కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సాతాను ఉనికి కేవలం మూఢనమ్మకం మాత్రమే కాదు

సాతాను ఉనికి కేవలం మూఢనమ్మకం మాత్రమే కాదు

సాతాను ఉనికి కేవలం మూఢనమ్మకం మాత్రమే కాదు

“క్రొత్త నిబంధన అంతటా, ఒక గొప్ప సంఘర్షణ మనకు కనిపిస్తుంది, ఆసంఘర్షణలో ఒకవైపు దేవుడు మరియు మంచి శక్తులు, మరోవైపు సాతాను అధిపత్యం క్రిందనున్న దుష్ట శక్తులు ఉన్నాయి. ఇది కేవలం ఒకరో ఇద్దరో రచయితల తలంపు మాత్రమే కాదు గానీ అది దాని రచయితలందరి తలంపు. ... కాబట్టి క్రొత్త నిబంధన సాక్ష్యాధారం స్పష్టంగా ఉంది. సాతాను ఉనికి ఒక చేదు నిజం, అతడు దేవునిపట్ల దేవుని ప్రజలపట్ల ఎల్లప్పుడూ శత్రుభావం కలిగివున్నాడు.” ​—⁠“ద న్యూ బైబిల్‌ డిక్షనరీ.”

మరైతే, క్రైస్తవత్వాన్ని అనుసరిస్తున్నామనీ, బైబిలును నమ్ముతున్నామనీ చెప్పుకునే అనేకులు నిజమైన సాతాను ఉనికిలో ఉన్నాడనే తలంపును ఎందుకు నిరాకరిస్తారు? ఎందుకంటే వారు నిజానికి బైబిలును దేవుని వాక్యంగా అంగీకరించరు. (యిర్మీయా 8:⁠9) బైబిలు రచయితలు తమ చుట్టుప్రక్కల ఉన్న జనాంగాల తత్త్వసిద్ధాంతాలను ప్రతిబింబింపజేశారనీ, దేవుని నుండి సత్యాన్ని ఖచ్చితంగా అందించలేదనీ వారంటారు. ఉదాహరణకు, క్యాథలిక్‌ దైవశాస్త్ర పండితుడైన హాన్స్‌ కుంగ్‌ ఇలా వ్రాస్తున్నాడు: “అసంఖ్యాకమైన దయ్యాలకు అధిపతియైన సాతానును గురించిన పురాణగాథల తలంపులు ... బబులోను పురాణగాథల నుండి తొలి యూదా మతంలోకి, అక్కడి నుండి క్రొత్త నిబంధనలోకి చొచ్చుకుని వెళ్ళాయి.”​—⁠ఆన్‌ బీయింగ్‌ ఎక్రిస్టియన్‌.

అయితే బైబిలు కేవలం మానవ వాక్యం కాదు. అది నిజంగా దేవుని ప్రేరేపిత వాక్యం. కాబట్టి, సాతాను గురించి అది ఏమి చెబుతుందో దాన్ని మనం గంభీరంగా తీసుకోవడం జ్ఞానయుక్తం.​—⁠2 తిమోతి 3:​14-17; 2 పేతురు 1:​20,21.

యేసు ఎలా భావించాడు?

సాతాను వాస్తవమైనవాడని యేసుక్రీస్తు విశ్వసించాడు. యేసు తనలోనే ఉన్న ఏదో దుర్గుణం చేత శోధింపబడలేదు. ఒక నిజమైన వ్యక్తి ఆయనపై దాడి చేశాడు, యేసు ఆతర్వాత అతడిని “ఈలోకాధికారి” అని పేర్కొన్నాడు. (యోహాను 14:​30; మత్తయి 4:​1-11) ఇతర ఆత్మ ప్రాణులు సాతానుకు అతని దుష్ట పథకాల్లో మద్దతునిచ్చారని కూడా ఆయన విశ్వసించాడు. ఆయన “దయ్యముపట్టిన” ప్రజలను స్వస్థపరిచాడు. (మత్తయి 12:​22-28) ఎరేషనలిస్ట్‌ ఎన్‌సైక్లోపీడియా అనే నాస్తిక ప్రచురణ కూడా దీని ప్రాముఖ్యతను పేర్కొంటోంది, అదిలా చెబుతోంది: “సువార్తల్లోని యేసు, దయ్యాలున్నాయని ఎలా అంగీకరించాడన్నది దైవశాస్త్ర పండితులకు ఎప్పుడూ ఒక చిక్కు సమస్యగానే ఉంది.” యేసు సాతాను గురించి, అతని దయ్యాల గురించి మాట్లాడినప్పుడు, ఆయన కేవలం బబులోను పురాణగాథల నుండి వచ్చిన మూఢనమ్మకాలను పునరుచ్చరించడం లేదు. వారు నిజంగా ఉనికిలో ఉన్నారని ఆయనకు తెలుసు.

