కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సాతాను ఉనికిలో ఉన్నాడా?

సాతాను ఉనికిలో ఉన్నాడా?

సాతాను ఉనికిలో ఉన్నాడా?

“క్రైస్తవ చర్చీ చరిత్రలో, నేడు కొంతమంది ప్రజలకు ‘దేవుడు’ ఎంత వాస్తవమైన శక్తివంతమైన వ్యక్తిగా ఉన్నాడో అపవాది, బయెల్జెబూలు లేక సాతాను, దుష్టత్వానికి రాజు, అంతే వాస్తవమైన శక్తివంతమైన వ్యక్తిగా ఉన్న సమయం కూడా ఒకప్పుడు ఉండేది; అయితే నేడు దేవుని గురించి అలా విశ్వసిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. తమ చుట్టూ ఉన్న దుష్టత్వానికి అర్ధ-మానవ, అర్ధ-మృగ రూపంలో భావాన్నిచ్చేందుకు యూదులు, తొలి క్రైస్తవులు అతడిని రూపకల్పన చేశారు. ఆతర్వాతి క్రైస్తవులు ఇది, వాస్తవంపై ఆధారపడిలేని ఊహాకల్పిత రూపం మాత్రమేనని గుర్తించి, గుట్టుగా అతడిని తొలగించివేశారు.”​—⁠లూడోవిక్‌ కెన్నెడి వ్రాసిన “కేవలం మనోకల్పన​—⁠దేవునికి వీడ్కోలు” (ఆంగ్లం).

రచయితగా, సమాచార ప్రసారకుడిగా లూడోవిక్‌ కెన్నెడి పేర్కొంటున్నదేమిటంటే, శతాబ్దాలపాటు క్రైస్తవమత సామ్రాజ్యంలోని ఎవరు కూడా సాతాను ఉనికి యొక్క వాస్తవికతను సందేహించలేదు. బదులుగా, ప్రొఫెసర్‌ నార్మన్‌ కోన్‌ చెబుతున్నట్లుగా, క్రైస్తవులు కొన్నిసార్లు “సాతాను అతని దయ్యాల శక్తిని బట్టి ఎంతో ప్రభావితులయ్యారు.” (యూరోపు అంతర్గత దయ్యాలు) (ఆంగ్లం) ఇలా ప్రభావితులైంది కేవలం సామాన్య, విద్యావిహీనులైన గ్రామీణులు మాత్రమే కాదు. ఉదాహరణకు, దుష్టత్వం మీదా హేయమైన ఆచారాల మీదా ఆధిపత్యం వహించేందుకు సాతాను జంతువు రూపాన్ని ధరించాడన్న నమ్మకం, “నిరక్షరాస్యులైన అత్యధికుల జానపదం నుండి ఉత్పన్నం కాలేదు గానీ, అందుకు భిన్నంగా, ఉన్నత మేధావి వర్గం యొక్క లోకదృష్టి నుండి ఉత్పన్నమైంది” అని ప్రొఫెసర్‌ కోన్‌ చెబుతున్నాడు. విద్యావంతులైన మతనాయకులతో సహా ఈ“ఉన్నత మేధావి వర్గం” పదిహేనవ శతాబ్దం నుండి పదిహేడవ శతాబ్దం వరకు యూరప్‌ అంతటా వ్యాపించిన మంత్రగత్తెల-వేటలకు కారణమైంది, అప్పుడు చర్చీ మరియు పౌర అధికారులు, మంత్రగత్తెలని నిందించబడిన దాదాపు 50,000 మందిని హింసించి చంపారని చెప్పబడుతోంది.

చాలామంది ప్రజలు, సాతాను గురించి తాము విడ్డూరమైనవనీ మూఢనమ్మకాలనీ పరిగణించిన వాటిని వదిలేశారంటే అందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు. చివరికి వెనుకటికి 1726 లో, అపవాది “గబ్బిలపు రెక్కలు, కొమ్ములు, రెండుగా చీలినట్లుండే పాదాలు, పొడవైన తోక, చీలిన నాలుక తదితరమైనవి గల” భయోత్పాదకమైన వికృతాకారి అనే ప్రజల నమ్మకాన్ని డానియెల్‌ డిఫో పరిహసించాడు. అలాంటి తలంపులు, “తామే సృష్టించుకున్న సాతానుతో అజ్ఞాన ప్రపంచాన్ని మోసగించిన” “సాతాను-ఉత్పాదకులు, సాతాను-నిర్మాణకులు” రూపొందించిన “మేధాలోపంగల, ఊహాకల్పిత అల్పవిషయాలు” అని ఆయన అన్నాడు.

మీరు కూడా అలాగే భావిస్తున్నారా? “వాస్తవానికి, మానవుడు తన సొంత పాపభరితమైన స్థితికి కారణం చెప్పుకోవడానికి చేసుకున్న కల్పనే సాతాను” అని మీరు అంగీకరిస్తారా? ఈవ్యాఖ్యానం, ద జోండర్‌వాన్‌ పిక్టోరియల్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ద బైబిల్‌ అనేదానిలో కనిపిస్తుంది, క్రైస్తవులమని చెప్పుకునే అనేకులు అలాగే అనుకుంటారు. క్రైస్తవమత సామ్రాజ్యంలోని దైవశాస్త్ర పండితులు మొత్తానికి “సాతానును, దయ్యాలను మూఢనమ్మకాల స్మారక చిహ్నాలుగా కొట్టిపడేశారు” అని జఫ్రీ బర్టన్‌ రస్సెల్‌ చెబుతున్నాడు.

కానీ కొంతమంది ప్రజలకు సాతాను ఎంతో వాస్తవమైనవాడు. మానవుని చరిత్రంతటిలోనూ పునరావృతమౌతున్న దుష్టకార్యాల వెనుక ఒక విధమైన మానవాతీత, హానికరమైన శక్తి ఉండవచ్చునని వారు తర్కిస్తారు. అయినా “చాలాకాలం తర్వాత, సాతానుపై నమ్మకం ఇంత వేగంగా మళ్ళీ” ఎందుకు “కనిపిస్తోందో ఇరవైయవ శతాబ్దం సృష్టించిన అకృత్యాలు” తెలియజేస్తున్నాయని రస్సెల్‌ అంటున్నాడు. డాన్‌ లూయిస్‌ అనే రచయిత అభిప్రాయం ప్రకారం, “విద్యావిహీనులైన తమ పూర్వీకుల” మూఢ నమ్మకాలను, భయాలను “చిన్నచూపు చూసి పరిహసించే” అనేకమంది ఆధునిక విద్యావంతులు “మళ్ళీ ఒకసారి మానవాతీతశక్తిలోని దుష్ట కారకంచేత మరులుగొలుపబడుతున్నారు.”​—⁠తరతరాలనుండి మత మూఢ నమ్మకాలు (ఆంగ్లం).

ఇంతకూ వాస్తవం ఏమిటి? సాతాను కేవలం మూఢనమ్మకాలతో కూడిన అర్థరహితమైన తలంపు మాత్రమేనా? లేక ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా గంభీరంగా ఆలోచించవలసిన వ్యక్తా?

[4వ పేజీలోని చిత్రం]

గుస్టేవ్‌ డోరె చెక్కిన ఈచిత్రంలో చూపించబడినట్లుగా ప్రాచీన మూఢ నమ్మకాలు సాతానును అర్ధ-మానవ, అర్ధ-మృగంగా చిత్రీకరించాయి

[చిత్రసౌజన్యం]

The Judecca​—Lucifer/The Doré Illustrations For Dante’s Divine Comedy/Dover Publications Inc.