మీరు మంచి నిర్ణయాలను ఎలా తీసుకోగలరు?
మీరు మంచి నిర్ణయాలను ఎలా తీసుకోగలరు?
స్వేచ్ఛా చిత్తం యెహోవా ఇచ్చిన కానుక. అది లేకపోయుంటే మనకూ మరమనుషులకూ తేడా ఉండేది కాదు, మన చర్యలపై మనకు నియంత్రణ ఉండేది కాదు. అయితే అది ఉన్నందుకు మనం సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది, జీవిత పయనంలో మనం నిర్ణయాలను తీసుకోవలసి ఉంటుంది.
నిజమే అనేకమైన నిర్ణయాలు చాలా అల్పమైనవే. ఎలాంటి కెరీర్‌ను ఎన్నుకోవాలి, వివాహం చేసుకోవాలా వద్దా వంటి ఇతర నిర్ణయాలు పూర్తి భవిష్యత్తునే మార్చేయగలవు. కొన్ని నిర్ణయాలు ఇతరులపై కూడా ప్రభావం చూపిస్తాయి. తల్లిదండ్రులు తీసుకునే కొన్ని నిర్ణయాలు తమ పిల్లలపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేగాక, మనం తీసుకునే ఎన్నో నిర్ణయాలకు మనం దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది.—రోమీయులు 14:11, 12.
సహాయం అవసరం
నిర్ణయాలు తీసుకునే విషయంలో మానవులకు మంచి చరిత్ర లేదు. నమోదు చేయబడిన తొలి మానవ నిర్ణయమే వినాశకరంగా ఉంది. దేవుడు ఖండితంగా నిషేధించిన పండునే హవ్వ తినాలని నిర్ణయించుకుంది. స్వార్థపూరితమైన కోరికపై ఆధారపడిన ఆమె ఎంపిక తర్వాత ఆమె భర్త కూడా దేవునికి అవిధేయత చూపించడానికి నడిపించింది, దాని ఫలితంగా మానవజాతికి గొప్ప బాధలు వచ్చాయి. ఇప్పటికీ అనేక సందర్భాల్లో మానవులు సరైన సూత్రాల ఆధారంగా కాక స్వార్థపూరిత కోరికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. (ఆదికాండము 3:6-19; యిర్మీయా 17:9) గంభీరమైన నిర్ణయాల విషయానికి వచ్చినప్పుడు మన పరిమితులు మన మనస్సుకు వస్తాయి.
అందుకే చాలామంది, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మానవులకన్నా ఉన్నతమైన మూలం నుండి సహాయాన్ని అర్థించడంలో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. నెబుకద్నెజరు ఒక దండయాత్ర చేస్తున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చింది, దాని గురించి బైబిలు నివేదిస్తోంది. ఆయన రాజైనప్పటికీ ‘శకునము తెలుసుకోవలసిన’ అవసరముందని, అంటే ఆత్మలను సంప్రదించాలని భావించాడు. ఆనివేదిక ఇలా చెబుతోంది: “అతడు బాణములను ఇటు అటు ఆడించుచు, విగ్రహములచేత విచారణ చేయుచు, కార్యమునుబట్టి శకునము చూచుచున్నాడు.” (యెహెజ్కేలు 21:21) నేడు కూడా అదే విధంగా అనేకమంది సోదెగాండ్రను, జ్యోతిష్కులను సంప్రదిస్తుంటారు, మరితర మాధ్యమాల ద్వారా ఆత్మల నుండి సహాయాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈమూలాలన్నీ మోసకరమైనవి, తప్పుదోవపట్టించేవి.—లేవీయకాండము 19:31.
పూర్తిగా నమ్మదగ్గ ఒక వ్యక్తి ఉన్నాడు, మానవులు జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకునేలా ఆయన చరిత్రంతటిలో వారికి సహాయం చేశాడు. ఆయనెవరో కాదు, యెహోవా దేవుడే. ఉదాహరణకు ప్రాచీన కాలాల్లో దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలుకు ఊరీము తుమ్మీములను ఇచ్చాడు—ఇవి బహుశ ఆజనాంగం అత్యంత ప్రాముఖ్యమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఉపయోగించబడే పవిత్ర చీట్లు కావచ్చు. యెహోవా వారడిగే ప్రశ్నలకు ఊరీము తుమ్మీముల ద్వారా సూటిగా జవాబిచ్చాడు, ఇశ్రాయేలులోని పెద్దలు తమ నిర్ణయాలు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉన్నాయో లేదో నిశ్చయపరచుకోవడానికి సహాయం చేశాడు.—నిర్గమకాండము 28:30; లేవీయకాండము 8:8; సంఖ్యాకాండము 27:21.