యేసు తన కాలంలోని మతబోధకులకు చెప్పిన ఈమాటలను పరిశీలించినప్పుడు మనం సాతాను గురించి ఎంతో తెలుసుకోవచ్చు: “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.”​—⁠యోహాను 8:​44.

దీని ప్రకారం, “కొండెములు చెప్పేవాడు” అనే భావముగల పేరున్న అపవాదియైన సాతాను ‘అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు.’ దేవుని గురించి అబద్ధం చెప్పిన మొదటి ప్రాణి అతడే, అతడు ఏదెను తోటలో ఆఅబద్ధం చెప్పాడు. మన ఆది తల్లిదండ్రులు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తింటే ‘నిశ్చయముగా చస్తారని’ యెహోవా చెప్పాడు. ఆమాటలు నిజం కాదని సాతాను ఒక సర్పము నోటి ద్వారా పలికాడు. (ఆదికాండము 2:​16-17; 3:⁠4) అందుకే, అతడు “అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్ప[ము]” అని పిలువబడ్డాడు.​—⁠ప్రకటన 12:⁠9.

సాతాను మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము గురించి అబద్ధం చెప్పాడు. ఆవృక్ష ఫలములను తినకూడదన్న నిషేధం అన్యాయమనీ, అది అధికార దుర్వినియోగమనీ అతడు వాదించాడు. తమకు ఏది మంచిదో ఏది చెడ్డదో నిశ్చయించుకోవడంలో ఆదాము హవ్వలు “దేవతలవలె” కావచ్చునని అతడు చెప్పాడు. స్వేచ్ఛా చిత్తంగల జీవులుగా వారు స్వయంగా నిర్ణయాలు తీసుకునే సంపూర్ణ హక్కు కలిగివుండాలని సాతాను సూచించాడు. (ఆదికాండము 3:1-5) దేవుని పరిపాలనా విధానపు సముచితత్వంపై జరిగిన ఈదాడి కీలకమైన వివాదాంశాలను లేవదీసింది. కాబట్టి ఈవివాదాంశాలు పరిష్కరించబడడానికి యెహోవా సమయం అనుమతించాడు. అంటే దాని భావం, సాతాను కొంతకాలం పాటు జీవించడానికి అనుమతించబడ్డాడు. అతడి పరిమిత సమయం అతి త్వరలో ముగియబోతోంది. (ప్రకటన 12:​12) అయినా, తన బోధలను ప్రచారం చేయడానికి అతడు యేసు కాలంనాటి శాస్త్రులు, పరిసయ్యుల వంటి ప్రజలను ఉపయోగించుకుంటూ అబద్ధాల ద్వారా, మోసం ద్వారా మానవజాతిని దేవుని నుండి దూరం చేస్తూనే ఉన్నాడు.​—⁠మత్తయి 23:​13,15.

సాతాను ‘ఆది నుండి నరహంతకుడై’ ఉండెననీ, ‘సత్యమందు నిలిచినవాడుకాదనీ’ కూడా యేసు చెప్పాడు. అంటే దాని భావం, యెహోవా సాతానును ‘నరహంతకునిగా’ సృష్టించాడని కాదు. దేవుడ్ని వ్యతిరేకించే వారెవరైనా వెళ్లవలసిన అగ్నిమయమైన హింసా స్థలంపై అధ్వర్యం వహించే ఏదో ఒక వికృతాకారిలా అతడు సృష్టించబడలేదు. బైబిలులో ప్రస్తావించబడిన “పాతాళము” సాతాను నివాస స్థలం కాదు. అది మానవజాతి యొక్క సామాన్య సమాధి మాత్రమే.​—⁠అపొస్తలుల కార్యములు 2:​25-27; ప్రకటన 20:​13,14.

