‘సమాధానమును వెదకి దాని వెంటాడుడి’
‘సమాధానమును వెదకి దాని వెంటాడుడి’
“శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.”—రోమీయులు 12:18.
1, 2. నరులు అందించే శాంతి ఎక్కువకాలం నిలవదనడానికి కారణాలేమిటి?
ఒక ఇంటి పరిస్థితి ఇలా ఊహించుకోండి: ఆఇంటికి పునాది గట్టిగా పడలేదు, దూలాలు క్షీణదశలో ఉన్నాయి, పైకప్పు కొంచెం లోపలికి వాలిపోయి ఎప్పుడు కూలిపోతుందా అన్నట్లు ఉంది. మీరలాంటి ఇంటిని మీగృహంగా చేసుకోవడానికి ఇష్టపడతారా? బహుశా మీరు ఇష్టపడకపోవచ్చు. ఆ ఇంటికి కొత్తగా రంగులు వేయించినా అది దృఢంగా లేదన్న వాస్తవంలో మాత్రం మార్పు ఉండదు. నేడో రేపో అది కూలిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి.
2 ఈ లోకం అందించే ఎలాంటి శాంతి సమాధానాలైనా ఆఇంటిలాగే ఉంటాయి. అది, “రక్షణ” ఇవ్వలేని నరమాత్రుల వాగ్దానాలూ వ్యూహాలూ అనే బలహీనమైన పునాదిపై నిర్మించబడింది. (కీర్తన 146:3) మానవజాతి చరిత్ర నిండా దేశాల మధ్య, జాతుల మధ్య, తెగల మధ్య జరిగిన ఘర్షణలెన్నెన్నో కనిపిస్తాయి. నిజమే, అప్పుడప్పుడు కొన్ని సమయాల్లో శాంతి సమాధానాలు ఉన్నాయి, కానీ ఎలాంటి శాంతి, ఎలాంటి సమాధానం? రెండు దేశాలు యుద్ధం చేస్తుండగా, ఒకటి ఓడిపోయినందుకో లేదా ఇరువైపుల వారికీ యుద్ధంవల్ల ప్రయోజనాలేవీ కనిపించనందుకో శాంతిని ప్రకటిస్తే, అదేం శాంతి? ఆయుద్ధం ప్రారంభం కావడానికి కారణమైన విద్వేషాలు, అనుమానాలు, అసూయలు ఇంకా ప్రజల మనసుల్లో అలాగే ఉన్నాయే! కేవలం కపటమైన సమాధానం, శత్రుత్వానికి రంగులు పులుముకున్న సమాధానం ఎక్కువకాలం నిలవదు.—యెహెజ్కేలు 13:10.
3. దేవుని ప్రజల దగ్గరున్న శాంతి, మానవుల కృషి మూలంగా వచ్చిన శాంతి ఎందుకు వేరుగా ఉన్నాయి?
3 అయినా, యుద్ధ బీభత్సాలతో ఛిన్నాభిన్నమైన ఈలోకంలో కూడా నిజమైన శాంతి ఉంది. ఎక్కడుంది? యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడుచుకునే అనుచరుల మధ్య, నిజ క్రైస్తవుల మధ్య; వారు యేసు మాటలను పాటిస్తూ ఆయన జీవిత విధానాన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తారు. (1 కొరింథీయులు 11:1; 1 పేతురు 2:21) జాతులు వేరైనా, జాతీయతలు వేరైనా, సమాజంలో హోదాలు వేరైనా, నిజ క్రైస్తవుల మధ్య ఉన్న శాంతి నిజమైన శాంతి, ఎందుకంటే అది యేసుక్రీస్తు అందించిన విమోచన క్రయధనం పైవున్న విశ్వాసం ఆధారంగా, దేవునితో తమకున్న శాంతియుతమైన సంబంధం నుండి ఉత్పన్నమౌతుంది. వారి మధ్యనున్న శాంతి సమాధానాలు దేవుడే వారికి ఇచ్చిన కానుక, అది ఏమానవుల కృషితోనూ లభించినది కాదు. (రోమీయులు 15:33; ఎఫెసీయులు 6:23,24) అది వారు, “సమాధానకర్తయగు అధిపతి” అయిన యేసుక్రీస్తుకు తమను తాము లోబరచుకోవడం మూలంగా, “ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు” అయిన యెహోవాను ఆరాధించడం మూలంగా వచ్చిన ఫలితం.—యెషయా 9:6; 2 కొరింథీయులు 13:11.