మరో ఉదాహరణ చూడండి. మిద్యానుకు విరుద్ధంగా ఇశ్రాయేలు సైన్యాలను నడిపించడానికి గిద్యోను పిలువబడినప్పుడు అంతటి ఆధిక్యతను తాను స్వీకరించాలా వద్దా అన్న నిర్ణయాన్ని ఆయన తీసుకోవలసి ఉంది. యెహోవా తనకు మద్దతునిస్తాడని నిశ్చయపరచుకోవడానికి ఆయన ఒక న్యాయాధిపతులు 6:33-40; 7:21,22.
అద్భుతమైన సూచననిమ్మని కోరాడు. రాత్రంతా తాను బయట పెట్టిన గొఱ్ఱెబొచ్చు మీద మంచు పడి చుట్టూ ఉన్న నేల ఆరివుండాలని ఆయన ప్రార్థించాడు. మరుసటి రాత్రి గొఱ్ఱెబొచ్చు పొడిగా ఉండి చుట్టూ ఉన్న నేల మంచుతో తడిసివుండాలని ఆయన అడిగాడు. యెహోవా దయతో గిద్యోను కోరిన సూచనలను చేసి చూపించాడు. తత్ఫలితంగా, గిద్యోను సరైన నిర్ణయం తీసుకున్నాడు, దైవిక మద్దతుతో ఇశ్రాయేలు శత్రువులను పూర్తిగా ఓడించాడు.—నేటి విషయమేమిటి?
నేడు కూడా యెహోవా తన సేవకులకు ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో సహాయం చేస్తానని చెబుతున్నాడు. ఎలా? మనం కూడా గిద్యోనులా ‘గొఱ్ఱెబొచ్చు పరీక్షల’ కోసం అడగాలా, ఏ దిశలోకి వెళ్ళాలో చూపించడానికి అద్భుత సూచనలివ్వమని యెహోవాను అడగాలా? రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతంలోకి మారాలా వద్దా అని ఒక వివాహిత జంట ఆలోచిస్తోంది. తాము నిర్ణయం తీసుకునేందుకు సహాయం చేయడానికి వారొక పరీక్షను పెట్టారు. ఒక నిర్దిష్ట మొత్తానికి తమ ఇంటిని అమ్మకానికి పెట్టారు. తాము నిర్ధారించిన వెలకు లేదా అంతకన్నా ఎక్కువకు ఫలాని తేదీలోపల అమ్ముడైతే అది తాము అక్కడినుండి మారాలని, ఇల్లు అమ్ముడు కాకపోతే తాము మారకూడదని దేవుడు సూచననిస్తాడని అనుకున్నారు.
ఇల్లు అమ్ముడు పోలేదు. రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువున్న ప్రాంతంలో వారు సేవ చేయడం యెహోవాకు ఇష్టం లేదనడానికి అది సూచనా? కానేకాదు. వాస్తవమేమిటంటే, యెహోవా తన సేవకుల కోసం ఏమి చేస్తాడు ఏమి చేయడు అన్నది నిర్ద్వంద్వంగా తేల్చిచెప్పాలనుకోవడం అహంకారమే అవుతుంది. అయితే తన చిత్తమేమిటో తెలియజేయడానికి నేడు యెహోవా ఏమాత్రం జోక్యం చేసుకోడని కూడా చెప్పలేము. (యెషయా 59:1) అలాగని, మనం ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు యెహోవా జోక్యం చేసుకోవాలని, తద్వారా నిర్ణయాన్ని తీసుకునే పని ఆయనపైనే విడిచిపెట్టాలని ఆశించే హక్కు కూడా మనకు లేదు. అంతెందుకు గిద్యోను కూడా తన జీవితంలో ఎక్కువ భాగం యెహోవా నుండి అద్భుత సూచనలను కోరకుండానే తీసుకోవలసివచ్చింది!