సాతాను ఆదిలో “సత్యమందు” ఉన్నాడు. అతడు ఒకప్పుడు యెహోవా పరలోక కుటుంబంలో భాగంగా, దేవుని పరిపూర్ణ ఆత్మ కూమారునిగా ఉన్నాడు. కానీ అతడు ‘సత్యమందు నిలువ’ లేదు. అతడు తన సొంత మార్గాలను, అబద్ధాలపై ఆధారపడిన తన సొంత సూత్రాలనే ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ“ఆది,” అతడు దేవదూతలలో ఒకనిగా సృష్టించబడిన సమయం కాదు గానీ అతడు ఉద్దేశపూర్వకంగా యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, ఆదాము హవ్వలకు అబద్ధం చెప్పిన సమయమే. సాతాను, మోషే కాలంలో యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ప్రజలవలె ఉన్నాడు. వారి గురించి మనమిలా చదువుతాము: “వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులుకారు; వారు కళంకులు.” (ద్వితీయోపదేశకాండము 32:⁠5) సాతాను గురించి కూడా అదే చెప్పవచ్చు. అతడు తిరుగుబాటు చేసి ఆదాము హవ్వల మరణానికి, వాస్తవానికి మొత్తం మానవ కుటుంబమంతటి మరణానికి బాధ్యుడైనప్పుడు అతడు ‘నరహంతకుడయ్యాడు.’​—⁠రోమీయులు 5:⁠12.

అవిధేయులైన దేవదూతలు

ఇతర దేవదూతలు తిరుగుబాటులో సాతానుతో కలిశారు. (లూకా 11:​14,15) నోవహు దినములలో, ఈదేవదూతలు “నరుల కుమార్తెలతో” లైంగిక సంబంధాలను పెట్టుకునేందుకు “తమ నివాసస్థలమును విడిచి” మానవ శరీరాలను దాల్చారు. (1 పేతురు 3:​19,20; ఆదికాండము 6:​1-4; యూదా 6) “ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము,” లేక ఆత్మ ప్రాణులలో ఒక చిన్న భాగము ఈవిధానాన్ని అనుసరించారు.​—⁠ప్రకటన 12:⁠4.

పూర్తిగా సూచనార్థక భావంలో వ్రాయబడిన పుస్తకమైన ప్రకటన గ్రంథం సాతానును “యెఱ్ఱని మహా ఘటసర్పము”గా వర్ణిస్తోంది. (ప్రకటన 12:⁠3) ఎందుకు? అతనికి అక్షరార్థంగా వికృతమైన, వికారమైన శరీరం ఉన్నందుకు కాదు. వాస్తవానికి, ఆత్మ ప్రాణులకు ఏవిధమైన శరీరం ఉంటుందో మనకు తెలియదు, కానీ సాతాను ఈవిషయంలో ఆత్మ ప్రాణులైన ఇతర దేవదూతల నుండి భిన్నంగా ఉండకపోవచ్చు. అయితే, “యెఱ్ఱని మహా ఘటసర్పము” అన్నది సాతాను యొక్క అత్యాశగల, భయంకరమైన, శక్తివంతమైన, నాశనకరమైన స్ఫూర్తికి తగిన వర్ణన.

సాతాను, దయ్యాలు ఇప్పుడు తీవ్రంగా నిర్భందించబడ్డారు. వారు ఒకప్పుడు మానవ శరీరాలను దాల్చారని స్పష్టమవుతోంది అయితే వారిప్పుడు అలా శరీరాలు దాల్చలేరు. క్రీస్తు చేతుల్లో 1914 లో దేవుని రాజ్యం స్థాపించబడిన వెంటనే కొంతకాలానికి, వారు భూమిపైకి పడద్రోయబడ్డారు.​—⁠ప్రకటన 12:​7-9.

జయించడానికి కష్టంగా ఉండే శత్రువైన సాతాను

ఇప్పటికీ సాతాను జయించడానికి కష్టంగా ఉండే శత్రువుగానే ఉన్నాడు. అతడు “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” (1 పేతురు 5:⁠8) అతడు మన అపరిపూర్ణ శరీరాల్లో అంతర్నిహితమైవున్న అస్పష్టమైన దుష్ట లక్షణమేమీ కాదు. నిజమే, మన పాపభరితమైన కోరికలకు వ్యతిరేకంగా మనం అనుదినం పోరాడవలసిందే. (రోమీయులు 7:​18-20) కానీ నిజమైన పోరాటం “ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను” చేయవలసి ఉంది.​—⁠ఎఫెసీయులు 6:​12.