4. క్రైస్తవులు సమాధానాన్ని ఎలా ‘వెంటాడుతారు’?
4 అపరిపూర్ణ మానవులకు శాంతి ఊరకే లభించదు. అందుకనే, ప్రతి క్రైస్తవుడు “సమాధానమును వెదకి దాని వెంటాడవలెను” అని పేతురు అన్నాడు. (1 పేతురు 3:11) మనమెలా వెంటాడవచ్చు? దానికి జవాబు ప్రాచీన కాలంలోని ఒక ప్రవచనం సూచిస్తోంది. యెషయా ద్వారా మాట్లాడుతూ యెహోవా ఇలా అన్నాడు: “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి [“శాంతి,” ఈజీ-టు-రీడ్ వర్షన్] కలుగును.” (యెషయా 54:13; ఫిలిప్పీయులు 4:9) అవును, నిజమైన శాంతి సమాధానాలు యెహోవా ఉపదేశాలను పాటించే వారికే లభిస్తాయి. అంతేకాదు, “ప్రేమ, సంతోషము, ... దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” వంటివాటితోపాటు సమాధానం అనేది దేవుని ఆత్మ ఫలము. (గలతీయులు 5:22,23) ప్రేమరహితులు, సంతోషరహితులు, దీర్ఘశాంతం లేనివారు, నిర్దయులు, చెడ్డవారు, విశ్వాసఘాతకులు, కఠినహృదయులు, లేదా నిగ్రహం లేనివారు దాన్ని అనుభవించలేరు.
“సమస్త మనుష్యులతో సమాధానము”
5, 6. (ఎ) సమాధానంతో ఉండడానికీ సమాధానపరచడానికీ తేడా ఏమిటి? (బి)క్రైస్తవులు ఎవరితో శాంతియుతంగా ఉండడానికి కృషిచేస్తారు?
5 శాంతి అంటే సమాధాన స్థితి లేదా ప్రశాంత పరిస్థితి అని అర్థం. సంఘర్షణలు లేని అనేక పరిస్థితులకు ఆనిర్వచనం చక్కగా సరిపోతుంది. అంతెందుకు మృతుడు కూడా ప్రశాంతంగా ఉన్నాడనవచ్చు! అయితే, నిజమైన శాంతిని అనుభవించాలంటే ఒక వ్యక్తి శాంతియుతంగా ఉంటేనే సరిపోదు. కొండమీది ప్రసంగంలో యేసు ఇలా అన్నాడు: “సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు.” (మత్తయి 5:9) యేసు ఇక్కడ దేవుని ఆత్మ కుమారులయ్యే, పరలోకంలో అమర్త్య జీవాన్ని అనుభవించే అవకాశాన్ని భవిష్యత్తులో పొందబోయే వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. (యోహాను 1:12; రోమీయులు 8:14-17) అంతేగాక చిట్టచివరికి, పరలోక నిరీక్షణ లేని మానవజాతిలోని విశ్వసనీయులందరూ “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము” పొందుతారు. (రోమీయులు 8:20, 21) కేవలం సమాధానపరిచేవారే అలాంటి నిరీక్షణను కలిగివుండగలరు. సమాధానంతో ఉండడానికీ అంటే శాంతితో ఉండడానికీ, సమాధానపరచడానికీ తేడా ఉంది. కాబట్టి బైబిలు భావంలో చెప్పాలంటే, సమాధానపరచడం చురుకుగా శాంతిని వృద్ధిచేస్తూ ఉండడాన్ని, కొన్నిసార్లు అంతకు ముందు లేని శాంతిని ప్రతిష్ఠించడాన్ని సూచిస్తుంది.