అయినా, దైవిక నడిపింపు లభ్యమవుతోందని బైబిలు తప్పక చెబుతోంది. మన కాలం గురించి అదిలా ప్రవచించింది: “మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను—ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.” (యెషయా 30:21) ప్రాముఖ్యమైన ఎంపికలు చేసుకునేటప్పుడు మన నిర్ణయాలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నాయో లేదో అత్యున్నతమైన ఆయన జ్ఞానాన్ని ప్రతిబింబిస్తున్నాయో లేదో నిశ్చయపరచుకోవడానికి ప్రయత్నించడంలో ఏమాత్రం తప్పులేదు. కానీ ఎలా? ఆయన వాక్యాన్ని పరిశీలించడం ద్వారా, అది మన “పాదములకు దీపమును [మన] త్రోవకు వెలుగునై” ఉండేలా అనుమతించడం ద్వారా. (కీర్తన 119:105; సామెతలు 2:1-6) ఇలా చేయాలంటే మనం బైబిలు నుండి ఖచ్చితమైన పరిజ్ఞానాన్ని సముపార్జించే అలవాటును అలవరచుకోవాలి. (కొలొస్సయులు 1:9,10) నిర్ణయం తీసుకునే సమయం వచ్చినప్పుడు మనం ఆవిషయానికి సంబంధించిన అన్ని బైబిలు సూత్రాలను జాగ్రత్తగా పరిశోధించాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిశోధన మూలంగా మనం “శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగల”వారిగా అవుతాము.—ఫిలిప్పీయులు 1:9,10.
యెహోవా వింటాడన్న నమ్మకంతో మనమాయనతో ప్రార్థనలో మాట్లాడాలి కూడా. మనం తీసుకోవలసిన నిర్ణయం గురించి, మనం పరిగణలోకి తీసుకుంటున్న ప్రత్యామ్నాయాల గురించి మన ప్రేమగల దేవునికి వివరించడం ఎంత ఓదార్పునిచ్చే విషయం! ఆతర్వాత సరైన నిర్ణయాన్ని తీసుకునేందుకు నడిపింపునిమ్మని నమ్మకంగా అడగగలము. తరచు, ఆయా విషయాల్లో వర్తించే బైబిలు సూత్రాలను పరిశుద్ధాత్మ మనకు జ్ఞాపకం చేస్తుంది, లేదా మన పరిస్థితికి సంబంధించిన ఏదైనా లేఖనాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అది మనకు సహాయం చేయవచ్చు.—యాకోబు 1:5,6.
ఎఫెసీయులు 4:11,12) అయితే మనం ఇతరులను సంప్రదించే విషయంలో, తమకు నచ్చినదాన్ని చెప్పే వ్యక్తి తారసపడేంతవరకు ఒక వ్యక్తి తర్వాత మరో వ్యక్తి దగ్గరికి వెళ్ళే వారిలా మనం ఉండకూడదు. ఆచివరి వ్యక్తి సలహా తమకు నచ్చినది కావడంతో దాన్ని వారు ఠక్కున అమలులో పెడతారు. మనం ఒక హెచ్చరికగా ఉన్న రెహబాము మాదిరిని కూడా గుర్తుంచుకోవాలి. ఆయన ఒక గంభీరమైన నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చినప్పుడు తన తండ్రి దగ్గర సేవచేసిన పెద్దలు అద్భుతమైన సలహాను ఇచ్చారు. అయితే ఆయన వారి సలహాను పాటించడానికి బదులుగా తనతో పెరిగిన యౌవనులను సంప్రదించాడు. వారి సలహాను పాటించి ఆయన చాలా ఘోరమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు, తత్ఫలితంగా తన రాజ్యంలో పెద్ద భాగాన్ని కోల్పోయాడు.—1 రాజులు 12:1-17.
సంఘంలోని పరిణతి చెందిన వ్యక్తులను కూడా యెహోవా మనకు అందజేస్తున్నాడు, మన నిర్ణయాల గురించి మనం వారితో చర్చించవచ్చు. (సలహా కోసం వెదికేటప్పుడు జీవితంలో అనుభవజ్ఞులైన వారిని, మంచి లేఖన పరిజ్ఞానం ఉన్నవారిని, నీతియుక్త సూత్రాలపట్ల ప్రగాఢమైన గౌరవం ఉన్నవారిని అడగండి. (సామెతలు 1:5; 11:14; 13:20) సాధ్యమైనప్పుడు మీకు వర్తించే సూత్రాలపైనా మీరు సేకరించిన సమాచారమంతటిపైనా ధ్యానించడానికి సమయం వెచ్చించండి. యెహోవా వాక్యం వెలుగులో విషయాలన్నింటినీ పరిశీలిస్తుండగా సరైన నిర్ణయమేదో స్పష్టమయ్యే అవకాశం ఉంది.—ఫిలిప్పీయులు 4:6,7.