సాతాను ప్రభావం ఎంత విస్తృతంగా వ్యాపించింది? “లోకమంతయు దుష్టుని యందున్నదని” అపొస్తలుడైన యోహాను చెబుతున్నాడు. (1 యోహాను 5:​19) సాతాను ప్రభావానికి గురి కావాలని మనం కోరుకోము లేక అతడిని గురించిన మూఢమైన భయం మనల్ని అశక్తులను చేసేందుకు అనుమతించాలనీ అనుకోము. సత్యాన్ని కనుగొనకుండా మనలను అంధులను చేయడానికీ, దేవుని పట్ల మన యథార్థతను చెదరగొట్టడానికీ అతడు చేసే ప్రయత్నాల గురించి మనం అప్రమత్తంగా ఉండడం జ్ఞానయుక్తమైనది.​—⁠యోబు 2:​3-5; 2 కొరింథీయులు 4:⁠3, 4.

దేవుని చిత్తం చేయాలని కోరుకునే వారిపై దాడి చేయడానికి సాతాను ఎప్పుడూ క్రూరమైన మార్గాలనే ఉపయోగించడు. కొన్నిసార్లు, అతడు తాను “వెలుగు దూత” వలె కనిపించేలా చేసుకుంటాడు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాసినప్పుడు ఆప్రమాదం గురించి క్రైస్తవులను హెచ్చరించాడు: “సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రతనుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.”​—⁠2 కొరింథీయులు 11:⁠3, 14.

కాబట్టి మనం ‘నిబ్బరమైన బుద్ధిగలవారమై, మెలకువగా ఉండి, వానిని ఎదిరిస్తూ, విశ్వాసమందు స్థిరులమై ఉండవలసిన’ అవసరం ఉంది. (1 పేతురు 5:⁠8, 9; 2 కొరింథీయులు 2:⁠11) అతీంద్రియ శక్తులతో సంబంధమున్న దేని దరిదాపులకైనా వెళ్ళి, సాతాను మిమ్మల్ని మోసగించడం సులభమయ్యేలా చేసుకోకుండా జాగ్రత్త వహించండి. (ద్వితీయోపదేశకాండము 18:​10-12) యేసు క్రీస్తు సాతానుచే శోధింపబడినప్పుడు మళ్ళీ మళ్ళీ దేవుని వాక్యాన్ని ప్రస్తావించాడని గుర్తుంచుకొని శ్రద్ధగల, దేవుని వాక్య విద్యార్థులై ఉండండి. (మత్తయి 4:​4,7,10) దేవుని ఆత్మ కోసం ప్రార్థించండి. ఆత్మఫలము, సాతాను ఎంతో ప్రభావవంతంగా ప్రేరేపించే శరీర కార్యములను నివారించడానికి మీకు సహాయం చేయగలదు. (గలతీయులు 5:​16-24) సాతాను నుండి, అతని దయ్యముల నుండి ఏదో విధంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు మీకు అనిపించినప్పుడు హృదయపూర్వకంగా యెహోవాకు ప్రార్థించండి.​—⁠ఫిలిప్పీయులు 4:⁠6, 7.

సాతాను గురించి భయపడిపోవలసిన అవసరం లేదు. సాతాను చేయగల దేని నుండైనా నిజమైన రక్షణను ఇస్తానని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. (కీర్తన 91:​1-4; సామెతలు 18:​10; యాకోబు 4:​7,8) “ప్రభువుయొక్క మహా శక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి” అని అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. అప్పుడు మీరు ‘అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులవుతారు.’​—⁠ఎఫెసీయులు 6:​10, 11.

[5వ పేజీలోని చిత్రం]

సాతాను నిజమైన వ్యక్తి అని యేసుకు తెలుసు

[6వ పేజీలోని చిత్రం]

“లోకమంతయు దుష్టుని యందున్న[ది]”

[చిత్రసౌజన్యం]

NASA photo

[7వ పేజీలోని చిత్రాలు]

క్రమంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా, ప్రార్థించడం ద్వారా సాతానును ఎదిరించండి