6 దీన్ని మనస్సులో ఉంచుకొని అపొస్తలుడైన పౌలు రోమీయులకు ఇచ్చిన సలహాను పరిశీలించండి: “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.” (రోమీయులు 12:18) ఊరకే ప్రశాంతంగా ఉండండి చాలు అని పౌలు రోమీయులకు చెప్పడం లేదు, అలా ఉండడం కూడా మంచిదే కానీ, వారు శాంతి సమాధానాలను ప్రతిష్ఠించుకోవాలని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. ఎవరితో ప్రతిష్ఠించుకోవాలి? “సమస్త మనుష్యులతో”—కుటుంబ సభ్యులతో, తోటి క్రైస్తవులతో, చివరికి తమ విశ్వాసాలతో ఏకీభవించని వ్యక్తులతో కూడా శాంతి సమాధానాలను ప్రతిష్ఠించుకోవాలి. ‘వారికి శక్యమైనంత మట్టుకు’ ఇతరులతో సమాధానాన్ని ప్రతిష్ఠించుకోవాలని ఆయన రోమీయులను ప్రోత్సహించాడు. అయితే శాంతిని ప్రతిష్ఠించడం కోసం వారు తమ నమ్మకాల విషయంలో రాజీపడిపోవాలని ఆయన కోరలేదు. ఇతరులకు అనవసరంగా కోపం తెప్పించడానికి బదులుగా వారితో శాంతియుతంగా వ్యవహరించాలి. సంఘం లోపలివారితోనైనా వెలుపలివారితోనైనా క్రైస్తవులు అలానే ఉండాలి. (గలతీయులు 6:10) అందుకు తగినట్లే పౌలు ఇలా వ్రాశాడు: “ఒకనియెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి.”—1 థెస్సలొనీకయులు 5:15.
7, 8. తమ నమ్మకాలకు భిన్నమైన నమ్మకాలను కలిగివున్న వారిపట్ల క్రైస్తవులు ఎలా, ఎందుకు శాంతియుతంగా ఉంటారు?
7 మన నమ్మకాలకు భిన్నమైన నమ్మకాలను కలిగివున్నవారితోను, చివరికి మన నమ్మకాలను వ్యతిరేకించేవారితోను మనమెలా శాంతియుతంగా ఉండగలం? ఒక మార్గమేమిటంటే, మనం వారికన్నా ఉన్నతులం అన్న భావనను కలుగనీయకుండా అలా చేయగలము. ఉదాహరణకు, నీచమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ నిర్దిష్టమైన వ్యక్తుల గురించి మాట్లాడడం ఎంతమాత్రమూ శాంతియుతంగా ఉంటున్నట్లు కాదు. యెహోవా ఆయా సంస్థలకు, గుంపులకు విరుద్ధంగా తన తీర్పులను ప్రకటించాడు, కానీ ఏ వ్యక్తిని గురించి కూడా ఆయన అప్పటికే దోషిగా తీర్పు తీర్చబడ్డాడన్నట్లుగా మాట్లాడే హక్కు మనకు లేదు. నిజానికి మనం ఇతరులకు తీర్పు తీర్చము, చివరికి మన వ్యతిరేకులకు కూడా. క్రేతులోని క్రైస్తవులు అక్కడి అధికారులతో వ్యవహరించే విషయంలో వారికి సలహా ఇమ్మని తీతుకు చెప్పిన తరువాత, పౌలు, వారు “మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెనని” వారికి జ్ఞాపకము చేయుమని చెప్పాడు.—తీతు 3:1,2.
1 కొరింథీయులు 15:33) అయినా, మనం మర్యాదపూర్వకంగా ఉండగలం, అంతేకాదు మనం ప్రజలందరినీ గౌరవిస్తూ నమ్రతగా ప్రవర్తించాలి. పేతురు ఇలా వ్రాశాడు: “అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలె[ను].”—1 పేతురు 2:12.