మనం తీసుకునే నిర్ణయాలు
కొన్ని నిర్ణయాలను తీసుకోవడం చాలా సులభం. సాక్ష్యం ఇవ్వడం మానేయమని యూదుల మహా సభవారు అపొస్తలులను ఆజ్ఞాపించినప్పుడు తాము యేసును గురించి సాక్ష్యమివ్వడంలో కొనసాగాలని అపొస్తలులకు తెలుసు, అందుకనే వారు వెంటనే ఆసభవారికి తాము మనుష్యులకు కాక దేవునికే లోబడాలన్న తమ నిర్ణయాన్ని తెలియజేశారు. (అపొస్తలుల కార్యములు 5:28,29) బహుశా ఏదైనా ఒక విషయం గురించి బైబిలు సూటిగా చెప్పకపోవడం మూలంగా దాని విషయంలో నిర్ణయం తీసుకోవడానికి బాగా ఆలోచించాల్సి ఉండవచ్చు. అయినా, బైబిలు సూత్రాలు సాధారణంగా శ్రేష్ఠమైన నిర్ణయాన్ని వెలుగులోకి తెస్తాయి. ఉదాహరణకు నేడున్న వివిధ రకాలైన వినోద కార్యకలాపాలు యేసు కాలంలో లేవు, అయినా యెహోవాకు ఇష్టమైనదేదో ఆయనకు అయిష్టమైనదేదో తెలియజేసే స్పష్టమైన బైబిలు వచనాలు ఉన్నాయి. కాబట్టి, హింసను, అనైతికతను, లేదా తిరుగుబాటు స్వభావాన్ని పురికొల్పే ఎలాంటి వినోద కార్యకలాపాల్లోనైనా పాల్గొనే క్రైస్తవుడు తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నట్లే.—కీర్తన 97:10; యోహాను 3:19-21; గలతీయులు 5:19-23; ఎఫెసీయులు 5:3-5.
కొన్నిసార్లు రెండు నిర్ణయాలూ సరైనవే అయివుండే సందర్భాలుంటాయి. అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సేవచేయడం ఒక అద్భుతమైన ఆధిక్యత, అది మరి గొప్ప ఆశీర్వాదాలను అనుభవించడానికి నడిపించగలదు. కానీ కొన్ని కారణాలచేత అలా చేయవద్దని నిర్ణయించుకున్న వ్యక్తి తన స్వంత సంఘంలో ఉంటూనే చక్కగా సేవ చేయవచ్చు. కొన్నిసార్లు, యెహోవా పట్ల మన భక్తి ఎంత ప్రగాఢమైనదో, లేదా మన జీవితాల్లో ఏది అత్యంత ప్రాముఖ్యమైనదో ప్రదర్శించే అవకాశాన్నిచ్చే నిర్ణయం మనకెదురు పడవచ్చు. ఆవిధంగా మన హృదయ స్థితి ఎలా ఉందో చూపించుకునేందుకు మన స్వేచ్ఛా చిత్తాన్ని ఉపయోగించుకునేందుకు యెహోవా మనల్ని అనుమతిస్తాడు.
తరచుగా మన నిర్ణయాల మూలంగా ఇతరులపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు, ధర్మశాస్త్రం విధించే ఎన్నో ఆంక్షల నుండి స్వేచ్ఛను పొందినందుకు మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎంతో ఆనందించారు. మచ్చుకు, ధర్మశాస్త్రం ప్రకారం పవిత్రమైన అపవిత్రమైన ఆహారాన్ని వారు తీసుకోనూవచ్చు, తిరస్కరించనూవచ్చు. అయినా వారు ఈస్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకోవడానికి ముందు ఇతరుల మనస్సాక్షిని పరిగణలోకి తీసుకోవాలని పురికొల్పబడ్డారు. ఈవిషయంపై పౌలు చెప్పిన మాటలు మనం 1 కొరింథీయులు 10:32) ఇతరులకు అభ్యంతరము కలుగజేయకూడదన్న అభిలాష మనం తీసుకోబోయే అనేక నిర్ణయాలను నిర్ధారించడానికి సహాయం చేయవచ్చు. ఎంతైనా, పొరుగువారిపట్ల ఉండే ప్రేమ రెండవ అతి ముఖ్యమైన ఆజ్ఞ కదా.—మత్తయి 22:36,39.
