు నిజంగా క్రైస్తవులైతే అంత పైశాచికంగా ప్రవర్తించరని వివరించగలిగాను. దాంతో ఆయన కారును ఆపమని చెప్పి నన్ను దిగిపొమ్మని ఆజ్ఞాపించాడు.

మరో సందర్భంలో నన్ను నలుగురు మిలిటెంట్లు కిడ్నాప్‌ చేశారు. ఎన్నో రకాలుగా బెదిరించి, చివరికి నన్ను తుపాకీతో కాల్చేస్తానని అన్న తర్వాత వారి నాయకుడు హఠాత్తుగా తన మనస్సు మార్చుకొని, నన్ను విడుదల చేశాడు. వారిలో ఇద్దరు ఇప్పుడు హత్య, దోపిడీల మూలంగా జైల్లో ఉన్నారు, మిగతా ఇద్దరికి మరణశిక్ష విధించబడింది.

సాక్ష్యమిచ్చే మరితర అవకాశాలు

నేను విమానాల్లో దేశదేశాలు తిరిగాను. ఒకసారి విమానంలో బీరూట్‌నుండి అమెరికా వెళ్తుండగా నేను లెబనాన్‌ దేశ మాజీ విదేశాంగ మంత్రి ఛార్లెస్‌ మాలిక్‌ ప్రక్కన కూర్చున్నాను. ఆయన నేను చెప్పేది జాగ్రత్తగా వింటూ నేను బైబిలు నుండి చదివిన ప్రతి వచనం పట్ల మెప్పుదల ప్రదర్శించారు. చివరికి ఆయన తాను ట్రిపోలిలో స్కూల్లో చదువుకునేటప్పుడు ఇబ్రాహీం ఆట్యా అధ్యాపకుడిగా ఉన్నాడని చెప్పారు, ఆయనకు బైబిలు సత్యాన్ని పరిచయం చేసింది మామామగారే! బైబిలును గౌరవించాలని ఇబ్రాహీం తనకు నేర్పించినట్లు మిస్టర్‌ మాలిక్‌ అన్నారు.

మరోసారి విమానంలోనే ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ప్రక్కనే నా సీటు. దేవుని రాజ్య సువార్తను గురించి నేను ఆయనకు తెలియజేసే అవకాశం నాకు లభించింది. చివరికి ఆయన నన్ను న్యూయార్క్‌లో ఉంటున్న తన తమ్ముడి కుటుంబానికి పరిచయం చేశాడు, నేను వారిని అక్కడ చాలాసార్లు కలిశాను. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి బిల్డింగ్‌లో పనిచేస్తున్న ఒక బంధువు కూడా నాకున్నాడు. నేనొకసారి ఆయన కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మూడు గంటలు ఉన్నాను. అప్పుడు ఆయనకు దేవుని రాజ్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వగలిగాను.

నాకిప్పుడు 88 సంవత్సరాలు, సంఘ బాధ్యతలను ఇప్పటికీ నేను చురుకుగా నిర్వహించగలుగుతున్నాను. నా భార్య ఇప్పటికీ నా సహచరిగా యెహోవాను సేవిస్తోంది. మాఅమ్మాయి యెహోవాసాక్షుల ఒక పైవిచారణకర్తను పెండ్లి చేసుకుంది, ఆయనిప్పుడు బీరూట్‌లోని ఒక సంఘంలో పెద్దగా సేవ చేస్తున్నాడు. వారి కూతురు కూడా సాక్షే. మాచిన్నబ్బాయీ ఆయన భార్యా కూడా సాక్షులే, వారి కుమార్తె కూడా సత్యంలోనే ఉంది. మాపెద్దబ్బాయి విషయానికొస్తే, సత్యాన్ని ఆయన హృదయంలో నాటడం జరిగింది, ఎప్పటికైనా దాన్ని ఆయన హత్తుకుంటాడని ఆశిస్తున్నాను.

1933 లో నన్ను పయినీరుగా నియమించారు​—⁠మొట్టమొదటి నియామకం మధ్యప్రాచ్యంలో. ఈ68 సంవత్సరాలూ పయినీరుగా యెహోవాను సేవించడం కన్నా నా జీవితంతో ఇంతకన్నా శ్రేష్ఠమైన పనేదీ చేసివుండను. ఆయన అందించే ఆధ్యాత్మిక వెలుగులో నడుస్తూ ఉండాలని నేను కృత నిశ్చయంతో ఉన్నాను.

[23వ పేజీలోని చిత్రం]

1935 లో నజీబ్‌

[24వ పేజీలోని చిత్రం]

లెబనాన్‌ కొండ ప్రాంతంలో గ్రామఫోను కారుతో, 1940 లో

[25వ పేజీలోని చిత్రాలు]

పైన ఎడమనుండి సవ్యదిశలో: నజీబ్‌, ఈవ్లీన్‌, వారి కుమార్తె, సహోదరుడు ఆబూద్‌, నజీబ్‌ మొదటి కుమారుడు, 1952 లో

క్రింద (ముందటి వరుస): ట్రిపోలిలో నజీబ్‌ ఇంటిదగ్గర సహోదరులు షామాస్‌, నార్‌, ఆబూద్‌, హెన్షెల్‌, 1952 లో

[26వ పేజీలోని చిత్రం]

నజీబ్‌, ఆయన భార్య ఈవ్లీన్‌