8 మన విశ్వాసాలకు భిన్నమైన విశ్వాసాలను కలిగివున్నవారితో శాంతియుతంగా ఉండడం మూలంగా, మనం వారికి సత్యాన్ని స్వీకరించమని చెప్పడానికి పరిస్థితి ఎంతో అనుకూలంగా ఉంటుంది. నిజమే, మనం ‘మంచి నడవడిని చెరిపే’ స్నేహాలను పెంచుకోము. (పరిచర్యలో శాంతియుతంగా
9, 10. అవిశ్వాసులతో శాంతియుతంగా వ్యవహరించడంలో అపొస్తలుడైన పౌలు ఎలాంటి మాదిరిని ఉంచాడు?
9 మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు వారి ధైర్యసాహసాలకు పేరుగాంచారు. వారు తమ సందేశ ప్రభావాన్ని నీరుగార్చలేదు, వ్యతిరేకత ఎదురైనప్పుడు వారు మనుష్యులకు కాక దేవునికే లోబడాలని కృత నిశ్చయం చేసుకొని ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 4:29; 5:29) అయితే ధైర్యసాహసాలకు దురుసైన ప్రవర్తనకు ఉన్న తేడా వారికి తెలుసు. పౌలు రెండవ హేరోదు అగ్రిప్ప రాజు ఎదుట తన విశ్వాసాలను ఏ విధంగా సమర్థించుకున్నాడో పరిశీలించండి. హేరోదు అగ్రిప్ప తన చెల్లియైన బెర్నికేతో వావివరుసలు తప్పి సంబంధాలు పెట్టుకున్నాడు. అయితే పౌలు నైతిక సూత్రాలపై అగ్రిప్పకు ప్రసంగమివ్వడం ప్రారంభించలేదు. బదులుగా, తామిద్దరికీ ఏకాభిప్రాయమున్న విషయాలపై మాట్లాడుతూ, అగ్రిప్ప యూదుల ఆచారాల విషయంలో ప్రజ్ఞావంతుడనీ, ప్రవక్తలను నమ్మే వ్యక్తియనీ పౌలు ఆయనను శ్లాఘించాడు.—అపొస్తలుల కార్యములు 26:2, 3,27.
10 తనకు స్వాతంత్ర్యం ఇవ్వగల వ్యక్తిని పౌలు ఊరకే పొగడుతున్నాడా? లేదు. పౌలు తన స్వంత సలహాను పాటిస్తూ సత్యాన్ని పలికాడు. ఆయన హేరోదు అగ్రిప్పతో చెప్పిన దానిలో లేశమాత్రమైన అసత్యం లేదు. (ఎఫెసీయులు 4:15) పౌలు సమాధానపరిచే వ్యక్తిగా ఉన్నాడు, “అందరికి అన్నివిధముల వా[డై]” ఉండడమెలాగో ఆయనకు తెలుసు. (1 కొరింథీయులు 9:22) యేసును గురించి ప్రకటించే తన హక్కును సమర్థించుకోవడమే ఆయన లక్ష్యం. నైపుణ్యంగల బోధకునిగా ఆయన, తానూ అగ్రిప్ప ఏకాభిప్రాయంగల విషయాలను గురించి మాట్లాడుతూ తన సంభాషణను ప్రారంభించాడు. ఆవిధంగా పౌలు, అనైతిక ప్రవర్తనగల ఆరాజు క్రైస్తవత్వం పట్ల సద్భావం కలిగివుండేందుకు సహాయం చేశాడు.—అపొస్తలుల కార్యములు 26:28-31.
11. మనం మన పరిచర్యలో సమాధానపరిచే వారిగా ఎలా ఉండగలము?