తీసుకునే అనేక నిర్ణయాలకు వర్తిస్తాయి: “అభ్యంతరము కలుగజేయకుడి.” (మన నిర్ణయాల ఫలితాలు
మనం మంచి మనస్సాక్షితో, బైబిలు సూత్రాల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు ఎల్లప్పుడూ దీర్ఘకాలిక సత్ఫలితాలను ఇస్తాయి. సమీప భవిష్యత్తులో వాటి మూలంగా వ్యక్తిగతంగా కొన్ని త్యాగాలు చేయాల్సివస్తుండవచ్చు. యేసును గురించి ప్రకటించే విషయంలో తమ నిర్ణయాన్ని గురించి అపొస్తలులు యూదుల మహాసభ వారికి తెలియజేసినప్పుడు వారు విడుదల చేయబడడానికి ముందు బెత్తాలతో కొట్టబడ్డారు. (అపొస్తలుల కార్యములు 5:40) షద్రకు, మేషాకు, అబేద్నెగోలనే ముగ్గురు హెబ్రీయులు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు సాగిలపడకూడదని నిర్ణయించుకున్నప్పుడు వారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. తాము తీసుకున్న నిర్ణయం మూలంగా తమకు మృత్యు దండన లభించే అవకాశం ఉందని వారికి తెలిసినా వారందుకు సిద్ధపడ్డారు. కానీ తమకు దేవుని ఆమోదం ఆయన ఆశీర్వాదాలు ఉంటాయని వారికి తెలుసు.—దానియేలు 3:16-19.
మనస్సాక్షిగా మనం నిర్ణయం తీసుకున్న తర్వాత కష్టాలు ఎదురైనప్పుడు మన నిర్ణయం తప్పని భావించాల్సిన అవసరం లేదు. “కాలము, అనూహ్యమైన సంఘటనలు,” ఎంతో సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలను కూడా ఘోరంగా ప్రభావితం చేయగలవు. (ప్రసంగి 9:11, NW) అంతేగాక, కొన్నిసార్లు మనం యెహోవాకు చేసుకున్న సమర్పణ ఎంత నిజమైనదో పరీక్షించడానికి ఆయన కొన్నిసార్లు విపత్కర పరిస్థితులను అనుమతిస్తాడు. యాకోబు ఆశీర్వాదాన్ని పొందడానికి ముందు ఒక రాత్రంతా దేవదూతతో పెనుగులాడాల్సి వచ్చింది. (ఆదికాండము 32:24-26) మనం చేస్తున్న పని సరైనదే అయినప్పటికీ, నేడు మనం కూడా విపత్కరమైన పరిస్థితితో పెనుగులాడాల్సి రావచ్చు. అయితే, మన నిర్ణయాలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నప్పుడు మనం సహించడానికి ఆయన సహాయం చేస్తాడని, చివరికి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడని నమ్మకం కలిగివుండవచ్చు.—2 కొరింథీయులు 4:7.
కాబట్టి ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ స్వంత జ్ఞానంపై ఆధారపడకండి. ఏ బైబిలు సూత్రాలు వర్తిస్తాయో పరిశోధించండి. ఆవిషయాన్ని గురించి యెహోవాతో మాట్లాడండి. సాధ్యమైతే పరిణతి చెందిన తోటి క్రైస్తవులను సంప్రదించండి. ఇక ధైర్యంగా ఉండండి. దేవుడిచ్చిన స్వేచ్ఛా చిత్తాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించండి. మంచి నిర్ణయం తీసుకుని ఆయనపట్ల మీహృదయం స్థిరంగా ఉందని యెహోవాకు వ్యక్తంచేయండి.
[28వ పేజీలోని చిత్రం]
ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని వాక్యాన్ని పరిశీలించండి
[28, 29వ పేజీలోని చిత్రాలు]
మీరు తీసుకోవలసిన నిర్ణయాల గురించి యెహోవాతో మాట్లాడండి
[30వ పేజీలోని చిత్రం]
మీరు తీసుకోవలసిన ప్రాముఖ్యమైన నిర్ణయాల గురించి పరిణతి చెందిన క్రైస్తవులతో చర్చించవచ్చు