11 మన పరిచర్యలో మనం సమాధానపరిచేవారిగా ఎలా ఉండగలం? పౌలులాగే, మనం వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. నిజమే కొన్నిసార్లు మనం మన విశ్వాసాన్ని ధైర్యంగా సమర్థించుకుంటూ “నిర్భయముగా దేవుని వాక్యము బోధించ” వలసిన అవసరం ఉంటుంది. (ఫిలిప్పీయులు 1:14) కానీ అత్యధిక సందర్భాల్లో మాత్రం మన మొట్టమొదటి లక్ష్యం ఏమిటంటే సువార్తను ప్రకటించడమే. (మత్తయి 24:14) ఒక వ్యక్తి ఒక్కసారి దేవుని సంకల్పాల సత్యాన్ని గ్రహించాడంటే, ఇక ఆయన అబద్ధ మత తలంపులను విడనాడడం, అపరిశుభ్రమైన అలవాట్ల నుండి తనను తాను శుభ్రం చేసుకోవడం మొదలుపెడుతుండవచ్చు. కాబట్టి సాధ్యమైనంత మేరకు, మనకూ మన శ్రోతలకూ ఏకాభిప్రాయంగల విషయాలను గురించి మాట్లాడడం ప్రారంభిస్తూ వారికి ఆకర్షణీయంగా ఉండే విషయాలనే నొక్కిచెప్పడం మంచిది. అవతలి వ్యక్తికి కోపం తెప్పించడం ఏమాత్రం ప్రయోజనాన్ని ఇవ్వదు. కానీ యుక్తిగా సమీపించినట్లైతే అదే వ్యక్తి మన సందేశాన్ని విని ఉండేవాడే.—2 కొరింథీయులు 6:3.
కుటుంబంలో సమాధానపరిచేవారిగా
12. కుటుంబంలో మనం ఏ మార్గాల్లో సమాధానపరిచేవారిగా ఉండగలం?
12 పెండ్లి చేసుకునే వారికి “శరీరసంబంధమైన శ్రమలు కలుగును” అని పౌలు చెప్పాడు. (1 కొరింథీయులు 7:28) అనేకమైన కష్టాలు వస్తాయి. ఒకటేమిటంటే, కొందరు దంపతుల మధ్య అడపాదడపా భేదాభిప్రాయాలు వస్తుంటాయి. వీటితో ఎలా వ్యవహరించాలి? శాంతియుతంగా. శాంతిని ప్రతిష్ఠించే వ్యక్తి ఒక సంఘర్షణ తీవ్రం కాకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఎలా? మొట్టమొదటిగా, నాలుకను అదుపులో ఉంచుకోవడం ద్వారా. దెప్పిపొడిచే మాటలు మాట్లాడడానికి, అవమానపరిచే వ్యాఖ్యానాలు చేయడానికి దీన్ని ఉపయోగించినట్లైతే ఈచిన్న అవయవం నిజంగానే “మరణకరమైన విషముతో నిండినది”గా ఉండగలదు, “అది నిరర్గళమైన దుష్టత్వమే.” (యాకోబు 3:8) సమాధానపరిచే వ్యక్తి తన నాలుకను క్షేమాభివృద్ధి కలుగజేయడానికే ఉపయోగిస్తాడు గాని కూలద్రోయడానికి ఉపయోగించడు.—సామెతలు 12:18.
13, 14. మాట ద్వారా తప్పు చేసినప్పుడు లేదా భావోద్రేకాలు విపరీతంగా ఉన్న సమయాల్లోను సమాధానాన్ని ఎలా కాపాడుకోవచ్చు?
13 అపరిపూర్ణులం కాబట్టి మనమందరమూ అప్పుడప్పుడు కొన్ని మాటలు అనేసి ఆతర్వాత పశ్చాత్తాపపడతాం. ఇలా జరిగినప్పుడు దిద్దుబాట్లు చేసుకోవడానికి, శాంతిని ప్రతిష్ఠించడానికి త్వరితంగా చర్య తీసుకోండి. (సామెతలు 19:11; కొలొస్సయులు 3:13) “వాగ్వాదముల” “వ్యర్థవివాదముల” మూలంగా మనస్సుపై భారం వేసుకోకండి. (1 తిమోతి 6:4,5) బదులుగా, పైపైన కనిపించేవి కాక లోలోపల ఏముందో చూడండి, మీభార్య లేక భర్త భావాలేమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీతో పరుషంగా మాట్లాడినట్లైతే మీరూ అదే విధంగా మాట్లాడకండి. “మృదువైన మాట క్రోధమును చల్లార్చును” అని గుర్తుంచుకోండి.—సామెతలు 15:1.
14 కొన్నిసార్లు మీరు, “వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము” అని చెబుతున్న సామెతలు 17:14 లోని సలహాను పాటించాల్సిన అవసరం వస్తుండవచ్చు. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా ఉన్నట్లయితే ఒక్క నిమిషం ఆగి ప్రశాంతంగా ఆలోచించండి. తర్వాత, భావోద్రేకాలు చల్లబడ్డాక సమస్యను మరింత సమాధానకరంగా పరిష్కరించుకోవడం సాధ్యమౌతుండవచ్చు. కొన్ని సందర్భాల్లో పరిణతిచెందిన క్రైస్తవ పైవిచారణకర్తను సహాయార్థం పిలవడం కూడా మంచిది కావచ్చు. అలాంటి అనుభవజ్ఞులైన సహానుభూతిగల పురుషులు వైవాహిక శాంతి భగ్నమయ్యే ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో సేదదీర్చే సహాయకులుగా ఉంటారు.—యెషయా 32:1,2.
సంఘంలో సమాధానపరిచేవారిగా
15. యాకోబు ప్రకారం కొందరు తొలి క్రైస్తవుల్లో ఎలాంటి చెడు స్ఫూర్తి పొడచూపింది, ఈస్ఫూర్తి ‘భూసంబంధమైనది’ ‘ప్రకృతి సంబంధమైనది’ ‘దయ్యముల సంబంధమైనది’ అని ఎలా చెప్పవచ్చు?
15 విచారకరంగా, మొదటి శతాబ్దంలోని కొందరు క్రైస్తవులు అసూయ వివాదాలతో కూడిన స్ఫూర్తిని ప్రదర్శించారు—ఇవి సమాధానానికి పూర్తి వ్యతిరేక గుణాలు. యాకోబు ఇలా యాకోబు 3:14-16) “వివాదము” అని అనువదించబడిన గ్రీకు పదం, ప్రసిద్ధి చెందాలన్న స్వార్థపూరితమైన కోరికను, పదవి కోసం పోటీపడడాన్ని సూచిస్తుందని కొందరు భావిస్తున్నారు. దాన్ని యాకోబు ‘భూసంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల సంబంధమైనది’ అని పిలవడం సహేతుకమే. ప్రపంచ నాయకులు పోట్లాడుకునే క్రూర మృగాల్లా వివాదాల్లో కూరుకుపోయిన ఘటనలు చరిత్రలో కోకొల్లలు. వివాదాలు నిజంగానే ‘భూసంబంధమైనవే,’ అవి ‘ప్రకృతి సంబంధమైనవే.’ అవి ‘దయ్యముల’ సంబంధమైనవి కూడా. ఈనీచమైన లక్షణాన్ని మొట్టమొదట, అధికార దాహంగల దూత ప్రదర్శించాడు, అతడు యెహోవా దేవునికి విరుద్ధంగా నిలబడి దయ్యాల పరిపాలకుడిగా, సాతానుగా మారాడు.
అన్నాడు: “ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.” (16. మొదటి శతాబ్దపు క్రైస్తవులలో కొందరు సాతాను వంటి స్ఫూర్తిని ఎలా ప్రదర్శించారు?
16 కలహమాడే స్ఫూర్తిని అలవరచుకోవద్దని యాకోబు క్రైస్తవులను ఉద్బోధపరిచాడు, ఎందుకంటే అది సమాధానాన్ని తీసుకురాదు. ఆయనిలా వ్రాశాడు: “మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?” (యాకోబు 4:1) ఇక్కడ ‘భోగేచ్ఛలు’ అనేవి వస్తు సంపదల కోసం అధికంగా ఆశించడాన్ని లేదా హోదా కోసం, అధికారం కోసం, పలుకుబడి కోసం ఆశించడాన్ని సూచిస్తుండవచ్చు. సాతానులా సంఘంలోని బహుశ కొందరు ‘అత్యల్పులుగా’ ఉండాలని కాక ప్రముఖులుగా ఉండాలని వాంఛించి ఉండవచ్చు. తన నిజమైన అనుచరులు అత్యల్పులుగా ఉంటారని యేసు చెప్పాడు. (లూకా 9:48) ప్రముఖులుగా ఉండాలన్న వారి స్ఫూర్తి సంఘంలోని శాంతిని ఛిన్నాభిన్నం చేయగలదు.
17. నేడు క్రైస్తవులు సంఘంలో ఎలా సమాధానపరిచేవారిగా ఉండగలరు?
17 నేడు, మనం కూడా వస్తు సంపదలను ఆశించే స్ఫూర్తి, అసూయతో రగిలిపోయే స్ఫూర్తి, ప్రసిద్ధి చెందాలన్న కోరిక వంటివాటి పట్ల మొగ్గు చూపే వైఖరికి విరుద్ధంగా పోరాడాలి. మనం నిజంగా సమాధానపరిచేవారమైతే, సంఘంలో కొందరు కొన్ని రంగాల్లో మనకన్నా నైపుణ్యంగలవారైతే, వారిని చూసి మన తక్కువ స్థానాన్ని గురించి చింతించము, అంతేకాదు వారి ఉద్దేశాలను శంకిస్తూ ఇతరుల దృష్టిలో వారిని కించపరచము. మనలో ఏదైనా విశిష్టమైన సామర్థ్యం ఉన్నట్లైతే, ఇతరులకన్నా మనం గొప్పవారిమని చూపించుకోవడానికి, సంఘం ఏదో మన ప్రతిభ మూలంగానే, మన జ్ఞానం మూలంగానే వర్ధిల్లుతోందని సూచించడానికి దాన్ని ఉపయోగించుకోము. అలాంటి స్ఫూర్తి విభజనలను సృష్టిస్తుంది; అది శాంతిని తీసుకురాదు. సమాధానపరిచేవారు తమ ప్రజ్ఞాపాటవాలను డంబంతో ప్రదర్శించరు, బదులుగా వాటిని తమ సహోదరులకు సేవచేయడానికి, యెహోవాకు ఘనతను తీసుకురావడానికి వినయంగా ఉపయోగిస్తారు. చివరికి నిజమైన క్రైస్తవత్వానికి గుర్తింపు చిహ్నం సామర్థ్యం కాదుగాని ప్రేమేనని వారు గ్రహిస్తారు.—యోహాను 13:35; 1 కొరింథీయులు 13:1-3.
‘సమాధానము మీ అధికారులుగా’
18. పెద్దలు తమ మధ్య సమాధానాన్ని ఎలా పెంపొందించుకుంటారు?
18 సమాధానపరిచేవారిగా ఉండడంలో సంఘ పెద్దలు నాయకత్వం వహిస్తారు. యెహోవా తన ప్రజల గురించి ఇలా ప్రవచించాడు: “సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.” (యెషయా 60:17) ఈప్రవచనార్థక మాటలకు అనుగుణంగా క్రైస్తవ కాపరులుగా సేవచేసేవారు ఇటు తమ మధ్యా అటు మంద మధ్యా సమాధానాన్ని పెంపొందించడానికి కృషిచేస్తారు. పెద్దలు “పైనుండివచ్చు” సమాధానకరమైన, సహేతుకమైన “జ్ఞానము”ను ప్రదర్శించడం ద్వారా తమ మధ్య సమాధానాన్ని కాపాడుకోవచ్చు. (యాకోబు 3:17) సంఘంలోని పెద్దలు వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చినవారు, జీవితాల్లో విభిన్నమైన అనుభవాలు ఉన్నవారు అయినందున వారికి కొన్నిసార్లు భిన్నమైన దృక్కోణాలు ఉంటాయి. దీనర్థం వారిలో సమాధానం లేదనా? పరిస్థితితో సరైన విధంగా వ్యవహరించినట్లైతే అలా అయ్యుండాల్సిన అవసరం లేదు. సమాధానపరిచేవారు తమ తలంపులను వినయంగా వ్యక్తం చేస్తారు, తర్వాత ఇతరుల తలంపులను గౌరవంతో వింటారు. పట్టిన పట్టును విడువకుండా ఉండడానికి బదులుగా సమాధానపరిచే వ్యక్తి తన సహోదరుని దృక్కోణాన్ని ప్రార్థనాపూర్వకంగా పరిగణలోకి తీసుకుంటాడు. ఎవరూ ఎలాంటి బైబిలు సూత్రమూ ఉల్లంఘించకుండా ఉన్నంత వరకు, సాధారణంగా వేర్వేరు దృక్కోణాలకు చోటివ్వవచ్చు. సమాధానపరిచే వ్యక్తి ఇతరులు తనతో విభేదించినప్పుడు అత్యధికుల నిర్ణయానికి తలొగ్గి దానికి మద్దతునిస్తాడు. ఆవిధంగా తాను సహేతుకమైన వ్యక్తియని ఆయన ప్రదర్శిస్తాడు. (1 తిమోతి 3:2,3, NW) తమ పంతాన్ని నెగ్గించుకోవడం కన్నా సమాధానాన్ని కాపాడడం ప్రాముఖ్యమని అనుభవజ్ఞులైన పైవిచారణకర్తలకు తెలుసు.
19. పెద్దలు సంఘంలో సమాధానపరిచే వారిగా ఎలా వ్యవహరిస్తారు?
19 మందలోని సభ్యులకు సహాయసహకారాలను అందించడం ద్వారా, వారి ప్రయత్నాలను అనవసరంగా విమర్శించకుండా ఉండడం ద్వారా పెద్దలు వారిమధ్య సమాధానాన్ని పెంపొందిస్తారు. నిజమే, అప్పుడప్పుడు కొందరిని దారికి తీసుకురావలసిన అవసరం ఉంటుంది. (గలతీయులు 6:1) కానీ క్రైస్తవ పైవిచారణకర్త బాధ్యత ప్రధానంగా క్రమశిక్షణను ఇవ్వడం కాదు. ఆయన తరచు మెచ్చుకుంటాడు. ప్రేమపూర్వకమైన పెద్దలు ఇతరులలోని మంచి లక్షణాలను చూడడానికి కృషిచేస్తారు. పైవిచారణకర్తలు తోటి క్రైస్తవుల శ్రమను ఎంతో మెప్పుదలతో దృష్టిస్తారు, తమ తోటి విశ్వాసులు తమకు చేతనైనంత సేవను చేస్తున్నారని వారు నమ్ముతారు.—2 కొరింథీయులు 2:3,4.
20. మనందరం సమాధానపరిచేవారిగా ఉన్నట్లైతే సంఘం ఏ విధంగా ప్రయోజనం పొందుతుంది?
20 కాబట్టి కుటుంబంలోను, సంఘంలోను, మన నమ్మకాలకు భిన్నమైన నమ్మకాలు ఉన్నవారితో వ్యవహరించడంలోను మనం సమాధానపరిచేవారిగా ఉండడానికి, శాంతిని స్థాపించడానికి మనం కృషిచేస్తాము. మనం సమాధానాన్ని అలవరచుకోవడానికి మన శాయశక్తులా కృషిచేసినట్లైతే సంఘంలో ఆనందం వెల్లివిరియడానికి దోహదపడిన వారిమౌతాము. అదే సమయంలో మనం అనేక విధాల్లో కాపాడబడతాము, బలపరచబడతాము. అదెలాగో తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం.
మీరు గుర్తుచేసుకోగలరా?
• సమాధానపరిచేవారిగా ఉండడం అంటే ఏమిటి?
• సాక్షులుకాని వారితో మనం సమాధానపరిచేవారిగా ఎలా ఉండగలం?
• కుటుంబంలో సమాధానాన్ని అలవరచుకునేందుకు కొన్ని మార్గాలేమిటి?
• పెద్దలు సంఘంలో సమాధానాన్ని ఎలా పెంపొందించగలరు?
[అధ్యయన ప్రశ్నలు]
[9వ పేజీలోని చిత్రం]
సమాధానపరిచేవారు తాము ఇతరులకన్నా ఉన్నతులమని భావించరు
[10వ పేజీలోని చిత్రాలు]
క్రైస్తవులు పరిచర్యలోను, ఇంట్లోను, సంఘంలోను సమాధానపరిచే వ్యక్తులు